‘మీ విడుదల సమీపించింది’!
“మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నది.”—లూకా 21:28.
1. సా.శ. 66లో ఎలాంటి సంఘటనలు జరిగాయి? (ప్రారంభ చిత్రం చూడండి.)
మీరు సా.శ. 66లో యెరూషలేములో జీవిస్తున్న ఓ క్రైస్తవుడని అనుకోండి. మీ చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఫ్లోరస్ అనే ఓ రోమా అధిపతి, ఆలయ ధననిధిలో నుండి 17 తలాంతులు దౌర్జన్యంగా తీసుకెళ్లాడు. దాంతో యూదులు తిరుగుబాటు చేసి, చాలామంది రోమా సైనికుల్ని చంపి, స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. దానికి రోమా ప్రభుత్వం వెంటనే స్పందించింది. మూడు నెలల్లోనే సెస్టీయస్ గాలస్ 30,000 మంది సైనికులతో యెరూషలేమును ముట్టడించాడు. భయపడిపోయిన యూదా తిరుగుబాటుదారులు ఆలయం లోపల దాక్కున్నారు. అయితే రోమా సైనికులు ఆలయం వరకూ వెళ్లి, దాని బయటి గోడను కూలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. యెరూషలేములోని ప్రతీ ఒక్కరూ ఏమి జరుగుతుందో అని భయంతో వణుకుతున్నారు. వీటన్నిటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది?
2. రోమా సైన్యం యెరూషలేమును చుట్టుముట్టినప్పుడు క్రైస్తవులు ఏమి చేయాలని యేసు చెప్పాడు? అది వాళ్లకు ఎలా సాధ్యమైంది?
2 ఈ దాడి గురించి యేసు తన శిష్యుల్ని చాలా సంవత్సరాల ముందే హెచ్చరించాడు. అంతేకాదు ఆయనిలా ఆజ్ఞాపించాడు, “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపకూడదు.” (లూకా 21:20, 21) పట్టణం చుట్టూ సైనికులు ఉంటే శిష్యులు పారిపోవడం ఎలా సాధ్యం? అయితే ఆశ్చర్యకరంగా రోమా సైన్యం ఉన్నట్టుండి యెరూషలేము నుండి వెళ్లిపోయింది. ఆ విధంగా యేసు చెప్పినట్లే, ఆ దాడి ‘తక్కువ చేయబడింది.’ (మత్త. 24:22) సైన్యం వెనక్కి వెళ్లిపోగానే శిష్యులు యేసు మాటకు లోబడి, నమ్మకమైన తోటి క్రైస్తవులతో కలిసి వెంటనే కొండలకు పారిపోయారు. a ఆ తర్వాత మళ్లీ సా.శ. 70లో మరో రోమా సైన్యం యెరూషలేముపై దాడిచేసి దాన్ని పూర్తిగా నాశనం చేసింది. కానీ యేసు ఇచ్చిన నిర్దేశాలు పాటించినవాళ్లు మాత్రమే బ్రతికి బయటపడ్డారు.
3. తొలి క్రైస్తవుల్లాగే నేటి క్రైస్తవులు కూడా త్వరలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు? ఈ ఆర్టికల్లో మనమేమి పరిశీలిస్తాం?
3 యేసు ఇచ్చిన హెచ్చరిక, నిర్దేశాలు మన కాలానికి కూడా వర్తిస్తాయి. ఎందుకంటే అతిత్వరలో మనం కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కోబోతున్నాం. మొదటి శతాబ్దంలో జరిగిన ఆ సంఘటనలు, ‘మహాశ్రమలు’ మొదలైనప్పుడు జరిగే సంఘటనలకు సూచనగా ఉన్నాయి. (మత్త. 24:3, 21, 29) యెరూషలేము నాశనమైనప్పుడు నమ్మకమైన క్రైస్తవులు తప్పించుకున్నట్లే, త్వరలో ఈ లోకంపైకి రాబోతున్న విపత్తును ఓ “గొప్పసమూహము” తప్పించుకుంటుంది. (ప్రకటన 7:9, 13-14 చదవండి.) త్వరలో జరగబోయే ఈ సంఘటనల గురించి బైబిలు ఏమి చెప్తుందో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే, మన జీవితాలు దానిమీదే ఆధారపడివున్నాయి. కాబట్టి ఈ సంఘటనలు వ్యక్తిగతంగా మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు పరిశీలిద్దాం.
మహాశ్రమలు మొదలైనప్పుడు
4. మహాశ్రమలు ఎలా మొదలౌతాయి?
4 అబద్ధమతం నాశనమవ్వడంతో మహాశ్రమలు మొదలౌతాయి. బైబిలు అబద్ధమతాన్ని ‘వేశ్యలకు తల్లియైన మహాబబులోను’ అని పిలుస్తుంది. (ప్రక. 17:5-7) బైబిలు అబద్ధ మతాన్ని వేశ్యతో ఎందుకు పోలుస్తుంది? ఎందుకంటే అబద్ధమత నాయకులు దేవునికి నమ్మకంగా లేరు. వాళ్లు యేసుకు, ఆయన రాజ్యానికి నమ్మకంగా మద్దతిచ్చే బదులు అధికారం కోసం మానవ ప్రభుత్వాలకు మద్దతిస్తూ, బైబిలు బోధల్ని పక్కనపెట్టేశారు. వాళ్లు అభిషిక్త క్రైస్తవుల్లా దేవున్ని పవిత్రంగా ఆరాధించలేదు. (2 కొరిం. 11:2; యాకో. 1:27; ప్రక. 14:4) ఇంతకీ మహాబబులోనును ఎవరు నాశనం చేస్తారు? ‘ఎర్రని క్రూరమృగానికి’ ఉన్న ‘పది కొమ్ముల్ని’ ఉపయోగించి యెహోవా దాన్ని నాశనం చేస్తాడు. ఆ ‘ఎర్రని క్రూరమృగం’ ఐక్యరాజ్య సమితిని, ఆ “పది కొమ్ములు” దానికి మద్దతిచ్చే రాజకీయ శక్తుల్ని సూచిస్తున్నాయి.—ప్రకటన 17:3, 16-18 చదవండి.
5, 6. మహాబబులోను నాశనమైనప్పుడు, దాని సభ్యులందరూ నాశనమవ్వరని ఎలా చెప్పవచ్చు?
5 మహాబబులోను నాశనమైనప్పుడు, దానిలోని సభ్యులందరూ నాశనమౌతారా? అవ్వకపోవచ్చు. అప్పుడు ఏమి జరుగుతుందో యెహోవా జెకర్యా ద్వారా ప్రవచించాడు. అబద్ధమత సభ్యులు ఇలా అంటారు, “‘నేను ప్రవక్తను కాను. నేనొక వ్యవసాయదారుడను. నా చిన్నతనం నుండి నేను వ్యవసాయదారునిగానే పని చేశాను’. ‘అయితే నీ చేతులమీద ఈ గాయాలు ఏమిటి?’ అని ఇతరులు అడుగుతారు. అందుకతడు, ‘నా స్నేహితుల ఇంటిలో నాకు దెబ్బలు తగిలాయి’ అని అంటాడు.” (జెక. 13:4-6, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) చివరికి కొంతమంది మతనాయకులు కూడా, అబద్ధమతంతో తాము తెగతెంపులు చేసుకున్నామని, తమకు అసలు దానితో సంబంధమే లేదని చెప్పుకుంటారు.
6 అప్పుడు దేవుని ప్రజలకు ఏమి జరుగుతుంది? యేసు ఇలా చెప్పాడు, “ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.” (మత్త. 24:22) సా.శ. 66లో శ్రమ ‘తక్కువ చేయబడడం’ వల్ల “ఏర్పరచబడినవారు” అంటే అభిషిక్త క్రైస్తవులు తప్పించుకున్నారు. అదేవిధంగా, మహాశ్రమల మొదటి భాగం కూడా ‘ఏర్పరచబడినవారి కోసం తక్కువ చేయబడుతుంది.’ “పది కొమ్ములు” లేదా రాజకీయ శక్తులు తన ప్రజల్ని నాశనం చేయడానికి యెహోవా అనుమతించడు. అయితే, మహా బబులోను నాశనమైన తర్వాత కొంతకాలం ప్రశాంతత ఉంటుంది.
పరీక్షా సమయం, తీర్పు
7, 8. అబద్ధమతం నాశనమైన తర్వాత ఏ అవకాశం దొరుకుతుంది? అప్పుడు దేవుని ప్రజలు ఎలా ఇతరులకన్నా భిన్నంగా ఉంటారు?
7 ప్రశాంతత ఉండే ఆ కాలంలో, మన హృదయంలో నిజంగా ఏముందో బయటపడుతుంది. అప్పుడు చాలామంది ప్రజలు ‘కొండల్లాంటి’ మానవ సంస్థలను ఆశ్రయిస్తారు. (ప్రక. 6:15-17) కానీ దేవుని ప్రజలు మాత్రం యెహోవాను ఆశ్రయిస్తారు. మొదటి శతాబ్దంలో శ్రమ ‘తక్కువ చేయబడినప్పుడు’ యూదులందరూ క్రైస్తవులుగా మారలేదు. కానీ అప్పటికే క్రైస్తవులుగా ఉన్నవాళ్లు, యేసు సలహాను పాటించి యెరూషలేము నుండి పారిపోవడానికి అవకాశం దొరికింది. అదేవిధంగా, మహాశ్రమలు తక్కువ చేయబడినప్పుడు, చాలామంది ప్రజలు నిజక్రైస్తవులుగా మారతారని మనం అనుకోకూడదు. బదులుగా, అప్పటికే నిజక్రైస్తవులైన వాళ్లందరూ యెహోవాపట్ల తమకున్న ప్రేమను నిరూపించుకోవడానికి, అభిషిక్తులకు మద్దతివ్వడానికి అవకాశం దొరుకుతుంది.—మత్త. 25:34-40.
8 ఆ పరీక్షా సమయంలో ఖచ్చితంగా ఏమి జరుగుతుందో మనకు తెలీదు. అయితే జీవితం కష్టంగా ఉంటుందని, మనం కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుందని కూడా మనకు తెలుసు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సివచ్చింది, బ్రతకడానికి ఎన్నో కష్టాలు పడాల్సివచ్చింది. (మార్కు 13:15-18) అందుకే మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘నాకున్న డబ్బును, వస్తువులను వదిలేయడానికి ఇష్టపడతానా? యెహోవాకు నమ్మకంగా ఉండడం కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నానా?’ ఒక్కసారి ఆలోచించండి, అప్పుడు పరిస్థితులు ఎలావున్నా మనం మాత్రమే యెహోవాను ఆరాధిస్తూ ఉంటాం. దానియేలు ప్రవక్త అదే చేశాడు.—దాని. 6:10, 11.
9, 10. (ఎ) మహాశ్రమల కాలంలో దేవుని ప్రజలు ఏ సందేశాన్ని ప్రకటిస్తారు? (బి) దానికి వాళ్ల శత్రువులు ఎలా స్పందిస్తారు?
9 మహాశ్రమల కాలం, “రాజ్య సువార్త” ప్రకటించే సమయం కాదు. ఆ సందేశాన్ని ప్రకటించాల్సిన సమయం అయిపోయింది. బదులుగా, అది “అంతము” వచ్చే సమయం. (మత్త. 24:14) అప్పుడు దేవుని ప్రజలు ధైర్యంగా శక్తివంతమైన తీర్పు సందేశాన్ని ప్రకటిస్తారు. సాతాను దుష్టలోకం త్వరలో నాశనం కాబోతుందన్నదే ఆ సందేశం. ఈ సందేశాన్ని బైబిలు వడగండ్లతో పోలుస్తూ ఇలా చెప్తుంది, “అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశమునుండి మనుష్యులమీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.”—ప్రక. 16:21.
10 ఆ సందేశం మన శత్రువుల చెవిన పడుతుంది. అప్పుడు ‘మాగోగువాడగు గోగు’ అంటే కొన్ని దేశాల గుంపు ఏమి చేస్తుందో యెహోవా యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇలా తెలియజేశాడు, ‘ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా—ఆ కాలంలో నీ మనసులో అభిప్రాయాలు పుడతాయి, నువ్వు దురాలోచనచేసి ఇలా అనుకుంటావు—నేను ప్రాకారాలులేని గ్రామాలు గల దేశం మీదికి వెళ్తాను, ప్రాకారాలు అడ్డగడియలు, గవునులు లేని దేశము మీదికి వెళ్తాను, నిమ్మళంగా నిర్భయంగా నివసించేవాళ్ల మీదికి వెళ్తాను. వాళ్లను దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకోవడానికి, పూర్వం పాడై మళ్లీ నివసించబడిన స్థలాల మీదికి తిరిగి వెళ్తాను, ఆయా జనములలో నుండి సమకూర్చబడి, పశువులు, సరుకులు కలిగి, భూమి నట్టనడుమ నివసించే జనుల మీదికి తిరిగి వెళ్తాను.’ (యెహె. 38:10-12) దేవుని ప్రజలు “భూమి నట్టనడుమ” ఉన్నట్లుగా, అంటే ప్రజలందరికన్నా ప్రత్యేకంగా ఉన్నట్లు కనిపిస్తారు. దాంతో గోగు ఆత్రంగా అభిషిక్తులమీద, వాళ్లకు మద్దతిస్తున్న వాళ్లమీద దాడి చేస్తాడు.
11. (ఎ) మహాశ్రమల కాలంలో జరిగే సంఘటనల క్రమం గురించి మనం ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి? (బి) ఆకాశంలో కనిపించే సూచనలు, సంఘటనలు చూసి ప్రజలు ఎలా స్పందిస్తారు?
11 తర్వాత ఏమి జరుగుతుంది? ఆ తర్వాత జరిగే సంఘటనలు ఖచ్చితంగా ఏ క్రమంలో జరుగుతాయో బైబిలు చెప్పడం లేదు. బహుశా కొన్ని సంఘటనలు ఒకే సమయంలో జరగవచ్చు. యుగసమాప్తికి సంబంధించిన ప్రవచనంలో యేసు ఇలా చెప్పాడు, “సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటివిషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు.” (లూకా 21:25-27; మార్కు 13:24-26 చదవండి.) ఈ ప్రవచన నెరవేర్పులో భాగంగా ఆకాశంలో భయపెట్టే సూచనలు, సంఘటనలు జరుగుతాయా? మనం వేచి చూడాల్సిందే. అయితే ఆ సూచనల్ని చూసి మన శత్రువులు భయపడిపోతారు.
12, 13. (ఎ) యేసు ‘ప్రభావముతో మహా మహిమతో’ వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? (బి) అప్పుడు దేవుని ప్రజలు ఎలా స్పందిస్తారు?
12 యేసు ‘ప్రభావముతో మహా మహిమతో’ వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? నమ్మకంగా ఉన్నవాళ్లకు ప్రతిఫలమిచ్చి, నమ్మకంగా లేనివాళ్లను శిక్షిస్తాడు. (మత్త. 24:46, 47, 50, 51; 25:19, 28-30) దీన్ని వివరించడానికి యేసు ఈ ఉపమానం చెప్పాడు, “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.” (మత్త. 25:31-33) గొర్రెలకు, మేకలకు ఏమి జరుగుతుంది? యేసు వాళ్లకు తీర్పుతీరుస్తాడు. మేకలు అంటే నమ్మకంగా లేనివాళ్లు “నిత్యశిక్షను,” గొర్రెలు అంటే నమ్మకంగా ఉన్నవాళ్లు నిత్యజీవాన్ని పొందుతారు.—మత్త. 25:46.
13 తాము నాశనం అవుతామని తెలుసుకున్నప్పుడు మేకల్లాంటి ప్రజలు ఎలా స్పందిస్తారు? వాళ్లు దుఃఖంతో ‘రొమ్ము కొట్టుకుంటారు.’ (మత్త. 24:30) మరి అభిషిక్తుల, వాళ్లకు మద్దతిచ్చేవాళ్ల సంగతేంటి? “ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నది” అని యేసు చెప్పినట్లు వాళ్లు ధైర్యంగా ఉంటారు.—లూకా 21:28.
రాజ్యంలో సూర్యునివలె తేజరిల్లుతారు
14, 15. మాగోగువాడగు గోగు దాడి మొదలైన తర్వాత ఏమి జరుగుతుంది? అభిషిక్తులు ఎలా పోగుచేయబడతారు?
14 మాగోగువాడగు గోగు దేవుని ప్రజలమీద దాడి చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏమి జరుగుతుంది? అప్పుడు మనుష్యకుమారుడు ‘దూతలను పంపించి భూలోకం మొదలుకొని ఆకాశం వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకొన్నవాళ్లను పోగుచేయించును’ అని బైబిలు చెప్తుంది. (మార్కు 13:27; మత్త. 24:31) ఈ ‘పోగుచేయడం’ అభిషిక్తులను ఎంపిక చేయడాన్నిగానీ, భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులు చివరి ముద్ర పొందడాన్నిగానీ సూచించట్లేదు. (మత్త. 13:37, 38) వాళ్లు మహాశ్రమలు మొదలవ్వడానికి కొంచెం ముందే చివరి ముద్రను పొందివుంటారు. (ప్రక. 7:1-4) మరి ఆ పోగుచేయడం దేన్ని సూచిస్తుంది? భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులు పరలోక బహుమానం పొందడాన్ని అది సూచిస్తుంది. (1 థెస్స. 4:15-17; ప్రక. 14:1) గోగు దాడి మొదలైన తర్వాత ఏదో ఒక సమయంలో వాళ్లు ఆ బహుమానాన్ని పొందుతారు. (యెహె. 38:11) అప్పుడు యేసు చెప్పినట్లు, “నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు.”—మత్త. 13:43. b
15 తాము మానవ శరీరాలతోనే పరలోకానికి ఎత్తబడతామని క్రైస్తవమత సామ్రాజ్యంలోని చాలామంది అనుకుంటారు. అంతేకాదు, యేసు భూమిని పరిపాలించడానికి వచ్చినప్పుడు ఆయన్ను చూస్తామని కూడా వాళ్లు అనుకుంటారు. అయితే, యేసు రాకడ అదృశ్యంగా ఉంటుందని బైబిలు స్పష్టంగా చెప్తుంది. “మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును” అని, యేసు ‘మేఘారూఢుడై వస్తాడు’ అని బైబిలు చెప్తుంది. (మత్త. 24:30) “రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు” అని కూడా చెప్తుంది. కాబట్టి వాళ్లు ‘ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మార్పు పొంది’ పరలోకానికి వెళ్తారు. c (1 కొరింథీయులు 15:50-53 చదవండి.) అవును, భూమ్మీద మిగిలివున్న నమ్మకమైన అభిషిక్తులందరూ రెప్పపాటున పోగుచేయబడతారు.
16, 17. గొర్రెపిల్ల వివాహానికి ముందు ఏమి జరుగుతుంది?
16 అభిషిక్తులందరూ పరలోకానికి వెళ్లిన తర్వాత, గొర్రెపిల్ల వివాహానికి చివరి ఏర్పాట్లు మొదలౌతాయి. (ప్రక. 19:9) అయితే, ఆ వివాహానికి ముందు మరో సంఘటన జరుగుతుంది. అభిషిక్తులు ఇంకా భూమ్మీదున్నప్పుడే, గోగు దేవుని ప్రజలమీద దాడి చేయడం మొదలుపెట్టాడని గుర్తుతెచ్చుకోండి. (యెహె. 38:16) అప్పుడు దేవుని ప్రజలు ఏమి చేస్తారు? వాళ్లు ఈ సలహాను పాటిస్తారు, ‘ఈ యుద్ధంలో మీరు పోరాడాల్సిన అవసరం లేదు. మీరు యుద్ధపంక్తులు తీర్చి నిలబడండి. మీతోకూడ ఉన్న యెహోవా దయచేసే రక్షణను మీరు చూస్తారు. భయపడకండి జడియకండి.’ (2 దిన. 20:17) గోగు దాడి మొదలైన తర్వాత ఏదో ఒక సమయంలో, భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులు పరలోకానికి వెళ్తారు. అప్పుడు యేసు ఏమి చేస్తాడో ప్రకటన 17:14 చెప్తుంది. దేవుని ప్రజల శత్రువులు ‘గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు గనుక విజయం పొందుతాడు. ఆయన వెంట ఆయన పిలిచిన వాళ్లు, ఆయన ఎన్నుకొన్నవాళ్లు, ఆయన్ని విశ్వసించే వాళ్లు ఉంటారు.’ (పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) అలా యేసూ 1,44,000 మంది సహరాజులూ కలిసి భూమ్మీదున్న దేవుని ప్రజల్ని కాపాడతారు.
17 వాళ్లు దేవుని ప్రజల్ని కాపాడడం కోసం హార్మెగిద్దోను యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం యెహోవా పరిశుద్ధ నామాన్ని మహిమపరుస్తుంది. (ప్రక. 16:14-16) మేకలుగా తీర్పు పొందినవాళ్లు, అంటే నమ్మకంగాలేని వాళ్లందరూ నాశనమౌతారు. అప్పుడు ఇక భూమ్మీద చెడ్డవాళ్లే ఉండరు. ‘గొప్పసమూహం’ హార్మెగిద్దోనును తప్పించుకుంటుంది. చివరిగా, గొర్రెపిల్ల వివాహంతో ప్రకటన గ్రంథం సంతోషకరమైన ముగింపుకొస్తుంది. (ప్రక. 21:1-4) d హార్మెగిద్దోనును తప్పించుకున్న వాళ్లందరూ దేవుని అనుగ్రహం పొంది, ఆయన ప్రేమతో ఇచ్చేవాటిని అనుభవిస్తారు. ఆ గొప్ప పెళ్లి విందు కోసం మనందరం ఆశతో ఎదురుచూద్దాం.—2 పేతురు 3:13 చదవండి.
18. త్వరలో ఉత్తేజకరమైన సంఘటనలు జరగబోతున్నాయి కాబట్టి మనం ఏమి చేయాలని నిశ్చయించుకోవాలి?
18 ఇలాంటి ఉత్తేజకరమైన సంఘటనలు త్వరలో జరగబోతున్నాయి కాబట్టి మనలో ప్రతీ ఒక్కరం ఏమి చేయాలి? అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు, ‘ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో, ఎంతో జాగ్రత్తగలవారై ఉండాలి . . . ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగా, నిందారహితులుగా కనబడునట్లు జాగ్రత్తపడండి.’ (2 పేతు. 3:11-12, 14) కాబట్టి మనం దేవున్ని పరిశుద్ధంగా ఆరాధిస్తూ, సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తుకు మద్దతిద్దాం.
c ఆ సమయంలో జీవిస్తున్న అభిషిక్తులు భౌతిక శరీరాలతో పరలోకానికి వెళ్లరు. (1 కొరిం. 15:48, 49) యెహోవా యేసు శరీరాన్ని లేకుండా చేసినట్టే, బహుశా వాళ్ల శరీరాల్ని కూడా లేకుండా చేస్తాడు.
d సంఘటనలు ఏ క్రమంలో జరుగుతాయో 45వ కీర్తన చెప్తుంది. రాజు ముందు యుద్ధం చేస్తాడు, తర్వాత వివాహం జరుగుతుంది.