దేవుడు చెప్పేది ఎందుకు తెలుసుకోవాలి?
దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి
దేవుడు చెప్పేది ఎందుకు తెలుసుకోవాలి?
ఈ ఆర్టికల్సాధారణంగా మీకు వచ్చే సందేహాలను ప్రస్తావిస్తుంది. అంతేకాదు, వాటికి జవాబులు మీ బైబిల్లో ఎక్కడ ఉన్నాయో కూడా ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఆ జవాబులను మీతో చర్చించడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.
1. దేవుడు చెప్పేది ఎందుకు తెలుసుకోవాలి?
దేవుడు మానవులకు ఒక మంచి విషయం చెప్తున్నాడు. దాన్ని ఆయన బైబిలు ద్వారా తెలియజేస్తున్నాడు. బైబిలు మన ప్రేమగల పరలోక తండ్రి నుండి వచ్చిన ఒక ఉత్తరం లాంటిది.—యిర్మీయా 29:11 చదవండి.
2. ఏమిటా మంచి విషయం?
మానవులకు మంచి ప్రభుత్వం కావాలి. ఇప్పటి వరకు ఏ మానవ పాలకుడూ దౌర్జన్యం, అన్యాయం, అనారోగ్యం, లేదా మరణం తీసివేయలేకపోయాడు. కానీ ఒక మంచి విషయమేమిటంటే, దేవుడు మానవుల కోసం ఒక మంచి ప్రభుత్వాన్ని తెస్తాడు, అది బాధ కలిగించే వాటన్నిటినీ లేకుండా చేస్తుంది.—దానియేలు 2:44 చదవండి.
3. దేవుడు చెప్పేది తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
త్వరలోనే దేవుడు, బాధలకు కారణమైనవాళ్లు ఈ భూమ్మీద లేకుండా చేస్తాడు. ఈలోపు, ప్రేమ కలిగివుంటూ శ్రేష్ఠమైన విధంగా ఎలా జీవించాలో వినయంగల లక్షలాదిమందికి ఆయన నేర్పిస్తున్నాడు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలో, నిజమైన ఆనందాన్ని ఎలా పొందాలో, దేవునికి ఎలా సంతోషం కలిగించాలో ప్రజలు దేవుని వాక్యం నుండి నేర్చుకుంటున్నారు.—జెఫన్యా 2:3 చదవండి.
4. బైబిలు గ్రంథకర్త ఎవరు?
బైబిల్లో 66 చిన్న పుస్తకాలు ఉన్నాయి. వీటిని 40 మంది రాశారు. మొదటి ఐదు పుస్తకాలను 3,500 సంవత్సరాల క్రితం మోషే రాశాడు. చివరి పుస్తకాన్ని 1,900 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం క్రితం అపొస్తలుడైన యోహాను రాశాడు. బైబిలు రాసినవాళ్లు తమ సొంత ఆలోచనలు కాదుగానీ దేవుని ఆలోచనలు రాశారు. కాబట్టి దేవుడే బైబిలు గ్రంథకర్త.—2 తిమోతి 3:16, 17; 2 పేతురు 1:21 చదవండి.
భవిష్యత్తులో జరగబోయే వాటి వివరాలు బైబిల్లో ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి దాన్ని రాయించింది దేవుడేనని మనకు తెలుస్తుంది. మనుషులెవరూ అలా తెలియజేయలేరు. (యెషయా 46:9, 10) అంతేకాదు, దేవుడు ఎంత ప్రేమగలవాడో బైబిలు సుస్పష్టంగా వర్ణిస్తోంది. ప్రజల జీవితాలను మంచిగా మార్చే శక్తి దానికుంది. ఈ వాస్తవాలను బట్టి బైబిలు దేవుని వాక్యమని లక్షలాదిమంది నమ్ముతున్నారు.—యెహోషువ 23:14; 1 థెస్సలొనీకయులు 2:13 చదవండి.
5. మీరు బైబిలును ఎలా అర్థం చేసుకోవచ్చు?
దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తిగా యేసు ప్రసిద్ధిగాంచాడు. ఆయన శ్రోతల్లో చాలామందికి బైబిలు గురించి తెలిసినా దాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్లకు సహాయం అవసరమైంది. ఆయన వాళ్లకు సహాయం చేయడానికి ఒక బైబిలు వచనం తర్వాత మరొకటి చూపిస్తూ ఆ ‘వచనాల భావాన్ని’ వివరించాడు. “దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి” అనే క్రమంగా వచ్చే ఈ శీర్షిక మీకు సహాయం చేయడానికి అదే పద్ధతిని ఉపయోగిస్తుంది.—లూకా 24:27, 45 చదవండి.
దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడనేది ఆయన ద్వారానే తెలుసుకోవడం ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ, మీరు బైబిలు చదవడం కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. అయినా మీరు నిరుత్సాహపడకండి. దేవుని గురించి తెలుసుకుంటేనే ఎల్లకాలం జీవించడం కోసం మీరు ఎదురుచూడవచ్చు.—మత్తయి 5:10-12; యోహాను 17:3 చదవండి. (w11-E 01/01)
ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలోని 2వ అధ్యాయం చూడండి.