ముఖపత్ర అంశం | పొగతాగడం తప్పా?
పొగతాగడం గురించి దేవుడు ఏమంటున్నాడు?
ముందటి ఆర్టికల్‌లో చెప్పుకున్న నావోకో, పొగతాగే అలవాటును తానెలా మానుకుందో చెప్పింది: “దేవుని లక్షణాల, ఉద్దేశాల గురించిన సత్యం నేర్చుకున్నాక నాలో ఎంతో మార్పు వచ్చింది.” ఆమె నేర్చుకున్న విషయాలు బైబిల్లో ఉన్నాయి. పొగాకు ప్రస్తావన బైబిల్లో ఎక్కడా లేదు. అయినా, పొగతాగే అలవాటు విషయంలో దేవుని ఆలోచన ఏమిటో అందులో ఉంది. a అది తెలుసుకున్న చాలామంది, పొగతాగే అలవాటుకు దూరంగా ఉండడానికి లేదా దాన్ని మానుకోవడానికి కావలసిన ప్రేరణను పొందారు. (2 తిమోతి 3:16, 17) పొగతాగడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. వాటిలో అందరికీ తెలిసిన మూడు నష్టాల గురించీ, వాటి విషయంలో బైబిలు ఏమి చెబుతుందనే దాని గురించీ ఇప్పుడు పరిశీలిద్దాం.
పొగతాగేవాళ్లు ఆ అలవాటుకు బానిసలౌతారు
పొగాకులో, అత్యంత వ్యసనకర మత్తుపదార్థాల్లో ఒకటైన నికొటీన్ ఉంటుంది. అది శరీరాన్ని, మెదడును ఉత్తేజపర్చగలదు లేదా మందగింపజేయగలదు. పొగ తాగుతున్నప్పుడు, నికొటీన్ వేగంగా వెంటవెంటనే మెదడుకు చేరుతూ ఉంటుంది. ఒక దమ్ము పొగ పీల్చినప్పుడు ఒక డోసు నికొటీన్ మన శరీరంలోకి వెళ్తుంది. రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్లు తాగేవాళ్లు, ఒక్క రోజులో దాదాపు 200 డోసుల నికొటీన్ పీలుస్తారు. వేరే ఏ మత్తుపదార్థాలు వాడేవాళ్లు తీసుకునే డోసు కన్నా అది ఎక్కువ. అంత తరచుగా తీసుకుంటారు కాబట్టే నికొటీన్‌కు ఎక్కువగా బానిసలౌతుంటారు. పొగతాగే అలవాటున్న వాళ్లు, కావాల్సినంత నికొటీన్ పీల్చుకోకపోతే వాళ్లకు అదోలా ఉంటుంది.
“దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురు.”—రోమీయులు 6:16
మీరు పొగాకు వ్యసనానికి బానిసగా ఉన్నారా? అలాగైతే, దేవునికి లోబడడం మీకు నిజంగా సాధ్యమౌతుందా?
ఈ విషయంలో సరైన దృక్పథం గురించి బైబిలు ఇలా చెబుతుంది: ‘లోబడడానికి దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో, దేనికి మీరు లోబడతారో దానికే మీరు దాసులౌతారని మీరెరుగరా?’ (రోమీయులు 6:16) పొగాకు పట్ల ఉన్న తీవ్రమైన వాంఛ ఒక వ్యక్తి ఆలోచనా విధానాన్ని, పనులను నియంత్రిస్తుంటే త్వరలోనే అతను ఆ దిగజారిన అలవాటుకు బానిస అవుతాడు. అయితే మనం, మన శరీరానికి హానిచేసే అలవాట్లకే కాక మన ఆత్మకు అంటే మన ఆలోచనా విధానానికి హానిచేసే అలవాట్లకు కూడా దూరంగా ఉండాలని యెహోవా దేవుడు కోరుకుంటున్నాడు. (కీర్తన 83:18; 2 కొరింథీయులు 7:1) ఒక వ్యక్తిలో యెహోవాపట్ల కృతజ్ఞత-గౌరవం పెరిగేకొద్దీ, తనకున్న దానిలో శ్రేష్ఠమైనది పొందడానికి యెహోవా అర్హుడని అతను అర్థంచేసుకుంటాడు. అంతేకాదు, ప్రమాదకరమైన అలవాటుకు బానిసగా ఉంటూ దేవునికి శ్రేష్ఠమైనది ఇవ్వడం అసాధ్యమని అతను గుర్తిస్తాడు. ఆ అవగాహనే, హానికరమైన కోరికలకు దూరంగా ఉండాలనే ప్రేరణను అతనిలో కలిగిస్తుంది.
జర్మనీలో నివసిస్తున్న ఓలాఫ్, 12 ఏళ్లకే సిగరెట్లకు అలవాటుపడ్డాడు. 16 ఏళ్లపాటు ఆ అలవాటుకు బానిసగావున్న అతను, చివరకు దాన్నుండి బయటపడ్డాడు. అతను ఇలా అంటున్నాడు: “నేను తాగిన మొదటి సిగరెట్టు, ఎలాంటి ప్రమాదమూ లేని చిన్న మంచు గడ్డలా కనిపించింది. కానీ ఏళ్లు గడిచేకొద్దీ అదొక పెద్ద హిమానీపాతంలా (avalanche) మారింది. ఒకసారి నా దగ్గరున్న సిగరెట్లన్నీ అయిపోవడంతో ఆ చిరాకులో ఆష్‌ట్రేలో ఉన్న సిగరెట్ ముక్కలన్నీ పోగేసి, వాటిలోవున్న మందును ఒక న్యూస్ పేపర్ ముక్కలో చుట్టి సిగరెట్ తయారు చేసుకున్నాను. తర్వాత దాని గురించి ఆలోచిస్తే, అదెంత సిగ్గుపడే పనో అర్థమైంది.” పొగతాగడమనే నీచమైన అలవాటు నుండి అతనెలా బయటపడగలిగాడు? అతను ఇలా చెప్పాడు: “యెహోవాను సంతోషపెట్టాలనే కోరికే నన్ను మార్చింది. మానవులపట్ల
యెహోవాకున్న ప్రేమ, భవిష్యత్తులో ఆయన చేయబోయే మంచి విషయాలు ఈ వ్యసనాన్ని శాశ్వతంగా వదిలించుకోవడానికి కావాల్సిన బలాన్ని నాకిచ్చాయి.”పొగతాగడం వల్ల శరీరం పాడౌతుంది
“సిగరెట్లు తాగడం వల్ల . . . శరీరంలోని ప్రతీ అవయవం పాడౌతుందని, త్వరగా జబ్బుపడి చనిపోతారని శాస్త్రవేత్తలు నిరూపించారు” అని ద టొబాకో అట్లస్ అనే పుస్తకం చెబుతుంది. పొగతాగడం వల్ల క్యాన్సర్, హృద్రోగం లాంటి అసంక్రమిత వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తాయని చాలామందికి తెలుసు. అయితే, క్షయ (టి.బి.) లాంటి సంక్రమిత వ్యాధులున్న వాళ్లు చనిపోవడానికి కూడా ముఖ్య కారణం పొగతాగే అలవాటేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది.
“నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.”—మత్తయి 22:37
దేవుడిచ్చిన శరీరాన్ని మీరు నీచమైన అలవాటుతో మలినం చేస్తుంటే, దేవుని మీద మీకు ప్రేమ, గౌరవం ఉన్నట్లేనా?
మన జీవం విషయంలో, శరీరం విషయంలో, సామర్థ్యాల విషయంలో సరైన వైఖరి పెంపొందించుకోవడానికి యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా సహాయం చేస్తున్నాడు. దాని గురించి ఆయన కుమారుడు యేసు ఇలా అన్నాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును [యెహోవాను] ప్రేమింపవలెను” (మత్తయి 22:37) మన జీవాన్ని, శరీరాన్ని సరైన విధంగా ఉపయోగించాలని, వాటిపట్ల గౌరవం చూపించాలని యెహోవా ఆశిస్తున్నాడు అనేది దాన్నిబట్టి స్పష్టమౌతుంది. యెహోవా గురించి, ఆయన వాగ్దానాల గురించి మనం నేర్చుకునేకొద్దీ ఆయన ఇప్పటివరకూ మనకోసం చేసినవాటిని ప్రేమిస్తాం, విలువైనవిగా ఎంచుతాం. అది, మన శరీరాన్ని మలినం చేసే ప్రతీదాని నుండి దూరంగా ఉండాలనే ప్రేరణ మనలో కలిగిస్తుంది.
భారతదేశానికి చెందిన జయ్వంత్ అనే డాక్టర్ 38 ఏళ్లపాటు పొగ తాగాడు. ఆయనిలా అంటున్నాడు: “పొగతాగడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి నేను మెడికల్ జర్నల్స్‌లో చదివాను. ఆ అలవాటు మంచిదికాదని నాకు తెలుసు, దాన్ని మానుకోమని నా దగ్గరకు వచ్చిన రోగులకు సలహా ఇచ్చేవాణ్ణి కూడా. దాన్ని మానుకోవడానికి ఐదారుసార్లు ప్రయత్నించాను, అయినా మానుకోలేకపోయాను.” ఇంతకీ ఆయనెలా మానుకోగలిగాడు? తనే స్వయంగా ఇలా చెబుతున్నాడు: “ఆ అలవాటును మానుకోవడానికి బైబిలు అధ్యయనం నాకు సహాయం చేసింది. యెహోవాను సంతోషపెట్టాలనే కోరికతో నేను వెంటనే దాన్ని మానుకున్నాను.”
పొగతాగడం వల్ల ఇతరులకు హాని జరుగుతుంది
పీల్చి వదిలిన పొగ, పొగాకును కాల్చడం వల్ల వచ్చిన పొగ ప్రమాదకరమైనవి. అలాంటి పొగ పీల్చడం వల్ల క్యాన్సర్, ఇతర రోగాలు వస్తాయి. దానివల్ల ప్రతీ ఏడాది, పొగతాగే అలవాటులేని 6,00,000 మంది చనిపోతున్నారు; వాళ్లలో ఎక్కువమంది ఆడవాళ్లు, పిల్లలే. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఒక నివేదిక ఇలా
హెచ్చరిస్తుంది: “పొగతాగే వాళ్లు వదిలే పొగను ఏ కాస్త పీల్చినా అది ప్రమాదకరమే.”“నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.”—మత్తయి 22:39
మీరు పొగతాగుతూ పొరుగువాళ్లకు, కుటుంబ సభ్యులకు హానిచేస్తుంటే వాళ్లమీద మీకు నిజంగా ప్రేమ ఉన్నట్లేనా?
దేవుణ్ణి ప్రేమించాలనే ఆజ్ఞ తర్వాత అంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ, తోటివాళ్లను ప్రేమించాలనేదే అని యేసు చెప్పాడు. వాళ్లలో మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, మన చుట్టూ ఉండేవాళ్లు ఉన్నారు. యేసు ఇలా చెప్పాడు: “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.” (మత్తయి 22:39) మనకు దగ్గరగా ఉన్నవాళ్లను బాధపెట్టే అలవాటును మనం మానుకోకపోతే, పొరుగువాళ్ల మీద మనకు ప్రేమ లేనట్లే. మన ప్రేమ నిజమైనదైతే, బైబిలు చెప్పే ఈ మాటను పాటిస్తాం: “ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.”—1 కొరింథీయులు 10:24.
అర్మేనియాలో ఉంటున్న ఆర్మన్ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “నేను పొగతాగడం వల్ల తమకు కూడా హాని జరుగుతుంది కాబట్టి ఆ అలవాటును మానుకొమ్మని నా కుటుంబ సభ్యులు నన్ను ప్రాధేయపడేవాళ్లు. అయినా, నా అలవాటు వాళ్లమీద చెడు ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని నేను ఒప్పుకోలేకపోయాను.” మరి ఆయన ఆలోచనా విధానాన్ని ఏది మార్చింది? ఆయనిలా చెప్పాడు: “పొగతాగడం మానుకొని, ఆ అలవాటు నాకే కాకుండా నా చుట్టూవున్న వాళ్లకు కూడా హానిచేస్తుందని ఒప్పుకోవడానికి బైబిలు నుండి నేర్చుకున్న విషయాలు, యెహోవాపట్ల ప్రేమ నాకు సహాయం చేశాయి.”
మంచి కోసం పొగను ఆర్పేస్తాడు!
తమకు, ఇతరులకు హాని కలిగించిన నీచమైన అలవాటును మానుకోవడానికి ఓలాఫ్, జయ్వంత్, ఆర్మన్‌లకు బైబిలు నుండి నేర్చుకున్న విషయాలు సహాయం చేశాయి. కేవలం పొగతాగడం హానికరమని తెలుసుకున్నందువల్ల కాదుగానీ యెహోవాను ప్రేమిస్తూ, ఆయనను సంతోషపెట్టాలని కోరుకున్నారు కాబట్టే వాళ్లు ఆ అలవాటునుండి బయటపడగలిగారు. అందుకు ప్రేమ ఎంత ప్రాముఖ్యమో 1 యోహాను 5:3 నొక్కిచెబుతుంది. అక్కడిలా ఉంది: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.” బైబిలు సూత్రాలను పాటించడం అన్నిసార్లూ తేలిక కాదనేది నిజమే. అయినా, ఒక వ్యక్తికి దేవునిమీద ప్రగాఢమైన ప్రేమ ఉంటే, లోబడడం అంత కష్టమనిపించదు.
యెహోవా దేవుడు ఒక ప్రపంచవ్యాప్త విద్యా కార్యక్రమం ద్వారా, పొగాకు వ్యసనం నుండి బయటపడడానికి, దానికి దూరంగా ఉండడానికి లక్షలమందికి సహాయం చేస్తున్నాడు. (1 తిమోతి 2:3, 4) దురాశతో కోట్లమందిని పొగాకుకు బానిసల్ని చేస్తున్న వాణిజ్య వ్యవస్థను యెహోవా త్వరలోనే తన రాజ్యం ద్వారా అంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు పరిపాలించే పరలోక ప్రభుత్వం ద్వారా సమూలంగా నాశనం చేస్తాడు. అందరి మంచి కోసం పొగను పూర్తిగా ఆర్పేస్తాడు; మానవుల శరీరాల్లో, మనసుల్లో ఉన్న అన్ని లోపాలనూ తీసేసి మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు.—యెషయా 33:24; ప్రకటన 19:11, 15.
మీరు పొగతాగే అలవాటుతో పోరాడుతున్నారా? అయితే, పట్టువిడవకండి. యెహోవాను ప్రేమించడం నేర్చుకుంటూ, పొగతాగే అలవాటు విషయంలో ఆయనకున్న ఆలోచనను అలవర్చుకుంటే మీరు తప్పకుండా విజయం సాధించవచ్చు. యెహోవాసాక్షులు ఒక్కొక్కరిని కలిసి ప్రయోజనకరమైన బైబిలు సూత్రాలు నేర్పిస్తారు, వాటిని పాటించడానికి సహాయం చేస్తారు. మీకు కూడా అలా సహాయం చేయడానికి వాళ్లు సంతోషిస్తారు. పొగాకు వ్యసనం నుండి బయటపడడానికి మీకు యెహోవా సహాయం అవసరమా? అయితే, మీకు కావాల్సిన బలాన్ని, శక్తిని ఆయన తప్పకుండా ఇస్తాడనే నమ్మకంతో ఉండండి.—ఫిలిప్పీయులు 4:13. (w14-E 06/01)
a ఇక్కడ పొగతాగడం అంటే సిగరెట్లు, బీడీలు, చుట్టలు, గొట్టాలు, నికొటీన్ ఉండే ఎలక్ట్రానిక్ సిగరెట్లు, మరితరమైన వాటిని ఉపయోగించి పొగ పీల్చడమని అర్థం. ఇందులో చర్చించే సూత్రాలు పొగాకు నమలడం, ముక్కుపొడి పీల్చడం వంటివాటికి కూడా వర్తిస్తాయి.