ప్రకృతి విపత్తులు ఉండని కాలం వస్తుందా?
ఎవరైనా మీతో, “ప్రకృతి విపత్తులు ఉండని కాలం త్వరలో రాబోతోంది!” అని చెబితే మీరేమంటారు? “నువ్వేమైనా కలకంటున్నావా? అవి జీవిత వాస్తవాలు, వాటిని ఎవ్వరూ కాదనలేరు” అని బహుశా మీరనవచ్చు లేదా ‘నాతోనే వేళాకోళమా?’ అని మనసులో అనుకోవచ్చు.
ప్రకృతి విపత్తులు ఎప్పుడూ ఉంటాయని అనిపించినా, పరిస్థితి మారుతుందని నమ్మడానికి గట్టి రుజువుంది. అయితే, ఆ మార్పు మనుషుల ప్రయత్నాలవల్ల రాదు. ప్రకృతి విపత్తులు ఎందుకు జరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో కూడా మనుషులు పూర్తిగా అర్థంచేసుకోలేకపోతున్నారు. అలాంటిది వాళ్లు వాటినెలా అదుపు చేయగలరు? జ్ఞానవంతుడు, నిశిత పరిశీలకుడని పేరుగాంచిన సొలొమోను అనే ప్రాచీన ఇశ్రాయేలు రాజు ఇలా అన్నాడు: “ఈ భూమిమీద దేవుడు చేసేదాన్నంతటినీ మనుష్యులు అర్థంచేసుకోలేరు. మనిషి వాటిని అర్థం చేసుకునేందుకు ఎంతైనా ప్రయత్నించవచ్చు. కాని, అతను అర్థంచేసుకోలేడు. దేవుడు చేసినదాన్ని తాను అర్థంచేసుకున్నానని ఒక జ్ఞాని అనవచ్చు. కాని, అది నిజం కాదు. వాటన్నింటినీ ఏ ఒక్కడూ అర్థంచేసుకోలేడు.”—ప్రసంగి 8:17, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.
ప్రకృతి విపత్తులను మనుషులు అదుపుచేయలేకపోతే, మరి ఎవరు చేయగలరు? మన సృష్టికర్త చేయగలడని బైబిలు చెబుతోంది. నీటిచక్రం వంటి జీవావరణ వ్యవస్థలను ఏర్పాటు చేసింది ఆయనే. (ప్రసంగి 1:7) మనుషులకున్న శక్తి చాలా పరిమితమైనది, కానీ దేవుని శక్తి చాలా గొప్పది, దానికి అంతేలేదు. ఆ నిజాన్ని బలపరుస్తూ యిర్మీయా ప్రవక్త ఇలా అన్నాడు: ‘ప్రభువా, సైన్యములకధిపతియగు యెహోవా, మహాదేవా, నీ అధిక బలం చేత, చాచిన బాహువు చేత భూమ్యాకాశాలను సృజించావు. నీకు అసాధ్యమైనదేదీ లేదు.’ (యిర్మీయా 32:17) భూమినీ, వాటిమీదున్న వాటన్నిటినీ చేసింది దేవుడే కాబట్టి ప్రజలు శాంతిగా, సురక్షితంగా భూమ్మీద జీవించాలంటే ఏమిచేయాలో ఆయనకు బాగా తెలుసు.—కీర్తన 37:11; 115:16.
దేవుడు ప్రకృతి విపత్తులను ఎలా అదుపుచేస్తాడు? నేడు భూమ్మీద జరుగుతున్న ఎన్నో ఘోరమైన సంఘటనలు ‘ఈ యుగసమాప్తికి సూచనగా’ ఉన్నాయని మనం రెండవ ఆర్టికల్లో చూశాం. యేసు ఇలా అన్నాడు: ‘మీరు ఈ సంగతులు జరగడం చూసినప్పుడు దేవుని రాజ్యం సమీపమైందని తెలుసుకోండి.’ (మత్తయి 24:3; లూకా 21:31) దేవుడు పరలోకంలో స్థాపించిన ఆ ప్రభుత్వం భూమ్మీద గొప్ప మార్పులు తీసుకువస్తుంది, చివరకు ప్రకృతి శక్తులను కూడా అదుపుచేస్తుంది. వీటన్నిటినీ స్వయంగా చేసే శక్తి యెహోవాకు ఉంది, కానీ ఆయన ఆ పనిని తన కుమారుడైన యేసుకు అప్పగించాడు. యేసు గురించి మాట్లాడుతూ దానియేలు ప్రవక్త ఇలా అన్నాడు: ‘సకల జనులు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించేలా ప్రభుత్వం, మహిమ, ఆధిపత్యం ఆయనకు ఇవ్వబడ్డాయి.’—దానియేలు 7:14.
భూమిని ఆహ్లాదకరమైన స్థలంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన మార్పులు చేసే శక్తిని యేసుక్రీస్తుకు దేవుడు ఇచ్చాడు. రెండువేల సంవత్సరాల క్రితం యేసు ఈ భూమ్మీద ఉన్నప్పుడు కొన్ని అద్భుతాలు చేసి, ప్రకృతి శక్తులను అదుపుచేసే శక్తి తనకుందని చూపించాడు. ఒకసారి యేసు, ఆయన శిష్యులు గలిలయ సముద్రంలో ఒక దోనెలో ప్రయాణిస్తున్నారు. ‘అప్పుడు పెద్ద తుఫాను రేగి, ఆయనున్న దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయింది.’ దాంతో శిష్యులు భయపడిపోయి, ప్రాణభయంతో యేసును ఆశ్రయించారు. అప్పుడు ఆయనేమి చేశాడు? ఆయన, ‘గాలిని గద్దించి, నిశ్శబ్దమై ఊరుకోమని సముద్రంతో చెప్పినప్పుడు, గాలి అణగి మిక్కిలి నిమ్మళమైంది.’ దానికి ఆయన శిష్యులు ఎంతో ఆశ్చర్యపోయి, ‘ఈయన ఎవరో, గాలి, సముద్రం కూడా ఈయనకు లోబడుతున్నాయి’ అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.—మార్కు 4:37-41.
ఇప్పుడు యేసు పరలోకంలో ఉన్నాడు, దేవుడు ఆయనకు ఇంకెంతో శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు. భూమ్మీద ప్రజలు శాంతిభద్రతలతో జీవించడానికి కావాల్సిన మార్పులు తీసుకొచ్చే బాధ్యత, సామర్థ్యం దేవుని రాజ్యానికి రాజైన యేసుకు ఉన్నాయి.
మనం చూసినట్టు చాలా సమస్యలకు, విపత్తులకు కారణం మనుషులే. అంటే స్వార్థపరులు, అత్యాశపరులు చేసే పనులవల్లే అవి కలుగుతున్నాయి, కొన్నిసార్లు ఎక్కువౌతున్నాయి. తమ తీరు మార్చుకోకుండా అలాంటి పనులు చేసేవాళ్లకు ఏమి జరుగుతుంది? ‘ప్రభువైన యేసు తన ప్రభావాన్ని కనబరిచే దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై, దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేస్తాడు’ అని బైబిలు చెబుతోంది. నిజంగానే, ఆయన ‘భూమిని నశింపజేసేవారిని నశింపజేస్తాడు.’—2 థెస్సలొనీకయులు 1:6-8; ప్రకటన 11:18.
ఆ తర్వాత, ‘రాజులకు రాజైన’ యేసుక్రీస్తు, ప్రకృతి శక్తులను పూర్తిగా అదుపు చేస్తాడు. (ప్రకటన 19:16) తన రాజ్య పౌరులను ఇంకెప్పుడూ విపత్తుల బారినపడనివ్వడు. వాతావరణం, రుతుచక్రాలు మనుషులకు ప్రయోజనం చేకూర్చేలా ఆయన తన శక్తితో భూపర్యావరణ వ్యవస్థను క్రమపరుస్తాడు. అప్పుడు పరిస్థితులు యెహోవా దేవుడు చాలాకాలం క్రితం తన ప్రజలకు మాటిచ్చినట్టు ఉంటాయి: ‘వర్షాకాలంలో మీకు వర్షమిస్తాను, మీ భూమి పంటలనిస్తుంది, మీ పొలాల చెట్లు ఫలిస్తాయి.’ (లేవీయకాండము 26:4) ఏదో ఒక విపత్తులో కూలిపోతాయనే భయంలేకుండా ప్రజలు ఇళ్లు కట్టుకుంటారు. బైబిలు ఇలా చెబుతోంది: ‘జనులు ఇళ్లు కట్టుకొని వాటిలో కాపురముంటారు. ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలాలను అనుభవిస్తారు.’—యెషయా 65:21.
మీరేం చేయాలి?
ప్రకృతి విపత్తులు ఉండని లోకంలో జీవించాలని చాలామందిలాగే మీరూ తప్పకుండా కోరుకుంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో జీవించాలంటే మీరేం చేయాలి? ఇప్పుడే దేవుని గురించి నేర్చుకోవాలి, భూమిని పరిపాలించడానికి ఆయన చేసిన ఏర్పాటుకు మద్దతునివ్వాలి. ఎందుకంటే ‘దేవుణ్ణి ఎరుగనివారికి, సువార్తకు లోబడనివారికి’ అలాంటి పరిస్థితుల్లో జీవించే అర్హత లేదు. మనం ఆయన గురించి నేర్చుకోవాలని, తన కుమారుడు రాజుగా ఉండే రాజ్యం గురించిన సువార్తకు లోబడాలని దేవుడు కోరుతున్నాడు.
దానికొక చక్కని పద్ధతి, జాగ్రత్తగా బైబిలు అధ్యయనం చేయడం. దేవుని రాజ్యంలో సురక్షితమైన పరిసరాల మధ్య జీవించడానికి అర్హులయ్యేందుకు కావాల్సిన నిర్దేశాలు బైబిల్లో ఉన్నాయి. బైబిలు ఏమి చెబుతోందో నేర్చుకోవడానికి సహాయం చేయమని మీరు యెహోవాసాక్షులను అడగవచ్చు. అలా చేయడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. దేవుని గురించి తెలుసుకోవడానికి, సువార్తకు లోబడడానికి మీరు కృషిచేస్తే, సామెతలు 1:33లోని ఈ మాటలు మీ విషయంలో నిజమౌతాయి: ‘నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా నివసిస్తాడు, కీడు వస్తుందన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు.’ (w11-E 12/01)