కీర్తనలు 49:1-20
సంగీత నిర్దేశకునికి సూచన. కోరహు కుమారుల కీర్తన.+ శ్రావ్యగీతం.
49 సమస్త దేశాల ప్రజలారా, ఆలకించండి.
లోకంలోని* ప్రజలారా, మీరంతా శ్రద్ధగా వినండి.
2 సామాన్యులు, గొప్పవాళ్లు,ధనవంతులు, పేదవాళ్లు అందరూ వినండి.
3 నా నోరు తెలివిగల మాటల్ని మాట్లాడుతుంది,నా హృదయ ధ్యానంలో+ అవగాహన కనిపిస్తుంది.
4 నేను ఒక సామెత మీద మనసు పెడతాను;వీణతో* నా పొడుపు కథను విప్పుతాను.
5 కష్టకాలాల్లో, నన్ను పడగొట్టాలని ప్రయత్నిస్తున్నవాళ్ల చెడ్డపనులు నన్ను చుట్టుముట్టినప్పుడునేను ఎందుకు భయపడాలి?+
6 తమ ఆస్తిని నమ్ముకునేవాళ్లలో,+తమ అపార సంపదల గురించి గొప్పలు చెప్పుకునేవాళ్లలో+
7 ఏ వ్యక్తీ ఎప్పటికీ ఇంకో వ్యక్తిని విడిపించలేడు,అతని కోసం దేవునికి విమోచన క్రయధనం* చెల్లించలేడు,+
8 (వాళ్ల ప్రాణ విమోచనా* మూల్యం ఎంత ఎక్కువంటేదాన్ని వాళ్లు ఎప్పటికీ చెల్లించలేరు);
9 అతను గోతిని* చూడకుండా శాశ్వతకాలం జీవించేలా చేయలేరు.+
10 మూర్ఖులతో, తెలివిలేని వాళ్లతో పాటుతెలివిగల వాళ్లు కూడా చనిపోవడం,+వాళ్లు తమ ఆస్తిని వేరేవాళ్లకు వదిలిపెట్టాల్సి రావడం ప్రతీ ఒక్కరు చూస్తుంటారు.+
11 తమ ఇళ్లు ఎప్పటికీ ఉండాలని,తమ డేరాలు తరతరాలపాటు ఉండాలని వాళ్లు లోలోపల కోరుకుంటారు.
వాళ్లు తమ భూములకు తమ పేర్లు పెట్టుకున్నారు.
12 అయితే ఎంత ఘనత పొందినాసరే మనిషి ఎల్లకాలం జీవించడు;+అతను నశించిపోయే జంతువుల లాంటివాడే.+
13 మూర్ఖులకూ, వాళ్ల వ్యర్థమైన మాటల్ని బట్టి సంతోషిస్తూవాళ్లను అనుసరించే వాళ్లకూ చివరికి జరిగేది ఇదే.+ (సెలా)
14 వాళ్లు గొర్రెల్లా చంపబడి, సమాధిలోకి* వెళ్తారు.
మరణం వాళ్లకు కాపరిగా ఉంటుంది;ఉదయం నిజాయితీపరులు వాళ్లను పరిపాలిస్తారు.+
వాళ్ల ఆనవాళ్లే లేకుండా పోతాయి;+రాజభవనానికి బదులు సమాధి*+ వాళ్లకు ఇల్లుగా ఉంటుంది.+
15 అయితే దేవుడు నన్ను సమాధి* గుప్పిట్లో* నుండి విడిపిస్తాడు,+తన సంరక్షణలోకి తీసుకుంటాడు. (సెలా)
16 ఒక వ్యక్తి ధనవంతుడు అయ్యాడనీ,అతని ఇంటి వైభవం పెరిగిపోతుందనీ భయపడకు,
17 ఎందుకంటే, చనిపోయినప్పుడు అతను తనతోపాటు ఏమీ తీసుకెళ్లలేడు;+అతని వైభవం అతనితోపాటు వెళ్లదు.+
18 అతను బ్రతికున్నప్పుడు తనను తాను పొగుడుకున్నాడు.+
(ఎవరైనా వర్ధిల్లినప్పుడు ప్రజలు పొగుడుతారు.)+
19 కానీ చివరికి అతను తన పూర్వీకుల తరంలో చేరిపోతాడు.
వాళ్లు ఇంకెప్పుడూ వెలుగు చూడరు.
20 ఈ విషయాన్ని అర్థం చేసుకోని మనిషి ఎంత ఘనత పొందినా+అతను నశించిపోయే జంతువుల లాంటివాడే.
అధస్సూచీలు
^ లేదా “వ్యవస్థలోని.”
^ ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
^ లేదా “విడుదల.”
^ లేదా “సమాధిని.”
^ లేదా “బలం.”