పిల్లలకు క్రమశిక్షణ ఎలా ఇవ్వాలి?
“ఏ కారు వచ్చినా మా అబ్బాయే వచ్చాడేమో అనుకున్నాను, జోర్డన్ కోసం చూసీచూసీ నా ఓపిక నశించింది. చెప్పిన సమయానికి కాకుండా ఆలస్యంగా రావడం ఇది మూడోసారి. ‘వాడు ఎక్కడున్నాడు? ఏదైనా సమస్యలో చిక్కుకున్నాడా? ఇక్కడ మేము ఆందోళన పడుతున్నామని వాడికి కనీసం గుర్తైనా ఉందా?’ జోర్డన్ వచ్చేసరికి, నా కోపం కట్టలు తెంచుకునే స్థితిలోవుంది.”—జార్జ్.
“మా అమ్మాయి అరిచిన అరుపుకు నాలో కంగారు మొదలైంది. తిరిగి చూసే సరికి, తల చేతులతో నొక్కి పట్టుకొని ఏడుస్తోంది. తన నాలుగేళ్ల తమ్ముడు ఆమెను కొట్టాడు.”—నీకోల్.
“‘నేను ఉంగరం దొంగతనం చేయలేదు. అది నాకు దొరికింది!’ అని అమాయకమైన కళ్లతో మా ఆరేళ్ల అమ్మాయి నటలీ అంది. దొంగతనం చేయలేదని తను అన్నిసార్లు చెబుతుంటే జాలేసి ఇద్దరం ఏడ్చేశాం. తను అబద్ధం చెబుతోందని మాకు తెలుసు.”—స్టీఫెన్.
మీకూ ఎప్పుడైనా అలాంటి పరిస్థితే ఎదురైందా? అప్పుడు, ‘ఇంతకీ నేనెలా క్రమశిక్షణ ఇవ్వాలి? అసలు క్రమశిక్షణ ఇవ్వాలా, వద్దా?’ అని మీకు అనిపించిందా? పిల్లలకు క్రమశిక్షణ ఇవ్వడం తప్పా?
క్రమశిక్షణ అంటే ఏమిటి?
బైబిల్లో, “క్రమశిక్షణ” అనే పదం శిక్షకు పర్యాయపదం కాదు. క్రమశిక్షణ ఇవ్వడమంటే ముఖ్యంగా ఉపదేశించడం, నేర్పించడం, సరిదిద్దడం అని అర్థం. అది ఎప్పటికీ అతిగా లేదా క్రూరంగా ఉండకూడదు.—సామెతలు 4:1, 2.
తల్లిదండ్రులు ఇచ్చే క్రమశిక్షణ తోటపని లాంటిది. తోటమాలి నేలను సిద్ధం చేస్తాడు; మొక్కకు ఎరువు వేస్తాడు, నీళ్లు పోస్తాడు; క్రిమికీటకాల నుండి, కలుపు మొక్కల నుండి దాన్ని కాపాడతాడు. మొక్క సరైన దిశలో పెరగాలంటే అప్పుడప్పుడూ వంకరగా ఉన్న కొమ్మలను కత్తిరించాలి కూడా. మొక్క సరిగ్గా ఎదగాలంటే, ఒకటికన్నా ఎక్కువ పద్ధతులను జాగ్రత్తగా ఉపయోగించాలని అతనికి తెలుసు. అలాగే, తల్లిదండ్రులు చాలా రకాలుగా పిల్లల బాగోగులు చూసుకుంటారు. అయితే ఒక్కోసారి క్రమశిక్షణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది వంకరగా ఉన్న కొమ్మలను కత్తిరించడం లాంటిది. లేత వయసులోనే పిల్లల్లో ఉన్న తప్పుడు వైఖరులను సరిదిద్దితే వాళ్లు సరైన మార్గంలో నడుస్తారు. అయితే, కొమ్మలను కత్తిరించే పనిని జాగ్రత్తగా చేయకపోతే మొక్కకు శాశ్వత హాని జరగవచ్చు. అలాగే తల్లిదండ్రులు కూడా ప్రేమతో, శ్రద్ధతో క్రమశిక్షణ ఇవ్వాలి.
యెహోవా దేవుడు a ఈ విషయంలో తల్లిదండ్రులకు చక్కని ఆదర్శం. తనకు లోబడే ప్రజలకు ఆయనిచ్చే క్రమశిక్షణ ఎంత సమర్థవంతంగా, చక్కగా ఉంటుందంటే వాళ్లు దాన్ని ‘ప్రేమిస్తారు.’ (సామెతలు 12:1) ‘ఉపదేశాన్ని [“క్రమశిక్షణను,” NW] విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటారు.’ (సామెతలు 4:13) దేవుడు ఇచ్చే క్రమశిక్షణలో ముఖ్యంగా మూడు అంశాలు ఉంటాయి. వాటిని పాటిస్తే, మీరిచ్చే క్రమశిక్షణను మీ పిల్లవాడు స్వీకరిస్తాడు. దేవుడు (1) ప్రేమతో, (2) అర్థంచేసుకొని, (3) ఎప్పుడూ ఒకేలా క్రమశిక్షణ ఇస్తాడు.
ప్రేమతో . . .
దేవుడిచ్చే క్రమశిక్షణలో ప్రేమ ఉంటుంది. నిజానికి క్రమశిక్షణ ఇచ్చేలా ఆయనను ప్రేరేపించేది కూడా ప్రేమే. సామెతలు 3:12) పైగా యెహోవా ‘దయ, జాలిగల దేవుడు, త్వరగా కోపపడడు.’ (నిర్గమకాండము 34:6, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) అందుకే యెహోవా ఎప్పుడూ మితిమీరి లేదా క్రూరంగా ప్రవర్తించడు. కఠినంగా మాట్లాడడం, ఎప్పుడూ తప్పుపట్టడం, ఎత్తిపొడవడం వంటివి “కత్తిపోటు” అంత బాధ కలిగిస్తాయి. యెహోవా ఎన్నడూ అలాంటి మాటలు ఉపయోగించడు.—సామెతలు 12:18.
“తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును” అని బైబిలు చెబుతుంది. (దేవుడు పరిపూర్ణుడు కాబట్టి తల్లిదండ్రులు ఆయనలా పూర్తిగా నిగ్రహం చూపించలేరనేది నిజమే. కొన్నిసార్లు పిల్లలు మీ ఓపికకు పరీక్ష పెట్టవచ్చు. ప్రశాంతంగా ఉండడం కష్టమయ్యే అలాంటి సందర్భాల్లో ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి: కోపంతో ఇచ్చే క్రమశిక్షణ సాధారణంగా క్రూరంగా, అతిగా ఉంటుంది; దానివల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. అంతేకాదు, కోపంతో-చిరాకుతో శిక్షిస్తే అది నిగ్రహం కోల్పోవడమే అవుతుంది తప్ప క్రమశిక్షణ అవ్వదు.
అదే మీరు ప్రేమతో, ఆత్మ నిగ్రహంతో క్రమశిక్షణ ఇస్తే ఎంతో లాభం ఉంటుంది. మనం మొదట్లో చూసిన జార్జ్, నీకోల్ ఆ పరిస్థితుల్లో ఏమి చేశారో పరిశీలించండి.
“జోర్డన్ వచ్చేసరికి మా ఆవిడ, నేను కోపంతో ఉడికిపోతున్నాం. కానీ తొందరపడకుండా, వాడు ఏమి చెబుతున్నాడో విన్నాం. అప్పటికే ఆలస్యమైంది కాబట్టి దాని గురించి రేపు మాట్లాడుకుందామని అన్నాం. అందరం కలిసి ప్రార్థన చేసి పడుకున్నాం. ఉదయంకల్లా మా కోపం తగ్గింది, రాత్రి జరిగిన దానిగురించి ప్రశాంతంగా మాట్లాడగలిగాం. మా అబ్బాయి కూడా మా బాధ అర్థం చేసుకున్నాడు. మేము పెట్టిన కట్టుబాట్లు పాటించడానికి ఇష్టం చూపించాడు, తన తప్పు ఒప్పుకున్నాడు. కోపంలో తొందరపడి ఏదోకటి అనడం వల్ల నష్టమే జరుగుతుందని మేము అర్థం చేసుకున్నాం, అది మంచిదైంది. ముందుగా మా అబ్బాయి ఏమి చెబుతున్నాడో విన్నప్పుడు, మంచి ఫలితాలు వచ్చాయి.”—జార్జ్.
“మా అబ్బాయి బుద్ధిలేకుండా వాళ్ల అక్కను కొట్టాడని చూసినప్పుడు నాకు పిచ్చి కోపం వచ్చింది. అయితే నేను సరిగ్గా ఆలోచించే స్థితిలో లేను కాబట్టి, వెంటనే ఏమీ అనకుండా మా అబ్బాయిని వాడి గదిలోకి వెళ్లమన్నాను. నా కోపం తగ్గాక, అలా కొట్టడం తప్పని స్థిరంగా చెప్పి, వాళ్ల అక్కకు ఎంత దెబ్బ తగిలిందో చూపించాను. ఈ పద్ధతి బాగా పనిచేసింది. వాడు వాళ్ల అక్కకు క్షమాపణ చెప్పి, ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.”—నీకోల్.
కొన్నిసార్లు శిక్షించాల్సి వచ్చినా, సరైన క్రమశిక్షణకు ప్రేరణ ఎల్లప్పుడూ ప్రేమే.
అర్థంచేసుకొని . . .
యెహోవా ఎల్లప్పుడూ “మితముగా” లేదా తగిన మోతాదులోనే క్రమశిక్షణ ఇస్తాడు. (యిర్మీయా 30:11; 46:28) బయటికి కనిపించని విషయాలతో సహా పరిస్థితులన్నిటినీ ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. తల్లిదండ్రులు కూడా అలాగే చేయవచ్చు. మొదట్లో చెప్పుకున్న స్టీఫెన్ ఇలా అంటున్నాడు: “నటలీ తాను ఉంగరం తీయలేదని పదేపదే ఎందుకు చెబుతుందో మాకు అర్థం కాలేదు, చాలా బాధనిపించింది. అయినా మేము తన వయసును, ఆలోచనా సామర్థ్యాన్ని లెక్కలోకి తీసుకున్నాం.”
నీకోల్ భర్త రాబర్ట్ కూడా పరిస్థితులన్నిటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. పిల్లవాడు ఏదైనా తప్పు చేసినప్పుడు, రాబర్ట్ ఇలా ఆలోచిస్తాడు: ‘ఇదే మొదటిసారా, లేక ఇది అలవాటుగా మారిందా? వాడు అలసిపోవడం వల్ల లేదా ఒంట్లో బాలేకపోవడం వల్ల ఇలా చేశాడా? బయటికి కనిపించని సమస్య ఇంకేదైనా ఉందా?’
అర్థం చేసుకునే తల్లిదండ్రులు, పిల్లలకు-పెద్దవాళ్లకు మధ్య తేడా ఉంటుందని గుర్తుంచుకుంటారు. ఈ విషయాన్ని ఒప్పుకుంటూ అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని.” (1 కొరింథీయులు 13:11) రాబర్ట్ ఇలా అంటున్నాడు: “చిన్నతనంలో నేను ఎలా ఉండేవాడినో గుర్తుంచుకోవడం, విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికీ అతిగా స్పందించకుండా ఉండడానికీ సహాయం చేస్తుంది.”
పిల్లలు అన్ని విషయాల్లో సరిగ్గా ఉంటారని ఆశించలేం, దీన్ని గుర్తించడం ప్రాముఖ్యం. అయితే తప్పుడు ఆలోచనలను, ప్రవర్తనను చూసీచూడనట్లు వదిలేయడం, ‘ఫర్లేదులే’ అనుకోవడం కూడా మంచిదికాదు. మీ పిల్లవాడి సామర్థ్యాలను, పరిమితులను, పరిస్థితులను అర్థంచేసుకుంటూ ఇచ్చే క్రమశిక్షణ సరిగ్గా ఉంటుంది.
ఎప్పుడూ ఒకేలా . . .
“యెహోవానైన నేను మార్పులేనివాడను” అని మలాకీ 3:6 చెబుతుంది. ఆ వాస్తవాన్ని నమ్మి దేవుని ప్రజలు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. మీరు ఇచ్చే క్రమశిక్షణ ఎప్పుడూ ఒకేలా ఉంటే, మీ పిల్లల్లో కూడా అలాంటి భావనే కలుగుతుంది. అలాకాకుండా మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఒకలా, కోపంలో ఉన్నప్పుడు ఇంకోలా క్రమశిక్షణ ఇస్తే మీ పిల్లవాడు అయోమయంలో పడిపోతాడు, వాడికి చిరాకొస్తుంది.
“మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను” అని యేసు చెప్పిన మాటను గుర్తుచేసుకోండి. పిల్లల్ని పెంచే విషయంలో ఆ మాటలు బాగా పనికొస్తాయి. (మత్తయి 5:37) శిక్షించే ఉద్దేశం లేకున్నా, తప్పుచేస్తే శిక్ష పడుతుందని మీ పిల్లవాడితో అనకండి. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఉంటుందని మీరు చెప్పివుంటే, అలాగే చేయండి.
క్రమశిక్షణ ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే, తల్లిదండ్రులు ఇద్దరూ చక్కగా మాట్లాడుకోవాలి. రాబర్ట్ ఇలా అంటున్నాడు: “నాకు తెలియకుండా, మా పిల్లలు వాళ్లమ్మ వద్దన్న పనికి నన్ను ఒప్పిస్తే, ఆ తర్వాత విషయం తెలిశాక నేను నా నిర్ణయం మార్చుకొని తను చెప్పినట్లే చేయమని అంటాను.” ఏదైనా విషయంలో తల్లిదండ్రులిద్దరికీ వేర్వేరు అభిప్రాయాలుంటే, దాని గురించి ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావడం మంచిది.
క్రమశిక్షణ చాలా అవసరం
యెహోవాలాగే మీరు కూడా ప్రేమతో, అర్థం చేసుకొని, ఎప్పుడూ ఒకేలా క్రమశిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తే మీ పిల్లలు ఎంతో ప్రయోజనం పొందుతారు. ప్రేమతో మీరిచ్చే నిర్దేశం మీ పిల్లల్ని పరిణతిగల, బాధ్యతగల, సరిగ్గా ఆలోచించగల వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. బైబిలు చెప్పినట్లు, “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.”—సామెతలు 22:6. ▪ (w14-E 07/01)
a బైబిల్లో దేవుని పేరు యెహోవా అని ఉంది.