మీ పిల్లలకు నేర్పించండి
పౌలు మేనల్లుడు—ఆయన తన మామయ్యను రక్షించాడు
అ పొస్తలుడైన పౌలు బంధువుల్లో కొందరు యేసు అనుచరులుగా ఉన్నారని మీకు తెలుసా? *— పౌలు సహోదరి, ఆమె కొడుకు యేసు అనుచరులని లేఖనాలు చూపిస్తున్నాయి. ఆ మేనల్లుడే పౌలును రక్షించాడు. అతని పేరు, అతని తల్లి పేరు మనకు తెలీదు గానీ అతను చేసింది మాత్రం మనకు తెలుసు. అతనేమి చేశాడో తెలుసుకోవాలని ఉందా?—
బహుశా అది సా.శ. 56వ సంవత్సరం అయ్యుంటుంది. అప్పుడు పౌలు తన మూడవ మిషనరీ యాత్ర ముగించుకొని యెరూషలేముకు వచ్చాడు. అక్కడ పౌలును బంధించి, విచారణ కోసం కావలిలో ఉంచారు. కానీ పౌలును విచారణ కోసం అలా ఉంచడం ఆయన శత్రువులకు ఇష్టంలేదు. ఆయన చనిపోవాలన్నదే వాళ్ల ఉద్దేశం. అందుకే వాళ్లు ఆయనను చంపడానికి దాదాపు 40 మందిని దారిలో కాపలా పెట్టారు.
ఎలాగోకానీ పౌలు మేనల్లుడికి ఈ విషయం తెలిసింది. అప్పుడు అతను ఏమి చేశాడో తెలుసా?— అతను పౌలు దగ్గరకు వెళ్లి ఆ విషయాన్ని చెప్పాడు. వెంటనే పౌలు శతాధిపతితో, ‘ఈ చిన్నవాడిని సహస్రాధిపతి దగ్గరికి తీసుకొనిపొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకోవాలనివున్నాడు’ అని చెప్పాడు. ఆ శతాధిపతి అతన్ని సహస్రాధిపతియైన క్లౌదియ లూసియ దగ్గరకు తీసుకెళ్లి ఆ యువకుడు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాడని చెప్పాడు. క్లౌదియ పౌలు మేనల్లుడిని పక్కకు తీసుకుపోయినప్పుడు ఆ యువకుడు, పౌలును చంపడానికి శత్రువులు పన్నిన పన్నాగం గురించి చెప్పాడు.
క్లౌదియ, ‘నీవు ఈ సంగతి నాకు తెలిపావని ఎవరితో చెప్పకు’ అని ఆ యువకున్ని హెచ్చరించాడు. తర్వాత ఆయన ఇద్దరు శతాధిపతులను పిలిచి 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెలవారిని కైసరయకు పోవడానికి సిద్ధపరచమని చెప్పాడు. ఆ రాత్రి తొమ్మిది గంటలకి, పౌలును సురక్షితంగా కైసరయకు తీసుకెళ్లి రోమా అధిపతియైన ఫేలిక్సు ముందు హాజరుపర్చడానికి 470 మంది బయల్దేరారు. పౌలును చంపడానికి శత్రువులు పన్నిన పన్నాగం గురించి క్లౌదియ ఫేలిక్సుకు ఒక ఉత్తరంలో తెలిపాడు.
కాబట్టి, యూదులు పౌలు మీద తమ ఆరోపణలను చెప్పుకోవడానికి కైసరయలోని మహాసభకు వెళ్లాల్సి వచ్చింది. అయితే, పౌలు ఏదైనా తప్పు చేశాడనడానికి వాళ్లదగ్గర ఏ ఆధారాలూ లేవు. అయినా, పౌలు అన్యాయంగా రెండు సంవత్సరాలు బంధీగా ఉన్నాడు. కాబట్టి, తన వాదనను కైసరుకు విన్నవించుకుంటానని ఆయన అనడంతో ఆయనను రోముకు తీసుకెళ్లారు.—అపొస్తలుల కార్యములు 23:16–24:27; 25:8-12.
యోహాను 7:1; 15:13; మత్తయి 24:14; 28:18-20.
పౌలు మేనల్లుడి గురించిన ఈ వృత్తాంతం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?— ఇతరులు తెలుసుకోవాల్సిన విషయాలను వాళ్లకు చెప్పాలంటే ఎంతో ధైర్యం అవసరమనీ అలా చెప్పినప్పుడు మనం ఇతరులను రక్షించవచ్చని నేర్చుకున్నాం. యేసు తన శత్రువులు ‘తనను చంపడానికి వెదుకుతున్నారని’ తెలిసినప్పుడు కూడా ఆయన దేవుని రాజ్యం గురించి ప్రజలకు ప్రకటించాడు. మనం కూడా అలాగే చేయాలని ఆయన చెప్పాడు. మరి మనమలా చేస్తామా? పౌలు మేనల్లుడికి ఉన్నలాంటి ధైర్యం మనకూ ఉంటే మనం అలాగే చేస్తాం.—పౌలు తన యువ స్నేహితుడైన తిమోతికి ఇలా రాశాడు: “నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.” (1 తిమోతి 4:16) పౌలు మేనల్లుడు తన మామయ్య ఇచ్చిన అలాంటి ప్రోత్సాహాన్ని అన్వయించుకున్నాడని స్పష్టమవుతోంది. మీరు కూడా అలాగే చేస్తారా? (w09 6/1)
^ పేరా 3 మీరు చిన్నపిల్లలతో కలిసి చదువుతుంటే, గీత దగ్గర ఆగి అక్కడున్న ప్రశ్నకు జవాబు చెప్పమని అడగండి.