కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సహాయంతో మీ వివాహ బంధాన్ని బలపర్చుకోండి, కాపాడుకోండి

యెహోవా సహాయంతో మీ వివాహ బంధాన్ని బలపర్చుకోండి, కాపాడుకోండి

“యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొని యుండుట వ్యర్థమే.”—కీర్త. 127:1.

1, 2. (ఎ) అద్భుతమైన బహుమానాన్ని 24,000 ఇశ్రాయేలీయులు ఎందుకు చేజార్చుకున్నారు? (బి) దాని నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

 వాగ్దాన దేశంలోకి వెళ్లడానికి కొద్దికాలం ముందు, కొన్ని వేలమంది ఇశ్రాయేలీయులు ‘మోయాబు స్త్రీలతో వ్యభిచారం’ చేశారు. దానివల్ల 24,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. ఒక్కసారి ఊహించండి, దేవుడు ఇవ్వబోయే అద్భుతమైన బహుమానం కోసం అంటే వాగ్దాన దేశంలోకి వెళ్లాలని వాళ్లు ఎంతగానో ఎదురుచూశారు. కానీ అది దాదాపు చేతికందే సమయంలో తప్పు చేసి దాన్ని చేజార్చుకున్నారు.—సంఖ్యా. 25:1-5, 9.

2 ఆ ఉదాహరణను, “యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై” దేవుడు బైబిల్లో రాయించాడు. (1 కొరిం. 10:6-11) మనం ‘అంత్యదినాల’ చివర్లో జీవిస్తున్నాం, కొత్త లోకం చాలా దగ్గర్లో ఉంది. (2 తిమో. 3:1; 2 పేతు. 3:13) అయితే విచారకరంగా, యెహోవా సేవకుల్లో కొంతమంది జాగ్రత్తగా లేకపోవడం వల్ల, తప్పు చేయాలనే శోధనకు లొంగిపోయారు. ఇప్పుడు ఆ ఫలితాలను అనుభవిస్తున్నారు. వాళ్లు గనుక చేసిన తప్పుకు బాధపడి, ప్రవర్తన మార్చుకోకపోతే, పరదైసులో నిత్యం జీవించే అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటారు.

3. భార్యాభర్తలకు యెహోవా నిర్దేశం, కాపుదల ఎందుకు అవసరం? (ప్రారంభ చిత్రం చూడండి.)

3 విచ్చలవిడితనంతో నిండిపోయిన ఈ లోకంలో భార్యాభర్తలు తమ బంధాన్ని కాపాడుకోవాలంటే వాళ్లకు యెహోవా నిర్దేశం, కాపుదల అవసరం. (కీర్తన 127:1 చదవండి.) దంపతులు తమ వివాహబంధాన్ని కాపాడుకోవాలంటే ఐదు పనులు చేయాలి: 1. హృదయాన్ని కాపాడుకోవాలి 2. దేవునికి దగ్గరవ్వాలి 3. కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి 4. చక్కగా మాట్లాడుకోవాలి 5. వివాహ ధర్మం నిర్వర్తించాలి. వాటిలో ఒక్కొక్క దానిగురించి ఇప్పుడు చర్చిద్దాం.

మీ హృదయాన్ని కాపాడుకోండి

4. కొంతమంది క్రైస్తవులు తప్పుడు ప్రవర్తనకు ఎందుకు పాల్పడ్డారు?

4 ఒక క్రైస్తవుడు తప్పు చేసేంత దూరం ఎలా వెళ్తాడు? అది ఎక్కువగా కళ్లతోనే మొదలౌతుంది. “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును” అని యేసు చెప్పాడు. (మత్త. 5:27, 28; 2 పేతు. 2:14) తప్పుడు ప్రవర్తనకు పాల్పడిన చాలామంది అశ్లీల చిత్రాలను చూడడం, రెచ్చగొట్టే పుస్తకాలను చదవడం లేదా ఇంటర్నెట్‌లో ఘోరమైన దృశ్యాలను చూడడం వంటివిచేసి తమ నైతిక విలువలను దిగజార్చుకున్నారు. మరికొంతమంది శరీర కోరికలను రెచ్చగొట్టే సిగ్గుమాలిన సినిమాలు, నాటకాలు లేదా టీవీ కార్యక్రమాలు చూశారు. ఇంకొంతమంది నైట్‌క్లబ్‌లకు, అశ్లీలత ఉండే మరితర చోట్లకు లేదా తప్పుడు పనులు జరిగే మసాజ్‌ పార్లర్‌లకు వెళ్లారు.

5. మన హృదయాన్ని ఎందుకు కాపాడుకోవాలి?

5 పెళ్లైన కొంతమంది, పరాయి వ్యక్తి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించి శోధనలో పడిపోయారు. కోరికలను ఏమాత్రం అదుపుచేసుకోని ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. వాళ్లు అనైతిక విషయాలను ఎంతో ఇష్టపడతారు. అంతేకాక, మన హృదయం కూడా మోసకరమైనది, ఘోరమైన వ్యాధిగలది కాబట్టి, మన భర్త/భార్య కాని వ్యక్తి మీద ఇట్టే ఇష్టం పెంచుకునే అవకాశం ఉంది. (యిర్మీయా 17:9, 10 చదవండి.) ‘దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు హృదయంలో నుండే’ వస్తాయని యేసు చెప్పాడు.—మత్త. 15:19.

6, 7. (ఎ) హృదయంలో తప్పుడు కోరికలు మొదలైతే, ఏమి జరగవచ్చు? (బి) తప్పు చేయకుండా ఉండాలంటే ఏంచేయాలి?

6 హృదయంలో ఒక్కసారి తప్పుడు కోరికలు మొదలయ్యాక, వాళ్లు తమ భర్తతో/భార్యతో మాత్రమే మాట్లాడాల్సిన విషయాలను ఆ వ్యక్తితో చెప్పుకోవడం మొదలుపెడతారు. కొంతకాలానికే, ఒకరినొకరు కలుసుకోవడం కోసం సాకులు వెదుకుతారు. ఎక్కువసార్లు కలుసుకుంటారు, కానీ అనుకోకుండా కలిసినట్లు నటిస్తారు. ఒకరిమీద ఒకరికి ఇష్టం పెరిగేకొద్దీ, తప్పు చేయకుండా ఉండడం మరింత కష్టమౌతుంది. వాళ్ల మధ్య బంధం బలపడే కొద్దీ, దాన్ని తెంచేసుకోవడం ఇంకా కష్టంగా మారుతుంది. చేసేది తప్పని తెలిసినా వాళ్లు దాన్ని మానుకోలేరు.—సామె. 7:21, 22.

7 తప్పుడు కోరికలు, మాటలు ఎక్కువయ్యే కొద్దీ యెహోవా ప్రమాణాలను మెల్లమెల్లగా పక్కనపెడుతూ, చేతులు పట్టుకోవడం, ముద్దుపెట్టుకోవడం, నిమరడం, కోరికను తెలియజేసేలా ముట్టుకోవడం చేస్తుంటారు. ఆ విధంగా, భర్తతో/ భార్యతో మాత్రమే చేయాల్సిన వాటిని పరాయివ్యక్తితో చేస్తుంటారు. వాళ్ల కోరికే వాళ్లను ‘ఈడ్చి’ వలలో పడేస్తుంది. చివరికి, ఆ కోరిక ఎక్కువైనప్పుడు, వాళ్లు వ్యభిచారానికి పాల్పడతారు. (యాకో. 1:14, 15) విషాదకరమైన విషయం ఏమిటంటే, వాళ్లిద్దరూ యెహోవా మాటవిని వివాహ బంధం పట్ల గౌరవాన్ని పెంచుకుని ఉంటే, పరిస్థితి అంత దూరం వెళ్లేది కాదు. మరి, అలాంటి గౌరవాన్ని ఎలా పెంచుకోవచ్చు?

దేవునికి దగ్గరౌతూనే ఉండండి

8. యెహోవాతో మనకున్న స్నేహం, పాపం చేయకుండా మనల్ని ఎలా కాపాడుతుంది?

8 కీర్తన 97:10 చదవండి. యెహోవాతో మనకున్న స్నేహం, పాపం చేయకుండా మనల్ని కాపాడుతుంది. ఆయనకున్న అద్భుతమైన లక్షణాల గురించి తెలుసుకున్నప్పుడు మనం ‘ప్రియులైన పిల్లల్లా దేవుణ్ణి’ అనుకరిస్తూ ‘ప్రేమ కలిగి నడుచుకుంటాం.’ దానివల్ల ‘జారత్వాన్ని,’ అన్ని రకాలైన ‘అపవిత్రతను’ ఎదిరించగలుగుతాం. (ఎఫె. 5:1-4) ‘వేశ్యాసంగులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు’ అనే విషయాన్ని దంపతులు గుర్తుంచుకుంటే, వాళ్లు ఒకరికొకరు నమ్మకంగా ఉండడానికి తీవ్రంగా కృషి చేస్తారు.—హెబ్రీ. 13:4.

9. (ఎ) తన యజమాని భార్య బలవంతపెడుతున్నా యోసేపు నమ్మకంగా ఎలా ఉండగలిగాడు? (బి) ఆయన నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

9 కొంతమంది క్రైస్తవులు, ఆఫీసు అయిపోయిన తర్వాత కూడా సాక్షులుకాని వాళ్లతో సమయం గడుపుతూ నైతిక ప్రమాదాల్ని కొనితెచ్చుకున్నారు. ఇంకొంతమందికి పని చేసేటప్పుడు కూడా శోధనలు ఎదురయ్యాయి. యువకుడైన యోసేపుకు అలాంటి శోధనే ఎదురైంది. యోసేపు యజమాని భార్య ఆయనను ఇష్టపడింది. తన కోరిక తీర్చమని ఆమె ప్రతీరోజు బలవంతపెట్టేది. చివరికి ఓ రోజు ఆమె, “అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని” అడిగింది. కానీ యోసేపు అందుకు ఒప్పుకోకుండా అక్కడి నుండి పారిపోయాడు. అలాంటి పరిస్థితిలో ఆయన అంత నమ్మకంగా ఎలా ఉండగలిగాడు? ఎందుకంటే, యెహోవాతో తనకున్న స్నేహాన్ని కాపాడుకోవాలని యోసేపు గట్టిగా నిర్ణయించుకున్నాడు. దానివల్ల యోసేపు ఉద్యోగం పోగొట్టుకుని, జైలుపాలయ్యాడు, కానీ యెహోవా ఆయన్ను ఆశీర్వదించాడు. (ఆది. 39:1-12; 41:38-43) మనం పని స్థలంలో ఉన్నా, ఇంకెక్కడున్నా తప్పు చేసే పరిస్థితులకు దూరంగా ఉండాలి.

కొత్త స్వభావాన్ని ధరించుకోండి

10. దంపతులు కొత్త స్వభావాన్ని ఎందుకు ధరించుకోవాలి?

10 దంపతులు తప్పుడు కోరికలకు లొంగిపోకుండా ఉండాలంటే, “దేవుడు తన పోలికలో సృజించిన కొత్త స్వభావం [వాళ్లు] ధరించుకోవాలి. ఇది నిజమైన పవిత్రత నీతినిజాయితీ గల స్వభావం.” (ఎఫె. 4:24, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) కొత్త స్వభావాన్ని ధరించుకునేవాళ్లు, ‘జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ’ వంటివాటితో పోరాడుతూ తమ ‘అవయవాలను చంపేస్తారు.’ (కొలొస్సయులు 3:5, 6 చదవండి.) ‘చంపేయండి’ అనే మాట, తప్పుడు కోరికలను తరిమికొట్టడానికి మనం చేయగలిగినదంతా చేయాలని సూచిస్తుంది. అదేవిధంగా తప్పుడు కోరికల్ని పెంచే ప్రతీదానికి మనం దూరంగా ఉండాలి. (యోబు 31:1) దేవుని ప్రమాణాల ప్రకారం జీవించినప్పుడు మనం ‘చెడ్డదాన్ని’ అసహ్యించుకుంటాం, ‘మంచిదాన్ని’ గట్టిగా హత్తుకొని ఉంటాం.—రోమా. 12:2, 9.

11. కొత్త స్వభావం వివాహ బంధాన్ని ఎలా బలంగా ఉంచుతుంది?

11 మనం కొత్త స్వభావాన్ని ధరించుకుంటే, యెహోవాకున్న లక్షణాలను చూపిస్తాం. (కొలొ. 3:9, 10) భార్యాభర్తలు ‘జాలిగల మనస్సును, దయాళుత్వాన్ని, వినయాన్ని, సాత్వికాన్ని, దీర్ఘశాంతాన్ని’ చూపిస్తే, వాళ్ల బంధం మరింత బలపడుతుంది, యెహోవా వాళ్లను ఆశీర్వదిస్తాడు. (కొలొ. 3:12) అంతేకాక, ‘క్రీస్తు అనుగ్రహించే సమాధానం వాళ్ల హృదయాల్లో’ ఉంటే, వాళ్లు మరింత అన్యోన్యంగా ఉంటారు. (కొలొ. 3:15) దంపతులకు ఒకరి మీద ఒకరికి “అనురాగం” ఉంటే శ్రద్ధ, గౌరవం చూపించుకోవడంలో ముందుంటారు.—రోమా. 12:10.

12. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఏయే లక్షణాలు అవసరమని మీకనిపిస్తుంది?

12 సంతోషంగా ఉండడానికి మీకు ఏ లక్షణాలు సహాయం చేశాయని సిడ్‌, సోన్య అనే జంటను అడిగినప్పుడు, భర్త ఇలా చెప్పాడు, “మేం ఎల్లప్పుడూ ఒకరిమీద ఒకరం ప్రేమ చూపించుకోవడానికి కృషి చేశాం. దానితోపాటు, మృదు స్వభావం కూడా చాలా ముఖ్యమని అనుభవంతో తెలుసుకున్నాం.” భార్య సోన్య ఆ మాటలతో ఒప్పుకుంటూ, “దయ చాలా ముఖ్యమైన లక్షణం. అంతేకాక, కొన్నిసార్లు కష్టమైనా మేమిద్దరం వినయం చూపించడానికి కృషి చేశాం” అని చెప్పింది.

చక్కగా మాట్లాడుకోండి

13. వివాహ బంధం బలంగా ఉండాలంటే ఏమి అవసరం? ఎందుకు?

13 వివాహ బంధాన్ని బలంగా ఉంచుకోవాలంటే, దంపతులు దయగా మాట్లాడుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే కొంతమంది, కనీసం కొత్తవాళ్లతో మాట్లాడేటప్పుడు ఇచ్చే గౌరవమర్యాదలు కూడా తమ భర్తతో/భార్యతో మాట్లాడేటప్పుడు ఇవ్వరు. భార్యాభర్తల మధ్య “ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి [“అరుచుకోవడం,” NW], దూషణ” లాంటివి ఉంటే, వాళ్ల బంధం మెల్లమెల్లగా బలహీనపడుతుంది. (ఎఫె. 4:31) అతిగా విమర్శించడం, వెటకారంగా మాట్లాడడం వల్ల కూడా దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. కాబట్టి భార్యాభర్తలు దయగా, ఆప్యాయంగా, ఒకరినొకరు అర్థంచేసుకుంటూ మాట్లాడుకోవడం ద్వారా తమ బంధాన్ని బలపర్చుకోవచ్చు.—ఎఫె. 4:32.

14. భార్యాభర్తలు ఏమి చేయకూడదు?

14 కొన్నిసార్లు మనం ‘మౌనంగా’ ఉండాలని బైబిలు చెబుతుంది. (ప్రసం. 3:7) అయితే, మీ భర్తతో/భార్యతో మాట్లాడకుండా మౌనంగా ఉండమని దానర్థం కాదు. ఎందుకంటే చక్కగా మాట్లాడుకుంటేనే దంపతుల మధ్య అనుబంధం బలంగా ఉంటుంది. జర్మనీకి చెందిన ఓ భార్య ఏమంటుందో వినండి, “అలాంటి సందర్భాల్లో మీరు మాట్లాడకుండా ఉంటే మీ భాగస్వామి మనసు గాయపడుతుంది.” అయితే ఆమె ఇంకా ఏం చెప్తుందంటే, “ఒత్తిడికి గురైనప్పుడు ప్రశాంతంగా ఉండడం అంత సులభమేమీ కాదు. అలాగని కోపాన్ని వెళ్లగక్కడం కూడా సరికాదు. అప్పుడు మీరు ఆలోచించకుండా అనే మాటలు, చేసే పనులు మీ భాగస్వామిని బాధపెట్టే అవకాశం ఉంది, దానివల్ల పరిస్థితి మరింత ఘోరంగా తయారౌతుంది.” గట్టిగా అరుచుకోవడం వల్ల లేదా అస్సలు మాట్లాడుకోకుండా ఉండడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. దానికి బదులు, చిన్నచిన్న సమస్యలు గొడవలుగా మారకముందే త్వరగా వాటిని పరిష్కరించుకుంటే వివాహ బంధం బలంగా ఉంటుంది.

15. చక్కగా మాట్లాడుకోవడం భార్యాభర్తల బంధాన్ని ఎలా బలంగా ఉంచుతుంది?

15 దంపతులారా, మీరు సమయం తీసుకుని మీ ఆలోచనలను, మనసులోని భావాలను ఒకరికొకరు చెప్పుకుంటే మీ అనుబంధం గట్టిగా ఉంటుంది. మీరు మీ భర్తతో/భార్యతో ఏమి చెప్తున్నారనేది ముఖ్యమే, కానీ వాటిని ఎలా చెప్తున్నారనేది కూడా ముఖ్యమే. కాబట్టి మీరు ఒత్తిడిలో ఉన్నా, సరైన మాటలు ఎంచుకుని దయగా మాట్లాడండి. అప్పుడే మీ భర్త/భార్య మీరు చెప్పేది వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. (కొలొస్సయులు 4:6 చదవండి.) దంపతులు ప్రోత్సహించే, బలపర్చే మాటలు ఉపయోగిస్తూ చక్కగా మాట్లాడుకుంటే, వాళ్ల వివాహ బంధం బలంగా ఉంటుంది.—ఎఫె. 4:29.

భార్యాభర్తల అనుబంధం బలంగా ఉండాలంటే, వాళ్లు మనసువిప్పి మాట్లాడుకోవాలి (15వ పేరా చూడండి)

వివాహ ధర్మాన్ని నిర్వర్తించండి

16, 17. దంపతులు ఒకరి భావోద్వేగ, శారీరక అవసరాల్ని మరొకరు ఎందుకు పట్టించుకోవాలి?

16 భర్త/భార్య తన అవసరాల కన్నా తన భాగస్వామి అవసరాలకే ఎక్కువ విలువివ్వాలి. అలా చేస్తే వాళ్లిద్దరి బంధం బలంగా ఉంటుంది. (ఫిలి. 2:3, 4) భార్యాభర్తలు ఒకరి భావోద్వేగ అవసరాల్ని, శారీరక కోరికల్ని ఒకరు పట్టించుకోవాలి.—1 కొరింథీయులు 7:3, 4 చదవండి.

17 అయితే విచారకరంగా, కొంతమందికి తమ భర్తతో/భార్యతో ప్రేమగా ఉండడం, వాళ్ల కోరికల్ని తీర్చడం ఇష్టముండదు. కొంతమంది భర్తలైతే, తమ భార్యతో ఆప్యాయంగా ప్రవర్తించడం బలహీనతగా భావిస్తారు. అయితే భర్తలు ‘జ్ఞానము చొప్పున తమ భార్యలతో కాపురం చేయమని,’ అంటే వాళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని బైబిలు చెబుతుంది. (1 పేతు. 3:7) వివాహ ధర్మాన్ని నిర్వర్తించడమంటే, శారీరకంగా దగ్గరవడం మాత్రమే కాదని భర్త అర్థం చేసుకోవాలి. ఆయన తన భార్య మీద ఎప్పుడూ ప్రేమాప్యాయతలు చూపిస్తూ ఉంటేనే, భార్య ఆయనకు శారీరకంగా దగ్గరైనప్పుడు ఆనందాన్ని అనుభవించగలుగుతుంది. దంపతులిద్దరూ ప్రేమానురాగాలు చూపించుకుంటే, ఒకరికొకరు భావోద్వేగ, భౌతిక అవసరాలు తీర్చుకోవడం సులభంగా ఉంటుంది.

18. దంపతులు తమ అనుబంధాన్ని ఎలా బలపర్చుకుంటారు?

18 భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామికి నమ్మకద్రోహం చేయకూడదు. అయితే, వాళ్లు ఒకరి మీద ఒకరు ఆప్యాయత చూపించుకోకపోతే భర్త లేదా భార్య పరాయివ్యక్తి ప్రేమను, సాన్నిహిత్యాన్ని కోరుకునే ప్రమాదముంది. (సామె. 5:18; ప్రసం. 9:9) అందుకే, వాళ్లు “కొంత కాలంవరకు ఇద్దరూ సమ్మతిస్తేనే తప్ప ఒకరికి ఒకరు దూరంగా ఉండకూడదు” అని బైబిలు సలహా ఇస్తుంది. ‘లేకపోతే మీ కోరికలు అదుపులో ఉంచుకోలేకపోవడం బట్టి సాతాను మిమ్మల్ని పాపం చేయడానికి పురికొల్పుతాడు.’ (1 కొరిం. 7:5, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) దంపతులు సాతాను శోధనకు లొంగిపోయి వ్యభిచారానికి పాల్పడడం ఎంత విషాదకరం. భర్త/భార్య, ‘తన మేలును కాకుండా, ఎదుటివ్యక్తి మేలును’ చూసినప్పుడు తమ వివాహ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తిస్తారు. వాళ్లు కేవలం దాన్ని ఓ బాధ్యతలా మాత్రమే చూడకుండా, ప్రేమతో నిర్వర్తిస్తారు. కాబట్టి దంపతులు ప్రేమానురాగాలతో వివాహ ధర్మాన్ని నిర్వర్తిస్తే, వాళ్ల బంధం బలపడుతుంది.—1 కొరిం. 10:24.

మీ వివాహ బంధాన్ని కాపాడుకుంటూ ఉండండి

19. మనం ఏమని గట్టిగా నిర్ణయించుకోవాలి? ఎందుకు?

19 మనం కొత్త లోకానికి చాలా దగ్గర్లో ఉన్నాం. కాబట్టి, వ్యభిచారం చేసిన 24,000 మంది ఇశ్రాయేలీయుల్లా మనం తప్పుడు కోరికలకు లొంగిపోతే మనం కొత్తలోకంలోకి ప్రవేశించలేం. ఆ సంఘటన గురించి వివరించాక బైబిలు ఇలా హెచ్చరిస్తుంది, “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.” (1 కొరిం. 10:12) భార్యాభర్తలు తమ వివాహ బంధాన్ని బలంగా ఉంచుకోవాలంటే వాళ్లు యెహోవాకు, తమ భర్తకు/భార్యకు నమ్మకంగా ఉండాలి. (మత్త. 19:5, 6) కాబట్టి, మనం శాంతిసమాధానాలతో ఉంటూ, దేవుని దృష్టిలో ఏ కళంకం, నింద లేకుండా ఉండడానికి తీవ్రంగా కృషి చేద్దాం. అలా చేయడం ముందెప్పటికన్నా ఇప్పుడు మరింత ప్రాముఖ్యం.—2 పేతు. 3:13, 14.