కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లలకు నేర్పించండి

యేసు విధేయంగా ఉండడం నేర్చుకున్నాడు

యేసు విధేయంగా ఉండడం నేర్చుకున్నాడు

విధేయంగా ఉండడం కష్టమని కొన్నిసార్లు మీకు అనిపిస్తుందా?— a మీకు అలా అనిపిస్తే అది పెద్ద వింతేమీ కాదు. ప్రతీఒక్కరికీ విధేయత చూపించడం అప్పుడప్పుడు కష్టమౌతుంది. యేసు కూడా విధేయంగా ఉండడం నేర్చుకోవలసి వచ్చిందని మీకు తెలుసా?—

పిల్లలందరూ ఎవరికి విధేయత చూపించాలో మీకు తెలుసా?— అవును, అమ్మానాన్నలకు విధేయత చూపించాలి. “ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి” అని బైబిలు చెబుతోంది. (ఎఫెసీయులు 6:1) యేసుకు తండ్రి ఎవరు?— యెహోవా దేవుడు. ఆయన మనకు కూడా తండ్రే. (మత్తయి 6:9, 10) ఒకవేళ మీరు యేసు తండ్రి యోసేపు అని, ఆయన తల్లి మరియ అని చెప్పివుంటే అప్పుడు కూడా మీరు సరిగ్గా చెప్పినట్లే. వాళ్లిద్దరూ ఆయనకు అమ్మానాన్నలు ఎలా అయ్యారో మీకు తెలుసా?—

అప్పటికి మరియ ఇంకా కన్యకే అయినా, ఆమె తల్లి కాబోతుందని గబ్రియేలు దూత ఆమెతో చెప్పాడు. యెహోవా గొప్ప అద్భుతం చేసి ఆమె అలా గర్భం దాల్చేలా చూశాడు. “సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును” అని గబ్రియేలు దూత మరియకు వివరించాడు.— లూకా 1:30-35.

దేవుడు పరలోకంలో ఉన్న తన కుమారుడి ప్రాణాన్ని మరియ గర్భంలోకి మార్చాడు. ఆ తర్వాత మాములుగా తల్లి కడుపులో బిడ్డ ఎలా పెరుగుతుందో అలాగే పెరిగి దాదాపు తొమ్మిది నెలల తర్వాత యేసు పుట్టాడు. ఈ మధ్యలో యోసేపు మరియను పెళ్లి చేసుకున్నాడు అందుకే చాలామంది యేసు కన్నతండ్రి యోసేపు అనుకున్నారు. నిజానికి, యోసేపు యేసును పెంచిన తండ్రి. కాబట్టి ఒకరకంగా చెప్పాలంటే, యేసుకు ఇద్దరు తండ్రులు!

యేసు 12 సంవత్సరాలకే, తన పరలోక తండ్రియైన యెహోవా అంటే తనకెంత ఇష్టమో చూపించాడు. అప్పుడు, యేసువాళ్లు ప్రతీ సంవత్సరంలాగే పస్కా జరుపుకోవడానికి చాలా దూరం ప్రయాణం చేసి యెరూషలేముకు వెళ్లారు. ఆ తర్వాత నజరేతుకు తిరిగి వస్తున్నప్పుడు యేసు తమతోపాటు రావడంలేదని యోసేపు మరియలు గమనించలేదు. వాళ్లు ఆయనను మరచిపోయారంటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుందా?—

అప్పటికి యోసేపు మరియలకు వేరే పిల్లలు కూడా ఉన్నారు. (మత్తయి 13:55, 56) బహుశ వాళ్లతోపాటు వాళ్ల బంధువులు అంటే మరియ చెల్లెలు సలోమె, ఆమె భర్త జెబెదయి, వాళ్ల పిల్లలు యాకోబు, యోహాను ప్రయాణం చేస్తుండవచ్చు. కాబట్టి యేసు ఆ బంధువులతో పాటు ఉన్నాడని మరియ అనుకొనివుంటుంది.— మత్తయి 27:56; మార్కు 15:40; యోహాను 19:25.

అయితే యేసు అక్కడ లేడని యోసేపు, మరియ చూసుకున్నప్పుడు కంగారుగా యెరూషలేముకు తిరిగి వెళ్లారు. వాళ్లు తమ కొడుకు కోసం ఆందోళనగా వెతికారు. మూడవ రోజున ఆయన వాళ్లకు ఆలయంలో కనిపించాడు. అప్పుడు మరియ ఆయనతో, “మా పట్ల నువ్వెందుకిలా వ్యవహరించావు? ఇదిగో, నీ తండ్రీ, నేనూ ఆతురతతో నీ కోసం గాలిస్తూ ఉన్నాం” అని అంది. కానీ యేసు, “నా కోసం మీరెందుకు వెదుకుతూ ఉన్నారు? నేను నా తండ్రి ఇంట్లో ఉండాలని మీకు తెలియదా?” అని అడిగాడు.— లూకా 2:45-50, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

యేసు తన తల్లికి అలా సమాధానం చెప్పడం తప్పని మీకు అనిపిస్తుందా?— అయితే, దేవుని ఆలయంలో ఆరాధించడమంటే యేసుకు ఎంతో ఇష్టమని ఆయన తల్లిదండ్రులకు తెలుసు. (కీర్తన 122:1) కాబట్టి తనకోసం వాళ్లు ముందుగా వెతకాల్సింది దేవుని ఆలయంలోనే అని ఆయన అనుకోవడం సరైనదే కదా?— యేసు అన్నదాని గురించి మరియ ఆ తర్వాత చాలాసార్లు ఆలోచించింది.

యోసేపు, మరియలతో యేసు ఎలా ఉండేవాడు?— “[యేసు] వారితో కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడియుండెను” అని బైబిలు చెబుతోంది. (లూకా 2:51, 52) యేసును చూసి మనమేమి నేర్చుకోవచ్చు?— మనం కూడా మన అమ్మానాన్నల మాటవింటూ వాళ్లకు లోబడివుండాలి.

కానీ, విధేయత చూపించడం, చివరికి తన పరలోక తండ్రికి విధేయత చూపించడం కూడా యేసుకు కొన్నిసార్లు కష్టమయ్యింది!

యేసు చనిపోవడానికి ముందు రాత్రి, తాను చేయాలని యెహోవా కోరుకుంటున్నదాన్ని చేసే విషయంలో మనసు మార్చుకునే వీలుందా అని ఆయనను అడిగాడు. (లూకా 22:42) దేవుడు కోరింది చేయడం కష్టం అనిపించినా యేసు విధేయత చూపించాడు. “ఆయన . . . తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను” అని బైబిలు చెబుతోంది. (హెబ్రీయులు 5:8) మనం కూడా ఆ పాఠాన్ని నేర్చుకోవచ్చని మీరు అనుకుంటున్నారా?—(w10-E 04/01)

a మీరు చిన్నపిల్లలతో కలిసి చదువుతుంటే, గీత దగ్గర ఆగి అక్కడున్న ప్రశ్నకు జవాబు చెప్పమని అడగండి.