భాగం 25
విశ్వాసం, ప్రవర్తన, ప్రేమ వంటి విషయాల్లో ఉపదేశం
యాకోబు, పేతురు, యోహాను, యూదా తోటి క్రైస్తవులను ప్రోత్సహించడానికి పత్రికలు రాశారు
యాకోబు, యూదా ఇద్దరూ యేసు సోదరులు. పేతురు, యోహానులు యేసు 12 మంది అపొస్తలుల్లో ఇద్దరు. ఈ నలుగురు మొత్తం ఏడు పత్రికలు రాశారు. అవి క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఉన్నాయి. ఆ పత్రికలు వీళ్ల పేర్లతోనే ఉన్నాయి. క్రైస్తవులు యెహోవాకు, ఆయన రాజ్యానికి నమ్మకంగా కట్టుబడివుండేందుకు సహాయం చేయడానికి వాళ్లు ఈ పత్రికల్లో దైవప్రేరేపిత హెచ్చరికలను రాశారు.
విశ్వాసం చూపించాలి. విశ్వాసం ఉందని చెప్పుకుంటే సరిపోదు. నిజమైన విశ్వాసం మనం చేసే పనుల్లో కనిపిస్తుంది. “క్రియలు లేని విశ్వాసము మృతము” అని యాకోబు రాశాడు. (యాకోబు 2:26) కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసంతో నడుచుకుంటే సహనం అలవడుతుంది. ఒక క్రైస్తవుడు, తను చేసే పనులు సఫలమవ్వాలంటే జ్ఞానమివ్వమని దేవుణ్ణి అడగాలి. అయితే, దేవుడు తప్పకుండా ఇస్తాడనే నమ్మకంతో అడగాల్సివుంటుంది. సహనం చూపించే వ్యక్తిని దేవుడు ఇష్టపడతాడు. (యాకోబు 1:2-6, 12) యెహోవాపై విశ్వాసంతో ఆయన ఆరాధకులు ఆయనకు నమ్మకంగా ఉంటే ఆయన వారికి తోడుంటాడు. “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అని యాకోబు చెప్పాడు.—యాకోబు 4:8.
తప్పు చేయాలనే శోధనలను, ఒత్తిడిని ఎదిరించేంత బలమైన విశ్వాసం ఒక క్రైస్తవునికి ఉండాలి. యూదా జీవించిన రోజుల్లో చుట్టూ చెడు పరిస్థితులు ఉన్నాయి కాబట్టే, విశ్వాసం కోసం ‘పోరాడమని’ ఆయన తన తోటి క్రైస్తవులకు రాశాడు.—యూదా 3.
మంచి ప్రవర్తన కల్గివుండాలి. తన ఆరాధకులు అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలని యెహోవా ఆశిస్తున్నాడు. ‘నేను [యెహోవా] పరిశుద్ధుడిగా ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండని వ్రాయబడివుంది. కాబట్టి, మీరు సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులుగా ఉండండి’ అని పేతురు రాశాడు. (1 పేతురు 1:14-16) క్రైస్తవులకు ఆదర్శంగా నిలిచిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి రాస్తూ పేతురు ఇలా అన్నాడు: “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.” (1 పేతురు 2:21) క్రైస్తవులు దేవుడు చెప్పిన విధంగా నడుచుకోవడంవల్ల బాధలు అనుభవించాల్సి వచ్చినా, వాళ్లు “నిర్మలమైన మనస్సాక్షి” కల్గివుంటారు. (1 పేతురు 3:15-17) క్రైస్తవులు దేవుని తీర్పు దినం కోసం, దేవుడు వాగ్దానం చేసిన ‘నీతి నివసించే’ కొత్త లోకం కోసం ఎదురుచూస్తుండగా పవిత్రమైన ప్రవర్తనను కల్గివుండాలని, దైవభక్తికి తగిన పనులు చేయాలని పేతురు క్రైస్తవులను ఆదేశించాడు.—2 పేతురు 3:11-13.
“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.”—యాకోబు 4:8
ప్రేమ చూపించాలి. దేవుడు “ప్రేమాస్వరూపి” అని అపొస్తలుడైన యోహాను రాశాడు. ‘మన పాపములకు ప్రాయశ్చిత్తంగా’ తన కుమారుడిని పంపించి దేవుడు తన గొప్ప ప్రేమను చూపించాడు అని ఆయన రాశాడు. క్రైస్తవులు దీనికి ఎలా స్పందించాలి? “ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై యున్నాము” అని యోహాను వివరించాడు. (1 యోహాను 4:8-11) అలాంటి ప్రేమను చూపించే ఒక మార్గం ఏమిటంటే తోటి విశ్వాసులకు ఉపకారం చేయడం.—3 యోహాను 5-8.
అయితే, యెహోవా ఆరాధకులు ఆయనను ప్రేమిస్తున్నారని ఎలా చూపిస్తారు? యోహాను దీనికి జవాబిస్తున్నాడు: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.” (1 యోహాను 5:3; 2 యోహాను 6) అలా దేవునికి లోబడే వాళ్లు, దేవుడు తమను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడనే నమ్మకంతో, తమకు ‘నిత్యజీవం’ లభిస్తుందనే నమ్మకంతో ఉండవచ్చు.—యూదా 20.