రెండో కొరింథీయులు 9:1-15
9 పవిత్రులకు చేసే సహాయం* గురించి+ నేను మీకు రాయాల్సిన అవసరం అంతగా లేదు.
2 ఎందుకంటే, మీరు ఎంత ఇష్టపూర్వకంగా సహాయం చేస్తారో నాకు తెలుసు. దాని గురించే నేను మాసిదోనియ వాళ్ల దగ్గర గొప్పగా మాట్లాడుతున్నాను. అకయలోని సహోదరులు ఒక సంవత్సరం నుండి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని నేను వాళ్లకు చెప్తున్నాను, మీ ఉత్సాహం వాళ్లలో చాలామందిని పురికొల్పింది.
3 అయితే, ఈ విషయంలో మేము మీ గురించి గొప్పగా చెప్పిన మాటలు వట్టిమాటలు కాకూడదని, నేను వాళ్లకు చెప్పినట్టే మీరు నిజంగా సిద్ధంగా ఉండాలని నేను సహోదరుల్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను.
4 ఒకవేళ మాసిదోనియ సహోదరులు నాతో కలిసి అక్కడికి వచ్చి మీరు సిద్ధంగా లేకపోవడం చూస్తే మీ మీద నమ్మకం పెట్టుకున్నందుకు మేము సిగ్గుపడాల్సి వస్తుంది, మీరు కూడా సిగ్గుపడాల్సి వస్తుందని వేరే చెప్పనక్కర్లేదు.
5 కాబట్టి సహోదరులు కాస్త ముందుగానే మీ దగ్గరికి వచ్చి, మీరు ఇస్తానని మాటిచ్చిన ఉదారమైన బహుమతిని సేకరించేలా* వాళ్లను ప్రోత్సహించడం అవసరమనిపించింది. అప్పుడు మీరు ఇచ్చే బహుమతి ఉదారంగా ఇచ్చినట్టు అవుతుంది కానీ ఎవరి బలవంతం మీదో ఇచ్చినట్టు అవ్వదు.
6 అయితే ఈ విషయంలో తక్కువ విత్తేవాళ్లు తక్కువ పంట కోస్తారు, ఎక్కువ విత్తేవాళ్లు ఎక్కువ పంట కోస్తారు.+
7 ప్రతీ ఒక్కరు అయిష్టంగానో బలవంతంగానో కాకుండా తమ మనసులో ఎంత ఇవ్వాలని తీర్మానించుకున్నారో అంత ఇవ్వాలి.+ ఎందుకంటే సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం.+
8 పైగా, దేవుడు మీ మీద తన అపారదయ అంతటినీ చూపించగలడు. దానివల్ల, మీకు కావాల్సినవన్నీ ఎప్పుడూ ఉంటాయి, అలాగే ప్రతీ మంచిపనికి అవసరమైనవన్నీ మీ దగ్గర పుష్కలంగా ఉంటాయి.+
9 (ఎందుకంటే లేఖనాల్లో ఇలా రాసివుంది: “అతను విస్తారంగా* పంచిపెట్టాడు, పేదవాళ్లకు ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ ఉంటుంది.”+
10 విత్తేవాళ్లకు విత్తనాల్ని, తినడానికి ఆహారాన్ని పుష్కలంగా ఇచ్చే దేవుడే విత్తడానికి మీకు విత్తనాల్ని ఇస్తాడు, అది కూడా పుష్కలంగా ఇస్తాడు; అలాగే మీరు ఎక్కువ నీతి ఫలాలు ఫలించడానికి సహాయం చేస్తాడు.)
11 మీరు అన్నిరకాల పద్ధతుల్లో ఉదారంగా ఇవ్వగలిగేలా దేవుడు ప్రతీ విషయంలో మిమ్మల్ని దీవిస్తున్నాడు, మీరిచ్చే బహుమతిని మేము ఇతరులకు పంచడం వల్ల ప్రజలు దేవునికి కృతజ్ఞతలు చెప్తారు;
12 ఎందుకంటే ఈ సేవ వల్ల పవిత్రుల అవసరాలు చక్కగా తీరడమే కాదు,+ చాలామంది దేవునికి ఎన్నో కృతజ్ఞతలు చెప్తారు కూడా.
13 మీరు ఎలాంటివాళ్లో ఈ సేవ రుజువుచేస్తుంది కాబట్టి వాళ్లు దేవుణ్ణి మహిమపరుస్తారు. ఎందుకంటే క్రీస్తు గురించిన మంచివార్తకు సంబంధించి మీరు బహిరంగంగా ప్రకటించే సందేశానికి మీరు లోబడి ఉంటున్నారు; అంతేకాదు మీరు వాళ్లకు, అలాగే అందరికీ ఉదారంగా విరాళాలు ఇస్తున్నారు.+
14 మీ మీద ఉన్న దేవుని సాటిలేని అపారదయను చూసి వాళ్లు మీ కోసం దేవుణ్ణి వేడుకుంటున్నారు, మీ మీద తమ ప్రేమను* వ్యక్తం చేస్తున్నారు.
15 వర్ణించలేని దేవుని ఉచిత బహుమతిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు.
అధస్సూచీలు
^ అక్ష., “పరిచారం.”
^ లేదా “ముందే సిద్ధం చేసేలా.”
^ లేదా “ఉదారంగా.”
^ లేదా “అనురాగాన్ని.”