కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

7

మీకు ఎప్పుడైనా ఒంటరిగా, భయంగా ఉన్నట్టు అనిపించిందా?

మీకు ఎప్పుడైనా ఒంటరిగా, భయంగా ఉన్నట్టు అనిపించిందా?

ఇక్కడున్న బాబును చూడండి. ఇతను ఒంటరిగా, భయంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు కదా? మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా?— అప్పుడప్పుడు ప్రతి ఒక్కరికీ అలా అనిపిస్తుంది. యెహోవా స్నేహితులకు కూడా కొన్నిసార్లు ఒంటరిగా, భయంగా ఉన్నట్టు అనిపించింది, వాళ్ల గురించి బైబిల్లో ఉంది. వాళ్లలో ఏలీయా ఒకరు. ఆయన గురించి ఇప్పుడు నేర్చుకుందామా?

యెజెబెలు ఏలీయాను చంపాలనుకుంది

ఈయన యేసు పుట్టకముందు ఎన్నో ఏళ్ల కిందట జీవించాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న అహాబు సత్య దేవుడైన యెహోవాను ఆరాధించేవాడు కాదు. అతను, అతని భార్య యెజెబెలు బయలు అనే అబద్ధ దేవతను పూజించేవాళ్లు. అందుకే, ఇశ్రాయేలులో చాలామంది బయలును పూజించడం మొదలుపెట్టారు. యెజెబెలు రాణి చాలా చెడ్డది, క్రూరురాలు కూడా. యెహోవాను ఆరాధించే వాళ్లందర్నీ ఆమె చంపించాలనుకుంది, అందులో ఏలీయా కూడా ఉన్నాడు! అప్పుడు ఏలీయా ఏమి చేశాడో తెలుసా?—

ఏలీయా పారిపోయాడు! ఎక్కడో దూరానున్న ఎడారికి పారిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. ఆయన ఎందుకలా పారిపోయాడు?— ఆఁ, ఆయన భయపడ్డాడు. అసలు ఏలీయా భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకని? ఎందుకంటే, యెహోవా తనకు సహాయం చేయగలడని ఏలీయాకు తెలుసు. యెహోవా తనకు ఎంత శక్తి ఉందో ఏలీయాకు అంతకుముందు చూపించాడు. ఓసారి ఏలీయా చేసిన ప్రార్థన విని యెహోవా పరలోకం నుండి అగ్ని పంపించాడు. అలాంటి యెహోవా ఇప్పుడు ఏలీయాకు సహాయం చేయలేడా?

యెహోవా ఏలీయాకు ఎలా సహాయం చేశాడు?

ఏలీయా గుహలో ఉండగా యెహోవా ఆయనను, ‘నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు?’ అని అడిగాడు. దానికి ఏలీయా ఇలా చెప్పాడు: ‘నేను ఒక్కడినే ఇంకా నిన్ను ఆరాధిస్తున్నాను. నేను ఒక్కడినైపోయా. నన్ను చంపేస్తారేమోనని భయంగా ఉంది.’ యెహోవాను ఆరాధించే వాళ్లందర్నీ చంపేశారని ఏలీయా అనుకున్నాడు. కానీ యెహోవా ఏలీయాతో ఇలా అన్నాడు: ‘అది నిజం కాదు, ఇంకా నన్ను ఆరాధిస్తున్న వాళ్లు 7,000 మంది ఉన్నారు. ధైర్యంగా ఉండు. నా కోసం నువ్వు చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది!’ అది విన్నప్పుడు ఏలీయా సంతోషించాడా?—

ఏలీయాకు జరిగిన దాని నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?— మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉన్నామని అనుకోవద్దు, భయపడొద్దు. యెహోవాను, మిమ్మల్ని ప్రేమించే స్నేహితులు మీకు ఉన్నారు. అంతేకాదు యెహోవాకు ఎంతో శక్తి ఉంది, ఆయన ఎప్పుడూ మీకు అండగా ఉంటాడు! మీరు ఎప్పుడూ ఒంటరివాళ్లు కాదనే విషయం తెలుసుకున్నందుకు మీకు సంతోషంగా లేదా?—

మీ బైబిల్లో చదవండి