కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్య దేవుడు విడుదల గురించి ప్రవచిస్తాడు

సత్య దేవుడు విడుదల గురించి ప్రవచిస్తాడు

ఐదవ అధ్యాయం

సత్య దేవుడు విడుదల గురించి ప్రవచిస్తాడు

యెషయా 44:​1-28

1, 2. (ఎ) యెహోవా ఏ ప్రశ్నలను లేవనెత్తాడు? (బి) తాను మాత్రమే సత్య దేవుడినని యెహోవా ఎలా నిరూపించుకుంటాడు?

 ‘సత్య దేవుడు ఎవరు?’ శతాబ్దాలుగా ఈ ప్రశ్న వేయబడుతోంది. కాబట్టి, యెషయా గ్రంథంలో యెహోవా తానే ఈ ప్రశ్నను లేవనెత్తడం ఎంత ఆశ్చర్యకరం! ‘యెహోవాయే ఏకైక సత్య దేవుడా? లేక ఆయన స్థానాన్ని సవాలు చేయగల వారెవరైనా ఉన్నారా?’ అని పరిశీలించమని ఆయన మానవులను ఆహ్వానిస్తున్నాడు. యెహోవా చర్చను ప్రారంభించిన తర్వాత, దైవత్వాన్ని గురించిన వివాదాంశాన్ని పరిష్కరించడానికి సహేతుకమైన ప్రమాణాలను అందజేస్తున్నాడు. ఇక్కడ చేయబడిన తర్కము యథార్థ హృదయులు తిరుగులేని ఒక ముగింపుకు చేరుకునేందుకు నడిపిస్తుంది.

2 యెషయా కాలంలో విగ్రహాలు విస్తృతంగా ఆరాధించబడేవి. యెషయా ప్రవచనార్థక గ్రంథంలోని 44 వ అధ్యాయంలో వ్రాయబడివున్న నిష్పక్షపాతమైన, స్పష్టమైన చర్చలో, విగ్రహారాధన ఎంత వ్యర్థమైనదిగా చూపించబడిందో కదా! అయినప్పటికీ, దేవుని స్వంత ప్రజలే విగ్రహాలను ఆరాధించే ఉరిలో చిక్కుకున్నారు. కాబట్టి యెషయా గ్రంథంలోని గత అధ్యాయాల్లో చూసినట్లుగా, ఇశ్రాయేలీయులు తీవ్రమైన క్రమశిక్షణను పొందబోతున్నారు. అయితే, బబులోనీయులు తన ప్రజలను చెరపట్టడానికి అనుమతించినప్పటికీ, తన నియమిత సమయంలో వారిని విడుదల చేస్తానని యెహోవా ఆ జనముకు ప్రేమపూర్వకంగా హామీ ఇస్తున్నాడు. జీవంలేని అన్య దేవుళ్ళను ఆరాధించేవారందరికీ అవమానం కలిగిస్తూ, చెరనుండి విడుదల చేయబడడాన్ని, సత్యారాధన పునఃస్థాపించబడడాన్ని గురించిన ప్రవచనాల నెరవేర్పు యెహోవా మాత్రమే సత్య దేవుడని నిస్సందేహంగా నిరూపిస్తుంది.

3. యెషయా ప్రవచనార్థక మాటలు నేడు క్రైస్తవులకు ఎలా సహాయం చేస్తాయి?

3 యెషయా గ్రంథంలోని ఈ భాగంలో ఉన్న ప్రవచనాలు, ప్రాచీన కాలాల్లో వాటి నెరవేర్పు నేడు క్రైస్తవుల విశ్వాసాన్ని బలపరుస్తాయి. అంతేగాక, యెషయా ప్రవచనార్థక మాటలు మన కాలంలోనూ, భవిష్యత్తులోనూ నెరవేరతాయి. ఆ సంఘటనల్లో, విమోచకుడు, దేవుని ప్రాచీన ప్రజల కోసం ప్రవచించబడిన దాని కన్నా గొప్ప విడుదల ఒక భాగం.

యెహోవాకు చెందేవారికి నిరీక్షణ

4. యెహోవా ఇశ్రాయేలును ఎలా ప్రోత్సహిస్తున్నాడు?

4 ఇశ్రాయేలు తన చుట్టుప్రక్కలనున్న జనముల నుండి వేరుచేయబడి, తన సేవకుడయ్యేందుకు దేవుడు ఇశ్రాయేలును ఎంపిక చేసుకున్నాడని గుర్తుచేస్తూ 44 వ అధ్యాయం ఒక అనుకూలమైన వాక్యంతో ప్రారంభమవుతోంది. ప్రవచనం ఇలా చెబుతోంది: “నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు​—⁠నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.” (యెషయా 44:​1, 2) ఇశ్రాయేలు తన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే అంటే ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ఒక జనముగా ఏర్పడినప్పటి నుండే యెహోవా దాని గురించి శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన తన ప్రజలను సమష్టిగా “యెషూరూనూ” అని పిలుస్తున్నాడు, దానికి “నీతిమంతుడు” అని భావం, అది ప్రేమానురాగాలను వ్యక్తం చేసే విశిష్ట నామము. ఇశ్రాయేలీయులు నీతిమంతులుగా ఉండాలనేదానికి కూడా ఈ పేరు ఒక జ్ఞాపిక, కానీ వారు నీతిమంతులుగా ఉండడంలో తరచూ విఫలమయ్యారు.

5, 6. యెహోవా ఇశ్రాయేలు కోసం ఉపశమనాన్నిచ్చే ఎటువంటి ఏర్పాట్లను చేస్తాడు, ఫలితమేమిటి?

5 యెహోవా తర్వాతి మాటలు ఎంత ఆహ్లాదకరమైనవిగా, ఉపశమనాన్నిచ్చేవిగా ఉన్నాయో కదా! ఆయనిలా చెబుతున్నాడు: “నేను దప్పిగలవానిమీద నీళ్లను, ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను. నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను. నీటికాలువలయొద్ద నాటబడిన నిరవంజిచెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు.” (యెషయా 44:​3, 4) తేమలేని ఉష్ణదేశంలో సహితం, నీటి ప్రవాహాల వద్ద నాటబడిన చెట్లు బాగా ఎదుగుతాయి. యెహోవా జీవమిచ్చే తన సత్య జలాలను అనుగ్రహించి, తన పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు, నీటి కాలువల ప్రక్కనున్న చెట్లలా ఇశ్రాయేలు శక్తివంతంగా వర్ధిల్లుతుంది. (కీర్తన 1: 3; యిర్మీయా 17:​7, 8) తన దైవత్వానికి సాక్షులుగా తమ పాత్రను నిర్వహించడానికి కావలసిన బలాన్ని యెహోవా తన ప్రజలకు ఇస్తాడు.

6 ఇలా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడడం వల్ల కలిగే ఒక ఫలితమేమిటంటే, ఇశ్రాయేలుకు యెహోవాతో ఉన్న సంబంధంపట్ల కొంతమంది వ్యక్తులకున్న మెప్పు పునర్నూతనం చేయబడుతుంది. అందుకే, మనమిలా చదువుతాము: “ఒకడు​—⁠నేను యెహోవావాడననును. మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరియొకడు యెహోవావాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును.” (యిషయా 44: 5) అవును, యెహోవా నామమును ధరించడం ఒక ఘనతే, ఎందుకంటే ఆయన మాత్రమే ఏకైక సత్య దేవుడని వారు గ్రహిస్తారు.

అన్యదేవుళ్ళకు సవాలు

7, 8. అన్య దేవుళ్ళను యెహోవా ఏమని సవాలు చేస్తున్నాడు?

7 మోషే ధర్మశాస్త్రం క్రింద, ఒక వ్యక్తిని సాధారణంగా అతని బంధువైన పురుషుడు దాసత్వం నుండి విడిపించగలుగుతాడు. (లేవీయకాండము 25:​47-54; రూతు 2:​20) బబులోనుకు, దాని దేవుళ్ళందరికీ సిగ్గుకలిగే విధంగా, యెహోవా ఇప్పుడు తాను ఇశ్రాయేలు విమోచకుడినని అంటే జనమును విడిపించేవాడినని వెల్లడిచేసుకుంటున్నాడు. (యిర్మీయా 50:​34) ఆయనిలా చెబుతూ అబద్ధ దేవుళ్ళను, వారి ఆరాధకులను ఎదుర్కొంటున్నాడు: “ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్పవలెను. ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై యుండవలెను. మీరు వెరవకుడి భయపడకుడి. పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నేనెరుగను.”​—యెషయా 44:​6-8.

8 తాము దేవుళ్ళమనడానికి సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టమని అన్యదేవుళ్ళను యెహోవా సవాలు చేస్తున్నాడు. ఇప్పటికే జరుగుతున్నట్లు అనిపించేంతటి ఖచ్చితత్వంతో భవిష్యద్‌ సంఘటనలను ముందే తెలియజేస్తూ వారు లేనివాటిని ఉన్నట్టుగా పిలువగలరా? అబద్ధ దేవుళ్ళందరూ ఉనికిలోకి రాకముందు నుండీ ఉండి, వారు మరువబడి ఎంతో కాలం గడిచిన తర్వాత కూడా ఉండేవాడైన ‘మొదటివాడు, కడపటివాడు’ మాత్రమే అటువంటిది చేయగలడు. ఈ సత్యానికి సాక్ష్యమిచ్చేందుకు ఆయన ప్రజలు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే వారికి గొప్ప ఆశ్రయదుర్గమంత దృఢమైనవాడు, స్థిరమైనవాడు అయిన యెహోవా మద్దతు ఉంది.​—⁠ద్వితీయోపదేశకాండము 32: 4; 2 సమూయేలు 22:​31, 32.

విగ్రహారాధన యొక్క వ్యర్థత

9. ఇశ్రాయేలీయులు జీవముగల దేని రూపమునైనా చేసుకోవడం తప్పా? వివరించండి.

9 అబద్ధ దేవుళ్ళకు యెహోవా చేసిన సవాలు, పది ఆజ్ఞల్లో రెండవదాన్ని మనకు జ్ఞప్తికి తెస్తుంది. “పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు” అని ఆ ఆజ్ఞ స్పష్టంగా పేర్కొంది. (నిర్గమకాండము 20:​4, 5) అయితే ఈ నిషేధం యొక్క భావం ఇశ్రాయేలీయులు అలంకరణ వస్తువులుగా వేటి ఆకృతినీ చేసుకోకూడదని కాదు. చెట్లు, జంతువులు, కెరూబుల ఆకృతులను చేసి గుడారంలో పెట్టమని యెహోవా తానే నిర్దేశించాడు. (నిర్గమకాండము 25:​18; నిర్గమకాండము 26:​31) అయితే వీటిని పూజించకూడదు లేక ఆరాధించకూడదు. ఎవరూ ఆ ఆకృతులకు ప్రార్థించకూడదు లేదా బలులు అర్పించకూడదు. ఆరాధనా వస్తువుగా ఉపయోగించడానికి ఏ విధమైన రూపమును చేసుకోవడాన్నైనా దైవ ప్రేరేపిత ఆజ్ఞ నిషేధించింది. ప్రతిమలను ఆరాధించడం లేదా భక్తిపూర్వకంగా వాటి ఎదుట సాగిలపడడం విగ్రహారాధన క్రిందకే వస్తుంది.​—⁠1 యోహాను 5:​21.

10, 11. యెహోవా ప్రతిమలను అవమానకరమైనవిగా ఎందుకు దృష్టిస్తాడు?

10 యెషయా ఇప్పుడు నిర్జీవ ప్రతిమల నిష్‌ప్రయోజకత్వాన్ని, వాటిని చేసే వారి కోసం వేచివున్న అవమానాన్ని వర్ణిస్తున్నాడు: “విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారు, వారికిష్టమైన విగ్రహములు నిష్‌ప్రయోజనములు; తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానినొక దేవునిగా నిరూపించువాడెవడు? ఇదిగో దాని పూజించువారందరు సిగ్గుపడుదురు ఆ శిల్పకారులు నరమాత్రులే గదా? వారందరు పోగుచేయబడి నిలువబడవలెను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు.”​—యెషయా 44:​9-11.

11 దేవుడు ఈ విగ్రహాలను అంత అవమానకరమైనవిగా ఎందుకు పరిగణిస్తాడు? మొదటిగా, భౌతిక వస్తువులతో సర్వశక్తిమంతుడి ప్రతిమను ఖచ్చితంగా చేయడమన్నది అసాధ్యం. (అపొస్తలుల కార్యములు 17:​29) అంతేగాక, సృష్టికర్తను ఆరాధించే బదులు సృష్టింపబడినదాన్ని ఆరాధించడం యెహోవా దైవత్వానికే అవమానం. “దేవుని స్వరూపమందు” సృజింపబడిన మానవునికి మాత్రం అది అవమానకరం కాదా?​—⁠ఆదికాండము 1:​27; రోమీయులు 1:​23, 25.

12, 13. మానవుడు ఆరాధనకు యోగ్యమైన ప్రతిమను ఎందుకు చేయలేడు?

12 భౌతిక పదార్థానికి ఒక రూపాన్నిచ్చి దాన్ని ఆరాధించినంత మాత్రాన అది పవిత్రతను సంతరించుకోగలదా? ఒక ప్రతిమను చేయడమన్నది కేవలం మానవుని హస్తకృత్యమేనని యెషయా మనకు గుర్తుచేస్తున్నాడు. ప్రతిమను చేసే వ్యక్తి యొక్క ఉపకరణాలు, నైపుణ్యాలు ఇతర పనివాళ్ళు ఉపయోగించేలాంటివే: “కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పనిచేయును; సుత్తెతో దానిని రూపించి తన బాహుబలముచేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును. నీళ్లు త్రాగక సొమ్మసిల్లును. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రికలతో దాని చక్కచేయును; కర్కాటకములతో గురుతుపెట్టి దాని రూపించును మందిరములో దాని స్థాపింపవలెనని నరరూపముగల దానిగాను నరసౌందర్యముగలదానిగాను చేయును.”​—యెషయా 44:​12, 13.

13 సత్య దేవుడు, మానవునితో సహా ఈ భూమిపైనున్న జీవప్రాణులన్నిటినీ సృష్టించాడు. సచేతన జీవం యెహోవా దైవత్వానికి అద్భుతమైన సాక్ష్యాధారం, అయితే యెహోవా సృష్టించిన ప్రతీదీ ఆయనకంటే తక్కువదే. మానవుడు యెహోవాకన్నా శ్రేష్ఠంగా ఏదైనా చేయగలగడం సాధ్యమేనా? అతడు తనకన్నా ఎంతో ఉన్నతమైనది అంటే దాని ఎడల తన భక్తిని చూపించగలిగేంతటి ఉన్నతమైనదేదైనా చేయగలడా? ఒక వ్యక్తి ఒక ప్రతిమను చేసినప్పుడు, అతడు అలిసిపోతాడు, అతనికి ఆకలవుతుంది, దాహం వేస్తుంది. ఇవి మానవులకున్న పరిమితులు, కానీ కనీసం ఆ వ్యక్తి సజీవంగా ఉన్నాడని అవి చూపిస్తాయి. అతడు చేసే ప్రతిమ మనిషిలా కనిపించవచ్చు. అది అందంగా కూడా ఉండవచ్చు. కానీ అది నిర్జీవమైనది. ప్రతిమలు ఏవిధంగానూ దైవికం కాదు. అంతేగాక, ప్రతిమకు మూలం నరమాత్రుడు కాక మరేదో ఉన్నతమైనదన్నట్లు చెక్కబడిన ఏ ప్రతిమా ఎన్నడూ ‘ఆకాశం నుండి పడలేదు.’​—⁠అపొస్తలుల కార్యములు 19:​35, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.

14. ప్రతిమలను చేసేవారు యెహోవాపై పూర్తిగా ఎలా ఆధారపడి ఉన్నారు?

14 ప్రతిమలను చేసేవారు యెహోవా సృష్టించిన సహజ ప్రక్రియలపైన, పదార్థాలపైన పూర్తిగా ఆధారపడతారని యెహోవా చూపిస్తున్నాడు: “ఒకడు దేవదారుచెట్లను నరుకవలెనని పూనుకొనును; శ్మశానావృక్షమును గాని సరళవృక్షమును గాని సిందూరవృక్షములకు గాని అడవి వృక్షములలో ఏదో ఒకదానిని తీసికొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును. ఒకడు పొయ్యికట్టెలకు వాటి నుపయోగించును. వాటిలో కొంత తీసికొని చలి కాచుకొనును. నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసికొని దానితో ఒక దేవతను చేసికొనును, దానికి నమస్కారము చేయును, దానితో ఒక విగ్రహముచేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చియున్నాడు. కొదువ సగముతో మాంసము వండి భక్షించియున్నాడు. తిని తృప్తిపొందగా చలి కాచుకొనుచు ఆహా, చలి కాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును. దానియెదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు​—⁠నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును.”​—యెషయా 44:​14-17.

15. విగ్రహాలను చేసే వ్యక్తి ఏ అవగాహనా లోపాన్ని చూపిస్తున్నాడు?

15 చెక్కముక్క ఎవరినైనా విడుదల చేయగలదా? చేయలేదు. కేవలం సత్య దేవుడు మాత్రమే విడుదల చేయగలడు. ప్రజలు నిర్జీవ వస్తువులను ఎలా ఆరాధించగలరు? అసలైన సమస్య ఆ వ్యక్తి హృదయంలో ఉందని యెషయా చూపిస్తున్నాడు: “వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పులమీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకొని భోజనము చేసితిని మిగిలినదానిని తీసికొని దానితో హేయమైనదాని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? అని యెవడును ఆలోచింపడు, యోచించుటకు ఎవనికిని తెలివిలేదు వివేచనలేదు. వాడు బూడిదె తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవుచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు.” (యెషయా 44:​18-20) అవును, విగ్రహారాధన ఆధ్యాత్మికంగా ఏదైనా మంచిదాన్ని ఇవ్వగలదని తలంచడం, పౌష్టికాహారానికి బదులు బూడిద తిన్నట్లుగా ఉంటుంది.

16. విగ్రహారాధన ఎలా ఉద్భవించింది, ఏది దాన్ని సాధ్యం చేస్తుంది?

16 యెహోవాకు మాత్రమే చెందవలసిన ఆరాధన తనకు కావాలని శక్తివంతమైన ఆత్మ ప్రాణియైన సాతాను వాంఛించినప్పుడే, విగ్రహారాధన వాస్తవానికి పరలోకంలో ప్రారంభమైంది. సాతాను కోరిక ఎంత బలంగా ఉందంటే అది చివరికి అతడిని దేవుని నుండి దూరం చేసేసింది. నిజంగా అది విగ్రహారాధనకు ఆరంభం, ఎందుకంటే అత్యాశ విగ్రహారాధన వంటిదేనని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (యెషయా 14:​12-14; యెహెజ్కేలు 28:​13-15, 17; కొలొస్సయులు 3:​5, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) సాతాను, మొదటి మానవ జంట స్వార్థపూరితమైన తలంపులను కలిగివుండేలా వారిని ప్రేరేపించాడు. “మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు” సాతాను తనకు చెప్పిన దాన్ని హవ్వ అతిగా ఆశించింది. అత్యాశ హృదయం నుండి ఉద్భవిస్తుందని యేసు పేర్కొన్నాడు. (ఆదికాండము 3: 5; మార్కు 7:​20-23) హృదయాలు కలుషితమైనప్పుడు విగ్రహారాధన చేయడానికి మొగ్గుచూపే అవకాశం ఉంది. కాబట్టి మనమందరం మన హృదయాల్లో యెహోవాకున్న సరైన స్థానాన్ని మరెవరూ లేదా మరేదీ ఆక్రమించడానికి అనుమతించకుండా, ‘మన హృదయాలను భద్రముగా కాపాడుకోవడం’ ఎంత ప్రాముఖ్యమో కదా!​—⁠సామెతలు 4:​23; యాకోబు 1:​14.

యెహోవా హృదయాలకు విజ్ఞప్తి చేస్తాడు

17. ఇశ్రాయేలు ఏ విషయాన్ని మనస్సులో ఉంచుకోవాలి?

17 తర్వాత, తాము ఆధిక్యతగల, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నామనే విషయాన్ని గుర్తు చేసుకొమ్మని యెహోవా వారికి విజ్ఞప్తి చేస్తున్నాడు. వారు ఆయన సాక్షులు! ఆయనిలా అంటున్నాడు: “యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము నీవు నా సేవకుడవు. నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు. నేను నిన్ను మరచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను. నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి! భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి! పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతివృక్షమా, సంగీతనాదము చేయుడి! యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును.”​—యెషయా 44:​21-23.

18. (ఎ) ఇశ్రాయేలు ఆనందించడానికి ఎందుకు కారణం ఉంది? (బి) నేడు యెహోవా సేవకులు కనికరం విషయంలో ఆయన మాదిరిని ఎలా అనుకరించవచ్చు?

18 ఇశ్రాయేలు యెహోవాను నిర్మించలేదు. ఆయన మానవ నిర్మిత దేవుడు కాదు. బదులుగా, యెహోవా ఇశ్రాయేలును తాను ఎంపిక చేసుకొనిన సేవకునిగా నిర్మించాడు. జనమును విడుదల చేసినప్పుడు ఆయన మరొకసారి తన దైవత్వాన్ని నిరూపించుకుంటాడు. ఆయన తన ప్రజలనుద్దేశించి ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ, వారు పశ్చాత్తాపపడితే, దట్టమైన మబ్బు చాటున వారి తప్పిదములను దాచిపెట్టినట్లుగా వారి పాపాలను పూర్తిగా కప్పివేస్తానని వారికి హామీ ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ఆనందించడానికి ఎంత చక్కని కారణం! యెహోవా ఆధునిక దిన సేవకులు ఆయన కనికరాన్ని అనుకరించడానికి ఆయన మాదిరి వారిని పురికొల్పుతుంది. తప్పు చేస్తున్నవారికి సహాయం చేయడం ద్వారా, సాధ్యమైతే వారు ఆధ్యాత్మికంగా తిరిగి బలపడేందుకు ప్రయత్నించడం ద్వారా వారు ఆయన కనికరాన్ని అనుకరించవచ్చు.​—⁠గలతీయులు 6: 1, 2.

దైవత్వపు పరీక్ష యొక్క చరమాంకం

19, 20. (ఎ) యెహోవా తన వాదనను ఏ విధంగా చరమాంకానికి తీసుకువస్తున్నాడు? (బి) యెహోవా తన ప్రజల కోసం మనస్సులను ఉత్తేజపరిచే ఏ విషయాలను ప్రవచిస్తున్నాడు, ఈ విషయాలను నెరవేర్చడంలో ఆయన ప్రతినిధిగా ఎవరు ఉంటారు?

19 యెహోవా ఇప్పుడు న్యాయమైన తన వాదనను శక్తివంతమైన చరమాంకానికి తీసుకువస్తున్నాడు. దైవత్వానికి సంబంధించిన అతితీవ్రమైన పరీక్షకు ఆయన తన జవాబును చెప్పబోతున్నాడు, అదేమిటంటే భవిష్యత్తును ఖచ్చితంగా ప్రవచించగల సామర్థ్యం. యెషయా గ్రంథం 44 వ అధ్యాయంలోని తర్వాతి ఐదు వచనాలను ఒక బైబిలు పండితుడు, ఏకైక సృష్టికర్తా భవిష్యత్తునూ ఇశ్రాయేలు విడుదలను గురించిన నిరీక్షణనూ బయల్పరచిన అద్వితీయుడు అయిన “ఇశ్రాయేలు దేవుని అతిశయ గీతము” అని పిలిచాడు. ఈ ఐదు వచనాల భాగం, జనాంగమును బబులోను నుండి విడుదల చేసే వ్యక్తి పేరును ప్రకటించడంతో క్రమంగా నాటకీయమైన చరమాంకానికి చేరుకుంటుంది.

20“గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు​—⁠యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను, నేనే భూమిని పరచినవాడను. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే; నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను​—⁠యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే. నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను కోరెషుతో​—⁠నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో​—⁠నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాదివేయబడుననియు నేను చెప్పుచున్నాను.”​—యెషయా 44:​24-28.

21. యెహోవా మాటలు ఏమని హామీ ఇస్తున్నాయి?

21 యెహోవాకు భవిష్యద్‌ సంఘటనలను ముందుగా తెలియజేసే సామర్థ్యమే కాదు, బయల్పరచబడిన తన సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చే శక్తి కూడా ఉంది. ఈ ప్రకటన ఇశ్రాయేలు నిరీక్షణకు ఆధారంగా పనిచేస్తుంది. బబులోను సైన్యాలు దేశాన్ని నిర్జనంగా చేసినా, యెరూషలేము దానిపై ఆధారపడివున్న నగరాలు మళ్ళీ కట్టబడతాయనడానికీ, అక్కడ సత్యారాధన పునఃస్థాపించబడుతుందనడానికీ అది ఒక హామీ. కానీ ఎలా?

22. యూఫ్రటీసు నది ఎలా ఎండిపోతుందో వివరించండి.

22 ప్రేరేపించబడని సోదెకాండ్రు సాధారణంగా, కాలం తమ ప్రవచనాలు తప్పని నిరూపిస్తుందేమోననే భయంతో మరీ నిర్దిష్టంగా ప్రవచించడానికి ధైర్యం చేయరు. దానికి భిన్నంగా, తన ప్రజలు స్వదేశానికి తిరిగి వెళ్ళి యెరూషలేమును, ఆలయాన్ని పునర్నిర్మించగలిగేలా వారిని విడుదల చేయడానికి తాను ఉపయోగించే వ్యక్తి పేరును యెహోవా యెషయా ద్వారా తెలియజేస్తాడు. ఆయన పేరు కోరెషు, ఆయన సైరస్‌ ద గ్రేట్‌ ఆఫ్‌ పర్సియా అని పిలువబడుతున్నాడు. బబులోను యొక్క బలమైన, విస్తృతమైన, రక్షణ విధానాన్ని ఛేదించుకొని ప్రవేశించడానికి కోరెషు ఉపయోగించే యుద్ధ తంత్ర వివరాలను కూడా యెహోవా తెలియజేస్తాడు. ఎత్తైన గోడలు, నగరం గుండా, నగరం చుట్టూ ప్రవహిస్తున్న నీటిప్రవాహాలు బబులోనుకు రక్షణగా ఉంటాయి. ఆ విధానంలో ప్రధానమైన దాన్ని అంటే యూఫ్రటీసు నదిని కోరెషు తనకు ప్రయోజనకరమైన విధంగా మలుచుకుంటాడు. ప్రాచీన చరిత్రకారులైన హెరొడోటస్‌ మరియు క్సెనోఫోన్‌ చెబుతున్న దాని ప్రకారం, తన సైనికులు దాటి వెళ్ళగలిగేంతగా నీటి మట్టం తగ్గిపోయేలా యూఫ్రటీసు నది బబులోను వైపుకు ప్రవహించకుండా కోరెషు దాన్ని ప్రక్కకు మళ్ళించాడు. బబులోనును కాపాడడానికి సంబంధించి దానికున్న సామర్థ్యం గురించి చెప్పాలంటే, శక్తివంతమైన యూఫ్రటీసు ఎండిపోతుంది.

23. కోరెషు ఇశ్రాయేలును విడుదల చేస్తాడన్న ప్రవచన నెరవేర్పు గురించి ఏ రికార్డు ఉంది?

23 కోరెషు దేవుని ప్రజలను విడుదల చేసి యెరూషలేము, ఆలయము పునర్నిర్మించబడేలా చూస్తాడన్న వాగ్దానం మాటేమిటి? బైబిలులో భద్రపరచబడి ఉన్న ఒక అధికారిక ప్రకటనలో, కోరెషు స్వయంగా ఇలా ప్రకటిస్తున్నాడు: “పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా​—⁠ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను; వారి దేవుడు వారికి తోడైయుండునుగాక.” (ఎజ్రా 1:​2, 3) యెషయా ద్వారా యెహోవా పలికిన మాట సంపూర్ణంగా నెరవేరింది!

యెషయా, కోరెషు, నేటి క్రైస్తవులు

24. “యెరూషలేమును మరల కట్టించవచ్చునని” అర్తహషస్త జారీ చేసిన ఆజ్ఞ అమలులోకి రావడానికీ, మెస్సీయ రాకకూ మధ్యనున్న సంబంధం ఏమిటి?

24 యెషయా గ్రంథంలోని 44 వ అధ్యాయం యెహోవాను ఏకైక సత్యదేవునిగా, ఆయన తన ప్రాచీన ప్రజల విమోచకునిగా ఘనపరుస్తుంది. అంతేగాక, ఆ ప్రవచనం నేడు మనకందరికీ ప్రగాఢమైన భావాన్ని కలిగి ఉంది. యెరూషలేము ఆలయం పునర్నిర్మించబడాలని కోరెషు సా.శ.పూ. 538/537 లో జారీ చేసిన ఆజ్ఞ, మరో గమనార్హమైన ప్రవచన నెరవేర్పుకు నడిపించిన సంఘటనలను ప్రారంభించింది. ఆయన తర్వాతి పరిపాలకుడైన అర్తహషస్త యెరూషలేము నగరం పునర్నిర్మించబడాలని ఆజ్ఞ జారీచేశాడు. [సా.శ.పూ. 455 లో,] “యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి” రావడానికి ఏడు సంవత్సరాల కాలనిడివిగల 69 “వారములు” పడుతుందని దానియేలు గ్రంథం వెల్లడించింది. (దానియేలు 9:​24, 25) ఈ ప్రవచనం కూడా నెరవేరింది. సరిగ్గా నిర్ణయించబడిన సమయానికి, సా.శ. 29 వ సంవత్సరంలో అంటే అర్తహషస్త జారీ చేసిన ఆజ్ఞ వాగ్దాన దేశంలో అమలులోకి వచ్చిన 483 సంవత్సరాలకు యేసు బాప్తిస్మం తీసుకుని తన భూపరిచర్యను ప్రారంభించాడు. a

25. కోరెషు చేతుల్లో బబులోను కూలిపోవడం ఆధునిక కాలాల్లో దేన్ని సూచిస్తుంది?

25 బబులోను కూలిపోవడం మూలంగా సుసాధ్యమైన, చెరలోనున్న యథార్థవంతులైన యూదుల విడుదల, 1919 లో అభిషిక్త క్రైస్తవులు ఆధ్యాత్మిక చెరనుండి విడుదల కావడానికి పూర్వఛాయగా ఉంది. ఆ విడుదల, ఒక వేశ్యగా వర్ణించబడుతున్న మరో బబులోను, అంటే సమిష్టిగా ఈ లోకంలోని అబద్ధ మతాలన్నిటికీ గుర్తు అయిన మహా బబులోను కూలిపోయిందనడానికి సాక్ష్యాధారం. ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లుగా, అపొస్తలుడైన యోహాను ఆమె కూలిపోవడాన్ని ముందుగా చూశాడు. (ప్రకటన 14: 8) ఆమె హఠాత్‌ నాశనాన్ని కూడా ఆయన ముందుగా చూశాడు. విగ్రహాలతో నిండివున్న ఆ ప్రపంచ సామ్రాజ్యపు నాశనాన్ని గూర్చిన యోహాను వర్ణన కొన్ని విధాలుగా, కోరెషు ప్రాచీన బబులోను నగరంపై సాధించిన విజయవంతమైన గెలుపును గూర్చిన యెషయా వర్ణనను పోలి ఉంది. బబులోనుకు భద్రతనిచ్చే నీటి ప్రవాహాలు దాన్ని కోరెషునుండి కాపాడలేకపోయినట్లుగానే, మహా బబులోనుకు మద్దతునిచ్చి, దాన్ని కాపాడే మానవజాతి అనే ‘జలాలు’ మహా బబులోను న్యాయబద్ధంగా నాశనం చేయబడడానికి ముందే ‘ఎండిపోతాయి.’​—⁠ప్రకటన 16:​12. b

26. యెషయా ప్రవచనం, దాని నెరవేర్పు మన విశ్వాసాన్ని ఎలా బలపరుస్తాయి?

26 మన దృక్కోణం నుండి చూస్తే, యెషయా తన ప్రవచనాన్ని ప్రకటించిన రెండున్నర సహస్రాబ్దాల కన్నా ఎక్కువ కాలం తర్వాత, దేవుడు నిజంగా ‘తన దూతల ఆలోచన నెరవేరుస్తాడని’ మనం చూడవచ్చు. (యెషయా 44:​26) కాబట్టి యెషయా ప్రవచన నెరవేర్పు, పరిశుద్ధ లేఖనాల్లోని అన్ని ప్రవచనాల విశ్వసనీయతకు విశేషమైన ఉదాహరణ.

[అధస్సూచీలు]

b వాచ్‌టవర్‌ సంస్థ ప్రచురించిన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకంలోని 35, 36 అధ్యాయాలను చూడండి.

[అధ్యయన ప్రశ్నలు]

[63 వ పేజీలోని చిత్రం]

చెక్కముక్క ఎవరినైనా విడుదల చేయగలదా?

[73 వ పేజీలోని చిత్రం]

ఒక ఇరాను రాజు, బహుశా కోరెషు యొక్క పాలరాతి శిరస్సు

[75 వ పేజీలోని చిత్రం]

యూఫ్రటీసు నదీ జలాలను ప్రక్కకు మళ్ళించడం ద్వారా కోరెషు ప్రవచనాన్ని నెరవేరుస్తాడు