కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం యెహోవాను ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చు?

మనం యెహోవాను ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చు?

“ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.”1 యోహా. 4:19.

పాటలు: 6, 138

1, 2. ప్రేమించడం అంటే ఏమిటో యెహోవా మనకు ఎలా నేర్పించాడు?

 ఓ తండ్రి తన పిల్లలకు ఒక పని ఎలా చేయాలో చక్కగా నేర్పించాలంటే, ఆయనే స్వయంగా చేసి చూపించాలి. ఉదాహరణకు, ఆయన తన పిల్లల్ని ప్రేమించినప్పుడు, వాళ్లు కూడా ఎలా ప్రేమించాలో నేర్చుకుంటారు. మన తండ్రి అయిన యెహోవా మనల్ని ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించలేదు. ‘ఆయన మొదట మనల్ని ప్రేమించాడు’ కాబట్టే మనం కూడా ఆయన్ను ప్రేమించడం నేర్చుకుంటున్నాం.—1 యోహా. 4:19.

2 యెహోవా మనల్ని ఏవిధంగా ‘మొదట ప్రేమించాడు’? బైబిలు ఇలా చెప్తుంది, ‘మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మనకోసం చనిపోయాడు.’ (రోమా. 5:8) మనల్ని పాపమరణాల నుండి రక్షించడానికి యెహోవా ప్రేమతో తన కుమారుణ్ణి విమోచన క్రయధనంగా ఇచ్చాడు. ఆ అద్భుతమైన బహుమానం వల్లే మనం యెహోవాకు దగ్గరవ్వగలుగుతున్నాం, ఆయన్ను ప్రేమించగలుగుతున్నాం. అంత గొప్ప త్యాగం చేసి, నిజమైన ప్రేమంటే ఏమిటో యెహోవా చూపించాడు. మనం కూడా నిస్వార్థంగా, ఎక్కువగా తనను ప్రేమించాలని ఆయన నేర్పించాడు.—1 యోహా. 4:10.

3, 4. మనం యెహోవాను ప్రేమిస్తున్నామని ఎలా చూపిస్తాం?

3 యెహోవాకున్న లక్షణాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రేమే. అందుకే యేసు “నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను” అనేది ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పాడు. (మార్కు 12:30) మనం తనను “పూర్ణహృదయముతో” ప్రేమించాలని యెహోవా కోరుకుంటున్నాడు. మనం ఎవరినైనా లేక వేటినైనా యెహోవాకన్నా ఎక్కువగా ప్రేమిస్తే ఆయన బాధపడతాడు. అయితే ఆయనమీద మనకు ఉండాల్సిన ప్రేమ కేవలం హృదయంలోని ఓ భావన మాత్రమే కాదు. మనం తనను ‘పూర్ణవివేకంతో లేదా పూర్ణమనసుతో, పూర్ణబలంతో’ ప్రేమించాలని కూడా యెహోవా కోరుకుంటున్నాడు. అంటే ఆయన మీద మనకు ప్రేమ ఉందని మన ఆలోచనలు, పనులు కూడా చూపించాలి.—మీకా 6:8 చదవండి.

4 కాబట్టి మన పూర్తి శక్తిసామర్థ్యాలతో, మన దగ్గరున్న వాటన్నిటితో యెహోవాను ప్రేమించాలి. మన జీవితంలో ఆయనకు మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆయన్ను నిజంగా ప్రేమిస్తున్నామని చూపిస్తాం. ముందటి ఆర్టికల్‌లో, యెహోవా తన పిల్లలమీద ప్రేమను చూపించే నాలుగు విధానాల గురించి చూశాం. ఈ ఆర్టికల్‌లో, యెహోవామీద మనకున్న ప్రేమను మరింతగా ఎలా పెంచుకోవచ్చో, ఆ ప్రేమను ఎలా చూపించవచ్చో నేర్చుకుందాం.

యెహోవాపట్ల కృతజ్ఞత చూపించండి

5. యెహోవా మనకోసం చేసినవాటన్నిటి గురించి ఆలోచిస్తే ఏమి చేయాలని కోరుకుంటాం?

5 మీకు ఎవరైనా ఓ బహుమతి ఇస్తే మీరు ఎంతో కృతజ్ఞత చూపిస్తారు. అంతేకాక ఆ బహుమతిని విలువైనదిగా చూస్తూ దాన్ని ఉపయోగిస్తారు కూడా. యాకోబు ఇలా రాశాడు, “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.” (యాకో. 1:17) మనం జీవించడానికి, సంతోషంగా ఉండడానికి కావాల్సినవన్నీ ఇస్తున్నందుకు యెహోవాకు ఎంతో కృతజ్ఞులం. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆయన్ను ప్రేమించాలని కోరుకుంటాం. మీ కోరిక కూడా అదేనా?

6. యెహోవా తమను ఆశీర్వదిస్తూ ఉండాలంటే ఇశ్రాయేలీయులు ఏమి చేయాలి?

6 యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు ఎన్నో ఇచ్చాడు. ఆయన వందల సంవత్సరాలపాటు తన నియమాల ద్వారా వాళ్లను నడిపించాడు, కావాల్సినవన్నీ ఇచ్చి పోషించాడు. (ద్వితీ. 4:7, 8) వాళ్లు ఆ నియమాలకు లోబడుతూ యెహోవా పట్ల తమ కృతజ్ఞతను చూపించగలిగేవాళ్లు. ఉదాహరణకు, వాళ్లు తమ పంటలోని “ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైనవి” యెహోవాకు అర్పణగా ఇవ్వాలి. (నిర్గ. 23:19, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) యెహోవాకు లోబడుతూ, తమకున్నవాటిలో శ్రేష్ఠమైనవి ఇస్తే ఆయన తమను ఆశీర్వదిస్తూనే ఉంటాడని ఇశ్రాయేలీయులకు తెలుసు.—ద్వితీయోపదేశకాండము 8:7-11 చదవండి.

7. మనం యెహోవాకు ఎలా మన ‘ఆస్తిలో భాగాన్ని’ ఇవ్వవచ్చు?

7 మనం కూడా యెహోవాకు మన ‘ఆస్తిలో భాగాన్ని’ ఇచ్చి ఆయన్ను ప్రేమిస్తున్నామని చూపించవచ్చు. (సామె. 3:9) మనకున్నవాటితో మనం ఆయన్ను ఘనపర్చాలి. ఉదాహరణకు మన సంఘంలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజ్యసంబంధ పనులకు మద్దతుగా విరాళాలు ఇవ్వవచ్చు. మనం ధనవంతులమైనా, కాకపోయినా మనకున్న దాంట్లో ఇవ్వడం ద్వారా యెహోవామీద ప్రేమ చూపిస్తాం. (2 కొరిం. 8:12) అయితే, ఇతర విధాలుగా కూడా మనం యెహోవాను ప్రేమిస్తున్నామని చూపించవచ్చు.

8, 9. యెహోవాను ప్రేమిస్తున్నామని చూపించే మరో విధానం ఏమిటి? మైక్‌, ఆయన కుటుంబ సభ్యులు ఏమి చేశారు?

8 రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వమని, ఆహారం గురించీ వస్త్రాల గురించీ చింతించవద్దని యేసు చెప్పాడు. ఎందుకంటే మన అవసరాలు తీరుస్తానని మన తండ్రి మాటిచ్చాడు. (మత్త. 6:31-33) ఆయన తన మాటను నిలబెట్టుకుంటాడనే పూర్తి నమ్మకం మనకుంది. మనం ఎవర్నైనా నిజంగా ప్రేమిస్తే వాళ్లను పూర్తిగా నమ్ముతాం. నిజానికి, మనం ఎంత ఎక్కువగా యెహోవాను నమ్మితే, అంత ఎక్కువగా ఆయనపై ప్రేమ ఉందని చూపిస్తాం. (కీర్త. 143:8) అందుకే మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘నేను యెహోవాను నిజంగా ప్రేమిస్తున్నానని నా లక్ష్యాలు, నా జీవన విధానం చూపిస్తున్నాయా? యెహోవా ప్రతీరోజు నా అవసరాల్ని తీరుస్తాడని నేను నమ్ముతున్నానా?’

9 మైక్‌, ఆయన కుటుంబ సభ్యులు యెహోవామీద అలాంటి ప్రేమను, నమ్మకాన్నే చూపించారు. ఆయనకు చిన్నప్పటినుండి, వేరే దేశానికి వెళ్లి ప్రకటించాలనే కోరిక ఉండేది. ఆయనకు పెళ్లై, ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఆ కోరిక అలానే ఉంది. అయితే మైక్‌, ఆయన కుటుంబ సభ్యులు, అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లి సేవచేసిన సహోదరసహోదరీల అనుభవాలు చదివినప్పుడు, సాదాసీదాగా జీవించాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు తమ ఇంటిని అమ్మేసి, ఓ చిన్న ఇంటికి మారారు. మైక్‌ తన వ్యాపారాన్ని తగ్గించుకున్నాడు, అంతేకాక వేరే దేశంలో ఉంటూ ఇంటర్నెట్‌ ద్వారా తన వ్యాపారాన్ని ఎలా చూసుకోవాలో కూడా నేర్చుకున్నాడు. అలా మార్పులు చేసుకోవడం వల్ల మైక్‌, ఆయన కుటుంబ సభ్యులు వేరే దేశానికి వెళ్లి, సంతోషంగా పరిచర్య చేశారు. మైక్‌ ఇలా చెప్పాడు, “మత్తయి 6:33⁠లోని యేసు మాటలు ఎంత నిజమో మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం.”

యెహోవా బోధిస్తున్నవాటి గురించి ధ్యానించండి

10. దావీదులాగే మనం కూడా యెహోవా గురించి నేర్చుకున్న విషయాలను ఎందుకు ధ్యానించాలి?

10 రాజైన దావీదు ఇలా రాశాడు, “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది . . . యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.” యెహోవా చేసిన అద్భుతమైన సృష్టి గురించి, ఆయన నియమాల్లో ఉన్న జ్ఞానం గురించి ఆలోచించినప్పుడు దావీదు యెహోవాకు ఇంకా దగ్గరయ్యాడు, ఆయన్ను మరింతగా ప్రేమించాడు. అందుకే ఆయనిలా చెప్పాడు, “యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక.”—కీర్త. 19:1, 7, 14.

11. మనం సత్యాన్ని ఎలా ఉపయోగించాలని యెహోవా కోరుకుంటున్నాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

11 యెహోవా తన గురించి, తన సంకల్పం గురించి, సృష్టి గురించి, బైబిలు గురించి మనకెన్నో విషయాలు బోధిస్తున్నాడు. కానీ ఈ లోకం పైచదువుల్ని ప్రోత్సహిస్తుంది, దానివల్ల చాలామందికి దేవునిమీద ఉన్న ప్రేమ చల్లారిపోయింది. అయితే యెహోవా మాత్రం, జ్ఞానంతోపాటు తెలివిని, వివేచనను సంపాదించమని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. మనం నేర్చుకున్న విషయాల్ని మన ప్రయోజనం కోసం, ఇతరుల ప్రయోజనం కోసం ఉపయోగించాలని ఆయన కోరుకుంటున్నాడు. (సామె. 4:5-7) ఉదాహరణకు, మనం ‘సత్యం గురించిన అనుభవజ్ఞానాన్ని’ ఇతరులతో పంచుకొని, వాళ్లు రక్షణ పొందేలా సహాయం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. (1 తిమో. 2:4) దేవుని రాజ్యం గురించి, అది తీసుకురాబోయే మంచి పరిస్థితుల గురించి వీలైనంత ఎక్కువమందికి చెప్పడం ద్వారా యెహోవామీద, ప్రజలమీద మనకు ప్రేమ ఉందని చూపిస్తాం.—కీర్తన 66:16, 17 చదవండి.

12. యెహోవా ఇచ్చిన ఓ బహుమానం గురించి ఒక యువ సహోదరి ఏమని చెప్పింది?

12 పిల్లలు కూడా యెహోవా తమకిచ్చిన వాటి గురించి, బోధించిన వాటి గురించి ధ్యానించవచ్చు. షానన్‌ అనే అమ్మాయి, ఆమె చెల్లి “దైవభక్తి” అనే జిల్లా సమావేశానికి హాజరయ్యారు. అప్పుడామెకు 11 ఏళ్లు, తన చెల్లికి 10 ఏళ్లు. ఆ సమావేశంలోని ఓ ప్రసంగం కోసం పిల్లలందర్నీ ఓ చోట కూర్చోబెట్టారు. వాళ్లలో షానన్‌, తన చెల్లి కూడా ఉన్నారు. ఆమె మొదట కాస్త కంగారుపడినా, పిల్లలందరికీ యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు (ఇంగ్లీషు) అనే పుస్తకాన్ని ఇచ్చినప్పుడు ఆశ్చర్యపోయింది. ఆ అద్భుతమైన బహుమానాన్ని అందుకున్నప్పుడు ఆమెకు ఏమనిపించింది? ఆమె ఇలా చెప్తుంది, ‘యెహోవా నిజమైన వ్యక్తని, ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని ఆ క్షణం నాకు అర్థమైంది. మన గొప్ప తండ్రి యెహోవా అలాంటి అద్భుతమైన, శ్రేష్ఠమైన బహుమానాల్ని ఉదారంగా ఇస్తున్నందుకు మనం ఎంతో సంతోషిస్తున్నాం.’

యెహోవా ఇచ్చే క్రమశిక్షణను అంగీకరించండి

13, 14. యెహోవా క్రమశిక్షణ ఇచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి? ఎందుకు?

13 బైబిలు ఇలా చెప్తుంది, “తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.” (సామె. 3:12) యెహోవా క్రమశిక్షణ ఇచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి? క్రమశిక్షణను చాలామంది ఇష్టపడకపోవచ్చు. అందుకే అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, “ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు.” అయితే, క్రమశిక్షణ ఎందుకు ప్రాముఖ్యమో వివరిస్తూ ఆయనింకా ఇలా అన్నాడు, “అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.” (హెబ్రీ. 12:11) మనం యెహోవాను ప్రేమిస్తే ఆయనిచ్చే క్రమశిక్షణను నిర్లక్ష్యం చేయం లేదా సలహా ఇచ్చినప్పుడు బాధపడం. బదులుగా ఆయనిచ్చే క్రమశిక్షణను స్వీకరించి, అవసరమైన మార్పులు చేసుకుంటాం.

14 మలాకీ కాలంలో చాలామంది యూదులు యెహోవా మాటను పట్టించుకోలేదు. తాము అర్పించే బలుల్ని ఆయన ఇష్టపడట్లేదని తెలిసినా వాళ్లు లెక్కచేయలేదు. అందుకే యెహోవా వాళ్లను గద్దించాడు. (మలాకీ 1:12, 13 చదవండి.) నిజానికి, యెహోవా ఎన్నిసార్లు హెచ్చరించినా వాళ్లు వినకపోవడంతో చివరికి ఆయనిలా అన్నాడు, ‘నేను మీ మీదికి శాపం తెప్పిస్తాను. మీ దీవెనలను శాపాలుగా మారుస్తాను.’ (మలా. 2:1-2, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) మనం కూడా యెహోవా ప్రేమతో ఇస్తున్న సలహాల్ని ఏమాత్రం పాటించకపోతే లేదా లెక్కచేయకపోతే ఆయనతో ఉన్న స్నేహాన్ని పోగొట్టుకుంటాం.

ఈ లోక ప్రమాణాలను కాకుండా యెహోవా సలహాలను పాటించండి (15వ పేరా చూడండి)

15. మనం ఎలాంటి ఆలోచనా తీరుకు దూరంగా ఉండాలి?

15 సాతాను లోకం మనుషుల్లో గర్వాన్ని, స్వార్థాన్ని పెంచుతుంది. ఇతరులు తమను సరిదిద్దినా, సలహాలిచ్చినా చాలామందికి నచ్చదు. కొంతమందైతే సలహాలను ఏదో తప్పదన్నట్లు వింటారు. కానీ మనం అలా ఉండకూడదు. ‘ఈ లోక మర్యాదను అనుసరించవద్దు’ అని బైబిలు చెప్తుంది. బదులుగా, యెహోవా మననుండి ఏమి కోరుతున్నాడో తెలుసుకుని ఆయన్ను సంతోషపెట్టేలా మనం ప్రవర్తించాలి. (రోమా. 12:2) యెహోవా తన సంస్థ ద్వారా మనకు సరైన సమయంలో సలహాలిస్తాడు. ఉదాహరణకు, అమ్మాయిలు అబ్బాయిలతో, అబ్బాయిలు అమ్మాయిలతో ఎలా మెలగాలో, ఎలాంటి స్నేహితుల్ని, వినోదాన్ని ఎంపిక చేసుకోవాలో సంస్థ మనకు గుర్తుచేస్తుంది. ఆ సలహాలను మనస్ఫూర్తిగా పాటిస్తూ, అవసరమైన మార్పులు చేసుకున్నప్పుడు మనం యెహోవాను సంతోషపెడతాం. అంతేకాక, ఆయన మనల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉన్నామని, ఆయన్ను నిజంగా ప్రేమిస్తున్నామని చూపిస్తాం.—యోహా. 14:31; రోమా. 6:17.

సహాయం కోసం యెహోవా వైపు చూడండి

16, 17. (ఎ) నిర్ణయాలు తీసుకునే ముందు యెహోవా అభిప్రాయమేమిటో మనం ఎందుకు తెలుసుకోవాలి? (బి) యెహోవామీద నమ్మకం ఉంచే బదులు ఇశ్రాయేలీయులు ఏమి చేశారు?

16 ఏదైనా ప్రమాదం ఎదురైతే చిన్నపిల్లలు వెంటనే తమ తల్లిదండ్రుల దగ్గరకు పరుగెడతారు. వాళ్లు పెద్దయ్యాక కూడా తల్లిదండ్రుల్నే సహాయం అడుగుతారు. వాళ్లు సొంతగా నిర్ణయాలు తీసుకోగలిగినప్పటికీ, తల్లిదండ్రులైతే మంచి సలహా ఇస్తారని వాళ్ల నమ్మకం. మన తండ్రైన యెహోవా మనకు సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇచ్చాడు. కానీ, మనం ఆయన్ను నిజంగా నమ్ముతాం, ప్రేమిస్తాం కాబట్టే ఎప్పుడూ ఆయన సహాయం అడుగుతాం. అంతేకాదు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు యెహోవా అభిప్రాయమేమిటో తెలుసుకోవడానికి కృషిచేస్తాం. అలా యెహోవాపై ఆధారపడినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మనిచ్చి సరైనది చేసేలా మనకు సహాయం చేస్తాడు.—ఫిలి. 2:13.

17 సమూయేలు కాలంలో ఓసారి ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేసి ఓడిపోయారు. ఆ సందర్భంలో ఏమి చేయాలో యెహోవాను అడిగే బదులు వాళ్లే ఓ నిర్ణయం తీసుకున్నారు. వాళ్లిలా అనుకున్నారు, ‘షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసాన్ని తీసికెళ్లి మనమధ్య ఉంచుకుందాం రండి; అది మనమధ్య ఉంటే, అది మన శత్రువుల చేతిలోనుండి మనల్ని రక్షిస్తుంది.’ దాని ఫలితం? ‘అప్పుడు అత్యధికమైన వధ జరిగింది, ఇశ్రాయేలీయుల్లో ముప్పై వేలమంది చనిపోయారు, దేవుని మందసం కూడా పట్టబడింది.’ (1 సమూ. 4:2-4, 10, 11) నిబంధన మందసాన్ని తమతోపాటు తీసుకెళ్తే చాలు, యెహోవా యుద్ధంలో సహాయం చేస్తాడనీ తమను కాపాడతాడనీ ఇశ్రాయేలీయులు అనుకున్నారు. కానీ వాళ్లు యెహోవా సహాయం అడగలేదు, ఆయన అభిప్రాయం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. బదులుగా, తమకు ఏది సరైనదని అనిపించిందో అదే చేశారు. దానివల్ల ఘోరమైన ఫలితాలు అనుభవించారు.—సామెతలు 14:12 చదవండి.

18. యెహోవా మీద నమ్మకం ఉంచడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

18 యెహోవాను ఎంతో ప్రేమిస్తూ, ఆయనమీద నమ్మకం ఉంచిన ఓ కీర్తనకర్త ఇలా రాశాడు, ‘దేవునియందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అని చెబుతూ నేను ఆయన్ను స్తుతిస్తాను. నా దేవా, నా ప్రాణం నాలో క్రుంగియున్నది కాబట్టి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను.’ (కీర్త. 42:5, 6) మీరు కూడా యెహోవా గురించి అలాగే భావిస్తున్నారా? మీకు కూడా ఆయనమీద అలాంటి ప్రేమ, నమ్మకమే ఉన్నాయా? ఒకవేళ ఉన్నా, ఆ నమ్మకాన్ని మరింతగా పెంచుకోవచ్చు. బైబిలు ఇలా చెప్తుంది, “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”—సామె. 3:5, 6.

19. యెహోవాను ప్రేమిస్తున్నారని మీరెలా చూపిస్తారు?

19 యెహోవా మొదట మనల్ని ప్రేమించి, మనం ఆయనను ఎలా ప్రేమించాలో నేర్పించాడు. కాబట్టి ఆయన మనకోసం చేసినవాటన్నిటి గురించి, మనపై చూపిస్తున్న ప్రేమ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉందాం. అంతేకాక మన పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో, పూర్ణబలంతో ఆయన్ను ప్రేమిస్తూ ఉందాం.—మార్కు 12:30.