కీర్తనలు 80:1-19
సంగీత నిర్దేశకునికి సూచన; “లిల్లీ పువ్వులు” అనే రాగంలో పాడాలి. జ్ఞాపకం చేయడానికి. ఆసాపు+ కీర్తన. శ్రావ్యగీతం.
80 యోసేపును మందలా నడిపిస్తున్న+ఇశ్రాయేలు కాపరీ, విను.
కెరూబుల పైన* సింహాసనంలో కూర్చున్న దేవా,+ప్రకాశించు.*
2 ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేల ముందునీ బలాన్ని చూపించు;+వచ్చి మమ్మల్ని కాపాడు.+
3 దేవా, మళ్లీ మామీద దయ చూపించు;+మేము రక్షణ పొందేలా నీ ముఖకాంతిని మామీద ప్రకాశింపజేయి.+
4 సైన్యాలకు దేవుడివైన యెహోవా, ఎంతకాలం నీ ప్రజల ప్రార్థనలకు వ్యతిరేకంగా ఉంటావు?*+
5 నువ్వు వాళ్లకు కన్నీళ్లను ఆహారంగా ఇస్తున్నావు,విస్తారమైన కన్నీళ్లను వాళ్లతో తాగిస్తున్నావు.
6 నువ్వు మా పొరుగువాళ్లు మా విషయంలో గొడవపడేలా చేశావు,మా శత్రువులు ఇష్టమొచ్చినట్టు మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు.+
7 సైన్యాల దేవా, మళ్లీ మామీద దయ చూపించు;మేము రక్షణ పొందేలా నీ ముఖకాంతిని మామీద ప్రకాశింపజేయి.+
8 నువ్వు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షతీగను+ బయల్దేరజేశావు.
జనాల్ని వెళ్లగొట్టి వాళ్ల దేశంలో దాన్ని నాటావు.+
9 నువ్వు దాని కోసం ఒక స్థలం సిద్ధం చేశావు,అది బలంగా నాటుకొని, దేశమంతా విస్తరించింది.+
10 దాని నీడ పర్వతాల్ని కప్పేసింది,దాని తీగలు దేవుని దేవదారు చెట్ల మీదికి ఎగబాకాయి.
11 దాని తీగలు సముద్రం వరకు,దాని రెమ్మలు నది* వరకు వ్యాపించాయి.+
12 మరి, దారినపోయే వాళ్లంతా దాని పండ్లను తెంచుకునేలా+ద్రాక్షతోట చుట్టూ ఉన్న రాతిగోడల్ని నువ్వెందుకు పడగొట్టావు?+
13 అడవి పందులు దాన్ని పాడుచేస్తున్నాయి,అడవి జంతువులు దాన్ని తినేస్తున్నాయి.+
14 సైన్యాల దేవా, దయచేసి తిరిగి రా.
పరలోకం నుండి కిందికి చూడు!
ఈ ద్రాక్షతీగ బాగోగులు చూసుకో.+
15 నీ కుడిచెయ్యి నాటిన తీగను,*+నీ కోసం నువ్వు బలపర్చిన కొమ్మను* పట్టించుకో.+
16 దాన్ని నరికేసి, కాల్చేశారు.+
నువ్వు గద్దించినప్పుడు ప్రజలు నశించిపోతారు.
17 నీ కుడివైపున ఉన్న మనిషిని,నీ కోసం నువ్వు బలపర్చిన మనిషిని నీ చెయ్యి ఆదుకోవాలి.+
18 అప్పుడు మేము నిన్ను విడిచివెళ్లం.
మేము నీ పేరున ప్రార్థించేలా మమ్మల్ని ప్రాణాలతో ఉంచు.
19 సైన్యాలకు దేవుడివైన యెహోవా, మళ్లీ మామీద దయ చూపించు;మేము రక్షణ పొందేలా నీ ముఖకాంతిని మామీద ప్రకాశింపజేయి.+
అధస్సూచీలు
^ లేదా “మధ్య” అయ్యుంటుంది.
^ లేదా “నీ తేజస్సును వెల్లడిచేయి.”
^ అక్ష., “ప్రార్థనల మీద పొగలు కక్కుతావు?”
^ అంటే, యూఫ్రటీసు.
^ లేదా “ద్రాక్షతీగ ప్రధాన కాండాన్ని.”
^ అక్ష., “కుమారుణ్ణి.”