జీవిత కథ
సువార్తికురాలిగా నా జీవితంలో మైలురాళ్లు
ఎల్ సాల్వడార్‌లోని సాంటా అనా నగరంలో క్యాథలిక్ మతగురువులు 1947లో సాక్షులను ఇబ్బందిపెట్టాలని చూశారు. సహోదరసహోదరీలు ఒక మిషనరీ ఇంట్లో కావలికోట అధ్యయనం చేసుకుంటుండగా, కొంతమంది కుర్రాళ్లు ఆ ఇంటి గుమ్మం గుండా పెద్దపెద్ద రాళ్లు లోపలికి విసిరారు. అదే సమయంలో మతగురువుల ఆధ్వర్యంలో కొంతమంది కాగడాలు, విగ్రహాలు పట్టుకుని ఊరేగింపుగా అక్కడికి వచ్చారు. వాళ్లు రెండు గంటలపాటు ఆ ఇంటిపై రాళ్ల వర్షం కురిపిస్తూ, “కన్యక నిత్యం జీవించాలి! యెహోవా చనిపోవును గాక!” అని అరుస్తూ ఉన్నారు. మిషనరీలను భయపెట్టి, వాళ్లను ఊరినుండి వెళ్లగొట్టడానికే అలా చేశారు. నాకు ఆ విషయం తెలుసు, ఎందుకంటే ఆ మిషనరీల్లో నేనూ ఒకదాన్ని! 67 ఏళ్ల క్రితం జరిగిన ఆ కూటంలో నేనూ ఉన్నాను. a
ఆ సంఘటన జరగడానికి రెండు సంవత్సరాల ముందు, నేనూ నాతో కలిసి మిషనరీ సేవచేసిన ఎవ్లన్ ట్రేబార్ట్, వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ నాలుగవ తరగతి నుండి పట్టభద్రులయ్యాం. అప్పట్లో గిలియడ్ తరగతులు న్యూయార్క్‌లోని ఇతాకాలో జరిగేవి. తర్వాత, సాంటా అనాలో సేవచేయడానికి మమ్మల్ని పంపించారు. దాదాపు 29 ఏళ్ల మిషనరీ సేవలోని నా జ్ఞాపకాలను మీతో పంచుకునే ముందు, నేను ఎందుకు ఆ సేవ చేయాలని నిర్ణయించుకున్నానో చెప్తాను.
నా ఆధ్యాత్మిక స్వాస్థ్యం
నేను 1923లో పుట్టినప్పుడు, మా అమ్మానాన్నలు జాన్ ఓస్లన్, ఈవా అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న స్పోకెన్ నగరంలో నివసిస్తుండేవాళ్లు. మా అమ్మానాన్నలు లూథరన్ చర్చీకి వెళ్లేవాళ్లు, కానీ నరకాగ్ని గురించి చర్చీలో బోధించే విషయాల్ని నమ్మేవాళ్లు కాదు. ఎందుకంటే, ప్రేమగల దేవుడు అలా బాధపెట్టడని వాళ్ల నమ్మకం. (1 యోహా. 4:8) నాన్న బేకరీలో పనిచేసేవాడు. ఆయనతో పనిచేసే ఒకాయన ఓ రాత్రి, నరకం అంటే బాధించే స్థలమని బైబిలు బోధించడం లేదని చెప్పాడు. వెంటనే మా అమ్మానాన్నలు యెహోవాసాక్షులతో అధ్యయనం మొదలుపెట్టి జీవం, మరణం గురించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో నేర్చుకున్నారు.
నాకు అప్పుడు తొమ్మిదేళ్లే అయినా, అమ్మానాన్నలు కొత్తగా నేర్చుకున్న బైబిలు సత్యాల గురించి ఉత్సాహంగా మాట్లాడుకునేటప్పుడు వినడం ఇప్పటికీ గుర్తుంది. సత్యదేవుని పేరు యెహోవా అని నేర్చుకున్నప్పుడు, తికమకపెట్టే త్రిత్వ బోధ నుండి బయటపడినప్పుడు వాళ్ల ఉత్సాహం మరింత ఎక్కువైంది. ప్రజల్ని ‘స్వతంత్రులుగా చేసే సత్యాన్ని’ నేర్చుకుంటూ యోహా. 8:32) అందుకే బైబిలు అధ్యయనం చేయడం నాకు ఎప్పుడూ విసుగ్గా అనిపించలేదు, దేవుని వాక్యాన్ని పరిశోధించడం అంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. నేను బిడియస్థురాల్ని అయినా మా అమ్మానాన్నలతో పరిచర్యకు వెళ్లేదాన్ని. వాళ్లు 1934లో బాప్తిస్మం పొందారు. నా 16వ ఏట అంటే 1939లో నేను కూడా యెహోవా సేవకురాలిగా బాప్తిస్మం పొందాను.
అద్భుతమైన ఆ లేఖన బోధలను గ్రహించడం మొదలుపెట్టాను. (మా అమ్మానాన్నలు 1940 వేసవికాలంలో మా ఇంటిని అమ్మేశారు. మేము ముగ్గురం ఐడహోలోని, కార్ డలేన్‌లో పయినీర్లుగా పూర్తికాల పరిచర్య మొదలుపెట్టాం. కార్లు బాగుచేసే ఓ షాపు పైనున్న ఇంటిని అద్దెకు తీసుకున్నాం. మా ఇంట్లో కూటాలు కూడా జరిగేవి. అప్పట్లో చాలా సంఘాలకు రాజ్యమందిరాలు ఉండేవి కావు, అందుకే సహోదరుల ఇళ్లల్లో లేదా అద్దె గదుల్లో కూటాలు జరిగేవి.
మేము 1941వ సంవత్సరంలో, మిస్సోరిలో ఉన్న సెయింట్ లూయిస్‌లో జరిగిన సమావేశానికి హాజరయ్యాం. ఆ ఆదివారం “పిల్లల రోజు” కాబట్టి 5 నుండి 18 ఏళ్ల మధ్యవయసున్న వాళ్లందరం స్టేజీకి ఎదురుగా కూర్చున్నాం. సహోదరుడు జోసెఫ్ ఎఫ్. రూథర్‌ఫర్డ్ తన ప్రసంగం చివర్లో పిల్లలతో ఇలా అన్నాడు, ‘దేవునికి, ఆయన రాజుకి లోబడాలని నిర్ణయించుకున్న పిల్లలందరూ దయచేసి లేచి నిలబడండి!’ మేమందరం లేచి నిలబడ్డాం. అప్పుడు సహోదరుడు రూథర్‌ఫర్డ్ గట్టిగా, “ఇదిగో, రాజ్యాన్ని ప్రకటించే 15,000ల కన్నా ఎక్కువమంది కొత్త సాక్షులు!” అని అన్నాడు. పయినీరు సేవనే జీవితంగా చేసుకోవాలని ఆ క్షణమే గట్టిగా నిర్ణయించుకున్నాను.
మా కుటుంబానికి నియామకాలు
ఆ సమావేశం జరిగిన కొన్ని నెలలకు, మా కుటుంబం దక్షిణ కాలిఫోర్నియాకు తరలివెళ్లింది. అక్కడ, ఆక్స్నార్డ్ అనే నగరంలో ఓ సంఘాన్ని ప్రారంభించమని మాకు నియామకం ఇచ్చారు. మేము ఒక చిన్న బండిలో ఉండేవాళ్లం, అందులో ఒకేఒక్క పరుపు ఉండేది. నేను భోజనం చేసే బల్లమీదే పక్కవేసుకుని పడుకునేదాన్ని. ఒకప్పుడు నాకంటూ బెడ్రూమ్ ఉండేది, కానీ అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా!
మేము కాలిఫోర్నియాకు రావడానికి కాస్త ముందు అంటే 1941, డిసెంబరు 7న హవాయిలోని పెర్ల్ హార్బర్ మీద జపాన్ దాడి చేసింది. ఆ తర్వాతి రోజు, అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించింది. యుద్ధ సమయంలో లైట్లు అన్నీ ఆపేయాలని అధికారులు ఆదేశించడంతో మేము రాత్రుళ్లు లైట్లన్నీ ఆపేయాల్సి వచ్చేది. జపాన్‌వాళ్ల జలాంతర్గాములు కాలిఫోర్నియా తీరంలోనే తిరుగుతున్నాయి కాబట్టి ముఖ్యమైన ప్రాంతాల మీద వాళ్లు దాడి చేయకుండా చూసేందుకే అలా అంతా చీకటిగా ఉంచారు.
కొన్ని నెలల తర్వాత, 1942 సెప్టెంబరులో ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌లో న్యూ వరల్డ్ థియోక్రటిక్ అసెంబ్లీకి హాజరయ్యాం. అక్కడ, సహోదరుడు నేథన్ హెచ్. నార్ ఇచ్చిన “శాంతి—అది నిలుస్తుందా?” అనే ప్రసంగాన్ని విన్నాం. ఆయన ప్రసంగంలో “ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు; అయితే అది అగాధ జలములోనుండి పైకి వచ్చుటకును . . . సిద్ధముగా ఉన్నది” అని వివరిస్తున్న ప్రకటన 17వ అధ్యాయాన్ని చర్చించాడు. (ప్రక. 17:8, 11) ఆ “మృగము,” 1939లో తన కార్యకలాపాలను ఆపేసిన నానాజాతి సమితిని సూచిస్తుందని సహోదరుడు నార్ వివరించాడు. ఆ సమితి స్థానంలోకి వేరొక సమితి వస్తుందని, అప్పుడు కొంతకాలం శాంతి ఉంటుందని బైబిలు ముందే చెప్పింది. 1945లో, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ తర్వాత, ఆ “మృగము” ఐక్యరాజ్య సమితిగా మళ్లీ కనిపించింది. అప్పుడు యెహోవాసాక్షులు తమ ప్రపంచవ్యాప్త పనిని విస్తృతం చేసుకున్నారు, అప్పటినుండి ఎంత అభివృద్ధి జరుగుతుందో కదా!
ముందుముందు ఏమి జరగనుందో ఆ ప్రవచనం వల్ల నాకు అర్థమైంది. తర్వాతి సంవత్సరంలో గిలియడ్ పాఠశాల ప్రారంభమౌతుందనే ప్రకటన విన్నప్పుడు, మిషనరీ అవ్వాలనే కోరిక నాకు కలిగింది. నన్ను 1943లో, ఆరిజన్లోని పోర్ట్‌లాండ్‌లో పయినీరుగా నియమించారు. ఆ రోజుల్లో, ప్రజలకు వాళ్ల ఇంటి గుమ్మం దగ్గరే ప్రసంగాలను వినిపించడానికి మేము ఫోనోగ్రాఫ్లను ఉపయోగించేవాళ్లం. తర్వాత దేవుని రాజ్యానికి సంబంధించిన బైబిలు సాహిత్యాన్ని ఇచ్చేవాళ్లం.
నేను ఆ సంవత్సరమంతా మిషనరీ సేవ గురించే ఆలోచిస్తూ గడిపాను.నాకూ నా ప్రియ స్నేహితురాలు ఎవ్లన్ ట్రేబార్ట్కూ 1944లో గిలియడ్ ఆహ్వానం వచ్చినప్పుడు నా ఆనందానికి హద్దుల్లేవు. పాఠశాల ఉపదేశకులు, బైబిలు అధ్యయనం ఆహ్లాదకరంగా ఎలా చేయాలో ఐదు నెలలపాటు మాకు చూపించారు. వాళ్ల వినయం నన్ను ఎంతో ఆకర్షించింది. కొన్నిసార్లు, మేము భోజనం చేసేటప్పుడు ఆ సహోదరులే మాకు వడ్డించేవాళ్లు. మేము 1945, జనవరి 22న పట్టభద్రులయ్యాం.
నా మిషనరీ నియామకం
నేను, ఎవ్లన్ మాతోపాటు లీయో మహన్, ఎస్తేర్ 1946 జూన్‌లో మాకు నియమించిన ఎల్ సాల్వడార్‌కి వెళ్లాం. అక్కడి క్షేత్రం “తెల్లబారి కోతకు” వచ్చింది. (యోహా. 4:35) నా కథ ప్రారంభంలో చెప్పిన సంఘటనను బట్టి అక్కడి మతనాయకులు ఎంత కోపంగా ఉన్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది. అది జరగడానికి ఒక వారం ముందే, సాంటా అనాలో మొట్టమొదటి ప్రాంతీయ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోని బహిరంగ ప్రసంగం గురించి విస్తృతంగా ప్రచారం చేశాం, దానికి దాదాపు 500 మంది హాజరైనప్పుడు చాలా సంతోషించాం. భయంతో ఊరు విడిచి వెళ్లిపోయే బదులు అక్కడే ఉండి యథార్థ హృదయంగల వాళ్లకు సహాయం చేయాలని గట్టిగా నిశ్చయించుకున్నాం. బైబిలు చదవొద్దని మతనాయకులు ప్రజల్ని బెదిరించారు, కొంతమంది మాత్రమే బైబిలు కొనగల స్థితిలో ఉన్నారు, అయినా చాలామంది సత్యంకోసం పరితపిస్తున్నారు. సత్య దేవుడైన యెహోవా గురించి, భూమిని పరదైసుగా మారుస్తానని ఆయన చేసిన అద్భుతమైన వాగ్దానం గురించి వాళ్లకు బోధించడానికి మేము స్పానిష్ భాష నేర్చుకోవడం మొదలుపెట్టాం. అది చూసి వాళ్లు మా ప్రయత్నాలను ఎంతో అభినందించారు.
నేను బైబిలు నేర్పించిన మొదటివాళ్లలో రోసా అసెన్స్యో అనే మహిళ ఒకరు. ఒకాయనతో కలిసి జీవిస్తున్న ఆమె, బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయననుండి విడిపోయింది. ఆ తర్వాత ఆయన కూడా బైబిలు అధ్యయనం మొదలుపెట్టాడు. వాళ్లు పెళ్లిచేసుకొని, బాప్తిస్మం పొంది, యెహోవాను ఉత్సాహంగా సేవించడం మొదలుపెట్టారు. సాంటా అనాలో పయినీరు సేవచేసిన మొట్టమొదటి స్థానిక సహోదరి రోసానే. b
రోసాకు ఒక చిన్న కిరాణా షాపు ఉండేది. ఆమె పరిచర్యకు వెళ్లేటప్పుడు, యెహోవా తన అవసరాలు తీరుస్తాడనే నమ్మకంతో షాపు మూసేసి వెళ్లేది. కొన్ని గంటల తర్వాత మళ్లీ షాపు తెరిచినప్పుడు, చాలామంది కస్టమర్లు వచ్చేవాళ్లు. మత్తయి 6:33లోని మాటలు ఎంత సత్యమో ఆమె అనుభవపూర్వకంగా తెలుసుకుంది. ఆమె తుదిశ్వాస వరకు నమ్మకంగా జీవించింది.
ఒకసారి, ఆ ప్రాంతంలోని మతగురువు మా ఆరుగురు మిషనరీలకు ఇల్లు అద్దెకు ఇచ్చిన వ్యక్తి దగ్గరకు వచ్చి, మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించకపోతే అతన్ని, అతని భార్యను చర్చీనుండి వెలివేస్తానని బెదిరించాడు. ఆ ఇంటి యజమాని ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన అప్పటికే మతగురువుల ప్రవర్తనతో విసిగిపోయి ఉండడంతో ఆ బెదిరింపులకు లొంగలేదు. తనను చర్చీనుండి వెలివేసినా ఫర్వాలేదని మతగురువుకు చెప్పాడు. మేము ఉండాలనుకున్నంత కాలం అక్కడే ఉండవచ్చని మాకు భరోసా ఇచ్చాడు.
ఓ ఇంజనీరు సత్యాన్ని అంగీకరించాడు
మరో మిషనరీ సహోదరి, సాన్ సాల్వడార్ నగరంలో ఇంజనీరుగా పనిచేస్తున్న బాల్టాసర్ పెర్లా అనే ఒకతని భార్యతో బైబిలు అధ్యయనం చేస్తుండేది. మంచిమనసున్న ఆయనకు మతనాయకుల
వేషధారణ చూశాక దేవుని మీద విశ్వాసం పోయింది. బాల్టాసర్ సత్యంలో లేకపోయినా, మన బ్రాంచి కార్యాలయాన్ని నిర్మించే సమయంలో డబ్బులు తీసుకోకుండానే ఆ కార్యాలయ నమూనాలను గీసి, దాన్ని నిర్మించడానికి ముందుకువచ్చాడు.ఆ నిర్మాణ పనిలో యెహోవా ప్రజలతో కలిసి పనిచేసిన తర్వాత, నిజమైన మతాన్ని కనుగొన్నాడనే నమ్మకం ఆయనలో కలిగింది. ఆయన 1955, జూలై 22న బాప్తిస్మం పొందాడు, కొంతకాలానికే ఆయన భార్య పౌలీనా కూడా బాప్తిస్మం పొందింది. వాళ్ల పిల్లలిద్దరూ యెహోవాను నమ్మకంగా సేవిస్తున్నారు. ఆయన కొడుకు జూనియర్ బాల్టాసర్, అంతకంతకూ అభివృద్ధి చెందుతున్న ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి మద్దతిస్తూ బ్రూక్లిన్ బెతెల్‌లో 49 ఏళ్లు సేవచేశాడు. ప్రస్తుతం అమెరికాలో బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవచేస్తున్నాడు. c
సాన్ సాల్వడార్లో సమావేశాలు జరుపుకోవడం మొదలుపెట్టినప్పుడు, అందుకోసం ఓ పెద్ద వ్యాయామశాలను ఉపయోగించుకోవడానికి సహోదరుడు బాల్టాసర్ పెర్లా సహాయం చేశాడు. మొదట్లో, ఆ హాలులో ఉన్న కొన్ని వరుసల కుర్చీలే నిండేవి. అయితే యెహోవా ఆశీర్వాదంతో సాక్షుల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉండడంతో ఆ వ్యాయామశాలంతా నిండిపోయేది, తర్వాత అది కూడా సరిపోలేదు. ఆ సంతోషకరమైన సందర్భాల్లో, నా పాత బైబిలు విద్యార్థుల్ని కూడా కలిసేదాన్ని. ఒకప్పటి నా బైబిలు విద్యార్థులు, “నా మనవళ్లను, మనవరాళ్లను” అంటే కొత్తగా బాప్తిస్మం పొందిన తమ బైబిలు విద్యార్థులను నాకు పరిచయం చేస్తుంటే నాకు కలిగిన ఆనందాన్ని ఒక్కసారి ఊహించండి!
ఓ సమావేశంలో, ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి తన తప్పును ఒప్పుకోవాలనుకుంటున్నానని అన్నాడు. నేను ఆయన్ను గుర్తుపట్టలేదు, కానీ ఏం చెబుతాడా అనే కుతూహలం నాలో కలిగింది. ఆయన ఇలా అన్నాడు, “సాంటా అనాలో మీమీద రాళ్లు విసిరిన కుర్రాళ్లలో నేను కూడా ఉన్నాను.” ఇప్పుడు ఆయన నాతో కలిసి యెహోవాను సేవిస్తున్నాడు! ఆ మాటలు విన్నప్పుడు నా హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది. సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చే పూర్తికాల సేవకు మించిన పని మరొకటి లేదని ఆ సంభాషణ నాకు రుజువుచేసింది.
సంతృప్తినిచ్చిన ఎంపికలు
ఎల్ సాల్వడార్లో దాదాపు 29 ఏళ్లపాటు నేను మిషనరీగా సేవచేశాను. మొదట సాంటా అనాలో, తర్వాత సాన్సోనాటాలో, ఆ తర్వాత సాంటా టేక్లాలో చివరిగా సాన్ సాల్వడార్లో
సేవచేశాను. అయితే, 1975లో ప్రార్థనాపూర్వకంగా బాగా ఆలోచించి, మిషనరీ సేవను ఆపేసి స్పోకెన్కి తిరిగివెళ్లాలని నిర్ణయించుకున్నాను. వయసుమళ్లుతున్న నమ్మకమైన మా అమ్మానాన్నలకు నా సహాయం అవసరమైంది.మా నాన్న 1979లో చనిపోయిన తర్వాత, అమ్మ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ, ఏమీ చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆమెను దగ్గరుండి చూసుకున్నాను. ఆమె మరో ఎనిమిదేళ్లు బ్రతికి తన 94వ ఏట చనిపోయింది. ఆ కష్ట కాలంలో నేను శారీరకంగా, మానసికంగా అలసిపోయాను. ఆ ఒత్తిడివల్ల తీవ్రమైన నొప్పి కలిగించే ఓ చర్మరోగం వచ్చింది. కానీ ప్రార్థనవల్ల, యెహోవా ఆప్యాయంగా నా వెన్ను తడుతూ నన్ను ప్రోత్సహించడం వల్ల ఆ కష్టమైన పరీక్షను తట్టుకోగలిగాను. “తల వెండ్రుకలు నెరయువరకు . . . నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే” అని చెప్పినట్లుగానే యెహోవా నన్ను ఆదుకున్నాడు.—యెష. 46:4.
నేను 1990లో వాషింగ్టన్‌లోని, ఒమాక్ నగరానికి వెళ్లిపోయాను. అక్కడ నేను స్పానిష్ భాషా క్షేత్రంలో సేవ చేయగలిగాను, నేను బైబిలు అధ్యయనం చేసినవాళ్లలో చాలామంది బాప్తిస్మం పొందారు. 2007 నవంబరు వచ్చేసరికి, ఒమాక్లోని నా ఇంటి పనులు చేసుకోవడం నావల్ల కాకపోవడంతో దగ్గర్లోని షాలన్ అనే పట్టణంలోని ఒక ఇంటికి మారాను. అప్పటినుండి అక్కడున్న ఆ స్పానిష్ సంఘం నన్ను ఎంతో శ్రద్ధగా చూసుకుంటుంది. దానికి నేను ఎంతో కృతజ్ఞురాలిని. అక్కడున్న సాక్షుల్లో నేనే పెద్దదాన్ని కాబట్టి, సహోదరసహోదరీలు దయతో నన్ను ‘అమ్మమ్మగా’ “దత్తత” తీసుకున్నారు.
ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిచర్యను మరింత సంపూర్ణంగా చేయాలని పెళ్లి, పిల్లలు వద్దనుకున్నాను. అయినా నాకు చాలామంది ఆధ్యాత్మిక పిల్లలు ఉన్నారు. (1 కొరిం. 7:34, 35) ఇప్పుడున్న జీవితంలో అనుకున్నవన్నీ పొందలేనని నేను అర్థంచేసుకున్నాను. అందుకే ప్రాముఖ్యమైన దానికి అంటే యెహోవాను హృదయపూర్వకంగా సేవించడానికి చేసుకున్న సమర్పణకు మొదటిస్థానం ఇచ్చాను. నూతనలోకంలో, మిగతా మంచి పనుల్లో ఆనందంగా పాల్గొనడానికి కావాల్సినంత సమయం ఉంటుంది. యెహోవా ‘ప్రతి జీవి కోరికను తృప్తిపరుచును’ అని అభయమిస్తున్న కీర్తన 145:16 అంటే నాకు చాలా ఇష్టం.
ప్రస్తుతం నాకు 91 ఏళ్లు, అయినా ఆరోగ్యం బాగానే ఉంది కాబట్టి పయినీరు సేవ కొనసాగిస్తున్నాను. పయినీరు సేవవల్ల నేనింకా యౌవనురాలినని అనిపిస్తుంది, ఆ సేవ నా జీవితానికి ఓ సంకల్పాన్ని ఇస్తోంది. నేను మొదట ఎల్ సాల్వడార్‌కి వచ్చినప్పుడు, అక్కడ ప్రకటనా పని అప్పుడే మొదలైంది. సాతాను అవిశ్రాంతంగా వ్యతిరేకిస్తున్నా, ఆ దేశంలో ఇప్పుడు 39,000 కన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉన్నారు. అది నా విశ్వాసాన్ని నిజంగా బలపర్చింది. యెహోవా ప్రజలు చేస్తున్న ప్రయత్నాలకు ఆయన పరిశుద్ధాత్మ మద్దతు ఖచ్చితంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు!