ప్రపంచవ్యాప్తంగా అనేకమంది కోరుతున్న విషయం
ప్రపంచవ్యాప్తంగా అనేకమంది కోరుతున్న విషయం
లక్షల, కోట్లమంది ఒకే విషయాన్ని కోరడం ఊహించుకోండి. వారందరూ విశ్వంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని, ఫలాని విషయం నెరవేర్చమని కోరుతున్నారు. అయితే వారు దేనిగురించి అడుగుతున్నారో వారిలో చాలామందికి తెలియదు. అసలు అలా జరగడం సాధ్యమేనా? నిజానికి ప్రతీరోజు అలాగే జరుగుతోంది. ఆ ప్రజలందరూ ఏమి కావాలని కోరుతున్నారు? దేవుని రాజ్యం రావాలని కోరుతున్నారు.
ఒక అంచనా ప్రకారం, యేసుక్రీస్తును తమ నాయకునిగా అంగీకరిస్తూ తమది క్రైస్తవ మతమని చెప్పుకునే మతాలు 37,000 ఉన్నాయి. ఆ మతాల్లో 200 కోట్లకన్నా ఎక్కువమంది సభ్యులున్నారు. వారిలో అనేకమంది, తరచూ ప్రభువు ప్రార్థన అని పిలవబడే ప్రార్థన చేస్తుంటారు. ఆ ప్రార్థన మీకు తెలుసా? యేసు తన అనుచరులకు నేర్పించిన ఆ ప్రార్థన ఇలా ఉంటుంది: “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.”—మత్తయి 6:9, 10.
చర్చీల్లో ఆరాధకులు ఇప్పటికి శతాబ్దాలుగా పూజ్యభావంతో ఆ ప్రార్థన చేస్తూవున్నారు. వారు కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, అనుకూల సమయాల్లో, అననుకూల సమయాల్లో అలా ప్రార్థిస్తుంటారు. వారు హృదయపూర్వకంగా, భావనాత్మకంగా ప్రార్థిస్తుంటారు. అనేకమంది దాన్ని కంఠతాపట్టి, దాని అర్థం తెలియకపోయినా ఊరకనే దాన్ని వల్లిస్తుంటారు. అయితే దేవుని రాజ్యం రావాలని ప్రార్థించి, దానికోసం ఎదురుచూసేది క్రైస్తవులమని చెప్పుకునేవారు మాత్రమే కాదు మరితరులు కూడా ఉన్నారు.
క్రైస్తవేతరులు కూడా కోరుతున్న విషయం
యూదా మతంలో పేరెన్నికగన్న ఒక ప్రార్థన మోర్నర్స్ ఖాదీష్ (విలాప ప్రార్థన). మరణం, బాధ వంటివాటితో దానికి ఎలాంటి సంబంధం లేకపోయినా ఇది ఎక్కువగా ఎవరైనా చనిపోయినప్పుడు చేయబడుతుంది. “మీ జీవితకాలంలో ఆయన [దేవుడు] తన రాజ్యాన్ని స్థాపించును గాక . . . , త్వరగా స్థాపించును గాక” అనే మాటలు ఆ ప్రార్థనలో ఉన్నాయి. * సమాజమందిరపు మరో ప్రాచీన ప్రార్థన, దావీదు వంశంలో పుట్టే మెస్సీయ రాజ్యం కోసం ఎదురుచూడడం గురించి ప్రస్తావిస్తోంది.
క్రైస్తవేతర మతస్థులకు కూడా దేవుని రాజ్యం అనే విషయం ఆకర్షణీయంగా అనిపిస్తుంది. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల్లో సారూప్యాన్ని కనుగొనాలనే ఉత్సాహం చూపించిన 19వ శతాబ్దపు ప్రముఖ భారతీయ మతనాయకుడు, “తూర్పుదేశాల ప్రజలు, పశ్చిమ దేశాల ప్రజలు ఒక్కటైతే తప్ప నిజమైన దేవుని రాజ్యం రాదు” అని అన్నాడని ద టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక నివేదించింది. ఆస్ట్రేలియాలోని స్ట్రాత్‌ఫీల్డ్‌లోవున్న ఒక ఇస్లామిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ఇటీవలే ఒక వార్తాపత్రికకు ఇలా వ్రాసింది: “ముస్లింలందరూ నమ్ముతున్నట్లుగానే, నేను కూడా యేసు తిరిగివచ్చి నిజమైన దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడని నమ్ముతున్నాను.”
కోట్లాదిమంది దేవుని రాజ్యం గురించి ఎదురుచూస్తూ ప్రార్థిస్తున్నారనడంలో సందేహం లేదు. అయితే ఆసక్తికరమైన ఈ వాస్తవాన్ని పరిశీలించండి.
ఈ పత్రికను ప్రచురించే యెహోవాసాక్షులమైన మేము, ప్రజలతో బైబిలు గురించి చర్చించడానికి మీ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్తామని మీకు తెలిసుండవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 236 దేశాల్లో, 400 కన్నా ఎక్కువ భాషల్లో మేము ఈ పని
చేస్తున్నాము. మా ప్రకటనా పని యొక్క ముఖ్యాంశం దేవుని రాజ్యం. నిజానికి ఈ పత్రిక పూర్తి పేరు కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది అని గమనించండి. ఆ రాజ్యం కోసం ప్రజలు ప్రార్థిస్తున్నారో లేదో మేము ప్రజల్ని తరచూ అడుగుతుంటాము. చాలామంది ప్రార్థిస్తున్నామని చెబుతారు. కానీ ఆ రాజ్యమంటే ఏమిటి అని అడిగితే, చాలామంది ‘నాకు తెలియదు’ అనే జవాబిస్తారు. లేదా వారి జవాబు అస్పష్టంగా ఉంటుంది.చాలామంది తమకు తెలియని విషయం గురించి ఎందుకు కోరుతున్నారు? దేవుని రాజ్యం వారు తెలుసుకోలేనంత క్లిష్టమైన లేక అస్పష్టమైన విషయమా? కాదు. బైబిల్లో ఆ రాజ్యం గురించి పూర్తిగా, స్పష్టంగా వివరించబడింది. అంతేకాక, ఈ అంధకార కాలాల్లో దేవుని రాజ్యాన్ని గురించిన బైబిలు సందేశం మీకు నిజమైన నిరీక్షణనివ్వగలదు. ఆ నిరీక్షణను బైబిలు ఎలా వివరించిందో మనం తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం. ఆ తర్వాత, రాజ్యం రావాలని యేసు నేర్పించిన ప్రార్థనకు ఎప్పుడు సమాధానం దొరుకుతుందో కూడా చూద్దాం. (w 08 1/1)
[అధస్సూచి]
^ పేరా 6 యేసు ఇచ్చిన మాదిరి ప్రార్థనలోలాగే మోర్నర్స్ ఖాదీష్‌లో కూడా దేవుని నామం పరిశుద్ధపరచబడాలని కోరబడుతుంది. ఖాదీష్ క్రీస్తు భూమ్మీద జీవించిన కాలంలో వాడుకలోకి వచ్చిందా లేదా అంతకన్నా ముందే వాడుకలోవుందా అనే విషయంపై కొంత వాగ్వివాదమున్నా, ప్రభువు ప్రార్థనకు, దీనికి మధ్య సారూప్యాలుంటే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. యేసు, ఏదో కొత్త ప్రార్థనను ప్రతిపాదించాలనే ఉద్దేశంతో ఈ ప్రార్థనను ఇవ్వలేదు. దానిలోని ప్రతీ విన్నపం, అప్పటి యూదులందరికీ అందుబాటులోవున్న లేఖనాల ఆధారంగా ఉంది. తోటి యూదులు అంతవరకు వేటిగురించి ప్రార్థించారో ఆ అంశాల గురించే ప్రార్థిస్తూ ఉండాలని యేసు ప్రోత్సహించాడు.