మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే ...
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంఘ కూటాలు జరుపుకోవడం
జూన్ 26, 2020
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రభుత్వాలు ప్రజల్ని భౌతిక దూరం పాటించాలని నిర్దేశించాయి, గుంపులుగుంపులుగా సమావేశమవ్వడాన్ని నిషేధించాయి. యెహోవాసాక్షులు అలాంటి ప్రభుత్వ నిర్దేశాల్ని పాటిస్తూనే సురక్షితమైన పద్ధతుల్లో కూటాలు జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకే వాళ్లు సంఘ కూటాల్ని జరుపుకోవడానికి జూమ్ (Zoom) లాంటి వీడియో కాన్ఫరెన్స్ యాప్‌లు ఉపయోగిస్తున్నారు.
సంఘాలు క్రమంగా, సురక్షితమైన పద్ధతిలో కూటాలు జరుపుకోగలిగేలా, పరిపాలక సభ విరాళాలుగా వచ్చిన డబ్బుతో జూమ్ అకౌంట్లను కొనడానికి అనుమతినిచ్చింది. అంతగా ఆర్థిక స్తోమత లేని కొన్ని సంఘాలకు ఇది చాలా ఉపయోగపడింది. ఎందుకంటే, అలాంటి అకౌంట్లు కొనాలంటే సాధారణంగా 1,200 నుండి 1,500 రూపాయలు ($15-$20) లేదా అంతకన్నా ఎక్కువ ఖర్చౌతుంది. ఆ సంఘాలు అంతకుముందు ఉచిత యాప్‌లను ఉపయోగించేవి. కానీ వాటితో ఎక్కువమంది కనెక్ట్ అవ్వడం వీలయ్యేది కాదు, పైగా అవి అంత సురక్షితమైనవి కాదు. అయితే సంస్థ ఇచ్చిన జూమ్ అకౌంట్లలో సెక్యూరిటీని చక్కగా నియంత్రించవచ్చు, అలాగే ఒక్కో మీటింగ్‌కి చాలామంది కనెక్ట్ అవ్వవచ్చు. ఇప్పటివరకు, 170 కన్నా ఎక్కువ దేశాల్లో 65,000 కన్నా ఎక్కువ సంఘాలు ఈ అకౌంట్లను ఉపయోగిస్తున్నాయి.
ఇండోనేసియాలోని కైరాగి సంఘం ఈ మధ్యే ఉచిత వీడియో కాన్ఫరెన్స్ యాప్ నుండి సంస్థ ఇచ్చిన జూమ్ అకౌంట్‌కి మారింది. కైరాగి సంఘం ఉత్తర సులవేసిలోని మనాడొలో ఉంది. సహోదరుడు హాడి సంటోసో ఇలా అంటున్నాడు: “ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించడం అంతగా రాని సహోదర సహోదరీలు కూడా ఇప్పుడు కూటాల్ని ఆనందిస్తున్నారు. అందుకు ఒక ముఖ్యకారణం ఏంటంటే, కూటం జరిగేటప్పుడు పదేపదే లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకపోవడమే.”
ఈక్వెడార్‌లోని గోయాకిల్‌లో గోయాకనేస్ ఓయెస్టే అనే సంఘం ఉంది. అందులో సంఘ పెద్దగా సేవ చేస్తున్న సహోదరుడు లెస్టర్ హిహోన్ జూనియర్ ఇలా అంటున్నాడు: “చాలామంది సహోదర సహోదరీల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. కాబట్టి సంఘమంతా కలిసి కూటాలు జరుపుకోగలిగే జూమ్ లైసెన్స్ కొనడం కొన్ని సంఘాలకు దాదాపు అసాధ్యమని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు సంస్థ ఇచ్చిన జూమ్ అకౌంట్ల వల్ల ఎక్కువమంది కనెక్ట్ అవ్వవచ్చు, కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా ఎక్కువమందిని కూటాలకు ఆహ్వానించగలుగుతున్నాం.”
జాంబియాలోని లుసాకాలో ఉన్న మ్వువరెరె ఉత్తర సంఘంలో సంఘ పెద్దగా సేవ చేస్తున్న సహోదరుడు జాన్సన్ మువాన్జా ఇలా రాశాడు: “చాలామంది సహోదర సహోదరీలు పదేపదే ఈ మాట చెప్పారు, ‘సంస్థ ఇచ్చిన జూమ్ అకౌంట్ వల్ల, తోటి సహోదర సహోదరీలకు ఇంకా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. యెహోవా మమ్మల్ని ప్రేమిస్తున్నాడని, శ్రద్ధ తీసుకుంటున్నాడని అనిపిస్తుంది.’”
ఈ అకౌంట్లను విపత్తు సహాయక చర్యల కోసం కేటాయించిన డబ్బుతో కొన్నారు. ఆ డబ్బు ప్రపంచవ్యాప్త పని కోసం స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాల నుండి వచ్చింది. ఆ విరాళాలు ఎక్కువగా donate.isa4310.com ద్వారా వచ్చాయి. ఉదార స్ఫూర్తితో మీరిచ్చే విరాళాల కోసం మీకు కృతజ్ఞతలు. అవి ప్రపంచవ్యాప్తంగా ఇతర సహాయక చర్యల కోసం కూడా ఉపయోగపడుతున్నాయి.—2 కొరింథీయులు 8:14.