ఆయన ‘యెహోవా సన్నిధిలో ఎదిగాడు’
వారి విశ్వాసాన్ని అనుసరించండి
ఆయన ‘యెహోవా సన్నిధిలో ఎదిగాడు’
సమూయేలు అక్కడ సమకూడిన ప్రజల వైపు చూస్తున్నాడు. ఆయన అప్పటికే దశాబ్దాల పాటు ప్రవక్తగా, న్యాయాధిపతిగా నమ్మకంగా సేవ చేశాడు. ఆయనే వాళ్లను గిల్గాలు అనే ఊరిలో సమావేశపర్చాడు. అది మన క్యాలెండరు ప్రకారం మే లేదా జూన్ నెల. ఎండ మండిపోతోంది. గోధుమ పంట తెల్లబారి కోతకు సిద్ధంగా ఉంది. అక్కడ ఉన్నవాళ్లందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ప్రజలను ఆలోచింపజేయడానికి సమూయేలు ఏమి చేశాడు?
ఇశ్రాయేలీయులకు తమ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో పూర్తిగా అర్థంకాలేదు. తమను పరిపాలించడానికి ఒక మానవ రాజు కావాలని వాళ్లు పట్టుబట్టారు. వాళ్లు తమ దేవుడైన యెహోవాను, ఆయన ప్రవక్తను ఘోరంగా అవమానించామన్న విషయాన్ని గ్రహించలేదు. నిజానికి వాళ్లు తమ మీద రాజుగా ఉండకుండా యెహోవానే తిరస్కరించారు. వాళ్లు తమ తప్పు తెలుసుకునేలా సమూయేలు ఎలా చేశాడు?
సమూయేలు వాళ్లతో మాట్లాడాడు. ‘నేను తల నెరిసి ముసలివాడనయ్యాను’ అంటూ ఆయన మొదలుపెట్టాడు. వయసు పైబడటం వల్ల వచ్చిన పెద్దరికం ఆయన మాటలకు బలాన్నిచ్చింది. అప్పుడు ఆయన ఇలా అన్నాడు ‘బాల్యం నుండి నేటి వరకు నేను మీ కార్యాలను జరిగిస్తూ వచ్చాను.’ (1 సమూయేలు 11:14, 15; 12:2) సమూయేలు వృద్ధుడైనా తన బాల్యాన్ని మర్చిపోలేదు. ఆ జ్ఞాపకాలు ఇంకా ఆయన మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఆయన పెరిగి పెద్దవాడవుతూ తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితాంతం తన దేవుడైన యెహోవా పట్ల విశ్వాసాన్ని, భక్తిని చూపించగలిగాడు.
సమూయేలు తన చుట్టూ ఉన్న ప్రజలు విశ్వాసం లేనివాళ్లూ విశ్వాసఘాతకులూ అయినా ఎన్నోసార్లు ఆయన తన విశ్వాసాన్ని బలపర్చుకుని, దాన్ని కాపాడుకోవాల్సి వచ్చింది. మనం కూడా విశ్వాసం లేని చెడ్డ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి విశ్వాసాన్ని బలపర్చుకోవడం అంత సులభం కాదు. సమూయేలు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చో చూద్దాం. ఆయన బాల్యం నుండి మొదలుపెడదాం.
‘బాలునిగా యెహోవాకు పరిచర్య చేయడం’
సమూయేలు బాల్యం మామూలుగా గడవలేదు. ఆయన తల్లిపాలు తాగడం మానేసిన కొంత కాలానికే, అంటే దాదాపు నాలుగు సంవత్సరాల వయసులో కావచ్చు షిలోహులో ఉన్న యెహోవా పరిశుద్ధ మందిరంలో సేవచేయడం మొదలుపెట్టాడు. షిలోహుకు, ఆయన ఊరైన రామాకు మధ్య దూరం 30 కిలోమీటర్ల పైనే ఉంటుంది. ఆయన తల్లిదండ్రులైన ఎల్కానా, హన్నా తమ కుమారుడైన సమూయేలును ఒక ప్రత్యేకమైన సేవ కోసం అంటే జీవితాంతం నాజీరుగా ఉండడానికి యెహోవాకు సమర్పించారు. a అంటే వాళ్లకు సమూయేలు మీద ప్రేమ లేదని, ఆయన్ని పూర్తిగా విడిచిపెట్టారని అర్థమా?
కానే కాదు! షిలోహులో ఉన్నవాళ్లు తమ కుమారుణ్ణి బాగా చూసుకుంటారని వాళ్లకు తెలుసు. సమూయేలు ప్రధాన యాజకుడైన ఏలీ దగ్గర పనిచేసేవాడు కాబట్టి ఆయనను చూసుకునే విషయంలో ఏలీ శ్రద్ద తీసుకునేవాడని చెప్పవచ్చు. మందిరానికి సంబంధించిన కొన్ని పనులు చూసుకోవడానికి అక్కడ చాలామంది స్త్రీలు కూడా ఉండేవాళ్లు. అక్కడ అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరిగేవని తెలుస్తోంది.—నిర్గమకాండము 38:8.
హన్నా ప్రార్థన చేసినందుకే దేవుడు అనుగ్రహించిన, తమ ప్రియమైన మొదటి కుమారుణ్ణి ఎల్కానా, హన్నా ఎప్పుడూ మర్చిపోలేదు. హన్నా తనకొక కుమారుణ్ణి ఇవ్వమని, ఇస్తే ఆ కుమారుణ్ణి పరిశుద్ధ సేవ కోసం దేవునికి సమర్పిస్తానని మొక్కుకుంది. హన్నా ప్రతీ సంవత్సరం సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడల్లా, మందిరంలో సేవ చేసేటప్పుడు వేసుకోవడానికి ఆయన కోసం తను కుట్టిన ఒక అంగీ తీసుకునివచ్చేది. వాళ్లు వచ్చినప్పుడల్లా సమూయేలు తప్పకుండా సంతోషించివుంటాడు. అలాంటి ప్రత్యేకమైన స్థలంలో యెహోవా సేవ చేయడం ఎంతో అమూల్యమైన అవకాశమని బోధిస్తూ తల్లిదండ్రులు
ప్రేమతో చెప్పిన మాటలు, ఇచ్చిన నిర్దేశం సమూయేలును తప్పకుండా ప్రోత్సహించివుంటాయి.ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎల్కానా, హన్నా నుండి చాలా నేర్చుకోవచ్చు. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు వస్తుసంబంధమైన వాటిని సమకూర్చిపెట్టడం మీదే మనసు పెడతారు కానీ వాళ్లకు దేవుని విషయాలు నేర్పించడానికి ప్రాధాన్యతనివ్వరు. అయితే సమూయేలు తల్లిదండ్రులు మాత్రం దేవునికి సంబంధించిన విషయాలకే ప్రాధాన్యతనిచ్చారు, సమూయేలు దైవభక్తి గల వ్యక్తిగా ఎదగడానికి అదెంతో దోహదపడింది.—సామెతలు 22:6.
బాలుడైన సమూయేలు పెరిగి పెద్దవాడవుతూ షిలోహు చుట్టుపక్కల ఉన్న కొండలపై తిరగడం మనం ఊహించుకోవచ్చు. అక్కడ నుండి పట్టణాన్ని, దానికి ఒక వైపున విస్తరించివున్న లోయను చూస్తుండగా, యెహోవా మందిరం కనిపించగానే ఆయన మనసు ఆనందంతో, గర్వంతో ఉప్పొంగిపోయి ఉంటుంది. ఆ మందిరం నిజంగా ఒక పరిశుద్ధ స్థలం. b అది దాదాపు 400 సంవత్సరాల క్రితం మోషే నిర్దేశం ప్రకారం నిర్మించబడింది. అప్పట్లో ప్రపంచమంతటిలోకి అక్కడే యెహోవా ఆరాధన జరిగేది.
సమూయేలు చిన్నప్పటినుండి ఆ మందిరాన్ని ఎంతో ప్రేమించాడు. పెరిగి పెద్దవాడయ్యాక ఆయన రాసిన వృత్తాంతంలో ఇలా ఉంది, “బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను.” (1 సమూయేలు 2:18) ఆయన చేతుల్లేని ఆ అంగీ వేసుకునే వాడు కాబట్టి మందిరంలో యాజకులకు పనుల్లో సహాయపడేవాడని అర్థమవుతుంది. సమూయేలు యాజకుడు కాకపోయినా, మందిర ఆవరణంలో ఉన్న తలుపులను ఉదయాన్నే తెరవడం లాంటి పనులు చేసేవాడు, వృద్ధుడైన ఏలీకి సహాయపడేవాడు. అలాంటి పనులను సమూయేలు ఎంతో ఆనందంగా చేసేవాడు. కానీ కొంతకాలానికి, కొన్ని విషయాలు ఆ పసిమనసును బాధపెట్టాయి. యెహోవా మందిరంలో ఘోరమైన చెడ్డ పనులు జరుగుతున్నాయి.
చుట్టూ చెడు జరుగుతున్నా పవిత్రంగా ఉన్నాడు
సమూయేలు చిన్న వయసులోనే ఎంతో చెడును, మోసాన్ని చూశాడు. ఏలీకి ఇద్దరు కుమారులు. వాళ్లు హొఫ్నీ, ఫీనెహాసు. సమూయేలు రాసిన వృత్తాంతంలో ఇలా ఉంది, ‘ఏలీ కుమారులు చెడ్డవాళ్లు. వాళ్లు యెహోవాను లక్ష్యపెట్టలేదు.’ (1 సమూయేలు 2:12, పరిశుద్ధ బైబల్: తెలుగు, ఈజీ-టు-రీడ్‌వర్షన్) ఈ వచనంలోని రెండు వాక్యాలు ఒకదానితో ఒకటి సంబంధం కల్గివున్నాయి. ‘చెడ్డవాళ్లు’ అని అనువదించబడిన హెబ్రీ పదాన్ని ‘పనికిమాలిన వాళ్లు’ అని కూడా అనువదించవచ్చు. హొఫ్నీ, ఫీనెహాసు చెడ్డవాళ్లని చెప్పడం తగినదే, ఎందుకంటే వాళ్లు యెహోవాను లక్ష్యపెట్టలేదు. దేవుని నీతి ప్రమాణాలను, ఆయన చేయమన్న వాటిని వాళ్లు పెడచెవినబెట్టారు. అందుకే వాళ్లు వేరే పాపాలు చేయడానికి కూడా వెనుకాడలేదు.
యాజకులు ఏయే పనులు చేయాలో, మందిరంలో బలులు ఎలా అర్పించాలో దేవుని ధర్మశాస్త్రం స్పష్టంగా తెలియజేసింది. దానికి మంచి కారణమే ఉంది. ఆ బలులు, ప్రజల పాపాలను క్షమించడానికి దేవుడు చేసిన ఏర్పాట్లను సూచించాయి. వాటివల్లే వాళ్లు దేవుని దృష్టిలో పవిత్రులుగా ఉండడం, ఆయన దీవెనలను, మార్గనిర్దేశాన్ని పొందడం సాధ్యమయ్యేది. కానీ హొఫ్నీ, ఫీనెహాసు చెడుగా ప్రవర్తించడం వల్ల ఇతర యాజకులు కూడా బలుల పట్ల తగిన గౌరవం చూపించేవాళ్లు కాదు. c
ఎవ్వరూ పట్టించుకోని అలాంటి పెద్దపెద్ద తప్పులను వాళ్లు చేస్తూపోతుంటే సమూయేలు కళ్లు విప్పార్చి చూస్తూ ఉండడం ఊహించుకోండి. ధర్మశాస్త్రం నుండి కాస్త ఓదార్పు పొందాలనే, బలపర్చబడాలనే ఆశతో పరిశుద్ధ మందిరానికి వచ్చి, అక్కడ నిరుత్సాహం, అవమానం ఎదురై బాధతో తిరిగి వెళ్లిపోయే ఎంతమంది దీనులను, పేదవాళ్లను, అణచివేయబడిన ప్రజలను సమూయేలు చూసి ఉంటాడో కదా! హొఫ్నీ, ఫీనెహాసు మందిరంలో సేవ చేయడానికి వచ్చిన కొంతమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకొని యెహోవా ఇచ్చిన నైతిక నియమాలను పెడచెవిన పెట్టారని తెలుసుకున్నప్పుడు సమూయేలుకు ఎలా అనిపించి ఉంటుందో కదా! (1 సమూయేలు 2:22) ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ఏలీ ఏదైనా చేస్తాడని సమూయేలు ఆశించివుండవచ్చు.
ఏలీ, అంతకంతకూ పెరుగుతున్న ఈ సమస్యను పరిష్కరించగల స్థానంలో ఉన్నాడు. ఏలీ ప్రధాన యాజకుడు కాబట్టి 1 సమూయేలు 2:23-25) కానీ వాళ్లకు గట్టి క్రమశిక్షణ అవసరం. వాళ్లు మరణానికి తగిన పాపాలు చేస్తున్నారు.
మందిరంలో జరుగుతున్న పనులకు ఆయనే బాధ్యుడు. ఒక తండ్రిగా తన కుమారులను సరిదిద్దాల్సిన బాధ్యత ఆయనకుంది. హొఫ్నీ, ఫీనెహాసు చేస్తున్న పనుల వల్ల వాళ్లకే కాదు ఎంతోమంది ఇతరులకు కూడా హాని జరుగుతోంది. అయితే ఏలీ తండ్రిగా, ప్రధాన యాజకునిగా తన పాత్రను నిర్వర్తించడంలో విఫలమయ్యాడు. ఆయన తన కుమారుల మనసు నొప్పించకుండా వాళ్లను చిన్నగా మందలించాడంతే. (పరిస్థితులు ఎంత ఘోరంగా తయారయ్యాయంటే చివరకు యెహోవా తీవ్రమైన తీర్పు సందేశాన్ని ప్రకటించడానికి, ‘ఒక దైవజనుణ్ణి’ అంటే ఒక ప్రవక్తను ఏలీ దగ్గరకు పంపించాడు, ఆ ప్రవక్త పేరు బైబిల్లో లేదు. “నీవు నాకంటే నీ కుమారులనే ఎక్కువ గౌరవిస్తున్నావు” అని యెహోవా ఏలీతో అన్నాడు. ఏలీ చెడ్డ కుమారులు ఒకేరోజు చనిపోతారనీ ఆయన కుటుంబం ఎంతో బాధ అనుభవిస్తుందనీ వాళ్లు యాజక తరగతిలో తమకున్న గౌరవప్రదమైన స్థానాన్ని కోల్పోతారనీ యెహోవా తెలియజేశాడు. అయితే ఈ హెచ్చరిక వల్ల ఆ కుటుంబంలో ఏమైనా మార్పు వచ్చిందా? అలాంటి మార్పేమీ రాలేదని వృత్తాంతం బట్టి తెలుస్తుంది.—1 సమూయేలు 2:27–3:1, పరిశుద్ధ బైబల్: తెలుగు, ఈజీ-టు-రీడ్ వర్షన్.
సమూయేలు చుట్టూ ఉన్న ఈ చెడు పరిస్థితులన్నీ ఆయన మీద ఏమైనా ప్రభావం చూపించాయా? ఆ చీకటి వృత్తాంతంలో సమూయేలు ప్రగతి, ఎదుగుదల గురించిన మంచి వార్తలు వెలుగు కిరణాల్లా ప్రకాశిస్తున్నాయి. 1 సమూయేలు 2:18లో ‘బాలుడైన’ సమూయేలు నమ్మకంగా ‘యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు’ అని చదివామని గుర్తు చేసుకోండి. సమూయేలు అంత చిన్న వయసులో కూడా తన జీవితాన్ని యెహోవా సేవకే అంకితం చేశాడు. అదే అధ్యాయంలోని 21వ వచనంలో, మనకెంతో సంతోషం కలిగించే మరో విషయాన్ని చదువుతాం, అదేమిటంటే, ‘బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిలో ఎదిగాడు.’ సమూయేలు పెరిగి పెద్దవాడవుతున్నకొద్దీ తన పరలోక తండ్రితో ఆయనకున్న సంబంధం కూడా బలపడింది. యెహోవాతో అలాంటి దగ్గర సంబంధం ఉంటే అన్ని రకాల చెడు ప్రభావాల నుండి తప్పించుకోవచ్చు.
ప్రధాన యాజకుడు, ఆయన కుమారులే తప్పు చేస్తే, తాను కూడా తనకు ఇష్టమైనట్టు జీవించవచ్చని సమూయేలు అనుకుని ఉండగలిగేవాడే. అయితే అధికారంలో ఉన్నవాళ్లతో సహా అందరూ తప్పులు చేస్తున్నారు కాబట్టి మనం కూడా పాపం చేయవచ్చని అనుకోవడం సరి కాదు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ యౌవనస్థులు, తమ చుట్టూ ఉన్న వాళ్లలో కొంతమంది ఆదర్శవంతంగా లేకపోయినా, సమూయేలును ఆదర్శంగా తీసుకుని ‘యెహోవా సన్నిధిలో ఎదుగుతున్నారు.’
అలా జీవించడం వల్ల సమూయేలుకు ఏదైనా మంచి జరిగిందా? ‘బాలుడైన సమూయేలు ఎదుగుతూ దేవుని దయయందు, మనుష్యుల దయయందు వర్ధిల్లుచుండెను.’ (1 సమూయేలు 2:26) సమూయేలు ఎవరి మాటలకు ప్రాధాన్యతనివ్వాలో, కనీసం వాళ్లయినా ఆయనను ఎంతో ఇష్టపడివుంటారు. సమూయేలు నమ్మకంగా ఉన్నందుకు యెహోవా దేవుడు కూడా ఆయనను చూసి ఎంతో సంతోషించాడు. షిలోహులో జరుగుతున్న చెడునంతటిని దేవుడు తీసివేస్తాడని సమూయేలుకు గట్టి నమ్మకం ఉన్నా, అది ఎప్పుడు జరుగుతుందా అని అనుకునివుంటాడు.
‘మీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇవ్వండి’
అలాంటి ప్రశ్నలకు ఒక రాత్రి జవాబు దొరికింది. దాదాపు తెల్లవారుజాము, కానీ ఇంకా చీకటిగానే ఉంది. మందిరంలోని పెద్ద దీపం రెపరెపలాడుతూ ఇంకా వెలుగుతూనే ఉంది. ప్రశాంతంగా ఉన్న ఆ సమయంలో ఎవరో తనను పిలవడం సమూయేలు విన్నాడు. ఎంతో వృద్దుడై, చూపు మందగించిన ఏలీ తనను పిలిచాడని సమూయేలు అనుకున్నాడు. సమూయేలు వెంటనే లేచి ఆ వృద్ధుని దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. సమూయేలు చెప్పులు కూడా వేసుకోకుండా ఏలీ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లడం మీ మనసులో ఊహించుకున్నారా? సమూయేలు గౌరవంతో, ప్రేమతో ఏలీకి సేవచేశాడన్న విషయం మన మనసును కదిలిస్తుంది. ఎంతైనా ఏలీ ఎన్నో పాపాలు చేసినా యెహోవా దేవుని ప్రధాన యాజకుడే కదా.—1 సమూయేలు 3:2-5.
సమూయేలు ఏలీని లేపి, ‘మీరు పిలిచారు కదా వచ్చాను’ అన్నాడు. దానికి ఏలీ తాను పిలవలేదని చెప్పి, వెళ్లి పడుకోమన్నాడు. కానీ మళ్లీ అలాగే జరిగింది, ఆ తర్వాత మరోసారీ అలాగే జరిగింది! జరుగుతున్నదేమిటో ఏలీకి అప్పుడు అర్థమైంది. అప్పటికి యెహోవా తన ప్రజలకు దర్శనాలు, ప్రవచనాత్మక సందేశాలు ఇవ్వడం తగ్గించాడు, దానికి తగిన కారణమే ఉంది. అయితే, ఇప్పుడు యెహోవా మళ్లీ, సమూయేలుతో మాట్లాడుతున్నాడని ఏలీ గ్రహించాడు. ఏలీ ఆ అబ్బాయిని వెళ్లి పడుకోమన్నాడు. ఈసారి మళ్లీ స్వరం వినిపిస్తే ఎలా మాట్లాడాలో చెప్పాడు. సమూయేలు అలాగే వెళ్లి పడుకున్నాడు. కాసేపటికి, ఎవరో “సమూయేలూ, సమూయేలూ” అని పిలవడం ఆయనకు వినిపించింది. దానికి ఆ అబ్బాయి, ‘మీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇవ్వండి’ అని బదులిచ్చాడు.—1 సమూయేలు 3:1, 5-10.
చివరకు యెహోవా చెప్పేది వినే దాసుడొకడు షిలోహులో ఉన్నాడు. సమూయేలు జీవితాంతం యెహోవా చెప్పింది విన్నాడు. మీరు కూడా అలాగే వింటారా? అలా వినాలంటే రాత్రిపూట ఏదో మానవాతీత స్వరం మనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే దేవుని స్వరం మనతో
ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంది. దేవుడు తన వాక్యమైన బైబిలు ద్వారా మాట్లాడుతున్నాడు. మనం దేవుడు చెప్పేది ఎంత ఎక్కువగా విని, దాని ప్రకారం నడుచుకుంటే మన విశ్వాసం అంతెక్కువగా బలపడుతుంది. సమూయేలు విషయంలో సరిగ్గా అదే జరిగింది.షిలోహులో ఉన్న సమూయేలుకు అది మర్చిపోలేని రోజు, ఎందుకంటే అప్పుడే ఆయనకు యెహోవాతో ఒక ప్రత్యేకమైన సంబంధం ఏర్పడింది. అప్పటి నుండి ఆయన దేవుని ప్రవక్తగా, ప్రతినిధిగా ఉన్నాడు. అయితే బాలుడైన సమూయేలు యెహోవా చెప్పిన సందేశాన్ని ఏలీకి ప్రకటించడానికి మొదట్లో భయపడ్డాడు, ఎందుకంటే ఏలీ కుటుంబం నాశనమవుతుందన్న ప్రవచనం ఇక త్వరలో నెరవేరుతుందన్నదే ఆ సందేశం. కానీ సమూయేలు ధైర్యం కూడగట్టుకుని ఆ సందేశాన్ని ఏలీకి చెప్పాడు, ఏలీ ఆ దైవిక తీర్పును వినయంగా అంగీకరించాడు. కొద్దికాలానికే యెహోవా చెప్పినదంతా జరిగింది. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు హొఫ్నీ, ఫీనెహాసు ఒకేరోజు చనిపోయారు. యెహోవా పరిశుద్ధ మందసం పట్టబడిందని విన్న వెంటనే ఏలీ కూడా చనిపోయాడు.—1 సమూయేలు 3:10-18; 4:1-18.
అయితే, సమూయేలు నమ్మకస్థుడైన ప్రవక్త అనే పేరు మరింత స్థిరపడింది. ‘యెహోవా అతనికి తోడైవున్నాడు’ అని బైబిలు చెబుతోంది. సమూయేలు ప్రవచించినవన్నీ యెహోవా నెరవెరేలా చేశాడని కూడా అది చెబుతోంది.—1 సమూయేలు 3:19.
“సమూయేలు యెహోవాను వేడుకున్నాడు”
అయితే, ఇశ్రాయేలీయులందరూ సమూయేలు నిర్దేశాన్ని అనుసరిస్తూ దైవభక్తితో నమ్మకంగా ఉన్నారా? లేరు. కొంతకాలం తర్వాత, కేవలం ఒక ప్రవక్త తమ మీద న్యాయాధిపతిగా ఉండాల్సిన అవసరం లేదని వాళ్లు నిర్ణయించుకున్నారు. వాళ్లు ఇతర జనాంగాల్లా ఉండాలనుకున్నారు, ఒక మానవ రాజు తమను పరిపాలించాలని కోరుకున్నారు. యెహోవా నిర్దేశించినట్టు సమూయేలు వాళ్ల విజ్ఞప్తిని అంగీకరించాడు. అయితే వాళ్లు చేసిన పాపం ఎంత ఘోరమైనదో సమూయేలు వాళ్లకు తెలిసేలా చేయాలి. వాళ్లు తిరస్కరిస్తున్నది కేవలం ఒక మనిషిని కాదు, యెహోవా దేవుణ్ణి! అందుకే సమూయేలు వాళ్లను గిల్గాలులో సమావేశపర్చాడు.
గిల్గాలులో సమూయేలు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్న 1 సమూయేలు 12:17, 18.
ఆ ఉద్వేగభరిత సమయంలో మళ్లీ అక్కడికి వెళ్దాం. అక్కడ, వృద్ధుడైన సమూయేలు తాను నమ్మకంగా చేసిన సేవను ఇశ్రాయేలీయులకు గుర్తుచేశాడు. తర్వాత, “సమూయేలు యెహోవాను వేడుకొన్నాడు” అని మనం చదువుతాం. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాన్ని కురిపించమని ఆయన యెహోవాను అడిగాడు.—ఉరుములు మెరుపులతో కూడిన వర్షమా? అదీ ఎండాకాలంలో? అలాంటిది ఎప్పుడూ జరగలేదు! ఒకవేళ ప్రజల మనసుల్లో ఏ కాస్త సందేహం లేదా వెటకారం ఉన్నా అది కాసేపట్లోనే పటాపంచలైపోయింది. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది. గాలులు విపరీతంగా వీస్తుండడంతో గోధుమ చేలు అటూ ఇటూ ఊగిపోతున్నాయి. ఆ ప్రాంతమంతా ఉరుములు మెరుపులతో హోరెత్తిపోతోంది. వర్షం మొదలైంది. అప్పుడు ప్రజలు ఎలా స్పందించారు? ‘జనులు యెహోవాకు, సమూయేలుకు చాలా భయపడ్డారు.’ చివరకు వాళ్లు తామెంత ఘోరమైన పాపం చేశారో అర్థంచేసుకున్నారు.—1 సమూయేలు 12:18, 19.
ఆ చెడ్డ ప్రజలను ఆలోచింపజేసింది సమూయేలు కాదు గానీ ఆయన దేవుడైన యెహోవాయే. సమూయేలు చిన్నప్పటి నుండీ వృద్దుడయ్యేంత వరకూ తన దేవుని మీద విశ్వాసముంచాడు. యెహోవా ఆయనకు తగిన ప్రతిఫలమిచ్చాడు. యెహోవా ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆయన ఇప్పటికీ, సమూయేలులా విశ్వాసం చూపించే వాళ్లకు తోడుగా ఉంటాడు. (w10-E 10/01)
[అధస్సూచీలు]
a నాజీరులుగా ఉండేవాళ్లు ఒక ప్రత్యేక ప్రమాణం చేస్తారు, దాని ప్రకారం వాళ్లు ద్రాక్షారసం తాగకూడదు, తమ వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అయితే చాలామంది కొంతకాలం పాటు నాజీరులుగా ఉంటామని ప్రమాణం చేస్తారు, కానీ సమ్సోను, సమూయేలు, బాప్తిస్మమిచ్చు యోహాను వంటి కొంతమంది జీవితాంతం నాజీరులుగా ఉన్నారు.
b ఆ మందిరం దీర్ఘచతురస్రాకారంలో ఉండేది. అది కర్రల సహాయంతో నిలబెట్టిన ఒక గుడారం. కానీ అది చాలా విలువైన వస్తువులతో అంటే సముద్రవత్సల తోళ్లతో, అందమైన కుట్టుపని ఉన్న బట్టలతో, బంగారం లేదా వెండి పలకలతో కప్పబడిన అమూల్యమైన చెక్కతో తయారు చేయబడింది. ఆ మందిరం దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక ఆవరణంలో ఉండేది, అందులో బలులు అర్పించడానికి ఒక పెద్ద బలిపీఠం కూడా ఉండేది. కాలం గడిచేకొద్దీ యాజకుల కోసం మందిరం పక్కన మరికొన్ని గదులు ఏర్పాటు చేయబడివుంటాయి. సమూయేలు బహుశా అలాంటి ఒక గదిలో పడుకునివుంటాడు.
c వాళ్లు గౌరవం చూపించలేదని తెలియజేసే రెండు ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. మొదటిది, బలి అర్పించే జంతువులలో ఏయే భాగాలను యాజకులు తీసుకోవాలో ధర్మశాస్త్రం స్పష్టంగా తెలియజేసింది. (ద్వితీయోపదేశకాండము 18:3, 4) కానీ మందిరంలోని చెడ్డ యాజకులు మరో పద్ధతి పాటించేవాళ్లు. మాంసం ఉడుకుతున్నప్పుడు మూడు ముండ్లున్న కొంకిని గుచ్చి దాంతో పాటువచ్చే ఏ మంచి ముక్కలనైనా తీసుకురమ్మని యాజకులు తమ పనివాళ్లను పురమాయించేవాళ్లు. రెండవది, బలిపీఠం మీద దహనబలిగా అర్పించడానికి ప్రజలు జంతువులను తీసుకువచ్చినప్పుడు, జంతువులోని కొవ్వును యెహోవాకు అర్పించక ముందే బలి అర్పించే వాళ్లను బెదిరించి పచ్చి మాంసాన్ని బలవంతంగా తీసుకు రమ్మని ఆ దుష్ట యాజకులు పనివాళ్లను పంపించేవాళ్లు.—లేవీయకాండము 3:3-5; 1 సమూయేలు 2:13-17.
[17వ పేజీలోని చిత్రం]
సమూయేలు ముందు భయపడినా యెహోవా తీర్పు సందేశాన్ని ఉన్నదున్నట్టు ఏలీకి తెలియజేశాడు
[18వ పేజీలోని చిత్రం]
సమూయేలు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాన్ని రప్పించాడు