మరణించినవారికి తిరిగి జీవాన్ని ఇవ్వగలడు
దేవునికి దగ్గరవ్వండి
మరణించినవారికి తిరిగి జీవాన్ని ఇవ్వగలడు
మీ ఆత్మీయులు ఎవరైనా చనిపోయారా? అలాగైతే మీరు జీవితంలో అత్యంత దుఃఖకర పరిస్థితిని అనుభవించారు. మన సృష్టికర్త మీ దుఃఖాన్ని అర్థం చేసుకోగలడు. దేవుడు అలా అర్థం చేసుకోవడమేకాదు, మరణంవల్ల కలిగిన నష్టాన్ని ఆయన పూరించగలడు. ఆయన జీవదాత మాత్రమే కాదు, మరణించినవారికి తిరిగి జీవాన్ని కూడా ఇవ్వగలడని నిరూపించడానికి గతంలో చనిపోయినవారిని అలా తిరిగి బ్రతికించిన నివేదికలను బైబిల్లో నమోదు చేయించిపెట్టాడు. పునరుత్థానం చేయడానికి దేవుడు తన కుమారునికి శక్తినిచ్చిన ఒక సంఘటనను మనం పరిశీలిద్దాం. లూకా 7:11-15లో ఆ అద్భుతం గురించి వ్రాయబడింది.
అది సా.శ. 31వ సంవత్సరంలో జరిగింది. యేసు గలిలయలోని నాయీను అనే ఊరికి వెళ్తున్నాడు. (11వ వచనం) ఆయన ఊరి పొలిమేరల దగ్గరకు వచ్చేసరికి బహుశా సాయంకాలమైవుంటుంది. బైబిలు ఇలా చెబుతోంది: “ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చినప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి.” (12వ వచనం) విధవరాలైన ఆ తల్లి ఎంత దుఃఖిస్తూ ఉంటుందో మీరు ఊహించగలరా? ఒక్కగానొక్క కుమారుని మరణంతో ఆమె రెండవసారి తనను సంరక్షించే, పోషించే ఆసరాను కోల్పోయింది.
మరణించిన తన కుమారుని పాడె పక్కనే దుఃఖిస్తూ నడుస్తున్న ఆ తల్లిని యేసు గమనించాడు. ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: ‘ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి—ఏడువవద్దని ఆమెతో చెప్పాడు.’ (13వ వచనం) యేసు ఆ విధవరాలి దుఃఖాన్ని చూసి ఎంతో చలించిపోయాడు. బహుశా అప్పటికే విధవరాలిగావున్న తన తల్లి త్వరలోనే తన గురించి కూడా అలాగే దుఃఖించబోతోందని యేసు ఆలోచించి ఉండవచ్చు.
యేసు ఆ పాడెను సమీపించాడు, అయితే ఆ జనులతో కలిసివెళ్లాలనే ఉద్దేశంతో కాదు. తనకు అధికారం ఉందని చూపిస్తూ ఆయన ‘పాడెను ముట్టడంతో’ దాన్ని మోస్తున్నవారు ఆగిపోయారు. అప్పుడాయన మరణంపై అధికారం ఇవ్వబడిన వ్యక్తి మాట్లాడినట్లుగా మాట్లాడుతూ: “చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను.” (14, 15 వచనాలు) ఆ చిన్నవాడు మరణించినప్పుడు ఆయన తన తల్లికి దూరమైపోయాడు. కాబట్టి యేసు అతణ్ణి ‘అతని తల్లికి అప్పగించినప్పుడు’ ఆ కుటుంబం మళ్ళీ ఒకటైంది. ఆ విధవరాలి హృదయంలోని దుఃఖమంతా ఎగిరిపోగా అంతులేని ఆనందంతో ఆమె ఉప్పొంగిపోయింది.
మరణించిన మీ ఆత్మీయులను తిరిగి కలుసుకునే ఆ మధుర క్షణాలకోసం మీ మనసు ఉవ్విళ్ళూరుతోందా? దేవుడు మీ దుఃఖాన్ని కూడా నిశ్చయంగా అర్థంచేసుకుంటాడు. యేసు దుఃఖిస్తున్న ఆ విధవరాలి బాధను అర్థం చేసుకోవడం, దేవుని కనికరాన్ని వెల్లడిచేసింది, ఎందుకంటే యేసు తన తండ్రిని పరిపూర్ణంగా అనుకరించాడు. (యోహాను 14:9) దేవుడు తన జ్ఞాపకంలో ఉన్న మృతులను తిరిగి బ్రతికించేందుకు ఇష్టపడుతున్నాడని లేదా పరితపిస్తున్నాడని బైబిలు తెలియజేస్తోంది. (యోబు 14:14, 15) మనం పరదైసు భూమిపై జీవించే, మన ఆత్మీయులు మరలా బ్రతికించబడడాన్ని చూసే అద్భుతమైన నిరీక్షణను ఆయన వాక్యమైన బైబిలు మనకు ఇస్తోంది. (లూకా 23:43; యోహాను 5:28, 29) మరణించినవారికి తిరిగి జీవాన్ని ఇచ్చేవాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకొని, ఆ నిరీక్షణను మీ సొంతం చేసుకోవాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. (w 08 3/1)
[11వ పేజీలోని చిత్రం]
“చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను”