కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యం గురించి యేసు ఏమి బోధించాడు?

దేవుని రాజ్యం గురించి యేసు ఏమి బోధించాడు?

దేవుని రాజ్యం గురించి యేసు ఏమి బోధించాడు?

‘ఆయన దేవుని రాజ్యసువార్త ప్రకటిస్తూ ప్రతీ పట్టణంలో, ప్రతీ గ్రామంలో సంచారము చేశాడు.’—లూకా 8:1.

మనకు ప్రాముఖ్యమైన విషయాల గురించి, మన మనసుకు నచ్చిన విషయాల గురించి మాట్లాడడానికి ఇష్టపడతాం. యేసు చెప్పినట్లు, ‘హృదయంలో నిండివున్న దానినిబట్టి నోరు మాట్లాడుతుంది.’ (మత్తయి 12:34) యేసు తన ప్రకటనా పనిలో మాట్లాడిన విషయాలను గమనిస్తే, దేవుని రాజ్యం ఆయనకు చాలా ఇష్టమైన అంశమని అర్థమౌతుంది.

దేవుని రాజ్యం అంటే ఏమిటి? దేవుని రాజ్యం అంటే దేవుడు స్థాపించిన రాజ్యం. దేవుని రాజ్యం గురించి యేసు ఎన్నో విషయాలు చెప్పాడు, ఆయన సందేశానికి అదే ముఖ్యాంశం. బైబిల్లోని నాలుగు సువార్తల్లో ఆ రాజ్యం గురించి 110 కంటే ఎక్కువసార్లు ఉంది. అయితే దేవుని రాజ్యాన్ని గురించి, అది ఏమి చేస్తుందనే దాని గురించి యేసు మాటల ద్వారానే కాదు క్రియల ద్వారా కూడా బోధించాడు.

దానికి రాజు ఎవరు? దేవుని రాజ్యానికి రాజు మనుష్యులు ఓట్లేసి ఎన్నుకునే వ్యక్తి కాదు. ఆ రాజును దేవుడే ఎంచుకున్నాడు. దేవుని రాజ్యానికి రాజుగా దేవుడు ఎంచుకున్నది తననేనని యేసు తన బోధలలో చూపించాడు.

కలకాలం ఉండే దేవుని రాజ్యాన్ని వాగ్దత్త మెస్సీయ పరిపాలిస్తాడని బైబిలు ప్రవచనాలు ముందే చెప్పినట్లు యేసుకు తెలుసు. (2 సమూయేలు 7:12-14; దానియేలు 7:13, 14; మత్తయి 26:63, 64) ముందే చెప్పబడిన ఆ మెస్సీయ తానేనని యేసు బాహాటంగా చెప్పాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలా చెప్పడం ద్వారా, దేవుడు నియమించిన రాజు తానేనని యేసు అంగీకరించాడు. (యోహాను 4:25, 26) అందుకే, యేసు “నా రాజ్యము” అనే పదాన్ని చాలాసార్లు ఉపయోగించాడు.—యోహాను 18:36.

ఆ రాజ్యంలో ఇతరులు తనతోపాటు పరిపాలిస్తారని కూడా యేసు బోధించాడు. (లూకా 22:28-30) ఈ తోటి పరిపాలకుల్ని ఆయన “చిన్న మంద” అన్నాడు, ఎందుకంటే వాళ్లు పరిమిత సంఖ్యలో మాత్రమే ఉంటారు. ఆయన వాళ్ల గురించి మాట్లాడుతూ, “మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది” అని అన్నాడు. (లూకా 12:32) క్రీస్తుతో పాటు పరిపాలించేవారు మొత్తం 1,44,000 మంది ఉంటారని బైబిల్లోని చివరి పుస్తకం చూపిస్తోంది.—ప్రకటన 5:9, 10; 14:1.

ఆ రాజ్యం ఎక్కడ నుండి పరిపాలిస్తుంది? “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు” అని పొంతి పిలాతు అనే రోమా పరిపాలకుడితో యేసు అన్నాడు. (యోహాను 18:36) క్రీస్తు రాజుగా ఉండే దేవుని రాజ్యం మానవ ప్రతినిధుల ద్వారా పాలన సాగించదు. దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ యేసు చాలాసార్లు, “పరలోకరాజ్యము” అని అన్నాడు. a (మత్తయి 4:17; 5:3, 10, 19, 20) కాబట్టి దేవుని రాజ్యం పరలోకం నుండి పరిపాలిస్తుంది.

యేసు, భూమ్మీద కొంతకాలం గడిపిన తర్వాత తప్పకుండా పరలోకానికి తిరిగి వెళ్తానని నమ్మకంతో ఉన్నాడు. అక్కడ తన తోటిపరిపాలకులు తనతోపాటు పరిపాలించడానికి వీలుగా వారికోసం ‘స్థలం సిద్ధపరుస్తాను’ అని చెప్పాడు.—యోహాను 14:2, 3.

ఆ రాజ్యం ఏమి చేస్తుంది? “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,” అని దేవునికి ప్రార్థించమని యేసు తన బోధ వింటున్నవారితో చెప్పాడు. (మత్తయి 6:9, 10) దేవుని చిత్తం పరలోకంలో జరుగుతుంది. ఆ రాజ్యం ద్వారానే దేవుడు తాను భూమి కోసం చేయాలనుకున్నది చేస్తాడు. అది సాధించడానికి, ఆ రాజ్యం ఈ భూమ్మీద పెద్దపెద్ద మార్పులు తీసుకొస్తుంది.

ఆ రాజ్యం భూమ్మీద ఏమి చేస్తుంది? దేవుని రాజ్యం చెడ్డ పనులు చేస్తూ ఉండేవారిని నిర్మూలించి, చెడు లేకుండా చేస్తుందని యేసు బోధించాడు. (మత్తయి 25:31-34, 46) అంటే అవినీతి, దుష్టత్వం ఇక ఏ రూపంలోనూ లేకుండాపోతాయి. భూమంతటా “సాత్వికులు,” నీతిమంతులు, కనికరంగలవారు, “హృదయశుద్ధిగలవారు,” సమాధానపరిచేవారు ఉంటారని యేసు బోధించాడు.—మత్తయి 5:5-9.

అలాంటి నమ్మకస్థులు కలుషితమైపోయిన భూగ్రహం మీద జీవించాల్సివస్తుందా? ఎంతమాత్రం కాదు! దేవుని రాజ్యంలో అద్భుతమైన మార్పులు వస్తాయని యేసు మాటిచ్చాడు. యేసుతో పాటు మరణశిక్ష వేయబడిన వ్యక్తి ఆయనతో, “యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము” అని అన్నాడు. దానికి జవాబుగా ఆయన, “నేడు, నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను” అని చెప్పాడు. (లూకా 23:42, 43) అవును, దేవుని రాజ్యం భూమిని పరదైసులా అంటే ఏదెను తోట ఎలా ఉండేదో అలా మారుస్తుంది.

ఆ రాజ్యం మానవజాతి కోసం ఇంకా ఏమేమి చేస్తుంది? దేవుని రాజ్యం చేసే వాటి గురించి యేసు మాటివ్వడం మాత్రమే కాదు, అది ఏమి చేయబోతుందో చూపించాడు కూడా. యేసు ఎన్నోసార్లు, ఎంతోమందిని అద్భుతంగా బాగుచేశాడు. అలా, తన రాజ్యపరిపాలనలో భూవ్యాప్తంగా చేయబోయేవాటిని మచ్చుకు చేసి చూపించాడు. దేవుని ఆత్మ సహాయంతో మత్తయి రాసిన సువార్తలో యేసు గురించి ఏమి ఉందంటే, “యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.”—మత్తయి 4:23.

యేసు ఎన్నో రకాల వ్యాధులను నయం చేశాడు. ఆయన ‘పుట్టు గ్రుడ్డివాని కళ్ళు తెరిచాడు.’ (యోహాను 9:1-7, 32, 33) అసహ్యమైన కుష్ఠురోగమున్న వ్యక్తిని సున్నితంగా ముట్టి బాగుచేశాడు. (మార్కు 1:40-42) “చెవుడుగల నత్తివానిని” యేసు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆయన వానిని బాగుచేసి, ‘చెవిటి వారు వినేలా, మూగవారు మాట్లాడేలా’ చేయగలడని చూపించాడు.—మార్కు 7:31-37.

దేవుడు నియమించిన రాజు ముందు మృత్యువు కూడా తలవంచింది. యేసు చనిపోయిన వారిని బ్రతికించిన మూడు సందర్భాల గురించి బైబిలు చెబుతోంది. ఒక విధవరాలి ఒక్కగానొక్క కొడుకు, 12 సంవత్సరాల ఒక అమ్మాయి, ఆయన ప్రియ స్నేహితుడైన లాజరు చనిపోతే వారిని బ్రతికించాడు.—లూకా 7:11-15; 8:41-55; యోహాను 11:38-44.

దేవుని రాజ్యంలో ఉండే ప్రజలు అనుభవించబోయే అద్భుతమైన భవిష్యత్తు ఎలా ఉంటుందో యేసు వివరించాడు. దాని గురించి అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: ‘ఇదిగో దేవుని నివాసం మనుషులతో ఉంది, ఆయన వారితో కాపురముంటాడు, వారాయన ప్రజలైవుంటారు, దేవుడు తానే వారి దేవుడైవుండి వారికి తోడైవుంటాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేస్తాడు, మరణం ఇక ఉండదు. దుఃఖం, ఏడ్పు, వేదనా ఇక ఉండవు. మొదటి సంగతులు గతించిపోయాయి.’ (ప్రకటన 1:1; 21:3, 4) కన్నీళ్లు, బాధా, మరణం లేని లోకాన్ని ఒక్కసారి ఊహించండి! అప్పుడు, దేవుని చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లే భూమ్మీద కూడా జరగాలని చేసే ప్రార్థన పూర్తిగా నిజమౌతుంది.

దేవుని రాజ్యం ఎప్పుడొస్తుంది? యేసు, తాను రాజ్యాధికారాన్ని చేపట్టడం, అలాగే “యుగసమాప్తి” అని ఆయన చెప్పిన ఒక ప్రత్యేకమైన కాలం ఒకేసారి మొదలౌతాయని బోధించాడు. యేసు తాను రాజుగా ఎప్పటి నుండి అధికారాన్ని చేపడతాడో సూచించే కొన్ని వివరాలను ముందే తెలియజేశాడు. ఆ కాలంలో ప్రపంచమంతటా యుద్ధాలు, కరవులు, భూకంపాలు, తెగుళ్లు, అక్రమం పెరిగిపోవడం వంటివి ఉంటాయని ఆయన చెప్పాడు. (మత్తయి 24:3, 7-12; లూకా 21:10, 11) ఇవీ, యేసు చెప్పిన అనేక ఇతర అంశాలూ ప్రాముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం మొదలైన 1914 నుండి జరుగుతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, యేసు ఇప్పుడు రాజుగా పరిపాలిస్తున్నాడు. త్వరలోనే ఆ రాజ్యపరిపాలన ఇక్కడ ప్రారంభమై, దేవుని చిత్తం భూమ్మీద జరిగే సమయం వస్తుంది. b

దేవుని రాజ్యపరిపాలన వల్ల వచ్చే ప్రయోజనాలను మీరెలా పొందవచ్చు? యేసు ఇచ్చిన సందేశానికి మీరెలా ప్రతిస్పందిస్తారనే దాన్నిబట్టి అది ఉంటుంది. (w10-E 04/01)

[అధస్సూచీలు]

a “పరలోకరాజ్యము” అనే పదం మత్తయి సువార్తలో దాదాపు 30 సార్లు ఉంది.

b దేవుని రాజ్యపరిపాలన త్వరలోనే ఇక్కడ మొదలౌతుందని ఎలా చెప్పవచ్చో వివరంగా తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని “మనం ‘అంత్యదినములలో’ జీవిస్తున్నామా?” అనే 9వ అధ్యాయం చూడండి.