కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అబ్రాహాము వినయం గల వ్యక్తి

అబ్రాహాము వినయం గల వ్యక్తి

అబ్రాహాము వినయం గల వ్యక్తి

బయట ఎండ మండిపోతోంది. అబ్రాహాము తన గుడారంలో సేదదీరుతున్నాడు. అల్లంత దూరంలో ముగ్గురు వ్యక్తులను ఆయన చూశాడు. a అబ్రాహాము ఏమాత్రం సంకోచించకుండా పరుగెత్తుకెళ్లి వాళ్లను కలిశాడు. తన ఆతిథ్యాన్ని స్వీకరించమని, కాస్త విశ్రాంతి తీసుకోమని వేడుకున్నాడు. వాళ్లతో ‘కొంచెం ఆహారమే’ తెస్తానని చెప్పి వెన్న, పాలు, మంచి లేత దూడ, అప్పుడే చేసిన రొట్టెలతో గొప్ప విందునే ఏర్పాటుచేశాడు. అలా, అబ్రాహాము గొప్ప ఆతిథ్యాన్ని ఇవ్వడమేకాదు నిజమైన వినయం కూడా చూపించాడు.—ఆదికాండము 18:1-8.

వినయం అంటే ఏమిటి? గర్వం, అహంకారం లేకపోవడమే వినయం. వినయంగల వ్యక్తి ప్రతి ఒక్కరూ ఏదో విధంగా తనకన్నా గొప్పవాళ్లని గుర్తిస్తాడు. (ఫిలిప్పీయులు 2:3) ఎదుటివాళ్లు ఇచ్చే సలహాలను వింటాడు, వాళ్ల కోసం తక్కువ స్థాయి పనులు చేయడానికి కూడా ఇష్టపడతాడు.

అబ్రాహాము వినయాన్ని ఎలా చూపించాడు? అబ్రాహాము సంతోషంగా ఇతరులకు సేవలు చేశాడు. పైన గమనించినట్లు, అబ్రాహాము ఆ ముగ్గురు వ్యక్తులను చూసినప్పుడు, వాళ్లకు కావాల్సినవి సమకూర్చడానికి వెంటనే ఏర్పాట్లు చేశాడు. ఆయన భార్య శారా తక్షణమే వంట మొదలుపెట్టింది. అయితే ఎక్కువ పని ఎవరు చేశారో గమనించండి. అబ్రాహామే వాళ్లను కలవడానికి పరుగెత్తుకు వెళ్లాడు, ఆయనే వాళ్లను భోజనానికి ఆహ్వానించాడు, ఆయనే పరుగెత్తుకెళ్లి మందలోంచి మంచి దూడను చూసి తెచ్చాడు, ఆయనే వండినవన్నీ తీసుకొచ్చి వాళ్ల ముందు పెట్టాడు. ఈ పనులన్నీ తన సేవకులకు అప్పగించే బదులు ఎంతో వినయంగా అవసరమైన పనులన్నీ తనే చేశాడు. ఎదుటివాళ్ల కోసం ఇలాంటి పనులు చేయడం చిన్నతనమని ఆయన అనుకోలేదు.

అబ్రాహాము తన అధికారం కిందవున్న వాళ్ల సలహాలు విన్నాడు. ఉదాహరణకు, అబ్రాహాము శారాలు మాట్లాడుకున్న సందర్భాల్లో కొన్నింటి గురించే బైబిలు చెబుతున్నా వాటిలో రెండుచోట్ల, శారా చెప్పిన ఆలోచనలను అబ్రాహాము విని, వాటి ప్రకారం చేశాడని మనం చదువుతాం. (ఆదికాండము 16:2; 21:8-14) ఒకసారైతే, శారా చెప్పిన ఆలోచన అబ్రాహాముకు మొదట్లో అస్సలు నచ్చలేదు. కానీ ఆమె ఆలోచన సరైనదని యెహోవా అబ్రాహాముతో చెప్పినప్పుడు ఆయన వినయంగా ఒప్పుకొని ఆమె చెప్పినట్లు చేశాడు.

దీన్నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? మనం నిజంగా వినయస్థులమైతే సంతోషంగా ఎదుటివాళ్లకు సేవలు చేస్తాం. వాళ్ల మేలు కోసం మనం చేయగలిగినదంతా సంతోషంగా చేస్తాం.

ఎదుటివాళ్లు ఇచ్చే సలహాలకు స్పందించే విధానంలో కూడా మనం వినయాన్ని చూపించవచ్చు. ఎదుటివాళ్లు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు, అది మనకు వచ్చిన ఆలోచన కాదని దాన్ని కొట్టిపారేసే బదులు వాళ్లు చెప్పేది వినడం మంచిది. (సామెతలు 15:22) ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్లకు అలాంటి మనస్తత్వం ఉంటే ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. ఎంతోకాలం నుండి సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న జాన్‌ అనే ఆయన ఇలా చెబుతున్నాడు: “ఒక మంచి అధికారి, తన కింద పనిచేసే వాళ్లు మొహమాటపడకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాడని నేను గమనించాను. మీ కింద పనిచేసే వాళ్లు ఒక పనిని మీకన్నా బాగా చేయగలరని ఒప్పుకోవడానికి వినయం కావాలి. మంచి ఆలోచనలు ఏ ఒక్కరి సొత్తూ కాదు, అది అధికారైనా సరే మరెవరైనా సరే.”

అబ్రాహాములాగే మనం కూడా ఎదుటివాళ్లు ఇచ్చే సలహాలను విని, వాళ్ల కోసం తక్కువ స్థాయి పనులు చేస్తే యెహోవా ఆమోదాన్ని పొందుతాం. ఎందుకంటే, ‘దేవుడు అహంకారులను ఎదిరించి, దీనులకు కృప అనుగ్రహిస్తాడు.’—1 పేతురు 5:5. (w12-E 01/01)

[అధస్సూచి]

a అబ్రాహాము మొదట్లో గమనించి ఉండకపోవచ్చు, కానీ ఆ ముగ్గురు వ్యక్తులు దేవుని దూతలు.—హెబ్రీయులు 13:1.