కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మనమీద ఏయే విధాలుగా ప్రేమ చూపిస్తున్నాడు?

యెహోవా మనమీద ఏయే విధాలుగా ప్రేమ చూపిస్తున్నాడు?

‘తండ్రి మనకెలాంటి ప్రేమ అనుగ్రహించాడో చూడండి.’1 యోహా. 3:1.

పాటలు: 51, 13

1. అపొస్తలుడైన యోహాను క్రైస్తవుల్ని ఏమని ప్రోత్సహించాడు? ఎందుకు?

 యెహోవా మనపై చూపిస్తున్న గొప్ప ప్రేమ గురించి లోతుగా ఆలోచించమని 1 యోహాను 3:1⁠లో అపొస్తలుడైన యోహాను ప్రోత్సహించాడు. అక్కడిలా ఉంది, ‘తండ్రి మనకెలాంటి ప్రేమ అనుగ్రహించాడో చూడండి.’ యెహోవా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆ ప్రేమను ఏయే విధాలుగా చూపిస్తున్నాడో ఆలోచించినప్పుడు మనం ఆయనకు ఇంకా దగ్గరౌతాం, ఆయన్ను మరింతగా ప్రేమిస్తాం.

2. దేవుడు తమను ప్రేమిస్తున్నాడనే విషయాన్ని కొంతమంది ఎందుకు నమ్మరు?

2 అయితే విచారకరంగా, దేవుడు తమను ప్రేమిస్తున్నాడనే విషయాన్ని కొంతమంది నమ్మరు. దేవునికి మనుషులమీద శ్రద్ధ లేదని, ఆయన కేవలం నియమాలు పెడుతూ వాటిని పాటించనివాళ్లను శిక్షించేవాడని వాళ్లు అనుకుంటారు. ఇంకొంతమంది అబద్ధ బోధల్ని నమ్ముతూ, దేవుడు క్రూరుడనీ మన ప్రేమను పొందే అర్హత ఆయనకు లేదనీ అంటారు. మరికొంతమందైతే, మనం ఎలాంటి పనులు చేసినా దేవుడు మనల్ని ప్రేమిస్తాడని భావిస్తారు. కానీ మీరు బైబిలు అధ్యయనం చేసి యెహోవా గురించి సత్యం తెలుసుకున్నారు. ఆయన ప్రేమాస్వరూపి అని, తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మీ కోసం విమోచన క్రయధనంగా ఇచ్చాడని నేర్చుకున్నారు. (యోహా. 3:16; 1 యోహా. 4:8) అయితే మీకు ఎదురైన కొన్ని పరిస్థితులవల్ల, యెహోవా మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవడం మీకు కష్టం కావచ్చు.

3. యెహోవా ప్రేమను అర్థం చేసుకోవాలంటే మనమేమి చేయాలి?

3 యెహోవా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవాలంటే, మనల్ని సృష్టించింది ఆయనే అని మొదట అర్థం చేసుకోవాలి. ఆయనే మనకు జీవాన్నిచ్చాడు. (కీర్తన 100:3-5 చదవండి.) అందుకే బైబిలు మొదటి మనిషిని ‘దేవుని కుమారుడు’ అని పిలుస్తోంది. (లూకా 3:38) యెహోవాను “పరలోకమందున్న మా తండ్రీ” అని పిలవమని యేసు కూడా మనకు నేర్పించాడు. (మత్త. 6:9, 10) కాబట్టి యెహోవా మన తండ్రి. ఒక మంచి తండ్రి తన పిల్లల్ని ప్రేమించినట్టే యెహోవా కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు.

4. (ఎ) యెహోవా ఎలాంటి తండ్రి? (బి) ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

4 మానవ తండ్రులు అపరిపూర్ణులు. వాళ్లు ఎంత ప్రయత్నించినా, ఓ తండ్రిగా యెహోవా చూపించేలాంటి ప్రేమను పూర్తిగా చూపించలేరు. నిజానికి కొంతమంది తండ్రులు తమ పిల్లలతో క్రూరంగా ప్రవర్తిస్తారు, పిల్లలకు అవి చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కానీ యెహోవా తన పిల్లలతో అలా ఎప్పటికీ ప్రవర్తించడు. ఆయనలాంటి ప్రేమగల తండ్రి మరొకరు ఉండరు. (కీర్త. 27:10) యెహోవా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనపై ఏయే విధాలుగా శ్రద్ధ చూపిస్తున్నాడో అర్థం చేసుకుంటే మనం ఖచ్చితంగా ఆయనకు మరింత దగ్గరౌతాం. (యాకో. 4:8) ఈ ఆర్టికల్‌లో, యెహోవా మనపై ప్రేమ చూపిస్తున్న నాలుగు మార్గాల గురించి చూద్దాం. తర్వాతి ఆర్టికల్‌లో, మనం ఆయన్ను ప్రేమిస్తున్నామని చూపించగల నాలుగు విధానాల్ని చర్చిస్తాం.

యెహోవా మనల్ని పోషిస్తున్నాడు

5. పౌలు ఏథెన్సు ప్రజలకు దేవుని గురించి ఏమి చెప్పాడు?

5 అపొస్తలుడైన పౌలు ఓసారి ఏథెన్సుకు వెళ్లినప్పుడు, అక్కడ చాలా విగ్రహాలు ఉండడం, అవే తమకు జీవాన్ని ఇచ్చాయని అక్కడి ప్రజలు నమ్మడం గమనించాడు. అందుకే ఆయన వాళ్లకు ‘జగత్తును అందులోని సమస్తాన్ని నిర్మించిన దేవుని’ గురించి చెప్పాడు. అంతేకాదు ‘ఆయన అందరికి జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేసేవాడు’ అని, ‘మనం ఆయనయందు బ్రదుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగివున్నాం’ అని వాళ్లకు చెప్పాడు. (అపొ. 17:24, 25, 28) అవును, మనం బ్రతకడానికి, జీవితాన్ని ఆనందించడానికి కావాల్సినవన్నీ యెహోవా మనకిస్తున్నాడు. యెహోవా ప్రేమతో మనకు ఏమేమి ఇచ్చాడో ఒక్కసారి ఆలోచించండి.

6. భూమిని తయారు చేసిన విధానంలో యెహోవా ప్రేమ ఎలా కనిపిస్తుంది? (ప్రారంభ చిత్రం చూడండి.)

6 యెహోవా మనకోసం అందమైన భూమిని తయారుచేశాడు. (కీర్త. 115:15, 16) ఆయన చేసిన గ్రహాలన్నిటిలో భూమి ప్రత్యేకమైనది. శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా ఎన్నో గ్రహాలను కనుగొన్నారుగానీ, వాటిలో ఏ ఒక్కటీ మనుషులు జీవించడానికి అనుకూలంగా లేదు. మనం ఏదోకవిధంగా బ్రతకాలని కాదుగానీ, జీవితాన్ని సంతోషంగా గడపాలనే యెహోవా కోరుకున్నాడు. అందుకే భూమిని అందంగా, సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండేలా చేశాడు. (యెష. 45:18) మన తండ్రైన యెహోవా ఇచ్చిన ఈ భూమి గురించి ఆలోచించినప్పుడు, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమౌతుంది.—యోబు 38:4, 7; కీర్తన 8:3-5 చదవండి.

7. యెహోవా మనమీద ప్రేమ చూపించిన మరో విధానం ఏమిటి?

7 యెహోవా మనమీద ప్రేమ చూపించిన మరొక విధానం, తనను అనుకరించగలిగే సామర్థ్యంతో మనల్ని సృష్టించడం. (ఆది. 1:27) అందువల్లే మనం దేవుని ప్రేమను గుర్తించి, తిరిగి ఆయన్ను ప్రేమించగలుగుతున్నాం. అదే మనకు నిజమైన సంతోషాన్నిస్తుందని యెహోవాకు తెలుసు. ఎంతైనా తల్లిదండ్రులు తమను ప్రేమిస్తున్నారని తెలుసుకున్నప్పుడే పిల్లలు సంతోషంగా ఉంటారు. మన తండ్రైన యెహోవాకు దగ్గరగా ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉంటామని యేసు కూడా చెప్పాడు. (మత్త. 5:3) మనం సంతోషంగా జీవించడానికి అవసరమైనవన్నీ సమృద్ధిగా ఇస్తున్నాడు కాబట్టి యెహోవాకు మనమీద ఎంతో ప్రేమ ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు.—1 తిమో. 6:17; కీర్త. 145:16.

యెహోవా మనకు సత్యాన్ని బోధిస్తున్నాడు

8. యెహోవా మనల్ని సరైన దారిలో నడిపించగలడని మనమెందుకు నమ్ముతాం?

8 తండ్రి తన పిల్లల్ని ప్రేమిస్తాడేగానీ వాళ్లు పక్కదారి పట్టాలని లేదా మోసపోవాలని కోరుకోడు. అయితే నేడు చాలామంది తల్లిదండ్రులు, బైబిలు ప్రమాణాలను అంగీకరించట్లేదు కాబట్టి తమ పిల్లల్ని సరైన దారిలో నడిపించలేకపోతున్నారు. దాంతో కుటుంబంలో చిరాకు, అయోమయం కలుగుతున్నాయి. (సామె. 14:12) అయితే ‘యెహోవా సత్యదేవుడు’ కాబట్టి తన పిల్లలకు సరైన దారి చూపిస్తున్నాడు. (కీర్త. 31:5) తను ఎలాంటి దేవుడో, తనను ఎలా ఆరాధించాలో మనకు నేర్పిస్తున్నాడు. అంతేకాక అత్యుత్తమ జీవితాన్ని ఎలా అనుభవించవచ్చో కూడా ఆయన చెప్తున్నాడు. (కీర్తన 43:3 చదవండి.) ఇంతకీ యెహోవా ఏ సత్యాల్ని మనకు తెలియజేశాడు? అందులో ఆయన ప్రేమ ఎలా కనిపిస్తుంది?

క్రైస్తవ తండ్రులు యెహోవాను అనుకరిస్తూ తమ పిల్లలకు సత్యాన్ని బోధిస్తారు, వాళ్లు తమ పరలోక తండ్రికి దగ్గరయ్యేలా సహాయం చేస్తారు (8-10 పేరాలు చూడండి)

9, 10. (ఎ) యెహోవా దేవుడు తన గురించి మనకెందుకు చెప్తున్నాడు? (బి) మన విషయంలో దేవుని సంకల్పం ఏమిటి?

9 మొదటిగా, యెహోవా తన గురించిన సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మనం తనను తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. (యాకో. 4:8) అందుకే ఆయన తన పేరును మనకు తెలియజేశాడు. నిజానికి బైబిల్లో మరే ఇతర పేరు కన్నా యెహోవా పేరే ఎక్కువసార్లు ఉంది. అంతేకాదు తనకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో కూడా ఆయన తెలియజేస్తున్నాడు. సృష్టిని గమనిస్తే యెహోవాకు ఎంత శక్తి, జ్ఞానం ఉన్నాయో అర్థమౌతుంది. (రోమా. 1:20) అలాగే బైబిలు చదువుతున్నప్పుడు ఆయన న్యాయవంతుడని, మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటాం. యెహోవా అద్భుతమైన లక్షణాల్ని తెలుసుకునేకొద్దీ మనం ఆయనకు మరింత దగ్గరౌతాం.

10 రెండవదిగా, మన విషయంలో తన సంకల్పం ఏమిటో కూడా ఆయన తెలియజేస్తున్నాడు. మనం తన కుటుంబంలో సభ్యులమని తెలియజేస్తూ, ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరితో మనం ఐక్యంగా, సమాధానంగా ఎలా ఉండవచ్చో నేర్పిస్తున్నాడు. మంచేదో చెడేదో స్వయంగా నిర్ణయించుకునే హక్కు మనుషులకు లేదని బైబిలు స్పష్టంగా చెప్తుంది. (యిర్మీ. 10:23) మనకేది మంచిదో యెహోవాకు తెలుసు. అంతేకాదు, ఆయన అధికారానికి లోబడినప్పుడు మాత్రమే మనం మనశ్శాంతిగా, సంతృప్తిగా జీవించగలం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని మనకు తెలియజేశాడు.

11. భవిష్యత్తు గురించి మన ప్రేమగల తండ్రి ఏమని మాటిచ్చాడు?

11 ప్రేమగల తండ్రి తన పిల్లల భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచిస్తాడు. వాళ్లు సంతోషంగా, సంతృప్తిగా జీవించాలని ఆయన కోరుకుంటాడు. అయితే విచారకరంగా, నేడు చాలామంది తమ భవిష్యత్తు గురించి దిగులుపడుతున్నారు. లేదా కొంతకాలం మాత్రమే ఉండే వాటికోసం ఆరాటపడుతూ జీవితాన్ని వృథా చేసుకుంటున్నారు. (కీర్త. 90:10) కానీ యెహోవా మాత్రం, ఇప్పుడు సంతృప్తిగా ఎలా జీవించాలో తన పిల్లలమైన మనకు నేర్పిస్తున్నాడు, భవిష్యత్తులో అద్భుతమైన జీవితాన్ని ఇస్తానని మాటిస్తున్నాడు.

యెహోవా తన పిల్లలకు నిర్దేశం, క్రమశిక్షణ ఇస్తున్నాడు

12. కయీనుకు, బారూకుకు సహాయం చేయడానికి యెహోవా ఎలా ప్రయత్నించాడు?

12 కయీను తప్పు చేయబోతున్నాడని తెలిసినప్పుడు యెహోవా అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించాడు. యెహోవా కయీనుతో ఇలా అన్నాడు, “నీకు కోపం ఎందుకు? నీ ముఖం చిన్నబోవడం దేనికి? నీవు మంచిని చేస్తే తలెత్తుకోవా?” (ఆది. 4:6-7, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) కానీ కయీను యెహోవా మాటను లెక్కచేయలేదు, దానివల్ల చెడు ఫలితాలను అనుభవించాడు. (ఆది. 4:11-13) అయితే మరో సందర్భంలో యెహోవా బారూకును కూడా సరిదిద్దాడు. అతను నిరాశకు, నిరుత్సాహానికి గురైనప్పుడు యెహోవా అతని ఆలోచనా విధానం సరిగ్గా లేదని గమనించి, దాన్ని మార్చుకోమని చెప్పాడు. యెహోవా ఇచ్చిన ఆ సలహాను పాటించి బారూకు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు.—యిర్మీ. 45:2-5.

13. తన నమ్మకమైన సేవకులు కష్టాలు అనుభవించేందుకు యెహోవా ఎందుకు అనుమతించాడు?

13 యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనకు నిర్దేశాన్ని, క్రమశిక్షణను ఇస్తున్నాడు. అవసరమైనప్పుడు ఆయన మనల్ని సరిదిద్దడమే కాకుండా మనకు శిక్షణ కూడా ఇస్తున్నాడు. (హెబ్రీ. 12:4-6) ఆయనిచ్చిన శిక్షణను తీసుకుని ప్రయోజనం పొందిన నమ్మకమైన సేవకుల గురించి మనం బైబిల్లో చదువుతాం. ఉదాహరణకు యోసేపు, మోషే, దావీదు తీవ్రమైన కష్టాల్ని ఎదుర్కొంటున్నప్పుడు యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు. ఆ కష్టకాలాల్లో వాళ్లు నేర్చుకున్న విషయాలు, ఆ తర్వాత యెహోవా వాళ్లకు పెద్దపెద్ద బాధ్యతల్ని అప్పగించినప్పుడు సహాయం చేశాయి. యెహోవా తన ప్రజలకు ఎలా తోడుగా ఉన్నాడో, వాళ్లకెలా శిక్షణ ఇచ్చాడో బైబిల్లో చదివినప్పుడు, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకుంటాం.—సామెతలు 3:11, 12 చదవండి.

14. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు యెహోవా మనమీద ఎలా ప్రేమ చూపిస్తాడు?

14 మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, మనకు క్రమశిక్షణ ఇవ్వడం ద్వారా యెహోవా ప్రేమ చూపిస్తాడు. ఆయనిచ్చిన క్రమశిక్షణను అంగీకరించి పశ్చాత్తాపపడితే మనల్ని ‘బహుగా క్షమిస్తాడు.’ (యెష. 55:7) దానర్థమేమిటి? యెహోవాకున్న క్షమాగుణం గురించి దావీదు ఇలా రాశాడు, “ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి యున్నాడు.” ఈ మాటల్నిబట్టి యెహోవా ఎంత జాలిగల తండ్రో అర్థమౌతుంది. (కీర్త. 103:3, 4, 12) యెహోవా ఎన్నో విధాలుగా మనకు నిర్దేశాన్ని, క్రమశిక్షణను ఇస్తున్నాడు. అయితే మనం దాన్ని వెంటనే అంగీకరిస్తున్నామా? యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనకు క్రమశిక్షణ ఇస్తున్నాడని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి.—కీర్త. 30:5.

యెహోవా మనల్ని కాపాడుతున్నాడు

15. యెహోవాకు తన ప్రజలు ఎంతో విలువైనవాళ్లని ఎందుకు చెప్పవచ్చు?

15 ప్రేమగల తండ్రి తన కుటుంబాన్ని ప్రమాదాల నుండి కాపాడతాడు. మన తండ్రి అయిన యెహోవా కూడా అంతే. ఆయన గురించి కీర్తనకర్త ఇలా చెప్పాడు, ‘తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడుతున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వాళ్లను విడిపిస్తాడు.’ (కీర్త. 97:10) ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి, కళ్లు మనకెంతో విలువైనవి కాబట్టి వాటికి ఏదైనా ప్రమాదం కలుగుతుంటే వాటిని కాపాడుకోవడానికి వెంటనే స్పందిస్తాం. అలాగే యెహోవాకు తన ప్రజలు ఎంతో విలువైనవాళ్లు కాబట్టి వాళ్లను కాపాడడానికి ఆయన వెంటనే చర్య తీసుకుంటాడు.—జెకర్యా 2:8 చదవండి.

16, 17. యెహోవా తన ప్రజల్ని ఎలా కాపాడుతున్నాడు?

16 యెహోవా గతంలో దేవదూతల్ని ఉపయోగించుకుని తన ప్రజల్ని కాపాడాడు, ఇప్పుడు కూడా అలాగే కాపాడుతున్నాడు. (కీర్త. 91:11) ఉదాహరణకు ఓ దూత ఒక్కరాత్రిలోనే 1,85,000 మంది అష్షూరు సైనికుల్ని చంపి దేవుని ప్రజల్ని కాపాడాడు. (2 రాజు. 19:35) దేవదూతలు మొదటి శతాబ్దంలో పేతురును, పౌలును, మరితరులను జైలు నుండి విడిపించారు. (అపొ. 5:18-20; 12:6-11) ఈ మధ్యకాలంలో, ఆఫ్రికాలోని ఓ దేశంలో భయంకరమైన యుద్ధం జరిగింది. అక్కడ ఎటు చూసినా గొడవలు, దోపిడీలు, మానభంగాలు, హత్యలే కనిపించేవి. మన సహోదరసహోదరీలు ఎవ్వరూ చనిపోలేదు కానీ, వాళ్లలో చాలామంది తమకున్నదంతా పోగొట్టుకున్నారు. అయితే ఆ పరిస్థితుల్లో కూడా వాళ్లు యెహోవా ప్రేమను, శ్రద్ధను రుచి చూశారు, అందుకే సంతోషంగా ఉండగలిగారు. మన ప్రధాన కార్యాలయ ప్రతినిధి వాళ్లను కలిసి ఎలా ఉన్నారని అడిగినప్పుడు, వాళ్లు ‘అంతా బాగానే ఉంది, యెహోవాకు మేమెంతో కృతజ్ఞులం’ అని చెప్పారు.

17 అయితే, స్తెఫను లాంటి కొంతమంది నమ్మకమైన దేవుని సేవకులు ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. యెహోవా కొన్నిసార్లు ఇలాంటివి జరగడానికి అనుమతించినప్పటికీ ఓ గుంపుగా తన సేవకుల్ని ఎప్పటికీ నాశనం కానివ్వడు. సాతాను పన్నాగాల గురించి హెచ్చరిస్తూ ఆయన వాళ్లను కాపాడుతున్నాడు. (ఎఫె. 6:10-12) బైబిలు ద్వారా, తన సంస్థ అందించే ప్రచురణల ద్వారా అలాంటి హెచ్చరికల్ని ఇస్తున్నాడు. ఉదాహరణకు ఇంటర్నెట్‌వల్ల, డబ్బు మీద ప్రేమవల్ల, చెడు సన్నివేశాలు లేదా హింస ఉన్న వినోద కార్యక్రమాలవల్ల వచ్చే ప్రమాదాల గురించి ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. వీటినిబట్టి యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడనీ, కాపాడుతున్నాడనీ ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఓ గొప్ప గౌరవం

18. యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీరెలా భావిస్తున్నారు?

18 యెహోవా మనమీద ప్రేమ చూపిస్తున్న కొన్ని మార్గాల గురించి పరిశీలించాక మనం కూడా మోషేలాగే భావిస్తాం. ఎన్నో సంవత్సరాలుగా యెహోవాకు చేస్తున్న సేవ గురించి ఆలోచిస్తూ మోషే ఇలా అన్నాడు, ‘ఉదయమున నీ కృపతో [“ప్రేమతో,” NW] మమ్మల్ని తృప్తిపర్చు, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం.’ (కీర్త. 90:14) యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడనే విషయం అర్థం చేసుకోవడం, ఆ ప్రేమను రుచి చూడడం మనకు దొరికిన ఓ ఆశీర్వాదం. యెహోవా ప్రేమను పొందడం ఎంత గొప్ప గౌరవమో కదా! దానిగురించి ఆలోచించినప్పుడు, అపొస్తలుడైన యోహానులాగే మనం కూడా ‘తండ్రి మనకెలాంటి ప్రేమ అనుగ్రహించాడో చూడండి’ అని చెప్తాం.—1 యోహా. 3:1.