కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాల్ని మారుస్తుంది

“నేను ఇప్పుడు లోకాన్ని మార్చేయాలని అనుకోవట్లేదు”

“నేను ఇప్పుడు లోకాన్ని మార్చేయాలని అనుకోవట్లేదు”
  • పుట్టిన సంవత్సరం: 1966

  • దేశం: ఫిన్‌లాండ్‌

  • ఒకప్పుడు: సమాజాన్ని మార్చాలని అనుకున్నాడు

నాగతం:

చిన్నప్పటి నుండి నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. సెంట్రల్‌ ఫిన్‌లాండ్‌లోని యువాస్కులా అనే మా ఊరి చుట్టూ అడవులు, అందమైన సరస్సులు ఉండేవి. మా కుటుంబం సరదాగా గడపడానికి అక్కడికి వెళ్తూ ఉండేది. నాకు జంతువులు అంటే ప్రాణం. చిన్నప్పుడు, కనిపించిన ప్రతీ పిల్లిని, కుక్కని వెళ్లి హత్తుకోవాలని అనిపించేది! నేను పెరిగి పెద్దౌతున్నప్పుడు, జంతువులతో చాలామంది క్రూరంగా ప్రవర్తించడం చూసి బాధపడ్డాను. కొంతకాలానికి జంతు హక్కుల సంస్థలో చేరాను, అక్కడ నాలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లను కలిశాను.

జంతు హక్కుల కోసం మేము ఉత్సాహంగా ప్రచారం చేశాం. జంతు చర్మాలతో బట్టలు తయారుచేసే షాపులకు, జంతువుల మీద ప్రయోగాలు చేసే లాబరేటరీలకు వ్యతిరేకంగా ప్రచారాలు చేశాం, ధర్నాలు చేశాం. జంతు సంరక్షణ కోసం మేము ఒక కొత్త సంస్థను కూడా స్థాపించాం. జంతువుల్ని కాపాడడానికి మేము ఎంతకైనా తెగించేవాళ్లం కాబట్టి, తరచూ పోలీసులు మమ్మల్ని అడ్డుకునేవాళ్లు. పోలీసులు నన్ను చాలాసార్లు అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లారు.

జంతువుల గురించే కాదు ప్రపంచంలో ఉన్న వేరే సమస్యల్ని చూసినప్పుడు కూడా నాకు బాధ అనిపించేది. కొంతకాలానికి అమ్నెస్టి ఇంటర్నేషనల్‌, గ్రీన్‌పీస్‌ వంటి చాలా సంస్థల్లో చేరాను. ఆ సంస్థలు చేసే పనికి మద్దతు ఇవ్వడానికి నా శక్తి అంతా ధారపోసేవాణ్ణి. పేదవాళ్ల, ఆకలితో అలమటించేవాళ్ల, దిక్కులేనివాళ్ల హక్కుల కోసం నేను పోరాడేవాణ్ణి.

అయితే, నేను ఎంత ప్రయత్నించినా ఈ ప్రపంచాన్ని మార్చలేనని మెల్లమెల్లగా గుర్తించాను. ఆ సంస్థలు చిన్నచిన్న సమస్యల్ని పరిష్కరించినా పెద్ద సమస్యలు మాత్రం ఇంకా పెద్దవి అవుతున్నాయి. ఒక దుష్ట శక్తి ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుందని, ఎవ్వరూ దేని గురించీ పట్టించుకోవట్లేదని నాకు అనిపించింది. నేనేం చేయలేకపోయాను.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...

నేనేం చేయలేకపోతున్నందుకు చాలా బాధపడ్డాను. దాంతో దేవుని గురించి, బైబిలు గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. నేను అంతకుముందు యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకునేవాణ్ణి. వాళ్లు నా మీద దయ, శ్రద్ధ చూపించారు. అది నాకెంతో నచ్చింది. కాకపోతే నా జీవన విధానాన్ని మార్చుకోవడానికి నేను అప్పుడు సిద్ధంగా లేను. కానీ ఈసారి, పరిస్థితులు మారాయి.

నేను నా బైబిలు తీసి చదవడం మొదలుపెట్టాను. అది నా గాయాలకు మందు రాసినట్టుగా అనిపించింది. జంతువుల్ని దయగా చూడమని చెప్పే ఎన్నో లేఖనాలు బైబిల్లో కనిపించాయి. ఉదాహరణకు, సామెతలు 12:10 ఇలా చెప్తుంది: “నీతిమంతుడు తన పశువుల బాగోగులు చూసుకుంటాడు.” అంతేకాదు, ఈ ప్రపంచ సమస్యలకు దేవుడు కారణం కాదుగానీ, ఎక్కువ శాతం మంది ప్రజలు ఆయన మాట వినకపోవడం వల్లే ఇన్ని సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నాను. యెహోవా చూపించే ప్రేమ, ఓర్పు గురించి నేను నేర్చుకున్న విషయాలు నన్నెంతో ఆకట్టుకున్నాయి.​—కీర్తన 103:​8-​14.

ఆ సమయంలో, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం కోసం రిక్వెస్టు చేసుకునే కూపన్‌ కనిపించింది. నేను దాన్ని నింపి పంపించాను. కొన్ని రోజులకే ఒక యెహోవాసాక్షుల జంట మా ఇంటికి వచ్చి బైబిలు స్టడీ గురించి చెప్పారు, నేను దానికి ఒప్పుకున్నాను. రాజ్యమందిరంలో జరిగే క్రైస్తవ కూటాలకు కూడా వెళ్లడం మొదలుపెట్టాను. అలా బైబిలు సత్యం నా హృదయంలో నాటుకోవడం మొదలైంది.

బైబిలు సహాయంతో నేను చాలా మార్పులు చేసుకున్నాను. సిగరెట్లు, అతిగా మందు తాగడం మానుకున్నాను. కనబడే తీరును, మాట తీరును మార్చుకున్నాను. అధికారుల విషయంలో నాకున్న అభిప్రాయం మారింది. (రోమీయులు 13:1) ఒకప్పుడు నైతికంగా దిగజారిన జీవితాన్ని గడిపేవాణ్ణి, కానీ అది కూడా వదిలేశాను.

నేను చేరిన కొన్ని సంస్థల విషయంలో నా అభిప్రాయాన్ని మార్చుకోవడం మాత్రం చాలా కష్టమనిపించింది. ఒక్కసారిగా మార్చుకోలేకపోయాను. నేను ఆ సంస్థలకు రాజీనామా చేస్తే వాటికి ద్రోహం చేసినట్టు అవుతుందని మొదట్లో అనుకున్నాను. కానీ, దేవుని రాజ్యం మాత్రమే ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించగలదని గ్రహించాను. దేవుని రాజ్యానికి మద్దతివ్వడానికి, దాని గురించి ఇతరులకు చెప్పడానికి నా శక్తంతా ధారపోయాలని నిర్ణయించుకున్నాను.​—మత్తయి 6:​33.

నేనెలా ప్రయోజనం పొందానంటే ...

ఒకప్పుడు నేను ప్రజల్ని ‘వీళ్లు మంచివాళ్లు, వీళ్లు చెడ్డవాళ్లు’ అని ముద్ర వేసేసుకునేవాణ్ణి. చెడ్డవాళ్లు అని నేను అనుకున్న వాళ్లను చాలా ద్వేషించేవాణ్ణి. కానీ, బైబిలు సహాయంతో నేను ద్వేషాన్ని తీసేసుకొని, అందరి మీద క్రైస్తవ ప్రేమను చూపించడానికి కృషి చేస్తున్నాను. (మత్తయి 5:​44) ముఖ్యంగా, దేవుని రాజ్యం గురించిన మంచివార్త చెప్పడం ద్వారా ఆ ప్రేమను చూపిస్తున్నాను. ప్రకటనా పని వల్ల ప్రజలు శాంతి సంతోషాలతో, భవిష్యత్తు మీద ఆశతో జీవించడం గమనించాను. అది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది.

విషయాల్ని యెహోవా చేతికి వదిలేయడం వల్ల నేను మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాను. యెహోవా సృష్టికర్త కాబట్టి జంతువులు, మనుషులు బాధపడడానికి గానీ, ఈ అందమైన భూమి నాశనం అవ్వడానికి గానీ ఆయన అనుమతించడని నాకు నమ్మకం కుదిరింది. దానికి బదులుగా, ఆయన తన రాజ్యం ద్వారా ఇప్పటివరకు పాడైన దాన్నంతటిని త్వరలోనే సరిచేస్తాడని నమ్ముతున్నాను. (యెషయా 11:​1-9) నేను ఈ సత్యాలు తెలుసుకున్నందుకు, వాటిని ఇతరులు కూడా నమ్మేలా సహాయం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను ఇప్పుడు లోకాన్ని మార్చేయాలని అనుకోవట్లేదు.