అప్రమత్తంగా ఉండండి!
మరో ప్రపంచ యుద్ధం తప్పదా?—బైబిలు ఏం చెప్తుంది?
గడిచిన 30 ఏళ్లలో, ప్రపంచమంతా ప్రగతి బాటలో ఉంది, ఇక చింతే లేదు అని చాలామంది అనుకున్నారు. కానీ ఈ మధ్య జరిగిన సంఘటనల్ని బట్టి చూస్తే కథ అడ్డం తిరిగినట్టు అనిపిస్తుంది.
ఒకవైపున గాజా యుద్ధం అలజడి సృష్టిస్తుంటే, మరోవైపున లెబనాన్ సరిహద్దు దగ్గర ఇజ్రాయేల్, హెజ్‌బలా మధ్య కూడా కాల్పులు, బాంబు దాడులతో పోరు మొదలైంది.—రోయ్‌టర్స్, జనవరి 6, 2024.
ఇరాన్ సైనిక దళాలు ఆయా చోట్ల దాడులు జరుపుతున్నాయి. అలాగే ఈ మధ్యే ఇరాన్ మళ్లీ అణ్వాయుధాలను తయారు చేయడం మొదలుపెట్టింది. దానికితోడు, ఇరాన్‌కు రష్యా, చైనా దేశాలతో చెలిమి కుదరడంతో అది పశ్చిమ దేశాలకు కొత్త సవాలుగా మారింది.—ద న్యూయార్క్ టైమ్స్, జనవరి 7, 2024
రష్యా సైనిక దళాలు తమ దాడులతో యుక్రెయిన్‌లో బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి.—UN న్యూస్, జనవరి 11, 2024.
ఆకాశాన్ని అంటుతున్న చైనా ఆర్థిక స్థితి, సైనిక శక్తి; మరోవైపున తన జాతీయ గుర్తింపును బట్టి రోజురోజుకీ మరింత గర్వంగా ఫీలౌతున్న తైవాన్; చైనా, అమెరికా దేశాల మధ్య బగ్గుమంటున్న చర్చలు, ఇవన్నీ చూస్తుంటే యుద్ధ పోరు ఇప్పుడా, అప్పుడా అన్నట్టుంది పరిస్థితి.—ద జపాన్ టైమ్స్, జనవరి 9, 2024.
ప్రపంచ పరిస్థితుల్ని చూస్తుంటే ఎప్పుడు ఏమౌతుందో అన్న భయం! మరి దీని గురించి బైబిలు ఏమైనా చెప్తోందా? మరో ప్రపంచ యుద్ధం తప్పదా?
నేటి సంఘటనల గురించి బైబిలు ముందే చెప్పింది
అంటే బైబిలు ముందే చెప్పింది మన కళ్ల ముందు జరుగుతున్న ఫలానా యుద్ధం గురించని కాదు. కానీ, మన కాలానికి గుర్తింపు చిహ్నంగా మారిన భయంకరమైన యుద్ధ వాతావరణం గురించి అది చెప్పింది. ఆ యుద్ధాలన్నీ “భూమ్మీద శాంతి లేకుండా” చేస్తున్నాయి.—ప్రకటన 6:4.
“అంత్యకాలంలో” ఒకదానితో ఒకటి పోటీపడుతున్న ప్రపంచ శక్తుల మధ్య ఆధిపత్య పోరు ఉంటుందని బైబిల్లోని దానియేలు పుస్తకం ముందే చెప్పింది. అవి తమకున్న గొప్ప సైనిక బలగాల్ని, అణ్వాయుధాల్ని గొప్పగా చూపించుకోవడం, వాటి ’ఖజానాల’ నుండి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం కూడా ఆ పోరులో భాగమే.—దానియేలు 11:40, 42, 43.
త్వరలో జరగనున్న యుద్ధం
అయితే మంచి రోజులు రావడానికి ముందు పరిస్థితులు ఇంకా దారుణంగా తయారౌతాయని బైబిలు సూచించింది. “మహాశ్రమ వస్తుంది. లోకం పుట్టిన దగ్గర నుండి ఇప్పటివరకు అలాంటి శ్రమ రాలేదు” అని యేసు ముందే చెప్పాడు. (మత్తయి 24:21) ఆ “మహాశ్రమ” తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు హార్‌మెగిద్దోన్ యుద్ధం జరుగుతుంది. అది “సర్వశక్తిమంతుడైన దేవుని మహారోజున జరిగే యుద్ధం.”—ప్రకటన 16:14, 16.
అయితే హార్‌మెగిద్దోన్ యుద్ధం మనుషుల్ని నాశనం చేయదు కానీ కాపాడుతుంది. ఎన్నో యుద్ధాలతో బీభత్సం సృష్టించిన మానవ పరిపాలనకు దేవుడు ఆ యుద్ధంతో ముగింపు చుక్క పెడతాడు. అయితే హార్‌మెగిద్దోన్ ఎలా శాశ్వతమైన శాంతిని తీసుకొస్తుందో తెలుసుకోవడానికి ఈ కింది ఆర్టికల్స్ చదవండి: