కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని గూర్చిన జ్ఞానాన్ని బయల్పర్చే పుస్తకము

దేవుని గూర్చిన జ్ఞానాన్ని బయల్పర్చే పుస్తకము

అధ్యాయము 2

దేవుని గూర్చిన జ్ఞానాన్ని బయల్పర్చే పుస్తకము

1, 2. మనకు మన సృష్టికర్త నడిపింపు ఎందుకు అవసరము?

మానవజాతి కొరకు ఉపదేశము, నడిపింపుగల పుస్తకాన్ని మన ప్రేమగల సృష్టికర్త అందజేయడమనేది కారణసహితమైనదే. మానవులకు నడిపింపు అవసరమని మీరు అంగీకరించరా?

2 ఒక ప్రవక్త, చరిత్రకారుడు 2,500 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం క్రితం ఇలా వ్రాశాడు: “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు.” (యిర్మీయా 10:23) నేడు, ఆ వ్యాఖ్యానం యొక్క సత్యత్వం మునుపెన్నటికంటే స్పష్టంగా ఉంది. కాబట్టి, చరిత్రకారుడైన విల్యమ్‌ హెచ్‌. మక్‌నీల్‌ ఇలా చెబుతున్నాడు: “భూమిపై మానవ అనుభవమనేది సమాజం యొక్క స్థాపించబడిన శాంతి సమాధానాలకు సంబంధించిన సంకటాలు, అవాంతరాలకు అడ్డులేని పరంపరలా ఉంటున్నది.”

3, 4. (ఎ) మనం బైబిలు పఠనాన్ని ఏ దృక్పథంతో ఆరంభించాలి? (బి) బైబిలును పరీక్షించడంలో మనం ఎలా కొనసాగుతాము?

3 వివేకవంతమైన నడిపింపు కొరకైన మన అవసరతలన్నిటినీ బైబిలు తీరుస్తుంది. నిజమే, మొదటిసారి బైబిలును పరీక్షించినప్పుడు అనేకులు కంగారు పడతారు. అది పెద్ద పుస్తకం, దానిలోని కొన్ని భాగాలను అర్థం చేసుకోవడం సులభం కాదు. బహుశా ఒక విలువైన సంపదను పొందేందుకు మీరు ఏమి చేయాలో తెలియజేసే వివరాలు గల ఒక వీలునామా మీకు ఇవ్వబడితే, దాన్ని జాగ్రత్తగా చదవడానికి మీరు సమయం తీసుకోరా? ఆ పత్రంలోని కొన్ని భాగాలు అర్థం చేసుకోవడం మీకు కష్టమనిపిస్తే, అలాంటి విషయాల్లో అనుభవంగల ఎవరి సహాయాన్నైనా మీరు తప్పకుండా తీసుకుంటారు. బైబిలును కూడా అలాంటి దృక్పథంతోనే ఎందుకు సమీపించకూడదు? (అపొస్తలుల కార్యములు 17:11) వస్తుసంబంధమైన వారసత్వ సంపదకంటే మరెక్కువైనది ప్రమాదంలో ఉంది. మనం మునుపటి అధ్యాయంలో నేర్చుకున్నట్లుగా, దేవుని గూర్చిన జ్ఞానం నిత్య జీవానికి నడిపించగలదు.

4 దేవుని గూర్చిన జ్ఞానాన్ని బయల్పర్చే పుస్తకాన్ని మనం పరిశీలిద్దాము. మేము ముందు బైబిలు గురించిన సంక్షిప్త స్థూలదృష్టిని అందజేస్తాము. అది దేవుని ప్రేరేపిత వాక్యమని అనేకమంది అభిజ్ఞులైన ప్రజలు ఎందుకు నమ్ముతారనేదానికి కారణాలను మనం తర్వాత చర్చిద్దాము.

బైబిలు ఏమి కలిగివుంది

5. (ఎ) హెబ్రీ లేఖనాలు ఏమి కలిగి ఉన్నాయి? (బి) గ్రీకు లేఖనాలు ఏమి కలిగి ఉన్నాయి?

5 బైబిలు రెండు భాగాలలో 66 పుస్తకాలను కలిగివుంది, ఇవి తరచూ పాత నిబంధన, క్రొత్త నిబంధన అని పిలువబడుతున్నాయి. ప్రాముఖ్యంగా 39 బైబిలు పుస్తకాలు హెబ్రీ భాషలో, 27 పుస్తకాలు గ్రీకు భాషలో వ్రాయబడ్డాయి. ఆదికాండము నుండి మలాకీ వరకున్న హెబ్రీ లేఖనాలు, సృష్టి మరియు 3,500 సంవత్సరాల మానవ చరిత్రను గూర్చి వివరిస్తాయి. బైబిలు యొక్క ఈ భాగాన్ని పరీక్షించడం ద్వారా, 16వ శతాబ్దంలో ఒక జనాంగంగా ఇశ్రాయేలీయుల ప్రారంభం నుండి సా.శ.పూ. 5వ శతాబ్దం వరకు వారితో దేవుని వ్యవహారాల గురించి మనం తెలుసుకుంటాము. * మత్తయి నుండి ప్రకటన వరకున్న గ్రీకు లేఖనాలు యేసుక్రీస్తు మరియు సా.శ. మొదటి శతాబ్దంలోని ఆయన శిష్యుల బోధలు, కార్యకలాపాలపై కేంద్రీకరిస్తాయి.

6. మనం మొత్తం బైబిలును ఎందుకు పఠించాలి?

6 “పాత నిబంధన” యూదుల కొరకు, “క్రొత్త నిబంధన” క్రైస్తవుల కొరకు అని కొందరు చెబుతారు. కాని 2 తిమోతి 3:16 ప్రకారం, ‘లేఖనాలు అన్నీ దైవావేశమువల్ల కలిగినవి, ప్రయోజనకరమైనవి.’ గనుక, లేఖనాలను సరైన విధంగా పఠించడంలో మొత్తం బైబిలును చదవడం చేరి ఉండాలి. నిజానికి, ఒక సమగ్ర ముఖ్యాంశాన్ని పెంపొందింపజేయడానికి బైబిలు యొక్క రెండు భాగాలు అనుగుణ్యతతో, ఒకదానితో ఒకటి పొందిక కల్గివున్నాయి.

7. బైబిలు మూలాంశం ఏమిటి?

7 బహుశా మీరు కొన్ని సంవత్సరాలు మత సంబంధమైన ఆరాధనలకు హాజరై, బైబిల్లో కొంతభాగం బిగ్గరగా చదవడాన్ని విని ఉండవచ్చు. లేక దానిలోని అంశాలను మీకై మీరు చదివి ఉండవచ్చు. బైబిలులో ఆదికాండము నుండి ప్రకటన వరకు ఒకే సామాన్య అంశం ఉందని మీకు తెలుసా? అవును, బైబిలంతటిలో ఒకే పొందికగల అంశం ఉంది. ఆ అంశం ఏమిటి? అది, మానవజాతిని పరిపాలించేందుకు దేవునికి గల హక్కును ఉన్నతపర్చడం మరియు ఆయన రాజ్యం ద్వారా ఆయన ప్రేమపూర్వక సంకల్పం యొక్క నెరవేర్పు. ఈ సంకల్పాన్ని దేవుడు ఎలా నెరవేరుస్తాడో మనం ఆ తర్వాత చూస్తాము.

8. దేవుని వ్యక్తిత్వాన్ని గూర్చి బైబిలు ఏమి బయల్పరుస్తుంది?

8 బైబిలు దేవుని సంకల్పాన్ని గూర్చి తెలియజేయడమే కాకుండా, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా బయల్పరుస్తుంది. ఉదాహరణకు, దేవునికి భావాలున్నాయని, మనం చేసే ఎంపికల ఎడల ఆయన శ్రద్ధ కలిగివున్నాడని మనం బైబిలు నుండి తెలుసుకుంటాము. (కీర్తన 78:40, 41; సామెతలు 27:11; యెహెజ్కేలు 33:11) దేవుడు “దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు” అని కీర్తన 103:8-14 చెబుతుంది. ‘మనం కేవలం మంటి నుండి నిర్మింపబడినవారమని,’ మరణమందు తిరిగి మంటికే చేరతామని గుర్తుంచుకొని ఆయన మనతో దయగా వ్యవహరిస్తాడు. (ఆదికాండము 2:7; 3:19) ఆయన ఎంతటి అద్భుతమైన లక్షణాలను ప్రదర్శిస్తాడోకదా! మీరు ఆరాధించాలని ఇష్టపడే దేవుడు ఇటువంటి దేవుడుకాదా?

9. దేవుని ప్రమాణాలను గూర్చి బైబిలు మనకు ఏ స్పష్టమైన దృక్కోణాన్నిస్తుంది, అలాంటి జ్ఞానం నుండి మనం ఎలా ప్రయోజనం పొందగలము?

9 దేవుని ప్రమాణాలను గూర్చి బైబిలు స్పష్టంగా తెలియజేస్తుంది. అవి కొన్నిసార్లు ఆజ్ఞలుగా చెప్పబడ్డాయి. అయితే, ఎంతో తరచుగా, వస్తు పాఠాల ద్వారా బోధింపబడిన సూత్రాలలో అవి ప్రతిబింబించాయి. ప్రాచీన ఇశ్రాయేలు చరిత్రలోని కొన్ని సంఘటనలను దేవుడు మన ప్రయోజనం కొరకు వ్రాయించాడు. ప్రజలు దేవుని సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తే ఏమి జరుగుతుందో, అలాగే వారు తమ స్వంత మార్గంలో వెళ్లడం వలన వచ్చే దుఃఖకరమైన ఫలితాలేమిటో ఈ నిక్కచ్చియైన వృత్తాంతాలు చూపిస్తాయి. (1 రాజులు 5:4; 11:4-6; 2 దినవృత్తాంతములు 15:8-15) అలాంటి నిజ జీవిత వృత్తాంతాలను చదవడం నిస్సందేహంగా మీ హృదయాలను ప్రభావితం చేస్తుంది. వ్రాయబడిన వృత్తాంతాలను దృశ్యీకరించుకోవడానికి మనం ప్రయత్నిస్తే, వాటిలో ఇమిడివున్న ప్రజలను మనం గుర్తించగలము. అలా, మనం మంచి మాదిరుల నుండి ప్రయోజనం పొంది, తప్పిదస్థులను చిక్కుకుపోయేలా చేసిన ఉరులను తప్పించుకోవచ్చు. అయితే, మనం బైబిల్లో చదివేది నిజంగా దేవునిచే ప్రేరేపించబడినదని మనమెలా నమ్మవచ్చు? అనే ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నకు సమాధానం అవసరం.

బైబిలును మీరు నమ్మవచ్చా?

10. (ఎ) బైబిలు పాతదైపోయిందని కొందరు ఎందుకు భావిస్తారు? (బి) బైబిలు గురించి 2 తిమోతి 3:16, 17 మనకేమి చెబుతుంది?

10 సలహా ఇచ్చే పుస్తకాలనేకం కేవలం కొద్ది సంవత్సరాల తర్వాత పాతవైపోవడం బహుశా మీరు గమనించే ఉండవచ్చు. బైబిలు విషయమేమిటి? అది చాలా పురాతనమైనది, దాని చివరి మాటలు వ్రాయబడి ఇప్పటికి దాదాపు 2,000 సంవత్సరాలు గడిచిపోయాయి. కాబట్టి అది మన ఆధునిక యుగానికి అన్వయింపదగినది కాదని కొందరు భావిస్తారు. కాని బైబిలు దేవునిచే ప్రేరేపించబడినదైతే, అది ఎంతో పురాతనమైనదైనప్పటికీ, దాని సలహా ఎల్లప్పుడూ కాలానుకూలమైనదై ఉండాలి. లేఖనాలు ఇప్పటికీ “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు . . . ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై”నవై ఉండాలి.—2 తిమోతి 3:16, 17.

11-13. బైబిలు మన కాలానికి ఆచరణ యోగ్యమైనదని మనం ఎందుకు చెప్పవచ్చు?

11 బైబిలు సూత్రాలు, మొదట అవి వ్రాయబడినప్పటిలానే నేడు కూడా అన్వయిస్తాయని సునిశిత పరిశీలన తెలియజేస్తుంది. ఉదాహరణకు, మానవ నైజానికి సంబంధించి, మానవజాతి యొక్క ప్రతి తరానికి అన్వయించే లోతైన వివేచనను బైబిలు ప్రతిబింబిస్తుంది. మత్తయి 5 నుండి 7 అధ్యాయాలలో కనుగొనబడే యేసు కొండమీది ప్రసంగంలో మనం దీన్ని సులభంగా కనుగొనవచ్చు. భారతదేశ దివంగత నేత మోహన్‌దాస్‌ కె. గాంధీని ఈ ప్రసంగం ఎంతగానో ప్రభావితం చేసింది, ఆయన ఒక బ్రిటీష్‌ అధికారితో ఇలా చెప్పినట్లు తెలిసింది: “క్రీస్తు ఈ కొండమీది ప్రసంగములో చెప్పిన బోధలను మీ దేశము మా దేశము కలిసి అమలు చేసినప్పుడు, మన దేశముల సమస్యలనేకాదు మనము యావత్‌ ప్రపంచ సమస్యలను పరిష్కరించిన వారమౌతాము.”

12 ప్రజలు యేసు బోధచే ప్రభావితులయ్యారంటే అందులో ఆశ్చర్యం లేదు! కొండమీది ప్రసంగంలో, ఆయన మనకు నిజమైన సంతోషానికి మార్గం చూపించాడు. వివాదాలను ఎలా పరిష్కరించుకోవాలో ఆయన వివరించాడు. ప్రార్థించవలసిన విధానాన్ని గూర్చి యేసు ఉపదేశించాడు. వస్తుసంబంధ అవసరతల ఎడల కలిగివుండవలసిన వివేకయుక్తమైన దృక్పథాన్ని ఎత్తి చూపించి, ఇతరులతో సరైన సంబంధాలు కలిగివుండడానికి బంగారు సూత్రాన్నిచ్చాడు. మతసంబంధమైన మోసాలను ఎలా కనిపెట్టవచ్చు, సురక్షితమైన భవిష్యత్తును ఎలా కలిగివుండవచ్చు అనే విషయాలు కూడా ఈ ప్రసంగంలో చెప్పబడ్డాయి.

13 కొండమీది ప్రసంగంలో, బైబిలు యొక్క మిగతా పేజీలన్నిటిలో, మనం జీవితంలోని పరిస్థితులను మెరుగుపర్చుకొనేందుకు ఏమి చేయాలో, ఏవి నివారించాలో అది మనకు స్పష్టంగా చెబుతుంది. దాని ఉపదేశం ఎంత ఆచరణాత్మకంగా ఉందంటే, ఒక విద్యావేత్త ఇలా చెప్పడానికి పురికొల్పబడ్డాడు: “పెద్ద చదువుల పట్టాలు పొంది, మానసిక ఆరోగ్యం మరియు మనస్తత్వ శాస్త్రంపై అనేక పుస్తకాలు చదివి, ఉన్నత పాఠశాల ఉపదేశకునిగా ఉంటున్నప్పటికీ, వివాహంలో సాఫల్యమొందడం, బాల్య నేరాలను నివారించడం, స్నేహితులను ఎలా సంపాదించుకొని కాపాడుకోవాలి అనేవాటిలో నేను చదివిన లేక కళాశాలలో పఠించిన దానంతటికంటే బైబిలు ఉపదేశం ఎంతో శ్రేష్ఠమైనదని నేను కనుగొన్నాను.” బైబిలు ఆచరణయోగ్యమైనది మరియు కాలానుగుణ్యమైనదే కాక, ఆధారపడదగినది కూడా.

కచ్చితమైనది, నమ్మదగినది

14. బైబిలు వైజ్ఞానికంగా కచ్చితమైనదని ఏది చూపిస్తుంది?

14 బైబిలు విజ్ఞానశాస్త్ర పుస్తకం కాకపోయినప్పటికీ, అది వైజ్ఞానికంగా కచ్చితమైనది. ఉదాహరణకు, భూమి బల్లపరుపుగా ఉందని అనేకమంది ప్రజలు నమ్మిన కాలంలో అది “మండలము” (హెబ్రీ భాషలో చుగ్‌, అది “గోళం” అనే తలంపునిస్తుంది) అని ప్రవక్తయైన యెషయా సూచించాడు. (యెషయా 40:22) యెషయా కాలం తర్వాత వేల సంవత్సరాల వరకు భూమి గోళాకారంగా ఉందనే తలంపు విస్తృతంగా అంగీకరించబడలేదు. అంతేగాక 3,000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన యోబు 26:7, దేవుడు “శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను” అని చెబుతుంది. ఒక బైబిలు పండితుడు ఇలా చెబుతున్నాడు: “ఖగోళశాస్త్రం చూపిస్తున్నట్లుగా, భూమి దృశ్యమైన ఏ ఆధారం లేకుండా శూన్యంలో వ్రేలాడుతుందన్న సత్యం యోబుకు ఎలా తెలుసనే ప్రశ్నను పరిశుద్ధ లేఖనాల ప్రేరేపణను నిరాకరించేవారు అంత సులభంగా పరిష్కరించలేరు.”

15. బైబిలు యొక్క నివేదనా శైలి దానియందు మన నమ్మకాన్ని ఎలా బలపరుస్తుంది?

15 బైబిలులో కనుగొనబడే నివేదనా శైలి కూడా ఈ అతి ప్రాచీన పుస్తకమందలి మన నమ్మకాన్ని బలపరుస్తుంది. కల్పనాకథలలా కాకుండా, బైబిలులో వ్రాయబడిన సంఘటనలు నిర్దిష్టమైన ప్రజలతో, తేదీలతో సంబంధం కల్గివున్నాయి. (1 రాజులు 14:25; యెషయా 36:1; లూకా 3:1, 2) అయితే, ప్రాచీన చరిత్రకారులు దాదాపు ఎప్పుడూ తమ పాలకుల విజయాలను అతిశయోక్తిగా చెప్పి వారి అపజయాలను, తప్పులను దాచిపెట్టగా, బైబిలు రచయితలు చివరికి తమ స్వంత గంభీరమైన పాపాల గురించి తెల్పడంలో కూడా నిష్పక్షపాతంగా, యథార్థంగా ఉన్నారు.—సంఖ్యాకాండము 20:7-13; 2 సమూయేలు 12:7-14; 24:10.

ప్రవచన పుస్తకం

16. బైబిలు దేవుని చేత ప్రేరేపించబడిందనడానికి బలమైన సాక్ష్యాధారం ఏది?

16 నెరవేర్చబడిన ప్రవచనం బైబిలు దేవునిచే ప్రేరేపించబడినదనేందుకు, నిర్ణయాత్మకమైన సాక్ష్యాధారాన్నిస్తుంది. స్పష్టంగా నెరవేర్చబడిన అనేక ప్రవచనాలు బైబిలులో ఉన్నాయి. సుస్పష్టంగా, మానవులు దీనికి బాధ్యులు కాలేరు. అయితే మరి ఈ ప్రవచనాల వెనకనున్నదేమిటి? “ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ [లేక దేవుని చురుకైన శక్తి] వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి” అని బైబిలే చెబుతుంది. (2 పేతురు 1:21) కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.

17. బబులోను కూలిపోవడాన్ని ఏ ప్రవచనాలు ముందే తెలియజేశాయి, ఇవి ఎలా నెరవేర్చబడ్డాయి?

17బబులోను కూలిపోవడం. మాదీయ పారసీకుల చేతుల్లో బబులోను కూలిపోతుందని యెషయా, యిర్మీయా ఇద్దరూ ప్రవచించారు. విశేషంగా, ఈ సంఘటనను గూర్చిన యెషయా ప్రవచనం, బబులోను జయింపబడడానికి ఇంచుమించు 200 సంవత్సరాల ముందు వ్రాయబడింది! ప్రవచనం యొక్క ఈ క్రింది అంశాలు ఇప్పుడు చారిత్రాత్మక వాస్తవాలు: యూఫ్రటీసు నది నీటిని కృత్రిమ సరస్సులోకి మళ్లించడం ద్వారా దాన్ని ఎండిపోజేయడం (యెషయా 44:27; యిర్మీయా 50:38); బబులోను నది ద్వారాలవద్ద అజాగ్రత్తతో కూడిన భద్రతాలోపం (యెషయా 45:1); కోరెషు అనే పేరుగల పరిపాలకుని విజయం.—యెషయా 44:28.

18. “గ్రేకుల రాజు” ఏలికూలడాన్ని గూర్చిన బైబిలు ప్రవచనం ఎలా నెరవేర్చబడింది?

18“గ్రేకుల రాజు” ఏలి కూలడం. ఒక మేకపోతు పొట్టేలు మీదికి వచ్చి దాని రెండు కొమ్ములను విరిచినట్లు దానియేలు ఒక దర్శనంలో చూశాడు. ఆ తర్వాత మేకపోతు పెద్దకొమ్ము విరిగి, దాని స్థానంలో నాలుగు కొమ్ములు పెరిగాయి. (దానియేలు 8:1-8) దానియేలుకు ఇలా వివరించబడింది: “నీవు చూచిన రెండు కొమ్ములుగల ఆ పొట్టేలున్నదే, అది మాదీయులయొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకులరాజు; దాని రెండు కన్నుల మధ్యనున్న ఆ పెద్దకొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి గదా; నలుగురు రాజులు ఆ జనములో నుండి పుట్టుదురుగాని వారు అతనికున్న బలముగలవారుగా ఉండరు.” (దానియేలు 8:20-22) ఈ ప్రవచనానికి అనుగుణంగా, దాదాపు రెండు శతాబ్దాల తర్వాత, “గ్రేకుల రాజు” అయిన అలెగ్జాండర్‌ ది గ్రేట్‌, రెండు కొమ్ములుగల మాదీయ పారసీక రాజ్యాన్ని పడద్రోసాడు. సా.శ.పూ. 323 లో అలెగ్జాండర్‌ మరణించాడు, ఆ తర్వాత చివరికి అతని నలుగురు సైన్యాధికారులు అతని స్థానాన్ని తీసుకున్నారు. అయితే, తర్వాత వచ్చిన ఈ రాజ్యాలలో దేనికి అలెగ్జాండర్‌కున్నంత అధికారం లేకుండెను.

19. యేసుక్రీస్తునందు ఏ ప్రవచనాలు నెరవేరాయి?

19యేసు క్రీస్తు జీవితం. యేసు జననం, పరిచర్య, మరణ పునరుత్థానాలలో నెరవేర్చబడిన డజన్ల కొలది ప్రవచనాలు హెబ్రీ లేఖనాల్లో ఉన్నాయి. ఉదాహరణకు, 700 కంటే ఎక్కువ సంవత్సరాల ముందుగానే, మెస్సీయ లేక క్రీస్తు బేత్లెహేములో జన్మిస్తాడని మీకా ప్రవచించాడు. (మీకా 5:2; లూకా 2:4-7) మెస్సీయ కొట్టబడి, మీద ఉమ్మివేయబడతాడని మీకా సమకాలీనుడైన యెషయా ప్రవచించాడు. (యెషయా 50:6; మత్తయి 26:67) మెస్సీయ 30 వెండి నాణెములకు అప్పగించబడతాడని జెకర్యా ఐదు వందల సంవత్సరాల ముందే ప్రవచించాడు. (జెకర్యా 11:12; మత్తయి 26:15) మెస్సీయ అయిన యేసు మరణానికి సంబంధించిన పరిస్థితులను దావీదు వెయ్యి కంటే ఎక్కువ సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. (కీర్తన 22:7, 8 18; మత్తయి 27:35, 39-43) మెస్సీయ ఎప్పుడు కనిపిస్తాడు, అలాగే ఆయన పరిచర్య కాల నిడివి, ఆయన మరణ సమయం వంటివాటి గురించి దానియేలు ప్రవచనం దాదాపు ఐదు శతాబ్దాల ముందే తెలియజేసింది. (దానియేలు 9:24-27) ఇది యేసుక్రీస్తునందు నెరవేరిన ప్రవచనాల నమూనా మాత్రమే. ఆ తర్వాత ఆయన గురించి ఇంకా ఎక్కువ చదవడం ప్రతిఫలదాయకమైనదని మీరు తెలుసుకుంటారు.

20. నెరవేర్చబడిన ప్రవచనాలను గూర్చిన బైబిలు యొక్క కచ్చితమైన రికార్డు మనకు ఏ నమ్మకాన్నివ్వాలి?

20 అనేక ఇతర దీర్ఘకాలిక బైబిలు ప్రవచనాలు ఇప్పటికే నెరవేర్చబడ్డాయి. మీరిలా అడగవచ్చు, ‘కాని ఇది నా జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?’ ఎవరైనా మీకు చాలా సంవత్సరాలు సత్యం చెబితే, ఆ వ్యక్తి ఏదైనా ఒక క్రొత్త విషయం చెప్పినప్పుడు మీరు వెంటనే అతన్ని అనుమానిస్తారా? అలా చేయరు! దేవుడు బైబిలంతటిలో సత్యమే చెప్పాడు. రాబోయే భూ పరదైసుకు సంబంధించిన దాని ప్రవచనాల వంటి బైబిలు వాగ్దానాలయందు ఇది మీ నమ్మకాన్ని పెంపొందింపజేయవద్దా? వాస్తవానికి, ‘దేవుడు అబద్ధమాడనేరడు’ అని వ్రాసిన, యేసు మొదటి శతాబ్దపు శిష్యులలో ఒకరైన పౌలు వంటి నమ్మకాన్నే మనం కలిగి ఉండవచ్చు. (తీతు 1:2) అంతేగాక, మనం లేఖనాలను చదివి, వాటి ఉపదేశాన్ని అన్వయించుకున్నప్పుడు, మానవులు తమ స్వంతగా సంపాదించుకోలేని వివేకాన్ని మనం చూపిస్తున్నాము, ఎందుకంటే బైబిలు నిత్యజీవానికి నడిపించే దేవుని గూర్చిన జ్ఞానాన్ని తెలియజేసే పుస్తకము.

దేవుని గూర్చిన జ్ఞానాన్ని “అపేక్షించుడి”

21. బైబిలు నుండి మీరు నేర్చుకొనే కొన్ని విషయాలు మిమ్మల్ని కలవరపర్చేవిగా ఉంటే మీరేమి చేయాలి?

21 మీరు బైబిలు పఠిస్తుండగా, మీకు గతంలో నేర్పబడిన వాటి నుండి భిన్నమైన విషయాలను మీరు నేర్చుకోవచ్చు. మీ మనస్సులో ఉంచుకొన్న మతసంబంధమైన ఆచారాలు కొన్ని దేవునికి ప్రీతికరమైనవి కావని మీరు తెలుసుకోవచ్చు. అదుపులేని ఈ లోకంలో సర్వసాధారణమైయున్న వాటికంటే తప్పొప్పులను గూర్చి తెలిపే ఉన్నతమైన ప్రమాణాలు దేవునికున్నాయని మీరు తెలుసుకుంటారు. ఇది మొదట్లో కలవరపర్చేదిగా ఉండవచ్చు. కాని సహనం కలిగివుండండి! దేవుని గూర్చిన జ్ఞానాన్ని కనుగొనేందుకు లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించండి. బైబిలు ఉపదేశం మీ ఆలోచనావిధానంలో, క్రియలలో మార్పు చేసుకోవలసిన సాధ్యతను కలిగిస్తే దానికి తగినట్లు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండండి.

22. మీరు బైబిలు ఎందుకు పఠిస్తున్నారు, దీన్ని అర్థంచేసుకొనేందుకు మీరు ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చు?

22 మీరు బైబిలు పఠించడాన్ని మీ శ్రేయోభిలాషులైన స్నేహితులు, బంధువులు ఆటంకపర్చవచ్చు, కాని యేసు ఇలా చెప్పాడు: “మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును ఎరుగనందును.” (మత్తయి 10:32, 33) మీరు ఏదో ఒక మతశాఖను అనుసరించబోతున్నారని లేక వెర్రివారౌతారని కొందరు భయపడవచ్చు. అయితే, వాస్తవానికి మీరు దేవుని గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని, ఆయన సత్యాన్ని పొందడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు. (1 తిమోతి 2:3, 4) ఇది ఇతరులు అర్థంచేసుకొనేందుకు సహాయపడడానికి, మీరు నేర్చుకొంటున్నదాని గురించి మీరు వారితో మాట్లాడేటప్పుడు సహేతుకంగా ఉండండి, వాదించేవారిగా ఉండకండి. (ఫిలిప్పీయులు 4:5) బైబిలు జ్ఞానం ప్రజలకు నిజంగా ప్రయోజనకరమైనదనే దానికి సాక్ష్యాధారాన్ని చూసినప్పుడు అనేకులు “వాక్యము లేకుండనే . . . రాబట్ట” బడ్డారని గుర్తుంచుకోండి.—1 పేతురు 3:1, 2.

23. దేవుని గూర్చిన జ్ఞానాన్ని మీరు ఎలా ‘అపేక్షించవచ్చు’?

23 బైబిలు మనల్నిలా కోరుతోంది: “క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను . . . పాలను అపేక్షించుడి.” (1 పేతురు 2:2) ఒక శిశువు పోషణ కొరకు తన తల్లిపై ఆధారపడుతుంది, ఆ అవసరత తీరడం గురించి పట్టుదల కలిగివుంటుంది. అలాగే, మనం దేవుని నుండి వచ్చే జ్ఞానంపై ఆధారపడి ఉన్నాము. మీ పఠనాన్ని కొనసాగించడం ద్వారా ఆయన వాక్యాన్ని “అపేక్షించుడి.” వాస్తవానికి, బైబిలును ప్రతిదినం చదవడాన్ని మీ గురిగా పెట్టుకోండి. (కీర్తన 1:1-3) ఇది మీకు గొప్ప ఆశీర్వాదాలను తెస్తుంది, ఎందుకంటే కీర్తన 19:11 దేవుని కట్టడల గురించి ఇలా చెబుతుంది: “వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.”

[అధస్సూచీలు]

^ పేరా 5 క్రీ.పూ. (“క్రీస్తు పూర్వం”) అనేదానికన్నా “సామాన్య శక పూర్వం” అనే భావంగల సా.శ.పూ. మరింత కచ్చితమైనది. “ప్రభువు సంవత్సరంలో” అనే భావంగల ఎ.డి. అంటే అన్నో డోమిని, అని తరచూ పిలువబడే సా.శ. “సామాన్య శకాన్ని” సూచిస్తుంది.

మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి

బైబిలు ఏయే విధాలుగా ఇతర గ్రంథాలకంటె విశేషమైనది?

మీరు బైబిలును ఎందుకు నమ్మవచ్చు?

బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమని మీకు ఏది నిరూపిస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[14వ పేజీలోని బాక్సు]

మీ బైబిలుతో బాగా పరిచయం కలిగివుండండి

బైబిలుతో పరిచయం కలిగివుండడం కష్టమైనదై ఉండనవసరం లేదు. బైబిలు పుస్తకాల క్రమాన్ని, స్థానాన్ని తెలుసుకోవడానికి దాని విషయసూచికను ఉపయోగించండి.

సులభంగా కనుగొనేందుకు బైబిలు పుస్తకాలకు అధ్యాయాలు, వచనాలు ఉన్నాయి. అధ్యాయ విభాగాలు 13వ శతాబ్దంలో చేర్చబడ్డాయి, 16వ శతాబ్దపు ఫ్రెంచి ముద్రణకర్త గ్రీకు లేఖనాలను నేడున్నట్లుగా వచనాలలోకి స్పష్టంగా విభాగించాడు. అధ్యాయాల మరియు వచనాల సంఖ్యలు గల మొదటి పూర్తి బైబిలు 1553 లో ముద్రించబడిన ఫ్రెంచి భాషా గ్రంథమే.

ఈ పుస్తకంలో లేఖనాలు ఉదాహరించబడినప్పుడు, మొదటి సంఖ్య అధ్యాయాన్ని, తరువాతది వచనాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు, “సామెతలు 2:5” అని ఉదాహరించబడితే సామెతల పుస్తకం, రెండవ అధ్యాయం, ఐదవ వచనం అని భావం. ఉదాహరించబడిన లేఖనాలను తెరిచి చూసుకోవడం ద్వారా మీరు త్వరలోనే బైబిలు లేఖనాలను సులభంగా గుర్తిస్తారు.

బైబిలుతో బాగా పరిచయం కలిగివుండడానికి మంచి మార్గం ఏమిటంటే ప్రతిదినం బైబిలు చదవడమే. మొదట్లో, ఇది సవాలుతో కూడినదిగా అనిపించవచ్చు. కాని మీరు వాటి నిడివినిబట్టి ఒకరోజుకు మూడు నుండి ఐదు అధ్యాయాలను చదివితే, మీరు మొత్తం బైబిలును ఒక సంవత్సరంలో ముగిస్తారు. నేడే చదవడానికి ఎందుకు ప్రారంభించకూడదు?

[19వ పేజీలోని బాక్సు]

బైబిలు—ఒక అత్యున్నత పుస్తకం

• బైబిలు “దైవావేశము వలన” కలిగినది. (2 తిమోతి 3:16) పదాలను మానవులే వ్రాసినప్పటికీ, బైబిలు నిజంగా “దేవుని వాక్య”మై ఉండేలా దేవుడు వారి తలంపులను నడిపించాడు.—1 థెస్సలొనీకయులు 2:13.

• విభిన్న జీవనగతుల నుండి వచ్చిన దాదాపు 40 మంది బైబిలు రచనకు తోడ్పడ్డారు, దీనికి 16 శతాబ్దాల కాలం పట్టింది. అయినప్పటికీ, పూర్తయిన మొత్తం బైబిలు మొదటి నుండి చివరి వరకు పొందిక కలిగివుంది.

• మరే ఇతర పుస్తకం కంటే బైబిలు ఎక్కువ వ్యతిరేకతను ఎదుర్కొని నిలిచింది. మధ్య యుగాల్లో, కేవలం లేఖనాల ప్రతిని కలిగివున్నందుకే ప్రజలు మ్రానుపై కాల్చబడ్డారు.

• ప్రపంచంలో అత్యంత విరివిగా అమ్ముడుపోయే గ్రంథం బైబిలు. అది మొత్తంగా లేక భాగాలుగా 2,000 కంటే ఎక్కువ భాషల్లోకి అనువదించబడింది. వందల కోట్ల ప్రతులు ముద్రించబడ్డాయి, భూమిపై దాని ప్రతి లేని స్థలం దాదాపు లేదు.

• బైబిలు యొక్క అతి పురాతనమైన భాగం సా.శ.పూ. 16వ శతాబ్దానికి చెందినది. ఇది హిందువుల ఋగ్వేదం (దాదాపు సా.శ.పూ. 1300 కాలంలో) కంటే, లేక బౌద్ధుల “కానన్‌ ఆఫ్‌ ది త్రీ బాస్కెట్స్‌” (సా.శ.పూ. ఐదవ శతాబ్దం) కంటే, లేదా మహమ్మదీయుల ఖురాను (సా.శ. ఏడవ శతాబ్దం) కంటే, అలాగే షింటో మతస్థుల నిహోంగీ (సా.శ. 720) కంటే ముందే ఉంది.

[20వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]