కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరదైసు పునఃస్థాపించబడింది!

పరదైసు పునఃస్థాపించబడింది!

ఇరవై-ఎనిమిదవ అధ్యాయం

పరదైసు పునఃస్థాపించబడింది!

యెషయా 35:​1-10

1. అనేక మతాలు పరదైసులో జీవితమనే నిరీక్షణను ఎందుకు ఇస్తున్నాయి?

 “పరదైసు కావాలనే అపేక్ష మానవులు ఉవ్విళ్ళూరుతున్న అనేక బలమైన అపేక్షలలో ఒకటి. ఇది అన్నింటిలోకి అత్యంత బలమైనది, పట్టువిడువనిదై యుండవచ్చు. మతపరమైన జీవితంలో ప్రతి స్థాయిలోనూ పరదైసు కోసం నిశ్చయమైన అపేక్షను చూడవచ్చు” అని ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రిలీజియన్‌ చెబుతోంది. మానవ జీవితం రోగమరణాలు లేని అందమైన తోట వంటి పరదైసులో ప్రారంభమైందని బైబిలు చెబుతోంది గనుక అలాంటి అపేక్ష కేవలం సహజసిద్ధమైనది. (ఆదికాండము 2:​8-15) ప్రపంచంలోని అనేక మతాలు ఏదో ఒక విధమైన పరదైసులో భవిష్యత్‌ జీవితాన్ని గురించిన నిరీక్షణను ఇస్తున్నాయంటే అందులో ఆశ్చర్యం లేదు.

2. భవిష్యత్‌ పరదైసును గురించిన నిజమైన నిరీక్షణను మనం ఎక్కడ కనుగొనవచ్చు?

2 బైబిల్లోని అనేక భాగాల్లో, భవిష్యత్‌ పరదైసును గురించిన నిజమైన నిరీక్షణ గురించి మనం చదువవచ్చు. (యెషయా 51:3) ఉదాహరణకు, 35 వ అధ్యాయంలో వ్రాయబడివున్న యెషయా ప్రవచనంలోని భాగం, ఎడారి ప్రాంతాలు తోటవంటి ఉద్యానవనాలుగా ఫలభరితమైన పొలాలుగా మారడాన్ని గురించి వర్ణిస్తుంది. గ్రుడ్డివారికి చూపు తిరిగి వస్తుంది, మూగవారు మాట్లాడగలుగుతారు, చెవిటివారు వినగలుగుతారు. వాగ్దానం చేయబడిన ఈ పరదైసులో, దుఃఖము లేక నిట్టూర్పు ఉండవు, మరణం కూడా ఉండదని అది సూచిస్తుంది. ఎంత అద్భుతమైన వాగ్దానమది! ఈ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? అవి మనకు నేడు నిరీక్షణను ఇస్తాయా? యెషయా గ్రంథంలోని ఈ అధ్యాయాన్ని పరిశీలించడం, ఈ ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తుంది.

నిస్సారమైన భూమి సంతోషిస్తుంది

3. యెషయా ప్రవచనం ప్రకారం, భూమి ఎలాంటి మార్పును పొందుతుంది?

3 పునఃస్థాపించబడిన పరదైసును గురించిన యెషయా ప్రేరేపిత ప్రవచనం ఈ మాటలతో ప్రారంభమవుతుంది: “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.”​—యెషయా 35:1, 2.

4. యూదుల స్వదేశం ఎప్పుడు, ఎలా ఎడారిగా మారుతుంది?

4 యెషయా సా.శ.పూ. 732 వ సంవత్సరంలో ఈ మాటలను వ్రాశాడు. దాదాపు 125 సంవత్సరాల తర్వాత, బబులోనీయులు యెరూషలేమును నాశనం చేస్తారు, యూదా ప్రజలు చెరగా కొనిపోబడతారు. వారి స్వదేశం నిర్మానుష్యంగా, పాడుగా విడిచిపెట్టబడుతుంది. (2 రాజులు 25:​8-11, 21-26) అవిశ్వసనీయత చూపిస్తే చెరగా కొనిపోబడతారని యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన హెచ్చరిక ఈ విధంగా నెరవేరుతుంది. (ద్వితీయోపదేశకాండము 28:15, 36, 37; 1 రాజులు 9:​6-8) హీబ్రూ జనాంగం పరాయి దేశంలో బందీగా ఉన్నప్పుడు, చక్కని నీటి సరఫరాలుగల వారి పొలాలు, పండ్లతోటలు 70 సంవత్సరాల పాటు శ్రద్ధ తీసుకోకపోవడంతో ఎడారిలా మారతాయి.​—⁠యెషయా 64:10; యిర్మీయా 4:​23-27; 9:​10-12.

5. (ఎ) భూమికి పరదైసు వంటి పరిస్థితులు ఎలా పునఃస్థాపించబడతాయి? (బి) ప్రజలు ఏ భావంలో “యెహోవా మహిమను” చూస్తారు?

5 అయితే, దేశం ఎప్పటికీ అలాగే పాడుగా విడువబడదని యెషయా ప్రవచనం తెలియజేస్తోంది. అది నిజమైన పరదైసుగా పునఃస్థాపించబడుతుంది. దానికి “లెబానోను సౌందర్యము,” “కర్మెలు షారోనులకున్న సొగసు” ఇవ్వబడతాయి. a ఎలా? యూదులు చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత తమ పొలాలను తిరిగి సేద్యం చేసి, నీరు పెట్టగలుగుతారు, వారి భూమి తిరిగి మునుపటి సుసంపన్నమైన ఫలభరితమైన స్థితికి చేరుకుంటుంది. దానికి, ఘనత యెహోవాకు మాత్రమే చెందాలి. యూదులు అలాంటి పరదైసువంటి పరిస్థితులను అనుభవించగలిగేది ఆయన చిత్తాన్ని బట్టే, ఆయన మద్దతు ఆశీర్వాదాలతోనే. భూమి ఆశ్చర్యకరంగా మార్పు చెందడంలో యెహోవా హస్తాన్ని ప్రజలు గుర్తించినప్పుడు వారు, “యెహోవా మహిమను [వారి] దేవుని తేజస్సును” చూడగలుగుతారు.

6. యెషయా మాటల ఏ ప్రాముఖ్యమైన నెరవేర్పును మనం చూడవచ్చు?

6 ఏదేమైనప్పటికీ, పునఃస్థాపించబడిన ఇశ్రాయేలు దేశంలో, యెషయా మాటల మరింత ప్రాముఖ్యమైన నెరవేర్పు ఉంటుంది. ఆధ్యాత్మిక భావంలో, ఇశ్రాయేలు అనేక సంవత్సరాలపాటు ఎండిన, ఎడారివంటి స్థితిలో ఉంది. చెరగా కొనిపోబడినవారు బబులోనులో ఉండగా, స్వచ్ఛారాధన తీవ్రంగా నిర్బంధించబడింది. ఆలయం లేదు, బలిపీఠం లేదు, సంస్థీకృత యాజకత్వం లేదు. అనుదిన బలులు నిలిపివేయబడ్డాయి. ఇప్పుడు, యెషయా పూర్తి భిన్నమైనదాన్ని ప్రవచిస్తున్నాడు. జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా వంటి వారి నాయకత్వం క్రింద, మొత్తం ఇశ్రాయేలు 12 గోత్రాల నుండి ప్రతినిధులు యెరూషలేముకు తిరిగి వచ్చి, ఆలయాన్ని పునర్నిర్మించి, యెహోవాను స్వేచ్ఛగా ఆరాధిస్తారు. (ఎజ్రా 2:​1, 2) ఇది నిజంగా ఒక ఆధ్యాత్మిక పరదైసు!

ఆత్మయందు తీవ్రతగలవారై ఉండండి

7, 8. చెరగా కొనిపోబడిన యూదులకు అనుకూల దృక్పథం ఎందుకు అవసరం, యెషయా మాటలు ప్రోత్సాహాన్ని ఎలా అందజేస్తాయి?

7యెషయా 35 వ అధ్యాయంలోని మాటల్లో ఆనందం తొణికిసలాడుతోంది. పశ్చాత్తాపపడిన జనాంగానికి ప్రవక్త ఉజ్వలమైన భవిష్యత్తును ప్రకటిస్తున్నాడు. వాస్తవానికి, ఆయన దృఢవిశ్వాసంతోనూ, ఆశాభావంతోనూ మాట్లాడుతున్నాడు. చెరగా కొనిపోబడిన యూదులు, రెండు శతాబ్దాల తర్వాత, పునఃస్థాపన అంచున ఉన్నప్పుడు, వారికి అదే దృఢవిశ్వాసం, ఆశాభావం అవసరమవుతాయి. యెషయా ద్వారా, యెహోవా ప్రవచనార్థకంగా వారిని ఇలా ఉద్బోధిస్తున్నాడు: “సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి​—⁠భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును.”​—యెషయా 35:3, 4.

8 దీర్ఘకాలం తర్వాత చెర నుండి విముక్తి పొందడం, చర్య తీసుకోవడానికి సమయం. బబులోనుపై తన ఉగ్రతను కుమ్మరించడానికి యెహోవా ఉపయోగించుకునే ఉపకరణమైన పారసీక రాజు కోరేషు, యెరూషలేములో యెహోవా ఆరాధన పునఃస్థాపించబడాలని ప్రకటించాడు. (2 దినవృత్తాంతములు 36:​22, 23) బబులోను నుండి యెరూషలేముకు చేయవలసిన ప్రమాదకరమైన ప్రయాణం కోసం వేలాది హీబ్రూ కుటుంబాలను సంస్థీకరించవలసిన అవసరం ఉంది. వారు అక్కడికి చేరుకున్నప్పుడు, తగినన్ని వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసుకుని ఆలయాన్ని, నగరాన్ని పునర్నిర్మించే బృహత్తర కార్యం కోసం సిద్ధపడవలసి ఉంది. బబులోనులో ఉన్న కొంతమంది యూదులకు ఇదంతా దుస్సాధ్యమైనదిగా అనిపించవచ్చు. అయితే, బలహీనంగా లేక అధైర్యంగా ఉండడానికి ఇది సమయం కాదు. యూదులు ఒకరినొకరు బలపరచుకొని, యెహోవాపై నమ్మకం ఉంచాలి. వారు రక్షించబడతారని ఆయన వారికి హామీ ఇస్తున్నాడు.

9. తిరిగివచ్చే యూదుల కోసం ఎలాంటి గొప్ప వాగ్దానం ఉంది?

9 బబులోను చెర నుండి విడిపించబడినవారు ఆనందించడానికి మంచి కారణం ఉంటుంది, ఎందుకంటే వారు యెరూషలేముకు తిరిగి వచ్చినప్పుడు వారి కోసం ఒక గొప్ప భవిష్యత్తు వేచివుంది. యెషయా ఇలా ప్రవచిస్తున్నాడు: “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును. [“ఇప్పుడు మాట్లాడలేని మూగవాళ్లు, వారి కంఠం ఎత్తి ఆనంద గీతాలు పాడుతారు.” ఈజీ-టు-రీడ్‌-వర్షన్‌]”​—యెషయా 35:5, 6ఎ.

10, 11. తిరిగి వచ్చే యూదులకు, యెషయా మాటలు ఎందుకు ఆధ్యాత్మిక భావాన్ని కలిగి ఉండాలి, అవి ఏమి సూచిస్తాయి?

10 ప్రజల ఆధ్యాత్మిక స్థితి గురించి యెహోవా ఆలోచిస్తున్నాడని స్పష్టమవుతోంది. వారు తమ గత మతభ్రష్టత్వాన్ని బట్టి 70 సంవత్సరాలపాటు చెరలో ఉంచబడి శిక్షించబడ్డారు. అయినప్పటికీ, యెహోవా తన ప్రజలకు క్రమశిక్షణను ఇస్తూ వారికి అంధత్వాన్ని, చెముడును, అవిటితనాన్ని, లేక మూగతనాన్ని ఇవ్వలేదు. కాబట్టి, ఇశ్రాయేలు జనాంగాన్ని పునఃస్థాపించడానికి శారీరక రుగ్మతల స్వస్థత అవసరం లేదు. కోల్పోబడినదాన్నే అంటే ఆధ్యాత్మిక ఆరోగ్యాన్నే యెహోవా పునఃస్థాపిస్తాడు.

11 పశ్చాత్తాపపడిన యూదులు స్వస్థపరచబడతారు అంటే, వారు తమ ఆధ్యాత్మిక ఇంద్రియాలను తిరిగి పొందుతారు, అంటే వారికి ఆధ్యాత్మిక దృష్టి తిరిగి వస్తుంది, యెహోవా వాక్యాన్ని వినే, దానికి విధేయత చూపే, దాన్ని గురించి మాట్లాడే సామర్థ్యం వారికి తిరిగి ఇవ్వబడుతుంది. యెహోవాకు సన్నిహితంగా ఉండాలనే తమ అవసరతను వారు గుర్తిస్తారు. వారు తమ మంచి ప్రవర్తన ద్వారా, తమ దేవునికి ఆనందభరితమైన స్తుతిని ‘పాడుతారు.’ ఒకప్పటి “కుంటివాడు” యెహోవాకు తాను చేసే ఆరాధనలో ఆసక్తిగా, ఉత్సాహవంతంగా తయారవుతాడు. సూచనార్థకంగా, అతడు “దుప్పివలె గంతులువేయును.”

యెహోవా తన ప్రజల సేదతీరుస్తాడు

12. యెహోవా భూమిని ఎంతమేరకు నీటితో ఆశీర్వదిస్తాడు?

12 నీళ్లు లేని పరదైసు గురించి ఊహించడం కష్టం. ఏదెనులోని ఆది పరదైసులో నీళ్లు పుష్కలంగా ఉండేవి. (ఆదికాండము 2:​10-14) ఇశ్రాయేలుకు ఇవ్వబడిన దేశం కూడా “నీటి వాగులును, . . . ఊటలును అగాధ జలములును గల దేశము.” (ద్వితీయోపదేశకాండము 8:7) కాబట్టి సముచితంగానే, యెషయా సేదదీర్చే ఈ వాగ్దానాన్ని చేస్తున్నాడు: “అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును. నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.” (యెషయా 35:​6బి, 7) ఇశ్రాయేలీయులు మళ్ళీ భూమి గురించి శ్రద్ధ తీసుకున్నప్పుడు, ఒకప్పుడు నక్కలు తిరుగాడిన పాడుబడిన ప్రాంతాలు పచ్చని, ఏపుగా పెరిగిన వృక్షసంపదతో నిండిపోతాయి. ఎండిపోయిన, ధూళితో నిండిన నేల, జమ్ము, నీటిలో పెరిగే ఇతర రెల్లు మొక్కలు పెరిగే “బురద” నేలగా మారుతుంది.​—⁠యోబు 8:11.

13. పునఃస్థాపిత జనాంగానికి ఏ ఆధ్యాత్మిక జలం పుష్కలంగా అందుబాటులో ఉంటుంది?

13 అయితే, సత్యపు ఆధ్యాత్మిక జలం మరింత ప్రాముఖ్యం, తిరిగివచ్చే యూదులు ఆ జలంతో పుష్కలంగా ఆనందిస్తారు. యెహోవా తన వాక్యం ద్వారా జ్ఞానమును, ప్రోత్సాహాన్ని, ఓదార్పును అనుగ్రహిస్తాడు. అంతేగాక, నమ్మకమైన పెద్దలు, అధికారులు “ఎండినచోట నీళ్లకాలువలవలె” ఉంటారు. (యెషయా 32:​1, 2) వాస్తవానికి, స్వచ్ఛారాధనను పెంపొందింపజేసే ఎజ్రా, హగ్గయి, యేషూవ, నెహెమ్యా, జెకర్యా, జెరుబ్బాబెలు వంటివారు యెషయా ప్రవచన నెరవేర్పుకు సజీవ సాక్ష్యాలుగా ఉంటారు.​—⁠ఎజ్రా 5:1, 2; 7:​6, 10; నెహెమ్యా 12:47.

‘పరిశుద్ధ మార్గం’

14. బబులోను యెరూషలేముల మధ్య ప్రయాణాన్ని వర్ణించండి.

14 అయితే, పరవాసులుగా ఉన్న యూదులు అలాంటి శారీరక, ఆధ్యాత్మిక పరదైసు పరిస్థితులను ఆనందించడానికి ముందు, వారు బబులోను నుండి యెరూషలేముకు సుదీర్ఘమైన, అపాయకరమైన ప్రయాణాన్ని చేయవలసి ఉంది. నేరుగా ప్రయాణించడం అంటే దాదాపు 800 కిలోమీటర్ల పైరుపచ్చలులేని, వాసయోగ్యంకాని ప్రదేశాన్ని దాటి వెళ్ళాలి. అంత సవాలుదాయకం కాని మార్గాన్ని తీసుకుంటే, 1,600 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ రెండిటిలో ఏ మార్గంపై ప్రయాణించాలన్నా, వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, క్రూరమృగాలనూ మృగాలవంటి మనుష్యులనూ ఎదుర్కొంటూ నెలలపాటు ప్రయాణించాలి. అయినప్పటికీ, యెషయా ప్రవచనాన్ని నమ్మేవారు అతిగా ఆందోళన చెందరు. ఎందుకు?

15, 16. (ఎ) తమ స్వదేశానికి తిరిగి వస్తున్న నమ్మకమైన యూదులకు వారి ప్రయాణంలో యెహోవా ఏ కాపుదలను ఇస్తాడు? (బి) యెహోవా యూదులకు ఏ భావంలో సురక్షితమైన రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తాడు?

15 యెషయా ద్వారా, యెహోవా ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు. అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడినవారే అక్కడ నడచుదురు.” (యెషయా 35:​8, 9) యెహోవా తన ప్రజలను సంస్కరించాడు! వారు ఆయన “విమోచింపబడినవా[రు],” వారు క్షేమంగా తమ స్వదేశానికి తిరిగి వచ్చేలా చూస్తానని ఆయన హామీ ఇస్తున్నాడు. అంటే బబులోను నుండి యెరూషలేముకు వెళ్ళడానికి అక్షరార్థమైన, రాళ్లు పరచిన, ఎత్తుచేయబడిన, కంచె వేయబడిన మార్గం ఏదైనా ఉందా? లేదు, కానీ యెహోవా తన ప్రజలకు వారి ప్రయాణంలో ఇచ్చే కాపుదల ఎంత ఖచ్చితమైనదంటే, వారు అలాంటి రాజమార్గంపై ప్రయాణిస్తున్నట్లుగానే ఉంటుంది.​—⁠కీర్తన 91:1-16 పోల్చండి.

16 యూదులు ఆధ్యాత్మిక ప్రమాదాల నుండి కూడా కాపాడబడతారు. ‘పరిశుద్ధ మార్గం’ ఒక సూచనార్థకమైన రాజమార్గం. పరిశుద్ధమైనవాటిని అగౌరవపరిచేవారు లేక ఆధ్యాత్మికంగా అపరిశుభ్రమైనవారు దానిపై ప్రయాణించడానికి యోగ్యులు కాదు. పునఃస్థాపిత దేశంలో వారు అవసరం లేదు. ఆమోదించబడేవారు సరైన మనోదృక్పథం గలవారై ఉంటారు. వారు జాతీయ గర్వంతో కూడిన దృక్పథంతో లేక వ్యక్తిగత ఆసక్తులతో యూదా, యెరూషలేములకు తిరిగి రావడం లేదు. ఆధ్యాత్మిక విషయాలపట్ల శ్రద్ధగల యూదులు, తాము తిరిగి రావడానికి ప్రధాన కారణం యెహోవా స్వచ్ఛారాధనను ఆ దేశంలో పునఃస్థాపించడమే అని గుర్తిస్తారు.​—⁠ఎజ్రా 1:1-3.

యెహోవా ప్రజలు ఆనందిస్తారు

17. యెషయా ప్రవచనం, నమ్మకమైన యూదులు చెరలో ఉండిన సుదీర్ఘమైన కాలంపాటు వారికి ఎలా ఓదార్పును ఇచ్చింది?

17 యెషయా ప్రవచనం 35 వ అధ్యాయం ఆనందకరమైన మాటలతో ముగుస్తుంది: “యెహోవా విమోచించినవారు పాటలు పాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.” (యెషయా 35:​9బి) తాము పరవాసులుగా ఉన్నప్పుడు ఓదార్పు నిరీక్షణల కోసం ఈ ప్రవచనం వైపు చూసిన బందీలుగా ఉండిన యూదులు, దాని వివిధ అంశాలు ఎలా నెరవేరుతాయా అని తలంచి ఉండవచ్చు. వారికి ప్రవచనంలోని అనేక భాగాలు అర్థమై ఉండక పోవచ్చు. అయినప్పటికీ, వారు “తిరిగి సీయోనునకు వచ్చెదరు” అన్నది మాత్రం సుస్పష్టం.

18. బబులోనులో దుఃఖం నిట్టూర్పులకు బదులు, పునఃస్థాపిత దేశంలో ఆనంద సంతోషములు ఏ విధంగా ఉంటాయి?

18 కాబట్టి, సా.శ.పూ. 537 లో, స్త్రీలు, పిల్లలతోపాటు (7,000 కంటే ఎక్కువమంది దాసులతో సహా) దాదాపు 50,000 మంది పురుషులు, యెహోవాపై పూర్ణ నమ్మకంతో, నాలుగు నెలల ప్రయాణం చేసి యెరూషలేముకు తిరిగి వస్తారు. (ఎజ్రా 2:​64, 65) కేవలం కొన్ని నెలల్లో యెహోవా బలిపీఠం పునర్నిర్మించబడడంతో, ఆలయం పూర్తిగా పునర్నిర్మించబడడానికి ఉద్ఘాటన జరుగుతుంది. 200-సంవత్సరాల-పూర్వపు యెషయా ప్రవచనం నెరవేరుతుంది. బబులోనులో ఉండగా జనాంగం అనుభవించిన దుఃఖం నిట్టూర్పులకు బదులు, పునఃస్థాపిత దేశంలో ఆనందోత్సాహాలు ఉంటాయి. యెహోవా తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అక్షరార్థ, ఆధ్యాత్మిక రెండు విధాలైన పరదైసు పునఃస్థాపించబడింది!

ఒక క్రొత్త జనాంగపు జననం

19. యెషయా ప్రవచనం సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో పరిమిత నెరవేర్పునే కలిగి ఉందని ఎందుకు చెప్పవచ్చు?

19 అయితే, సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో జరిగిన యెషయా 35 వ అధ్యాయ నెరవేర్పు పరిమితమైనది. తిరిగి వచ్చిన యూదులు ఆనందించిన పరదైసు పరిస్థితులు నిరంతరం నిలువవు. కొంతకాలానికి, అబద్ధ మత బోధలు, జాతీయభావం స్వచ్ఛారాధనను కలుషితం చేస్తాయి. ఆధ్యాత్మికంగా, యూదులు మళ్లీ దుఃఖాన్ని, నిట్టూర్పును అనుభవిస్తారు. చివరికి యెహోవా వారిని తన ప్రజలుగా తిరస్కరిస్తాడు. (మత్తయి 21:​43) మళ్ళీ అవిధేయత చూపించినందుకు వారు ఆనందాన్ని శాశ్వతంగా కోల్పోతారు. ఇదంతా, యెషయా 35 వ అధ్యాయానికి మరొక, మరింత గొప్ప నెరవేర్పు ఉంటుందని చూపిస్తుంది.

20. సా.శ. మొదటి శతాబ్దంలో ఏ క్రొత్త ఇశ్రాయేలు ఉనికిలోకి వచ్చింది?

20 యెహోవా నిర్ణీత సమయంలో, మరో ఇశ్రాయేలు అంటే ఆధ్యాత్మిక ఇశ్రాయేలు ఉనికిలోకి వచ్చింది. (గలతీయులు 6:​16) యేసు తన భూపరిచర్య సమయంలో ఈ క్రొత్త ఇశ్రాయేలు జననానికి రంగాన్ని సిద్ధం చేశాడు. ఆయన స్వచ్ఛారాధనను పునఃస్థాపించాడు, ఆయన బోధలతో సత్య జలాలు మళ్లీ ప్రవహించడం మొదలుపెట్టాయి. ఆయన శారీరక, ఆధ్యాత్మిక రోగులను స్వస్థపరిచాడు. దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుండగా ఆనందభరితమైన పాట అంతటా వ్యాపించింది. ఆయన మరణ పునరుత్థానాల తర్వాత ఏడు వారాలకు, మహిమపర్చబడిన యేసు క్రైస్తవ సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘమే, యేసు చిందించిన రక్తంతో విమోచింపబడి, దేవుని ఆధ్యాత్మిక కుమారులుగా యేసు సహోదరులుగా జన్మించి, పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన యూదులతోనూ మరితరులతోనూ రూపొందించబడిన ఆధ్యాత్మిక ఇశ్రాయేలు.​—⁠అపొస్తలుల కార్యములు 2:1-4; రోమీయులు 8:16, 17; 1 పేతురు 1:18, 19.

21. మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘానికి సంబంధించి, యెషయా ప్రవచనంలోని నిర్దిష్ట అంశాల నెరవేర్పుగా ఏ సంఘటనలను దృష్టించవచ్చు?

21 అపొస్తలుడైన పౌలు ఆధ్యాత్మిక ఇశ్రాయేలులోని సభ్యులకు వ్రాసేటప్పుడు, “వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి” అని చెబుతూ, యెషయా 35:3 లోని మాటలను పేర్కొన్నాడు. (హెబ్రీయులు 12:​12) కాబట్టి, సా.శ. మొదటి శతాబ్దంలో యెషయా 35 వ అధ్యాయంలోని మాటలు నెరవేరాయని స్పష్టమవుతోంది. అక్షరార్థ భావంలో, యేసు ఆయన శిష్యులు అద్భుతరీతిగా గ్రుడ్డివారికి చూపును, చెవిటివారికి వినికిడి శక్తిని ఇచ్చారు. వారు “కుంటివారు” నడిచేలా, మూగవారు తిరిగి మాట్లాడగలిగేలా చేశారు. (మత్తయి 9:​32; 11:5; లూకా 10:9) మరింత ప్రాముఖ్యంగా, యథార్థ హృదయులు అబద్ధ మతాన్ని తప్పించుకొని, క్రైస్తవ సంఘంలో ఆధ్యాత్మిక పరదైసును ఆనందించడం మొదలు పెట్టారు. (యెషయా 52:11; 2 కొరింథీయులు 6:​16-18) బబులోను నుండి తిరిగి వచ్చిన యూదుల వలెనే, తప్పించుకొనిన వీరు, సునిశ్చితమైన, ధైర్యవంతమైన స్ఫూర్తి అత్యావశ్యకమని తెలుసుకున్నారు.​—⁠రోమీయులు 12:​11.

22. యథార్థవంతులైన, సత్యాన్వేషకులైన క్రైస్తవులు ఆధునిక కాలాల్లో బబులోను చెరలోకి ఎలా వెళ్ళారు?

22 మన కాలం మాటేమిటి? యెషయా ప్రవచనానికి మరో నెరవేర్పు అంటే నేటి క్రైస్తవ సంఘం చేరివున్న మరింత సంపూర్ణమైన నెరవేర్పు ఉందా? అవును, ఉంది. అపొస్తలుల మరణం తర్వాత, నిజమైన అభిషిక్త క్రైస్తవుల సంఖ్య బాగా తగ్గిపోయింది, “గురుగులు” అంటే అబద్ధ క్రైస్తవులు ప్రపంచ దృశ్యంపై వర్ధిల్లారు. (మత్తయి 13:36-43; అపొస్తలుల కార్యములు 20:30; 2 పేతురు 2:​1-3) యథార్థపరులైన వ్యక్తులు తమను తాము క్రైస్తవమత సామ్రాజ్యం నుండి వేరుపరచుకుని స్వచ్ఛారాధన చేపడుతున్న 19 వ శతాబ్ద కాలంలో కూడా, వారి అవగాహన లేఖన విరుద్ధ బోధలతో కొంతమేరకు కలుషితమయ్యే ఉంది. యేసు 1914 లో మెస్సీయ రాజుగా సింహాసనాసీనునిగా చేయబడ్డాడు, కాని వెంటనే ఆ తర్వాత, యథార్థవంతులైన ఈ సత్యాన్వేషకులకు పరిస్థితి నిరాశాజనకంగా కనిపించింది. ప్రవచన నెరవేర్పుగా, దేశాలు ‘వారితో యుద్ధముచేసి వారిని జయించాయి,’ సువార్త ప్రకటించాలనే ఈ యథార్థ క్రైస్తవుల ప్రయత్నాలు అణచివేయబడ్డాయి. ఫలితంగా, వారు బబులోను చెరలోకి వెళ్లిపోయారు.​—⁠ప్రకటన 11:7, 8.

23, 24. యెషయా మాటలు, 1919 నుండి దేవుని ప్రజల మధ్యన ఏ యే విధాలుగా నెరవేరాయి?

23 అయితే, 1919 లో, పరిస్థితులు మారాయి. యెహోవా తన ప్రజలను చెరలో నుండి విడిపించాడు. తమ ఆరాధనను మునుపు కలుషితం చేసిన అబద్ధ బోధలను వారు తిరస్కరించడం మొదలు పెట్టారు. ఫలితంగా, వారు స్వస్థతను పొందారు. వారు ఆధ్యాత్మిక పరదైసులోకి ప్రవేశించారు, ఆ ఆధ్యాత్మిక పరదైసు ఈనాటికీ భూవ్యాప్తంగా విస్తరిస్తూనే ఉంది. దేవుని పరిశుద్ధాత్మ పనిచేసే తీరు గురించి పూర్తిగా గ్రహించి, యెహోవాకు సన్నిహితంగా ఉండాలనే అవసరతను ఎల్లవేళలా గుర్తెరిగినవారై, ఆధ్యాత్మిక భావంలో, గ్రుడ్డివారు చూడడమూ చెవిటివారు వినడమూ నేర్చుకుంటున్నారు. (1 థెస్సలొనీకయులు 5:6; 2 తిమోతి 4:5) ఇక మూగవారిగా ఉండక, నిజ క్రైస్తవులు “కంఠం ఎత్తి” ఇతరులకు బైబిలు సత్యాలను ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నారు. (రోమీయులు 1:​15) ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉండిన వారు లేక ‘కుంటివారు’ ఇప్పుడు అత్యంతాసక్తిని, ఆనందాన్ని కనబరుస్తున్నారు. అలంకారికంగా, వారు ‘దుప్పివలె గంతులువేయ’ గలుగుతున్నారు.

24 ఈ పునఃస్థాపిత క్రైస్తవులు ‘పరిశుద్ధ మార్గం’లో నడుస్తున్నారు. మహాబబులోనులో నుండి ఆధ్యాత్మిక పరదైసులోకి నడిపించే ఈ ‘మార్గం’ ఆధ్యాత్మికంగా పరిశుభ్రమైన ఆరాధకులందరి కోసం తెరిచి ఉంది. (1 పేతురు 1:​13-16) వారు కాపుదల కోసం యెహోవాపై ఆధారపడగలరు, సత్యారాధనను నిర్మూలించడానికి సాతాను చేసే క్రూరమైన దాడులలో అతడు ఎంతమాత్రం సఫలం కాలేడని నమ్మకం కలిగివుండగలరు. (1 పేతురు 5:8) అవిధేయులు, క్రూరమైన మృగాల్లా ప్రవర్తించే ఎవరైనా, దేవుని పరిశుద్ధ రాజమార్గంపై నడిచే వారిని కలుషితం చేయడానికి అనుమతించబడరు. (1 కొరింథీయులు 5:​11) ఈ సురక్షితమైన వాతావరణంలో, యెహోవా యొక్క విమోచించబడినవారు అంటే అభిషిక్తులు, “వేరే గొఱ్ఱెలు” ఏకైక సత్య దేవుని సేవ చేయడంలో ఆనందాన్ని పొందుతారు.​—⁠యోహాను 10:​16.

25. యెషయా 35 వ అధ్యాయానికి భౌతిక నెరవేర్పు ఉంటుందా? వివరించండి.

25 భవిష్యత్తు మాటేమిటి? యెషయా ప్రవచనం ఎప్పటికైనా భౌతిక భావంలో నెరవేరుతుందా? నెరవేరుతుంది. మొదటి శతాబ్దంలో యేసు, ఆయన అపొస్తలులు చేసిన అద్భుత స్వస్థతలు, భవిష్యత్తులో భారీ ఎత్తున అలాంటి స్వస్థతలు చేయగల యెహోవా సామర్థ్యాన్ని, చేయాలని ఆయనకున్న కోరికను చూపించాయి. ప్రేరేపిత కీర్తనలు భూమిపై సమాధానకరమైన పరిస్థితుల్లో నిత్యజీవాన్ని గురించి మాట్లాడతాయి. (కీర్తన 37:​9, 11, 29) యేసు, పరదైసులో జీవితం గురించి వాగ్దానం చేశాడు. (లూకా 23:​43) బైబిలు దాని మొదటి పుస్తకం నుండి చివరి పుస్తకం వరకూ, ఒక అక్షరార్థ పరదైసును గురించిన నిరీక్షణను ఇస్తుంది. ఆ సమయంలో, గ్రుడ్డివారు, చెవిటివారు, కుంటివారు, మూగవారు శారీరకంగా, శాశ్వతంగా స్వస్థపరచబడతారు. దుఃఖం, నిట్టూర్పు ఎగిరిపోతాయి. నిజానికి, ఆనందం నిత్యం, చివరికి నిరంతరం ఉంటుంది.​—⁠ప్రకటన 7:​9, 16, 17; 21:​3, 4.

26. యెషయా మాటలు క్రైస్తవులను నేడు ఎలా బలపరుస్తాయి?

26 భౌతిక భూ పరదైసు పునఃస్థాపన కోసం ఎదురు చూస్తూ నిజ క్రైస్తవులు, ఇప్పుడు కూడా ఆధ్యాత్మిక పరదైసు ఆశీర్వాదాలను ఆనందిస్తున్నారు. వారు శ్రమలను కష్టాలను ఆశావాదంతో ఎదుర్కొంటారు. యెహోవాయందు నిశ్చలమైన నమ్మకంతో, “సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి​—⁠భయపడక ధైర్యముగా ఉండుడి” అనే హెచ్చరికను అనుసరిస్తూ, వారు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. “ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును” అనే ప్రవచనార్థక హామీలో వారికి సంపూర్ణ నమ్మకం ఉంది.​—⁠యెషయా 35:3, 4.

[అధస్సూచి]

a ప్రాచీన లెబానోను పచ్చని అడవులు, ఎత్తైన దేవదారు వృక్షాలుగల ఫలవంతమైన నేలతో, ఏదెను తోటను పోలి ఉంటుందని లేఖనాలు వర్ణిస్తున్నాయి. (కీర్తన 29:5; 72:​16; యెహెజ్కేలు 28:​11) షారోను దాని నీటి ప్రవాహాలకు, ఓకు అడవులకు పేరుపొందింది; కర్మేలు దాని ద్రాక్షతోటలకు, పండ్లతోటలకు, పూలచెట్లతో నిండివుండే ఏటవాలు ప్రదేశాలకు పేరుపొందింది.

[అధ్యయన ప్రశ్నలు]

[370 వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]

[375 వ పేజీలోని చిత్రాలు]

ఎడారి ప్రాంతాలు జమ్ము, తుంగ మొక్కలకు సమృద్ధిగా నీరున్న ప్రాంతాలుగా అవుతాయి

[378 వ పేజీలోని చిత్రం]

రోగులను యేసు ఆధ్యాత్మికంగానూ శారీరకంగానూ స్వస్థపరిచాడు