యోహాను సువార్త 12:1-50
12 పస్కా పండుగకు ఆరు రోజుల ముందు యేసు బేతనియకు వచ్చాడు, మృతుల్లో నుండి యేసు బ్రతికించిన లాజరు+ అక్కడే ఉన్నాడు.
2 వాళ్లు సాయంకాలం యేసు కోసం ఒక విందు ఏర్పాటు చేశారు. మార్త వాళ్లకు వడ్డిస్తూ ఉంది.+ అయితే, ఆయనతోపాటు భోజనం బల్ల దగ్గర కూర్చున్న వాళ్లలో లాజరు కూడా ఉన్నాడు.
3 అప్పుడు మరియ చాలా ఖరీదైన అసలుసిసలు జటామాంసి* పరిమళ తైలం దాదాపు 300 గ్రాములు* తీసుకొని, యేసు పాదాల మీద పోసి తన తలవెంట్రుకలతో వాటిని తుడిచింది. దాంతో ఆ ఇల్లంతా పరిమళ తైలం వాసనతో నిండిపోయింది.+
4 కానీ ఆయన శిష్యుల్లో ఒకడు, ఆయనకు నమ్మకద్రోహం చేయబోతున్నవాడు అయిన ఇస్కరియోతు యూదా+ ఇలా అన్నాడు:
5 “ఈ పరిమళ తైలాన్ని 300 దేనారాలకు* అమ్మి ఎందుకు పేదవాళ్లకు ఇవ్వలేదు?”
6 అతను పేదవాళ్ల మీద శ్రద్ధతో అలా అనలేదు కానీ అతను ఒక దొంగ, డబ్బు పెట్టె అతని దగ్గరే ఉండేది, అతను దానిలో వేసిన డబ్బును దొంగతనం చేసేవాడు కాబట్టే అలా అన్నాడు.
7 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “ఆమెను ఏమనకండి. నన్ను సమాధి చేసే రోజు కోసం నా శరీరాన్ని సిద్ధం చేయడానికి ఆమెను ఈ ఆచారాన్ని చేయనివ్వండి.+
8 పేదవాళ్లు ఎప్పుడూ మీతోనే ఉంటారు.+ కానీ నేను ఎప్పుడూ మీతో ఉండను.”+
9 ఈలోగా, యేసు అక్కడ ఉన్నాడని తెలుసుకొని చాలామంది యూదులు అక్కడికి వచ్చారు. వాళ్లు యేసును, అలాగే మృతుల్లో నుండి ఆయన బ్రతికించిన లాజరును చూడడానికి వచ్చారు.
10 అప్పుడు ముఖ్య యాజకులు లాజరును కూడా చంపడానికి కుట్రపన్నారు.
11 ఎందుకంటే, అతని వల్లే చాలామంది యూదులు అక్కడికి వెళ్తున్నారు, యేసుమీద విశ్వాసం ఉంచుతున్నారు.
12 తర్వాతి రోజు, యేసు యెరూషలేముకు వస్తున్నాడని పండుగ కోసం వచ్చిన చాలామంది ప్రజలకు తెలిసింది.
13 అందుకే వాళ్లు ఖర్జూర మట్టలు తీసుకొని ఆయన్ని కలవడానికి వెళ్లారు. వాళ్లు, “దేవా, ఈయన్ని కాపాడు! యెహోవా* పేరున వస్తున్న ఈయన దీవించబడాలి!+ ఇశ్రాయేలు రాజు దీవించబడాలి!”+ అని కేకలు వేయడం మొదలుపెట్టారు.
14 యేసుకు ఒక చిన్న గాడిద కనిపించినప్పుడు, ఆయన దానిమీద కూర్చున్నాడు.+ ఎందుకంటే ఇలా రాయబడి ఉంది:
15 “సీయోను కూతురా, భయపడకు. ఇదిగో! నీ రాజు గాడిదపిల్ల మీద కూర్చొని వస్తున్నాడు.”+
16 ఈ విషయాలు ఆయన శిష్యులకు మొదట్లో అర్థం కాలేదు. కానీ యేసు మహిమపర్చబడినప్పుడు,+ ఆయన గురించి రాయబడినట్టే ఆ విషయాలు జరిగాయని వాళ్లు గుర్తుచేసుకున్నారు.+
17 యేసు లాజరును సమాధి* నుండి బయటికి రమ్మని పిలవడం, అతన్ని మృతుల్లో నుండి బ్రతికించడం చూసిన ప్రజలు జరిగినదాని గురించి అందరికీ చెప్తూ ఉన్నారు.+
18 ఆయన ఈ అద్భుతం చేశాడని వినడం వల్ల కూడా చాలామంది ఆయన్ని కలవడానికి వెళ్లారు.
19 అప్పుడు పరిసయ్యులు ఇలా మాట్లాడుకున్నారు: “చూస్తున్నారా, మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఇదిగో! లోకమంతా ఆయన వెంట వెళ్లింది.”+
20 ఆ పండుగలో ఆరాధించడానికి వచ్చినవాళ్లలో కొంతమంది గ్రీకువాళ్లు కూడా ఉన్నారు.
21 వాళ్లు గలిలయలోని బేత్సయిదాకు చెందిన ఫిలిప్పు దగ్గరికి వచ్చి,+ “అయ్యా, మేము యేసును చూడాలనుకుంటున్నాం” అని అడిగారు.
22 ఫిలిప్పు వెళ్లి అంద్రెయతో ఆ విషయం చెప్పాడు. తర్వాత వాళ్లిద్దరు వచ్చి యేసుకు చెప్పారు.
23 అయితే యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడు మహిమపర్చబడే సమయం వచ్చేసింది.+
24 నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, గోధుమ గింజ నేలమీద పడి చనిపోకపోతే అది ఒక్క గింజగానే ఉండిపోతుంది; కానీ అది చనిపోతే+ ఎంతగానో ఫలిస్తుంది.
25 తన ప్రాణాన్ని ప్రేమించే వ్యక్తి దాన్ని కోల్పోతాడు,* కానీ ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించే* వ్యక్తి+ శాశ్వత జీవితం కోసం దాన్ని కాపాడుకుంటాడు.+
26 ఎవరైనా నాకు సేవకుడిగా ఉండాలనుకుంటే అతను నన్ను అనుసరించాలి. నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు.+ ఎవరైనా నాకు సేవచేస్తే తండ్రి అతన్ని ఘనపరుస్తాడు.
27 ఇప్పుడు నాకు ఆందోళనగా ఉంది,+ నేను ఏమనాలి? తండ్రీ, జరగబోయేదాని నుండి* నన్ను కాపాడు.+ అయినా, దీని కోసమే నేను వచ్చాను.
28 తండ్రీ, నీ పేరును మహిమపర్చు.” అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం+ ఇలా వినిపించింది: “నేను దాన్ని మహిమపర్చాను, మళ్లీ మహిమపరుస్తాను.”+
29 అక్కడ నిలబడి ఉన్న ప్రజలు అది విని, ఉరిమిందని అనడం మొదలుపెట్టారు. ఇంకొందరు, “దేవదూత ఆయనతో మాట్లాడాడు” అని అన్నారు.
30 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “ఈ స్వరం వచ్చింది నా కోసం కాదు, మీ కోసమే.
31 ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతోంది. ఈ లోక పరిపాలకుడు+ బయటికి తోసేయబడతాడు.+
32 అయితే నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు*+ అన్నిరకాల ప్రజల్ని నావైపుకు ఆకర్షించుకుంటాను.”
33 నిజానికి తాను ఏ విధంగా చనిపోబోతున్నాడో+ చెప్పడానికి ఆయన ఆ మాట అన్నాడు.
34 అప్పుడు ఆ ప్రజలు ఆయనతో, “క్రీస్తు ఎప్పటికీ ఉంటాడని మేము ధర్మశాస్త్రం నుండి విన్నాం.+ అలాంటప్పుడు మానవ కుమారుడు పైకి ఎత్తబడాలని నువ్వెలా చెప్తున్నావు?+ ఇంతకీ ఈ మానవ కుమారుడు ఎవరు?” అని అన్నారు.
35 కాబట్టి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “ఇంక కొంతకాలమే వెలుగు మీ మధ్య ఉంటుంది. చీకటి మిమ్మల్ని కమ్ముకోకుండా ఉండేలా వెలుగు ఉండగానే దానిలో నడవండి; చీకట్లో నడిచే వ్యక్తికి తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు.
36 మీరు వెలుగు పుత్రులు అయ్యేలా+ వెలుగు ఉండగానే వెలుగు మీద విశ్వాసం చూపించండి.”
యేసు ఈ మాటలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయి వాళ్లకు కనిపించకుండా దాక్కున్నాడు.
37 ఆయన వాళ్ల ముందు చాలా అద్భుతాలు చేసినా, వాళ్లు ఆయనమీద విశ్వాసం ఉంచలేదు.
38 దానివల్ల యెషయా ప్రవక్త చెప్పిన ఈ మాట నెరవేరింది: “యెహోవా,* మేము మాట్లాడిన* దానిమీద ఎవరు విశ్వాసం ఉంచారు?+ యెహోవా* బాహువు ఎవరికి వెల్లడైంది?”+
39 వాళ్లు నమ్మకపోవడానికి గల కారణాన్ని కూడా యెషయా ఇలా వివరించాడు:
40 “వాళ్లు కళ్లతో చూసి, హృదయంతో అర్థం చేసుకొని ఆయనవైపు తిరిగి ఆయన చేత బాగుచేయబడకుండా ఉండేలా ఆయన వాళ్ల కళ్లకు గుడ్డితనం కలిగించాడు, వాళ్ల హృదయాల్ని కఠినం చేశాడు.”+
41 యెషయా ఆయన* మహిమను చూశాడు, కాబట్టి ఆయన గురించి ఆ మాటలు అన్నాడు.+
42 నిజానికి యూదుల నాయకుల్లో కూడా చాలామంది ఆయనమీద విశ్వాసముంచారు,+ కానీ సమాజమందిరం నుండి వెలివేయబడతామేమో అని పరిసయ్యులకు భయపడి ఆ విషయాన్ని ఒప్పుకోలేదు.+
43 ఎందుకంటే, వాళ్లు దేవుని ఆమోదం* కన్నా మనుషుల ఆమోదాన్నే ఎక్కువగా ఇష్టపడ్డారు.+
44 అయితే యేసు బిగ్గరగా ఇలా అన్నాడు: “నామీద విశ్వాసముంచే వ్యక్తి నామీదే కాదు, నన్ను పంపించిన వ్యక్తి మీద కూడా విశ్వాసం ఉంచుతున్నాడు;+
45 నన్ను చూసే వ్యక్తి నన్ను పంపించిన వ్యక్తిని కూడా చూస్తున్నాడు.+
46 నామీద విశ్వాసముంచే ఏ వ్యక్తీ చీకట్లో ఉండిపోకూడదని+ నేను లోకానికి వెలుగుగా వచ్చాను.+
47 అయితే, ఎవరైనా నా మాటలు విని వాటిని పాటించకపోతే నేను అతనికి తీర్పుతీర్చను; ఎందుకంటే నేను లోకానికి తీర్పుతీర్చడానికి రాలేదు కానీ లోకాన్ని రక్షించడానికే వచ్చాను.+
48 నన్ను గౌరవించని, నా మాటలు స్వీకరించని వాళ్లకు తీర్పు తీర్చేది ఒకటి ఉంది. నేను మాట్లాడిన మాటే చివరి రోజున వాళ్లకు తీర్పు తీరుస్తుంది.
49 నేను ఏదీ నా సొంతగా మాట్లాడలేదు. నేను ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో నన్ను పంపించిన తండ్రే నాకు ఆజ్ఞాపించాడు.+
50 ఆయన ఆజ్ఞ శాశ్వత జీవితానికి నడిపిస్తుందని నాకు తెలుసు.+ కాబట్టి, నేను ఏం మాట్లాడినా తండ్రి నాకు చెప్పినట్టే మాట్లాడతాను.”+
అధస్సూచీలు
^ అక్ష., “ఒక పౌండ్,” అంటే రోమా పౌండ్. అనుబంధం B14 చూడండి.
^ అనుబంధం B14 చూడండి.
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “స్మారక సమాధి.”
^ అక్ష., “నాశనం చేసుకుంటాడు.”
^ లేదా “ప్రాణాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండే.”
^ అక్ష., “ఈ గంట నుండి.”
^ అంటే, కొయ్యకు వేలాడదీసినప్పుడు.
^ అనుబంధం A5 చూడండి.
^ అక్ష., “మా నుండి విన్న.”
^ అనుబంధం A5 చూడండి.
^ అంటే, క్రీస్తు.
^ అక్ష., “మహిమ.”