ఆనాటి జ్ఞాపకాలు
సూర్యుడు ఉదయిస్తున్న దేశంలో వెలుగు ప్రకాశిస్తోంది
జపాన్‌కు చెందిన ఓ పిల్‌గ్రిమ్ (ప్రయాణ పర్యవేక్షకుడు) 1926, సెప్టెంబరు 6న అమెరికా నుండి జపాన్‌కు మిషనరీగా తిరిగొచ్చాడు. కోబీ నగరంలో ఓ బైబిలు అధ్యయన గుంపును ప్రారంభించిన ఒకాయన ఈ మిషనరీని స్వాగతించడానికి వచ్చాడు. అప్పట్లో ఆ ప్రాంతంలో ఆయనొక్కడే ద వాచ్ టవర్ పత్రికకు చందాదారుడు. ఆ నగరంలో బైబిలు విద్యార్థులు తమ మొదటి సమావేశాన్ని 1927, జనవరి 2న జరుపుకున్నారు. దానికి 36 మంది హాజరయ్యారు, 8 మంది బాప్తిస్మం తీసుకున్నారు. అలా జపాన్‌లో సత్యపు తొలి అడుగులు చక్కగా పడ్డాయి, అయితే బైబిలు సత్యపు వెలుగును చూడాల్సిన సుమారు 6 కోట్ల జపాన్ వాసులకు సువార్త ప్రకటించడం ఆ చిన్నగుంపుకు సాధ్యమేనా?
తెలివైన ఆ బైబిలు విద్యార్థులు, బైబిలు ప్రసంగాల గురించి అందరికీ తెలియజేయడం కోసం 1927, మే నెలలో బహిరంగ సాక్ష్యపు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఓసాకా నగరంలో ఏర్పాటు చేసిన మొదటి ప్రసంగం కోసం సహోదరులు నగరం అంతటా రోడ్డు పక్కన సైన్ బోర్డులను పెట్టారు, పెద్దపెద్ద పోస్టర్‌లను అంటించారు. నగరంలోని ప్రముఖులకు 3,000 ఆహ్వానాలను పంపించారు. వాళ్లు సుమారు 1,50,000 హాండ్‌బిల్స్ పంచిపెట్టారు, నగరంలోని ముఖ్య వార్తాపత్రికల్లో దానిగురించి ప్రకటనలు ఇచ్చారు, 4,00,000 రైలు టిక్కెట్ల మీదకూడా దాన్ని ముద్రించారు. ప్రసంగం ఇచ్చేరోజు రెండు విమానాలు నగరం మీదుగా ఎగురుతూ 1,00,000 హాండ్‌బిల్స్ వెదజల్లాయి. ఆ ప్రసంగ అంశం, “దేవుని రాజ్యం సమీపించింది.” దాన్ని వినేందుకు ఓసాకాలోని ఆసాహీ హాలుకు 2,300 మంది వచ్చారు. హాలు ప్రేక్షకులతో కిక్కిరిసిపోవడంతో, కూర్చోడానికి కూడా స్థలం లేక సుమారు 1000 మంది వెనక్కి వెళ్లిపోయారు. ప్రసంగం తర్వాత 600 కన్నా ఎక్కువమంది ప్రేక్షకులు ప్రశ్నాజవాబుల కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాతి నెలల్లో క్యోటోలోనూ, జపాన్‌లో తూర్పున ఉన్న ఇతర నగరాల్లోనూ ప్రసంగాలు ఏర్పాటు చేశారు.
బైబిలు విద్యార్థులు 1927, అక్టోబరులో టోక్యోలో ప్రసంగాలు ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా ప్రధానమంత్రి, పార్లమెంటు సభ్యులు, మతనాయకులు, సైనికాధికారులు వంటి ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. పోస్టర్లు అంటించారు, పేపర్లో ప్రకటనలు ఇచ్చారు; 7,10,000 హాండ్‌బిల్స్ పంచిపెట్టారు. టోక్యోలోని మూడు ప్రసంగాలకు మొత్తం 4,800 మంది హాజరయ్యారు.
ఉత్సాహవంతులైన కల్‌పోర్చర్లు
ప్రజల ఇళ్లకు వెళ్లి రాజ్య సందేశాన్ని ప్రకటించడంలో కల్‌పోర్చర్లు (పయినీర్లు) ముఖ్యపాత్ర పోషించారు. జపాన్‌లోని మొదటి కల్‌పోర్చర్లలో మాట్సూయె ఇషీ ఒకరు. ఆమె, ఆమె భర్త జీజో కలిసి జపాన్‌లో మూడొంతుల భాగాన్ని పూర్తి చేశారు. ఉత్తరాన సుదూరంలో ఉన్న సాపోరో మొదలుకుని సెండాయి, టోక్యో, యొకోహామా, నాగోయా, ఓసాకా, క్యోటో, ఓకాయామా, టోకూషేమా నగరాలకు వాళ్లు సువార్త ప్రకటించారు. సహోదరి ఇషీ, పెద్ద వయసున్న మరో సహోదరి సాకీకో తానాకా ప్రభుత్వ ఉన్నత అధికారుల్ని కలిసేటప్పుడు సాంప్రదాయ దుస్తులు వేసుకునేవాళ్లు. వాళ్లలో ఓ అధికారి, జైలులోని లైబ్రరీలో పెట్టడానికి ద హార్ప్ ఆఫ్ గాడ్, డెలివరెన్స్ పుస్తకాల సెట్లు 300 కావాలని అడిగాడు.
కాట్సూవో, హాగీనో మీవూరాలు సహోదరి ఇషీ ఇచ్చిన పుస్తకాలు చదివి సత్యాన్ని వెంటనే గ్రహించారు. వాళ్లు 1931లో
బాప్తిస్మం తీసుకుని, తర్వాత కల్‌పోర్చర్లు అయ్యారు. హారూయీచే యామాడా, తానె దంపతులు అలాగే వాళ్ల బంధువులు చాలామంది 1930కి ముందే రాజ్య సందేశాన్ని అంగీకరించారు. ఆ దంపతులు పయినీరు సేవ మొదలుపెట్టారు, వాళ్ల కూతురు యూకేకో టోక్యోలోని బెతెల్‌లో సేవచేసింది.చిన్నా పెద్దా ‘యెహూలు’
అప్పట్లో వాహనాలు చాలా ఖరీదైనవి, పైగా రోడ్లు బాగుండేవి కావు. దాంతో కాజూమీ, మీనౌరా ఇంకా ఇతర యువ కల్‌పోర్చర్లు ఇంజన్ లేని హౌజ్‌కార్లను ఉపయోగించేవాళ్లు. వాళ్లు వాటిని ‘యెహూలు’ అని ముద్దుగా పిలిచేవాళ్లు. వేగంగా రథాన్ని నడిపే ఇశ్రాయేలు రాజైన యెహూ పేరును వాటికి పెట్టారు. (2 రాజు. 10:15, 16) జపాన్ బ్రాంచి కార్యాలయంలో మూడు పెద్ద యెహూలను, 11 చిన్న యెహూలను తయారుచేశారు. ఒక్కో పెద్ద యెహూ సుమారు ఏడు అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల ఎత్తు ఉండేది. ఒక్కోదాంట్లో ఆరుగురు వరకూ నిద్రపోవచ్చు. సైకిళ్ల సహాయంతో కదిలే చిన్న యెహూల్లో ఇద్దరు నిద్రపోవచ్చు. వాటి తయారీలో సహాయపడ్డ కేయ్‌చే ఈవాసాకీ ఇలా గుర్తుచేసుకున్నాడు, “ప్రతీ యెహూలో ఒక డేరా ఉండేది, లైట్లను వెలిగించుకోవడానికి ఓ బ్యాటరీ కూడా ఉండేది.” కల్‌పోర్చర్లు లోయల్లో, కొండల్లో యెహూలను నెడుతూ, లాగుతూ ఉత్తరానున్న హొక్కాయిడో నుండి దక్షిణానున్న క్యూషూ వరకూ జపాన్ అంతటా సత్యపు వెలుగును ప్రశాశింపజేశారు.
ఈకూమాట్సూ ఓటా అనే ఓ కల్‌పోర్చర్ ఇలా చెప్పాడు, “మేము ఏదైనా పట్టణానికి వెళ్లినప్పుడు, నది ఒడ్డునగానీ ఆరు బయటగానీ మా యెహూని ఆపుతాం. మొదట ఆ పట్టణంలోని మేయర్‌లాంటి ముఖ్యులను కలుస్తాం, ఆ తర్వాత ప్రజల ఇళ్లకు వెళ్లి మా సాహిత్యాన్ని వాళ్లకు పరిచయం చేస్తాం. ఆ పట్టణాన్ని పూర్తిచేసిన తర్వాత మరో పట్టణానికి వెళ్తాం.”
కోబీ పట్టణంలో 36 మంది బైబిలు విద్యార్థుల చిన్నగుంపు తమ మొదటి సమావేశాన్ని జరుపుకున్నప్పుడు అది “కొద్దిపాటి పనియే.” (జెక. 4:10, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము) కేవలం ఐదు సంవత్సరాల తర్వాత అంటే 1932లో జపాన్‌లో 103 మంది కల్‌పోర్చర్లు, ప్రచారకులు తమ సేవను రిపోర్టు చేశారు. వాళ్లు 14,000 కన్నా ఎక్కువ పుస్తకాలను ప్రజలకు ఇచ్చారు. నేడు జపాన్‌లోని పెద్దపెద్ద నగరాల్లో చక్కని సంస్థీకరణతో బహిరంగ సాక్ష్యం ఇచ్చే పని జరుగుతోంది. దాదాపు 2,20,000 మంది ప్రచారకులు ‘సూర్యుడు ఉదయిస్తున్న దేశమంతటా’ తమ వెలుగును ప్రకాశింపజేస్తున్నారు.—జపాన్‌నుండి సేకరించినవి.