మనమెలా ఉనికిలోకి వచ్చాము?
మనమెలా ఉనికిలోకి వచ్చాము?
ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం ఎందుకంత ప్రాముఖ్యం? భూమ్మీద జీవం యాదృచ్ఛికంగా ఉనికిలోకి వచ్చిందని చాలామందికి బోధించబడుతోంది. వరుసగా అసాధ్యమైన, యాదృచ్ఛికమైన సంఘటనలు జరిగిన పరిణామ క్రమంవల్లే మానవులు ఉనికిలోకి వచ్చారని, ఆ పరిణామ క్రమంలోనే వారికి భావావేశాలు, మేధస్సు, జీవిత పరమార్థాన్ని వెదికే కోరిక కలిగాయని వారికి బోధించబడింది.
కానీ దీని గురించి ఒకసారి ఆలోచించండి: మనం నిజంగా పరిణామ క్రమం ద్వారా ఉనికిలోకి వచ్చివుంటే, అసలు సృష్టికర్తే లేకపోతే మానవజాతి చెప్పాలంటే ఒక విధంగా అనాథే అవుతుంది. మానవజాతి సలహాల కోసం సంప్రదించడానికి ఉన్నత జ్ఞాని అంటూ ఎవరూ ఉండరు, మన సమస్యలను పరిష్కరించుకోవడానికి మనకు సహాయం చేసేవారు ఎవరూ ఉండరు. పర్యావరణానికి సంభవించబోయే ముప్పును తప్పించడానికి, రాజకీయ సంఘర్షణలను, మన స్వంత సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం మానవ జ్ఞానంపై ఆధారపడాల్సివుంటుంది.
మనం మానవ జ్ఞానంపై ఆధారపడాలనే ఆలోచన మీకు మనశ్శాంతిని ఇస్తుందా? అలా కాకపోతే, మనకన్నా ఉన్నతమైన జ్ఞానంగల వ్యక్తిపై ఆధారపడడం మనశ్శాంతిని ఇస్తుందేమో ఆలోచించండి. ఆ ఆలోచన ఆకర్షణీయంగా ఉండడమేకాక, సహేతుకంగా కూడా ఉంటుంది.
బైబిలు ఇస్తున్న జవాబు ఏమిటి?
మానవులను దేవుడే సృష్టించాడని బైబిలు బోధిస్తోంది. ప్రేమకు, జ్ఞానానికి ఏ మాత్రం తావు లేని పరిణామ క్రమం ద్వారా మనం ఉనికిలోకి రాలేదు. బదులుగా, మనం ప్రేమగల, జ్ఞానంగల తండ్రికి పిల్లలం. బైబిల్లో స్పష్టంగా పేర్కొనబడిన ఈ వ్యాఖ్యానాలను గమనించండి:
ఆదికాండము 1:27. “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.”
కీర్తన 139:14. “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.”
మత్తయి 19:4-6. “సృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు—ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.”
అపొస్తలుల కార్యములు 17:24, 25. “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.”
ప్రకటన 4:10, 11. “ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు.”
బైబిలు ఇస్తున్న జవాబులు నిజమైన మనశ్శాంతిని ఎలా ఇస్తాయి?
“ప్రతి కుటుంబము” దేవుణ్ణిబట్టి ‘కుటుంబం అని పిలువబడుతుంది’ అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు, ఇతరుల గురించి మన ఆలోచించే విధానం మారుతుంది. (ఎఫెసీయులు 3:14) ఆ విషయం తెలిసుండడం, మనపై మనకున్న అభిప్రాయంపైన, మన సమస్యలను ఎలా చూస్తామనే దానిపైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ క్రింద ఇవ్వబడిన విధాలుగా మన ఆలోచనాతీరు మారుతుంది:
కష్టమైన నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చినప్పుడు, మనం మనుష్యుల భిన్నాభిప్రాయాల గురించి ఎక్కువగా ఆందోళనపడం. దానికి బదులు, బైబిలు ఉపదేశంపై పూర్తిగా నమ్మకముంచుతాం. ఎందుకు? ఎందుకంటే, “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.”—2 తిమోతి 3:16, 17.
నిజమే, బైబిలు సలహాను పాటించడం అంత సులభం కాదు. దాని సలహాను పాటించేందుకు మనం కొన్నిసార్లు మన అభీష్టానికి విరుద్ధంగా కూడా ప్రవర్తించాల్సి ఉంటుంది. (ఆదికాండము 8:21) అయితే, ఒక ప్రేమగల తండ్రి మనల్ని సృజించాడని మనం ఒప్పుకుంటే, మనం ఏమి చేయాలో మనకన్నా ఆయనకే బాగా తెలుసు అనే నిర్ధారణకు రావడమే సహేతుకం. (యెషయా 55:9) ఆయన వాక్యం మనకిలా అభయాన్నిస్తోంది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” (సామెతలు 3:5, 6) మనం ఆ సలహాను పాటిస్తే, మనం సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు, నిర్ణయాలను తీసుకుంటున్నప్పుడు అంతగా ఆందోళనపడం.
వివక్షకు గురైనప్పుడు, ఇతర జాతుల, సంస్కృతుల వారికన్నా మనం తక్కువవాళ్ళమని అనుకుంటూ ఆత్మన్యూనతా భావాలతో కృంగిపోము. బదులుగా, మనపట్ల మనం తగినంత ఆత్మగౌరవాన్ని పెంపొందించుకుంటాము. ఎందుకు? ఎందుకంటే, మన తండ్రియైన యెహోవా దేవుడు, “పక్షపాతి కాడు . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”—అపొస్తలుల కార్యములు 10:34, 35.
ఈ విషయాన్ని మనం అర్థంచేసుకుంటే, మన ఆలోచనల్లోకూడా ఇతరులపట్ల వివక్షకు తావివ్వకుండా ఉంటాం. దేవుడు “యావద్భూమిమీద కాపురముండుటకు యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టిం[చాడు]” కాబట్టి, మనం ఇతర జాతుల వారికన్నా ఉన్నతులం అని అనుకోవడానికి తగిన కారణాలే లేవని మనం గ్రహిస్తాము.—అపొస్తలుల కార్యములు 17:26.
కాబట్టి, మనం సృష్టించబడ్డామనీ, మన సృష్టికర్తకు మనపట్ల శ్రద్ధ ఉందనీ తెలుసుకోవడమే నిజమైన మనశ్శాంతికి పునాది. అయితే, మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే అది మాత్రమే సరిపోదు. (w 08 2/1)
[4వ పేజీలోని బ్లర్బ్]
మానవజాతి పరిణామ క్రమం ద్వారా ఉనికిలోకి వచ్చిందా?
[5వ పేజీలోని చిత్రం]
మన సృష్టికర్తకు మనపట్ల శ్రద్ధ ఉందని తెలుసుకోవడం మనశ్శాంతిని ఇవ్వగలదు