మనం యేసుకు ప్రార్థన చేయవచ్చా?
యేసు ప్రార్థనలకు జవాబు ఇస్తాడా? అనే ప్రశ్న మీద వేర్వేరు చర్చీలకు వెళ్లే 800 యువకులను సర్వే చేశారు. 60 శాతం కన్నా ఎక్కువ మంది యేసు జవాబు ఇస్తాడు అని ఖచ్చితంగా నమ్ముతున్నామని చెప్పారు. అయితే ఒక అమ్మాయి మాత్రం యేసు పేరును కొట్టివేసి “దేవుడు” అని రాసింది.
మీకు ఏమి అనిపిస్తుంది? మనం ప్రార్థన యేసుకు చేయాలా లేదా దేవునికి చేయాలా? a ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి యేసు తన శిష్యులకు ఎలా ప్రార్థించమని నేర్పించాడో చూద్దాం.
మనం ఎవరికి ప్రార్థించాలని యేసు చెప్పాడు?
యేసు, మనం ఎవరికి ప్రార్థించాలో నేర్పించాడు, స్వయంగా తన ప్రార్థనల్లో చేసి చూపించాడు.
ఏమి నేర్పించాడు? “ప్రభువా . . . ప్రార్థనచేయ నేర్పుము” అని తన శిష్యుడు అడిగినప్పుడు “మీరు ప్రార్థన చేయునప్పుడు—తండ్రీ” అని ప్రార్థన చేయండి అని చెప్పాడు. (లూకా 11:1, 2) కొండ మీద ప్రసంగం అని చాలామందికి తెలిసిన ప్రసంగంలో ప్రార్థన చేయమని చెబుతూ యేసు ఇలా అన్నాడు: “నీ తండ్రికి ప్రార్థనచేయుము.” “మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును” అనే నమ్మకాన్ని కూడా ఇచ్చాడు. (మత్తయి 6:6, 8) చనిపోవడానికి కొన్ని గంటల ముందు యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును.” (యోహాను 16:23) కాబట్టి ఆయన తండ్రి, మన తండ్రి అయిన యెహోవా దేవునికి ప్రార్థించమని యేసు నేర్పించాడు.—యోహాను 20:17.
యేసు ఎలా ప్రార్థించాడు? వేరేవాళ్లకు నేర్పించినట్లే యేసు కూడా ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా . . . నిన్ను స్తుతించుచున్నాను.” (లూకా 10:21) మరోసారి “యేసు కన్నులు పైకెత్తి—తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను” అని ప్రార్థించాడు. (యోహాను 11:41) చనిపోయేటప్పుడు “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను” అని ప్రార్థించాడు. (లూకా 23:46) “ఆకాశమునకును భూమికిని ప్రభువు,” పరలోక తండ్రి అయిన యెహోవాకు యేసు చేసిన ప్రార్థనలు చూసి ఎవరికి ప్రార్థించాలో మనం నేర్చుకోవాలి. (మత్తయి 11:25; 26:41, 42; 1 యోహాను 2:5, 6) యేసు మొదటి శిష్యులు ఆయన చెప్పినట్లే ప్రార్థించారా?
యేసు శిష్యులు ఎవరికి ప్రార్థించారు?
యేసు పరలోకానికి వెళ్లిపోయిన కొన్ని వారాలకే, ఆయన శిష్యులను శత్రువులు హింసించడం, భయపెట్టడం మొదలు పెట్టారు. (అపొస్తలుల కార్యములు 4:18) ఆ సమయంలో వాళ్లు ప్రార్థన చేశారు. అయితే ఎవరికి ప్రార్థన చేశారు? సహాయం చేయమని ‘ఏకమనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టారు.’ “పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా” దేవునికి ప్రార్థించారు. (అపొస్తలుల కార్యములు 4:24, 30) దీన్ని బట్టి యేసు చెప్పినట్టే వాళ్లు ప్రార్థించారు. దేవునికి ప్రార్థించారు కానీ యేసుకు కాదు.
కొన్ని సంవత్సరాల తర్వాత పౌలు తను, తన స్నేహితులు ఎలా ప్రార్థించారో వివరించాడు. తోటి క్రైస్తవులకు రాస్తూ ఆయనిలా అన్నాడు: “మీ నిమిత్తము ప్రార్థనచేయుచు, మన ప్రభువగు యేసుక్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.” (కొలొస్సయులు 1:3) “మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు” చెప్పాలని కూడా పౌలు తన తోటి క్రైస్తవులకు రాశాడు. (ఎఫెసీయులు 5:20) ఈ మాటల్ని బట్టి ప్రతీ విషయంలో, “తండ్రియైన దేవునికి” యేసు పేరట ప్రార్థించమని పౌలు చెప్పాడని అర్థమౌతుంది.—కొలొస్సయులు 3:17.
ఆ క్రైస్తవుల్లానే, యేసు నేర్పించినట్లు దేవునికి ప్రార్థిస్తే మనం యేసును ప్రేమిస్తున్నాం అని చూపించవచ్చు. (యోహాను 14:15) మన పరలోక తండ్రికి మాత్రమే ప్రార్థిస్తే, “యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను . . . నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ పెట్టుదును” అని కీర్తన 116:1, 2లో ఉన్న మాటలు నిజమని మనకు అనిపిస్తుంది. b ▪ (w15-E 01/01)
a పరిశుద్ధ లేఖనాలు దేవుడు, యేసు ఒక్కరే అని చెప్పట్లేదు. ఈ విషయం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం 4వ అధ్యాయం చూడండి.
b దేవుడు మన ప్రార్థనలు వినాలంటే, ఆయన చెప్పిన వాటిని చేయడానికి నిజాయితీగా ప్రయత్నించాలి. ఈ విషయం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం 17వ అధ్యాయం చూడండి.