కీర్తనలు 22:1-31
సంగీత నిర్దేశకునికి సూచన; “పగటి ఆడ జింక”* అనే రాగంలో పాడాలి. దావీదు శ్రావ్యగీతం.
22 నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు?+
నన్ను రక్షించడానికి ఎందుకు రావడం లేదు?నా ఆర్తనాదాలు ఎందుకు పట్టించుకోవట్లేదు?+
2 నా దేవా, పగటిపూట నేను నీకు మొరపెడుతూ ఉన్నాను,
కానీ నువ్వు జవాబివ్వడం లేదు;+
రాత్రిపూట కూడా నేను మౌనంగా ఉండలేకపోతున్నాను.
3 కానీ నువ్వు పవిత్రుడివి,+ఇశ్రాయేలు స్తుతుల మధ్య సింహాసనాసీనుడివై ఉన్నావు.*
4 మా పూర్వీకులు నీ మీద నమ్మకముంచారు;+వాళ్లు నమ్మకముంచారు, నువ్వు వాళ్లను రక్షిస్తూ వచ్చావు.+
5 వాళ్లు నీకు మొరపెట్టారు, నువ్వు వాళ్లను కాపాడావు;వాళ్లు నీ మీద నమ్మకముంచారు, వాళ్లకు నిరాశ ఎదురుకాలేదు.*+
6 నా విషయానికొస్తే, మనుషులు నన్ను హీనంగా* చూస్తూ చీదరించుకుంటున్నారు.+నేను మనిషిని కాదు పురుగును అన్నట్టు చూస్తున్నారు;
7 నన్ను గమనించేవాళ్లందరూ హేళన చేస్తున్నారు;+గేలి చేస్తూ, హేళనగా తలలాడిస్తూ ఇలా అంటున్నారు:+
8 “అతను యెహోవాకు తనను తాను అప్పగించుకున్నాడు. ఆయనే అతన్ని రక్షించనీ!
అతను ఆయనకు ఎంతో ఇష్టమైనవాడు కాబట్టి ఆయనే అతన్ని కాపాడనీ!”+
9 నా తల్లి గర్భం నుండి నువ్వే నన్ను బయటికి తెచ్చావు,+నా తల్లి స్తనాల మీద నేను సురక్షితంగా ఉన్నట్టు భావించేలా చేశావు.
10 పుట్టినప్పటి నుండి నేను నీ కాపుదలకు అప్పగించబడ్డాను;*నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి నువ్వే నా దేవుడివి.
11 నాకు దూరంగా ఉండకు, ఎందుకంటే శ్రమ దగ్గర్లో ఉంది,+నాకు సహాయం చేసేవాళ్లు ఇంకెవ్వరూ లేరు.+
12 ఎన్నో బలమైన ఎద్దులు* నన్ను చుట్టుముట్టాయి;+బలమైన బాషాను ఎద్దులు నా చుట్టూ ఉన్నాయి.+
13 గర్జించే సింహం జంతువును ముక్కలుముక్కలుగా చీల్చేసినట్టు+అవి నా మీద పెద్దగా నోళ్లు తెరిచాయి.+
14 నేను నీళ్లలా పారబోయబడ్డాను;నా ఎముకలన్నీ వాటి స్థానం తప్పాయి.
నా హృదయం మైనంలా తయారైంది;+అది నా లోలోపల కరిగిపోతోంది.+
15 నాలో ఇక శక్తి లేదు, నేను మట్టి పెంకులా ఉన్నాను;+నా నాలుక నా అంగిలికి అంటుకుపోతోంది;+నువ్వు నన్ను మరణ ధూళిలో పడేస్తున్నావు.+
16 నా శత్రువులు కుక్కల్లా నన్ను చుట్టుముట్టారు;+కీడు చేసేవాళ్ల గుంపు నా మీదికి వస్తోంది,+వాళ్లు సింహంలా నా చేతులను, కాళ్లను కొరుకుతున్నారు.+
17 నేను నా ఎముకలన్నీ లెక్కపెట్టగలను.+
వాళ్లు నన్ను అదేపనిగా తేరి చూస్తున్నారు.
18 వాళ్లు నా వస్త్రాలు పంచుకుంటున్నారు,నా వస్త్రాల కోసం చీట్లు* వేసుకుంటున్నారు.+
19 కానీ యెహోవా, నాకు దూరంగా ఉండకు.+
నువ్వే నా బలం; నాకు సహాయం చేయడానికి త్వరగా రా.+
20 కత్తి నుండి నన్ను,కుక్కల చేతి* నుండి నా అమూల్యమైన ప్రాణాన్ని* కాపాడు;+
21 నాకు జవాబివ్వు,సింహం నోటి నుండి, అడవి ఎద్దుల కొమ్ముల నుండి నన్ను కాపాడు.+
22 నేను నీ పేరును నా సహోదరులకు ప్రకటిస్తాను;+సమాజం మధ్యలో నిన్ను స్తుతిస్తాను.+
23 యెహోవాకు భయపడేవాళ్లారా, ఆయన్ని స్తుతించండి!
యాకోబు సంతానమా,* మీరంతా ఆయన్ని మహిమపర్చండి!+
ఇశ్రాయేలు సంతానమా,* మీరంతా ఆయన మీద భయభక్తులతో లేచి నిలబడండి.
24 ఆయన బాధితుని కష్టాల్ని అసహ్యించుకోలేదు, వాటిని అలక్ష్యం చేయలేదు;+అతని నుండి తన ముఖాన్ని దాచుకోలేదు.+
అతను సహాయం కోసం మొరపెట్టినప్పుడు, ఆయన విన్నాడు.+
25 మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను;+నీకు భయపడేవాళ్ల ముందు నా మొక్కుబళ్లు చెల్లిస్తాను.
26 సాత్వికులు తిని తృప్తి పొందుతారు;+యెహోవాను వెదికేవాళ్లు ఆయన్ని స్తుతిస్తారు.+
మీరు శాశ్వతకాలం జీవించాలి.*
27 భూమంతా యెహోవాను గుర్తించి, ఆయనవైపు తిరుగుతుంది.
దేశాల కుటుంబాలన్నీ నీ ముందు సాష్టాంగపడతాయి.+
28 ఎందుకంటే రాజరికం యెహోవాది;+ఆయన దేశాల మీద పరిపాలిస్తున్నాడు.
29 భూమ్మీది ధనవంతులందరూ భోజనం చేసి, మొక్కుతారు;మట్టికి చేరుకుంటున్న వాళ్లందరూ ఆయన ముందు మోకాళ్లూనుతారు;వాళ్లలో ఎవ్వరూ తమ ప్రాణాల్ని కాపాడుకోలేరు.
30 వాళ్ల వంశస్థులు ఆయన్ని సేవిస్తారు;రాబోయే తరం యెహోవా గురించి వింటుంది.
31 వాళ్లు వచ్చి ఆయన నీతి గురించి చెప్తారు.
ఆయన ఏమి చేశాడో పుట్టబోయేవాళ్లకు చెప్తారు.
అధస్సూచీలు
^ ఒక రాగం లేదా సంగీత శైలి కావచ్చు.
^ లేదా “ఇశ్రాయేలు స్తుతులు నీ చుట్టూ ఉన్నాయి.”
^ లేదా “వాళ్లు అవమానాలపాలు కాలేదు.”
^ లేదా “నిందగా.”
^ అక్ష., “నీ మీద విసిరేయబడ్డాను.”
^ లేదా “కోడెదూడలు.”
^ లేదా “పంజా.”
^ అక్ష., “నా ఒకేఒక్క దాన్ని,” అతని ప్రాణాన్ని సూచిస్తుంది.
^ అక్ష., “విత్తనమా.”
^ అక్ష., “విత్తనమా.”
^ లేదా “మీ గుండెలు శాశ్వతంగా కొట్టుకుంటూ ఉండాలి.”