బైబిలు పదాల పదకోశం
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఒ ఓ క గ చ జ ట డ త ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ క్ష
అ
-
అకయ.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో అకయ అనేది రోమా పరిపాలన కిందవున్న దక్షిణ గ్రీసు ప్రాంతం. దాని రాజధాని కొరింథు. పెలపన్నీస్ ప్రాంతమంతా, అలాగే గ్రీసులోని మధ్యభాగం కూడా అకయలో భాగమే. (అపొ 18:12)—అనుబంధం B13 చూడండి.
-
అగాధం.
ఇది అబిస్సోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దీనికి “చాలా లోతైన” లేదా “కొలవలేని, హద్దుల్లేని” అనే అర్థాలున్నాయి. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, ఈ పదాన్ని బంధించి ఉంచే చోటును లేదా బంధించబడిన స్థితిని సూచించడానికి వాడారు. సమాధి కూడా దీనిలోకే వస్తుంది, కానీ ఇది సమాధికి మాత్రమే పరిమితం కాదు.—లూకా 8:31; రోమా 10:7; ప్రక 20:3.
-
అగ్ని సరస్సు.
‘అగ్నిగంధకాలతో మండే’ సూచనార్థక స్థలం. ఇది ‘రెండో మరణం’ అని కూడా వర్ణించబడింది. పశ్చాత్తాపపడని పాపులు, అపవాది అందులో పడేయబడతారు. ఆఖరికి మరణం, సమాధి (లేదా హేడిస్) కూడా అందులో పడేయబడతాయి. పరలోక ప్రాణుల్ని, మరణాన్ని, హేడిస్‌ని అగ్ని ఏమీ చేయలేదు. అవి కూడా అందులో పడేయబడుతున్నాయి అంటే, ఈ సరస్సు నిత్యయాతన పడే స్థలాన్ని కాదుగానీ శాశ్వత నాశనాన్ని సూచిస్తుందని అర్థమౌతుంది.—ప్రక 19:20; 20:14, 15; 21:8.
-
అజాజేలు.
ఈ హీబ్రూ పదానికి బహుశా “మాయమయ్యే మేక” అని అర్థం. ప్రాయశ్చిత్త రోజున, అజాజేలు పేరున చీటి పడిన మేకను ఎడారిలోకి పంపేవాళ్లు, అలా అది సూచనార్థకంగా గడిచిన సంవత్సరంలో ఇశ్రాయేలు జనం చేసిన పాపాల్ని మోసుకెళ్లేది.—లేవీ 16:8, 10.
-
అతి పవిత్ర స్థలం.
గుడారంలో, ఆ తర్వాత ఆలయంలో ఉన్న చాలా లోపలి గది. అక్కడ ఒప్పంద మందసం ఉండేది; దీన్ని అత్యంత పవిత్రమైనది అని కూడా అంటారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం అతి పవిత్ర స్థలంలోకి వెళ్లడానికి అనుమతి ఉన్న ఏకైక వ్యక్తి ప్రధానయాజకుడు మాత్రమే. ప్రధానయాజకుడు ప్రతీ సంవత్సరం ప్రాయశ్చిత్త రోజున మాత్రమే ఆ స్థలంలోకి వెళ్లవచ్చు.—నిర్గ 26:33; లేవీ 16:2, 17; 1రా 6:16; హెబ్రీ 9:3.
-
అదారు.
ఇది బబులోను చెర తర్వాత, యూదుల పవిత్ర క్యాలెండరులో 12వ నెల, వ్యవసాయ క్యాలెండరులో 6వ నెల. ఇది మన క్యాలెండరులో ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు ఉంటుంది. (ఎస్తే 3:7)—అనుబంధం B15 చూడండి.
-
అద్భుతాలు; శక్తివంతమైన పనులు.
మనుషులకు తెలిసిన శక్తులన్నిటినీ మించిన పనులు లేదా సంఘటనలు. అవి మానవాతీత శక్తి వల్ల జరుగుతాయని అంటారు. బైబిల్లో కొన్నిసార్లు “సూచనలు” అనే పదాన్ని పర్యాయపదంగా వాడారు.—నిర్గ 4:21; అపొ 4:22; హెబ్రీ 2:4.
-
అపరాధ పరిహారార్థ బలి.
ఒక వ్యక్తి తన పాపాల్ని బట్టి అర్పించే బలి. ఇతర పాపపరిహారార్థ బలులకు దీనికి కొంచెం తేడా ఉంది. కొన్ని ఒప్పంద హక్కుల్ని నెరవేర్చడానికి లేదా పాపం చేసి పశ్చాత్తాపపడిన వ్యక్తి తాను కోల్పోయిన హక్కుల్ని తిరిగి పొందడానికి, శిక్ష నుండి విముక్తి పొందడానికి దీన్ని అర్పించేవాడు.—లేవీ 7:37; 19:22; యెష 53:10.
-
అపవాది.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, సాతానును వర్ణించడానికి ఉపయోగించిన పేరు. దీనికి “నిందలు వేసేవాడు” అని అర్థం. యెహోవా గురించి, ఆయన మంచిమాట గురించి, ఆయన పవిత్రమైన పేరు గురించి లేనిపోనివి కల్పించి చెప్పినవాళ్లలో, నిందలు వేసినవాళ్లలో సాతాను ముఖ్యుడు, మొట్టమొదటివాడు. అందుకే అతనికి ఈ పేరు ఇవ్వబడింది.—మత్త 4:1; యోహా 8:44; ప్రక 12:9.
-
అపవిత్రం.
భౌతికంగా మురికిగా ఉండడాన్ని లేదా నైతిక నియమాలు మీరడాన్ని సూచించవచ్చు. బైబిల్లో ఈ పదం తరచూ మోషే ధర్మశాస్త్రం ప్రకారం అంగీకారంకాని లేదా పవిత్రంగాలేని దాన్ని సూచిస్తుంది. (లేవీ 5:2; 13:45; మత్త 10:1; అపొ 10:14; ఎఫె 5:5)—శుద్ధమైన చూడండి.
-
అపారదయ.
దీని గ్రీకు పదం ముఖ్యంగా ప్రీతికరమైన, మనోహరమైన దాన్ని సూచిస్తుంది. దయతో ఇచ్చే బహుమతిని లేదా దయతో ఇవ్వడాన్ని సూచించడానికి దీన్ని తరచూ ఉపయోగించారు. దేవుని అపారదయను సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు, తిరిగిస్తారని ఆశించకుండా దేవుడు ఉదారంగా ఇచ్చే ఒక ఉచిత బహుమతిని వర్ణిస్తుంది. కాబట్టి ఈ పదం దేవుడు సమృద్ధిగా ఇవ్వడాన్ని, మనుషులపట్ల ఆయనకున్న గొప్ప ప్రేమను, దయను సూచిస్తుంది. ఈ గ్రీకు పదాన్ని “అనుగ్రహం,” “దయతో ఇచ్చిన బహుమానం” లాంటి మాటలతో కూడా అనువదించారు. ఒక వ్యక్తి కష్టపడకున్నా, అతనికి అర్హత లేకున్నా, కేవలం ఇచ్చే వ్యక్తి తన ఔదార్యంతో పురికొల్పబడి దీన్ని ఇస్తాడు.—2కొ 6:1; ఎఫె 1:7.
-
అపొస్తలుడు.
ఈ పదానికి ప్రాథమికంగా “పంపబడినవాడు” అనే అర్థం ఉంది. యేసు గురించి, ఇతరులకు సేవచేయడానికి పంపించబడిన కొంతమంది గురించి చెప్తున్నప్పుడు ఈ పదాన్ని వాడారు. అయితే యేసు స్వయంగా ఎంపిక చేసుకున్న 12 మంది నియమిత ప్రతినిధుల గుంపులోని శిష్యుల్ని సూచించడానికి ఈ పదాన్ని ఎక్కువసార్లు వాడారు.—మార్కు 3:14; అపొ 14:14.
-
అబీబు.
ఇది మొదట్లో యూదుల పవిత్ర క్యాలెండరులో మొదటి నెల, వ్యవసాయ క్యాలెండరులో 7వ నెల. ఆ పేరుకు ద్వితీ 16:1)—అనుబంధం B15 చూడండి.
“పచ్చని వెన్నులు (ధాన్యం)” అని అర్థం. ఇది మన క్యాలెండరులో మార్చి మధ్య నుండి ఏప్రిల్ మధ్య వరకు ఉంటుంది. యూదులు బబులోను నుండి తిరిగొచ్చాక దాన్ని “నీసాను” అని పిలిచారు. ( -
అబ్.
ఇది బబులోను చెర తర్వాత, యూదుల పవిత్ర క్యాలెండరులో 5వ నెల, వ్యవసాయ క్యాలెండరులో 11వ నెల. ఇది మన క్యాలెండరులో జూలై మధ్య నుండి ఆగస్టు మధ్య వరకు ఉంటుంది. బైబిల్లో అబ్ అనే పేరు లేదుగానీ దాన్ని “ఐదో నెల” అన్నారు. (సం 33:38; ఎజ్రా 7:9)—అనుబంధం B15 చూడండి.
-
అభిషేకించడం.
హీబ్రూ భాషలో ఉపయోగించిన పదానికి ప్రాథమికంగా “ద్రవాన్ని పూయడం” అని అర్థం. ఒక వ్యక్తిని గానీ వస్తువును గానీ ప్రత్యేకమైన సేవకు సమర్పించారనడానికి గుర్తుగా తైలం రాసేవాళ్లు. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, పరలోక నిరీక్షణ కోసం ఎంచుకోబడిన వాళ్లమీద పవిత్రశక్తి కుమ్మరించడం గురించి చెప్తున్నప్పుడు కూడా ఈ పదాన్ని ఉపయోగించారు.—నిర్గ 28:41; 1స 16:13; 2కొ 1:21.
-
అమావాస్య.
-
అరామిక్.
ఇది ఒక భాష పేరు. దీనికి హీబ్రూ భాషతో చాలా దగ్గరి సంబంధం ఉంది. ఈ భాషలో హీబ్రూ అక్షరమాలనే ఉపయోగించేవాళ్లు. మొదట్లో ఈ భాషను అరామీయులు మాట్లాడేవాళ్లు. కానీ ఆ తర్వాత ఇది అష్షూరు, బబులోను సామ్రాజ్యాల్లో అంతర్జాతీయ వ్యాపార భాషగా, వ్యవహార భాషగా మారిపోయింది. అంతేకాదు, పారసీక సామ్రాజ్యంలో ఇది అధికార కార్యనిర్వాహక భాషగా ఉండేది. (ఎజ్రా 4:7) ఎజ్రా, యిర్మీయా, దానియేలు పుస్తకాల్లోని కొన్ని భాగాలు అరామిక్ భాషలో రాయబడ్డాయి.—ఎజ్రా 4:8–6:18; 7:12-26; యిర్మీ 10:11; దాని 2:4బి–7:28.
-
అరాము; అరామీయులు.
ముఖ్యంగా లెబానోను పర్వతాల నుండి మెసొపొతమియ వరకు, ఉత్తరాన టౌరస్ పర్వతాల నుండి దక్షిణాన దమస్కు, ఆ తర్వాతి ప్రాంతం వరకు ఉన్న ప్రాంతాల్లో నివసించిన షేము కుమారుడైన అరాము వంశస్థులు. హీబ్రూలో ఈ ప్రాంతాన్ని అరాము అని పిలిచేవాళ్లు; తర్వాత దీన్నే సిరియా అని, ఇందులో నివసించినవాళ్లను సిరియన్లు అని పిలిచేవాళ్లు.—ఆది 25:20; ద్వితీ 26:5; హోషే 12:12.
-
అరేయొపగు.
ఇది ఏథెన్సులో ఉన్న ఒక పెద్ద కొండ. ఇది అక్రొపొలిస్‌కు వాయవ్య దిశలో ఉంది. అరేయొపగు అనేది ఒక సభ (న్యాయస్థానం) పేరు కూడా; అక్కడ సమావేశాలు జరిగేవి. పౌలు తన నమ్మకాలు వివరించేలా స్తోయికుల, ఎపికూరీయుల తత్త్వవేత్తలు అతన్ని అరేయొపగుకు తీసుకొచ్చారు.—అపొ 17:19.
-
అలబాస్టర్.
ఐగుప్తులోని అలబాస్ట్రన్ ప్రాంతం దగ్గర దొరికే ఒక రాయితో తయారుచేసిన చిన్న అత్తరు బుడ్డీలను అలబాస్టర్ అంటారు. సాధారణంగా వాటి మూతి భాగం సన్నగా ఉంటుంది; దానివల్ల వాటిలో ఉన్న ఖరీదైన అత్తరు కొంచెం కూడా కారిపోకుండా మూత గట్టిగా బిగించడం వీలౌతుంది. తర్వాతి కాలంలో ఆ రాయికి కూడా అలబాస్టర్ అనే పేరే వచ్చింది.—మార్కు 14:3, అధస్సూచి.
-
అలమోతు.
ఇది సంగీతానికి సంబంధించిన పదం. దీనికి “కన్యలు; యువతులు” అని అర్థం. ఇది బహుశా యువతుల ఉచ్చస్వరాన్ని సూచిస్తుండవచ్చు. సంగీతాన్ని ఉచ్చస్వరంలో వాయించాలని సూచించడానికి దీన్ని ఉపయోగించి ఉండవచ్చు.—1ది 15:20; కీర్త 46:పైవిలాసం.
-
అల్లాడించే అర్పణ.
ఈ అర్పణను ఆరాధకుడు తన చేతులతో పట్టుకునేవాడు, యాజకుడు తన చేతుల్ని అతని చేతుల కింద ఉంచి ముందుకు, వెనకకు కదిలించేవాడు; లేదా యాజకుడు ఆ అర్పణను తన చేతుల్లోకి తీసుకుని ముందుకు, వెనకకు కదిలించేవాడు. ఇలా కదిలించడం లేదా అల్లాడించడం బలి అర్పణల్ని యెహోవాకు అర్పించడాన్ని సూచిస్తుంది.—లేవీ 7:30.
-
అష్తారోతు.
కనానీయుల యుద్ధ, సంతాన సాఫల్య దేవత; బయలు దేవుని భార్య.—1స 7:3.
-
అసెల్జీయ.—
లెక్కలేనితనం చూడండి.
-
అహరోను కుమారులు.
లేవి మనవడైన అహరోను వంశస్థులు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం మొట్టమొదట ప్రధాన యాజకునిగా ఎంచుకోబడిన వ్యక్తి ఇతను. అహరోను కుమారులు గుడారంలో, ఆలయంలో యాజక విధులు నిర్వహించేవాళ్లు.—1ది 23:28.
ఆ
-
ఆకాశరాణి.
యిర్మీయా కాలంలో మతభ్రష్టులైన ఇశ్రాయేలీయులు పూజించిన ఒక దేవత బిరుదు. ఈ బిరుదు బబులోనీయుల ఇష్తార్ (అస్టార్టె) దేవతను సూచిస్తుందని కొందరు అంటారు. అంతకుముందు సుమేరియన్లు ఆమెలాంటి ఇంకో దేవతను, అంటే “ఆకాశరాణి” అనే అర్థం ఉన్న ఇనానా దేవతను ఆరాధించేవాళ్లు. ఈమె ఆకాశ దేవత మాత్రమే కాదు, సంతాన సాఫల్య దేవత కూడా. ఒక ఐగుప్తీయుల చెక్కడంలో అస్టార్టె “ఆకాశ యజమానురాలు” అని కూడా పిలవబడింది.—యిర్మీ 44:19.
-
ఆమేన్.
ఈ మాటకు, “అలాగే జరగాలి” లేదా “ఖచ్చితంగా” అని అర్థం. ఈ పదం అమన్ అనే హీబ్రూ మూలపదం నుండి వచ్చింది. దానికి “నమ్మకంగా, నమ్మదగిన విధంగా ఉండడం” అనే అర్థాలు ఉన్నాయి. ఒక ఒట్టుకు, ప్రార్థనకు లేదా మాటకు అంగీకారం తెలపడానికి “ఆమేన్” అని అనేవాళ్లు. ప్రకటన గ్రంథంలో, ఈ పదాన్ని యేసుకు బిరుదుగా ఉపయోగించారు.—ద్వితీ 27:26; 1ది 16:36; ప్రక 3:14.
-
ఆలయం.
యెరూషలేములో ఇశ్రాయేలీయుల ఆరాధనకు కేంద్రంగా ఉన్న శాశ్వత కట్టడం, ఇది ఒక చోటి నుండి ఇంకో చోటికి తీసుకెళ్లగలిగే గుడారం స్థానంలో వచ్చింది. మొట్టమొదటి ఆలయాన్ని సొలొమోను కట్టించాడు, దాన్ని ఎజ్రా 1:3; 6:14, 15; 1ది 29:1; 2ది 2:4; మత్త 24:1)—అనుబంధం B8, B11 చూడండి.
బబులోనీయులు నాశనం చేశారు. రెండో ఆలయాన్ని బబులోను చెర నుండి తిరిగొచ్చిన తర్వాత జెరుబ్బాబెలు కట్టించాడు. ఆ తర్వాత హేరోద్ ద గ్రేట్ దాన్ని తిరిగి కట్టించాడు. ఈ ఆలయాన్ని లేఖనాల్లో ఎక్కువగా “యెహోవా మందిరం” అని పిలిచారు. ( -
ఆల్ఫా, ఓమెగ.
-
ఆశ్రయపురాలు.
ఇవి లేవీయుల నగరాలు. అనుకోకుండా ఎవరినైనా చంపిన వ్యక్తి, ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి నుండి తనను తాను కాపాడుకోవడానికి ఈ నగరాలకు వెళ్లేవాడు. యెహోవా నిర్దేశం కింద మొదట మోషే, ఆ తర్వాత యెహోషువ వాగ్దాన దేశమంతటా అలాంటి ఆరు నగరాల్ని ఏర్పాటు చేశారు. పారిపోయి వచ్చిన వ్యక్తి ఆ నగరానికి చేరుకున్నాక, నగర ద్వారం దగ్గరున్న పెద్దలకు తన వ్యాజ్యాన్ని వినిపించేవాడు, తర్వాత వాళ్లు అతన్ని లోపలికి రానిచ్చేవాళ్లు. కావాలని హత్య చేసిన వ్యక్తి ఈ ఏర్పాటును ఉపయోగించుకునే వీలు లేకుండా, పారిపోయి వచ్చిన వ్యక్తి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి హత్య జరిగిన నగరంలో న్యాయ విచారణకు హాజరవ్వాలి. అతను నిర్దోషి అని తేలితే, ఆ ఆశ్రయపురానికి తిరిగెళ్లి తాను చనిపోయేంతవరకు, లేదా ప్రధానయాజకుడు చనిపోయేంతవరకు దాని సరిహద్దుల లోపలే ఉండాలి.—సం 35:6, 11-15, 22-29; యెహో 20:2-8.
-
ఆసియా.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, రోమా ఆధిపత్యం కింద ఉన్న ఒక ప్రాంతం. ఇప్పటి పశ్చిమ తుర్కియే అందులో భాగంగా ఉండేది; అలాగే కోస్తా ప్రాంతానికి దగ్గర్లో ఉన్న సమొసు, పత్మాసు వంటి కొన్ని ద్వీపాలు కూడా అందులో భాగంగా ఉండేవి. అప్పటి ఆసియా రాజధాని ఎఫెసు. (అపొ 20:16; ప్రక 1:4)—అనుబంధం B13 చూడండి.
ఇ
-
ఇతియోపియా.
ఐగుప్తుకు దక్షిణాన ఉన్న ప్రాచీన దేశం. ఇప్పటి ఈజిప్టులో దక్షిణాన చిట్టచివర ఉన్న ప్రాంతం, అలాగే ఇప్పటి సూడాన్ అప్పటి ఇతియోపియాలో ఉండేవి. కొన్నిసార్లు హీబ్రూలో “కూషు” అనే ప్రాంతాన్ని సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగించారు.—ఎస్తే 1:1.
-
ఇల్లూరికు.
గ్రీసుకు వాయవ్య దిశలో ఉన్న రోమా ప్రాంతం. పౌలు తన పరిచర్యలో భాగంగా ఇల్లూరికు వరకు వెళ్లాడు. అయితే ఆయన ఇల్లూరికులో కూడా ప్రకటించాడా లేక కేవలం అక్కడి వరకు వెళ్లాడా అన్నది బైబిలు చెప్పట్లేదు. (రోమా 15:19)—అనుబంధం B13 చూడండి.
-
ఇశ్రాయేలు.
దేవుడు యాకోబుకు ఇచ్చిన పేరు. తర్వాతి కాలంలో అతని వంశస్థులందర్నీ కలిపి ఇశ్రాయేలు అని పిలవడం మొదలైంది. యాకోబు 12 మంది కుమారుల వంశస్థుల్ని తరచూ ఇశ్రాయేలు కుమారులు, ఇశ్రాయేలు కుటుంబం, ఇశ్రాయేలు ప్రజలు (పురుషులు), లేదా ఇశ్రాయేలీయులు అని పిలిచారు. దక్షిణ రాజ్యం నుండి విడిపోయిన పది గోత్రాల ఉత్తర రాజ్యాన్ని కూడా ఇశ్రాయేలు అని పిలిచారు. ఆ తర్వాతి కాలంలో ఈ పదం అభిషిక్త క్రైస్తవుల్ని సూచించడానికి ఉపయోగించబడింది, వాళ్లు “దేవుని ఇశ్రాయేలు” అని పిలవబడ్డారు.—గల 6:16; ఆది 32:28; 2స 7:23; రోమా 9:6.
ఈ
-
ఈ వ్యవస్థ ముగింపు.
సాతాను అధికారం కిందవున్న వ్యవస్థ అంతానికి ముందున్న కాలం. ఇది క్రీస్తు ప్రత్యక్షత కాలానికి సమాంతరంగా నడుస్తుంది. యేసు నిర్దేశంలో దేవదూతలు “నీతిమంతుల మధ్య నుండి దుష్టుల్ని వేరు చేసి” నాశనం చేస్తారు. (మత్త 13:40-42, 49) యేసు శిష్యులు ఆ “ముగింపు” ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలనుకున్నారు. (మత్త 24:3) ఆ సమయం వరకు తన అనుచరులకు తోడుగా ఉంటానని పరలోకానికి వెళ్లేముందు యేసు వాళ్లకు మాటిచ్చాడు.—మత్త 28:20.
-
ఈఫా.
ధాన్యాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక ఘన కొలత, ఆ కొలిచే పాత్రను కూడా ఈఫా అంటారు. ఇది ఒక ద్రవ బాత్ కొలతతో, అంటే 22 లీటర్లతో సమానం. (నిర్గ 16:36; యెహె 45:10)—అనుబంధం B14 చూడండి.
ఉ
-
ఉన్నత స్థలం.
ఇది సాధారణంగా ఒక కొండ మీద, పర్వతం మీద లేదా వేదిక మీద ఉండే ఆరాధనా స్థలం. కొన్ని సందర్భాల్లో వీటిని దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగించినా, అవి ఎక్కువగా అబద్ధ దేవుళ్ల పూజతో ముడిపెట్టబడ్డాయి.—సం 33:52; 1రా 3:2; యిర్మీ 19:5.
-
ఉపపత్నులు.
బహుభార్యత్వంలో ఒక వ్యక్తికి ఉన్న భార్య (లేదా, భార్యలు) కాకుండా అతను పెళ్లి చేసుకున్న మిగతా స్త్రీలు. భార్యలకు ఉన్నన్ని హక్కులు వీళ్లకు ఉండేవికాదు. ఎక్కువగా దాసురాళ్లే ఉపపత్నులుగా ఉండేవాళ్లు.—నిర్గ 21:8; 2స 5:13; 1రా 11:3.
-
ఉపవాసం.
కొంత సమయం పాటు ఏ రకమైన ఆహారమూ తీసుకోకపోవడం. ఇశ్రాయేలీయులు ప్రాయశ్చిత్త రోజున, అలాగే కష్టసమయాల్లో, దేవుని నిర్దేశం అవసరమైన సమయంలో ఉపవాసం ఉండేవాళ్లు. యూదులు తమ చరిత్రలో జరిగిన విపత్కర సంఘటనలకు గుర్తుగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉపవాసం ఏర్పాటు చేసుకున్నారు. క్రైస్తవులు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు.—ఎజ్రా 8:21; యెష 58:6; లూకా 18:12.
ఊ
-
ఊరీము, తుమ్మీము.
మొత్తం జనానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలకు యెహోవా ఇచ్చే జవాబు ఏంటో తెలుసుకోవడానికి ప్రధానయాజకుడు వీటిని చీటీల్లా ఉపయోగించేవాడు. ప్రధానయాజకుడు గుడారంలోకి ప్రవేశించేటప్పుడు అతని వక్షపతకంలో ఇవి ఉండేవి. బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసిన తర్వాత వీటిని ఉపయోగించడం ఆగిపోయి ఉండవచ్చు.—నిర్గ 28:30; నెహె 7:65.
ఎ
-
ఎడారి.
హీబ్రూ లేఖనాల్లో కొన్నిచోట్ల ఈ పదం నిర్మానుష్య ప్రదేశాల్ని, అడవుల్ని కూడా సూచిస్తుంది. గ్రీకు లేఖనాల్లో ఈ పదాన్ని ఇసుక, బండరాళ్లతో కూడిన ఎండిపోయిన ప్రాంతాల్ని వర్ణించడానికి ఉపయోగించారు. (యోహా 3:14) అయితే సంవత్సరంలోని ఆయా సమయాల్లో పచ్చిక ఉండడం వల్ల ఆ ప్రాంతాల్లో పశువుల్ని మేపే అవకాశముంది. (లూకా 15:4) కొన్ని సందర్భాల్లో ఒక ప్రాంతంలోని భౌతిక అంశాల్ని కాకుండా అక్కడ తక్కువ జనాభా ఉందని సూచించడానికి ఈ పదం ఉపయోగించబడింది.
-
ఎదోము.
ఇది ఇస్సాకు కుమారుడైన ఏశావు మరో పేరు. ఏశావు (ఎదోము) వంశస్థులు మృత సముద్రానికి, అకాబా సింధుశాఖకు మధ్య ఉన్న శేయీరు కొండ ప్రాంతంలో నివాసం ఏర్పర్చుకున్నారు. ఆ ప్రాంతం ఎదోము అని పిలవబడింది. (ఆది 25:30; 36:8)—అనుబంధం B3, B4 చూడండి.
-
ఎపికూరీయుల తత్త్వవేత్తలు.
గ్రీకు తత్త్వవేత్త ఎపికూరు (సా.శ.పూ. 341-270) అనుచరులు. సొంత సుఖాలే జీవిత అంతిమ లక్ష్యం అన్నది వాళ్ల సిద్ధాంతం.—అపొ 17:18.
-
ఎఫ్రాయిము.
యోసేపు రెండో కుమారుడి పేరు; తర్వాతి కాలంలో ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రాన్ని ఈ పేరుతో పిలిచారు. ఇశ్రాయేలు రెండు భాగాలుగా విడిపోయిన తర్వాత పది గోత్రాల రాజ్యం ఈ పేరుతోనే పిలవబడింది, ఎందుకంటే వాటిలో అది ముఖ్యమైన గోత్రం.—ఆది 41:52; యిర్మీ 7:15.
ఏ
-
ఏతనీము.
ఇది యూదుల పవిత్ర క్యాలెండరులో 7వ నెల, వ్యవసాయ క్యాలెండరులో మొదటి నెల. ఇది మన క్యాలెండరులో సెప్టెంబరు మధ్య నుండి అక్టోబరు మధ్య వరకు ఉంటుంది. యూదులు బబులోను నుండి తిరిగొచ్చిన తర్వాత, దీనికి తిష్రీ అనే పేరు వచ్చింది. (1రా 8:2)—అనుబంధం B15 చూడండి.
-
ఏఫోదు.
యాజకులు బట్టల పైన ధరించే చిన్న వస్త్రం. ప్రధానయాజకుడు ఒక ప్రత్యేకమైన ఏఫోదును ధరించేవాడు, దానిమీద 12 రత్నాలు పొదిగిన వక్షపతకం ఉండేది. (నిర్గ 28:4, 6)—అనుబంధం B5 చూడండి.
-
ఏలూలు.
ఇది బబులోను చెర తర్వాత, యూదుల పవిత్ర క్యాలెండరులో 6వ నెల, వ్యవసాయ క్యాలెండరులో 12వ నెల. ఇది మన క్యాలెండరులో ఆగస్టు మధ్య నుండి సెప్టెంబరు మధ్య వరకు ఉంటుంది. (నెహె 6:15)—అనుబంధం B15 చూడండి.
ఒ
-
ఒట్టు.
ఒక విషయం నిజమని చెప్పడానికి, లేదా ఏదైనా చేస్తానని గానీ, చేయనని గానీ మాట ఇవ్వడానికి సాధారణంగా తమకన్నా పైస్థానంలో ఉన్నవాళ్లకు, ముఖ్యంగా దేవునికి చేసే ప్రమాణం. యెహోవా ఒట్టేసి ప్రమాణం చేయడం ద్వారా, అబ్రాహాముతో తాను చేసిన ఒప్పందాన్ని బలపర్చాడు.—ఆది 14:22; హెబ్రీ 6:16, 17.
-
ఒప్పంద మందసం.
దీన్ని సాక్ష్యపు మందసం అని కూడా పిలిచేవాళ్లు. ఇది తుమ్మకర్రతో తయారుచేసి, బంగారు రేకు తొడిగిన పెట్టె. ఇది గుడారంలోని అతి పవిత్ర స్థలంలో ఉండేది. ఆ తర్వాతి కాలంలో దీన్ని సొలొమోను నిర్మించిన ఆలయంలోని అతి పవిత్ర స్థలంలో పెట్టారు. దీనికి బంగారంతో చేసిన గట్టి మూత ఉండేది. ఆ మూత మీద రెండు కెరూబులు ఎదురెదురుగా ఉండేవి. ఆ మందసంలో ముఖ్యంగా పది ఆజ్ఞలు ఉన్న రెండు రాతిపలకలు ఉండేవి. వీటిని సాక్ష్యంగా ఉండే రాతి పలకలు అని కూడా అనేవాళ్లు. (నిర్గ 25:22; 31:18; ద్వితీ 31:26; 1రా 6:19; హెబ్రీ 9:4)—అనుబంధం B5, B8 చూడండి.
-
ఒప్పందం/నిబంధన.
ఏదైనా ఒక పని చేసేందుకు లేదా చేయకుండా ఉండేందుకు దేవునికి, మనుషులకు మధ్య గానీ మనుషుల్లోనే రెండు పక్షాల మధ్య గానీ లాంఛనప్రాయంగా జరిగే ఒడంబడిక. కొన్నిసార్లు కేవలం ఒక పక్షం వాళ్లే ఒప్పందంలోని షరతుల్ని పాటించాల్సి ఉండేది (ఇది ఏకపక్ష ఒప్పందం; ఇది చాలామట్టుకు వాగ్దాన రూపంలోనే ఉంటుంది). వేరే ఒప్పందాల్లో ఇరుపక్షాల వాళ్లు షరతుల్ని పాటించాల్సి ఉండేది (ఇవి ద్వైపాక్షిక ఒప్పందాలు). దేవుడు మనుషులతో చేసిన ఒప్పందాల గురించే కాకుండా, మనుషుల మధ్య, గోత్రాల మధ్య, దేశాల మధ్య లేదా ప్రజల గుంపుల మధ్య జరిగిన ఒప్పందాల గురించి కూడా బైబిలు ప్రస్తావిస్తోంది. ఎంతగానో ప్రభావం చూపించిన కొన్ని ఒప్పందాలు ఏంటంటే: దేవుడు అబ్రాహాముతో, దావీదుతో, ఇశ్రాయేలు జనంతో (ధర్మశాస్త్ర ఒప్పందం), దేవుని ఇశ్రాయేలుతో (కొత్త ఒప్పందం) చేసిన ఒప్పందాలు.—ఆది 9:11; 15:18; 21:27; నిర్గ 24:7; 2ది 21:7.
ఓ
-
ఓమెరు.
ఇది ఒక ఘన కొలత, 2.2 లీటర్లతో సమానం. ఇది ఈఫాలో పదోవంతు. (నిర్గ 16:16, 18)—అనుబంధం B14 చూడండి.
క
-
కనాను.
నోవహు మనవడు, హాము నాలుగో కుమారుడు. కనాను నుండి వచ్చిన 11 గోత్రాలు క్రమక్రమంగా మధ్యధరా సముద్రానికి తూర్పు వైపున ఐగుప్తు, సిరియాల మధ్య ఉన్న ప్రాంతంలో నివసించాయి. ఆ ప్రాంతాన్నే “కనాను దేశం” అని పిలిచారు. (లేవీ 18:3; ఆది 9:18; అపొ 13:19)—అనుబంధం B4 చూడండి.
-
కప్పం.
-
కల్దీయ; కల్దీయులు.
టైగ్రిస్, యూఫ్రటీసు నదుల డెల్టా ప్రాంతం, ఆ ప్రాంతంలో నివసించిన ప్రజలు. కొంతకాలానికి, మొత్తం బాబిలోనియాను, దాని ప్రజల్ని సూచించడానికి ఈ పదాలు ఉపయోగించారు. “కల్దీయులు” అనే పదం చదువుకున్నవాళ్ల ఒక గుంపును కూడా సూచిస్తుంది. వీళ్లు విజ్ఞానశాస్త్రాన్ని, చరిత్రను, భాషల్ని, ఖగోళ శాస్త్రాన్ని ఎజ్రా 5:12; దాని 4:7; అపొ 7:4.
అధ్యయనం చేసేవాళ్లు కానీ ఇంద్రజాలాన్ని, జ్యోతిష్యాన్ని అభ్యసించేవాళ్లు.— -
కళ్లం.
ధాన్యపు గింజల్ని కాండం నుండి, పొట్టు నుండి వేరు చేయడాన్ని నూర్చడం అంటారు; అలా చేసే స్థలాన్ని కళ్లం అంటారు. ధాన్యాన్ని నూర్చడం కోసం కర్రతో కొట్టేవాళ్లు. ఒకవేళ ధాన్యం ఎక్కువగా ఉంటే, జంతువులు లాగే చెక్క పలకలు లేదా రోలర్ల లాంటి ప్రత్యేకమైన పరికరాలు ఉపయోగించేవాళ్లు. కళ్లంలో పరిచివున్న ధాన్యం మీద ఆ పరికరాల్ని తిప్పేవాళ్లు. కళ్లం అనేది చదునుగా, వృత్తాకారంలో ఉంటుంది; అది సాధారణంగా గాలి బాగా వీచే ఎత్తైన స్థలంలో ఉంటుంది.—లేవీ 26:5; యెష 41:15; మత్త 3:12.
-
కాడి.
ఒక వ్యక్తి భుజం మీద మోసే కొయ్య, దీనికి రెండు వైపులా బరువులు తగిలిస్తారు. అలాగే, పొలంలో వాడే పరికరాన్ని గానీ బండిని గానీ లాగేటప్పుడు రెండు జంతువుల (సాధారణంగా ఎద్దుల) మెడల మీద పెట్టే చెక్క కొయ్యను లేదా ఫ్రేమును కూడా కాడి అంటారు. దాసులు తరచూ పెద్దపెద్ద బరువులు మోయడానికి కాడిని ఉపయోగించేవాళ్లు. కాబట్టి వేరే వ్యక్తికి దాసుడిగా ఉండడాన్ని లేదా లోబడి ఉండడాన్ని సూచించడానికి, అలాగే అణచివేతను-బాధను సూచించడానికి కాడిని అలంకారికంగా ఉపయోగించారు. కాడిని తీసేయడం లేదా విరగ్గొట్టడం చెర నుండి, అణచివేత నుండి, దోపిడి నుండి విడుదలవ్వడాన్ని సూచించింది.—లేవీ 26:13; మత్త 11:29, 30.
-
కావలివాడు.
ఎక్కువగా రాత్రిపూట, మనుషులకు లేదా ఆస్తికి హాని జరగకుండా కాపలా కాసే వ్యక్తి. ఏదైనా అపాయం వస్తుందని తెలిసినప్పుడు అతను శబ్దం చేయవచ్చు. వస్తున్నవాళ్లను కాస్త దూరంలో ఉండగానే చూడడం కోసం కావలివాళ్లను తరచూ నగర ప్రాకారాల మీద, బురుజుల మీద నిలబెట్టేవాళ్లు. సైన్యంలో ఉన్న కావలివాళ్లను తరచూ గార్డు లేదా భటుడు అంటారు. ప్రవక్తలు రాబోయే నాశనం గురించి హెచ్చరిస్తూ ఇశ్రాయేలు జనానికి సూచనార్థకంగా కావలివాళ్లలా పనిచేశారు.—2రా 9:20; యెహె 3:17.
-
కిస్లేవు.
ఇది బబులోను చెర తర్వాత, యూదుల పవిత్ర క్యాలెండరులో 9వ నెల, వ్యవసాయ క్యాలెండరులో 3వ నెల. ఇది మన క్యాలెండరులో నవంబరు మధ్య నుండి డిసెంబరు మధ్య వరకు ఉంటుంది. (నెహె 1:1; జెక 7:1)—అనుబంధం B15 చూడండి.
-
కీర్తన.
దేవునికి పాడే స్తుతిగీతం. కీర్తనల్ని సంగీతానికి తగ్గట్టు కట్టేవాళ్లు, యెరూషలేము ఆలయంలో యెహోవా దేవునికి బహిరంగంగా చేసే ఆరాధనలో వీటిని పాడేవాళ్లు.—లూకా 20:42; అపొ 13:33; యాకో 5:13, అధస్సూచి.
-
కుమ్మరి.
-
కుష్ఠువ్యాధి; కుష్ఠురోగి.
తీవ్రమైన ఒక చర్మవ్యాధి. లేఖనాల్లో ప్రస్తావించిన కుష్ఠురోగం, మన కాలంలో ఉన్న కుష్ఠురోగానికి మాత్రమే పరిమితం కాదు. ఎందుకంటే అది మనుషులకే కాకుండా బట్టలకు, ఇళ్లకు కూడా వచ్చేది. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తిని కుష్ఠురోగి అంటారు.—లేవీ 14:54, 55; లూకా 5:12.
-
కృతజ్ఞతార్పణ.
దేవుడు ఇచ్చిన వాటిని బట్టి, ఆయన చూపించిన విశ్వసనీయ ప్రేమను బట్టి ఆయన్ని స్తుతించడానికి అర్పించే సమాధానబలి. బలిగా అర్పించిన జంతువు మాంసాన్ని, పులిసిన రొట్టెల్ని, పులవని రొట్టెల్ని తినేవాళ్లు. మాంసాన్ని ఆ రోజే తినాలి.—2ది 29:31.
-
కెమోషు.
మోయాబీయుల ముఖ్య దేవుడు.—1రా 11:33.
-
కెరూబులు.
ప్రత్యేక విధులు నిర్వహించే ఉన్నత శ్రేణి దేవదూతలు. వీళ్లు, సెరాపులు ఒకటి కాదు.—ఆది 3:24; నిర్గ 25:20; యెష 37:16; హెబ్రీ 9:5.
-
కైసరు.
రోమన్ల ఇంటి పేర్లలో ఇదొకటి. తర్వాత అది రోమా చక్రవర్తులకు బిరుదుగా మారింది. వాళ్లలో ఔగుస్తు, తిబెరి, క్లౌదియ వంటి కొంతమంది పేర్లు బైబిల్లో ఉన్నాయి; నీరో చక్రవర్తి పేరు బైబిల్లో లేకపోయినా, కైసరు అనే బిరుదు అతనికి కూడా వర్తిస్తుంది. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, లౌకిక అధికారాన్ని లేదా ప్రభుత్వాన్ని సూచించడానికి కూడా “కైసరు” అనే పదం వాడారు.—మార్కు 12:17; అపొ 25:12.
-
కొమ్ము.
ఇది జంతువుల కొమ్ముల్ని సూచిస్తుంది. వీటిని తాగే పాత్రలుగా, నూనె పాత్రలుగా, సిరాబుడ్డీలుగా, అలంకార ద్రవ్యాల పాత్రలుగా, సంగీత వాయిద్యాలుగా, సంకేతాల్నిచ్చే పరికరాలుగా వాడేవాళ్లు. (1స 16:1, 13; 1రా 1:39, అధస్సూచి; యెహె 9:2, అధస్సూచి) బలాన్ని, జయించడాన్ని, గెలుపును సూచించడానికి “కొమ్ము” అనే పదాన్ని తరచూ అలంకారికంగా ఉపయోగించారు.—ద్వితీ 33:17; మీకా 4:13; జెక 1:19.
-
కొయ్య.
బాధితుడిని వేలాడదీసే ఒక నిలువు కొయ్య. దీన్ని కొన్నిదేశాల్లో మరణశిక్ష వేయడానికీ, ఇతరులకు హెచ్చరికగా ఉండడం కోసం లేదా అందరిముందు అవమానించడం కోసం మృతదేహాన్ని వేలాడదీయడానికీ ఉపయోగించేవాళ్లు. కొన్నిసార్లు వాటిలో ఏదో ఒకదానికి ఉపయోగించేవాళ్లు. పాశవిక యుద్ధాలకు పేరుగాంచిన అష్షూరీయులు, బందీలను పదునైన కొయ్యల మొన మీద వేలాడదీసేవాళ్లు. ఆ కొయ్య, బాధితుడి కడుపు గుండా ఛాతి భాగంలోకి దూసుకెళ్లేది. అయితే యూదుల ధర్మశాస్త్రం ప్రకారం, దైవదూషణ లేదా విగ్రహపూజ వంటి ఘోరమైన నేరాలు చేసేవాళ్లను ముందు రాళ్లతో కొట్టి చంపేవాళ్లు లేదా వేరే పద్ధతిలో చంపేవాళ్లు. తర్వాత, ఇతరులకు హెచ్చరికగా ఉండడం కోసం ఆ శవాల్ని కొయ్యలకు లేదా చెట్లకు వేలాడదీసేవాళ్లు. (ద్వితీ 21:22, 23; 2స 21:6, 9) రోమీయులు కొన్నిసార్లు బాధితుల్ని కొయ్యకు కట్టి అలా వదిలేసేవాళ్లు; దాంతో వాళ్లు నొప్పి, ఆకలి, దప్పిక, ఎండదెబ్బ వల్ల బాధపడి కొన్ని రోజులకు చనిపోయేవాళ్లు. ఇంకొన్నిసార్లు వాళ్లు నిందితుడి చేతుల్ని, పాదాల్ని మేకులతో కొయ్యకు దిగగొట్టేవాళ్లు. యేసుకు మరణశిక్ష విధించినప్పుడు వాళ్లు అలాగే చేశారు. (లూకా 24:20; యోహా 19:14-16; 20:25; అపొ 2:23, 36)—హింసాకొయ్య చూడండి.
-
కొరడా.
యేసు కాలంలో కొరడాలకు ఇనుప గుండ్లు లేదా పదునైన ఎముక ముక్కలు ఉండేవి. ఈ కొరడాలను శిక్షించడానికి ఉపయోగించేవాళ్లు.—యోహా 19:1.
-
కొర్.
దీన్ని ద్రవ కొలతల్లో, ఘన కొలతల్లో రెండిట్లోనూ ఉపయోగించేవాళ్లు. బాత్ కొలత ఆధారంగా చూస్తే ఒక కొర్ 220 లీటర్లతో సమానం. (1రా 5:11)—అనుబంధం B14 చూడండి.
-
కొలకర్ర.
దీన్ని సాధారణంగా రెల్లుతో తయారుచేస్తారు. ఇది ఆరు మూరల పొడవు ఉంటుంది. సాధారణ మూరతో కొలిచేది 2.67 మీటర్ల (8.75 అడుగుల) పొడవు ఉండేది; పొడవైన మూరతో కొలిచేది 3.11 మీటర్ల (10.2 అడుగుల) పొడవు ఉండేది. (యెహె 40:3, 5; ప్రక 11:1, అధస్సూచి)—అనుబంధం B14 చూడండి.
-
కొలిమి.
ముడి ఖనిజాన్ని లేదా లోహాన్ని కరిగించడానికి ఉపయోగించే నిర్మాణం. కుండల్ని, పింగాణీ వస్తువుల్ని కాల్చడానికి కూడా దీన్ని వాడతారు. బైబిలు కాలాల్లో వీటిని ఇటుకలతో లేదా రాళ్లతో చేసేవాళ్లు. కుండలు, పింగాణీ పాత్రలు, సున్నం కాల్చడానికి ఉపయోగించే కొలిమిని ‘బట్టీ’ అని కూడా పిలుస్తారు.—ఆది 15:17; దాని 3:17; ప్రక 9:2.
-
కోత పండుగ; వారాల పండుగ.
—పెంతెకొస్తు చూడండి.
-
క్యాబ్.
ఇది ఒక ఘన కొలత, దాదాపు 1.22 లీటర్లతో సమానం. బాత్ కొలత ఘనపరిమాణం ప్రకారం దీన్ని లెక్కకట్టే వాళ్లు. (2రా 6:25)—అనుబంధం B14 చూడండి.
-
క్రీస్తు.
యేసుకు ఉన్న ఈ బిరుదు క్రిస్టోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ఆ పదం “మెస్సీయ” లేదా “అభిషిక్తుడు” అని అనువదించబడిన హీబ్రూ పదానికి సరిసమానమైన పదం.—మత్త 1:16; యోహా 1:41.
-
క్రీస్తువిరోధి.
గ్రీకు భాషలో ఉపయోగించిన పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఇది క్రీస్తుకు విరోధంగా లేదా వ్యతిరేకంగా ఉన్నదాన్ని సూచిస్తుంది. ఇది క్రీస్తు స్థానంలో వచ్చే దొంగ క్రీస్తును కూడా సూచించవచ్చు. క్రీస్తు ప్రతినిధులు కాకపోయినా క్రీస్తు ప్రతినిధులమని చెప్పుకునే ప్రజల్ని, సంస్థల్ని, గుంపుల్ని, ‘నేనే మెస్సీయను’ అని చెప్పుకునేవాళ్లను లేదా క్రీస్తునూ, ఆయన శిష్యుల్నీ వ్యతిరేకించేవాళ్లను క్రీస్తువిరోధులు అనడంలో తప్పులేదు.—1యో 2:22.
-
క్రైస్తవులు.
యేసుక్రీస్తు అనుచరులకు దేవుడు ఇచ్చిన పేరు.—అపొ 11:26; 26:28.
గ
-
గిత్తీత్.
ఇది సంగీతానికి సంబంధించిన ఒక పదం, దీని అర్థం ఖచ్చితంగా తెలీదు. ఇది గాత్ అనే హీబ్రూ పదం నుండి వచ్చివుంటుంది. గాత్ ద్రాక్షతొట్టిని సూచిస్తుంది, కాబట్టి ఇది ద్రాక్షారసాన్ని తయారుచేసేటప్పుడు పాడే పాటలకు సంబంధించిన రాగం అని కొందరి అభిప్రాయం.—కీర్త 81:పైవిలాసం.
-
గిలాదు.
ఖచ్చితంగా చెప్పాలంటే, యొర్దాను నది తూర్పున యబ్బోకు లోయ ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించిన సారవంతమైన ప్రాంతం. కొన్నిసార్లు, యొర్దానుకు తూర్పున రూబేను, గాదు గోత్రాలు, అలాగే మనష్షే అర్ధగోత్రం నివసించిన ఇశ్రాయేలు ప్రాంతమంతటినీ సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగించారు. (సం 32:1; యెహో 12:2; 2రా 10:33)—అనుబంధం B4 చూడండి.
-
గీరా.
ఒక తూకం రాయి, 0.57 గ్రాములతో సమానం. ఇది ఒక షెకెల్‌లో 20వ వంతు. (లేవీ 27:25)—అనుబంధం B14 చూడండి.
-
గుడారం.
ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు ఆరాధన కోసం ఉపయోగించిన డేరా. దీన్ని ఒకచోటు నుండి ఇంకో చోటుకు తీసుకెళ్లవచ్చు. ఇందులో యెహోవా సన్నిధికి సూచనగా ఉండే ఒప్పంద మందసం ఉండేది, అక్కడ బలులు అర్పించేవాళ్లు, ఆరాధించేవాళ్లు. దీన్ని “ప్రత్యక్ష గుడారం” అని కూడా పిలిచేవాళ్లు. ఇది చెక్క పలకలతో, తెరలతో చేసినది. ఆ తెరలమీద బుట్టాపని చేసిన కెరూబుల రూపాలు ఉండేవి. ఇందులో పవిత్ర స్థలం, అతి పవిత్ర స్థలం అని రెండు భాగాలు ఉండేవి. (యెహో 18:1; నిర్గ 25:9)—అనుబంధం B5 చూడండి.
-
గృహదేవత.
కులదైవం, విగ్రహం. కొన్నిసార్లు వీటిని శకునాలు చూడడానికి ఉపయోగించేవాళ్లు. (యెహె 21:21) కొన్ని విగ్రహాలు మనిషి అంత ఎత్తుగా, మనిషి రూపంలో ఉండేవి; కొన్ని చిన్నగా ఉండేవి. (ఆది 31:34; 1స 19:13, 16) కుటుంబ స్వాస్థ్యాన్ని ఎవరు పొందుతారనేది కొంతవరకు గృహదేవతల విగ్రహాలు ఎవరి దగ్గర ఉన్నాయనే దానిమీద ఆధారపడి ఉంటుందని మెసొపొతమియలో జరిపిన పురావస్తు తవ్వకాలు సూచిస్తున్నాయి. (రాహేలు తన తండ్రి గృహదేవతల విగ్రహాల్ని ఎందుకు తీసుకుందో దీన్నిబట్టి అర్థమౌతుంది.) ఇశ్రాయేలులో ఇలా జరిగివుండకపోవచ్చు. అయితే న్యాయాధిపతుల కాలంలో, రాజుల కాలంలో ఇశ్రాయేలు ప్రజలు గృహదేవతల విగ్రహాల్ని పూజించేవాళ్లు. దేవునికి నమ్మకంగా ఉన్న యోషీయా రాజు నాశనం చేసిన వాటిలో గృహదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.—న్యా 17:5; 2రా 23:24; హోషే 3:4.
-
గెహెన్నా.
ప్రాచీన యెరూషలేముకు దక్షిణాన, నైరుతి వైపున ఉన్న హిన్నోము లోయకు గ్రీకు పేరు. (యిర్మీ 7:31) ఇది శవాల్ని చెల్లాచెదురుగా పారేసే చోటు అని ప్రవచనాత్మకంగా చెప్పబడింది. (యిర్మీ 7:32; 19:6) జంతువుల్ని, మనుషుల్ని కాల్చేందుకు లేదా బాధించేందుకు సజీవంగా అందులో పారేసేవాళ్లు అని చెప్పడానికి ఎలాంటి రుజువులూ లేవు. కాబట్టి గెహెన్నా, అక్షరార్థమైన మంటల్లో మనుషుల ఆత్మల్ని శాశ్వతంగా బాధించే అదృశ్యమైన చోటును సూచించదు. బదులుగా, శాశ్వత శిక్ష అయిన “రెండో మరణాన్ని” అంటే నిత్యనాశనాన్ని సూచించడానికి యేసు, ఆయన శిష్యులు గెహెన్నా అనే పదాన్ని ఉపయోగించారు.—ప్రక 20:14; మత్త 5:22; 10:28.
-
గోనెపట్ట.
ధాన్యం నిల్వచేయడానికి ఉపయోగించే సంచుల లాంటివి తయారుచేసేందుకు వాడే దట్టమైన బట్ట. అప్పట్లో దీన్ని సాధారణంగా ముదురు రంగు మేక వెంట్రుకలతో ఆది 37:34; లూకా 10:13.
నేసేవాళ్లు. దీన్ని దుఃఖానికి సూచనగా వేసుకోవడం సంప్రదాయంగా ఉండేది.— -
గ్రంథపు చుట్ట.
పొడవాటి తోలు కాగితం లేదా పపైరస్. దీనిమీద ఒకవైపే రాసేవాళ్లు. సాధారణంగా దీన్ని ఒక కర్రకు చుట్టి ఉంచేవాళ్లు. లేఖనాల్ని రాసింది, వాటిని నకలు చేసింది ఇలాంటి గ్రంథపు చుట్టల్లోనే. బైబిలు రాసిన కాలాల్లో ఇలాంటి పుస్తక రూపమే వాడుకలో ఉంది.—యిర్మీ 36:4, 18, 23; లూకా 4:17-20; 2తి 4:13.
-
గ్రీకు.
గ్రీకు అంటే గ్రీసు ప్రజలు మాట్లాడే భాష.
-
గ్రీకువాళ్లు.
గ్రీకువాళ్లు అంటే గ్రీసు దేశస్థులు లేదా గ్రీసు సంతతివాళ్లు. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఈ మాటను విస్తృత అర్థంలో కూడా వాడారు; అంటే యూదులుకాని ప్రజలందర్నీ లేదా గ్రీకు భాషతో, సంస్కృతితో ప్రభావితులైన ప్రజల్ని సూచించడానికి ఉపయోగించారు.—యోవే 3:6; యోహా 12:20.
చ
-
చివరి రోజులు.
చారిత్రక సంఘటనలు చివరి దశకు చేరుకునే సమయాన్ని సూచించడానికి బైబిలు ప్రవచనాల్లో ఈ పదాన్ని ఉపయోగించారు. (యెహె 38:16; దాని 10:14; అపొ 2:17) ప్రవచన స్వభావాన్ని బట్టి, ఇది కేవలం కొన్ని సంవత్సరాల కాలాన్ని లేదా ఎన్నో సంవత్సరాల కాలాన్ని సూచించవచ్చు. ముఖ్యంగా గమనిస్తే, బైబిలు ఈ పదాన్ని యేసు అదృశ్య ప్రత్యక్షత సమయంలో ప్రస్తుత వ్యవస్థ ‘చివరి రోజుల’ గురించి చెప్పడానికి ఉపయోగిస్తుంది.—2తి 3:1; యాకో 5:3; 2పే 3:3.
-
చీట్లు.
నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగించిన గులకరాళ్లు లేదా చిన్నచిన్న చెక్కముక్కలు లేదా చిన్నరాళ్లు. వాటిని ఒక బట్ట మడతలో వేసి లేదా గిన్నెలో వేసి ఊపేవాళ్లు, బయట పడిన దాన్ని లేదా బయటికి తీసిన దాన్ని ఎంచుకునేవాళ్లు. సాధారణంగా, ప్రార్థన చేసి వీటిని వేసేవాళ్లు. “చీటి” అనే పదాన్ని అక్షరార్థంగా ఉపయోగించేవాళ్లు, అలాగే “వంతు” లేదా “భాగం” వంటి అర్థాలు వచ్చేలా సూచనార్థకంగా ఉపయోగించేవాళ్లు.—యెహో 14:2; కీర్త 16:5; సామె 16:33; మత్త 27:35.
-
చెడ్డదూతలు.
వీళ్లు కంటికి కనిపించరు. ఈ దుష్టులు మానవాతీత శక్తులున్న పరలోక ప్రాణులు. ఆదికాండం 6:2లో “సత్యదేవుని కుమారులు” అనీ, యూదా 6లో “దేవదూతలు” అనీ పిలవబడిన వీళ్లను దేవుడు దుష్టులుగా సృష్టించలేదు. కానీ, నోవహు కాలంలో వాళ్లు దేవునికి అవిధేయత చూపించి, యెహోవాకు వ్యతిరేకంగా సాతాను రేపిన తిరుగుబాటులో అతనితో చేతులు కలిపి తమంతట తామే దేవునికి శత్రువులయ్యారు. వీళ్లు అపవిత్ర దూతలు అని కూడా పిలవబడ్డారు.—ద్వితీ 32:17; లూకా 8:30; అపొ 16:16; యాకో 2:19.
-
చెర.
స్వదేశం నుండి లేదా ఉంటున్న ఊరు నుండి దూరంగా తీసుకెళ్లడం. సాధారణంగా జయించిన రాజులు అలా చేసేవాళ్లు. హీబ్రూలో ఉపయోగించిన పదానికి “దూరంగా వెళ్లిపోవడం” అని అర్థం. ఇశ్రాయేలీయులకు ముఖ్యంగా రెండుసార్లు అలా జరిగింది. పది గోత్రాల ఉత్తర రాజ్యానికి చెందినవాళ్లను అష్షూరీయులు చెరగా లేదా బందీలుగా తీసుకెళ్లారు, తర్వాత రెండు గోత్రాల దక్షిణ రాజ్యానికి చెందినవాళ్లను బబులోనీయులు చెరగా తీసుకెళ్లారు. చెరగా వెళ్లిన రెండు రాజ్యాల వాళ్లలో కొంతమంది పారసీక రాజైన కోరెషు పరిపాలనలో తమ దేశానికి తిరిగొచ్చారు.—2రా 17:6; 24:16; ఎజ్రా 6:21.
-
చేతులు ఉంచడం.
ఒక ప్రత్యేకమైన పని కోసం నియమించడానికి లేదా దీవించడానికి, బాగుచేయడానికి, పవిత్రశక్తికి సంబంధించిన ఒక వరాన్ని ఇవ్వడానికి ఒక వ్యక్తి మీద చేతులు ఉంచేవాళ్లు. కొన్నిసార్లు జంతువుల్ని బలి ఇచ్చేముందు వాటిమీద చేతులు ఉంచేవాళ్లు.—నిర్గ 29:15; సం 27:18; అపొ 19:6; 1తి 5:22.
జ
-
జటామాంసి.
లేత ఎరుపు రంగులో ఉండే ఖరీదైన సుగంధ తైలం. దీన్ని జటామాంసి మొక్క (నార్డోస్టకిస్ జటామాంసి) నుండి సేకరిస్తారు. ఇది చాలా ఖరీదైనది కాబట్టి, దీన్ని తరచూ మామూలు నూనెలతో కలిపేవాళ్లు. కొన్నిసార్లు నకిలీవి కూడా తయారుచేసేవాళ్లు. ఆసక్తికరంగా, యేసు మీద పోసింది “అసలుసిసలు జటామాంసి” అని మార్కు, యోహాను ఇద్దరూ చెప్పారు.—మార్కు 14:3; యోహా 12:3.
-
జీవవృక్షం.
-
జీవ్.
యూదుల పవిత్ర క్యాలెండరులో 2వ నెల, వ్యవసాయ క్యాలెండరులో 8వ నెల అసలు పేరు. మన క్యాలెండరులో ఇది ఏప్రిల్ మధ్య నుండి మే మధ్య వరకు ఉంటుంది. యూదుల టాల్‌ముడ్‌లో, బబులోను చెర తర్వాతి కాలంలో దీన్ని అయ్యార్ అని రాశారు. (1రా 6:37)—అనుబంధం B15 చూడండి.
-
జేన.
ఇది రేఖీయ కొలత. ఇది దాదాపు, చేతివేళ్లను చాపినప్పుడు బొటనవేలి చివరి నుండి చిటికెనవేలి చివరివరకు ఉండే దూరమంత ఉంటుంది. మూర 44.5 సెంటీమీటర్లు (17.5 అంగుళాలు) అయితే, జేన 22.2 సెంటీమీటర్లు (8.75 అంగుళాలు) ఉంటుంది. (నిర్గ 28:16; 1స 17:4)—అనుబంధం B14 చూడండి.
-
జ్యోతిష్యుడు.
భవిష్యత్తు సంఘటనల్ని అంచనా వేయడానికి సూర్యచంద్ర నక్షత్రాల కదలికల్ని పరిశీలించే వ్యక్తి.—దాని 2:27; మత్త 2:1.
ట
-
టార్టరస్.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, ఈ పదాన్ని నోవహు కాలంలో తిరుగుబాటు చేసిన దేవదూతల్ని పడేసిన జైలు లాంటి హీనమైన స్థితిని సూచించడానికి ఉపయోగించారు. 2 పేతురు 2:4లో ఉపయోగించిన టార్టరూ (‘టార్టరస్‌లో పడేయడం’) అనే క్రియాపదం, “పాపం చేసిన దేవదూతల్ని” అన్యమత పురాణాల్లో ఉన్న టార్టరస్‌లో (అంటే, తక్కువ స్థాయి దేవుళ్లు ఉండే భూగర్భంలోని జైలు, చీకటి స్థలం) పడేశారని సూచించట్లేదు. బదులుగా ఆ క్రియాపదం దేవుడు ఆ దేవదూతల్ని పరలోకంలో వాళ్లకున్న స్థానం నుండి, సేవావకాశాల నుండి తొలగించి, ఉజ్వలమైన తన సంకల్పాల విషయంలో వాళ్లను మానసికంగా కటికచీకటి స్థితిలో ఉంచాడని సూచిస్తుంది. అంతేకాదు ఆ చీకటి, వాళ్లకు చివరికి పట్టే గతికి సూచనగా ఉంది; వాళ్లు తమ పరిపాలకుడితో పాటు అంటే అపవాదియైన సాతానుతో పాటు నిత్యనాశనం పొందుతారని లేఖనాలు చూపిస్తున్నాయి. కాబట్టి టార్టరస్ అనే పదం తిరుగుబాటు చేసిన ఆ దేవదూతల అత్యంత హీనస్థితిని సూచిస్తుంది. టార్టరస్, ప్రకటన 20:1-3లో ఉన్న “అగాధం” ఒకటి కాదు.
-
టెబేతు.
బబులోను చెర తర్వాత, యూదుల పవిత్ర క్యాలెండరులో 10వ నెల, వ్యవసాయ క్యాలెండరులో 4వ నెల. మన క్యాలెండరులో ఇది డిసెంబరు మధ్య నుండి జనవరి మధ్య వరకు ఉంటుంది. ఎక్కువసార్లు దీన్ని “పదో నెల” అని మాత్రమే పిలిచారు. (ఎస్తే 2:16)—అనుబంధం B15 చూడండి.
డ
-
డారిక్.
ఇది ఒక పారసీక బంగారు నాణెం, దీని బరువు 8.4 గ్రాములు. (1ది 29:7)—అనుబంధం B14 చూడండి.
-
డ్రక్మా.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, ఈ పదం గ్రీకుల వెండి నాణేన్ని సూచిస్తుంది. ఆ కాలంలో దాని బరువు 3.4 గ్రాములు. హీబ్రూ లేఖనాల్లో, పారసీకుల కాలం నాటి బంగారు డ్రక్మా గురించి ఉంది. అది డారిక్‌తో సమానమని భావించబడుతోంది. (నెహె 7:70; మత్త 17:24, అధస్సూచి)—అనుబంధం B14 చూడండి.
త
-
తమ్మూజు.
(1) ఇది ఒక దేవుని పేరు. యెరూషలేములో మతభ్రష్టులైన హెబ్రీ స్త్రీలు ఏడ్చింది ఇతని కోసమే. నిజానికి ఇదివరకు తమ్మూజు అనే ఒక రాజు ఉన్నాడని, అతను చనిపోయిన తర్వాత అతన్ని దేవునిగా పూజించారని కొందరు అంటారు. సుమేరియన్‌ల రాతల్లో, తమ్మూజును డుముజి అని పిలిచారు. అతన్ని సంతాన సాఫల్య దేవత అయిన ఇనానా (బబులోనీయుల ఇష్తార్) భర్తగా లేదా ప్రేమికుడిగా గుర్తించేవాళ్లు. (యెహె 8:14) (2) బబులోను చెర తర్వాత, యూదుల పవిత్ర చాంద్రమాన క్యాలెండరులో 4వ నెల, వ్యవసాయ క్యాలెండరులో 10వ నెల. ఇది మన క్యాలెండరులో జూన్ మధ్య నుండి జూలై మధ్య వరకు ఉంటుంది.—అనుబంధం B15 చూడండి.
-
తర్షీషు ఓడలు.
-
తలపాగా.
తల చుట్టూ అలంకారంగా కట్టుకునే వస్త్రం. ప్రధానయాజకుడు సన్నని నారతో చేసిన తలపాగా పెట్టుకునేవాడు, దాని ముందుభాగంలో నీలంరంగు దారంతో కట్టిన ఒక బంగారు రేకు ఉండేది. రాజు తన కిరీటం కింద తలపాగా పెట్టుకునేవాడు. యోబు తన న్యాయాన్ని తలపాగాతో పోలుస్తూ ఈ పదాన్ని సూచనార్థకంగా ఉపయోగించాడు.—నిర్గ 28:36, 37; యోబు 29:14; యెహె 21:26.
-
తలాంతు.
బరువును, డబ్బును కొలవడానికి ఉపయోగించే అతి పెద్ద హీబ్రూ కొలమానం. ఒక తలాంతు 34.2 కిలోలు ఉండేది. గ్రీకు తలాంతు కాస్త తక్కువ, అంటే 20.4 కిలోలు ఉండేది. (1ది 22:14; మత్త 18:24)—అనుబంధం B14 చూడండి.
-
తాకట్టు.
అప్పు తీసుకున్న వ్యక్తి దాన్ని తిరిగిస్తాననే హామీ కోసం అప్పు ఇచ్చిన వ్యక్తికి ఇచ్చే ఒక వస్తువు. దీన్ని జామీను అని కూడా అంటారు. దేశంలో ఉన్న పేదల, నిస్సహాయుల ప్రయోజనం కోసం దీనికి సంబంధించి మోషే ధర్మశాస్త్రంలో కొన్ని నియమాలు ఉండేవి.—నిర్గ 22:26; యెహె 18:7.
-
తిరుగలి రాయి.
ఒక గుండ్రటి రాయి మీద మరో గుండ్రటి రాయి ఉంటుంది, పై రాయిని తిప్పుతూ ధాన్యాన్ని పిండి చేసేవాళ్లు. బైబిలు కాలాల్లో, చాలా ఇళ్లల్లో స్త్రీలు దీన్ని ఉపయోగించేవాళ్లు. ప్రతీరోజు భోజనం తయారుచేయడానికి తిరుగలి రాయి అవసరం కాబట్టి, దాన్ని లేదా దాని పై రాయిని తాకట్టుగా తీసుకోవడాన్ని ధర్మశాస్త్రం నిషేధించింది. ఇలానే ఉండే పెద్ద తిరుగలి రాయిని జంతువులతో తిప్పించేవాళ్లు.—ద్వితీ 24:6; మార్కు 9:42.
-
తిష్రీ.—
ఏతనీము, అలాగే అనుబంధం B15 చూడండి.
-
తీర్పు రోజు.
తనకు లెక్క చెప్పమని కొన్ని గుంపుల్ని, దేశాల్ని లేదా మనుషులందర్నీ దేవుడు అడిగే ఒక నిర్దిష్ట రోజు లేదా కాలం. ఇది మరణశిక్షకు తగినవాళ్లుగా తీర్పు పొందినవాళ్లు చంపబడే సమయం అయ్యుండవచ్చు; లేదా ఆ తీర్పువల్ల కొంతమందికి రక్షించబడి, శాశ్వత జీవితం పొందే అవకాశం దొరకవచ్చు. భవిష్యత్తులో రాబోయే “తీర్పు రోజు” గురించి యేసుక్రీస్తు, ఆయన అపొస్తలులు మాట్లాడారు. అప్పుడు బ్రతికున్నవాళ్లకే కాక గతంలో చనిపోయినవాళ్లకు కూడా తీర్పు జరుగుతుంది.—మత్త 12:36.
-
తెగ.
ఒక సిద్ధాంతాన్ని లేదా నాయకుణ్ణి అంటిపెట్టుకొని సొంత నమ్మకాల్ని అనుసరించే ప్రజల గుంపు. యూదా మతంలోని రెండు ప్రముఖ శాఖల్ని, అంటే పరిసయ్యుల్ని, సద్దూకయ్యుల్ని సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగించారు. క్రైస్తవులుకాని వాళ్లు కూడా క్రైస్తవత్వాన్ని “తెగ” అని, లేదా “నజరేయులు అనే తెగ” అని పిలిచారు. క్రైస్తవుల్ని యూదా మతం నుండి విడిపోయిన గుంపుగా భావించి వాళ్లు అలా పిలిచివుంటారు. ఆ తర్వాత మెల్లమెల్లగా క్రైస్తవ సంఘంలో కూడా తెగలు పుట్టుకొచ్చాయి; ప్రకటన గ్రంథంలో “నీకొలాయితు తెగ” గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది.—అపొ 5:17; 15:5, అధస్సూచి; 24:5; 28:22; ప్రక 2:6; 2పే 2:1, అధస్సూచి.
-
తెగులు.
చాలా వేగంగా ఎక్కువమందికి వ్యాపించి, ప్రాణాలు తీసే ఏదైనా పెద్ద అంటువ్యాధి. సాధారణంగా దేవుని తీర్పులు సం 14:12; యెహె 38:22, 23; ఆమో 4:10.
అమలు చేయడంలో భాగంగా దీన్ని ప్రస్తావించారు.— -
తెర.
ఇది గుడారంలో, ఆ తర్వాత ఆలయంలో పవిత్ర స్థలాన్ని, అతి పవిత్ర స్థలాన్ని వేరు చేసింది. ఇది అందంగా నేసిన వస్త్రం. దీనిమీద బుట్టాపని చేసిన కెరూబుల రూపాలు ఉండేవి. (నిర్గ 26:31; 2ది 3:14; మత్త 27:51; హెబ్రీ 9:3)—అనుబంధం B5 చూడండి.
-
తోలు కాగితం.
రాయడానికి ఉపయోగించేలా సిద్ధం చేసిన గొర్రె, మేక లేదా దూడ చర్మం. ఇది పపైరస్ కన్నా ఎక్కువకాలం పాటు పాడవకుండా ఉంటుంది; బైబిలు గ్రంథపు చుట్టల కోసం దీన్ని ఉపయోగించారు. పౌలు తిమోతిని తీసుకురమ్మని చెప్పిన తోలు కాగితాలు బహుశా హీబ్రూ లేఖనాల కొన్ని భాగాలు అయ్యుండవచ్చు. కొన్ని మృతసముద్ర గ్రంథపు చుట్టలు తోలు కాగితంపై రాశారు.—2తి 4:13.
ద
-
దహనబలి.
బలి ఇచ్చే పశువును బలిపీఠం మీద దహించి, దేవునికి సంపూర్ణంగా అర్పించే బలి; ఆ జంతువులో (ఎద్దు, పొట్టేలు, మేకపోతు, గువ్వ లేదా పావురం పిల్ల) ఏ భాగాన్నీ ఆరాధకుడు ఉంచుకోకూడదు.—నిర్గ 29:18; లేవీ 6:9.
-
దాగోను.
ఫిలిష్తీయుల దేవుడు. ఈ పదం ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలీదు, అయితే కొందరు పండితులు దీన్ని దాగ్ (చేప) అనే హీబ్రూ పదంతో ముడిపెడతారు.—న్యా 16:23; 1స 5:4.
-
దానధర్మాలు.
అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడానికి ఇచ్చే బహుమతులు. హీబ్రూ లేఖనాలు వీటి గురించి నేరుగా ప్రస్తావించట్లేదు కానీ పేదవాళ్ల విషయంలో ఇశ్రాయేలీయులు తప్పనిసరిగా చేయాల్సిన పనుల గురించి ధర్మశాస్త్రం కొన్ని నిర్దేశాలు ఇచ్చింది.—మత్త 6:2.
-
దావీదు కుమారుడు.
ఈ మాటను తరచూ యేసును సూచించడానికి ఉపయోగించారు. దావీదు వంశస్థుల్లో ఒకరు నెరవేర్చాల్సిన రాజ్య ఒప్పందానికి యేసే వారసుడని ఈ మాట నొక్కిచెప్తుంది.—మత్త 12:23; 21:9.
-
దావీదు నగరం.
దావీదు యెబూసు నగరాన్ని జయించి, అక్కడ తన రాజభవనాన్ని నిర్మించిన తర్వాత దానికి ఆ పేరు వచ్చింది. దీనిని సీయోను అని కూడా పిలిచేవాళ్లు. ఇది యెరూషలేములో ఆగ్నేయం వైపు ఉన్న అతి పురాతన స్థలం.—2స 5:7; 1ది 11:4, 5.
-
దీర్ఘదర్శి.
దేవుని ఇష్టాన్ని గ్రహించే సామర్థ్యాన్ని దేవుని నుండి పొందిన వ్యక్తి. ఇతను సాధారణంగా మనుషులు చూడలేని, అర్థం చేసుకోలేని వాటిని చూస్తాడు లేదా అర్థం చేసుకుంటాడు. దీనికి సంబంధించిన హీబ్రూ పదం అక్షరార్థంగా లేదా సూచనార్థకంగా “చూడడం” అనే అర్థమున్న మూల పదం నుండి వచ్చింది. సమస్యలు వచ్చినప్పుడు తెలివైన సలహా కోసం ప్రజలు దీర్ఘదర్శి దగ్గరికి వెళ్లేవాళ్లు.—1స 9:9.
-
దుఃఖం.
ఎవరైనా చనిపోతే లేదా ఏదైనా విపత్తు జరిగితే బయటికి వ్యక్తం చేసే బాధ. బైబిలు కాలాల్లో, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కొంతకాలంపాటు దుఃఖపడడం ఆచారం. అలా దుఃఖపడేవాళ్లు పెద్దగా ఏడ్వడంతోపాటు ప్రత్యేకమైన బట్టలు వేసుకునేవాళ్లు, తలమీద బూడిద పోసుకునేవాళ్లు, బట్టలు చింపుకునేవాళ్లు, గుండెలు బాదుకునేవాళ్లు. ఏడ్వడమే వృత్తిగా చేసుకున్నవాళ్లను కొన్నిసార్లు అంత్యక్రియలకు పిలిచేవాళ్లు.—ఆది 23:2; ఎస్తే 4:3; ప్రక 21:4.
-
దుష్టుడు.
దేవుణ్ణి, ఆయన నీతియుక్త ప్రమాణాల్ని వ్యతిరేకించే అపవాదియైన సాతానుకు ఉన్న ఒక బిరుదు.—మత్త 6:13; 1యో 5:19.
-
దెకపొలి.
కొన్ని గ్రీకు నగరాల్ని కలిపి అలా అంటారు. మొదట్లో, దీనిలో పది నగరాలు (గ్రీకులో డెక అంటే “పది,” పొలిస్ అంటే “నగరం.”) ఉండేవి. వీటిలో ఎక్కువ నగరాలున్న ప్రాంతానికి అంటే గలిలయ సముద్రానికి, యొర్దాను నదికి తూర్పున ఉన్న ప్రాంతానికి కూడా ఆ పేరే ఉండేది. గ్రీకుల (హెల్లెనిస్టిక్) సంస్కృతికి, వ్యాపారానికి ఆ నగరాలు కేంద్రంగా ఉండేవి. యేసు ఈ ప్రాంతాన్ని దాటుకుంటూ వెళ్లాడు, కానీ ఆయన ఈ నగరాల్లో ఏదైనా ఒకదాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. (మత్త 4:25; మార్కు 5:20)—అనుబంధం A7, B10 చూడండి.
-
దేనారం.
ఇది సుమారు 3.85 గ్రాములు ఉండే రోమన్ల వెండి నాణెం. దీనికి ఒకవైపు కైసరు బొమ్మ ఉండేది. ఇది ఒక కూలివాడికి ఇచ్చే ఒక రోజు కూలి; అలాగే రోమన్లు యూదుల్లో “ప్రతీ ఒక్కరి” దగ్గర వసూలు చేసే పన్ను నాణెం. (మత్త 22:17, అధస్సూచి; లూకా 20:24)—అనుబంధం B14 చూడండి.
-
దేవదూతలు.
మలఖ్ అనే హీబ్రూ పదం నుండి, ఎజ్జిలొస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ఈ రెండు పదాలకు అక్షరార్థంగా ‘సందేశకుడు’ అనే అర్థం ఉంది, కానీ పరలోక సందేశకుల గురించి చెప్తున్నప్పుడు “దేవదూత” అని అనువదించారు. (ఆది 16:7; 32:3; యాకో 2:25, అధస్సూచి; ప్రక 22:8) దేవదూతలు శక్తివంతమైన పరలోక ప్రాణులు. దేవుడు మనుషుల్ని సృష్టించడానికి ఎంతోకాలం ముందే దేవదూతల్ని సృష్టించాడు. బైబిల్లో వాళ్లను “లక్షలాది పవిత్ర దూతలు,” “దేవుని కుమారులు,” “ఉదయ నక్షత్రాలు” అని కూడా పిలిచారు. (ద్వితీ 33:2; యోబు 1:6; 38:7) వాళ్లు తమ లాంటి ప్రాణుల్ని కనే సామర్థ్యంతో సృష్టించబడలేదు, బదులుగా దేవుడు వాళ్లలో ప్రతీ ఒక్కర్ని విడివిడిగా సృష్టించాడు. వాళ్ల సంఖ్య కోట్లలో ఉంటుంది. (దాని 7:10) వాళ్లలో ప్రతీ ఒక్కరికి ఒక్కో పేరు, ఒక్కో వ్యక్తిత్వం ఉన్నాయని బైబిలు చెప్తోంది. అయితే వాళ్లు వినయంగా ఉంటూ, ఆరాధనను స్వీకరించడానికి ఒప్పుకోరు; చాలామంది దేవదూతలు తమ పేర్లు కూడా చెప్పరు. (ఆది 32:29; లూకా 1:26; ప్రక 22:8, 9) దేవదూతల్లో వేర్వేరు శ్రేణులు ఉన్నాయి. యెహోవా సింహాసనం ముందు సేవచేయడం, ఆయన సందేశాల్ని తెలియజేయడం, భూమ్మీదున్న యెహోవా సేవకుల తరఫున చర్య తీసుకోవడం, దేవుని తీర్పుల్ని అమలుచేయడం, మంచివార్తను ప్రకటించే పనికి మద్దతివ్వడం లాంటి ఎన్నో రకాల పనులు ఆయన వాళ్లకు అప్పగిస్తాడు. (2రా 19:35; కీర్త 34:7; లూకా 1:30, 31; ప్రక 5:11; 14:6) భవిష్యత్తులో హార్‌మెగిద్దోన్ యుద్ధమప్పుడు వాళ్లు యేసుకు మద్దతిస్తారు.—ప్రక 19:14, 15.
-
దేవుని రాజ్యం.
దేవుని సర్వాధిపత్యానికి ప్రాతినిధ్యం వహించే ఆయన కుమారుని ప్రభుత్వాన్ని, అంటే క్రీస్తుయేసు ప్రభుత్వాన్ని సూచించడానికి ఈ మాటను ముఖ్యంగా ఉపయోగించారు.—మత్త 12:28; లూకా 4:43; 1కొ 15:50.
-
దైవభక్తి.
-
దోపుడుసొమ్ము.
శత్రువుల్ని ఓడించాక వాళ్ల దగ్గర నుండి కొల్లగొట్టిన లేదా దోచుకున్న సామగ్రి, పశువులు, ఇతర విలువైన వస్తువులు.—యెహో 7:21; 22:8; హెబ్రీ 7:4.
-
ద్యుపతి.
రకరకాల దేవతల్ని పూజించే గ్రీకు ప్రజల ప్రధాన దేవుడు. లుస్త్రలో ప్రజలు బర్నబాను పొరపాటున ద్యుపతి అనుకున్నారు. లుస్త్రకు దగ్గర్లో దొరికిన ప్రాచీన చెక్కడాల్లో “ద్యుపతి యాజకులు,” “సూర్యదేవుడు ద్యుపతి” అనే మాటలు ఉన్నాయి. మెలితే అనే ద్వీపం నుండి పౌలు ప్రయాణించిన ఓడ మీద “ద్యుపతి కుమారులు” అనే చిహ్నం ఉంది; వీళ్లు కాస్టర్, పోలక్స్ అనే కవలలు.—అపొ 14:12; 28:11.
-
ద్రాక్షతిత్తి.
మేక లేదా గొర్రె లాంటి జంతువు పూర్తి తోలుతో తయారుచేసే తోలు తిత్తి. దీన్ని ద్రాక్షారసం ఉంచడానికి ఉపయోగిస్తారు. ద్రాక్షారసం పులిసిపోయే కొద్దీ కార్బన్ డై ఆక్సైడ్ (CO2) వాయువును ఉత్పత్తి చేసి ద్రాక్షతిత్తుల మీద ఒత్తిడి కలుగజేస్తుంది కాబట్టి ద్రాక్షారసాన్ని కొత్త ద్రాక్షతిత్తుల్లో పోసేవాళ్లు. కొత్త ద్రాక్షతిత్తులు వ్యాకోచిస్తాయి; పాతవి అంతగా వ్యాకోచించవు కాబట్టి ఆ ఒత్తిడికి పిగిలిపోతాయి.—యెహో 9:4; మత్త 9:17.
-
ద్రాక్షతొట్టి.
సహజ సున్నపురాయిలో రెండు తొట్లు (గుంతలు) తొలిచి వాటిమధ్య చిన్న దారి చేస్తారు. వాటిలో ఒకటి ఇంకోదాని కన్నా ఎత్తుగా ఉంటుంది. ఎత్తుగా ఉన్న తొట్టిలో ద్రాక్షపండ్లను తొక్కినప్పుడు ఆ రసం కింద ఉన్న తొట్టిలోకి వెళ్లేది. ఈ పదాన్ని దేవుని తీర్పును సూచించడానికి అలంకారికంగా ఉపయోగించారు.—యెష 5:2; ప్రక 19:15.
ధ
-
ధర్మశాస్త్రం.
సా.శ.పూ. 1513లో సీనాయి ఎడారిలో యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మోషే ధర్మశాస్త్రాన్ని ఇది సూచిస్తుండవచ్చు. బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాల్ని తరచూ ధర్మశాస్త్రం అని పిలుస్తారు. (యెహో 23:6; లూకా 24:44; మత్త 7:12; గల 3:24) ధర్మశాస్త్రంలోని ఆయా నియమాల్ని లేదా ఒక నియమం వెనకున్న సూత్రాన్ని కూడా ఇది సూచించవచ్చు.—సం 15:16; ద్వితీ 4:8.
-
ధూపద్రవ్యం.
సువాసన వెదజల్లే జిగురుల, తైలాల మిశ్రమం. ఇది మెల్లగా మండుతూ మంచి సువాసన వెదజల్లుతుంది. గుడారంలో, ఆ తర్వాత ఆలయంలో ఉపయోగించడం కోసం నాలుగు పదార్థాలున్న ఒక ప్రత్యేక ధూపద్రవ్యాన్ని తయారుచేసేవాళ్లు. ప్రతీ ఉదయం, ప్రతీ రాత్రి పవిత్ర స్థలంలోని ధూపవేదిక మీద దీన్ని కాల్చేవాళ్లు; ప్రాయశ్చిత్త రోజున అతి పవిత్ర స్థలం లోపల దీన్ని కాల్చేవాళ్లు. దేవుడు అంగీకరించే నమ్మకమైన సేవకుల ప్రార్థనల్ని ఇది సూచిస్తుంది. క్రైస్తవులు ధూపం వేయాల్సిన అవసరం లేదు.—నిర్గ 30:34, 35; లేవీ 16:13; ప్రక 5:8.
-
ధూపవేదిక.
ఇది చెక్కతో చేసి బంగారు రేకు కప్పిన ఒక చిన్న వేదిక లాంటిది. అది గుడారంలోని, ఆలయంలోని మొదటి గదిలో ఉండేది. దీన్ని ధూపం వేయడానికి ఉపయోగించేవాళ్లు. (నిర్గ 39:38; 1రా 6:20; లూకా 1:11)—అనుబంధం B5 చూడండి.
న
-
నగర అధికారులు (పాలకులు).
బబులోను పరిపాలనలో, చట్టం తెలిసిన నిర్ణీత ప్రాంతాల ప్రజాధికారులు. వీళ్లకు న్యాయ సంబంధ విషయాల్లో పరిమిత అధికారం ఉండేది. రోమన్ల కాలనీల్లో, నగర అధికారులు ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలు చూసుకునేవాళ్లు. శాంతిభద్రతల్ని కాపాడడం, ఆర్థిక వ్యవహారాల్ని చూసుకోవడం, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్లకు తీర్పు తీర్చడం, శిక్ష అమలు చేయమని ఆజ్ఞాపించడం వంటి పనులు వీళ్లు చేసేవాళ్లు.—దాని 3:2; అపొ 16:20.
-
నజరేయుడు.
యేసుకున్న ఒక పేరు. ఆయన నజరేతు పట్టణం నుండి వచ్చాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. యెషయా 11:1లోని “మొలక” కోసం ఉపయోగించిన హీబ్రూ పదంతో దీనికి సంబంధం ఉండివుండవచ్చు. ఆ తర్వాత, యేసు అనుచరులకు కూడా ఈ పదాన్ని ఉపయోగించారు.—మత్త 2:23; అపొ 24:5.
-
నపుంసకుడు.
అక్షరార్థంగా వృషణాలు తొలగించబడిన పురుషుడు అని అర్థం. సాధారణంగా అలాంటి పురుషులు రాజగృహాల్లో రాణులకు-ఉపపత్నులకు సేవకులుగా, సంరక్షకులుగా నియమించబడేవాళ్లు. అయితే ఈ పదం, అక్షరార్థమైన నపుంసకుడినే (షండుడినే) కాకుండా, రాజదర్బారులో విధులు నిర్వహించడానికి నియమించబడిన అధికారిని కూడా సూచిస్తుంది. బైబిల్లో ‘రాజ్యం కోసం నపుంసకుడు’ అనే మాట కూడా ఉంది. దేవుని సేవకు తనను తాను పూర్తిగా అంకితం చేసుకునేలా ఆత్మనిగ్రహం చూపించే వ్యక్తిని సూచించడానికి అది అలంకారికంగా ఉపయోగించబడింది.—మత్త 19:12; ఎస్తే 2:15; అపొ 8:27, అధస్సూచి.
-
నాజీరు.
“వేరుచేయబడిన వ్యక్తి,” “సమర్పించబడిన వ్యక్తి,” “ప్రత్యేకించబడిన వ్యక్తి,” అనే అర్థాలు ఉన్న హీబ్రూ పదం నుండి వచ్చింది. రెండు రకాల నాజీరులు ఉండేవాళ్లు. (1) స్వచ్ఛందంగా నాజీరులు అయినవాళ్లు, (2) దేవుడు నాజీరులుగా నియమించినవాళ్లు. ఒక పురుషుడు లేదా స్త్రీ కొంతకాలం పాటు నాజీరుగా జీవిస్తానని యెహోవాకు ప్రత్యేక మొక్కుబడి చేసుకోవచ్చు. నాజీరుగా ఉంటానని స్వచ్ఛందంగా మొక్కుబడి చేసుకునేవాళ్లు ముఖ్యంగా ఈ మూడు నియమాలు పాటించాలి: (1) వాళ్లు మద్యం తాగకూడదు, ద్రాక్షలతో చేసిన దేన్నీ తినకూడదు; (2) వెంట్రుకలు కత్తిరించుకోకూడదు; (3) మృతదేహాన్ని తాకకూడదు. దేవుడు నాజీరులుగా నియమించినవాళ్లు జీవితాంతం అలాగే ఉండేవాళ్లు, యెహోవా వాళ్లకు కొన్ని ప్రత్యేక నియమాలు ఏర్పర్చాడు.—సం 6:2-7; న్యా 13:5.
-
నిప్పు పాత్రలు.
బంగారం, వెండి, లేదా రాగితో తయారుచేసిన పాత్రలు. వీటిని గుడారంలో, ఆలయంలో ధూపం వేయడానికి వాడేవాళ్లు. అలాగే బలిపీఠం మీద నుండి బొగ్గుల్ని, బంగారు దీపస్తంభం మీద నుండి కాలిపోయిన వత్తుల్ని తీసేయడానికి ఉపయోగించేవాళ్లు. వీటిని ధూపపాత్రలు అని కూడా పిలిచేవాళ్లు.—నిర్గ 37:23; 2ది 26:19; హెబ్రీ 9:4.
-
నీతి.
లేఖనాల్లో ఈ పదం, తప్పొప్పుల విషయంలో దేవుని ప్రమాణం ప్రకారం ఏది సరైనదో దాన్ని సూచిస్తుంది.—ఆది 15:6; ద్వితీ 6:25; సామె 11:4; జెఫ 2:3; మత్త 6:33.
-
నీసాను.
బబులోను చెర తర్వాత యూదుల పవిత్ర క్యాలెండరులోని మొదటి నెల అయిన అబీబుకు వచ్చిన కొత్త పేరు. వ్యవసాయ క్యాలెండరులో అది 7వ నెల. అది మన క్యాలెండరులో మార్చి నెల మధ్య నుండి ఏప్రిల్ నెల మధ్య వరకు ఉంటుంది. (నెహె 2:1)—అనుబంధం B15 చూడండి.
-
నెతీనీయులు.
ఇశ్రాయేలీయులుకాని ఆలయ సేవకులు లేదా పరిచారకులు. దీని హీబ్రూ పదానికి అక్షరార్థంగా “ఇవ్వబడినవాళ్లు” అని అర్థం. అంటే వాళ్లు ఆలయ సేవ కోసం ఇవ్వబడ్డారని సూచిస్తుంది. వీళ్లలో చాలామంది ‘సమాజం కోసం, యెహోవా బలిపీఠం కోసం కట్టెలు ఏరేవాళ్లుగా, నీళ్లు తోడేవాళ్లుగా’ యెహోషువ నియమించిన గిబియోనీయుల వంశస్థులు అయ్యుంటారు.—యెహో 9:23, 27; 1ది 9:2; ఎజ్రా 8:17.
-
నెఫీలీయులు.
జలప్రళయం రాకముందు, మానవ శరీరాన్ని ధరించిన దేవదూతలకు, మానవ స్త్రీలకు పుట్టిన సంకరజాతి పిల్లలు. వీళ్లు చాలా క్రూరులు.—ఆది 6:4.
-
నెహిలోతు.
ఈ పదం 5వ కీర్తన పైవిలాసంలో కనిపిస్తుంది. దీని అర్థం ఏమిటో ఖచ్చితంగా తెలీదు. ఇది కాలీల్ (ఫ్లూటు) అనే హీబ్రూ మూలపదానికి సంబంధించినదని, ఇది ఒక రకమైన ఊదే పరికరమని కొంతమంది అంటారు. అయితే, ఇది ఒక రాగం కూడా కావచ్చు.
-
న్యాయపీఠం.
సాధారణంగా ఆరు బయట ఎత్తుగా ఉండే ఒక వేదిక. అక్కడికి మెట్లు ఎక్కి చేరుకోవాల్సి ఉంటుంది. దానిమీద కూర్చొని అధికారులు ప్రజల గుంపును ఉద్దేశించి మాట్లాడతారు లేదా తమ నిర్ణయాల్ని ప్రకటిస్తారు. “దేవుని న్యాయపీఠం,” “క్రీస్తు న్యాయపీఠం” అనే పదాలు మనుషులకు తీర్పుతీర్చడానికి యెహోవా చేసిన ఏర్పాటును సూచిస్తున్నాయి.—రోమా 14:10; 2కొ 5:10; యోహా 19:13.
-
న్యాయాధిపతులు.
ఇశ్రాయేలీయులకు మానవ రాజులు రాకముందు తన ప్రజల్ని కాపాడడానికి యెహోవా ఇచ్చిన పురుషులు.—న్యా 2:16.
ప
-
పగడం.
చిన్న సముద్ర ప్రాణుల నుండి తయారయ్యే రాయిలాంటి గట్టి పదార్థం. ఇవి మహా సముద్రాల్లో ఎరుపు, తెలుపు, నలుపు వంటి రకరకాల రంగుల్లో ఉంటాయి. ఎర్ర సముద్రంలో పగడాలు చాలా విరివిగా ఉండేవి. బైబిలు కాలాల్లో, ఎరుపు రంగు పగడాలు చాలా ఖరీదైనవి; వాటిని పూసలు, ఆభరణాలు తయారుచేయడానికి ఉపయోగించేవాళ్లు.—సామె 8:11.
-
పట్టుకారు.
బంగారంతో చేసిన పనిముట్టు. గుడారంలో, ఆలయంలో దీపాల నిప్పును ఆర్పడానికి దీన్ని ఉపయోగించేవాళ్లు.—నిర్గ 37:23.
-
పదోవంతు.
ముఖ్యంగా మతసంబంధ పనుల కోసం కప్పంలా చెల్లించే పదోభాగం లేదా 10 శాతం. దీన్ని “దశమభాగం” అని కూడా అంటారు. (మలా 3:10; ద్వితీ 26:12; మత్త 23:23) మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఇశ్రాయేలీయులు ప్రతీ సంవత్సరం తమ పంటలో పదోవంతును, అలాగే పశువుల, గొర్రెల, మేకల మందలు వృద్ధి చెందినప్పుడు వాటిలో పదోవంతును లేవీయులకు సహాయంగా ఇచ్చేవాళ్లు. లేవీయులు ఆ పదోవంతులో పదోవంతును అహరోను వంశంలోని యాజక బృందానికి సహాయంగా ఉండడం కోసం వాళ్లకు ఇచ్చేవాళ్లు. ఇవే కాకుండా వేరే పదోవంతులు కూడా ఉండేవి. క్రైస్తవులు పదోవంతు చెల్లించాల్సిన అవసరం లేదు.
-
పపైరస్.
గంపలు, పాత్రలు, పడవల వంటివి తయారుచేయడానికి ఉపయోగించే జమ్ములాంటి నీటి మొక్క. రాయడానికి వీలుగా ఉండే కాగితం లాంటి పదార్థాన్ని తయారుచేయడానికి కూడా దీన్ని ఉపయోగించేవాళ్లు. దీన్ని చాలా గ్రంథపుచుట్టల్లో ఉపయోగించారు.—నిర్గ 2:3, అధస్సూచి.
-
పరదైసు.
అందమైన ఉద్యానవనం, లేదా ఉద్యానవనం లాంటి తోట. అలాంటిది మొదట ఏదెనులో ఉండేది. యెహోవా దాన్ని మొదటి మానవ జంట కోసం చేశాడు. యేసు హింసాకొయ్యపై ఉన్నప్పుడు, తన పక్కనున్న ఒక నేరస్తునితో మాట్లాడుతూ భూమి పరదైసుగా మారుతుందని సూచించాడు. 2 కొరింథీయులు 12:4 లో ఉన్న “పరదైసు” భవిష్యత్తు పరదైసును, ప్రకటన 2:7 లో ఉన్న “పరదైసు” పరలోక పరదైసును సూచిస్తుందని స్పష్టమౌతుంది.—పర 4:13, అధస్సూచి; లూకా 23:43.
-
పరిగె ఏరుకోవడం.
కోతకోసేటప్పుడు కావాలని లేదా అనుకోకుండా వదిలేసిన ధాన్యపు వెన్నుల్ని ఏరుకోవడం. పొలాన్ని అంచుల దాకా కోయకూడదని; ఒలీవ పండ్లను, ద్రాక్షపండ్లను పూర్తిగా తీసుకోకూడదని మోషే ధర్మశాస్త్రం ప్రజలకు చెప్పింది. కోతకోసిన తర్వాత మిగిలినదాన్ని ఏరుకునే హక్కును దేవుడు పేదవాళ్లకు, కష్టాల్లో ఉన్నవాళ్లకు, పరదేశులకు, తండ్రిలేని పిల్లలకు, విధవరాళ్లకు ఇచ్చాడు.—రూతు 2:7.
-
పరిసయ్యులు.
సా.శ. మొదటి శతాబ్దంలో యూదా మతానికి చెందిన ఒక ప్రముఖ తెగ. యాజక వంశస్థులు కాకపోయినా, చిన్న పొల్లు కూడా పోకుండా ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటించేవాళ్లు. మౌఖిక ఆచారాలకు కూడా వాళ్లు అంతే ప్రాముఖ్యత ఇచ్చేవాళ్లు. (మత్త 23:23) గ్రీకు సంస్కృతి ప్రభావాన్ని వాళ్లు వ్యతిరేకించేవాళ్లు. ధర్మశాస్త్ర పండితులుగా, సంప్రదాయాల విద్వాంసులుగా వాళ్లకు ప్రజలమీద ఎంతో అధికారం ఉండేది. (మత్త 23:2-6) వాళ్లలో కొంతమంది మహాసభలో సభ్యులుగా కూడా ఉండేవాళ్లు. విశ్రాంతి రోజును ఆచరించడం, సంప్రదాయాలు పాటించడం, పాపులతో, పన్ను వసూలు చేసేవాళ్లతో సహవసించడం వంటి విషయాల్లో వాళ్లు యేసును తరచూ వ్యతిరేకించారు. వాళ్లలో కొంతమంది క్రైస్తవులయ్యారు, అందులో తార్సుకు చెందిన సౌలు కూడా ఉన్నాడు.—మత్త 9:11; 12:14; మార్కు 7:5; లూకా 6:2; అపొ 26:5.
-
పర్ణశాలల పండుగ.
దీన్ని గుడారాల పండుగ లేదా సమకూర్చే పండుగ అని కూడా పిలుస్తారు. దీన్ని ఏతనీము నెల 15-21 తేదీల్లో చేసుకునేవాళ్లు. ఇది ఇశ్రాయేలీయుల వ్యవసాయ సంవత్సరం చివర్లో పంట చేతికి వచ్చినందుకు చేసుకునే పండుగ. ఇది సంతోషించే సమయం, తమ పంటల్ని దీవించినందుకు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించే సమయం. ఐగుప్తు నుండి కలిగిన విడుదలను గుర్తుచేసుకోవడానికి పండుగ రోజుల్లో ప్రజలు పర్ణశాలల్లో లేదా పందిరిలాంటి వాటిలో నివసించేవాళ్లు. పురుషులు యెరూషలేముకు వెళ్లాల్సిన మూడు పండుగల్లో ఇదొకటి.—లేవీ 23:34; ఎజ్రా 3:4.
-
పర్యవేక్షకుడు.
సంఘాన్ని చూసుకుంటూ, దాన్ని కాసే ముఖ్యమైన బాధ్యత ఉన్న ఒక పురుషుడు. ఎపిస్కోపొస్ అనే గ్రీకు పదంలో సంరక్షణతో కూడిన పర్యవేక్షణ అనే ప్రాథమిక అర్థం ఉంది. “పర్యవేక్షకుడు,” “పెద్ద” (ప్రెస్బైటిరోస్) అనే పదాలు క్రైస్తవ సంఘంలో ఒకే స్థానాన్ని సూచిస్తున్నాయి. “పెద్ద” అనే పదం నియమితుడైన వ్యక్తిలోని పరిణతితో కూడిన లక్షణాల్ని సూచిస్తుంది. “పర్యవేక్షకుడు” అనే పదం ఆ నియామకంలో ఉన్న విధుల్ని నొక్కిచెప్తుంది.—అపొ 20:28; 1తి 3:2-7; 1పే 5:2.
-
పవిత్ర రహస్యం.
దేవుని సంకల్పంలో ఒక అంశం. దీనికి దేవుడే మూలం. ఆయన అనుకున్న సమయం వచ్చేంత వరకు దాన్ని తన దగ్గరే ఉంచుకుంటాడు. ఆయన ఎవరికి తెలియజేయాలని అనుకుంటాడో వాళ్లకు మాత్రమే దాన్ని తెలియజేస్తాడు.—మార్కు 4:11; కొలొ 1:26.
-
పవిత్ర స్థలం.
గుడారంలో, ఆ తర్వాత ఆలయంలో మొట్టమొదటి పెద్ద గది; చాలా లోపలి భాగమైన అతి పవిత్ర స్థలానికి వేరుగా ఉండే భాగం. గుడారంలోని పవిత్ర స్థలంలో బంగారు దీపస్తంభం, బంగారు ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల, బంగారు పాత్రలు ఉండేవి; ఆలయంలోని పవిత్ర స్థలంలో అయితే బంగారు ధూపవేదిక, పది బంగారు దీప స్తంభాలు, సముఖపు రొట్టెలు పెట్టే పది బల్లలు ఉండేవి. (నిర్గ 26:33; హెబ్రీ 9:2)—అనుబంధం B5, B8 చూడండి.
-
పవిత్రమైన స్థలం.
సాధారణంగా, ఆరాధన కోసం ప్రత్యేకించబడిన ఒక పవిత్రమైన చోటు. ఎక్కువగా అది యెరూషలేములో ఉన్న గుడారం లేదా ఆలయం కోసం ఉపయోగించబడింది. పరలోకంలో ఉన్న దేవుని ఆలయం లేదా నివాసం కోసం కూడా ఆ పదాన్ని వాడారు.—నిర్గ 25:8, 9; 1ది 28:10; ప్రక 11:19.
-
పవిత్రమైన; పవిత్రత.
యెహోవాకు స్వతహాగా ఉన్న లక్షణం; పూర్తిస్థాయిలో నైతిక స్వచ్ఛతను, పరిశుద్ధతను కలిగివుండే స్థితి. (నిర్గ 28:36; 1స 2:2; సామె 9:10; యెష 6:3) హీబ్రూ భాషలోని పదాన్ని మనుషులకు (నిర్గ 19:6; 2రా 4:9), జంతువులకు (సం 18:17), వస్తువులకు (నిర్గ 28:38; 30:25; లేవీ 27:14), స్థలాలకు (నిర్గ 3:5; యెష 27:13), సమయాలకు (నిర్గ 16:23; లేవీ 25:12), పనులకు (నిర్గ 36:4) ఉపయోగించినప్పుడు, అది పవిత్రుడైన దేవుని కోసం వేరుగా ఉండడాన్ని, ప్రత్యేకించబడడాన్ని లేదా ప్రతిష్ఠించబడడాన్ని సూచిస్తుంది; అంటే యెహోవా సేవ కోసం ప్రత్యేకించబడిన స్థితిని సూచిస్తుంది. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, “పవిత్రమైన,” “పవిత్రత” అని అనువదించబడిన పదాలు కూడా దేవుని కోసం వేరుగా ఉండడాన్ని సూచిస్తాయి. ఆ పదాలు, ఒక వ్యక్తి ప్రవర్తనలో స్వచ్ఛతను సూచించడానికి కూడా ఉపయోగించారు.—మార్కు 6:20; 2కొ 7:1; 1పే 1:15, 16.
-
పవిత్రశక్తి.
దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఉపయోగించే శక్తి. ఇది బలాన్నిచ్చే అదృశ్యమైన శక్తి. అత్యున్నత స్థాయిలో పవిత్రుడు, నీతిమంతుడు అయిన యెహోవా నుండి వస్తుంది కాబట్టి, పవిత్రమైన దాన్ని నెరవేర్చడానికి దేవుడు దాన్ని ఉపయోగిస్తాడు కాబట్టి అది పవిత్రమైనది.—లూకా 1:35; అపొ 1:8.
-
పవిత్రసేవ.
దేవుని ఆరాధనకు సంబంధించిన పవిత్ర పరిచర్య లేదా పని.—రోమా 12:1; ప్రక 7:15.
-
పశ్చాత్తాపం.
-
పస్కా.
ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు పొందిన విడుదలకు గుర్తుగా ప్రతీ సంవత్సరం అబీబు నెల (ఆ తర్వాత నీసాను నెల అని పిలిచారు) 14వ రోజున చేసుకునే పండుగ. ఆ పండుగలో గొర్రెపిల్లను (లేదా మేకను) వధించి, కాల్చేవాళ్లు. తర్వాత దాన్ని చేదు ఆకుకూరలతో, పులవని రొట్టెలతో తినేవాళ్లు.—నిర్గ 12:27; యోహా 6:4; 1కొ 5:7.
-
పానీయార్పణ.
-
పాపపరిహారార్థ బలి.
ఉద్దేశపూర్వకంగా కాకుండా అపరిపూర్ణ శరీర బలహీనత వల్ల చేసిన పాపం విషయంలో అర్పించే బలి. పాపం చేసిన వ్యక్తి స్థాయిని బట్టి, పరిస్థితుల్ని బట్టి ఎద్దు నుండి పావురం వరకు ఆయా జంతువుల్ని ప్రాయశ్చిత్తంగా అర్పించేవాళ్లు.—లేవీ 4:27, 29; హెబ్రీ 10:8.
-
పారసీక; పారసీకులు.
తరచూ మాదీయులతో పాటు ప్రస్తావించిన దేశం, ఆ దేశ ప్రజలు. వీళ్లకు మాదీయులతో సంబంధం ఉందని తెలుస్తుంది. మొదట్లో, పారసీకులు ఇరాన్ పీఠభూమి నైరుతి ప్రాంతంలో మాత్రమే ఉండేవాళ్లు. కోరెషు రాజు (ఇతని నాన్న పారసీకుడు అని, అమ్మ మాదీయురాలు అని కొందరు ప్రాచీన చరిత్రకారులు అంటారు) నాయకత్వంలో పారసీకులు మాదీయుల కన్నా బలంగా తయారయ్యారు, అయినా అది మాదీయ-పారసీక అనే ద్వంద్వ సామ్రాజ్యంగా కొనసాగింది. కోరెషు సా.శ.పూ. 539లో బాబిలోనియా సామ్రాజ్యాన్ని జయించి, చెరలో ఎజ్రా 1:1; దాని 5:28; 8:20)—అనుబంధం B9 చూడండి.
ఉన్న యూదుల్ని తమ స్వదేశానికి తిరిగి వెళ్లనిచ్చాడు. పారసీక సామ్రాజ్యం తూర్పు వైపు సింధు నది నుండి పడమటి వైపు ఏజియన్ సముద్రం వరకు విస్తరించింది. సా.శ.పూ. 331లో అలెగ్జాండర్ ద గ్రేట్ పారసీకుల్ని జయించేవరకు యూదులు పారసీకుల పరిపాలన కింద ఉన్నారు. దానియేలు దర్శనం పారసీక సామ్రాజ్యం రాబోతుందని సూచించింది. బైబిల్లో ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు పుస్తకాల్లో ఈ సామ్రాజ్యం గురించి కనబడుతుంది. ( -
పిమ్.
ఇది ఒక తూకంరాయి. వేర్వేరు లోహపు పరికరాల్ని పదును పెట్టడానికి ఫిలిష్తీయులు వసూలు చేసే ఒక వెల. ఇశ్రాయేలులో జరిపిన పురావస్తు తవ్వకాల్లో చాలా తూకంరాళ్ల మీద “పిమ్” అనే పదానికి సంబంధించిన ప్రాచీన హీబ్రూ హల్లులు ఉన్నాయి; వాటి సగటు బరువు 7.8 గ్రాములు, అంటే షెకెల్‌లో మూడింట రెండు వంతులు.—1స 13:20, 21.
-
పునరుత్థానం.
చనిపోయిన స్థితి నుండి లేవడం, తిరిగి బ్రతకడం. గ్రీకులో దీనికి వాడిన అనేస్టసిస్ అనే పదానికి అక్షరార్థంగా “లేపడం; నిలబడడం” అని అర్థం. యెహోవా దేవుడు చేసిన యేసు పునరుత్థానంతో కలుపుకొని బైబిల్లో తొమ్మిది పునరుత్థానాల ప్రస్తావన ఉంది. అయితే ఏలీయా, ఎలీషా, యేసు, పేతురు, పౌలు పునరుత్థానాలు చేసినప్పటికీ, వాళ్లు ఆ అద్భుతాలన్నీ దేవుని శక్తితోనే చేసినట్టు స్పష్టంగా చెప్పబడింది. భూమ్మీద జరిగే ‘నీతిమంతుల, అనీతిమంతుల పునరుత్థానానికి దేవుని సంకల్పంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. (అపొ 24:15) బైబిల్లో పరలోక పునరుత్థానం గురించి కూడా ఉంది. బైబిలు దాన్ని “మొదటి పునరుత్థానం” అని అంటుంది. ఆ పునరుత్థానం, పవిత్రశక్తితో అభిషేకించబడిన యేసు సహోదరులకు సంబంధించినది.—ఫిలి 3:11; ప్రక 20:5, 6; యోహా 5:28, 29, అధస్సూచి; 11:25, అధస్సూచి.
-
పులవని రొట్టెల పండుగ.
ప్రతీ సంవత్సరం ఇశ్రాయేలీయులు చేసుకునే మూడు పెద్ద పండుగల్లో ఇది మొదటిది. ఇది పస్కా పండుగ తర్వాతి రోజున అంటే నీసాను 15న మొదలై ఏడు రోజుల పాటు కొనసాగేది. ఐగుప్తు నుండి కలిగిన విడుదలకు గుర్తుగా, ఈ పండుగలో కేవలం పులవని రొట్టెలు మాత్రమే తినాలి.—నిర్గ 23:15; మార్కు 14:1.
-
పులిసిన పిండి.
పిండిముద్ద లేదా పానీయాలు పులవడానికి కలిపే పదార్థం; ముఖ్యంగా అంతకుముందు ఉపయోగించిన పులిసిన ముద్దలో నుండి పక్కకు పెట్టిన కొంత భాగం. ఈ పదాన్ని బైబిల్లో ఎక్కువగా పాపాన్ని, అవినీతిని సూచించడానికి ఉపయోగించారు. అయితే, బయటికి కనిపించకుండా లోలోపల పెరుగుతూ వ్యాప్తిచెందడాన్ని సూచించడానికి కూడా ఈ పదాన్ని ఉపయోగించారు.—నిర్గ 12:20; మత్త 13:33; గల 5:9.
-
పూజా కర్ర.
ఇది అషేరా అనే హీబ్రూ పదం నుండి వచ్చింది. ఇది (1) కనానీయుల సంతాన సాఫల్య దేవత అషేరాను సూచించే పూజా కర్రను, లేదా (2) అషేరా దేవత ప్రతిమను సూచిస్తుంది. ఈ కర్రల్ని నిలువుగా పాతేవాళ్లని తెలుస్తోంది. వీటిలో కొంతభాగమైనా చెక్కతో చేసేవాళ్లు. ఇవి చెక్కబడని కొయ్య దుంగలు లేదా చెట్లు కూడా అయ్యుండవచ్చు.—ద్వితీ 16:21; న్యా 6:26; 1రా 15:13.
-
పూజా స్తంభం.
నిలువుగా పాతిన స్తంభం, సాధారణంగా రాతితో చేసినది. ఇది బయలు లేదా ఇతర అబద్ధ దేవుళ్ల లింగం గుర్తు అని స్పష్టమౌతోంది.—నిర్గ 23:24.
-
పూరీము.
ప్రతీ సంవత్సరం అదారు నెల 14, 15 తేదీల్లో జరుపుకునే పండుగ. ఎస్తేరు రాణి కాలంలో యూదులకు కలిగిన రక్షణకు గుర్తుగా దీన్ని జరుపుకునేవాళ్లు. పూరీము హీబ్రూ పదం కాదు, ఆ పదానికి “చీట్లు” అని అర్థం. యూదుల్ని సమూలంగా తుడిచిపెట్టే రోజును ఎంచుకోవడానికి హామాను పూరు (అంటే, చీటి) వేశాడు, అందుకే దీనికి పూరీము పండుగ లేదా చీట్ల పండుగ అనే పేరు వచ్చింది.—ఎస్తే 3:7; 9:26.
-
పెంతెకొస్తు.
యూదా పురుషులందరూ తప్పనిసరిగా యెరూషలేములో జరుపుకోవాల్సిన మూడు పెద్ద పండుగల్లో ఇది రెండవది. పెంతెకొస్తు అంటే “యాభైయవ (రోజు)” అని అర్థం; హీబ్రూ లేఖనాల్లో “కోత పండుగ” లేదా “వారాల పండుగ” అనే పేర్లతో ఉన్న పండుగను క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో పెంతెకొస్తు పండుగ అని ప్రస్తావించారు. నీసాను 16 నుండి లెక్కించి 50వ రోజున దీన్ని చేసుకునేవాళ్లు.—నిర్గ 23:16; 34:22; అపొ 2:1.
-
పెద్ద; వృద్ధుడు.
ఇది వయసు పైబడిన వాళ్లను సూచించే పదమే అయినా, లేఖనాల్లో ప్రాథమికంగా ఈ పదాన్ని సమాజంలో గానీ దేశంలో గానీ అధికార స్థానంలో, బాధ్యతాయుత స్థానంలో ఉన్నవాళ్లను సూచించడానికి ఉపయోగించారు. ప్రకటన గ్రంథంలో పరలోక ప్రాణుల్ని సూచించడానికి కూడా ఈ పదాన్ని వాడారు. ప్రెస్బైటిరోస్ అనే గ్రీకు పదాన్ని సంఘంలో నాయకత్వం వహించే బాధ్యత ఉన్నవాళ్లను సూచించడానికి ఉపయోగించినప్పుడు దాన్ని “పెద్ద” అని అనువదించారు.—నిర్గ 4:29; సామె 31:23; 1తి 5:17; ప్రక 4:4.
-
పైవిలాసం.
-
పొట్టు
నూర్చేటప్పుడు, తూర్పారబట్టేటప్పుడు ధాన్యం నుండి వేరైపోయే ఊక లేదా పైపొర. పనికిరాని దాన్ని, అవసరంలేని దాన్ని సూచించడానికి దీన్ని ఒక పదచిత్రంగా ఉపయోగించేవాళ్లు.—కీర్త 1:4; మత్త 3:12.
-
పొడుగు గోధుమలు.
తక్కువ రకం గోధుమలు (ట్రిటికమ్ స్పెల్టా). వీటి గింజల నుండి పొట్టు అంత తేలిగ్గా ఊడిరాదు.—నిర్గ 9:32.
-
పోర్నియా.—
లైంగిక పాపం చూడండి.
-
ప్రత్యక్ష గుడారం.
మోషే డేరాను, మొదట ఎడారిలో నిలబెట్టిన పవిత్ర గుడారాన్ని సూచించడానికి ఈ మాటను ఉపయోగించారు.—నిర్గ 33:7; 39:32.
-
ప్రత్యక్షత.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఈ పదం కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు రాజరిక ప్రత్యక్షతను సూచిస్తుంది. ఆ ప్రత్యక్షత ఈ వ్యవస్థ చివరి రోజుల్లో మెస్సీయ రాజ్యానికి రాజుగా యేసుక్రీస్తు అదృశ్యంగా సింహాసనాన్ని అధిష్ఠించినప్పటి నుండి మొదలైంది. క్రీస్తు ప్రత్యక్షత అనేది ఇలా వచ్చి అలా వెళ్లిపోయేది కాదు; బదులుగా అది ఒక ప్రత్యేకమైన కాలమంతటినీ సూచిస్తుంది.—మత్త 24:3.
-
ప్రథమఫలాలు.
కోతకాలంలో మొట్టమొదట వచ్చే పంట; దేనికైనా వచ్చే మొదటి ఫలితం లేదా ఉత్పత్తి. మనుషుల్లోనే గానీ, జంతువుల్లోనే గానీ, పంటల్లోనే గానీ ప్రథమఫలాల్ని తనకు అర్పించాలని యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. పులవని రొట్టెల పండుగ రోజున, పెంతెకొస్తు పండుగ రోజున ఇశ్రాయేలీయులందరూ తమ ప్రథమఫలాల్ని దేవునికి అర్పించేవాళ్లు. క్రీస్తు, ఆయన అభిషిక్త అనుచరుల విషయంలో కూడా ‘ప్రథమఫలాలు’ అనే మాటను అలంకారికంగా ఉపయోగించారు.—1కొ 15:23; సం 15:21, అధస్సూచి; సామె 3:9; ప్రక 14:4.
-
ప్రధానదూత.
ఈ పదానికి, “దేవదూతల్లో ముఖ్యుడు” అని అర్థం. ఈ అర్థాన్నీ, అలాగే “ప్రధానదూత” అనే మాటను బైబిల్లో ఏకవచనంలో మాత్రమే ఉపయోగించారనే వాస్తవాన్నీ గమనిస్తే కేవలం ఒకేఒక్క ప్రధానదూత ఉన్నాడని అర్థమౌతుంది. ఆ ప్రధానదూత పేరు మిఖాయేలు అని బైబిలు చెప్తోంది.—దాని 12:1; యూదా 9; ప్రక 12:7.
-
ప్రధానయాజకుడు.
మోషే ధర్మశాస్త్రం ప్రకారం, దేవుని ముందు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ముఖ్యమైన యాజకుడు. ఇతను వేరే యాజకుల్ని పర్యవేక్షించేవాడు కూడా. ఇతన్ని “ముఖ్య యాజకుడు” అని కూడా పిలిచేవాళ్లు. (2ది 26:20; ఎజ్రా 7:5) గుడారంలో, ఆ తర్వాత ఆలయంలో చాలా లోపలి భాగమైన అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించడానికి ఇతనికి మాత్రమే అనుమతి ఉండేది. ఇతను సంవత్సరానికి ఒకసారి వచ్చే ప్రాయశ్చిత్త రోజున మాత్రమే అందులోకి వెళ్లేవాడు. “ప్రధానయాజకుడు” అనే మాటను యేసుక్రీస్తుకు కూడా ఉపయోగించారు.—లేవీ 16:2, 17; 21:10; మత్త 26:3; హెబ్రీ 4:14.
-
ప్రభువు రాత్రి భోజనం.
క్రీస్తు శరీరానికి, రక్తానికి సూచనలుగా ఉన్న పులవని రొట్టె, ద్రాక్షారసం ఉన్న ఒక అక్షరార్థ భోజనం; యేసు మరణానికి జ్ఞాపకార్థంగా దీన్ని చేస్తారు. లేఖనాల ప్రకారం క్రైస్తవులు దీన్ని తప్పనిసరిగా ఆచరించాలి కాబట్టి, “జ్ఞాపకార్థ ఆచరణ” అనే పేరు కూడా దీనికి సరిగ్గా సరిపోతుంది.—1కొ 11:20, 23-26.
-
ప్రవక్త.
-
ప్రవచనం.
ఒక ప్రేరేపిత సందేశం. ఇది దేవుని ఇష్టాన్ని వెల్లడిచేయడం కావచ్చు లేదా ప్రకటించడం కావచ్చు. ప్రవచనం అనేది ప్రేరేపిత నైతిక బోధ కావచ్చు, దేవుని ఆజ్ఞను లేదా తీర్పును తెలిపే మాటలు కావచ్చు, లేదా రాబోయే దాని గురించిన ప్రకటన కావచ్చు.—యెహె 37:9, 10; దాని 9:24; మత్త 13:14; 2పే 1:20, 21.
-
ప్రాంగణం.
గుడారం చుట్టూ తెరల లోపల ఉన్న ఖాళీ స్థలం; ఆ తర్వాతి కాలంలో, ఆలయ ముఖ్య భవనం చుట్టూ ప్రహరీగోడ లోపల ఉన్న ఖాళీ స్థలం. బలులు అర్పించే బలిపీఠం గుడారపు ప్రాంగణంలో ఉండేది; ఆలయంలో అయితే అది లోపలి ప్రాంగణంలో ఉండేది. (అనుబంధం B5, B8, B11 చూడండి.) ఇళ్లు, రాజభవనాల ప్రాంగణాల లేదా ఆవరణల గురించి కూడా బైబిల్లో ఉంది.—నిర్గ 8:13, అధస్సూచి; 27:9; 1రా 7:12; ఎస్తే 4:11; మత్త 26:3.
-
ప్రాంత పాలకుడు.
బాబిలోనియా, పారసీక సామ్రాజ్యాల్లో ఒక సంస్థానానికి అధిపతి. రాజు ఇతన్ని ముఖ్య పరిపాలకునిగా నియమించేవాడు.—ఎజ్రా 8:36; దాని 6:1.
-
ప్రాణం.
మూలభాషలోని చాలా పదాలు “ప్రాణం” అని అనువదించబడ్డాయి. వాటిలో నెఫెష్ అనే హీబ్రూ పదం, సైఖే అనే గ్రీకు పదం కూడా ఉన్నాయి. ఈ అనువాదంలో ఈ పదాలు ఎక్కువగా “ప్రాణం” అని అనువదించబడ్డాయి. బైబిల్లో ఈ పదాల్ని ఉపయోగించిన తీరును పరిశీలిస్తే, ఇవి ప్రాథమికంగా (1) మనుషుల్ని, (2) జంతువుల్ని లేదా (3) ఒక వ్యక్తికి లేదా జంతువుకు ఉన్న ప్రాణాన్ని సూచిస్తున్నాయని అర్థమౌతుంది. (ఆది 1:20; 2:7; 1పే 3:20; అధస్సూచీలు కూడా) ఈ అనువాదంలో, ఆ మూలభాష పదాల్ని ఎక్కువగా ఆయా సందర్భాల్లో వాటికున్న అర్థానికి తగినట్టు “ప్రాణం,” “ప్రాణి,” “వ్యక్తి,” “పూర్తి సామర్థ్యం” అని గానీ లేదా సర్వనామంగా (ఉదాహరణకు, “నేను”) అని గానీ అనువదించారు. కొన్ని లేఖనాల్లో నెఫెష్, సైఖే అనే పదాలు “నిండు ప్రాణంతో” అని అనువదించబడ్డాయి; అంటే దేన్నైనా నిండు హృదయంతో చేయడమని అర్థం. (ద్వితీ 6:5; మత్త 22:37) ఈ పదాలు చనిపోయిన వ్యక్తిని లేదా శవాన్ని కూడా సూచించవచ్చు.—సం 6:6; హగ్గ 2:13.
-
ప్రాయశ్చిత్త మూత.
ఇది ఒప్పంద మందసం మూత (కరుణా పీఠం). ప్రాయశ్చిత్త రోజున ప్రధానయాజకుడు పాపపరిహారార్థ బలుల రక్తాన్ని చిలకరించేది దీని ముందే. దీనికి ఉపయోగించిన హీబ్రూ పదం, “(పాపాన్ని) కప్పడం” లేదా బహుశా “(పాపాన్ని) తుడిచేయడం” అనే మూల క్రియాపదం నుండి వచ్చింది. ఇది గట్టి బంగారంతో చేయబడింది. దానిమీద ఆ చివర ఒక కెరూబు, ఈ చివర ఒక కెరూబు ఉండేవి. కొన్నిసార్లు దీన్ని సూచించడానికి కేవలం “మూత” అని మాత్రమే వాడారు. (నిర్గ 25:17-22; 1ది 28:11; హెబ్రీ 9:5)—అనుబంధం B5 చూడండి.
-
ప్రాయశ్చిత్త రోజు.
ఇది ఇశ్రాయేలీయుల పవిత్రమైన రోజుల్లో అత్యంత ప్రాముఖ్యమైనది. దీన్ని యోమ్ కిప్పూర్ (“కప్పేసే రోజు” అనే అర్థం ఉన్న యోమ్ హక్కిప్పురిమ్ అనే హీబ్రూ పదం నుండి వచ్చింది) అని కూడా పిలిచేవాళ్లు. ఇది ఏతనీము నెలలో 10వ తారీఖున వచ్చేది. సంవత్సరంలో కేవలం ఆ రోజున మాత్రమే ప్రధానయాజకుడు అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించేవాడు. ఆ రోజు లేవీ 23:27, 28.
అతను తన పాపాల కోసం, ఇతర లేవీయుల పాపాల కోసం, ప్రజల పాపాల కోసం వధించిన బలుల రక్తాన్ని అక్కడ అర్పించేవాడు. ఆ రోజు పవిత్ర సమావేశం జరిగేది, ప్రజలు ఉపవాసం ఉండేవాళ్లు. అంతేకాదు అది, సాధారణంగా రోజూ చేసే పనికి దూరంగా ఉండాల్సిన విశ్రాంతి రోజు కూడా.— -
ప్రాయశ్చిత్తం.
హీబ్రూ లేఖనాల్లో, ప్రజలు దేవుని దగ్గరికి వచ్చి ఆయన్ని ఆరాధించగలిగేలా బలులు అర్పించేవాళ్లు, ఇది ఆ సందర్భానికి సంబంధించి ఉపయోగించే పదం. ఆయా వ్యక్తులు, అలాగే పూర్తి ఇశ్రాయేలు సమాజం పాపం చేసినప్పుడు వాళ్లు దేవునితో తిరిగి శాంతియుత సంబంధం కలిగివుండేలా మోషే ధర్మశాస్త్రం ప్రకారం బలులు అర్పించేవాళ్లు, ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి వచ్చే ప్రాయశ్చిత్త రోజున అలా అర్పించేవాళ్లు. ఆ బలులు యేసు బలిని సూచించాయి. యేసు అర్పించిన బలి అన్నికాలాలకు సరిపోయేలా ఒక్కసారే మనుషుల పాపాలకు పూర్తిగా ప్రాయశ్చిత్తం చేసింది. అలా అది యెహోవాతో మళ్లీ శాంతియుత సంబంధం నెలకొల్పుకునే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చింది.—లేవీ 5:10; 23:28; కొలొ 1:20; హెబ్రీ 9:12.
-
ప్రేతోర్య సైనికులు.
రోమా చక్రవర్తికి అంగరక్షకులుగా ఉండడానికి నియమితులైన రోమా సైనికుల గుంపు. తర్వాతి కాలంలో ఈ సైనికులు చక్రవర్తికి మద్దతివ్వగల లేదా అతన్ని ఆ స్థానం నుండి తీసేయగల బలమైన రాజకీయ శక్తిగా మారారు.—ఫిలి 1:13.
ఫ
-
ఫరో.
ఐగుప్తు రాజులకు ఇవ్వబడిన బిరుదు. బైబిల్లో ఐదుగురు ఫరోల పేర్లు ఉన్నాయి (షీషకు, సో, తిర్హాకా, నెకో, హొఫ్ర). కానీ మిగతా ఫరోల పేర్లు బైబిల్లో లేవు. వాళ్లలో అబ్రాహాము, మోషే, యోసేపులతో అనేకసార్లు వ్యవహరించిన ఫరోలు కూడా ఉన్నారు.—నిర్గ 15:4; రోమా 9:17.
-
ఫాథమ్.
నీటి లోతును కొలవడానికి ఉపయోగించే రేఖీయ కొలత, ఇది 1.8 మీటర్లతో (6 అడుగులతో) సమానం. (అపొ 27:28, అధస్సూచీలు)—అనుబంధం B14 చూడండి.
-
ఫిలిష్తియ; ఫిలిష్తీయులు.
ఇశ్రాయేలు దక్షిణ తీరాన ఉన్న దేశాన్ని ఫిలిష్తియ అని పిలిచేవాళ్లు. క్రేతు నుండి వలసవచ్చి అక్కడ స్థిరపడినవాళ్లను ఫిలిష్తీయులు అని పిలిచేవాళ్లు. దావీదు వాళ్లను జయించాడు, కానీ వాళ్లు స్వతంత్రులుగానే ఉంటూ ఎప్పుడూ ఇశ్రాయేలీయులకు శత్రువులుగానే ఉన్నారు. (నిర్గ 13:17; 1స 17:4; ఆమో 9:7)—అనుబంధం B4 చూడండి.
బ
-
బయలు.
కనానీయుల దేవుడు. బయలును ఆకాశానికి యజమానిగా, వర్షాలు ఇచ్చేవాడిగా, సంతాన సాఫల్యాన్ని కలగజేసే దేవుడిగా ఎంచేవాళ్లు. స్థానికంగా పూజించిన చిన్నచిన్న దేవుళ్లను కూడా “బయలు” అనేవాళ్లు. దీనికి ఉపయోగించిన హీబ్రూ పదానికి “యజమాని” అని అర్థం.—1రా 18:21; రోమా 11:4.
-
బయెల్జెబూలు.
ఇది చెడ్డదూతల అధిపతి లేదా పరిపాలకుడు అయిన సాతానుకు ఉపయోగించిన ఒక బిరుదు. ఎక్రోనులో ఫిలిష్తీయులు పూజించిన బయలు-జెబూబు అనే బయలు దేవత పేరే బహుశా ఇలా మారివుంటుంది.—2రా 1:3; మత్త 12:24.
-
బలి.
దేవుని పట్ల కృతజ్ఞత తెలపడానికి, తప్పు ఒప్పుకోవడానికి, ఆయనతో మంచి సంబంధం తిరిగి నెలకొల్పుకోవడానికి గుర్తుగా ఆయనకు సమర్పించే అర్పణ. హేబెలు మొదలుకొని మనుషులు స్వచ్ఛందంగా రకరకాల బలులు అర్పించారు, వాటిలో జంతు బలులు కూడా ఉండేవి. ఆ తర్వాత మోషే ధర్మశాస్త్ర ఒప్పందం దీన్ని ఒక ఆజ్ఞగా చేసింది. యేసు తన ప్రాణాన్ని పరిపూర్ణ బలిగా అర్పించిన తర్వాత, ఇక జంతు బలులు అర్పించాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే క్రైస్తవులు దేవునికి ఆధ్యాత్మిక బలుల్ని అర్పిస్తూనే ఉంటారు.—ఆది 4:4; హెబ్రీ 13:15, 16; 1యో 4:10.
-
బలిపీఠం.
మట్టితో, రాళ్లతో, బండరాయితో, లేదా లోహపు రేకు కప్పిన చెక్కతో నేలమీద కాస్త ఎత్తులో నిర్మించిన కట్టడం లేదా వేదిక. ఆరాధనలో భాగంగా దానిమీద బలుల్ని, ధూపాన్ని అర్పించేవాళ్లు. గుడారంలోని, ఆలయంలోని ప్రాంగణంలో దీనికన్నా పెద్దగా ఉండే “రాగి బలిపీఠం” ఉండేది. దీనిమీద దహనబలులు అర్పించేవాళ్లు. (నిర్గ 27:1; 39:39; ఆది 8:20; 2ది 4:1)—అనుబంధం B5, B8 చూడండి.
-
బలిపీఠపు కొమ్ములు.
కొన్ని బలిపీఠాలకు వాటి నాలుగు మూలల్లో బయటికి పొడుచుకొచ్చినట్టుగా ఉండే కొమ్ములాంటి ఆకారాలు. (లేవీ 8:15; 1రా 2:28)—అనుబంధం B5, B8 చూడండి.
-
బాకా.
లోహంతో చేసిన ఊదే పరికరం. దీన్ని సంకేతాలు ఇవ్వడం కోసం, సంగీతం కోసం ఉపయోగించేవాళ్లు. సంఖ్యాకాండం 10:2లో ఉన్నట్టు సమాజాన్ని పిలవడానికి, డేరాలు ఎప్పుడు తీసేయాలో సూచించడానికి లేదా యుద్ధం చాటించడానికి రెండు వెండి బాకాలు చేసుకోమని యెహోవా నిర్దేశాలు ఇచ్చాడు. ఇవి నిటారుగా ఉండేవి. అచ్చంగా జంతువుల కొమ్ములతో తయారుచేసిన “బూరల్లా” వంపు తిరిగి ఉండేవి కావు. ఆలయంలోని సంగీత పరికరాల్లో కూడా బాకాలు ఉండేవి, అయితే వీటి ఆకారం ఎలా ఉండేదో తెలీదు. తరచూ బాకాల శబ్దంతో పాటు అలంకారార్థంగా యెహోవా తీర్పుల ప్రకటన లేదా దేవుడు జరిగించే ఇతర ముఖ్యమైన సంఘటనలు ఉంటాయి.—2ది 29:26; ఎజ్రా 3:10; 1కొ 15:52; ప్రక 8:7–11:15.
-
బాత్.
ఇది ద్రవ కొలత. పురావస్తు తవ్వకాల్లో బాత్ అనే పేరుతో దొరికిన కూజా పెంకుల ఆధారంగా వేసిన అంచనా ప్రకారం అది దాదాపు 22 లీటర్లతో సమానం. బైబిల్లోని ఇతర ఘన కొలతల్ని, ద్రవ కొలతల్ని బాత్ కొలత ఘనపరిమాణం ప్రకారం లెక్కకట్టేవాళ్లు. (1రా 7:38; యెహె 45:14)—అనుబంధం B14 చూడండి.
-
బాప్తిస్మం; బాప్తిస్మం ఇవ్వడం.
దీని క్రియాపదానికి “ముంచడం,” అంటే నీళ్లలో ముంచడం అని అర్థం. తన అనుచరులు బాప్తిస్మం తీసుకోవడం తప్పనిసరి అని యేసు చెప్పాడు. లేఖనాల్లో యోహాను బాప్తిస్మం, పవిత్రశక్తితో బాప్తిస్మం, అగ్నితో బాప్తిస్మం, ఇతర బాప్తిస్మాల గురించి మత్త 3:11, 16; 28:19; యోహా 3:23; 1పే 3:21.
కూడా ఉంది.— -
బూజు.
శిలీంధ్రాల వల్ల వచ్చే పరాన్నజీవి మొక్కల వ్యాధి. బైబిల్లో ప్రస్తావించిన బూజు నల్ల కుంకుమ తెగులు (పూచినియ గ్రామినిస్) అనే అభిప్రాయం ఉంది.—1రా 8:37, అధస్సూచి.
-
బూలు.
యూదుల పవిత్ర క్యాలెండరులో 8వ నెల, వ్యవసాయ క్యాలెండరులో 2వ నెల. “పంట” అనే అర్థమున్న పదం నుండి ఈ పేరు వచ్చింది. ఇది మన క్యాలెండరులో అక్టోబరు మధ్య నుండి నవంబరు మధ్య వరకు ఉంటుంది. (1రా 6:38)—అనుబంధం B15 చూడండి.
-
బొండ.
శిక్షించడం కోసం నిర్బంధించడానికి ఉపయోగించే పరికరం. కొన్ని పరికరాలు పాదాలను మాత్రమే నిర్బంధించేవి. ఇంకొన్ని బహుశా పాదాల్ని, చేతుల్ని, మెడని నిర్బంధించి శరీరాన్ని వంకరగా పట్టి ఉంచేవి.—యిర్మీ 20:2; అపొ 16:24.
-
బోళం.
ఇది సువాసనను ఇచ్చే జిగురు పదార్థం. దీన్ని ఒక రకమైన ముళ్లపొద నుండి లేదా కామ్మీఫోరా జాతికి చెందిన చిన్న చెట్ల నుండి సేకరిస్తారు. పవిత్రమైన అభిషేక తైలం తయారీలో ఈ బోళాన్ని కూడా కలిపేవాళ్లు. బట్టలు లేదా పరుపుల వంటివాటికి సువాసన తెప్పించడానికి దీన్ని వాడేవాళ్లు; మర్దన కోసం వాడే నూనెలో, శరీరానికి పూసేవాటిలో దీన్ని కలిపేవాళ్లు. సమాధి చేయడానికి శరీరాల్ని సిద్ధం చేసేందుకు కూడా బోళం వాడేవాళ్లు.—నిర్గ 30:23; సామె 7:17; యోహా 19:39.
భ
-
భవిష్యత్తు చెప్పేవాళ్లు.
ఇంద్రజాలం చేసే పూజారులు, చెడ్డదూతల సహాయంతో సోదె చెప్పేవాళ్లు, జ్యోతిష్యులు, మరితరులు ఈ కోవలోకి వస్తారని బైబిలు చెప్తుంది.—లేవీ 19:31; ద్వితీ 18:11; అపొ 16:16.
మ
-
మంచిచెడుల తెలివినిచ్చే చెట్టు.
-
మంచివార్త/సువార్త.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, దేవుని రాజ్యం గురించిన మంచివార్తను, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం వల్ల కలిగే రక్షణ గురించిన మంచివార్తను సూచించడానికి ఈ పదాన్ని వాడారు.—లూకా 4:18, 43; అపొ 5:42; ప్రక 14:6.
-
మంత్రవిద్య.
భౌతిక శరీరం చనిపోయినప్పుడు ఆత్మలు బ్రతికే ఉంటాయనే, అవి బ్రతికున్న వాళ్లతో మాట్లాడగలవనే, మాట్లాడతాయనే నమ్మకం; ముఖ్యంగా వాటి ప్రభావానికి తేలిగ్గా లొంగిపోయే వ్యక్తి (మాధ్యమం) ద్వారా అలా మాట్లాడతాయని నమ్ముతుంటారు. “మంత్రతంత్రాలు చేయడం” అనేదానికి ఉపయోగించిన గ్రీకు పదం ఫార్మాకియా. దానికి అక్షరార్థంగా “మాదకద్రవ్యాలు ఉపయోగించడం” అని అర్థం. పూర్వకాలంలో క్షుద్రపూజలు చేసేటప్పుడు చెడ్డదూతల శక్తిని ఆహ్వానించడానికి మాదకద్రవ్యాలు ఉపయోగించేవాళ్లు కాబట్టి ఈ పదాన్ని మంత్రవిద్యతో ముడిపెట్టడం మొదలైంది.—గల 5:20; ప్రక 21:8.
-
మగ్గం.
దారంతో లేదా నూలుతో వస్త్రాన్ని నేయడానికి ఉపయోగించే యంత్రం.—నిర్గ 39:27.
-
మతభ్రష్టత్వం.
గ్రీకు భాషలో ఉపయోగించిన పదం (అపొస్టసైయా) అక్షరార్థంగా “దూరంగా నిలబడడం” అనే అర్థం ఉన్న క్రియాపదం నుండి వచ్చింది. దాని నామవాచక పదానికి “వదిలేయడం, విడిచిపెట్టడం, లేదా తిరుగుబాటు చేయడం” అనే అర్థాలు ఉన్నాయి. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, “మతభ్రష్టత్వం” అనే పదాన్ని సత్యారాధనను వదిలేసినవాళ్లను సూచించడానికి వాడారు.—సామె 11:9, అధస్సూచి; అపొ 21:21, అధస్సూచి; 2థె 2:3.
-
మధ్యవర్తి.
-
మన్నా.
ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఎడారిలో ఉన్నప్పుడు తిన్న ముఖ్య ఆహారం. యెహోవాయే దాన్ని వాళ్లకు ఇచ్చాడు. అది విశ్రాంతి రోజున తప్ప ప్రతీరోజు అద్భుతరీతిలో నేలమీద కనిపించేది. దానిమీద మంచు పొర కప్పబడి ఉండేది. ఇశ్రాయేలీయులు మొదటిసారి దాన్ని చూసినప్పుడు, “ఇది ఏంటి?” లేదా హీబ్రూలో “మ్యాన్ హు?” అని అడిగారు. (నిర్గ 16:13-15, 35) వేరే సందర్భాల్లో దీన్ని “ఆకాశ ధాన్యం” (కీర్త 78:24) అని, “ఆకాశం నుండి ఆహారం” (కీర్త 105:40) అని, “బలశాలుల ఆహారం” (కీర్త 78:25) అని వర్ణించారు. యేసు కూడా మన్నాను అలంకారికంగా ప్రస్తావించాడు.—యోహా 6:49, 50.
-
మరిది ధర్మం.
ఇది ఒక ఆచారం. కొంతకాలానికి దీన్ని మోషే ధర్మశాస్త్రంలో చేర్చారు. ఆ ఆచారం ప్రకారం ఒకతను కుమారులు లేకుండా చనిపోతే, అతని అన్న లేదా తమ్ముడు అతని భార్యను పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని అతని వంశాన్ని నిలబెట్టాలి.—ఆది 38:8; ద్వితీ 25:5.
-
మల్కాము.
-
మహాశ్రమ.
“శ్రమ” అనే పదానికి గ్రీకులో వాడిన పదం, పరిస్థితులు సృష్టించే ఒత్తిళ్ల వల్ల కలిగే వేదన లేదా బాధ అనే అర్థాన్నిస్తుంది. ముందెప్పుడూ రాని “మహాశ్రమ” గురించి యేసు మాట్లాడాడు. అంటే యెరూషలేము మీదికి, మరిముఖ్యంగా భవిష్యత్తులో తాను “మహిమతో” వచ్చే సమయంలో మనుషులందరి మీదికి రాబోయే మహాశ్రమ గురించి యేసు మాట్లాడాడు. (మత్త 24:21, 29-31) పౌలు ఈ శ్రమను, “దేవుడు తెలియనివాళ్ల మీద,” యేసుక్రీస్తు గురించిన “మంచివార్తకు లోబడనివాళ్ల మీద” దేవుడు తీసుకోబోయే నీతియుక్త చర్య అని వర్ణించాడు. ప్రకటన 19వ అధ్యాయం ‘క్రూరమృగానికి, భూమ్మీది రాజులకు, వాళ్ల సైన్యాలకు’ వ్యతిరేకంగా పరలోక సైన్యాల్ని నడిపించే వ్యక్తి యేసు అని తెలియజేస్తోంది. (2థె 1:6-8; ప్రక 19:11-21) “ఒక గొప్పసమూహం” ఆ శ్రమ నుండి తప్పించుకున్నట్టు బైబిలు చూపిస్తోంది. (ప్రక 7:9, 14)—హార్‌మెగిద్దోన్ చూడండి.
-
మహాసభ.
యెరూషలేములో ఉన్న యూదుల ఉన్నత న్యాయస్థానం. యేసు కాలంలోని మహాసభలో ప్రధానయాజకుడు, గతంలో ప్రధానయాజకులుగా సేవచేసినవాళ్లు, ప్రధానయాజకుల కుటుంబ సభ్యులు, పెద్దలు, గోత్ర పెద్దలు, కుటుంబ పెద్దలు, శాస్త్రులతో కలుపుకొని మొత్తం 71 మంది సభ్యులు ఉండేవాళ్లు.—మార్కు 15:1; అపొ 5:34; 23:1, 6.
-
మాచిపత్రి.
చాలా చేదైన రుచి, ఘాటైన వాసన ఉండే రకరకాల అడవి మొక్కలు. బైబిల్లో ఈ పదాన్ని అనైతికత, బానిసత్వం, అన్యాయం, మతభ్రష్టత్వం వల్ల వచ్చే చేదు పర్యవసానాల్ని సూచించడానికి సూచనార్థకంగా వాడారు. ప్రకటన 8:11లో “మాచిపత్రి” అనే పదం చేదైన, విషపూరితమైన పదార్థాన్ని సూచిస్తుంది.—ద్వితీ 29:18; సామె 5:4; యిర్మీ 9:15; ఆమో 5:7.
-
మాదీయులు; మాదీయ.
యాపెతు కుమారుడైన మాదయి నుండి వచ్చిన ప్రజలు; వాళ్లు పర్వత ప్రాంతమైన ఇరాన్ పీఠభూమిలో స్థిరపడ్డారు. తర్వాత ఆ ప్రాంతానికి మాదీయ దేశమనే పేరు వచ్చింది. అష్షూరును జయించడానికి మాదీయులు బబులోనుతో చేతులు కలిపారు. ఆ సమయంలో, పారసీక ప్రాంతం మాదీయ కింద ఒక సంస్థానంగా ఉండేది, అయితే కోరెషు తిరుగుబాటు చేయడంతో మాదీయ పారసీకలో చేరిపోయి మాదీయ-పారసీక సామ్రాజ్యం ఏర్పడింది. సా.శ.పూ. 539లో నియో-బాబిలోనియన్ సామ్రాజ్యాన్ని జయించింది ఈ సామ్రాజ్యమే. సా.శ. 33 పెంతెకొస్తు రోజున యెరూషలేముకు వచ్చినవాళ్లలో మాదీయులు కూడా ఉన్నారు. (దాని 5:28, 31; అపొ 2:9)—అనుబంధం B9 చూడండి.
-
మానవ కుమారుడు.
సువార్త పుస్తకాల్లో ఈ మాట దాదాపు 80 సార్లు కనిపిస్తుంది. ఇది యేసుక్రీస్తుకు వర్తిస్తుంది. ఆయన కేవలం మానవ శరీరం ధరించిన పరలోక ప్రాణి కాదుగానీ, భౌతిక శరీరంతో పుట్టడం వల్ల మానవుడు అయ్యాడని ఆ మాట చూపిస్తుంది. దానియేలు 7:13, 14లో ఉన్న ప్రవచనాన్ని యేసు నెరవేరుస్తాడని కూడా ఈ మాట సూచిస్తుంది. హీబ్రూ లేఖనాల్లో యెహెజ్కేలును, దానియేలును ఇలా పిలిచారు. వాళ్ల సందేశానికి మూలమైన దేవునికి, మానవమాత్రులైన వీళ్లకు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూపించడానికి అలా పిలిచారు.—యెహె 3:17; దాని 8:17; మత్త 19:28; 20:28.
-
మార్గం.
యెహోవాకు అంగీకారమైన లేదా అంగీకారంకాని పనితీరును, ప్రవర్తనా తీరును సూచించడానికి లేఖనాల్లో ఈ పదం సూచనార్థకంగా ఉపయోగించబడింది. యేసుక్రీస్తు అనుచరులుగా మారిన వాళ్లు ‘ప్రభువు మార్గానికి’ చెందినవాళ్లు అని పిలవబడ్డారు. అంటే, వాళ్లు యేసుక్రీస్తు మీది విశ్వాసమే కేంద్రంగా ఉన్న జీవన విధానాన్ని అనుసరించారని, ఆయన ఆదర్శాన్ని పాటించారని అర్థం.—అపొ 19:9.
-
మాసిదోనియ.
గ్రీసుకు ఉత్తరాన ఉన్న ప్రాంతం. అలెగ్జాండర్ ద గ్రేట్ పరిపాలనలో ఇది ప్రాముఖ్యతను సంపాదించుకొని, రోమన్లు జయించే వరకు స్వతంత్ర ప్రాంతంగా ఉంది. అపొస్తలుడైన పౌలు మొదటిసారి యూరప్‌కు వెళ్లినప్పుడు అది రోమా ప్రాంతంగా ఉంది. పౌలు ఈ ప్రాంతానికి మూడుసార్లు వెళ్లాడు. (అపొ 16:9)—అనుబంధం B13 చూడండి.
-
మాస్కిల్.
13 కీర్తనల పైవిలాసాల్లో కనిపించే హీబ్రూ పదం. దీని అర్థం ఏంటో ఖచ్చితంగా తెలీదు, బహుశా “ధ్యాన కవిత” అనేది దీని అర్థం అయ్యుంటుంది. దీని లాంటి ఇంకొక పదం ఉంది, దాన్ని ‘వివేచనతో సేవించడం’ అని అనువదించారు. ఆ పదం అర్థానికి, ఈ పదం అర్థానికి సంబంధం ఉండొచ్చని కొంతమంది అనుకుంటారు.—2ది 30:22; కీర్త 32:పైవిలాసం.
-
మాహలతు.
-
మిక్తాము.
-
మిడతలు.
పెద్ద దండుగా వలస వెళ్లే ఒక రకమైన గొల్లభామ జాతి పురుగులు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వీటిని తినవచ్చు. దారిలో ఉండే ప్రతీదాన్ని తినేసి, భారీ ఎత్తున నాశనాన్ని కలుగజేసే పెద్ద మిడతల దండును ఒక తెగులుగా పరిగణించేవాళ్లు.—నిర్గ 10:14; మత్త 3:4.
-
మినా.
యెహెజ్కేలు పుస్తకంలో మనె అని కూడా పిలవబడింది. ఇది బరువును, డబ్బును కొలిచే ప్రమాణం. పురావస్తు ఆధారాల ప్రకారం అప్పట్లో ఒక మినా 50 షెకెల్‌లతో సమానం. ఒక షెకెల్ 11.4 గ్రాములు కాబట్టి హీబ్రూ లేఖనాల్లో ఒక మినా అంటే 570 గ్రాములు. మూర విషయంలో ఉన్నట్టే మినా విషయంలో కూడా రాజ మినా ఉండుంటుంది. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, ఒక మినా 100 డ్రక్మాలతో సమానం. దాని బరువు 340 గ్రాములు ఉండేది. 60 మినాలు ఒక తలాంతుతో సమానం. (ఎజ్రా 2:69; లూకా 19:13)—అనుబంధం B14 చూడండి.
-
మిల్కోము.
అమ్మోనీయులు పూజించిన దేవుడు. ఇతను, మోలెకు బహుశా ఒక్కరే అయ్యుండొచ్చు. (1రా 11:5, 7) సొలొమోను తన పరిపాలన చివర్లో ఈ అబద్ధ దేవుని కోసం ఉన్నత స్థలాలు కట్టించాడు.—మోలెకు చూడండి.
-
మిల్లో.
-
ముఖ్య ప్రతినిధి.
గ్రీకులో వాడిన పదానికి “ముఖ్య నాయకుడు” అని అర్థం. పాపం వల్ల వచ్చిన ఘోరమైన పర్యవసానాల నుండి నమ్మకమైన మనుషుల్ని విడిపించడానికి, వాళ్లను శాశ్వత జీవితానికి నడిపించడానికి యేసుక్రీస్తు పోషించిన అతి ముఖ్యమైన పాత్రను అది సూచిస్తోంది.—అపొ 3:15; 5:31; హెబ్రీ 2:10; 12:2.
-
ముఖ్య యాజకుడు.
హీబ్రూ లేఖనాల్లో వాడిన “ప్రధానయాజకుడు” అనే పదానికి ఇది ప్రత్యామ్నాయ పదం. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, “ముఖ్య యాజకులు” అనే మాట యాజకుల్లోని ముఖ్యుల్ని సూచించడానికి వాడివుంటారని స్పష్టమౌతుంది. బహుశా వాళ్లలో ప్రధానయాజకుడి హోదా నుండి తొలగించబడినవాళ్లు, అలాగే 24 యాజకత్వ విభాగాల పెద్దలు కూడా ఉండివుంటారు.—2ది 26:20; ఎజ్రా 7:5; మత్త 2:4; మార్కు 8:31.
-
ముత్లబ్బేను.
ఈ పదం 9వ కీర్తన పైవిలాసంలో కనిపిస్తుంది. కొంతమంది దీన్ని “కుమారుని మరణం గురించి” అని అనువదించారు. ఇది బాగా తెలిసిన ఒక పాట పేరు లేదా దాని ప్రారంభ మాటలు అయ్యుంటాయని, దీన్నిబట్టి ఆ కీర్తన ఎలా పాడాలో తెలుస్తుందని కొందరు అంటారు.
-
ముద్ర.
ఇది యాజమాన్యపు హక్కును, అధికారికతను లేదా ఒప్పందాన్ని చూపించే గుర్తును (సాధారణంగా బంకమట్టి మీద లేదా మైనం మీద) వేయడానికి ఉపయోగించే పరికరం. ప్రాచీన ముద్రల్లో గట్టి పదార్థాల (రాయి, దంతం, లేదా చెక్క) మీద అక్షరాలు గానీ ఆకారాలు గానీ వ్యతిరేక దిశలో చెక్కబడి ఉండేవి. అయితే, అధికారికమైనదని చూపించడానికి గానీ, ఫలానా వాళ్ల సొత్తు అనడానికి గుర్తుగా గానీ, దాచబడిన దాన్ని లేదా రహస్యంగా ఉన్నదాన్ని సూచించడానికి గానీ ముద్ర అనే పదాన్ని అలంకారికంగా ఉపయోగించారు.—నిర్గ 28:11; నెహె 9:38; ప్రక 5:1; 9:4.
-
ముద్ర-ఉంగరం.
-
ముల్లుకర్ర.
పదునైన లోహపు మొన ఉండే ఒక పొడవాటి కర్ర. జంతువుల్ని తోలడానికి రైతులు దీన్ని వాడేవాళ్లు. తెలివిగలవాళ్ల మాటల్ని ముల్లుకర్రతో పోల్చారు. తెలివైన సలహాను పాటించేలా అవతలి వ్యక్తిని ఆ మాటలు కదిలిస్తాయి. రైతు తోలడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ముల్లుకర్రకు ఎదురుతన్నుతూ ఎదురుతిరిగే మొండి ఎద్దు దానికదే హాని చేసుకుంటుంది. “ముల్లుకర్రకు ఎదురుతన్నడం” అనే మాట దాని నుండే వచ్చింది.—అపొ 26:14; న్యా 3:31.
-
మూర.
ఇది రేఖీయ కొలత. సుమారు మోచేతి నుండి మధ్య వేలి కొన వరకు ఉన్న దూరాన్ని మూర అంటారు. ఇశ్రాయేలీయులు సాధారణంగా 44.5 సెంటీమీటర్ల (17.5 అంగుళాల) పొడవు ఉండే మూరను ఉపయోగించేవాళ్లు. వాళ్లు దానికన్నా పెద్ద మూరను కూడా ఉపయోగించేవాళ్లు. అది ఒక బెత్తెడు ఎక్కువ, అంటే దాదాపు 51.8 సెంటీమీటర్ల (20.4 అంగుళాల) పొడవు ఉండేది. (ఆది 6:15; లూకా 12:25, అధస్సూచి)—అనుబంధం B14 చూడండి.
-
మూలరాయి.
భవనంలో రెండు గోడలు కలిసే చోట లేదా మూలన పెట్టే రాయి. ఇది ఆ రెండు గోడల్ని కలిపివుంచడానికి చాలా ప్రాముఖ్యం. ముఖ్యమైన మూలరాయి పునాది మూలరాయి; సాధారణంగా ప్రజా భవనాల్లో, నగర గోడల్లో చాలా బలమైన పునాది మూలరాయి వాడేవాళ్లు. ఈ పదాన్ని భూమికి పునాది వేయడం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు అలంకారికంగా వాడారు. ఆధ్యాత్మిక ఇల్లుతో పోల్చబడిన క్రైస్తవ సంఘానికి యేసు ‘పునాది మూలరాయి’ అని బైబిలు చెప్తుంది.—ఎఫె 2:20; యోబు 38:6.
-
మెరోదకు.
బబులోను నగర ముఖ్య దేవుడు. బబులోను రాజు, శాసనకర్త అయిన హమ్మురాబి బబులోనును బాబిలోనియా రాజధానిగా చేశాక మెరోదకు (లేదా, మార్దుక్) ప్రాముఖ్యత సంతరించుకొని, చివరికి అంతకుముందున్న ఎందరో దేవుళ్ల స్థానంలో, బాబిలోనియా దేవుళ్ల గుంపులో ముఖ్య దేవుడు అయ్యాడు. తర్వాతి కాలాల్లో, మెరోదకు (లేదా, మార్దుక్) అనే పేరుకు బదులు “బెలు” (“యజమాని”) అనే బిరుదు ఉపయోగించడంతో మెరోదకును సాధారణంగా బేలు అని పిలిచారు.—యిర్మీ 50:2.
-
మెస్సీయ.
“అభిషేకించబడిన” లేదా “అభిషేకించబడినవాడు” అనే అర్థమున్న హీబ్రూ పదం నుండి వచ్చింది. దానికి సరిసమానమైన గ్రీకు భాషా పదం నుండి “క్రీస్తు” అనే పదం వచ్చింది.—దాని 9:25; యోహా 1:41.
-
మైలు.
దూరాన్ని కొలవడానికి వాడే కొలత. క్రైస్తవ గ్రీకు లేఖనాల మూలప్రతుల్లో మత్తయి 5:41 లో మాత్రమే ఈ పదం కనిపిస్తుంది. అది బహుశా రోమన్ మైలును సూచిస్తుండవచ్చు. ఆ మైలు 1,479.5 మీటర్లతో (4,854 అడుగులతో) సమానం. అయితే లూకా 24:13, యోహాను 6:19; 11:18 అనే మూడు చోట్ల కనిపించే ‘మైలు,’ మూలప్రతిలోని ప్రాచీన స్టేడియా కొలతను ప్రభుత్వ మైలు కొలతకు మారిస్తే వచ్చింది.—అనుబంధం B14 చూడండి.
-
మొక్కుబడి అర్పణ.
కొన్ని మొక్కుబడులతో పాటు అర్పించే స్వేచ్ఛార్పణ.—లేవీ 23:38; 1స 1:21.
-
మొక్కుబడి.
-
మొలొకు.—
మోలెకు చూడండి.
-
మోలెకు.
అమ్మోనీయుల దేవుడు; మల్కాము, మిల్కోము, మొలొకు అని పిలవబడింది ఇతనే అయ్యుండవచ్చు. ఇది ప్రత్యేకంగా ఒక దేవుని పేరు కాదుగానీ ఒక బిరుదు అయ్యుంటుంది. మోలెకుకు తన పిల్లల్ని బలి ఇచ్చే ఏ వ్యక్తికైనా మరణశిక్ష విధించాలని మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞాపించింది.—లేవీ 20:2; యిర్మీ 32:35; అపొ 7:43.
-
మోషే ధర్మశాస్త్రం.
సా.శ.పూ. 1513లో, సీనాయి ఎడారిలో యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన చట్టం. తరచూ బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాల్ని ధర్మశాస్త్రం అని పిలుస్తారు.—యెహో 23:6; లూకా 24:44.
య
-
యాకోబు.
ఇస్సాకు, రిబ్కాల కుమారుడు. తర్వాతి కాలంలో దేవుడు ఇతనికి ఇశ్రాయేలు అనే పేరు పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలకు (ఇశ్రాయేలీయులు అని కూడా పిలుస్తారు, ఆ తర్వాతి కాలంలో యూదులు అనే పేరు వచ్చింది) ఇతను పూర్వీకుడయ్యాడు. ఇతనికి 12 మంది కుమారులు. వాళ్ల నుండి, వాళ్ల వంశస్థుల నుండి ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా యాకోబు అనే పేరును ఇశ్రాయేలు ప్రజలకు ఉపయోగిస్తూ వచ్చారు.—ఆది 32:28; మత్త 22:32.
-
యాజకుడు.
తాను సేవచేస్తున్న ప్రజలకు దేవుని అధికారిక ప్రతినిధిగా ఉండేవాడు. ఇతను దేవుని గురించి, ఆయన నియమాల గురించి వాళ్లకు ఉపదేశించేవాడు. అంతేకాదు యాజకులు బలులు అర్పిస్తూ, ప్రజలకూ దేవునికీ మధ్యవర్తులుగా ఉంటూ, ప్రజల తరఫున వేడుకుంటూ దేవుని ముందు ప్రజల ప్రతినిధులుగా కూడా ఉండేవాళ్లు. మోషే ధర్మశాస్త్రం స్థాపించబడక ముందు, కుటుంబ పెద్దే తన కుటుంబానికి యాజకుడిగా సేవచేసేవాడు. మోషే ధర్మశాస్త్రం కింద, లేవి గోత్రంవాడైన అహరోను వంశంలోని పురుషులతో యాజకత్వం రూపొందింది. లేవి గోత్రంలోని మిగతా పురుషులందరూ వాళ్లకు సహాయకులుగా ఉండేవాళ్లు. కొత్త ఒప్పందం ప్రారంభమవడంతో, ఆధ్యాత్మిక ఇశ్రాయేలు యాజక బృందంగా తయారయ్యారు, వాళ్ల ప్రధానయాజకుడు యేసుక్రీస్తు.—నిర్గ 28:41; హెబ్రీ 9:24; ప్రక 5:10.
-
యాత్ర కీర్తన.
కీర్తనలు 120-134 పైవిలాసాల్లో కనిపిస్తుంది. ఈ మాట అర్థం గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. అయితే, సంతోషవంతులైన ఇశ్రాయేలు ఆరాధకులు సంవత్సరంలో వచ్చే మూడు పెద్ద పండుగల్ని ఆచరించడానికి యూదా పర్వతాల మీద ఎత్తులో ఉన్న యెరూషలేముకు ఎక్కి వెళ్తున్నప్పుడు ఈ 15 కీర్తనల్ని పాడేవాళ్లని చాలామంది అంటారు.
-
యుద్ధ కవచం.
రక్షణ కోసం సైనికులు ధరించే వాటన్నిటినీ కలిపి యుద్ధ కవచం అంటారు. ఇందులో శిరస్త్రాణం, రొమ్ము -కవచం, దట్టీ, కాళ్ల-తొడుగులు, డాలు ఉండేవి.—1స 31:9; ఎఫె 6:13-17.
-
యూదా.
యాకోబు, లేయాల నాలుగో కుమారుడు. యాకోబు తాను చనిపోయేముందు చెప్పిన ప్రవచనంలో, యూదా వంశం నుండి శాశ్వత కాలం పరిపాలించే ఒక గొప్ప రాజు వస్తాడని అన్నాడు. యేసు మనిషిగా వచ్చినప్పుడు యూదా వంశంలోనే పుట్టాడు. యూదా అనే పేరు ఒక గోత్రాన్ని, అలాగే ఆ తర్వాత యూదా అని పేరుపెట్టబడిన ఒక రాజ్యాన్ని సూచిస్తుంది. ఇది దక్షిణ రాజ్యంగా వర్ణించబడింది, ఇందులో యూదా, బెన్యామీను గోత్రాలవాళ్లు, యాజకులు, లేవీయులు ఉండేవాళ్లు. యెరూషలేము, దానిలోని ఆలయం ఉన్న దక్షిణ ప్రాంతం యూదా కిందికి వచ్చేది.—ఆది 29:35; 49:10; 1రా 4:20; హెబ్రీ 7:14.
-
యూదుడు.
పదిగోత్రాల ఇశ్రాయేలు రాజ్యం పతనమైన తర్వాతి నుండి యూదా గోత్రానికి చెందిన వ్యక్తిని సూచించడానికి ఈ పదం వాడేవాళ్లు. (2రా 16:6) బబులోను చెర నుండి విడుదలైన తర్వాత ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చిన వేర్వేరు గోత్రాల ఇశ్రాయేలీయుల్ని సూచించడానికి ఈ పదాన్ని వాడారు. (ఎజ్రా 4:12) ఆ తర్వాత, ఇశ్రాయేలీయుల్ని ఇతర దేశాల వాళ్ల నుండి వేరు చేసి చెప్పడానికి ప్రపంచమంతటా ఆ పదాన్ని వాడారు. (ఎస్తే 3:6) అంతేకాదు, క్రైస్తవ సంఘంలో ఎవరు ఏ జాతికి చెందినవాళ్లనేది ప్రాముఖ్యంకాదని వివరించడానికి అపొస్తలుడైన పౌలు ఈ పదాన్ని అలంకారికంగా వాడాడు.—రోమా 2:28, 29; గల 3:28.
-
యూఫ్రటీసు.
ఆసియా నైరుతి వైపున ఉన్న అత్యంత పొడవైన, ప్రాముఖ్యమైన నది. అంతేకాదు, మెసొపొతమియలో ఉన్న రెండు ప్రధాన నదుల్లో ఇదొకటి. యూఫ్రటీసు అనే పదం మొట్టమొదటిసారిగా ఆదికాండం 2:14 లో కనిపిస్తుంది; ఏదెనుకు సంబంధించిన నాలుగు నదుల్లో ఇదొకటి. దీన్ని తరచూ “నది” అని మాత్రమే పిలిచేవాళ్లు. (ఆది 31:21) ఇశ్రాయేలీయులకు నియమించబడిన ప్రాంతానికి ఇది ఉత్తర సరిహద్దు. (ఆది 15:18; ప్రక 16:12)—అనుబంధం B2 చూడండి.
-
యెదూతూను.
39వ, 62వ, 77వ కీర్తనల పైవిలాసాల్లో ఈ పదం కనబడుతుంది, దీని అర్థం ఏమిటో ఖచ్చితంగా తెలీదు. ఈ పైవిలాసాలు ఆ కీర్తనను ఏ శైలిలో పాడాలో లేదా దానికి ఏ సంగీత వాయిద్యాన్ని ఉపయోగించాలో సూచిస్తుండవచ్చు. యెదూతూను అనేది లేవీ వంశస్థుడైన ఒక సంగీతకారుని పేరు కూడా, కాబట్టి ఈ శైలి లేదా సంగీత వాయిద్యం అతనికి లేదా అతని కుమారులకు సంబంధించినది అయ్యుండవచ్చు.
-
యెహోవా.
టెట్రగ్రామటన్‌కు (దేవుని పేరును సూచించే నాలుగు హీబ్రూ అక్షరాలు) తెలుగులో సాధారణంగా ఉపయోగించే పదం. ఈ అనువాదంలో ఆ పేరు 7,000 కన్నా ఎక్కువసార్లు కనిపిస్తుంది.—అనుబంధం A4, A5 చూడండి.
ర
-
రథం.
ముఖ్యంగా యుద్ధంలో ఉపయోగించే రెండు చక్రాల గుర్రపు బండి.—నిర్గ 14:23; న్యా 4:13; అపొ 8:28.
-
రాజదండం.
పరిపాలకుడు తన రాజ అధికారానికి గుర్తుగా ఉపయోగించే కర్ర లేదా కడ్డీ.—ఆది 49:10; హెబ్రీ 1:8.
-
రాహాబు.
యోబు, కీర్తనలు, యెషయా పుస్తకాల్లో సూచనార్థకంగా ఉపయోగించిన పదం (యెహోషువ పుస్తకంలోని రాహాబు అనే స్త్రీ కాదు). యోబు పుస్తకంలోని సందర్భాన్ని చూస్తే రాహాబు అంటే భారీ సముద్ర ప్రాణి అని అర్థమౌతుంది; మిగతా సందర్భాల్లో ఈ భారీ సముద్ర ప్రాణిని ఐగుప్తును సూచించడానికి ఉపయోగించారు.—యోబు 9:13; కీర్త 87:4; యెష 30:7; 51:9, 10.
-
రూ-ఆహ్; న్యూమా.
రూ-ఆహ్ హీబ్రూ పదం, న్యూమా దానికి సమానమైన గ్రీకు పదం. చాలా తెలుగు బైబిళ్లలో ఈ పదాలు ఆత్మ అని అనువదించబడ్డాయి. కానీ అలా అనువదించడం సరైనది కాదు. ఎందుకంటే అది అమర్త్యమైన ఆత్మ అనే తప్పుడు సిద్ధాంతానికి మద్దతిస్తుంది. (కీర్త 146:4) రూ-ఆహ్, న్యూమా అనే పదాల ప్రాథమిక అర్థం, “ఊపిరి.” ఆ పదాలకు (1) గాలి, (2) భూమ్మీది ప్రాణుల్లో చురుగ్గా ఉండే జీవశక్తి, (3) ఒక వ్యక్తి అలంకారార్థ హృదయంలో పుట్టి ఫలానా విధంగా మాట్లాడేలా లేదా పనిచేసేలా ప్రేరేపించే శక్తి, (4) అదృశ్య మూలం నుండి వచ్చే ప్రేరేపిత సందేశాలు, (5) పరలోక ప్రాణులు, (6) దేవుని చురుకైన శక్తి లేదా పవిత్రశక్తి అనే అర్థాలు కూడా ఉన్నాయి. (నిర్గ 35:21; కీర్త 104:29; మత్త 12:43; లూకా 11:13) కాబట్టి ఈ అనువాదంలో ఆ పదాలు సందర్భానికి తగినట్టు అనువదించబడ్డాయి.
-
రెల్లు.
చిత్తడి నేలల్లో పెరిగే వేర్వేరు మొక్కల్ని సూచించడానికి ఉపయోగించిన పదం. చాలా సందర్భాల్లో ఇది అరుండో డోనాక్స్ అనే మొక్కను సూచిస్తుంది. (యోబు 8:11; యెష 42:3; మత్త 27:29; ప్రక 11:1) రెల్లు కర్రల్ని కొలకర్రలుగా ఉపయోగించేవాళ్లు.—కొలకర్ర చూడండి.
ల
-
లవంగిపట్ట.
దాల్చినచెక్క చెట్టు జాతికి చెందిన ఒక చెట్టు (సిన్నమోమమ్ కేసియా) నుండి తీసిన బెరడు. దీన్ని పరిమళ ద్రవ్యంగా, పవిత్రమైన అభిషేక తైలంలో ఒక భాగంగా ఉపయోగించేవాళ్లు.—నిర్గ 30:24; కీర్త 45:8; యెహె 27:19.
-
లాగ్.
బైబిల్లోని అతిచిన్న ద్రవ కొలత. యూదుల టాల్‌ముడ్‌లో దీన్ని హిన్‌లో 12వ వంతుగా వర్ణించారు, దాని ఆధారంగా చూస్తే ఇది 0.31 లీటర్లతో సమానం. (లేవీ 14:10, అధస్సూచి)—అనుబంధం B14 చూడండి.
-
లివ్యాతన్.
దీన్ని సాధారణంగా నీళ్లలో ఉన్నట్టు చెప్తారు, కాబట్టి ఇది ఒక రకమైన నీటి ప్రాణి అని తెలుస్తోంది. యోబు 3:8; 41:1 వచనాల్లో ఇది మొసలిని గానీ బలమైన మరో భారీ నీటిప్రాణిని గానీ సూచిస్తుంది. కీర్తన 104:26లో ఉన్నది ఒక రకమైన తిమింగలం అయ్యుంటుంది. మిగతా వచనాల్లో ఇది సూచనార్థకంగా ఉపయోగించబడింది, ఆ వచనాల్లో దీన్ని ఫలానా జంతువు అని చెప్పలేం.—కీర్త 74:14; యెష 27:1.
-
లెక్కలేనితనం.
ఇది అసెల్జీయ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దేవుని నియమాల్ని తీవ్రంగా ఉల్లంఘించే పనులకు, లెక్కలేని స్వభావానికి లేదా తెగింపుతో కూడిన ధిక్కార వైఖరికి సంబంధించిన పదం; అంతేకాదు అధికారం పట్ల, నియమాల పట్ల, ప్రమాణాల పట్ల అగౌరవాన్ని, ఆఖరికి ధిక్కారాన్ని చూపించే స్వభావం. ఇది చిన్నచిన్న తప్పుల్ని సూచించే మాట కాదు.—గల 5:19; 2పే 2:7.
-
లెప్టాన్.
క్రైస్తవ గ్రీకు లేఖనాల కాలంలో, యూదులు వాడిన అతిచిన్న రాగి లేదా కంచు నాణెం. (మార్కు 12:42; లూకా 21:2; అధస్సూచీలు)—అనుబంధం B14 చూడండి.
-
లెబానోను పర్వతశ్రేణి.
లెబానోను పర్వత ప్రాంతంలోని రెండు పర్వత శ్రేణుల్లో ఒకటి. ఇది పడమర వైపు ఉండేది. దానికి ఎదురుగా తూర్పు వైపు అమాన పర్వతశ్రేణి ఉండేది. ఈ రెండిటి మధ్య పొడవైన, సారవంతమైన లోయ ఉంటుంది. లెబానోను పర్వతశ్రేణి దాదాపు మధ్యధరా సముద్ర తీరాన్ని ఆనుకుని మొదలౌతుంది. ఆ పర్వతాలు సగటున 1,800 మీటర్ల నుండి 2,100 మీటర్ల (6,000 అడుగుల నుండి 7,000 అడుగుల) ఎత్తు ఉంటాయి. ప్రాచీన కాలాల్లో, లెబానోను అంతటా పెద్దపెద్ద దేవదారు చెట్లు ఉండేవి, చుట్టుపక్కల దేశాల్లో వాటికి మంచి గిరాకీ ఉండేది. (ద్వితీ 1:7; కీర్త 29:6; 92:12)—అనుబంధం B7 చూడండి.
-
లేఖనం (లేఖనాలు).
దేవుని వాక్యంలోని పవిత్ర రాతలు. ఈ పదాలు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో మాత్రమే కనిపిస్తాయి.—లూకా 24:27; 2తి 3:16.
-
లేవి; లేవీయుడు.
యాకోబు లేయాల మూడో కుమారుడు లేవి. అంతేకాదు, ఒక గోత్రానికి లేవి గోత్రం అని అతని పేరే పెట్టారు. అతని ముగ్గురు కుమారులు లేవీయుల మూడు ప్రధాన విభాగాలకు మూలపురుషులు అయ్యారు. కొన్నిసార్లు, “లేవీయులు” అనే పదం లేవి గోత్రం మొత్తానికి వర్తిస్తుంది కానీ సాధారణంగా, అహరోను యాజక వంశం ఇందులోకి రాదు. వాగ్దాన దేశంలో లేవి గోత్రానికి ప్రత్యేకంగా ఒక భూభాగాన్ని ఇవ్వలేదు కానీ వేరే గోత్రాలకు ఇచ్చిన భూభాగంలోనే 48 నగరాల్ని కేటాయించారు.—ద్వితీ 10:8; 1ది 6:1; హెబ్రీ 7:11.
-
లైంగిక పాపం.
ఇది పోర్నియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దేవుడు నిషేధించిన కొన్ని రకాల లైంగిక చర్యల్ని సూచించడానికి లేఖనాల్లో ఈ పదాన్ని ఉపయోగించారు. వ్యభిచారం, వేశ్యావృత్తి, పెళ్లికానివాళ్ల మధ్య లైంగిక సంబంధాలు, స్వలింగ సంపర్కం, జంతువులతో సంపర్కం వంటివన్నీ దీని కిందికి వస్తాయి. “మహాబబులోను” అనే పేరున్న మతసంబంధమైన వేశ్య అధికారం కోసం, ఆర్థిక లాభాల కోసం ఈ లోక పాలకులతో సంబంధం పెట్టుకోవడాన్ని వర్ణించడానికి, ప్రకటన గ్రంథంలో ఈ పదం సూచనార్థకంగా ఉపయోగించబడింది. (ప్రక 14:8; 17:2; 18:3; మత్త 5:32; అపొ 15:29; గల 5:19)—వేశ్య చూడండి.
వ
-
వక్షపతకం.
ఇశ్రాయేలీయుల ప్రధానయాజకుడు పవిత్ర స్థలంలోకి వెళ్లే ప్రతీసారి తన ఛాతి పైన ధరించే రత్నాలు పొదిగిన సంచి. యెహోవా తీర్పుల్ని తెలియజేయడానికి ఉపయోగించే ఊరీము, తుమ్మీము దానిలో ఉండేవి కాబట్టి దాన్ని “న్యాయనిర్ణయ వక్షపతకం” అని కూడా పిలిచేవాళ్లు. (నిర్గ 28:15-30)—అనుబంధం B5 చూడండి.
-
వడిసెల.
జంతువుల నరాలతో, పొడవాటి గడ్డితో లేదా వెంట్రుకలతో అల్లే పట్టీ లేదా తోలు పట్టీ. విసరాల్సిన దానిని (సాధారణంగా రాయిని) వెడల్పుగా ఉండే మధ్య భాగంలో పెట్టేవాళ్లు. వడిసెల ఒక కొనను చేతికి గానీ మణికట్టుకు గానీ కట్టుకునేవాళ్లు, మరో కొనను చేతిలో పట్టుకుని గిరగిరా తిప్పి వదిలేవాళ్లు, అప్పుడు రాయి దూసుకెళ్లేది. ప్రాచీన దేశాలు వడిసెల విసిరేవాళ్లను తమ సైన్యాల్లో పెట్టుకునేవి.—న్యా 20:16; 1స 17:50.
-
వాగు.
లోయ లేదా నీళ్లు వెళ్లే దారి. వర్షాకాలంలో తప్ప మిగతా రోజుల్లో ఇది ఎండిపోయి ఉంటుంది. ఈ పదం నీటి ప్రవాహాన్ని కూడా సూచిస్తుంది. కొన్ని నీటి ప్రవాహాలు ఊటల్లో నుండి వచ్చేవి, కాబట్టి ఎప్పుడూ పారుతూనే ఉండేవి. దీన్ని కొన్ని చోట్ల “లోయ” అని కూడా అనువదించారు.—ఆది 26:19; సం 34:5; ద్వితీ 8:7; 1రా 18:5; యోబు 6:15.
-
విగ్రహం; విగ్రహపూజ.
నిజమైన లేదా ఊహించుకున్న దేన్నైనా ఒకదాన్ని పూజించడానికి ప్రజలు ఉపయోగించే ఒక ప్రతిమ లేదా రూపమే విగ్రహం. విగ్రహం మీద భక్తి, ప్రేమ చూపించడం, దాన్ని పూజించడం లేదా దానిమీద ఎంతో గౌరవం, అభిమానం కలిగివుండడమే విగ్రహపూజ.—కీర్త 115:4; అపొ 17:16; 1కొ 10:14.
-
విమోచన క్రయధనం.
విమోచనా మూల్యం చూడండి.
-
విమోచనా మూల్యం.
చెర నుండి, శిక్ష నుండి, బాధ నుండి, పాపం నుండి లేదా బాధ్యత నుండి విడిపించడానికి చెల్లించే వెల. ఇది అన్నివేళలా డబ్బే కానవసరం లేదు. (యెష 43:3) రకరకాల పరిస్థితుల్లో విమోచనా మూల్యం చెల్లించాల్సి వచ్చేది. ఉదాహరణకు, ఇశ్రాయేలులో మొదట పుట్టిన మగపిల్లలు యెహోవాకు చెందుతారు, అలాగే మొదట పుట్టిన మగ జంతువులు కూడా ఆయనకే చెందుతాయి. యెహోవా సేవలో మాత్రమే ఉపయోగించాల్సిన ఆ వ్యక్తుల్ని లేదా ఆ జంతువుల్ని విడిపించడానికి విమోచనా మూల్యం చెల్లించాల్సి ఉండేది. (సం 3:45, 46; 18:15, 16) ఒకవేళ కట్టేయని ప్రమాదకరమైన ఎద్దు ఎవరినైనా చంపితే, మోషే ధర్మశాస్త్రం విధించిన మరణశిక్ష నుండి ఆ ఎద్దు యజమాని తనను తాను విడిపించుకోవడానికి విమోచన వెల చెల్లించాల్సి ఉండేది. (నిర్గ 21:29, 30) అయితే కావాలని హత్య చేసిన వ్యక్తి నుండి ఎలాంటి విమోచనా మూల్యం అంగీకరించబడేది కాదు. (సం 35:31) అన్నిటికన్నా ప్రాముఖ్యంగా, విధేయులైన మనుషుల్ని పాపం నుండి, మరణం నుండి విడిపించడానికి త్యాగపూరితంగా మరణించి క్రీస్తు చెల్లించిన విమోచన క్రయధనం లేదా విమోచనా మూల్యం గురించి బైబిలు నొక్కిచెప్తుంది.—కీర్త 49:7, 8; మత్త 20:28; ఎఫె 1:7.
-
విశ్రాంతి రోజు/సబ్బాతు.
“విశ్రమించడం; పని ఆపేయడం” అనే అర్థమున్న హీబ్రూ పదం నుండి వచ్చింది. ఇది యూదుల వారంలో ఏడో రోజు (శుక్రవారం సూర్యాస్తమయం నుండి శనివారం సూర్యాస్తమయం వరకు). సంవత్సరంలో జరుపుకునే కొన్ని పండుగ రోజుల్ని కూడా విశ్రాంతి రోజులని అనేవాళ్లు; అలాగే 7వ, 50వ సంవత్సరాల్ని విశ్రాంతి సంవత్సరాలు అని అనేవాళ్లు. ఆలయంలో చేసే యాజక సేవ తప్ప విశ్రాంతి రోజున ఇంకే పనీ చేయడానికి అనుమతి లేదు. విశ్రాంతి సంవత్సరాల్లో, నేలను సేద్యం చేయకుండా వదిలేయాలి. ఆ సంవత్సరంలో అప్పులు తీర్చమని తోటి హెబ్రీయుల్ని ఒత్తిడి చేసేవాళ్లు కాదు. మోషే ధర్మశాస్త్రంలో, విశ్రాంతి రోజుకు సంబంధించిన నియమాలు ప్రజలు పాటించగలిగేలా ఉండేవి. కానీ మతనాయకులు మెల్లమెల్లగా కొత్తకొత్త నియమాలు చేర్చుకుంటూ వెళ్లడం వల్ల, యేసు కాలానికల్లా అవి ప్రజలు పాటించలేనంత కష్టంగా తయారయ్యాయి.—నిర్గ 20:8; లేవీ 25:4; లూకా 13:14-16; కొలొ 2:16.
-
విశ్వసనీయ ప్రేమ.
ఎక్కువగా కెసెద్ అనే హీబ్రూ పదాన్ని ఇలా అనువదించారు. నిబద్ధత, యథార్థత, విశ్వసనీయత, ప్రగాఢ అనుబంధం అనేవాటి వల్ల పుట్టే ప్రేమను సూచించడానికి దీన్ని ఉపయోగించారు. ఇది సాధారణంగా దేవునికి మనుషుల మీద ఉన్న ప్రేమను సూచిస్తుంది, అయితే మనుషుల మధ్య కూడా ఈ ప్రేమ ఉంటుంది.—నిర్గ 34:6; రూతు 3:10.
-
వేకువ చుక్క.
సూర్యుడు కనిపించే ముందు ఆకాశంలో (భూమ్యాకాశాలు కలిసినట్టుండే చోట) తూర్పు దిక్కున ఉదయించే చివరి నక్షత్రం. అలా అది ఒక కొత్త రోజు ప్రారంభాన్ని చాటుతుంది.—ప్రక 22:16; 2పే 1:19.
-
వేశ్య.
వివాహ బంధం అనేది లేకుండా, ముఖ్యంగా డబ్బు కోసం లైంగిక సంబంధాలు పెట్టుకునే వ్యక్తి. (“వేశ్య” అని అనువదించబడిన గ్రీకు పదం పోర్ని, “అమ్మడానికి” అనే అర్థమున్న మూలపదం నుండి వచ్చింది.) బైబిల్లో మగవేశ్యల లేదా పురుషగాముల గురించిన ప్రస్తావన కూడా ఉన్నప్పటికీ, ఈ పదం సాధారణంగా స్త్రీలను సూచిస్తుంది. మోషే ధర్మశాస్త్రం వేశ్యావృత్తిని ఖండించింది. అంతేకాదు, రాబడి కోసం ఆలయ వేశ్యల్ని ఉపయోగించే అన్యుల ఆచారానికి భిన్నంగా, పడుపుసొమ్మును యెహోవా ఆలయంలో చందా వేయడం అనుమతించబడలేదు. (ద్వితీ 23:17, 18; 1రా 14:24) దేవుని ఆరాధకులమని చెప్పుకుంటూ ఏదో ఒక విధమైన విగ్రహపూజలో పాల్గొనే ప్రజల్ని, దేశాల్ని లేదా సంస్థల్ని సూచించడానికి బైబిలు ఈ పదాన్ని అలంకారికంగా కూడా వాడుతుంది. ఉదాహరణకు, “మహాబబులోను” అని పిలవబడే మత వ్యవస్థను ప్రకటన గ్రంథం వేశ్య అని వర్ణిస్తోంది. ఎందుకంటే ఆమె అధికారం కోసం, డబ్బు కోసం ఈ ప్రపంచ పరిపాలకులతో సంబంధం పెట్టుకుంది.—ప్రక 17:1-5; 18:3; 1ది 5:25.
-
వ్యభిచారం.
పెళ్లయిన పురుషుడు లేదా స్త్రీ తన వివాహ భాగస్వామి కాని వ్యక్తితో ఇష్టపూర్వకంగా పెట్టుకునే లైంగిక సంబంధం.—నిర్గ 20:14; మత్త 5:27; 19:9.
-
వ్యవస్థ(లు).
ఎయాన్ అనే గ్రీకు పదం ఒకానొక కాలాన్ని, శకాన్ని లేదా యుగాన్ని ప్రత్యేకంగా గుర్తుపట్టేలా చేసే అప్పటి వ్యవహారాల స్థితిని లేదా అంశాల్ని సూచిస్తున్నప్పుడు దాన్ని వ్యవస్థ అని అనువదించారు. బైబిలు “ఈ వ్యవస్థ” అనే మాటను ఉపయోగించినప్పుడు, అది సాధారణంగా లోకంలో ఉన్న వ్యవహారాల స్థితిని, లోకసంబంధమైన జీవన విధానాన్ని సూచిస్తుంది. (2తి 4:10) ధర్మశాస్త్ర ఒప్పందం ద్వారా దేవుడు ఒక వ్యవస్థను ప్రారంభించాడు. కొంతమంది దాన్ని ఇశ్రాయేలీయుల లేదా యూదుల శకం అని అంటారు. విమోచన క్రయధనం ద్వారా, యేసుక్రీస్తును ఉపయోగించుకొని దేవుడు ఇంకో వ్యవస్థను ప్రారంభించాడు. అందులో ముఖ్యంగా అభిషిక్త క్రైస్తవుల సంఘం ఉంది. దాంతో ఒక కొత్త శకం, అంటే ధర్మశాస్త్ర ఒప్పందంలో ముందుగా ఏవైతే సూచించబడ్డాయో వాటి నెరవేర్పులతో గుర్తించబడిన శకం ఆరంభమైంది. వ్యవస్థ అనే పదాన్ని బహువచనంలో ఉపయోగించినప్పుడు, అది అంతకుముందున్న లేదా భవిష్యత్తులో ఉండబోయే వేర్వేరు వ్యవస్థల్ని లేదా అప్పటి వ్యవహారాల స్థితుల్ని సూచిస్తుంది.—మత్త 24:3; మార్కు 4:19; రోమా 12:2; 1కొ 10:11.
శ
-
శపించడం.
ఎవరికైనా, దేనికైనా కీడు జరుగుతుందని బెదిరించడం లేదా ప్రకటించడం. బూతులు లేదా విపరీతమైన కోపం ఆది 12:3; సం 22:12; గల 3:10.
దీని కిందికి రావు. తరచూ, శపించడం అంటే ఒక తీర్పును అధికారికంగా ప్రకటించడం లేదా కీడు జరుగుతుందని ప్రవచించడం. అయితే దేవుడు, లేదా అధికారం ఇవ్వబడిన ఒక వ్యక్తి శపించినప్పుడు ఆ శాపానికి ప్రవచనాత్మక విలువ ఉంటుంది, ఆ శాపం శక్తివంతంగా ఉంటుంది.— -
శాస్త్రి.
హీబ్రూ లేఖనాల్ని నకలు రాసే వ్యక్తి. యేసు భూమ్మీదికి వచ్చే సమయానికి, ధర్మశాస్త్రంలో ఆరితేరిన పురుషుల వర్గానికి ఈ పేరు వచ్చింది. వీళ్లు యేసును వ్యతిరేకించారు.—ఎజ్రా 7:6; మార్కు 12:38, 39; 14:1.
-
శీర్షం.
అలంకారం కోసం స్తంభాల పైన ఉన్న ఒక భాగం. సొలొమోను నిర్మించిన ఆలయంలో యాకీను, బోయజు అనే రెండు స్తంభాల మీద ఈ భారీ శీర్షాలు ఉండేవి. (1రా 7:16)—అనుబంధం B8 చూడండి.
-
శుద్ధమైన.
బైబిలు వాడుకలో, ఈ పదం భౌతిక పరిశుభ్రతను మాత్రమే సూచించట్లేదు; ఇది కళంకం లేకుండా, మచ్చ లేకుండా ఉండడాన్ని, లేదా ఆ స్థితికి తిరిగి రావడాన్ని కూడా సూచిస్తుంది. అంతేకాదు, నైతికంగా లేదా ఆధ్యాత్మికంగా మలినపర్చే, పాడుచేసే లేదా కళంకపర్చే దేనికైనా దూరంగా ఉండడాన్ని కూడా సూచిస్తుంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ పదాన్ని ఆచారబద్ధంగా శుద్ధి చేసుకోవడానికి సంబంధించి ఉపయోగించారు.—లేవీ 10:10; కీర్త 51:7; మత్త 8:2; 1కొ 6:11.
-
శెబాటు.
బబులోను చెర తర్వాత, యూదుల పవిత్ర క్యాలెండరులో 11వ నెల, వ్యవసాయ క్యాలెండరులో 5వ నెల. మన క్యాలెండరులో ఇది జనవరి మధ్య నుండి ఫిబ్రవరి మధ్య వరకు ఉంటుంది. (జెక 1:7)—అనుబంధం B15 చూడండి.
-
శోకగీతం.
స్నేహితుడు గానీ బాగా కావాల్సిన వ్యక్తి గానీ చనిపోయినప్పుడు కలిగే బాధ లాంటి తీవ్రమైన దుఃఖాన్ని తెలియజేసే కవిత లేదా పాట; దీన్నే విలాపగీతం అని కూడా అంటారు.—2స 1:17; కీర్త 7:పైవిలాసం.
ష
-
షియోల్.
“హేడిస్” అనే గ్రీకు పదానికి సమానమైన హీబ్రూ పదం. దీన్ని “సమాధి” అని అనువదించారు. అన్ని పనులు, స్పృహ ఆగిపోయే సూచనార్థక చోటును లేదా స్థితిని ఇది సూచిస్తుంది.—ఆది 37:35; కీర్త 16:10; అపొ 2:31 (అధస్సూచీలు).
-
షెకెల్.
బరువును, డబ్బును కొలవడానికి ఉపయోగించే ప్రాథమిక హీబ్రూ కొలమానం. ఇది 11.4 గ్రాములతో సమానం. “పవిత్ర స్థల షెకెల్” అనే మాటను, బరువు ఖచ్చితంగా ఉండాలని లేదా అది గుడారంలోని ప్రామాణిక తూకంరాయి ప్రకారం ఉండాలని నొక్కిచెప్పడానికి ఉపయోగించి ఉండవచ్చు. బహుశా సామాన్య షెకెల్ కాని “రాజ” షెకెల్ లేదా రాజభవనంలోని ప్రామాణిక తూకంరాయి అనేది కూడా ఒకటి ఉండుంటుంది.—నిర్గ 30:13.
-
షెమినీతు.
ఇది సంగీతానికి సంబంధించిన పదం. దీనికి అక్షరార్థంగా “ఎనిమిదవ” అని అర్థం. ఇది తక్కువ స్వరస్థాయిని సూచిస్తుండవచ్చు. సంగీత పరికరాల విషయానికొస్తే, ఈ పదం సంగీత శ్రేణిలో తక్కువస్థాయి శబ్దాల్ని సూచిస్తుండవచ్చు. పాటల విషయానికొస్తే, సంగీతాన్ని తక్కువ స్థాయిలో వాయించాలని, పాటలు కూడా దానికి తగినట్టు పాడాలని ఈ పదం సూచిస్తుండవచ్చు.—1ది 15:21; కీర్త 6:పైవిలాసం; 12:పైవిలాసం.
స
-
సంగీత నిర్దేశకుడు.
కీర్తనల్లో ఉపయోగించినదాన్ని బట్టి, దీని హీబ్రూ పదం పాటల్ని కూర్చి, అవి ఎలా పాడాలో నిర్దేశించి, లేవీ గాయకులతో వాటిని అభ్యాసం చేయించి, శిక్షణనిచ్చే వ్యక్తిని సూచిస్తుండవచ్చు. అంతేకాదు ముఖ్యమైన సందర్భాల్లో అతను సంగీతానికి నాయకత్వం వహించేవాడు. వేరే అనువాదాలు ఈ పదాన్ని “గాయకుల నాయకుడు,” లేదా “సంగీత నాయకుడు” అని అనువదించాయి.—కీర్త 4:పైవిలాసం; 5:పైవిలాసం.
-
సంఘ పరిచారకుడు.
గ్రీకు పదమైన డయాకొనొస్ నుండి వచ్చింది. ఇది తరచూ “పరిచారకుడు” లేదా “సేవకుడు” అని అనువదించబడింది. సంఘంలో పెద్దల సభకు సహాయకునిగా పనిచేసే వ్యక్తిని “సంఘ పరిచారకుడు” అంటారు. ఒక వ్యక్తి ఈ సేవావకాశానికి అర్హుడవ్వాలంటే అతను బైబిల్లో ఉన్న ప్రమాణాల్ని చేరుకోవాలి.—1తి 3:8-10, 12.
-
సత్యదేవుడు.
హా-ఎలోహిమ్, హా-ఎల్ అనే రెండు హీబ్రూ మాటల్ని “సత్యదేవుడు” అని అనువదించారు. చాలా చోట్ల, ఈ హీబ్రూ మాటలు అబద్ధ దేవతల నుండి ఒకేఒక్క సత్యదేవుడైన యెహోవాను వేరుచేసి చూపిస్తాయి. అలాంటి చోట్ల “సత్య దేవుడు” అనే మాట హీబ్రూలోని పూర్తి అర్థాన్ని తెలియజేస్తుంది.—ఆది 5:22, 24; 46:3; ద్వితీ 4:39.
-
సద్దూకయ్యులు.
యూదా మతానికి చెందిన ఒక ప్రముఖ తెగ. సమాజంలో పలుకుబడి, హోదా ఉన్న ధనికులు, యాజకులు ఈ తెగలో ఉండేవాళ్లు. ఆలయంలో జరిగే కార్యకలాపాల మీద వీళ్లు చాలా అధికారం చెలాయించేవాళ్లు. పరిసయ్యులు ఆచరించే అనేక మౌఖిక సంప్రదాయాల్ని, పరిసయ్యుల నమ్మకాల్ని వీళ్లు తిరస్కరించారు. పునరుత్థానాన్ని గానీ దేవదూతలు ఉన్నారని గానీ వీళ్లు నమ్మేవాళ్లు కాదు. వీళ్లు యేసును వ్యతిరేకించారు.—మత్త 16:1; అపొ 23:8.
-
సన్నిధి రొట్టెలు.—
సముఖపు రొట్టెలు చూడండి.
-
సమరయ.
పదిగోత్రాల ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుకు దాదాపు 200 సంవత్సరాల పాటు రాజధానిగా ఉంది; అలాగే, ఆ రాజ్యం మొత్తానికి కూడా అదే పేరు ఉంది. సమరయ అనే పేరున్న కొండ మీదే ఆ నగరం కట్టబడింది. యేసు కాలంలో సమరయ అనేది ఒక జిల్లా, దీనికి ఉత్తరాన గలిలయ, దక్షిణాన యూదయ ఉండేది. సాధారణంగా యేసు ప్రకటించడానికి ఈ ప్రాంతానికి వెళ్లలేదు కానీ, కొన్నిసార్లు ఆ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నప్పుడు అక్కడి వాళ్లతో మాట్లాడాడు. సమరయులు పవిత్రశక్తిని పొందిన సందర్భంలో రాజ్యానికి సంబంధించిన రెండో అలంకారిక తాళపుచెవిని పేతురు ఉపయోగించాడు. (1రా 16:24; యోహా 4:7; అపొ 8:14)—అనుబంధం B10 చూడండి.
-
సమరయులు.
మొదట్లో, ఈ పదాన్ని పదిగోత్రాల ఉత్తర రాజ్యంలోని ఇశ్రాయేలీయుల్ని సూచించడానికి ఉపయోగించేవాళ్లు. కానీ సా.శ.పూ. 740లో అష్షూరీయులు సమరయను జయించిన తర్వాత ఈ ప్రాంతంలోకి పరదేశుల్ని తీసుకొచ్చారు. దానివల్ల, కేవలం ఇశ్రాయేలీయుల్నే కాకుండా ఇశ్రాయేలీయుల్ని, ఈ పరదేశుల్ని కలిపి సమరయులు అని పిలవడం మొదలైంది. అయితే యేసు కాలంలో, జాతిపరమైన, రాజకీయపరమైన విషయాల్ని బట్టి కాకుండా ప్రాచీన షెకెము, సమరయ పరిసర ప్రాంతాల్లో ఉన్న మత తెగలోని సభ్యుల్ని సూచించడానికే ఎక్కువగా ఈ పదాన్ని వాడేవాళ్లు. యూదా మత నమ్మకాలకు పూర్తి భిన్నమైన కొన్ని నమ్మకాలు వాళ్లకు ఉండేవి.—యోహా 8:48.
-
సమర్పణ పండుగ.
ఆంటియోకస్ ఎపిఫనెస్ అనే వ్యక్తి ఆలయాన్ని మలినం చేసిన తర్వాత జరిగిన ఆలయ శుద్ధీకరణను గుర్తుచేసుకోవడానికి ప్రతీ సంవత్సరం ఈ పండుగ జరుపుకునేవాళ్లు. ఈ పండుగ కిస్లేవు నెల 25న మొదలై ఎనిమిది రోజుల పాటు జరిగేది.—యోహా 10:22.
-
సమర్పణకు గుర్తుగా ఉన్న పవిత్రమైన రేకు.
స్వచ్ఛమైన బంగారంతో చేసిన మెరిసే రేకు. దానిపైన “పవిత్రత యెహోవాకు చెందుతుంది” అనే మాట హీబ్రూలో చెక్కి ఉంటుంది. దీన్ని ప్రధానయాజకుని తలపాగా ముందు భాగంలో పెట్టేవాళ్లు. (నిర్గ 39:30)—అనుబంధం B5 చూడండి.
-
సమాజం/సంఘం.
-
సమాజమందిరం.
ఈ మాటకు “సమకూర్చడం, సమావేశం” అని అర్థం. కానీ చాలా లేఖనాల్లో, యూదులు లేఖనాలు చదవడానికి, ఉపదేశం పొందడానికి, ప్రకటించడానికి, ప్రార్థించడానికి సమావేశమైన కట్టడాన్ని లేదా స్థలాన్ని సూచించడానికి ఈ పదాన్ని వాడారు. యేసు రోజుల్లో, కాస్త పెద్దగా ఉన్న ప్రతీ ఇశ్రాయేలు పట్టణంలో ఒక సమాజమందిరం ఉండేది. అదే పెద్దపెద్ద నగరాల్లో అయితే ఒకటి కన్నా ఎక్కువ సమాజమందిరాలు ఉండేవి.—లూకా 4:16; అపొ 13:14, 15.
-
సమాధానబలి.
యెహోవాతో శాంతియుత సంబంధాన్ని కోరుతూ అర్పించే బలి. బలి ఇచ్చే వ్యక్తి, అతని ఇంటివాళ్లు, బలి అర్పిస్తున్న యాజకుడు, సేవచేస్తున్న ఇతర యాజకులు అంతా దాన్ని తినేవాళ్లు. బలి జంతువు కొవ్వును కాలిస్తే వచ్చే పొగ యెహోవాను సంతోషపెట్టేది, ఆ బలిని ఆయన అంగీకరించేవాడు. ప్రాణాన్ని సూచించే రక్తాన్ని కూడా ఆయనకు అర్పించేవాళ్లు. ఒకరకంగా ఆ యాజకులు, ఆరాధకులు యెహోవాతో కలిసి భోజనం చేసినట్టు ఉండేది, అది శాంతియుత సంబంధానికి గుర్తుగా ఉండేది.—లేవీ 7:29, 32; ద్వితీ 27:7.
-
సమాధి.
ఇది ఒక వ్యక్తి సమాధిని గానీ, మానవజాతి సాధారణ సమాధిని గానీ సూచించడానికి ఉపయోగించిన పదం. దీనికి హీబ్రూ భాషలో “షియోల్” అనే పదాన్ని, గ్రీకు భాషలో “హేడిస్” అనే పదాన్ని ఉపయోగించారు. అన్ని పనులు, స్పృహ ఆగిపోయే సూచనార్థక చోటు లేదా స్థితి అని బైబిలు దీన్ని వర్ణిస్తోంది.—ఆది 47:30; ప్రస 9:10; అపొ 2:31.
-
సమావేశం.
ముందే అనుకుని కలుసుకున్న ప్రజల గుంపును సమావేశం లేదా సమాజం అని పిలిచేవాళ్లు. హీబ్రూ లేఖనాల్లో ఈ పదాల్ని ఎక్కువగా మతపరమైన పండుగల సమయంలో, దేశమంతటికీ సంబంధించిన ముఖ్యమైన సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలు సమకూడడాన్ని సూచించడానికి ఉపయోగించారు.—ద్వితీ 16:8; 1రా 8:5.
-
సముఖపు రొట్టెలు.
గుడారంలోని, ఆ తర్వాత ఆలయంలోని పవిత్ర స్థలంలో ఉన్న బల్ల మీద ఒక్కొక్క వరుసలో ఆరు చొప్పున రెండు వరుసల్లో పెట్టే పన్నెండు రొట్టెలు. వీటిని “సన్నిధి రొట్టెలు” అని కూడా అంటారు. దేవునికి అర్పించే ఈ రొట్టెలను ప్రతీ విశ్రాంతి రోజున తీసేసి కొత్త రొట్టెలు పెట్టేవాళ్లు. తీసేసిన రొట్టెల్ని సాధారణంగా యాజకులు మాత్రమే తినేవాళ్లు. (2ది 2:4; మత్త 12:4; నిర్గ 25:30; లేవీ 24:5-9; హెబ్రీ 9:2)—అనుబంధం B5 చూడండి.
-
సాంబ్రాణి.
బోస్వెల్లియ జాతికి చెందిన కొన్నిరకాల చెట్ల నుండి, పొదల నుండి సేకరించే ఎండు జిగురు. దాన్ని కాల్చినప్పుడు సుగంధ పరిమళాలు వెదజల్లేది. గుడారంలో, ఆలయంలో వేసే పవిత్రమైన ధూపంలో అది కూడా ఉండేది. ధాన్యార్పణల్లో అది ఉండేది; అలాగే పవిత్ర స్థలం లోపలున్న సముఖపు రొట్టెల ప్రతీ వరుస మీద కూడా దాన్ని ఉంచేవాళ్లు.—నిర్గ 30:34-36; లేవీ 2:1; 24:7; మత్త 2:11.
-
సాతాను.
ఈ పదం “ఎదిరించేవాడు” లేదా “వ్యతిరేకించేవాడు” అనే అర్థం ఉన్న హీబ్రూ పదం నుండి వచ్చింది. ఇతను దేవుని ముఖ్య వ్యతిరేకి. ఇతనికి అపవాది అనే పేరు కూడా ఉంది.—యోబు 1:6; మత్త 4:10; ప్రక 12:9.
-
సామెత.
కేవలం కొన్ని మాటల్లో ఒక పాఠాన్ని నేర్పించే లేదా లోతైన సత్యాన్ని తెలియజేసే జ్ఞానవాక్కు లేదా చిన్న కథ. కొన్నిసార్లు బైబిలు సామెతలు చిక్కు ప్రశ్నల రూపంలోనో, పొడుపుకథల రూపంలోనో ఉండవచ్చు. సామెత ఒక సత్యాన్ని వర్ణనాత్మక శైలిలో వివరిస్తుంది, తరచూ అలంకారిక భాషలో వివరిస్తుంది. కొంతమందిని ఎగతాళి చేయడానికి లేదా వాళ్లపట్ల తిరస్కారాన్ని వ్యక్తం చేయడానికి కూడా కొన్ని సామెతల్ని వాడుతుంటారు.—ప్రస 12:9; 2పే 2:22.
-
సిద్ధపడే రోజు.
విశ్రాంతి రోజుకు ముందురోజు. ఆ రోజున యూదులు విశ్రాంతి రోజు కోసం కావాల్సిన ఏర్పాట్లు చేసుకునేవాళ్లు. ఇప్పటి లెక్కలో చెప్పాలంటే, సిద్ధపడే రోజు శుక్రవారం సూర్యాస్తమయంతో ముగుస్తుంది, ఆ తర్వాత విశ్రాంతి రోజు మొదలౌతుంది. యూదులు ఒక సాయంత్రం నుండి మరుసటి సాయంత్రం వరకు ఒక రోజుగా పరిగణించేవాళ్లు.—మార్కు 15:42; లూకా 23:54.
-
సిరియా; సిరియన్లు.—
అరాము; అరామీయులు చూడండి.
-
సీయ.
ఘన కొలత. బాత్ అనే ద్రవ కొలత ఆధారంగా చూస్తే ఇది 7.33 లీటర్లతో సమానం. (2రా 7:1)—అనుబంధం B14 చూడండి.
-
సీయోను; సీయోను పర్వతం.
ఇది యెబూసీయులకు చెందిన, యెబూసు అనే పేరున్న కోటగల నగరం. ఇది యెరూషలేముకు ఆగ్నేయ దిశలో ఉన్న కొండ పైన ఉండేది. దావీదు దాన్ని ఆక్రమించుకున్నాక, తన రాజ భవనాన్ని అక్కడ కట్టుకున్నాడు. దాంతో ఆ నగరాన్ని “దావీదు నగరం” అని పిలవడం మొదలుపెట్టారు. (2స 5:7, 9) దావీదు యెహోవా మందసాన్ని అక్కడికి మార్చినప్పుడు సీయోను యెహోవాకు ఎంతో పవిత్రమైన పర్వతం అయింది. తర్వాత, మోరీయా పర్వతం మీదున్న ఆలయ ప్రాంతాన్ని, అలాగే కొన్నిసార్లు మొత్తం యెరూషలేము నగరాన్ని ఆ పేరుతో పిలిచేవాళ్లు. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో దాన్ని తరచూ అలంకార భావంలో ఉపయోగించారు.—కీర్త 2:6; 1పే 2:6; ప్రక 14:1.
-
సీవాను.
బబులోను చెర తర్వాత, యూదుల పవిత్ర క్యాలెండరులో మూడో నెల, వ్యవసాయ క్యాలెండరులో తొమ్మిదో నెల. ఇది మన క్యాలెండరులో మే మధ్య నుండి జూన్ మధ్య వరకు ఉంటుంది. (ఎస్తే 8:9)—అనుబంధం B15 చూడండి.
-
సునాద సంవత్సరం.
ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టినప్పటి నుండి ప్రతీ 50వ సంవత్సరం. సునాద సంవత్సరంలో నేలను సాగుచేయకూడదు, హెబ్రీయులైన దాసుల్ని స్వతంత్రుల్ని చేయాలి. అమ్ముకున్న వారసత్వ భూములు తిరిగొచ్చేవి. ఒకవిధంగా అది పండుగ సంవత్సరంలా, విడుదల సంవత్సరంలా ఉండేది, దేవుడు ఇశ్రాయేలు జనాన్ని మొట్టమొదటిగా స్థాపించినప్పుడు ఉన్న స్థితికి తిరిగి తీసుకొచ్చేది.—లేవీ 25:10.
-
సున్నతి.
పురుషాంగానికి ముందు ఉండే తోలును తీసేయడం. అబ్రాహాము, అతని వంశస్థులు ఖచ్చితంగా సున్నతి చేసుకోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే, క్రైస్తవులు సున్నతి చేసుకోవాల్సిన అవసరం లేదు. వేర్వేరు సందర్భాల్లో ఆ పదం అలంకారికంగా కూడా ఉపయోగించబడింది.—ఆది 17:10; 1కొ 7:19; ఫిలి 3:3.
-
సులిమాని రాయి.
మధ్యమధ్యలో తెల్లని పొరలు కలిగి రకరకాల రంగుల్లో (నలుపు, గోధుమ, ఎరుపు, బూడిద, ఆకుపచ్చ) ఉండే విలువైన రాయి. దీన్ని ప్రధానయాజకుని ప్రత్యేక వస్త్రాల్లో ఉపయోగించారు.—నిర్గ 28:9, 12; 1ది 29:2; యోబు 28:16.
-
సూచన.
ప్రస్తుతం లేదా భవిష్యత్తులో జరిగే ఒకదాన్ని సూచించగల వస్తువు, పని, పరిస్థితి, లేదా అసాధారణ ప్రదర్శన.—ఆది 9:12, 13, అధస్సూచి; 2రా 20:9; మత్త 24:3; ప్రక 1:1.
-
సూర్తిసు.
ఉత్తర ఆఫ్రికాలోని ఆధునిక ట్యునీషియా, లిబియా తీరంలో లోతు తక్కువగా ఉండే రెండు పెద్ద సింధుశాఖలు. అలల ఆటుపోట్ల వల్ల అక్కడున్న ఇసుక తీరాలు తరచూ స్థానం మారుతూ ప్రమాదకరంగా ఉండేవి కాబట్టి ప్రాచీన నావికులు వాటికి భయపడేవాళ్లు. (అపొ 27:17)—అనుబంధం B13 చూడండి.
-
సెరాపులు.
-
సెలా.
సంగీతానికి లేదా వల్లించడానికి సంబంధించిన పదం. కీర్తనలు, హబక్కూకు పుస్తకాల్లో కనిపిస్తుంది. ఇది పాడుతున్నప్పుడు గానీ సంగీతంలో గానీ లేదా రెండిట్లో గానీ ఇచ్చే విరామం కావచ్చు. నిశ్శబ్దంగా ధ్యానించడానికి లేదా అప్పుడే వ్యక్తం చేసిన భావాన్ని ముఖ్యమైనదిగా చూపించడానికి అలా విరామం ఇచ్చేవాళ్లు. గ్రీకు సెప్టువజింటులో దీన్ని డయాసమా అని అనువదించారు, దానికి “సంగీత విరామం” అనే అర్థం ఉంది.—కీర్త 3:4; హబ 3:3.
-
సొలొమోను మంటపం.
యేసు కాలంలోని ఆలయంలో బయటి ప్రాంగణానికి తూర్పున, పైకప్పు ఉన్న దారి. ఇది సొలొమోను కట్టించిన ఆలయంలోని అవశేషమని చాలామంది నమ్మేవాళ్లు. ‘చలికాలంలో’ యేసు అక్కడ నడిచాడు. తొలి క్రైస్తవులు ఆరాధన కోసం అక్కడ కలుసుకునేవాళ్లు. (యోహా 10:22, 23; అపొ 5:12)—అనుబంధం B11 చూడండి.
-
స్తంభం.
చారిత్రక సంఘటనల్ని, పనుల్ని గుర్తు చేసుకోవడానికి కొన్నిసార్లు స్తంభాల్ని పాతేవాళ్లు. సొలొమోను కట్టించిన ఆలయంలో, రాజ భవనాల్లో స్తంభాలు వాడారు. అన్యులు అబద్ధ ఆరాధనలో భాగంగా పవిత్ర స్తంభాలు పాతేవాళ్లు, కొన్నిసార్లు ఇశ్రాయేలీయులు కూడా ఈ ఆచారాన్ని పాటించారు. (న్యా 16:29; 1రా 7:21; 14:23)—శీర్షం చూడండి.
-
స్తోయికుల తత్త్వవేత్తలు.
తర్కానికి, ప్రకృతికి అనుగుణంగా జీవించడమే సంతోషం అని నమ్మే ఒకానొక గ్రీకు పాఠశాల తత్త్వవేత్తలు. వాళ్ల అంచనా ప్రకారం నొప్పికి, సుఖానికి స్పందించనివాడే నిజంగా తెలివైన వ్యక్తి.—అపొ 17:18.
-
స్థానిక అధిపతి.
-
స్మారక సమాధి.
చనిపోయిన వ్యక్తి శవాన్ని పెట్టే చోటు. నిమీయోన్ అనే గ్రీకు పదాన్ని అలా అనువదించారు. ఆ గ్రీకు పదం “గుర్తుచేయడానికి” అనే అర్థమున్న క్రియాపదం నుండి వచ్చింది. చనిపోయిన వ్యక్తి గుర్తుచేసుకోబడుతున్నాడని ఆ క్రియాపదం సూచిస్తుంది.—యోహా 5:28, 29, అధస్సూచి.
-
స్వతంత్రులు; స్వతంత్రులుగా చేయబడినవాళ్లు.
రోమా పరిపాలనలో స్వతంత్రులుగా పుట్టి, పౌరసత్వ హక్కులన్నీ కలిగివుండే వాళ్లే “స్వతంత్రులు.” అయితే, బానిసత్వం నుండి విడుదలైన వాళ్లను ‘స్వతంత్రులుగా చేయబడినవాళ్లు’ అంటారు. అధికారికంగా విడుదలవ్వడం వల్ల స్వతంత్రులు అయినవాళ్లకు రోమా పౌరసత్వం దొరికేది, కానీ వాళ్లు అక్కడి రాజకీయ పదవికి అర్హులు అవ్వరు. అలా కాకుండా 1కొ 7:22.
మామూలుగా విడుదలయ్యే వాళ్లకు బానిసత్వం నుండి స్వేచ్ఛ దొరికేది, కానీ వాళ్లకు పూర్తిస్థాయిలో పౌరహక్కులు లభించేవి కాదు.—
హ
-
హార్‌మెగిద్దోన్.
ఈ హీబ్రూ పదానికి “మెగిద్దో పర్వతం” అని అర్థం. ఇది, ‘సర్వశక్తిమంతుడైన దేవుని మహారోజున జరిగే యుద్ధానికి’ సంబంధించిన పదం. ఆ రోజున యెహోవాతో యుద్ధం చేయడానికి “భూమంతటా ఉన్న రాజులు” పోగౌతారు. (ప్రక 16:14, 16; 19:11-21)—మహాశ్రమ చూడండి.
-
హింసాకొయ్య.
నిలువుగా ఉండే కొయ్య లేదా గుంజ అనే అర్థమున్న స్టౌరస్ అనే గ్రీకు పదాన్ని ఇలా అనువదించారు. యేసుకు మరణశిక్ష వేసింది అలాంటి దానిమీదే. స్టౌరస్ అనే గ్రీకు పదం, క్రీస్తు రాకముందు చాలా శతాబ్దాల పాటు అన్యమతాల ప్రజలు మత చిహ్నంగా ఉపయోగించిన సిలువను సూచిస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. “హింసా కొయ్య” అనే మాట మూలభాష పదంలో ఉన్న పూర్తి అర్థాన్ని వివరిస్తుంది. ఎందుకంటే యేసు అనుచరులకు ఎదురయ్యే హింసను, బాధను, అవమానాన్ని సూచించడానికి కూడా స్టౌరస్ అనే పదం ఉపయోగించబడింది. (మత్త 16:24; హెబ్రీ 12:2)—కొయ్య చూడండి.
-
హిగ్గాయోన్.
సంగీత నిర్దేశానికి సంబంధించిన పదం. కీర్తన 9:16లో ఉపయోగించినట్టు, ఈ పదం వీణ (హార్ప్) వాయించేటప్పుడు గంభీరమైన, లోతైన రాగాన్ని గానీ ధ్యానించడం కోసం కాసేపు ఆగడాన్ని గానీ సూచిస్తుంది.
-
హిన్.
ఇది ఒక ద్రవ కొలత, అలాగే కొలవడానికి ఉపయోగించే పాత్ర. చరిత్రకారుడైన జోసిఫస్ ఒక హిన్ రెండు ఎథేనియన్ కోస్‌తో సమానం అని చెప్పాడు, కాబట్టి ఇది 3.67 లీటర్లతో సమానం. (నిర్గ 29:40)—అనుబంధం B14 చూడండి.
-
హిస్సోపు.
సన్నని రెమ్మలు, ఆకులు ఉండే మొక్క. దీన్ని శుద్ధీకరణ ఆచారాల్లో రక్తాన్ని లేదా నీళ్లను చిలకరించడానికి వాడేవాళ్లు. బహుశా ఇది ‘మరువం’ మొక్క అయ్యుంటుంది (ఓరిగ్యానమ్ మరు; ఓరిగ్యానమ్ సిరియాకమ్). యోహాను 19:29లో హిస్సోపు అనే మాటను ఉపయోగించిన తీరును బట్టి చూస్తే, సువాసన గల ఈ మొక్కను ఒక కొమ్మకు తగిలించి ఉపయోగించి ఉంటారు లేదా ఒక రకమైన జొన్న కాడను (సోర్గమ్ వల్గేర్) ఉపయోగించి ఉంటారు. జొన్న కాడ యేసు నోటికి పుల్లటి ద్రాక్షారసాన్ని అందించడానికి కావాల్సినంత పొడవు ఉండివుంటుంది కాబట్టి వాళ్లు దాన్నే వాడివుంటారు.—నిర్గ 12:22; కీర్త 51:7.
-
హీబ్రూ భాష.
అబ్రాహాము సంతానమైన హెబ్రీయులు మాట్లాడిన భాష. యేసు కాలానికల్లా, హీబ్రూ భాషలో చాలా అరామిక్ పదాలు వచ్చి చేరాయి. క్రీస్తు, ఆయన శిష్యులు కూడా ఆ హీబ్రూనే మాట్లాడారు. (అపొ 26:14)—హెబ్రీయుడు చూడండి.
-
హెబ్రీయుడు.
ఇది మొట్టమొదట అబ్రాముకు (అబ్రాహాముకు) ఉపయోగించబడిన బిరుదు. ఈ పదం, చుట్టుపక్కల ఉన్న అమోరీయుల నుండి అతన్ని వేరు చేసింది. ఆ తర్వాత ఈ పదం, అబ్రాహాము మనవడైన యాకోబు ద్వారా వచ్చిన అబ్రాహాము వంశస్థుల్ని సూచించడానికి కూడా ఉపయోగించబడింది.—ఆది 14:13; నిర్గ 5:3.
-
హెర్మే.
ఇతను గ్రీకు దేవుడు, ద్యుపతి కుమారుడు. ఇతన్ని దేవతల సందేశకుడని, వాక్చాతుర్యం ఉన్న దేవుడని ప్రజలు అనుకునేవాళ్లు. అందుకే లుస్త్రలో ప్రజలు పౌలును “హెర్మే” అని తప్పుగా పిలిచారు.—అపొ 14:12.
-
హేడిస్.
ఇది “షియోల్” అనే హీబ్రూ పదానికి సమాన అర్థం ఉన్న గ్రీకు పదం. దీన్ని “సమాధి” అని అనువదించారు. అన్ని పనులు, స్పృహ ఆగిపోయే సూచనార్థక చోటును లేదా స్థితిని ఇది సూచిస్తుంది.—సమాధి చూడండి.
-
హేరోదు అనుచరులు.
వీళ్లకు హేరోదీయులు అనే పేరు కూడా ఉంది. వీళ్లు రోమన్ల కింద పరిపాలించిన హేరోదుల రాజకీయ లక్ష్యాలకు మద్దతిచ్చిన జాతీయవాదుల గుంపు. కొంతమంది సద్దూకయ్యులు బహుశా ఈ గుంపుకు చెందినవాళ్లు అయ్యుంటారు. యేసును వ్యతిరేకించడానికి హేరోదీయులు పరిసయ్యులతో చేతులు కలిపారు.—మార్కు 3:6.
-
హేరోదు.
యూదుల్ని పరిపాలించిన రాజ వంశస్థుల ఇంటి పేరు. వీళ్లను రోము నియమించేది. వీళ్లలో హేరోద్ ద గ్రేట్ అనే వ్యక్తి యెరూషలేము ఆలయాన్ని తిరిగి కట్టించి పేరుగాంచాడు; అలాగే, యేసును నాశనం చేసే ప్రయత్నంలో పిల్లల్ని చంపమనే ఆజ్ఞ ఇచ్చింది కూడా ఇతనే. (మత్త 2:16; లూకా 1:5) హేరోద్ ద గ్రేట్ కుమారులైన హేరోదు అర్కెలాయు, హేరోదు అంతిప తమ తండ్రి సంస్థానంలో ఉన్న కొన్ని భాగాల మీద నియమించబడ్డారు. (మత్త 2:22) అంతిప చతుర్థాధిపతిగా ఉండేవాడు. అయితే అందరూ అతన్ని “రాజు” అనే పిలిచేవాళ్లు. ఇతను క్రీస్తు మూడున్నర సంవత్సరాల పరిచర్య కాలంలో, అలాగే అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలోని సంఘటనలు జరిగిన కాలం వరకు పరిపాలించాడు. (మార్కు 6:14-17; లూకా 3:1, 19, 20; 13:31, 32; 23:6-15; అపొ 4:27; 13:1) ఆ తర్వాత, హేరోద్ ద గ్రేట్ మనవడైన హేరోదు అగ్రిప్ప I కొంతకాలం పరిపాలించాక, దేవదూత చేత చంపబడ్డాడు. (అపొ 12:1-6, 18-23) తర్వాత అతని కుమారుడు అగ్రిప్ప II పరిపాలన మొదలుపెట్టి, యూదులు రోము మీద తిరుగుబాటు చేసిన కాలం వరకు ఏలాడు.—అపొ 23:35; 25:13, 22-27; 26:1, 2, 19-32.
-
హోమర్.
కొర్‌తో సమానమైన ఘన కొలత. బాత్ కొలత ఆధారంగా చూస్తే ఇది 220 లీటర్లతో (దాదాపు 130 కిలోలతో) సమానం. (లేవీ 27:16)—అనుబంధం B14 చూడండి.
-
హోరేబు; హోరేబు పర్వతం.
హోరేబు అంటే సీనాయి పర్వతం చుట్టూ ఉన్న పర్వత ప్రాంతం. హోరేబు పర్వతం అనేది సీనాయి పర్వతానికి మరో పేరు. (నిర్గ 3:1; ద్వితీ 5:2)—అనుబంధం B3 చూడండి.
క్ష
-
క్షుద్రవిద్య.
చెడ్డదూతల నుండి వచ్చే శక్తిని ఉపయోగించడం. ఆ శక్తి చెడ్డదూతల నుండి వస్తుందని ప్రజలు సాధారణంగా అంగీకరిస్తారు.—2ది 33:6.