కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మా పాఠకుల ప్రశ్న

దేవుణ్ణి ఎవరు సృష్టించారు?

దేవుణ్ణి ఎవరు సృష్టించారు?

ఒక తండ్రి తన ఏడేళ్ల కొడుకుతో మాట్లాడుతున్నట్లు ఊహించుకోండి. తండ్రి ఇలా అన్నాడు: “చాలాకాలం ముందు దేవుడు భూమినీ, దానిమీద ఉన్న వాటన్నిటినీ, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను చేశాడు.” పిల్లవాడు కాసేపు ఆలోచించి ఇలా అడుగుతాడు, “నాన్న, మరి దేవుణ్ణి ఎవరు చేశారు?”

“దేవుణ్ణి ఎవ్వరూ చేయలేదు, ఆయన ఎప్పుడూ ఉంటాడు” అని తండ్రి అన్నాడు. పిల్లవాడు ఆ జవాబుతో సరిపెట్టుకుంటాడు. అయితే, అతను ఎదిగేకొద్దీ ఆ ప్రశ్న అతనికి అంతకంతకూ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక వ్యక్తికి ఆరంభం లేకుండా ఎలా ఉంటుందో అర్థంచేసుకోవడం అతనికి కష్టమనిపిస్తుంది. అంతెందుకు, విశ్వానికి కూడా ఆరంభం ఉంది. మరి ‘దేవుడు ఎలా వచ్చాడు?’ అని అతను ఆలోచిస్తాడు.

ఆ ప్రశ్న గురించి బైబిలు ఏమి చెబుతుంది? అదిచ్చే జవాబు చాలావరకు, పై ఉదాహరణలో తండ్రి పిల్లవాడికి ఇచ్చిన సమాధానంలాగే ఉంటుంది. మోషే ఇలా రాశాడు: ‘యెహోవా, పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు.’ (కీర్తన 90:1, 2) యెషయా ప్రవక్త ఇలా అన్నాడు: “నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు”! (యెషయా 40:28) దేవుడు “యుగములకు పూర్వము” నుండి ఉన్నాడని యూదా రాసిన పత్రిక కూడా చూపిస్తుంది.—యూదా 24, 25.

అపొస్తలుడైన పౌలు వర్ణించినట్లు, దేవుడు “సకల యుగములలో రాజు” అని ఆ లేఖనాలు చెబుతున్నాయి. (1 తిమోతి 1:17) అంటే, మనం ఎంతకాలం వెనక్కి వెళ్లినా, అప్పుడు దేవుడు ఉన్నాడని అర్థం. అలాగే మనం ఎంతకాలం ముందుకు వెళ్లినా, అప్పుడు కూడా దేవుడు ఉంటాడు. (ప్రకటన 1:8) సర్వశక్తుని ప్రధాన లక్షణాల్లో ఒకటి, అన్ని కాలాల్లో ఉండడం.

దాన్ని అర్థంచేసుకోవడం మనకెందుకు కష్టంగా ఉంటుంది? మన ఆయుష్షు చాలా తక్కువ కాబట్టి సమయం విషయంలో దేవుని ఆలోచనకు మన ఆలోచనకు చాలా తేడా ఉంటుంది. దేవుడు ఎప్పటికీ ఉంటాడు, అందుకే ఆయనకు వెయ్యి సంవత్సరాలు ఒక రోజులా అనిపిస్తుంది. (2 పేతురు 3:8) దీన్ని గమనించండి: ఎగరడం వచ్చాక, మిడత దాదాపు 50 రోజులు మాత్రమే బ్రతుకుతుంది. అలాంటిది, 70 లేదా 80 ఏళ్లు ఉండే మన ఆయుష్షును అది అర్థం చేసుకోగలుగుతుందా? అస్సలు అర్థం చేసుకోలేదు. మన గొప్ప సృష్టికర్తతో పోలిస్తే మనమూ మిడతల్లాగే ఉన్నామని బైబిలు చెబుతుంది. మన ఆలోచనాతీరు విషయంలో కూడా అంత తేడా ఉంటుంది. (యెషయా 40:22; 55:8, 9) కాబట్టి యెహోవా గురించిన ఎన్నో విషయాలు మనుషుల అవగాహనకు అంతుపట్టవంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు.

దేవుడు అన్ని కాలాల్లో ఉన్నాడనే విషయం మనకు అంతుపట్టకపోయినా, అది ఎందుకు నిజమో మనం అర్థంచేసుకోవచ్చు. ఎందుకంటే, ఒకవేళ దేవుణ్ణి ఇంకెవరో చేసివుంటే, ఆ వ్యక్తే సృష్టికర్త అవుతాడు. కానీ యెహోవాయే ‘సమస్తాన్నీ సృష్టించాడు’ అని బైబిలు చెబుతుంది. (ప్రకటన 4:10, 11) ఒకప్పుడు విశ్వం అనేదే లేదని మనకు తెలుసు. (ఆదికాండము 1:1, 2) మరి అది ఎలా వచ్చింది? దాన్ని సృష్టించిన వ్యక్తి అంతకన్నా ముందే ఉన్నాడు కాబట్టి. అంతేకాదు, ఇతర తెలివైన ప్రాణుల కన్నా అంటే దేవుని ఏకైక కుమారుని కన్నా, దేవదూతల కన్నా ముందునుండే సృష్టికర్త ఉన్నాడు. (యోబు 38:4, 7; కొలొస్సయులు 1:15) అంటే మొదట్లో ఆయనొక్కడే ఉండేవాడని స్పష్టమౌతుంది. ఆయనను ఎవరూ సృష్టించే అవకాశం లేదు, ఎందుకంటే ఆయనకన్నా ముందు ఎవరూ లేరు.

మనం ఉన్నామన్నా, ఈ విశ్వం ఉందన్నా దానర్థం దేవుడు అన్నికాలాల్లో ఉన్నాడని. విశ్వాన్ని సృష్టించి, దాని కదలికను నియంత్రించే నియమాలను ఏర్పాటుచేసిన దేవుడు అన్ని కాలాల్లో ఉండివుండాలి. అప్పుడే, ఆయన అన్నిటికీ జీవాన్ని ఇవ్వగలడు.—యోబు 33:4. ▪ (w14-E 08/01)