15వ పాఠం
పెద్దలు సంఘానికి ఎలా సహాయం చేస్తారు?
మా సంస్థలో డబ్బులకు పనిచేసే మతనాయకులు ఉండరు. బదులుగా, “దేవుని సంఘాన్ని కాయడం కోసం” అర్హతగల పర్యవేక్షకులు నియమించబడతారు. క్రైస్తవ సంఘం మొదలైనప్పుడు అలాంటి ఏర్పాటే ఉండేది. (అపొస్తలుల కార్యాలు 20:28) ఆధ్యాత్మిక అర్హతలు ఉన్న ఈ పెద్దలు సంఘంలో నాయకత్వం వహిస్తారు, దేవుని మందను కాస్తారు. వాళ్లు ఆ పనిని ‘బలవంతంగా కాకుండా దేవుని ముందు ఇష్టపూర్వకంగా, అక్రమ లాభం మీద ప్రేమతో కాకుండా ఉత్సాహంతో’ చేస్తారు. (1 పేతురు 5:1-3) మా కోసం వాళ్లు ఏమేం చేస్తారు?
వాళ్లు మా మీద శ్రద్ధ చూపిస్తారు, మమ్మల్ని సంరక్షిస్తారు. పెద్దలు సంఘంలోని వాళ్లకు బైబిలు నిర్దేశం ఇస్తూ, యెహోవాకు దగ్గరగా ఉండేలా సహాయం చేస్తారు. ఈ ముఖ్యమైన బాధ్యతను అప్పగించింది దేవుడే అని వాళ్లు గుర్తుంచుకుంటారు. అందుకే వాళ్లు దేవుని ప్రజలమీద పెత్తనం చెలాయించరు కానీ వాళ్ల సంక్షేమం కోసం, సంతోషం కోసం పాటుపడతారు. (2 కొరింథీయులు 1:24) గొర్రెల కాపరి ప్రతీ గొర్రెను శ్రద్ధగా చూసుకున్నట్టు, పెద్దలు సంఘంలోని ప్రతీ ఒక్కరి గురించి బాగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.—సామెతలు 27:23.
దేవుని ఇష్టాన్ని ఎలా చేయాలో వాళ్లు మాకు బోధిస్తారు. ప్రతీవారం, పెద్దలు సంఘ కూటాల్లో నాయకత్వం వహిస్తూ మా విశ్వాసాన్ని బలపరుస్తారు. (అపొస్తలుల కార్యాలు 15:32) అంతేకాదు, అంకితభావంతో సేవచేసే ఈ సహోదరులు ప్రకటనా పనిలో ముందుండి నడిపిస్తారు, మాతో కలిసి పనిచేస్తారు, అన్నిరకాల పద్ధతుల్లో పరిచర్య చేయడం నేర్పిస్తారు.
మమ్మల్ని కలిసి ప్రోత్సహిస్తారు. యెహోవాతో మాకున్న సంబంధాన్ని బలపర్చుకోవడానికి పెద్దలు మాలో ప్రతీ ఒక్కరికి సహాయం చేస్తారు. అందుకోసం వాళ్లు మా ఇంటికి వచ్చి లేదా రాజ్యమందిరంలో కలిసి మాతో మాట్లాడతారు. వాళ్లు లేఖనాల ద్వారా మాకు సహాయాన్ని, ఓదార్పును ఇస్తారు.—యాకోబు 5:14, 15.
చాలామంది పెద్దలు సంఘ పనులతో పాటు ఉద్యోగ, కుటుంబ బాధ్యతలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది, వాటికి సమయం వెచ్చించాల్సి ఉంటుంది. కష్టపడి పనిచేసే ఈ సహోదరులు మా గౌరవం పొందడానికి అర్హులు.—1 థెస్సలొనీకయులు 5:12, 13.
-
సంఘ పెద్దలు ఏమేం చేస్తారు?
-
పెద్దలు ఏయే విధాలుగా వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తారు?