6వ పాఠం
చనిపోయినవాళ్లను మళ్లీ ఎప్పుడైనా చూస్తామా?
1. చనిపోయినవాళ్ల గురించి ఏదైనా మంచివార్త ఉందా?
యేసు యెరూషలేముకు దగ్గర్లో ఉన్న బేతనియకు చేరుకున్నాడు. ఆయన స్నేహితుడైన లాజరు చనిపోయి అప్పటికి నాలుగు రోజులైంది. ఆయన లాజరు తోబుట్టువులైన మార్త, మరియతో కలిసి సమాధి దగ్గరికి వెళ్లాడు. కాసేపటికి చాలామంది అక్కడికి వచ్చారు. యేసు లాజరును పునరుత్థానం చేసినప్పుడు లేదా తిరిగి బ్రతికించినప్పుడు మార్త, మరియ ఎంత సంతోషించి ఉంటారో మీరు ఊహించుకోగలరా?—యోహాను 11:21-24, 38-44 చదవండి.
చనిపోయినవాళ్ల గురించి బైబిలు చెప్తున్న మంచివార్త ఏంటో మార్తకు ముందే తెలుసు. చనిపోయినవాళ్లను యెహోవా బ్రతికిస్తాడని, వాళ్లు మళ్లీ ఇదే భూమ్మీద జీవిస్తారని ఆమెకు తెలుసు.—యోబు 14:14, 15 చదవండి.
2. చనిపోయినప్పుడు ఏమౌతుంది?
దేవుడు మనుషుల్ని మట్టితో చేశాడు. (ఆదికాండం 2:7; 3:19) మన శరీరంలో చావులేని ఆత్మ అంటూ ఏదీ లేదు. చనిపోయాక మనలోని ఏ భాగమూ బ్రతికుండదు. చనిపోయినప్పుడు మన మెదడు పనిచేయడం ఆగిపోతుంది, మన ఆలోచనలు నశించిపోతాయి. చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు కాబట్టే లాజరు కూడా చనిపోయిన తర్వాత తనకేం జరిగిందో చెప్పలేదు.—కీర్తన 146:4; ప్రసంగి 9:5, 6, 10 చదవండి.
చనిపోయినవాళ్లను దేవుడు అగ్నిలో కాల్చి బాధిస్తాడా? నరకాగ్ని అనేది దేవున్ని నిందించే ఒక తప్పుడు బోధ. ఎందుకంటే చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదని బైబిలు చెప్తుంది. నిజానికి, మనుషుల్ని అగ్నిలో కాల్చడమనే ఆలోచనే దేవునికి అసహ్యం.—యిర్మీయా 7:31 చదవండి.
చనిపోయిన తర్వాత ఏమౌతుంది? వీడియో చూడండి.
3. చనిపోయినవాళ్లు మనతో మాట్లాడగలరా?
చనిపోయినవాళ్లు మనతో మాట్లాడలేరు, మనం చెప్పేది వినలేరు. (కీర్తన 115:17) కొన్నిసార్లు చెడ్డ దేవదూతలు ప్రజలతో మాట్లాడుతూ, చనిపోయినవాళ్లే మాట్లాడుతున్నట్టు నమ్మిస్తారు. (2 పేతురు 2:4) అయితే చనిపోయినవాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించకూడదని యెహోవా గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాడు.—ద్వితీయోపదేశకాండం 18:10, 11 చదవండి.
4. ఎవరెవరు మళ్లీ బ్రతుకుతారు?
చనిపోయిన కోట్లమందిని దేవుడు మళ్లీ బ్రతికించి ఇదే భూమ్మీద జీవించేలా చేస్తాడు. వాళ్లలో దేవుని గురించి తెలియక చెడ్డపనులు చేసిన కొంతమంది కూడా ఉంటారు.—లూకా 23:43; అపొస్తలుల కార్యాలు 24:15 చదవండి.
తిరిగి బ్రతికినవాళ్లకు దేవుని గురించిన సత్యం తెలుసుకునే అవకాశం, అలాగే యేసుకు లోబడుతూ ఆయన మీద విశ్వాసం చూపించే అవకాశం ఉంటుంది. (ప్రకటన 20:11-13) తిరిగి బ్రతికిన తర్వాత మంచిపనులు చేసేవాళ్లు భూమ్మీద ఎప్పటికీ జీవిస్తారు.—యోహాను 5:28, 29 చదవండి.
5. చనిపోయినవాళ్లను బ్రతికించే ఏర్పాటు యెహోవా గురించి ఏం చెప్తుంది?
యెహోవా ఎంత ప్రేమ, అపారదయ గల దేవుడో ఈ ఏర్పాటు చూపిస్తుంది. మన కోసం చనిపోయేలా దేవుడు తన కుమారుడైన యేసును పంపించాడు. చనిపోయినవాళ్లు తిరిగి బ్రతకడం, పరదైసు భూమ్మీద ఎప్పటికీ జీవించడం అనేవి దానివల్లే సాధ్యమయ్యాయి. తిరిగి బ్రతికేవాళ్లలో ముఖ్యంగా ఎవర్ని చూడాలని మీరు అనుకుంటున్నారు?—యోహాను 3:16; రోమీయులు 6:23 చదవండి.