కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘దుర్దినాల్లో’ సంతోషంగా యెహోవాను సేవించండి

‘దుర్దినాల్లో’ సంతోషంగా యెహోవాను సేవించండి

“నా అనారోగ్య సమస్యలు రోజురోజుకీ ఎక్కువౌతున్నాయి” అని 70లలో ఉన్న ఎర్నెస్ట్‌ a అనే సహోదరుడు బాధపడుతున్నాడు. మీకూ అలానే అనిపిస్తుందా? వయసుపైబడడం వల్ల మీ ఆరోగ్యం, బలం రోజురోజుకీ క్షీణిస్తుండవచ్చు. ఆ పరిస్థితుల్లో, ప్రసంగి 12వ అధ్యాయంలోని మాటల్ని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఉదాహరణకు 1వ వచనంలో, ముసలితనంలో ‘దుర్దినాలు’ అంటే కష్టాలతో నిండిన రోజులు ఉంటాయని బైబిలు చెప్తుంది. అయితే వయసుపైబడినంత మాత్రాన కృంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ వయసులో కూడా సంతోషంగా యెహోవా సేవ చేస్తూ సంతృప్తిగా జీవించవచ్చు.

విశ్వాసాన్ని బలంగా ఉంచుకోండి

ప్రియమైన వృద్ధ సహోదరసహోదరీల్లారా, మీలాగే బైబిలు కాలాల్లోని యెహోవా సేవకులు కూడా వృద్ధాప్యంలో కష్టాలుపడ్డారు. ఉదాహరణకు ఇస్సాకు, యాకోబు, అహీయాల చూపు మందగించింది. (ఆది. 27:1; 48:10; 1 రాజు. 14:4) శారా, తన ‘బలం ఉడిగిపోయినట్లు’ భావించింది. (ఆది. 18:11, 12) ముసలితనంలో దావీదు చలిని తట్టుకోలేకపోయాడు. (1 రాజు. 1:1) ధనవంతుడైన బర్జిల్లయి ఆహారాన్ని, సంగీతాన్ని ఆస్వాదించలేకపోయాడు. (2 సమూ. 19:32-35) అబ్రాహాము భార్యను పోగొట్టుకుని ఎంతో బాధపడ్డాడు. నయోమికి కూడా అలాంటి కష్టమే వచ్చింది.—ఆది. 23:1, 2; రూతు 1:3, 12.

ఆ పరిస్థితుల్లో కూడా వాళ్లందరూ యెహోవాకు నమ్మకంగా ఉంటూ సంతోషాన్ని ఎలా కాపాడుకోగలిగారు? అబ్రాహాము వయసుపైబడినా దేవుని వాగ్దానాల మీద నమ్మకముంచుతూ ‘విశ్వాసంవల్ల బలం పొందాడు.’ (రోమా. 4:19-21) మనకు కూడా అలాంటి బలమైన విశ్వాసమే ఉండాలి. అది మన వయసుపై, సామర్థ్యంపై లేదా పరిస్థితులపై ఆధారపడివుండదు. ఉదాహరణకు యాకోబు, మంచం మీదనుండి లేవలేనంత బలహీనంగా ఉన్నా, చూపు తగ్గినా దేవుని వాగ్దానాల మీద బలమైన విశ్వాసం ఉంచాడు. (ఆది. 48:1-4, 10; హెబ్రీ. 11:21) మన కాలానికి వస్తే, కండరాల బలహీనతతో బాధపడుతున్న 93 ఏళ్ల ఈనెస్‌ ఇలా చెప్తోంది, “ప్రతీరోజు యెహోవా నాకు ఎన్నో దీవెనలు ఇస్తున్నట్లు భావిస్తాను. నేను రోజూ పరదైసు గురించి ఆలోచిస్తాను, అది నాలో భవిష్యత్తు మీద ఆశను పెంచుతుంది.” అది ఎంత చక్కని స్ఫూర్తి!

మన విశ్వాసాన్ని బలపర్చుకోవాలంటే ప్రార్థించాలి, బైబిలు చదవాలి, కూటాలకు హాజరవ్వాలి. దానియేలు వయసుపైబడినా రోజూ మూడుసార్లు ప్రార్థించేవాడు, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసేవాడు. (దాని. 6:10; 9:2) విధవరాలైన అన్న ముసలితనంలో కూడా ‘దేవాలయానికి విడువక’ వెళ్లేది. (లూకా 2:36, 37) వృద్ధులైన మీరు కూడా సాధ్యమైనప్పుడల్లా కూటాలకు వెళ్తూ, వాటిలో ఎక్కువగా పాల్గొంటూ ఉండండి. అలాచేస్తే, మీరూ అలాగే హాజరైనవాళ్లంతా ప్రోత్సాహం పొందుతారు. యెహోవా సేవలో మీరు చేస్తున్నది కొంచెమే అయినా, ఆయన ఎల్లప్పుడూ మీ ప్రార్థనలను సంతోషంగా వింటాడు.—సామె. 15:8.

ఒకర్నొకరు ప్రోత్సహించుకోండి

మీలో చాలామంది చక్కగా చూడాలనీ చదవాలనీ కూటాలకు హాజరయ్యేంత బలంగా ఉండాలని కోరుకుంటుండవచ్చు. కానీ వయసు పెరిగేకొద్దీ అది కష్టమని, దాదాపు అసాధ్యమని కూడా మీకు అనిపించవచ్చు. అప్పుడు మీరేమి చేయవచ్చు? మీకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను చక్కగా ఉపయోగించుకోండి. మీటింగ్స్‌కి హాజరుకాలేని చాలామంది ఫోన్‌ ద్వారా వాటిని వింటారు. 79 ఏళ్ల ఇంగ అనే సహోదరి, తనకు కంటిచూపు సరిగ్గా లేకపోయినా, సంఘంలోని ఓ సహోదరుడిచ్చే పెద్ద అచ్చు ప్రింట్‌లను ఉపయోగించి కూటాలకు సిద్ధపడుతుంది.

వేరేవాళ్లకు లేనంత తీరిక సమయం మీకుండవచ్చు. ఆ సమయంలో బైబిలు అలాగే ఇతర ప్రచురణల రికార్డింగ్‌లను, ప్రసంగాల్ని, ఆడియో డ్రామాల్ని వినవచ్చు. అంతేకాదు తోటి సహోదరులకు ఫోన్‌చేసి, బైబిలు విషయాల గురించి మాట్లాడి, ఒకర్నొకరు ప్రోత్సహించుకోవచ్చు.—రోమా. 1:11, 12.

దేవుని సేవలో చురుగ్గా ఉండండి

ప్రకటించండి

‘ఒకప్పటిలా ఉత్సాహంగా పరిచర్య చేయలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది’ అని 80లలో ఉన్న క్రిస్టా అనే సహోదరి చెప్తోంది. అయితే వయసు పైబడుతున్నా సంతోషాన్ని ఎలా కాపాడుకోవచ్చు? 75 ఏళ్ల పీటర్‌ ఇలా చెప్తున్నాడు, ‘సానుకూల దృక్పథంతో ఉండాలి, అంటే మీరు చేయలేకపోతున్న వాటి గురించి ఆలోచిస్తూ ఉండడంకన్నా, చేయగలిగిన వాటినిబట్టి సంతోషించాలి.’

సాక్ష్యమివ్వడానికి మీకు ఏయే అవకాశాలు ఉన్నాయో ఆలోచించండి. హైడీ అనే సహోదరి ఒకప్పటిలా ఇంటింటి పరిచర్యకు వెళ్లలేకపోతుంది. కాబట్టి ఉత్తరాల ద్వారా సాక్ష్యమివ్వడం కోసం 80 ఏళ్ల వయసులో కంప్యూటర్‌ ఉపయోగించడం నేర్చుకుంది. కొంతమంది వృద్ధ ప్రచారకులు, పార్కుల్లో లేదా బస్‌స్టాపుల్లో కూర్చున్నప్పుడు ఇతరులకు సాక్ష్యమిస్తారు. ఒకవేళ మీరు ఆశ్రమంలో ఉంటున్నట్లయితే, అక్కడున్న వైద్య సిబ్బందితో, మిగతావాళ్లతో మాట్లాడవచ్చు.

ఆతిథ్యం ఇవ్వండి

దావీదు వృద్ధాప్యంలో, సత్యారాధనకు ఎంతో ఉత్సాహంగా మద్దతిచ్చాడు. ఆలయం కట్టడానికి కావాల్సిన విరాళాన్ని ఇచ్చాడు, కావాల్సినవన్నీ సమకూర్చాడు. (1 దిన. 28:11–29:5) మీరుకూడా, ప్రపంచవ్యాప్త ప్రకటనాపనికి మీ వంతు సహాయం చేయవచ్చు. మీ సంఘంలోని పయినీర్లను, ఇతర ఉత్సాహవంతమైన ప్రచారకులను మాటల ద్వారా, చిన్నచిన్న బహుమతులు ఇవ్వడం ద్వారా లేదా అల్పాహారానికి ఆహ్వానించడం ద్వారా ప్రోత్సహించవచ్చు. అలాగే యౌవనుల్ని, వాళ్ల కుటుంబాల్ని, పూర్తికాల సేవకుల్ని, ఆరోగ్యం బాగోలేనివాళ్లను, సంఘంలో బాధ్యతలు నిర్వహిస్తున్నవాళ్లను మీ ప్రార్థనలో గుర్తుచేసుకోవచ్చు.

యెహోవా మిమ్మల్నీ, మీరు చేస్తున్న సేవను ఎంతో అమూల్యంగా ఎంచుతాడు. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. (కీర్త. 71:9) ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు ఆయనకు ఎంతో విలువైనవాళ్లు. కొద్దికాలంలోనే మనందరం కొత్తలోకంలో ఉంటాం. అప్పుడు మన వయసు పెరుగుతూ ఉంటుంది కానీ, ముసలితనం వల్ల వచ్చే కష్టాలేవీ లేకుండా మనం పూర్తి బలంతో, ఆరోగ్యంతో యెహోవాను నిత్యం సేవిస్తూ ఉంటాం.

a అసలు పేర్లు కావు.