85వ అధ్యాయం
పశ్చాత్తాపపడిన పాపి విషయంలో సంతోషించడం
-
తప్పిపోయిన గొర్రె, పోయిన నాణెం ఉదాహరణలు
-
పరలోకంలో దూతలు సంతోషించడం
వినయం చూపించడం ముఖ్యమని యేసు తన పరిచర్యలో చాలాసార్లు చెప్పాడు. (లూకా 14:8-11) వినయంగా దేవుణ్ణి సేవించాలని కోరుకునేవాళ్ల కోసం యేసు ఆసక్తిగా వెతుకుతున్నాడు. అయితే వాళ్లలో కొంతమంది ఇంకా ఘోరమైన పాపులుగానే ఉండి ఉంటారు.
పరిసయ్యులు, శాస్త్రులు హీనంగా చూసే అలాంటి పాపులు యేసు దగ్గరికి వచ్చి, ఆయన చెప్పేది వింటున్నారు. అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు “ఇతను పాపులతో కలిసిపోయి వాళ్లతో పాటు భోంచేస్తున్నాడు” అని గొణుక్కున్నారు. (లూకా 15:2) ఆ మతనాయకులు తాము గొప్పవాళ్లమని అనుకుంటూ, సామాన్య ప్రజల్ని తమ కాళ్ల కింద మట్టిలా హీనంగా చూసేవాళ్లు. అందుకే ఆ ప్రజల్ని హీబ్రూలో ఆమ్హారెట్స్ [మట్టి మనుషులు] అని పిలిచేవాళ్లు.
అయితే యేసు మాత్రం అందర్నీ గౌరవిస్తూ వాళ్ల పట్ల దయ, కనికరం చూపించాడు. అందుకే చాలామంది దీనులు, అలాగే పాపులుగా పేరున్నవాళ్లు యేసు చెప్పేవి వినాలని కోరుకున్నారు. అలాంటి నిస్సహాయులకు సహాయం చేస్తున్నందుకు విమర్శలు ఎదురైనప్పుడు యేసుకు ఎలా అనిపించి ఉంటుంది? ఆయన ఎలా స్పందించాడు?
హృదయాన్ని తాకే ఒక ఉదాహరణ యేసు చెప్పాడు. ఆయన అలాంటి ఉదాహరణే ఇదివరకు కపెర్నహూములో చెప్పాడు. (మత్తయి 18:12-14) పరిసయ్యులు నీతిమంతుల్లా దేవుని మందలో సురక్షితంగా ఉన్నట్లు, దీనులు తప్పిపోయి మంద నుండి దూరమైనట్లు వర్ణిస్తూ యేసు ఈ ఉదాహరణ చెప్పాడు:
“మీలో ఎవరికైనా 100 గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే, అతను మిగతా 99 గొర్రెల్ని ఎడారిలో విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె దొరికే వరకు దాన్ని వెతకడానికి వెళ్లడా? అది దొరికినప్పుడు, అతను దాన్ని భుజాల మీద వేసుకొని ఎంతో సంతోషిస్తాడు. అతను ఇంటికి వచ్చినప్పుడు తన స్నేహితుల్ని, చుట్టుపక్కల వాళ్లను పిలిచి, ‘నాతో కలిసి సంతోషించండి. తప్పిపోయిన నా గొర్రె దొరికింది’ అంటాడు.”—లూకా 15:4-6.
ఈ ఉదాహరణలో ఉన్న పాఠం ఏంటి? ఆయనిలా వివరించాడు: “అదేవిధంగా, పశ్చాత్తాపపడాల్సిన అవసరంలేని 99 మంది నీతిమంతుల కన్నా, పశ్చాత్తాపపడిన ఒక్క పాపి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని నేను మీతో చెప్తున్నాను.”—లూకా 15:7.
పశ్చాత్తాపపడడం గురించి యేసు చెప్పిన విషయానికి పరిసయ్యులు అవాక్కయి ఉంటారు. వాళ్లు నీతిమంతులని, పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదని అనుకునేవాళ్లు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం, పన్ను వసూలుచేసే వాళ్లతో, పాపులతో కలిసి యేసు భోజనం చేసినప్పుడు కొంతమంది పరిసయ్యులు విమర్శించారు. అప్పుడు ఆయన ఇలా జవాబిచ్చాడు: “నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు కానీ పాపుల్ని పిలవడానికే వచ్చాను.” (మార్కు 2:15-17) స్వనీతిపరులైన పరిసయ్యులు పశ్చాత్తాపపడాల్సిన అవసరాన్ని గుర్తించట్లేదు. కాబట్టి వాళ్ల వల్ల పరలోకంలో సంతోషం కలగదు. కానీ పాపులు నిజంగా పశ్చాత్తాపపడినప్పుడు పరలోకంలో సంతోషం కలుగుతుంది.
తప్పిపోయిన పాపులు తిరిగొచ్చినప్పుడు పరలోకంలో చాలా సంతోషం కలుగుతుంది. ఆ విషయాన్ని నొక్కిచెప్తూ యేసు మరో ఉదాహరణ చెప్పాడు. ఈసారి ఇంట్లో జరిగే విషయాన్ని చెప్పాడు: “ఏ స్త్రీకైనా పది వెండి నాణేలు ఉండి వాటిలో ఒక నాణెం పోతే, ఆమె దీపం వెలిగించి, ఇల్లంతా ఊడ్చి, ఆ నాణెం దొరికే వరకు జాగ్రత్తగా వెతకదా? ఆ నాణెం దొరికినప్పుడు ఆమె తన స్నేహితురాళ్లను, చుట్టుపక్కల వాళ్లను పిలిచి, ‘నాతో కలిసి సంతోషించండి. పోయిన నా వెండి నాణెం దొరికింది’ అంటుంది.”—లూకా 15:8, 9.
తప్పిపోయిన గొర్రె ఉదాహరణలో ఉన్నలాంటి పాఠాన్నే యేసు మళ్లీ చెప్పాడు: “అదేవిధంగా, పశ్చాత్తాపపడే ఒక్క పాపి విషయంలో దేవదూతల మధ్య ఎంతో సంతోషం కలుగుతుందని నేను మీతో చెప్తున్నాను.”—లూకా 15:10.
ఒక్కసారి ఊహించండి, తప్పిపోయిన పాపులు తిరిగొచ్చే విషయంలో దేవదూతలకు చాలా శ్రద్ధ ఉంది! అది చాలా ప్రత్యేకమైన విషయం. ఎందుకంటే, పశ్చాత్తాపపడిన పాపులు పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకున్నప్పుడు, వాళ్లు దేవదూతలకన్నా పైస్థానంలో ఉంటారు! (1 కొరింథీయులు 6:2, 3) అయినా దేవదూతలు ఏమాత్రం అసూయపడరు. మరి ఒక పాపి నిజంగా పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి తిరిగొచ్చినప్పుడు మనమెలా స్పందించాలి?