“ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో” తెలుసుకోండి
‘ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఎల్లప్పుడూ కృపాసహితముగా ఉండనియ్యుడి.’—కొలొ. 4:6.
1, 2. (ఎ) సరైన ప్రశ్నలు అడగడం ఎంత ప్రాముఖ్యమో చూపించే ఓ అనుభవం చెప్పండి. (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) కష్టమైన అంశాల గురించి మాట్లాడడానికి మనం ఎందుకు భయపడనక్కర్లేదు?
కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. ఓ క్రైస్తవ సహోదరి, సత్యంలో లేని తన భర్తతో బైబిలు విషయాలు మాట్లాడుతుంది. ఒకప్పుడు ఆయన అడపాదడపా చర్చికి వెళ్తుండేవాడు. మాటల మధ్యలో, తాను త్రిత్వాన్ని నమ్ముతానని భర్త అన్నాడు. త్రిత్వ సిద్ధాంతం నిజంగా ఏమి బోధిస్తుందో ఆయనకు తెలియకపోవచ్చని గ్రహించిన ఆ సహోదరి తన భర్తను తెలివిగా ఇలా అడిగింది, “దేవుడు ఒక దేవుడు, యేసు ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు; అయితే ముగ్గురు దేవుళ్లు లేరుగానీ ఒకే దేవుడున్నాడు అనే కదా మీరు నమ్మేది?” అందుకాయన ఆశ్చర్యపోతూ, “లేదు, నేను నమ్మేది అదికాదు!” అన్నాడు. అది, దేవుని గురించి వాస్తవాలను చక్కగా చర్చించుకునే అవకాశాన్ని కల్పించింది.
2 జాగ్రత్తగా ఆలోచించుకుని, తెలివైన ప్రశ్నలు అడగడం ఎంత ప్రాముఖ్యమో ఆ అనుభవం చూపిస్తుంది. ఇది మరో ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా నొక్కి చెబుతోంది; త్రిత్వం, నరకాగ్ని, సృష్టికర్త వంటి కష్టమైన అంశాల గురించి మాట్లాడడానికి మనం భయపడనక్కర్లేదు. యెహోవా మీద, ఆయన అందించే తర్ఫీదు మీద ఆధారపడితే, ఎదుటివాళ్ల హృదయాలను చేరుకొని వాళ్లను ఒప్పించే సమాధానం ఇవ్వగలుగుతాం. (కొలొ. 4:6) సమర్థవంతులైన పరిచారకులు ఇలాంటి అంశాలను చర్చిస్తున్నప్పుడు ఏమి చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఈ ఆర్టికల్లో మూడు ప్రశ్నలు చర్చిస్తాం. అవి, (1) ఎదుటి వాళ్ల అభిప్రాయాన్ని రాబట్టే ప్రశ్నలు ఎలా అడగాలి? (2) లేఖనాలు చెప్పేవాటి గురించి తర్కబద్ధంగా ఎలా మాట్లాడాలి? (3) విషయాన్ని స్పష్టం చేసేందుకు ఉదాహరణలు ఎలా ఉపయోగించాలి?
ఎదుటివాళ్ల అభిప్రాయాన్ని రాబట్టేందుకు ప్రశ్నలు అడగండి
3, 4. అవతలి వ్యక్తి ఏమి నమ్ముతున్నాడో తెలుసుకోవడానికి ప్రశ్నలు అడగడం ఎందుకు ప్రాముఖ్యం? ఉదాహరణ చెప్పండి.
3 ఒక వ్యక్తి ఏమి నమ్ముతున్నాడో తెలుసుకోవడానికి మనకు ప్రశ్నలు ఉపయోగపడతాయి. అలా తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? “సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును” అని సామెతలు 18:13 చెబుతోంది. ఫలాని అంశం గురించి బైబిలు ఏమి చెబుతుందో వివరించడానికి ముందే, ఆ విషయం గురించి అవతలి వాళ్లు అసలు ఏమి నమ్ముతున్నారో తెలుసుకుంటే మంచిది. లేకపోతే అసలు వాళ్లు నమ్మని ఓ విషయం తప్పని నిరూపించడానికి అనవసరంగా సమయాన్ని వృథా చేసే ప్రమాదం ఉంది.—1 కొరిం. 9:26.
4 ఉదాహరణకు మీరు, నరకం గురించి మాట్లాడుతున్నారని అనుకోండి. నరకం, అగ్నిలో యాతన పెట్టే నిజమైన స్థలమని కొంతమంది నమ్ముతారు. ఇంకొంతమందేమో, దేవునితో మంచి సంబంధం లేకపోవడమే నరకమని నమ్ముతారు. అలాంటి వాళ్లను ఇలా అడగొచ్చు, “నరకం గురించి ప్రజలు రకరకాలుగా అనుకుంటున్నారు, మరి మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోవచ్చా?” అవతలి వాళ్లు ఏమి చెప్తారో వింటే, ఆ విషయం గురించి బైబిలు చెబుతున్నది చక్కగా వివరించడం వీలౌతుంది.
5. ఎదుటివ్యక్తి అభిప్రాయానికి కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రశ్నలు అడగడం ఎందుకు ప్రాముఖ్యం?
5 జాగ్రత్తగా ప్రశ్నలు అడగడం వల్ల అసలు ఆయన ఎందుకు అలా నమ్ముతున్నాడో కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, దేవుడంటే నమ్మకం లేదనే వాళ్లను పరిచర్యలో కలిస్తే ఏమి చేయవచ్చు? లోకంలో బాగా ప్రాచుర్యం పొందిన పరిణామ సిద్ధాంతం వంటి వాటివల్లే ఆయన అలా అంటున్నాడని మనకు వెంటనే అనిపించవచ్చు. (కీర్త. 10:4) అయితే కొంతమంది, తాము చూసిన, అనుభవించిన తీవ్రమైన బాధల వల్ల దేవుని మీద నమ్మకం కోల్పోతారు. మనుషులను ప్రేమించే సృష్టికర్త ఉంటే, ఇన్ని బాధలు ఎందుకు ఉన్నాయంటూ వాళ్లు ప్రశ్నిస్తారు. కాబట్టి, దేవుణ్ణి నమ్మని ఇంటివాళ్లను, “మీకు మొదటి నుండి దేవుడంటే నమ్మకం లేదా?” అని అడగవచ్చు. ఒకవేళ ఆయన “మొదట్లో ఉండేది” అని చెబితే, మరి దేనివల్ల ఆ నమ్మకం పోయిందో ఆయనను అడిగి తెలుసుకోవచ్చు. ఆయన చెప్పే సమాధానం బట్టి ఆయనకు ఎలాంటి ఆధ్యాత్మిక సహాయం అవసరమో గుర్తించవచ్చు.—సామెతలు 20:5 చదవండి.
6. మనం ఓ ప్రశ్న అడిగిన తర్వాత ఏమి చేయాలి?
6 మనం ఓ ప్రశ్న అడిగిన తర్వాత, వాళ్లు చెప్పేది జాగ్రత్తగా వినాలి, వాళ్ల భావాలకు విలువిస్తున్నామని చూపించాలి. ఉదాహరణకు, తమ జీవితంలో జరిగిన ఓ దుర్ఘటన వల్ల, ప్రేమగల సృష్టికర్త ఉన్నాడనే నమ్మకం పోయిందని కొంతమంది చెప్తారు. అలాంటి వాళ్లకు, దేవుడు ఉన్నాడనే రుజువులు వివరించే ముందు, వాళ్లకు అలా జరిగినందుకు మీరు కూడా బాధపడుతున్నారని చూపించండి. అంతేకాదు, మనుషులు ఎందుకు బాధలు పడుతున్నారో అర్థంకాక విసిగిపోవడం తప్పుకాదని చెప్పండి. (హబ. 1:2, 3) మనం ఓర్పుతో ప్రేమగా మాట్లాడినప్పుడు వాళ్లు మరింత తెలుసుకోవడానికి ఇష్టపడవచ్చు. a
లేఖనాలు చెప్పేవాటి గురించి తర్కబద్ధంగా మాట్లాడండి
7. మన పరిచర్య ఎంత సమర్థవంతంగా ఉంటుందనేది ఎక్కువగా దేనిమీద ఆధారపడివుంటుంది?
7 లేఖనాలు చెప్పేవాటి గురించి తర్కబద్ధంగా ఎలా మాట్లాడవచ్చో ఇప్పుడు చూద్దాం. మన పరిచర్యకు అన్నిటికన్నా ముఖ్యమైనది బైబిలే. ప్రతీ పరిచారకుడు “సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు” అది సహాయం చేస్తుంది. (2 తిమో. 3:16, 17) మనం ఎన్ని లేఖనాలు ఉపయోగించామనే దానిమీద కాదుగానీ, మనం చదివిన లేఖనాలను ఎంత చక్కని తర్కంతో వివరించామనే దానిమీదే మన పరిచర్య సమర్థత ఆధారపడివుంటుంది. (అపొస్తలుల కార్యములు 17:2, 3 చదవండి.) దీన్ని అర్థం చేసుకోవడానికి, మూడు సన్నివేశాలు చూద్దాం.
8, 9. (ఎ) దేవుడూ యేసూ సమానమని నమ్మేవాళ్లతో ఎలా తర్కించవచ్చు? (బి) ఈ అంశం గురించి ఇంకా ఎలా తర్కించవచ్చు?
8 సన్నివేశం 1: దేవుడూ యేసూ సమానమని నమ్మేవాళ్లను పరిచర్యలో కలిశాం. ఈ విషయం గురించి మనం ఏ లేఖనాలను ఉపయోగిస్తూ తర్కించవచ్చు? బహుశా వాళ్లను, యోహాను 6:38లో యేసు చెప్పిన మాటల్ని చదవమని అడగొచ్చు. అక్కడిలా ఉంది, “నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.” ఆ లేఖనం చదివించిన తర్వాత వాళ్లను, “ఒకవేళ యేసుక్రీస్తే దేవుడైతే, ఆయనను పరలోకం నుండి పంపించింది ఎవరు? ఆయన యేసుకంటే గొప్పవ్యక్తి కాడా? ఎంతైనా, పంపగా వచ్చిన వ్యక్తి కంటే, పంపించిన వ్యక్తి ఎప్పుడూ పై స్థానంలోనే ఉంటాడు.”
9 అదేవిధంగా, ఫిలిప్పీయులు 2:11 కూడా చదివించవచ్చు. యేసు చనిపోయి, పునరుత్థానం అయిన తర్వాత దేవుడు ఆయనకు ఇచ్చిన బహుమతి గురించి అపొస్తలుడైన పౌలు అక్కడ వివరించాడు. ఆ వచనం, “దేవుడు ఆయనను [యేసును] అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను” అని చెబుతోంది. వాళ్లు ఆ లేఖనం గురించి తర్కబద్ధంగా ఆలోచించుకునేలా ఇలా అడగవచ్చు, “యేసు చనిపోకముందు ఒకవేళ దేవునితో సమాన స్థాయిలో ఉంటే, ఆ తర్వాత దేవుడు ఆయనను అధికముగా హెచ్చించినప్పుడు, దేవునికన్నా యేసు ఉన్నతమైన స్థానానికి వెళ్లిపోయినట్లు అవ్వదా? మరి, దేవునికన్నా పై స్థానానికి వెళ్లడం ఎవరికైనా సాధ్యమౌతుందా?” ఇంటివాళ్లకు దేవుని వాక్యాన్ని గౌరవించే, సత్యాన్ని అంగీకరించే మంచి మనసు ఉంటే ఆ తర్కాన్ని అర్థం చేసుకుని, ఆ విషయం ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడవచ్చు.—అపొ. 17:11.
10. (ఎ) నరకాగ్ని ఉందని నమ్మేవాళ్లతో మనం ఎలా మాట్లాడవచ్చు? (బి) నరకాగ్ని గురించి ఇంకా ఎలా మాట్లాడితే బావుంటుందని మీ అనుభవంలో తెలుసుకున్నారు?
10 సన్నివేశం 2: చెడ్డవాళ్లు నరకంలో నిరంతరం యాతనలు పడరనే నిజాన్ని జీర్ణించుకోలేని ఓ భక్తిపరుణ్ణి కలిశాం. చెడ్డ పనులు చేసే దుర్మార్గులు తగిన శిక్ష అనుభవించి తీరాలనే కోరిక మనసులో బలంగా నాటుకుపోవడం వల్లే బహుశా ఆయన నరకాగ్ని గురించి నమ్ముతుండవచ్చు. అలాంటి అభిప్రాయం ఉన్నవాళ్లతో ఎలా మాట్లాడవచ్చు? చెడ్డవాళ్లను దేవుడు తప్పకుండా శిక్షించబోతున్నాడనే భరోసా ముందు వాళ్లకు ఇవ్వవచ్చు. (2 థెస్స. 1:9, 10) ఆ తర్వాత, పాపానికి తగిన శిక్ష మరణమని చెబుతున్న ఆదికాండము 2:16, 17 చదివించవచ్చు. ఆదాము పాపం చేయడం వల్ల మనుషులందరూ పాపులుగానే పుడుతున్నారని ఆయనకు వివరించవచ్చు. (రోమా. 5:12) కానీ, నరకాగ్నిలో పడేసి శిక్షించడం గురించి దేవుడు ఆ వచనాల్లో చెప్పలేదని వాళ్లకు చూపించవచ్చు. అప్పుడు, “ఆదాముహవ్వలు పాపం చేస్తే వాళ్లు వెళ్లేది నిరంతరం యాతనలు పడే నరకానికైతే, ఆ విషయం గురించి వాళ్లను ముందుగా హెచ్చరించడం దేవుని కనీస ధర్మం కాదా?” అని అడగవచ్చు. తర్వాత ఆదికాండము 3:19 చదివించి, పాపంచేసిన ఆదాముకు శిక్ష విధిస్తున్నప్పుడు కూడా దేవుడు నరకాగ్ని గురించి ఏమీ చెప్పలేదని వివరించవచ్చు. బదులుగా, ఆదాము తిరిగి మన్నైపోతాడని మాత్రమే ఆయన చెప్పాడు. ఈ వివరణ తర్వాత మనం ఇలా అడగవచ్చు, “ఒకవేళ ఆదాము నిజంగా, యాతనలు పడే నరకాగ్నిలోకి వెళ్లబోతుంటే, ఆయన తిరిగి నేలకు చేరతాడని చెప్పడం న్యాయమేనా?” ఆ వ్యక్తికి వాస్తవాలను స్వాగతించే మనసుంటే, ఇలాంటి ప్రశ్న విన్నప్పుడు నరకమనే అంశం గురించి మరింత ఆలోచించడానికి ఇష్టపడవచ్చు.
11. (ఎ) మంచి వాళ్లందరూ పరలోకానికి వెళ్తారని నమ్మే వ్యక్తితో ఎలా మాట్లాడవచ్చు? (బి) మనుషులు పరలోకానికి వెళ్లడం గురించి చర్చిస్తున్నప్పుడు ఎలా మాట్లాడితే బావుంటుందని మీరు తెలుసుకున్నారు?
11 సన్నివేశం 3: మంచి వాళ్లందరూ పరలోకానికి వెళ్తారని నమ్మే వ్యక్తిని కలిశాం. అలాంటి నమ్మకం ఉన్నవాళ్లు బైబిలు వచనాలను పొరపాటుగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, వాళ్లకు మీరు ప్రకటన 21:4 చూపించారని అనుకుందాం. (చదవండి.) ఆ వచనం చెబుతున్న దీవెనలు పరలోకంలో పొందేవని ఆయన అనుకోవచ్చు. మరి ఆయనను ఒప్పించేలా ఎలా మాట్లాడవచ్చు? మరిన్ని లేఖనాలు తీసి రుజువులు చూపించే బదులు, ఆ లేఖనంలోనే ఉన్న విషయాన్ని చర్చించవచ్చు. ఆ లేఖనం “మరణము ఇక ఉండదు” అని చెబుతోంది. అప్పుడు ఆయనను, ‘ఫలానా చోట ఒక వస్తువు ఉన్నప్పుడే కదా, అది అక్కడ “ఇక ఉండదు” అని చెప్పగలం?’ అని అడగొచ్చు. దానికి వాళ్లు అవునని చెప్పవచ్చు. అప్పుడు మనం, పరలోకంలో ఎప్పుడూ మరణం లేదని, మనుషులు మరణిస్తున్నది భూమ్మీద మాత్రమేనని వాళ్లకు వివరించవచ్చు. కాబట్టి, ప్రకటన 21:4 భవిష్యత్తులో భూమ్మీద పొందే దీవెనల గురించే చెబుతుందనే ముగింపుకు వాళ్లను తీసుకురావచ్చు.—కీర్త. 37:29.
విషయాన్ని స్పష్టం చేసేందుకు ఉపమానాలు ఉపయోగించండి
12. యేసు ఎందుకు ఉపమానాలు ఉపయోగించాడు?
12 యేసు ప్రకటిస్తున్నప్పుడు ప్రశ్నలతోపాటు, ఉపమానాలు కూడా ఉపయోగించాడు. (మత్తయి 13:34, 35 చదవండి.) యేసు ఉపమానాలు ఆయన శ్రోతల మనసుల్లోని ఉద్దేశాలను బయటపెట్టేవి. (మత్త. 13:10-15) యేసు బోధలు ఆకర్షణీయంగా, సులువుగా గుర్తుంచుకునేలా ఉండడానికి ఉపమానాలు తోడ్పడ్డాయి. మనం బోధిస్తున్నప్పుడు ఉపమానాలు ఎలా ఉపయోగించవచ్చు?
13. దేవుడు యేసుకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడని ఎలా వివరించవచ్చు?
13 సులువైన ఉపమానాలు ఉపయోగించడం అన్నివిధాల ఉత్తమం. ఉదాహరణకు, దేవుడు యేసుకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడని ఇంటివాళ్లకు వివరిస్తున్నారని అనుకోండి. వాళ్లిద్దరూ అంటే యెహోవా దేవుడూ యేసుక్రీస్తూ, తమ మధ్యవున్న సంబంధాన్ని తండ్రీకొడుకుల సంబంధంతో పోల్చారనే విషయాన్ని వాళ్లకు గుర్తుచేయండి. దేవుడు యేసును “కుమారుడు” అని పిలిచాడు, యేసుక్రీస్తు దేవుణ్ణి “తండ్రి” అని సంబోధించాడు. (లూకా 3:21, 22; యోహా. 14:28) ఆ తర్వాత ఇంటివాళ్లను ఇలా అడగవచ్చు, “ఎవరైనా ఇద్దరు వ్యక్తులు సరిసమానులని మీరు నాకు చెప్పాలనుకుంటే, కుటుంబంలోని ఏ ఇద్దరితో వాళ్లను పోలుస్తారు?” బహుశా అన్నదమ్ములతోనో లేదా కవలలతోనో పోలుస్తామని వాళ్లు చెప్పవచ్చు. వాళ్లు అలా చెబితే, ఆ పోలిక సమంజసమైనదని వాళ్లను మెచ్చుకోండి. ఆ తర్వాత ఇలా అడగవచ్చు, “మనలాంటి మామూలు మనుషులకే ఇలాంటి పోలిక వెంటనే తట్టిందంటే, యేసు అంతటి గొప్ప బోధకుడికి అది తట్టదంటారా? కానీ యేసు, దేవుణ్ణి ‘తండ్రి’ అని పిలిచాడు. అలా పిలవడం ద్వారా వయసులో, అధికారంలో దేవుడు తనకన్నా ఎంతో ఉన్నతుడని యేసు చూపించాడు.”
14. దేవుడు, మనుషుల్ని యాతన పెట్టడానికి సాతానును ఉపయోగించుకుంటాడని అనుకోవడం ఎంత పొరపాటో అర్థం చేసుకోవడానికి ఏ ఉపమానం చెప్పవచ్చు?
14 మరో ఉదాహరణ పరిశీలించండి. దేవుడు, “నరకలోకానికి అధిపతిగా” సాతానును నియమించాడని కొందరు నమ్ముతారు. అయితే దేవుడు, మనుషుల్ని యాతన పెట్టడానికి సాతానును ఉపయోగించుకుంటాడని అనుకోవడం ఎంత పొరపాటో అర్థం చేసుకోవడానికి ఓ ఉపమానం చెప్పవచ్చు. ప్రత్యేకించి తల్లిదండ్రులకైతే ఇది మరింత సులువుగా అర్థమౌతుంది. మనం ఇలా అడగవచ్చు, “మీ అబ్బాయి ఎంత చెప్పినా వినకుండా, చాలా చెడుగా ప్రవర్తిస్తున్నాడనుకోండి. మీరేమి చేస్తారు?” ఇలా అడిగితే, సాధారణంగా ఏ తండ్రైనా తన కొడుకును గద్దిస్తానని చెబుతాడు. ఆ పిల్లవాణ్ణి సరిదిద్దడానికి ఆయన బహుశా ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు. (సామె. 22:15) ఎంత ప్రయత్నించినా ఆ అబ్బాయి మారకపోతే అప్పుడేమి చేస్తారని మీరు అడగవచ్చు. అలాంటి తప్పనిసరి పరిస్థితే వస్తే, తన కొడుకును దండిస్తానని వాళ్లు అనవచ్చు. తర్వాత మనం, “అయితే, మీ అబ్బాయి అలా తయారవ్వడానికి ఓ చెడ్డవాడు కారణమని తెలిస్తే అప్పుడేమి చేస్తారు?” అని అడగవచ్చు. తల్లిదండ్రులకు ఆ చెడ్డవాడి మీద తప్పకుండా కోపం వస్తుంది. ఆ ఉపమానం ద్వారా మనం చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టం చేస్తూ, “మీ అబ్బాయి తప్పుదోవ పట్టడానికి ఓ చెడ్డవాడు కారణమని తెలిసీ, మీ బిడ్డను శిక్షించే పనిని వాడికే అప్పగిస్తారా?” అని ప్రశ్నించవచ్చు. నూటికి నూరుపాళ్లు లేదనే జవాబు వస్తుంది. అలాంటప్పుడు మనుషులను శిక్షించే బాధ్యతను, వాళ్లు చెడ్డపనులు చేయడానికి కారకుడైన సాతానుకే దేవుడు అప్పగిస్తాడని అనుకోవడం ఎంతవరకు సబబని అడగవచ్చు.
సహేతుకంగా ఉండండి
15, 16. (ఎ) మనం ప్రకటించే ప్రతీఒక్కరు రాజ్య సందేశాన్ని అంగీకరిస్తారని మనం ఎందుకు ఆశించకూడదు? (బి) సమర్థవంతంగా బోధించాలంటే మనకు స్వతహాగా ప్రత్యేక నైపుణ్యాలు ఉండాలా? వివరించండి. (“జవాబు చెప్పడానికి తోడ్పడే ఉపకరణం” బాక్సు కూడా చూడండి.)
15 మనం ప్రకటించే ప్రతీఒక్కరు రాజ్య సందేశాన్ని అంగీకరించరని మనకు తెలుసు. (మత్త. 10:11-14) మనం సరిగ్గా సరిపోయే ప్రశ్నలు, తిరుగులేని తర్కం, ఎంతో గొప్ప ఉపమానాలు ఉపయోగించినా అందరూ వినరు. భూమ్మీద జీవించిన వాళ్లందరికన్నా గొప్ప బోధకుడైన యేసుక్రీస్తు బోధించినా ఎక్కువ మంది వినలేదు!—యోహా. 6:66; 7:45-48.
16 అయితే, మనకు స్వతహాగా ప్రత్యేక నైపుణ్యాలు లేవని అనిపించినా, మనం పరిచర్యను సమర్థవంతంగా చేయవచ్చు. (అపొస్తలుల కార్యములు 4:13 చదవండి.) నిత్యజీవం పట్ల సరైన మనోవైఖరి ఉన్న “వారందరు” తప్పకుండా సువార్తను అంగీకరిస్తారని దేవుని వాక్యం చెబుతోంది. (అపొ. 13:48) కాబట్టి మనం సహేతుకంగా ఉండాలి. మనం మన బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి, అయితే మనం ప్రకటించే ప్రజలు సువార్తను అంగీకరించకపోతే మనం నిరుత్సాహపడకూడదు. యెహోవా మీదా ఆయనిచ్చే తర్ఫీదు మీదా ఆధారపడితే, మనం నైపుణ్యంగల బోధకులముగా తయారౌతాం. అది మనకూ మన బోధ వినేవాళ్లకూ మేలు చేస్తుంది. (1 తిమో. 4:16) “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో” తెలుసుకోవడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడు. పరిచర్యలో విజయం సాధించాలంటే, బంగారు సూత్రమని పేరుగాంచిన వచనాన్ని కూడా మనం పాటించాలి. దాని గురించి తర్వాతి ఆర్టికల్లో చూస్తాం.
a అక్టోబరు 1, 2009 కావలికోట (ఇంగ్లీషు) సంచికలోని, “సృష్టికర్త మీద విశ్వాసం పెంపొందించుకోవడం సాధ్యమేనా?” ఆర్టికల్ చూడండి.