కీర్తనలు 139:1-24
సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు కీర్తన. శ్రావ్యగీతం.
139 యెహోవా, నువ్వు నన్ను బాగా పరిశోధించావు,
నేను నీకు తెలుసు.+
2 నేను కూర్చోవడం, లేవడం నీకు తెలుసు.+
దూరం నుండే నువ్వు నా ఆలోచనల్ని గ్రహిస్తావు.+
3 నేను ప్రయాణిస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు నువ్వు నన్ను గమనిస్తావు;నా మార్గాలన్నీ నీకు బాగా తెలుసు.+
4 మాట ఇంకా నా నాలుక మీదికి రాకముందే,యెహోవా, అది ఏమిటో నీకు బాగా తెలుసు.+
5 నువ్వు నా వెనక, నా ముందు, నా చుట్టూ ఉన్నావు;నా మీద నీ చెయ్యి ఉంచావు.
6 ఆ జ్ఞానం నా అవగాహనకు మించింది.*
అది నాకు అందనంత ఎత్తులో ఉంది.*+
7 నీ పవిత్రశక్తి నుండి తప్పించుకొని నేను ఎక్కడికి వెళ్లగలను?నీకు కనబడకుండా ఎక్కడికి పారిపోగలను?+
8 నేను ఆకాశానికి ఎక్కిపోయినా, అక్కడ నువ్వు ఉంటావు,నేను సమాధిలో* నా పరుపు వేసుకున్నా, ఇదిగో! అక్కడ కూడా నువ్వు ఉంటావు.+
9 సుదూరంలో ఉన్న సముద్రం పక్కన నివసించాలనివేకువ రెక్కలతో నేను ఎగిరిపోయినా,
10 అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది,నీ కుడిచెయ్యి నన్ను పట్టుకుంటుంది.+
11 “చీకటి ఖచ్చితంగా నన్ను దాచేస్తుంది!” అని నేను అనుకుంటే,
నా చుట్టూ ఉన్న రాత్రి కూడా వెలుగుగా మారుతుంది.
12 చీకటి కూడా నీకు మరీ చీకటిగా ఉండదు,రాత్రి కూడా పగటి వెలుగులా ఉంటుంది;+చీకటి కూడా నీకు వెలుగుతో సమానం.+
13 ఎందుకంటే నా మూత్రపిండాల్ని నువ్వే రూపొందించావు;నా తల్లి గర్భంలో నన్ను తెర చాటున ఉంచావు.*+
14 నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఎందుకంటే సంభ్రమాశ్చర్యాలు పుట్టించే రీతిలో నేను అద్భుతంగా చేయబడ్డాను.+
నీ పనులు అద్భుతమైనవి,+ఈ విషయం నాకు చాలా బాగా తెలుసు.
15 రహస్య స్థలంలో నేను రూపొందించబడినప్పుడు,భూమి లోతైన స్థలాల్లో నేను మలచబడినప్పుడునా ఎముకలు కూడా నీకు కనిపించాయి.+
16 నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్లు నన్ను చూశాయి;దాని భాగాల్లో ఏ ఒక్కటీ తయారవ్వకముందే,అవన్నీ రూపొందిన రోజుల గురించినీ గ్రంథంలో రాయబడింది.
17 కాబట్టి నీ ఆలోచనలు నాకెంతో అమూల్యమైనవి!+
దేవా, వాటి సంఖ్య చాలా పెద్దది!+
18 నేను వాటిని లెక్కపెట్టడానికి ప్రయత్నిస్తే, అవి ఇసుక రేణువుల కన్నా ఎక్కువగా ఉన్నాయి.+
నేను నిద్ర లేచినప్పుడు, ఇంకా నీతోనే ఉన్నాను.*+
19 దేవా, నువ్వు దుష్టుల్ని హతం చేస్తే ఎంత బావుంటుంది!+
అప్పుడు, దౌర్జన్యం చేసేవాళ్లు* నాకు దూరంగా వెళ్తారు.
20 వాళ్లు తప్పుడు ఉద్దేశాలతో* నీ గురించి చెడుగా మాట్లాడుతుంటారు;వాళ్లు నీ శత్రువులు, వాళ్లు నీ పేరును వ్యర్థంగా ఉపయోగిస్తారు.+
21 యెహోవా, నిన్ను ద్వేషించేవాళ్లను నేను ద్వేషిస్తున్నాను కదా?+నీ మీద తిరుగుబాటు చేసేవాళ్లను అసహ్యించుకుంటున్నాను కదా?+
22 వాళ్లంటే నాకు బొత్తిగా అసహ్యం;+వాళ్లు నాకు బద్ధశత్రువులు.
23 దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో.+
నన్ను పరిశీలించి, నన్ను కలవరపెడుతున్న ఆలోచనల్ని తెలుసుకో.+
24 హానికరమైన మార్గంలోకి తీసుకెళ్లేది ఏదైనా నాలో ఉందేమో చూడు,+శాశ్వత మార్గంలో నన్ను నడిపించు.+
అధస్సూచీలు
^ లేదా “చాలా అద్భుతం అనిపిస్తుంది.”
^ లేదా “దాన్ని నేను అంచనా వేయలేను.”
^ లేదా “ఒకటిగా మలిచావు” అయ్యుంటుంది.
^ లేదా “ఇంకా వాటిని లెక్కపెడుతూనే ఉంటాను” అయ్యుంటుంది.
^ లేదా “రక్తాపరాధులు.”
^ లేదా “తమ ఆలోచన ప్రకారం.”