మీరు పన్నులు కట్టాలా?
మీరు పన్నులు కట్టాలా?
పన్నులు కట్టడం చాలామందికి ఇష్టముండదు. తాము పన్ను రూపంలో చెల్లించే డబ్బు అసమర్థత, దుర్వినియోగం, మోసం వల్ల వృథా అవుతుందని చాలామంది అనుకుంటారు. ఆ డబ్బును అనైతిక విధానాల్లో ఉపయోగిస్తున్నారని కొంతమంది పన్ను కట్టడానికి నిరాకరిస్తారు. తాము పన్ను కట్టకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారో వివరిస్తూ మిడిల్ ఈస్ట్‌లోని ఒక పట్టణ వాసులు ఇలా చెప్పారు: “మా పిల్లల్ని చంపే బుల్లెట్లు కొనడానికి మేము డబ్బులు ఇవ్వం.”
అవి ఎక్కడో అరుదుగా వినిపించే మాటలో, ఇప్పుడే కొత్తగా వింటున్న మాటలో కాదు. ఒకప్పటి హిందూ నాయకుడైన మోహన్‌దాస్ కె. గాంధీ పన్ను కట్టడానికి తన మనస్సాక్షి ఎందుకు ఒప్పుకోదో చెప్తూ ఇలా అన్నాడు: “సైనిక విధానంలో వ్యవస్థీకరించబడిన దేశానికి ఎవరైతే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతిస్తారో అతనికి లేదా ఆమెకి ఆ పాపంలో వంతు ఉంటుంది. పన్ను కట్టడం ద్వారా దేశ నిర్వహణకు దోహదపడే ప్రతీ వ్యక్తికి అతను వృద్ధుడైనా, యౌవనుడైనా ఆ పాపంలో వంతు ఉంటుంది.”
అలాగే 19వ శతాబ్దానికి చెందిన హెన్రీ డేవిడ్ థోరో అనే తత్వవేత్త, యుద్ధం కోసం ఉపయోగించే పన్నులు కట్టకపోవడానికి తనకున్న నైతిక కారణాల్ని వివరించాడు. థోరో ఇలా అడిగాడు: “ఒక పౌరుడు ఒక్క క్షణమైనా తన మనస్సాక్షిని ఒక శాసనకర్త కోసం వదులుకోవచ్చా? అలాగైతే ప్రతీ మనిషికి మనస్సాక్షి ఎందుకు ఉన్నట్టు?”
ఈ అంశం గురించి క్రైస్తవులు కూడా ఆలోచించాలి, ఎందుకంటే వాళ్లు అన్ని విషయాల్లో స్వచ్ఛమైన మనస్సాక్షిని కాపాడుకోవాలని బైబిలు స్పష్టంగా చెప్తుంది. (2 తిమోతి 1:3) అదే సమయంలో, పన్నులు వసూలు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందని కూడా అది చెప్తుంది. బైబిల్లో ఇలా ఉంది: “ప్రతీ ఒక్కరు పై అధికారాలకు [మానవ ప్రభుత్వాలకు] లోబడివుండాలి, ఎందుకంటే అధికారాలన్నీ దేవుని అనుమతితోనే ఉనికిలో ఉన్నాయి; ఇప్పుడున్న అధికారాల్ని దేవుడే వాటివాటి స్థానాల్లో ఉంచాడు. కాబట్టి మీరు లోబడివుండడానికి బలమైన కారణమే ఉంది. కేవలం ఆగ్రహాన్ని బట్టి మాత్రమే కాదుగానీ మీ మనస్సాక్షిని బట్టి కూడా మీరు లోబడివుండాలి. అందుకే కదా మీరు పన్నులు కూడా కడుతున్నారు; ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ ప్రజలకు సేవ చేసే దేవుని సేవకులు. కాబట్టి ప్రతీ ఒక్కరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేయండి: ఎవరికి పన్ను కట్టాలో వాళ్లకు పన్ను కట్టండి.”—రోమీయులు 13:1, 5-7.
అందుకే, మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు పన్నులు చక్కగా కడతారనే పేరుంది. ఆ డబ్బులో కొంత సైన్యానికి మద్దతివ్వడానికి ఉపయోగించబడినా, వాళ్లు పన్ను కట్టేవాళ్లు. ఈ రోజుల్లో యెహోవాసాక్షులు కూడా అంతే. * పరస్పర విరుద్ధంగా కనిపించే ఈ విషయాల్ని మనం ఎలా అర్థంచేసుకోవాలి? పన్ను కట్టాల్సి వచ్చినప్పుడు ఒక క్రైస్తవుడు తన మనస్సాక్షిని పక్కన పెట్టేయాలా?
పన్నులు, మనస్సాక్షి
ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు కట్టాలని ఆజ్ఞాపించిన పన్నులో కొంతభాగాన్ని సైన్యం కోసం ఉపయోగించేవాళ్లు. ఆ తర్వాతి కాలాల్లో గాంధీ, థోరో అనేవాళ్ల మనస్సాక్షి పన్ను కట్టడానికి ఒప్పుకోనిది అందుకే.
ఆ క్రైస్తవులు రోమీయులు 13వ అధ్యాయంలో ఉన్న ఆజ్ఞను పాటించింది కేవలం శిక్ష తప్పించుకోవడానికి మాత్రమే కాదు, బదులుగా “మనస్సాక్షిని బట్టి కూడా” అని గమనించండి. (రోమీయులు 13:5) అవును, ఒక క్రైస్తవుడు కట్టే పన్నును అతను వ్యక్తిగతంగా తిరస్కరించే పనుల కోసం అధికారులు ఉపయోగించినా, అతని మనస్సాక్షి పన్ను కట్టాలి అనే చెప్తుంది. పరస్పర విరుద్ధంగా కనిపించే ఈ విషయాల్ని అర్థంచేసుకోవాలంటే, మనస్సాక్షి గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. మనస్సాక్షి అంటే మన లోపల ఉండి, మనం చేసే పని సరైనదా కాదా అని చెప్పే ఒక స్వరం.
థోరో చెప్పినట్టు, ప్రతీ ఒక్కరికి మనస్సాక్షి ఉంటుంది. అయితే కొన్నిసార్లు అది నమ్మదగినదిగా ఉండకపోవచ్చు. మనం దేవున్ని సంతోషపెట్టాలంటే, మన మనస్సాక్షి ఆయన నైతిక ప్రమాణాల ప్రకారం పనిచేయాలి. దేవుని ఆలోచనలు మన ఆలోచనల కన్నా ఉన్నతమైనవి కాబట్టి తరచూ మన ఆలోచనను దేవునికి తగినట్టు సరిచేసుకోవాల్సి ఉంటుంది. (కీర్తన 19:7) కాబట్టి మానవ ప్రభుత్వాల విషయంలో దేవుని ఆలోచన ఏంటో అర్థంచేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇంతకీ దేవుడు వాటిని ఎలా చూస్తాడు?
అపొస్తలుడైన పౌలు మానవ ప్రభుత్వాలను “ప్రజలకు సేవ చేసే దేవుని సేవకులు” అని పిలిచాడని గమనించాం. (రోమీయులు 13:6) దానర్థం ఏంటి? అంటే వాళ్లు అన్నీ పద్ధతిగా ఉండేలా చూసుకుంటూ సమాజానికి విలువైన సేవలు అందిస్తారని అర్థం. అవినీతికి మారు పేరు లాంటి ప్రభుత్వాలు కూడా ఉత్తరాలు చేరవేయడం, విద్య, అగ్నిమాపక సౌకర్యం కల్పించడం, చట్టాలు అమలుపర్చడం లాంటి సేవలు అందిస్తాయి. మనుషులు రూపొందించిన ఈ అధికారాల్లో ఉన్న లోపాల గురించి దేవునికి పూర్తిగా తెలుసు. అయినాసరే కొంతకాలం పాటు ఆ ప్రభుత్వాలు మనుషుల్ని పరిపాలించేందుకు అనుమతిస్తున్నాడు. అంతేకాదు, ఆయన ఏర్పాటుపట్ల గౌరవంతో మనం తప్పనిసరిగా పన్నులు కట్టాలని ఆయన చెప్తున్నాడు.
అయితే మానవ ప్రభుత్వాలు పరిపాలించాలి అనేది తాత్కాలిక ఏర్పాటు. వాటన్నిటినీ తీసేసి తన పరలోక రాజ్యాన్ని తీసుకురావాలి అనేది దేవుని ఉద్దేశం. వందల సంవత్సరాల్లో మానవ పరిపాలన వల్ల మనుషులకు కలిగిన నష్టమంతటినీ ఆ రాజ్యం పూర్తిగా తీసేస్తుంది. (దానియేలు 2:44; మత్తయి 6:10) ఈలోగా పన్నులు కట్టకుండా లేదా వేరే విధాల్లో తిరుగుబాటు చేసే అధికారాన్ని దేవుడు క్రైస్తవులకు ఇవ్వలేదు.
గాంధీకి అనిపించినట్టే, యుద్ధానికి మద్దతిచ్చే పన్నులను కట్టడం తప్పు అని ఇప్పటికీ మీకు అనిపిస్తుందా? కాస్త ఎత్తులో నుండి చూసినప్పుడు ఒక ప్రాంతం ఇంకా బాగా కనిపిస్తుంది. మన ఆలోచన కన్నా దేవుని ఆలోచన ఎంత ఎత్తుగా ఉంటుందో అర్థం చేసుకుంటే, ఆయనలా ఆలోచించడం మనకు తేలికౌతుంది. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇలా చెప్పాడు: “ఆకాశం భూమి కంటే ఎత్తుగా ఉన్నట్టు నా మార్గాలు మీ మార్గాల కన్నా ఎత్తుగా ఉన్నాయి, నా ఆలోచనలు మీ ఆలోచనల కన్నా ఉన్నతంగా ఉన్నాయి.”—యెషయా 55:8, 9.
పూర్తి అధికారమా?
పన్నులు కట్టాలని బైబిలు చెప్తుందంటే దానర్థం మానవ ప్రభుత్వాలకు తమ పౌరుల మీద పూర్తి అధికారం ఉందని కాదు. దేవుడు ఈ ప్రభుత్వాలకు పరిమిత అధికారం మాత్రమే ఇచ్చాడని యేసు చెప్పాడు. అప్పట్లో అధికారంలో ఉన్న రోమా ప్రభుత్వానికి పన్నులు కట్టడం దేవుని దృష్టిలో సరైనదేనా అని యేసును అడిగినప్పుడు, ఆయన ఎంతో ప్రాముఖ్యమైన ఈ మాటలు అన్నాడు: “కైసరువి కైసరుకు చెల్లించండి, కానీ దేవునివి దేవునికి చెల్లించండి.”—మార్కు 12:13-17.
“కైసరు” అనే మాట ప్రభుత్వాలను సూచిస్తుంది. అవి నాణేలను లేదా నోట్లను ముద్రించి వాటి విలువను నిర్ణయించడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి పన్నుల రూపంలో వాటిని తిరిగి చెల్లించమనే హక్కు ప్రభుత్వాలకు ఉంటుందనేది దేవుని అభిప్రాయం. అయితే “దేవునివి” అంటే మన ప్రాణం, ఆరాధన ఇవ్వమనే హక్కు ఏ మానవ సంస్థకూ ఉండదని యేసు చెప్తున్నాడు. మానవ చట్టాలు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు క్రైస్తవులు “లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు.”—అపొస్తలుల కార్యాలు 5:29.
తాము పన్ను రూపంలో చెల్లించే డబ్బును ఎలా ఖర్చు చేస్తారనే విషయంలో క్రైస్తవులకు కొంత ఆందోళన ఉండవచ్చు. అయినాసరే ఎదిరించడం, పన్ను కట్టడానికి నిరాకరించడం వంటివాటి ద్వారా ప్రభుత్వ చర్యలను అడ్డుకోవడానికి లేదా ప్రభావితం చేయడానికి వాళ్లు ప్రయత్నించరు. అలాచేస్తే, మనుషుల సమస్యలకు దేవుడు ఏర్పాటు చేసిన పరిష్కారం మీద వాళ్లకు నమ్మకం లేనట్టే. బదులుగా తన కుమారుడైన యేసు పరిపాలన ద్వారా మనుషుల విషయాల్లో జోక్యం చేసుకోవడానికి దేవుడు పెట్టిన సమయం వచ్చేవరకు వాళ్లు ఓపిగ్గా ఎదురుచూస్తారు. ఆ రాజ్యం గురించి యేసు ఇలా చెప్పాడు: “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.”—యోహాను 18:36.
బైబిలు చెప్పేది పాటిస్తే వచ్చే ప్రయోజనాలు
పన్నులు కట్టే విషయంలో బైబిలు చెప్పేది పాటిస్తే మీకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. చట్టాన్ని పాటించనివాళ్లకు వచ్చే శిక్ష తప్పించుకోవచ్చు, అలాగే దొరికిపోతామేమో అనే భయం కూడా ఉండదు. (రోమీయులు 13:3-5) ముఖ్యంగా, దేవుని ముందు మీ మనస్సాక్షి స్వచ్ఛంగా ఉంటుంది, చట్టాలకు లోబడే మీ మంచి ప్రవర్తనతో ఆయన్ని ఘనపరుస్తారు. పన్నులు కట్టనివాళ్లు, మోసం చేసి తక్కువ పన్ను చెల్లించేవాళ్లతో పోల్చుకుంటే మీరు ఆర్థికంగా కొంత నష్టపోవచ్చు. అయితే తన విశ్వసనీయ సేవకుల బాగోగులు చూసుకుంటానని దేవుడు చేసిన వాగ్దానం మీద మీరు నమ్మకం పెట్టుకోవచ్చు. బైబిల్లో దావీదు ఇలా అన్నాడు: “ఒకప్పుడు నేను చిన్నవాణ్ణి, ఇప్పుడు ముసలివాణ్ణి, అయితే ఒక్క నీతిమంతుడైనా విడిచిపెట్టబడడం గానీ, అతని పిల్లలు ఆహారం కోసం భిక్షమెత్తుకోవడం గానీ నేను చూడలేదు.”—కీర్తన 37:25.
చివరిగా, పన్నులు కట్టడం గురించిన బైబిలు ఆజ్ఞను అర్థం చేసుకొని పాటిస్తే మీకు మనశ్శాంతి ఉంటుంది. మీరు ఇచ్చే అద్దెను యజమాని ఎలా ఉపయోగిస్తున్నాడనే దానికి చట్టం మిమ్మల్ని బాధ్యులుగా ఎంచదు, అలాగే మీరు కట్టే పన్నులతో ప్రభుత్వం ఏంచేస్తుందనే దానికి దేవుడు మిమ్మల్ని బాధ్యులుగా ఎంచడు. దక్షిణ యూరప్‌కు చెందిన స్టెల్వీయో బైబిలు సత్యం నేర్చుకోకముందు ఎన్నో సంవత్సరాల పాటు రాజకీయ మార్పు కోసం కృషిచేశాడు. తన ప్రయత్నాలు ఆపడానికి కారణం చెప్తూ అతను ఇలా అన్నాడు: “మనిషి న్యాయాన్ని, శాంతిని, సహోదరత్వాన్ని ప్రపంచంలోకి తీసుకురాలేడని నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒక భిన్నమైన, మెరుగైన సమాజాన్ని నిజంగా తీసుకురావడం ఒక్క దేవుని రాజ్యం వల్లే అవుతుంది.”
స్టెల్వీయోలాగే మీరు నమ్మకంగా ‘దేవునివి దేవునికి చెల్లిస్తే’ ఆ భరోసా మీకు కూడా ఉంటుంది. మనుషుల పరిపాలన వల్ల జరిగిన నష్టాన్ని, అన్యాయాన్ని పూర్తిగా తీసేసే నీతిగల పరిపాలనను దేవుడు భూమ్మీదికి తీసుకొచ్చినప్పుడు మీరు దాన్ని చూడగలుగుతారు.
[అధస్సూచీలు]
^ పన్ను కట్టే విషయంలో యెహోవాసాక్షులకు ఉన్న మంచి పేరు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి కావలికోట నవంబరు 1, 2002 సంచికలోని 13వ పేజీ, 15వ పేరా; అలాగే మే 1, 1996 సంచికలోని 17వ పేజీ, 7వ పేరా చూడండి.
[బ్లర్బ్]
దేవుని ఆలోచనలు మన ఆలోచనల కన్నా ఉన్నతమైనవి కాబట్టి మన ఆలోచనను దేవునికి తగినట్టు సరిచేసుకోవాల్సి ఉంటుంది
[బ్లర్బ్]
దేవునికి లోబడి పన్నులు కట్టడం ద్వారా క్రైస్తవులు దేవుని ముందు మంచి మనస్సాక్షిని కాపాడుకుంటారు, ఆయన తమ అవసరాలు తీరుస్తాడనే నమ్మకాన్ని చూపిస్తారు
[చిత్రం]
“కైసరువి కైసరుకు చెల్లించండి, కానీ దేవునివి దేవునికి చెల్లించండి”
[క్రెడిట్ లైను]
Copyright British Museum