దేవునికి ఒక పేరుందా?
దేవునికి ఒక పేరుందా?
చాలామంది ఏమంటారంటే . . .
▪ “దేవునికి ప్రత్యేకంగా ఒక పేరంటూ ఏమీ లేదు.
▪ ఆయన ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు.”
యేసు ఏమి చెప్పాడంటే . . .
▪ ‘మీరు ఇలా ప్రార్థనచేయండి,—పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక.’ (మత్తయి 6:9) దేవునికి ఒక పేరుందని యేసు నమ్మాడు. ▪ “నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదనని చెప్పెను.” (యోహాను 17:26) యేసు దేవుని పేరును అందరికీ తెలియజేశాడు.
▪ “ప్రభువు [యెహోవా] పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాననెను.” (లూకా 13:35; కీర్తన 118:26) యేసు దేవుని పేరును వాడాడు.
“యెహోవాను నేనే; ఇదే నా నామము” అని దేవుడే స్వయంగా తన పేరును బైబిల్లో రాయించాడు. * దేవుడే స్వయంగా తన పేరేంటో చెప్పాడు. (యెషయా 42:8) దేవుడు తనకు పెట్టుకున్న హెబ్రీ పేరును తెలుగులో ఎక్కువగా యెహోవా అని పలుకుతారు. దేవునికి మాత్రమే ఉన్న ఈ హెబ్రీ పేరు ప్రాచీన బైబిలు చేతిరాత ప్రతుల్లో కొన్ని వేలసార్లు ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి బైబిల్లో ఈ పేరు ఉన్నన్నిసార్లు ఇంకే పేరూ లేదు.
“దేవుని పేరు ఏంటి?” అని అడిగితే కొందరు “దేవుడంటే దేవుడే ఆయన్ని ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు” అని అంటారు. వారిచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, “ఎన్నికల్లో ఎవరు గెలిచారు?” అని అడిగితే “అభ్యర్థి గెలిచాడు” అని చెప్పినట్లు ఉంటుంది. “దేవుడు” అని చెప్పినా, పోటీచేసిన “అభ్యర్థి” అని చెప్పినా అవి అడిగిన ప్రశ్నకు స్పష్టమైన జవాబులు కావు.
దేవుడు తన పేరును మనకెందుకు తెలియజేశాడు? తన గురించి మనం బాగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే తెలియజేశాడు. ఒకే వ్యక్తిని ఆయన దగ్గర పనిచేసేవారు సార్ అనీ, పిల్లలు నాన్నా అనీ, మనుమలు తాతయ్యా అని పిలుస్తారు. అలా పిలవడం విన్నప్పుడు ఆ వ్యక్తి వారికి ఫలానా అని మాత్రమే తెలుస్తుంది. కానీ ఆయన పేరు విన్నప్పుడు మాత్రమే ఆయన గురించి మనకు తెలిసిన వివరాలన్నీ గుర్తొస్తాయి. అలాగే దేవుణ్ణి ప్రభువు, సర్వశక్తిమంతుడు, తండ్రి, సృష్టికర్త అని పిలిచినప్పుడు కేవలం ఆయన హోదా ఏమిటో తెలుస్తుంది. అయితే, యెహోవా అన్న పేరు విన్నప్పుడు మాత్రమే దేవుని గురించి మనకు తెలిసిందంతా గుర్తొస్తుంది. దేవుని పేరేంటో కూడా తెలియకుండా దేవుని గురించి మనమెలా తెలుసుకోగలం?
దేవుని పేరు తెలుసుకుంటే సరిపోదు కానీ దాన్ని ఉపయోగించడం కూడా ప్రాముఖ్యం. ఎందుకు? ఎందుకంటే ‘యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేసే వారందరూ రక్షింపబడతారు’ అని బైబిలు చెబుతోంది.—యోవేలు 2:32; రోమీయులు 10:13. (w09 2/1)
[అధస్సూచి]
^ పేరా 8 దేవుని పేరుకి అర్థమేమిటో, కొన్ని బైబిలు అనువాదాల్లో ఆ పేరు ఎందుకు లేదో తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలోని 195-197 పేజీలను చూడండి.
[6వ పేజీలోని బ్లర్బ్]
ఒకే వ్యక్తిని సార్ అనీ, నాన్న అనీ, తాతయ్య అనీ రకరకాలుగా పిలుస్తారు. కానీ ఆయన పేరు విన్నప్పుడు మాత్రమే ఆయన గురించి మనకు తెలిసిన వివరాలన్నీ గుర్తొస్తాయి