కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లలకు నేర్పించండి

పేతురు, అననీయ అబద్ధమాడారు వాళ్ల నుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు?

పేతురు, అననీయ అబద్ధమాడారు వాళ్ల నుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు?

అబద్ధమాడడం అంటే ఫలానా విషయం నిజం కాదని తెలిసినా దాన్ని చెప్పడం. మీరెప్పుడైనా అబద్ధమాడారా? a దేవుణ్ణి ప్రేమించిన కొంతమంది పెద్దవాళ్లు కూడా అబద్ధాలాడారు. అలాంటివాళ్లలో ఒకరి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆయనే పేతురు, యేసు 12మంది అపొస్తలుల్లో ఆయన ఒకడు. పేతురు ఎందుకు అబద్ధాలు చెప్పాడో ఈ కథ చదివి తెలుసుకోండి.

యేసును బంధించి, ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లారు. అప్పటికే మధ్యరాత్రి దాటిపోయింది. పేతురు, ఎవరూ గుర్తుపట్టకుండ ఆ ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్లాడు. కానీ, ప్రధాన యాజకుని ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి చలిమంట వెలుగులో పేతురును గుర్తుపట్టి, ‘నువ్వూ యేసుతో కూడ ఉండేవాడివి కదా?’ అని అడిగింది. అప్పుడు పేతురు భయపడి, “లేదు” అన్నాడు.

బైబిల్లో ఇలా ఉంది: ‘మరొక చిన్నది ఆయనను చూసి—వీడు నజరేయుడైన యేసుతో కూడ ఉండేవాడని చెప్పెను.’ మళ్లీ పేతురు, “లేదు” అన్నాడు. అక్కడున్న ఇంకొంతమంది ఆయన దగ్గరకు వచ్చి, ‘నిజమే, నువ్వూ వాళ్లలో ఒకడివి’ అన్నారు.

పేతురు చాలా భయపడిపోయాడు. అందుకే, మూడోసారి కూడా అబద్ధం చెప్పాడు, ‘ఆ మనుష్యుని నేను ఎరుగను!’ అన్నాడు. సరిగ్గా అప్పుడే కోడి కూసింది, యేసు పేతురు వైపు చూశాడు. దాంతో, ‘కోడి కూయక ముందు, నీవు నన్ను ఎరుగనని మూడుసార్లు చెప్తావు’ అని కొన్ని గంటల క్రితమే యేసు తనతో అన్న మాటలు పేతురుకు గుర్తుకొచ్చాయి. ఆయన బాధతో కుమిలి కుమిలి ఏడ్చాడు.

మీకెప్పుడైనా అలా జరిగే అవకాశముందా?— మీరు స్కూల్లో ఉన్నప్పుడు, మీ తోటి పిల్లలు యెహోవాసాక్షుల గురించి మాట్లాడుతుండవచ్చు. ఒకరు, “యెహోవాసాక్షులు పరిణామ సిద్ధాంతాన్ని నమ్మరు” అనవచ్చు. మరొకరు “వాళ్లు పండుగలు, పుట్టినరోజులు కూడా చేసుకోరు” అనవచ్చు. వెంటనే ఇంకొకరు “అసలు వాళ్లు క్రైస్తవులే కాదు, కేవలం ఒక తెగ మాత్రమే” అనవచ్చు. ఇంతలో ఎవరైనా మీ వైపు చూసి “నువ్వూ యెహోవాసాక్షివే కదా?” అని అడిగితే, మీరేమి చెప్తారు?

అలాంటి సమయాల్లో సరైన జవాబు చెప్పాలంటే, మీరు ముందే సిద్ధపడి ఉండాలి. పేతురు అలా చేయలేదు. అందుకే ఒత్తిడి వచ్చినప్పుడు అబద్ధం చెప్పాడు. కానీ ఆ తర్వాత చాలా బాధపడి, క్షమించమని దేవుణ్ణి అడిగాడు.

యేసు తొలి శిష్యుల్లో ఒకడైన అననీయ కూడా అబద్ధమాడాడు. కానీ దేవుడు ఆయనను గానీ ఆయన భార్య సప్పీరాను గానీ క్షమించలేదు. ఎందుకంటే, తన భర్త చెప్పినట్లే ఆమె కూడా అబద్ధమాడింది. దేవుడు అననీయ, సప్పీరాలను ఎందుకు క్షమించలేదో ఇప్పుడు చూద్దాం.

యేసు తన అపొస్తలులను విడిచి పరలోకంలోవున్న తన తండ్రి దగ్గరకు వెళ్లిపోయిన పది రోజులకు, యెరూషలేములో దాదాపు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. అందులో, పెంతెకొస్తు పండుగ జరుపుకోవడానికి దూర దేశాలనుండి అక్కడికి వచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. కొత్తగా క్రీస్తు శిష్యులైనవాళ్లు, ఇంకొన్ని రోజులు అక్కడే ఉండి తమ నమ్మకాల గురించి ఎక్కువ నేర్చుకోవాలనుకున్నారు. ఆ సమయంలో యేసు శిష్యులు కొందరు, తమ సొంత డబ్బుతో వాళ్లను చూసుకున్నారు.

అననీయ, సప్పీరాలు తమ పొలం అమ్మి, ఆ డబ్బుతో కొత్తగా బాప్తిస్మం తీసుకున్నవాళ్లకు సహాయం చేయాలనుకున్నారు. అననీయ ఆ డబ్బును అపొస్తలుల దగ్గరకు తెచ్చి, పొలం అమ్మితే అంత డబ్బే వచ్చిందన్నాడు. కానీ అది అబద్ధం! ఆయన తన కోసం కొంత డబ్బు దాచుకున్నాడు. దేవుడు ఇదంతా పేతురుకు తెలిసేలా చేశాడు. కాబట్టి పేతురు అననీయతో ఇలా అన్నాడు: ‘నువ్వు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు.’ అప్పుడు అననీయ అక్కడికక్కడే చనిపోయాడు! మూడు గంటల తర్వాత, ఆయన భార్య అక్కడకు వచ్చింది. తన భర్తకు ఏమి జరిగిందో తెలియక తను కూడా అబద్ధం చెప్పింది, దాంతో అక్కడికక్కడే చనిపోయింది.

నిజాలు మాట్లాడడం ఎంత ప్రాముఖ్యమో ఈ కథలు మనకు చూపిస్తున్నాయి! అవును మనమందరం ఆ పాఠం నేర్చుకోవాలి! ఎంతైనా అందరం తప్పులు చేస్తుంటాం, ముఖ్యంగా చిన్నతనంలో. యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, పేతురును క్షమించినట్లే మిమ్మల్ని కూడా క్షమిస్తాడని తెలుసుకోవడం సంతోషంగా లేదా?— కానీ గుర్తుంచుకోండి, మనం నిజమే మాట్లాడాలి. మనం ఎప్పుడైనా అబద్ధం చెప్పడమనే పెద్ద తప్పు చేస్తే, మర్చిపోకుండా యెహోవాను క్షమాపణ అడగాలి. మరోమాటలో చెప్పాలంటే ఆయనను దీనంగా వేడుకోవాలి. పేతురు అలా వేడుకుని ఉంటాడు, అందుకే యెహోవా ఆయనను క్షమించాడు. మనం కూడా అబద్ధాలాడకుండా నిజమే చెప్పడానికి గట్టిగా ప్రయత్నిస్తే, దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు! ▪ (w13-E 03/01)

a మీ పిల్లవాడితో కలిసి దీన్ని చదువుతుంటే, అడ్డగీత (—) ఉన్నచోట కాసేపు ఆగి, తన అభిప్రాయం చెప్పేలా వాణ్ణి ప్రోత్సహించండి.