“ఆలాగు నీ దృష్టికి అనుకూలమాయెను”
‘నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపర్చావు.’—లూకా 10:21.
1. యేసు ఎందుకు ‘పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించాడు’? (ప్రారంభ చిత్రం చూడండి.)
యేసుక్రీస్తు ‘పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించినప్పుడు’ ఎలా ఉండివుంటాడో ఒకసారి ఊహించుకోండి. బహుశా ఆయన ముఖంలో నవ్వు, కళ్లల్లో ఆనందం ఉండివుంటాయి. అయితే యేసు ఎందుకంత సంతోషంగా ఉన్నాడు? ఆయన అంతకుముందే, 70మంది శిష్యుల్ని దేవుని రాజ్యసువార్త ప్రకటించడానికి పంపించాడు. సువార్త పనికి చాలామంది బలమైన శత్రువులున్నారు కాబట్టి తన శిష్యులు ఆ పనిని ఎలా చేశారో తెలుసుకోవాలని యేసు ఆత్రుతతో ఉన్నాడు. ఆ శత్రువుల్లో శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు. వాళ్లు బాగా చదువుకున్నవాళ్లు, పైగా తెలివైనవాళ్లు. ప్రజలు యేసును కేవలం ఓ వడ్రంగిలా, ఆయన శిష్యులను ‘విద్యలేని పామరులుగా’ చూడాలని వాళ్లు కోరుకున్నారు. (అపొ. 4:13; మార్కు 6:3) అయినప్పటికీ, శిష్యులు ప్రకటనాపని ముగించుకుని ఎంతో సంతోషంతో తిరిగొచ్చారు. మనుషులు, చివరికి దయ్యాలు ఆ పనిని వ్యతిరేకించినా, వాళ్లు ప్రకటించగలిగారు. వాళ్లు అంత సంతోషంగా, ధైర్యంగా ఎలా ఉండగలిగారు?—లూకా 10:1, 17-21 చదవండి.
2. (ఎ) యేసు తన శిష్యుల్ని ‘పసిబాలురు’ అని ఎందుకు అన్నాడు? (బి) వాళ్లు లోతైన లేఖన సత్యాలను ఎలా అర్థం చేసుకోగలిగారు?
2 యేసు యెహోవాతో ఇలా అన్నాడు, “తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.” (మత్త. 11:25, 26) యేసు తన శిష్యుల్ని ‘పసిబాలురు’ అని ఎందుకు అన్నాడు? తామే జ్ఞానులమని అనుకుంటున్న శాస్త్రులు, పరిసయ్యుల్లా కాకుండా, శిష్యులు చిన్నపిల్లలవలె నేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. వాళ్లు గర్వం లేకుండా, వినయంగా ఉండడం నేర్చుకున్నారు. (మత్త. 18:1-4) అందుకే, లోతైన లేఖన సత్యాలను అర్థం చేసుకోవడానికి యెహోవా పరిశుద్ధాత్మ ద్వారా వాళ్లకు సహాయం చేశాడు. కానీ, యూదా మతనాయకులు మాత్రం సాతాను ప్రభావంవల్ల, గర్వంవల్ల వాటిని అర్థం చేసుకోలేకపోయారు.
3. ఈ ఆర్టికల్‌లో మనమేమి చూస్తాం?
3 యేసు సంతోషించాడంటే ఆశ్చర్యం లేదు. చదువు, తెలివితేటలతో సంబంధం లేకుండా వినయంగల ప్రజలకు, యెహోవా లోతైన లేఖన సత్యాలను ఎలా తెలియజేశాడో చూసి యేసు సంతోషించాడు. అవును, స్పష్టంగా, తేలిగ్గా అర్థమయ్యేలా బోధించడాన్ని యెహోవా అంగీకరించాడు. ఆయన మార్పులేనివాడు. తాను ఇప్పటికీ అలాంటి బోధనా పద్ధతినే ఇష్టపడుతున్నానని యెహోవా ఎలా చూపించాడు? దాని జవాబును ఇప్పుడు పరిశీలిద్దాం, అప్పుడు యేసులాగే మనంకూడా సంతోషిస్తాం.
లోతైన సత్యాలను అందరికీ అర్థమయ్యేలా వివరించడం
4. కావలికోట సరళప్రతి ఒక బహుమతి అని ఎందుకు చెప్పవచ్చు?
4 ఈ మధ్య కాలంలో, దేవుని సంస్థ అంతకుముందు కన్నా స్పష్టంగా, తేలిగ్గా అర్థమయ్యేలా బైబిలు సత్యాలను బోధిస్తోంది. దీనికి సంబంధించి మూడు ఉదాహరణలు పరిశీలిద్దాం. మొదటిది, కావలికోట సరళప్రతి. a భాష అంతగా రానివాళ్లకు, అంతగా చదువుకోనివాళ్లకు ఇది ఓ చక్కని బహుమతి. సరళప్రతి వల్ల పిల్లలు కావలికోటను బాగా అర్థం చేసుకోగలుగుతున్నారని తల్లిదండ్రులు గమనించారు. చాలామంది తమ కృతజ్ఞతను చెప్తూ పరిపాలక సభకు ఉత్తరాలు రాశారు. ఓ సహోదరి, తాను కావలికోట అధ్యయనంలో జవాబులు చెప్పడానికి భయపడేదాన్నని రాసింది. కానీ ఇప్పుడు ఏమాత్రం భయపడట్లేదు. కావలికోట సరళప్రతి ఉపయోగించిన తర్వాత ఆమె ఇలా రాసింది, “నేను ఇప్పుడు ఎక్కువ వ్యాఖ్యానాలు ఇవ్వగలుగుతున్నాను. నా భయం పోయింది. యెహోవాకు, మీకు నా కృతజ్ఞతలు.”
5. రివైజ్డ్ ఎడిషన్ బైబిలు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?
5 రెండవది, 2013 అక్టోబరు 5న జరిగిన వార్షిక కూటంలో, పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదం రివైజ్డ్ ఎడిషన్‌ను ఇంగ్లీషులో విడుదల చేశారు. b ఆ బైబిల్లోని చాలా వచనాల్లో అంతకుముందుకన్నా తక్కువ పదాలు ఉన్నాయి. కానీ వాటి అర్థం ఏమాత్రం మారలేదు, పైగా ఇప్పుడు సులభంగా అర్థమౌతున్నాయి. ఉదాహరణకు, యోబు 10:1 వచనంలో 27 పదాలకు బదులు 19 పదాలను, అలాగే సామెతలు 8:6 వచనంలో 20 పదాలకు బదులు 13 పదాలను ఉపయోగించారు. అయితే ఆ వచనాలు ఇప్పుడే మరింత స్పష్టంగా అర్థమౌతున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా యెహోవాను నమ్మకంగా సేవిస్తున్న ఓ అభిషిక్త సహోదరుడు ఇలా అన్నాడు, ‘నేనిప్పుడే ఈ బైబిల్లో యోబు పుస్తకం చదివాను, నాకు అది మొదటిసారి బాగా అర్థమైనట్లు అనిపిస్తుంది!’ చాలామందికి అలాగే అనిపించింది.
6. మత్తయి 24:45-47 వచనాల అవగాహనలో వచ్చిన మార్పు గురించి మీకేమనిపిస్తుంది?
6 మూడవది, కొన్ని లేఖనాల అవగాహనలో ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పుల గురించి ఆలోచించండి. ఉదాహరణకు, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” విషయంలో వచ్చిన కొత్త అవగాహనను కావలికోట జూలై 15, 2013 సంచికలో పరిశీలించాం. (మత్త. 24:45-47) ‘నమ్మకమైన దాసుడు’ అంటే పరిపాలక సభ అని ఆ ఆర్టికల్ వివరించింది. ‘ఇంటివారు’ అంటే, నమ్మకమైన దాసుని ద్వారా ఆధ్యాత్మిక ఆహారం పొందుతున్న అభిషిక్తులు, అలాగే ‘వేరే గొర్రెలు’ అని అర్థంచేసుకున్నాం. (యోహా. 10:16) ఈ సత్యాలను తెలుసుకోవడం, వాటిని ఇతరులతో చెప్పడం మనకెంతో సంతోషాన్నిస్తుంది. స్పష్టంగా, తేలిగ్గా అర్థమయ్యేలా బోధించడాన్ని అంగీకరిస్తున్నానని యెహోవా ఇంకా ఏయే విధాలుగా చూపించాడు?
బైబిలు వృత్తాంతాల్లో ఉన్న స్పష్టమైన పాఠాల్ని వివరించడం
7, 8. బైబిల్లో ఉన్న ఏ వృత్తాంతాలు మరింత గొప్పవాటిని సూచించాయి?
7 మీరు ఎన్నో ఏళ్లుగా సత్యంలో ఉంటే, కొన్ని బైబిలు వృత్తాంతాలను సంస్థ వివరించే విధానంలో మార్పులు వచ్చాయని గమనించే వుంటారు. కొన్ని వృత్తాంతాలు, తర్వాత జరగబోయే మరింత గొప్పవాటిని సూచిస్తున్నాయని మన ప్రచురణలు గతంలో ఎక్కువగా చెప్పేవి. సంస్థ అలా వివరించడానికి సరైన కారణాలే ఉన్నాయి. ఉదాహరణకు, యేసు “యోనానుగూర్చిన సూచకక్రియ” గురించి ప్రస్తావించాడు. (మత్తయి 12:39, 40 చదవండి.) యోనా చేప కడుపులో గడిపిన రోజులు, తాను సమాధిలో ఉండబోయే రోజుల్ని సూచిస్తున్నాయని యేసు వివరించాడు.
8 బైబిల్లో ఉన్న మరికొన్ని వృత్తాంతాలు కూడా ఆ తర్వాత జరగబోయే గొప్పవాటిని సూచిస్తున్నాయి. వాటిలో కొన్నిటిని అపొస్తలుడైన పౌలు వివరించాడు. ఉదాహరణకు అబ్రాహాము-హాగరుల సంబంధం, యెహోవాకు ఇశ్రాయేలీయులతో ఉన్న సంబంధాన్నీ అబ్రాహాము-శారాల సంబంధం, యెహోవాకు ఆయన సంస్థలోని పరలోక భాగానికి ఉన్న సంబంధాన్నీ సూచించింది. (గల. 4:22-26) అలాగే ప్రత్యక్ష గుడారం, ఆలయం, ప్రాయశ్చిత్తార్థ దినం, ప్రధాన యాజకుడు, ధర్మశాస్త్రంలోని ఇతర విషయాలు “రాబోవుచున్న మేలుల ఛాయ” అని పౌలు చెప్పాడు. (హెబ్రీ. 9:23-25; 10:1) ఇలాంటి బైబిలు వృత్తాంతాలను, అవి సూచిస్తున్నవాటిని పరిశీలించినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. అయితే బైబిల్లోని ప్రతీ వ్యక్తి, సంఘటన, వస్తువు వేరే వ్యక్తులకు లేదా ముందుముందు జరగబోయే వాటికి సూచనని దానర్థమా?
9. నాబోతు గురించిన బైబిలు వృత్తాంతాన్ని సంస్థ గతంలో ఎలా వివరించింది?
9 బైబిల్లోని ప్రతీ వ్యక్తి, సంఘటన, వస్తువు వేరే వ్యక్తులను లేదా వేరేవాటిని సూచిస్తున్నట్లు గతంలో మనం తరచూ చెప్పేవాళ్లం. ఉదాహరణకు దుష్ట రాణియైన యెజెబెలు నాబోతును చంపించి, అతని ద్రాక్షతోటను తన భర్త ఆహాబుకు ఇచ్చిన సందర్భాన్నే తీసుకోండి. (1 రాజు. 21:1-16) అందులో ఆహాబు సాతానును, యెజెబెలు సాతాను వ్యవస్థను సూచించారనీ అలాగే నాబోతు యేసును, నాబోతు మరణం యేసు మరణాన్ని సూచిస్తున్నట్లు 1932లో కావలికోట పత్రిక చెప్పింది. అయితే 1961లో వచ్చిన “నీ నామము పరిశుద్ధ పరచబడుగాక” (ఇంగ్లీషు) అనే పుస్తకం, నాబోతు అభిషిక్త క్రైస్తవులకు, యెజెబెలు క్రైస్తవమత సామ్రాజ్యానికి సూచనగా ఉన్నారని చెప్పింది. యెజెబెలు వల్ల నాబోతు హింస అనుభవించడం, అంత్యదినాల్లో అభిషిక్త క్రైస్తవులు హింస అనుభవించడాన్ని సూచించిందని కూడా ఆ పుస్తకం చెప్పింది. అలాంటి వివరణలు చాలాకాలంగా దేవుని ప్రజల విశ్వాసాన్ని బలపర్చాయి. మరి వాటిని వివరించే విధానంలో ఇప్పుడు ఎందుకు మార్పు వచ్చింది?
10. (ఎ) కొన్ని వృత్తాంతాలను వివరించడంలో నమ్మకమైన దాసుడు ఎలా వివేచన చూపిస్తున్నాడు? (బి) ఇప్పుడు మన ప్రచురణలు ఎక్కువగా వేటి గురించి వివరిస్తున్నాయి?
10 సంవత్సరాలు గడుస్తుండగా ‘నమ్మకమైన, బుద్ధిమంతుడైన దాసుడు’ యెహోవా సహాయం వల్ల మరింత వివేచనతో ప్రవర్తిస్తున్నాడు. ఏ విధంగా? ఈ మధ్యకాలంలో ఆ దాసుడు బైబిల్లోని ఫలానా వృత్తాంతం, తర్వాత జరగబోయే గొప్పవిషయాన్ని సూచిస్తుందని సరైన లేఖనాధారం ఉన్నప్పుడు మాత్రమే వివరిస్తున్నాడు. కానీ ఒకప్పుడు ఇచ్చిన కొన్ని వివరణలను అర్థంచేసుకోవడం, గుర్తుంచుకోవడం, అన్వయించుకోవడం కష్టంగా ఉండేది. మరిముఖ్యంగా, ఫలానా బైబిలు వృత్తాంతం మరింత గొప్పదాన్ని సూచిస్తుందేమో అనుకుని, దాన్ని తెలుసుకోవడం మీదే దృష్టిపెట్టడంవల్ల, అందులోని ముఖ్యమైన పాఠాల్ని గుర్తించలేకపోయేవాళ్లం. అందుకే, ఇప్పుడు మన ప్రచురణలు బైబిలు వృత్తాంతాల్లో ఉన్న స్పష్టమైన, మనకు ఉపయోగపడే పాఠాల గురించే ఎక్కువగా చెప్తున్నాయి. ఆ వృత్తాంతాల నుండి మనం నేర్చుకోగల విశ్వాసం, సహనం, దైవభక్తి మరితర విలువైన లక్షణాల గురించే వివరిస్తున్నాయి. c
11. (ఎ) నాబోతు వృత్తాంతాన్ని మనం ఇప్పుడు ఎలా అర్థం చేసుకున్నాం? ఆయన నుండి మనం ఏ పాఠం నేర్చుకుంటాం? (బి) ఈ మధ్యకాలంలో మన ప్రచురణలు పోలికలు లేదా సాదృశ్యాల గురించి ఎందుకు అంతగా ప్రస్తావించట్లేదు? (ఈ సంచికలోని “పాఠకుల ప్రశ్న” చూడండి.)
11 మనం నాబోతు వృత్తాంతాన్ని ఇప్పుడు మరింత స్పష్టంగా, తేలిగ్గా అర్థంచేసుకున్నాం. నాబోతు యేసుకు లేదా అభిషిక్తులకు సూచనగా ఉన్నందుకు చనిపోలేదుగానీ, దేవునికి నమ్మకంగా ఉన్నందుకే చనిపోయాడు. అధికారంలో ఉన్నవాళ్లు తీవ్రంగా హింసించినప్పుడు కూడా ఆయన యెహోవా నియమాలకు కట్టుబడ్డాడు. (సంఖ్యా. 36:7; 1 రాజు. 21:3) తమ విశ్వాసం కారణంగా హింస అనుభవించే నేటి దేవుని సేవకులందరికీ ఆయన మంచి ఆదర్శం. (2 తిమోతి 3:12 చదవండి.) విశ్వాసాన్ని బలపర్చే ఆ పాఠాన్ని క్రైస్తవులందరూ అర్థంచేసుకోగలుగుతారు, దాన్ని గుర్తుపెట్టుకుని పాటించగలుగుతారు.
12. (ఎ) బైబిలు వృత్తాంతాల విషయంలో మనం ఏ అభిప్రాయానికి రాకూడదు? (బి) లోతైన విషయాలను కూడా మనం ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాం? (అధస్సూచి చూడండి.)
12 అయితే, బైబిలు వృత్తాంతాల్లో మనకు ఉపయోగపడే పాఠాలే తప్ప ఇంకేమీ లేవని అనుకోకూడదు. ఈ మధ్యకాలంలో మన ప్రచురణలు ఎక్కువగా, ఒక బైబిలు వృత్తాంతం మరో వృత్తాంతాన్ని గుర్తుచేస్తుందని లేదా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుందని చెప్తున్నాయి. అంతేకానీ అవి రాబోయేవాటికి సూచనలుగా ఉన్నాయని చెప్పట్లేదు. ఉదాహరణకు, దేవునికి నమ్మకంగా ఉండడం వల్ల హింసలు అనుభవించి, చనిపోయిన నాబోతు గురించి చదివినప్పుడు, యేసు, అభిషిక్తులు చూపించిన యథార్థత మనకు గుర్తొస్తుంది. అలాగే, ‘వేరే గొర్రెల’ యథార్థత కూడా మనకు గుర్తొస్తుంది. వీటన్నిటిని చూస్తే యెహోవా మనకు తేలిగ్గా అర్థమయ్యేలా బోధిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. d
యేసు చెప్పిన ఉపమానాలను తేలిగ్గా అర్థమయ్యేలా వివరించడం
13. యేసు చెప్పిన ఉపమానాలను మన ప్రచురణలు ఇప్పుడు మరింత స్పష్టంగా, తేలిగ్గా అర్థమయ్యేలా వివరిస్తున్నాయని ఏ ఉదాహరణల్ని బట్టి చెప్పవచ్చు?
13 భూమ్మీద జీవించిన వాళ్లందరిలో యేసుక్రీస్తు గొప్ప బోధకుడు. బోధించేటప్పుడు ఉపమానాలు, ఉదాహరణలు ఉపయోగించడం ఆయనకు ఇష్టం. (మత్త. 13:34) ఉపమానాలు చాలా సమర్థవంతంగా ఉంటాయి, ఎందుకంటే అవి కష్టమైన విషయాల్ని కూడా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి. అవి మనల్ని ఆలోచింపజేసి, మన హృదయాన్ని కదిలిస్తాయి. ఇటీవలి సంవత్సరాల్లో మన ప్రచురణలు, యేసు చెప్పిన ఉపమానాలను మరింత స్పష్టంగా, తేలిగ్గా అర్థమయ్యేలా వివరిస్తున్నాయి. ఉదాహరణకు పుల్లని పిండి, ఆవగింజ, వల ఉపమానాల గురించి కావలికోట జూలై 15, 2008 సంచిక చాలా స్పష్టంగా వివరించింది. ఆ ఉపమానాలు దేవుని రాజ్యం గురించీ, ఈ దుష్టలోకం నుండి క్రీస్తు నిజమైన శిష్యులను సమకూర్చడంలో అది సాధించిన విజయం గురించీ మాట్లాడుతున్నాయని మరింత స్పష్టంగా అర్థం చేసుకున్నాం.
14. (ఎ) మంచి సమరయుని ఉపమానాన్ని సంస్థ అంతకుముందు ఎలా వివరించింది? (బి) ఆ ఉపమానంలోని ముఖ్యమైన పాఠం ఏమిటి?
14 మరి యేసు చెప్పిన దృష్టాంతాలు లేదా చిన్నకథల సంగతేంటి? కొన్ని దృష్టాంతాలు భవిష్యత్తులో జరిగేవాటిని సూచిస్తే, మరికొన్ని మనకు ఉపయోగపడే పాఠాలు నేర్పిస్తాయి. అయితే, వాటిలో ఏవి సూచనార్థకమైనవి, ఏవి కావు అని మనకెలా తెలుస్తుంది? ఈ విషయంలో మన అవగాహన గడిచిన సంవత్సరాల్లో చాలా మెరుగైంది. ఉదాహరణకు, యేసు చెప్పిన మంచి సమరయుని ఉపమానమే తీసుకోండి. (లూకా 10:30-37) వాచ్ టవర్ పత్రిక 1924లో, సమరయుడు యేసును సూచిస్తున్నాడనీ, యెరూషలేము నుండి యెరికోకు వెళ్లే దారి, ఏదెనులో తిరుగుబాటు తర్వాత అంతకంతకు దిగజారుతున్న మనుషుల పరిస్థితిని సూచిస్తుందనీ వివరించింది. ఆ దారిలో ఉన్న దొంగలు పెద్దపెద్ద సంస్థలను, ధనాపేక్షగల వ్యాపారస్థులను సూచిస్తున్నారనీ, యాజకుడు-లేవీయుడు క్రైస్తవమత సామ్రాజ్యాన్ని సూచిస్తున్నారనీ ఆ పత్రిక వివరించింది. కానీ, ఇప్పుడు మన ప్రచురణలు, ఆ ఉపమానం నుండి విలువైన పాఠాన్ని నేర్పిస్తున్నాయి. అదేమిటంటే, మనం పక్షపాతం లేకుండా అవసరంలో ఉన్నవాళ్లందరికీ సహాయం చేయాలి, ముఖ్యంగా దేవుని గురించిన సత్యాన్ని వాళ్లకు బోధించాలి. యెహోవా మనకు సత్యాన్ని ఇంత స్పష్టంగా బోధిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం.
15. తర్వాతి ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?
15 మనం తర్వాతి ఆర్టికల్‌లో, యేసు చెప్పిన పదిమంది కన్యకల ఉపమానాన్ని చర్చిస్తాం. (మత్త. 25:1-13) అంత్యదినాల్లో జీవించే తన శిష్యులు ఆ ఉపమానాన్ని ఎలా అర్థంచేసుకోవాలని యేసు కోరుకున్నాడు? ఆ ఉపమానంలోని ప్రతీ వ్యక్తి, వస్తువు, సంఘటన రాబోయే గొప్పవాటిని సూచిస్తున్నాయా? లేక, ఆ ఉపమానం ద్వారా చివరిరోజుల్లో మనకు ఉపయోగపడే పాఠాల్ని యేసు నేర్పించాలనుకున్నాడా? తర్వాతి ఆర్టికల్‌లో వీటి గురించి చూద్దాం.
a కావలికోట సరళప్రతి ముందుగా ఇంగ్లీషులో 2011, జూలైలో అందుబాటులోకి వచ్చింది. తర్వాత అది, కొన్ని ఇతర భాషల్లో కూడా వస్తోంది.
b రివైజ్డ్ ఎడిషన్ బైబిలు ముందుముందు ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి వస్తుంది.
c ఉదాహరణకు, వాళ్లలా విశ్వాసం చూపించండి పుస్తకంలో బైబిల్లోని 14 మంది వ్యక్తుల గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే, వాళ్లు ఎవరికి సూచనగా ఉన్నారు అనే దానికన్నా, వాళ్లనుండి మనం నేర్చుకోగల పాఠాల గురించే ఈ పుస్తకం ఎక్కువగా వివరిస్తుంది.
d బైబిల్లో ‘గ్రహించడానికి కష్టంగా’ అనిపించే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, పౌలు రాసిన కొన్ని విషయాలు అలాంటివే. అయితే, బైబిలు రచయితలందరూ పరిశుద్ధాత్మ సహాయంతోనే రాశారు. నేడు అదే పరిశుద్ధాత్మ ‘దేవుని మర్మాలతో’ సహా బైబిల్లోని విషయాల్ని అర్థం చేసుకోవడానికి నిజ క్రైస్తవులకు సహాయం చేస్తుంది.—2 పేతు. 3:16, 17; 1 కొరిం. 2:10.