రెండో కొరింథీయులు 3:1-18

  • సిఫారసు ఉత్తరాలు (1-3)

  • కొత్త ఒప్పందానికి పరిచారకులు (4-6)

  • కొత్త ఒప్పందానికి ఉన్న గొప్ప మహిమ (7-18)

3  మమ్మల్ని మేము మళ్లీ కొత్తగా సిఫారసు చేసుకోవడం మొదలుపెట్టామా? వేరేవాళ్లలా మా గురించిన సిఫారసు ఉత్తరాలు మీకు చూపించాలా, లేక మీ నుండి మాకు సిఫారసు ఉత్తరాలు అవసరమా?  నిజానికి, మీరే మా సిఫారసు ఉత్తరం;+ ఈ ఉత్తరం మా హృదయాల మీద చెక్కబడింది, అది మనుషులందరికీ తెలుసు, వాళ్లు దాన్ని చదువుతున్నారు.  మా పరిచర్య ద్వారా మేము రాసిన క్రీస్తు ఉత్తరం మీరే అని స్పష్టమౌతోంది. అది సిరాతో రాయబడలేదు కానీ జీవంగల దేవుని పవిత్రశక్తితో చెక్కబడింది; రాతి పలకల+ మీద కాదు, హృదయాల మీద చెక్కబడింది.+  క్రీస్తు ద్వారా దేవుణ్ణి బట్టి మాకు ఈ నమ్మకం ఉంది.  మా సొంత శక్తితో మేము ఈ పనికి అర్హులమయ్యామని అనట్లేదు, మమ్మల్ని అర్హుల్ని చేసింది దేవుడే.+  ఆయన వల్లే మేము కొత్త ఒప్పందానికి*+ పరిచారకులుగా ఉండడానికి అర్హులమయ్యాం, రాతపూర్వక ధర్మశాస్త్ర నిర్దేశం కింద కాకుండా పవిత్రశక్తి నిర్దేశం కింద సేవచేస్తున్నాం; ఎందుకంటే రాతపూర్వక ధర్మశాస్త్రం మరణానికి గురిచేస్తుంది,+ కానీ పవిత్రశక్తి బ్రతికిస్తుంది.+  రాతి పలకల మీద చెక్కబడి+ మరణానికి గురిచేసే ధర్మశాస్త్రమే ఎంత మహిమతో వచ్చిందంటే, మోషే ముఖం మీద ప్రకాశించిన ఆ మహిమ కారణంగా ఇశ్రాయేలీయులు అతని ముఖాన్ని చూడలేకపోయారు. కనుమరుగైపోయే మహిమతో వచ్చిన ధర్మశాస్త్రానికే అంత మహిమ ఉంటే,  పవిత్రశక్తితో చేసే పరిచర్యకు ఇంకెంత మహిమ ఉండాలి?+  శిక్షకు గురిచేసే ధర్మశాస్త్రమే+ మహిమగలదిగా ఉంటే,+ నీతిని కలగజేసే పరిచర్య+ ఇంకెంత మహిమగలదిగా ఉండాలి? 10  నిజానికి, ఇప్పుడున్నదాని గొప్ప మహిమ కారణంగా, ఒకప్పుడు మహిమగలదిగా చేయబడినదాని మహిమ తొలగిపోయింది.+ 11  ఎందుకంటే, కనుమరుగైపోయేదే మహిమతో వచ్చిందంటే,+ నిలిచివుండే దానికి ఇంకెంత మహిమ ఉండాలి!+ 12  మనకు ఇలాంటి నిరీక్షణ+ ఉంది కాబట్టే చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాం. 13  కనుమరుగైపోయే దానికి ఏమౌతుందో ఇశ్రాయేలీయులకు కనబడకుండా మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునేవాడు. మేము అతనిలా చేయట్లేదు. 14  వాళ్ల మనసులు మొద్దుబారాయి. నేటికీ పాత ఒప్పందం* చదువుతున్నప్పుడు ఆ ముసుగు వాళ్ల మనసుల మీద అలాగే ఉంటుంది.+ ఎందుకంటే క్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే అది తొలగిపోతుంది.+ 15  నిజం చెప్పాలంటే, నేటికీ మోషే పుస్తకాలు చదువుతున్నప్పుడల్లా+ వాళ్ల హృదయాల మీద ముసుగు ఉంటుంది.+ 16  కానీ ఒక వ్యక్తి యెహోవా* వైపు తిరిగినప్పుడు ఆ ముసుగు తొలగిపోతుంది.+ 17  యెహోవా* అదృశ్యుడు.*+ యెహోవా* పవిత్రశక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది.+ 18  మనమంతా ముసుగులేని ముఖాలతో అద్దాల్లా యెహోవా* మహిమను ప్రతిఫలిస్తున్నాం. మనం అంతకంతకూ ఎక్కువ మహిమను ప్రతిఫలిస్తూ, అదృశ్యుడైన* యెహోవా* మనల్ని ఎలా మారుస్తున్నాడో* సరిగ్గా అలాగే, ఆయన ప్రతిబింబంలాగే మారుతున్నాం.*+

అధస్సూచీలు

లేదా “కొత్త నిబంధనకు.”
లేదా “పాత నిబంధన.”
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
అనుబంధం A5 చూడండి.
లేదా “యెహోవా పవిత్రశక్తి మనల్ని ఎలా మారుస్తోందో” అయ్యుంటుంది.
లేదా “రూపాంతరం చెందుతున్నాం.”