65వ కథ
రాజ్యం విభాగించబడడం
ఆ వ్యక్తి తన వస్త్రాన్ని ఎందుకు ముక్కలుగా చింపుతున్నాడో మీకు తెలుసా? అలా చేయమని యెహోవా ఆయనకు చెప్పాడు. ఆ వ్యక్తి దేవుని ప్రవక్తయైన అహీయా. ప్రవక్త అంటే ఎవరో మీకు తెలుసా? జరగబోయే దానిని దేవుడు ముందుగా ఎవరికైతే వివరిస్తాడో ఆ వ్యక్తిని ప్రవక్త అంటారు.
అహీయా అక్కడ యరొబాముతో మాట్లాడుతున్నాడు. ఆలయ నిర్మాణమప్పుడు సొలొమోను యరొబామును కొన్ని పనులకు అధికారిగా నియమించాడు. అహీయా యరొబామును దారిలో కలిసినప్పుడు అహీయా ఒక వింతైన పని చేశాడు. ఆయన తాను ధరించివున్న క్రొత్త వస్త్రాన్ని తీసివేసి దానిని 12 ముక్కలుగా చింపాడు. ఆ తర్వాత ఆయన యరొబాముతో, ‘నీవు పది ముక్కలు తీసుకో’ అన్నాడు. అహీయా యరొబాముకు 10 ముక్కలు ఎందుకిచ్చాడో మీకు తెలుసా?
యెహోవా సొలొమోను దగ్గరనుండి రాజ్యాన్ని తీసుకోబోతున్నాడు అని అహీయా యరొబాముకు వివరించాడు. యెహోవా 10 గోత్రాలను యరొబాముకు ఇవ్వబోతున్నాడని ఆయన చెప్పాడు. అంటే సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలించడానికి కేవలం రెండు గోత్రాలే మిగులుతాయని దానర్థం.
అహీయా యరొబాముతో చెప్పిన మాటలను సొలొమోను విన్నప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆయన యరొబామును చంపాలని ప్రయత్నించాడు. అయితే యరొబాము ఐగుప్తుకు పారిపోయాడు. కొంతకాలం తర్వాత సొలొమోను చనిపోయాడు. ఆయన 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు, ఆ తర్వాత ఆయన కుమారుడైన రెహబాము రాజుగా చేయబడ్డాడు. ఐగుప్తులో ఉన్న యరొబాముకు సొలొమోను మరణించిన సంగతి తెలిసి, ఆయన ఇశ్రాయేలుకు తిరిగివచ్చాడు.
రెహబాము మంచి రాజు కాదు. ఆయన ప్రజలతో తన తండ్రియైన సొలొమోను కంటే కఠినంగా ప్రవర్తించేవాడు. యరొబాము, కొంతమంది ప్రముఖ వ్యక్తులు రెహబాము వద్దకు వెళ్ళి, ప్రజలతో మంచిగా వ్యవహరించమని అడిగారు. కానీ రెహబాము వాళ్ళ మాట వినలేదు. నిజానికి ఆయన అంతకు ముందుకంటే మరింత కఠినంగా తయారయ్యాడు. అప్పుడు ప్రజలు 10 గోత్రాలకు యరొబామును రాజుగా చేసుకున్నారు. అయితే రెండు గోత్రాలు అంటే బెన్యామీను, యూదా గోత్రాలకు చెందినవారు రెహబామును తమ రాజుగా ఉంచుకున్నారు.
యరొబాము తన ప్రజలు యెహోవా ఆలయంలో ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్ళడాన్ని ఇష్టపడలేదు. కాబట్టి ఆయన రెండు బంగారు దూడలను చేసి, 10 గోత్రాల ప్రజలు వాటిని ఆరాధించేలా చేశాడు. త్వరలోనే దేశము నేరము, బలాత్కారముతో నిండిపోయింది.
రెండు గోత్రాల రాజ్యంలోనూ సమస్యలు మొదలయ్యాయి. రెహబాము రాజైన తర్వాత ఐదు సంవత్సరాల్లోపే ఐగుప్తు రాజు యెరూషలేముతో యుద్ధం చేయడానికి వచ్చాడు. అతను యెహోవా ఆలయంలోనుండి ఎంతో సంపదను తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఆలయం కేవలం కొంతకాలం వరకే నిర్మించబడినప్పుడు ఉన్న స్థితిలో ఉంది.