ఆయన మన బాధను అర్థం చేసుకుంటాడు
దేవునికి దగ్గరవ్వండి
ఆయన మన బాధను అర్థం చేసుకుంటాడు
ఇతరుల బాధలో మానసికంగా పాలుపంచుకోగల అమూల్యమైన సామర్థ్యాన్ని తదనుభూతి అంటారు. ఈ తదనుభూతిని చూపించడంలో యెహోవాదేవుడు ఉత్తమమైన మాదిరిగా ఉన్నాడు. తన ప్రజలు అనుభవిస్తున్న బాధను ఆయన స్వయంగా అనుభవిస్తాడు. ఆ విషయంలో మనమెలా నిశ్చయత కలిగివుండవచ్చు? యెహోవా చూపించే ప్రేమపూర్వకమైన తదనుభూతిని, యేసు భూమిపై ఉన్నప్పుడు తన మాటల్లో, క్రియల్లో పరిపూర్ణంగా చూపించాడు. (యోహాను 5:19) ఉదాహరణకు, యోహాను 11:33-35లో వర్ణించబడిన సంఘటనను పరిశీలించండి.
యేసు స్నేహితుడైన లాజరు అకస్మాత్తుగా చనిపోయినప్పుడు, ఆయన లాజరు ఉండే గ్రామానికి బయలుదేరాడు. లాజరు సహోదరీలైన మరియ, మార్తలు ఎంతో దుఃఖించడం అర్థంచేసుకోదగినదే. యేసు ఆ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించాడు. (యోహాను 11:5) అయితే ఆయన అప్పుడు ఏమి చేశాడు? ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: “ఆమె [మరియ] ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు—అతని నెక్కడ నుంచితిరని అడుగగా, వారు—ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను.” (యోహాను 11:33-35) ఆయన ప్రియ స్నేహితుడైన లాజరు చనిపోయాడు, కానీ యేసు ఆయనను తిరిగి బ్రతికించబోతున్నాడు కదా, మరి యేసు ఎందుకు ఏడ్చాడు? (యోహాను 11:41-44) యేసు అలా ఏడ్వడానికి వేరే కారణమేదైనా ఉందా?
పైన ఉల్లేఖించబడిన పదాలను మళ్ళీ చూడండి. మరియ, ఆమెతో ఉన్నవారు ఏడ్వడాన్ని యేసు చూసినప్పడు ఆయన ‘కలవరపడి, మూలగడాన్ని’ గమనించండి. ఇక్కడ ఉపయోగించబడిన మూలభాషలోని పదాలు తీవ్రమైన మనోభావాలను సూచిస్తున్నాయి. a యేసు తాను చూసినదాన్నిబట్టి ఎంతో చలించిపోయాడు. ఆయన కళ్ళలో ఉబికిన కన్నీటినిబట్టి ఆయనెంత బాధపడ్డాడో తెలుస్తుంది. ఇతరులు అనుభవిస్తున్న బాధను చూసి యేసు హృదయం చలించిపోయిందని స్పష్టమవుతోంది. మీరు ప్రేమించేవారెవరైనా దుఃఖిస్తున్నప్పుడు మీకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయా?—రోమీయులు 12:15.
యేసు చూపించిన తదనుభూతి, ఆయన తండ్రియైన యెహోవా లక్షణాలను, విధానాలను ఎక్కువగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది. యేసు తన తండ్రి లక్షణాలను ఎంతో పరిపూర్ణంగా ప్రతిబింబించాడని గుర్తుతెచ్చుకోండి, అందుకే ఆయనిలా చెప్పగలిగాడు: “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు.” (యోహాను 14:9) కాబట్టి “యేసు కన్నీళ్లు విడిచెను” అని మనం చదివినప్పుడు, యెహోవా తన ఆరాధకుల బాధను తాను స్వయంగా అనుభవిస్తాడని మనం నిశ్చయత కలిగివుండవచ్చు. నిజానికి, ఈ వాస్తవాన్ని ఇతర బైబిలు రచయితలు కూడా ధృవీకరిస్తున్నారు. (యెషయా 63:9; జెకర్యా 2:8) యెహోవాదేవుడు ఎంత ప్రేమగలవాడో కదా!
తదనుభూతి చూపించే ప్రజలకు మనం ఆకర్షించబడతాం. మనం నిరుత్సాహపడుతున్నప్పుడు లేదా కృంగుదలకు గురైనప్పుడు మన పరిస్థితిని అర్థంచేసుకుని, మన బాధను పంచుకొనే తోటి మానవులకు దగ్గరవుతాం. మన బాధను స్వయంగా అనుభవించే, మన కన్నీళ్ళకు కారణాన్ని అర్థం చేసుకొనే వాత్సల్యంగల దేవుడైన యెహోవాకు ఇంకెంత దగ్గరవుతామో కదా!—కీర్తన 56:8. (w 08 5/1)
[అధస్సూచి]
a “కన్నీళ్లు విడిచాడు” అని అనువదించబడిన గ్రీకు పదం “మౌనంగా ఏడ్వడాన్ని” సూచిస్తుంది. అయితే మరియ, ఇంకా ఇతరులు ఏడ్వడాన్ని వర్ణించడానికి ఉపయోగించబడిన పదం, “బిగ్గరగా ఏడ్వడాన్ని, విలపించడాన్ని” సూచిస్తుంది.