కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నీ రాజ్యము వచ్చుగాక”​—⁠ఎప్పుడు?

“నీ రాజ్యము వచ్చుగాక”​—⁠ఎప్పుడు?

“మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి.”మత్త. 24:33.

1, 2. (ఎ) కొన్నిసార్లు గుడ్డితనానికి ఏది కారణం కావచ్చు? (బి) దేవుని రాజ్యం గురించి మనకేమి తెలుసు?

 ఒక సంఘటనను ప్రత్యక్షంగా చూసిన చాలామంది దాని వివరాలను ఒకేలా గుర్తుపెట్టుకోలేరని మీరు గమనించేవుంటారు. అలాగే, తనకు ఫలానా జబ్బు ఉందని నిర్ధారించిన తర్వాత డాక్టరు ఖచ్చితంగా ఏమి చెప్పాడో రోగికి గుర్తుండకపోవచ్చు. కొన్నిసార్లు తాళాలు, కళ్లజోడు కళ్లముందే ఉన్నా ఒక వ్యక్తికి అవి కనిపించకపోవచ్చు. ఇలాంటివి జరగడానికి ఒకరకమైన గుడ్డితనం కారణమని పరిశోధకులు అంటారు, దేని గురించో ఆలోచిస్తుండడం వల్ల మనం కొన్నిటిని గమనించం లేదా మర్చిపోతాం. మన మెదడు పనిచేసే విధానమే దానికి కారణం.

2 నేడు లోకంలో జరుగుతున్న సంఘటనల విషయంలో కూడా చాలామందికి అలాంటి గుడ్డితనమే ఉంది. 1914 నుండి లోకం చాలా మారిందని వాళ్లు ఒప్పుకుంటారు గానీ, అలాంటి సంఘటనలు ఏమి చూపిస్తున్నాయో అర్థంచేసుకోరు. 1914లో యేసు పరలోకంలో రాజైనప్పుడు ఒక రకంగా దేవుని రాజ్యం వచ్చిందని బైబిలు విద్యార్థులమైన మనకు తెలుసు. అయితే, “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని మనం చేసే ప్రార్థనకు ఆ సంఘటన ఒక్కటే పూర్తి జవాబు కాదని మనకు తెలుసు. (మత్త. 6:9, 10) ఆ మాటలు సంపూర్ణంగా నెరవేరాలంటే ప్రస్తుతమున్న దుష్ట వ్యవస్థ కూడా అంతమవ్వాలి. అప్పుడే దేవుని చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లు భూమ్మీద కూడా జరుగుతుంది.

3. దేవుని వాక్య అధ్యయనం వల్ల మనం ఏమి చూస్తున్నాం?

3 మనం దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేస్తాం కాబట్టి ప్రవచనాల నెరవేర్పును కళ్లారా చూస్తున్నాం. మనకూ లోకంలోని ప్రజలకూ ఎంత తేడా ఉందో! క్రీస్తు 1914 నుండి పరిపాలిస్తున్నాడనీ, త్వరలోనే దేవుని తీర్పులు అమలు చేయబోతున్నాడనీ చూపించే స్పష్టమైన రుజువుల్ని ఏమాత్రం పట్టించుకోలేనంతంగా వాళ్లు తమ జీవితాల్లో, కార్యకలాపాల్లో మునిగిపోయారు. మీరు చాలాకాలంగా సత్యంలో ఉంటే ఇలా ప్రశ్నించుకోండి: ‘లోకాంతం అతి సమీపంలో ఉందనీ, భూమ్మీద జరుగుతున్న సంఘటనలే దానికి రుజువనీ నేను ఇప్పటికీ నమ్ముతున్నానా?’ ఒకవేళ మీరు ఈ మధ్యే సత్యంలోకి వచ్చినా, ‘నా దృష్టి ముఖ్యంగా దేనిమీద ఉంది?’ అని ఆలోచించండి. వాటికి మీ జవాబు ఏదైనా, భూమి విషయంలో దేవుని చిత్తం త్వరలోనే నెరవేరుతుందని ఎందుకు నమ్మవచ్చో మూడు ప్రాముఖ్యమైన కారణాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

గుర్రపురౌతులు ఇప్పటికే స్వారీ మొదలుపెట్టారు

4, 5. (ఎ) యేసు 1914 నుండి ఏమి చేస్తున్నాడు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) స్వారీ చేస్తున్న ముగ్గురు గుర్రపురౌతులు వేటిని సూచిస్తున్నారు? ఆ ప్రవచనం ఎలా నెరవేరుతూ ఉంది?

4 యేసుక్రీస్తు 1914లో పరలోకంలో కిరీటం పొందాడు అంటే దేవుని రాజ్యానికి రాజయ్యాడు. యేసు తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లు ప్రకటన 6వ అధ్యాయంలోని ఓ ప్రవచనం వర్ణించింది. యేసు రాజయ్యాక, సాతాను దుష్ట లోకాన్ని నాశనం చేసేందుకు వెంటనే తన స్వారీ మొదలుపెట్టాడు. (ప్రకటన 6:1, 2 చదవండి.) దేవుని రాజ్యం పరిపాలన మొదలుపెట్టిన వెంటనే భూమ్మీద పరిస్థితులు మరింత ఘోరంగా తయారౌతాయని ఆ ప్రవచనం సూచించింది. యుద్ధాలు, కరువులు, జబ్బులు, ప్రజల్ని పొట్టనబెట్టుకునే మరితర విషయాలు మునుపెన్నడూ లేనంతగా చోటుచేసుకుంటాయి. ప్రవచనంలో యేసు వెనకాలే స్వారీ చేస్తున్న ముగ్గురు గుర్రపురౌతులు ఆ విపత్తులను సూచిస్తున్నారు.—ప్రక. 6:3-8.

5 కలిసి పనిచేద్దామని, శాంతిని కాపాడుకుందామని దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నా, బైబిలు ముందే చెప్పినట్లు యుద్ధాల వల్ల ‘భూలోకములో సమాధానము లేకుండా’ పోయింది. భూమ్మీద సమాధానం లేకుండా చేసిన ఘోర యుద్ధాలకు మొదటి ప్రపంచయుద్ధం ఆరంభం మాత్రమే. 1914 నుండి ఆర్థిక, విజ్ఞాన రంగాల్లో ఎంతో అభివృద్ధి జరిగినా ఆహారకొరతలు ప్రపంచ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. దానితోపాటు అన్నిరకాల జబ్బులు, ప్రకృతి విపత్తులు, మరితర ప్రాణాంతక తెగుళ్లు ప్రతీ సంవత్సరం లక్షల మందిని పొట్టనబెట్టుకుంటూనే ఉన్నాయి. అవి మానవ చరిత్రలో మునుపెన్నడూ లేనంత ప్రమాదకరంగా మారుతూ, తరచూ సంభవిస్తూ, ఎంతోమందిని బలిగొంటున్నాయి. అవన్నీ దేన్ని సూచిస్తున్నాయో మీరు గ్రహించారా?

గుర్రపురౌతుల స్వారీతో లోకపరిస్థితులు మరింత ఘోరంగా తయారౌతున్నాయి (4, 5 పేరాలు చూడండి)

6. బైబిలు ప్రవచనం నెరవేరిందని ఎవరు గ్రహించారు? వాళ్లు ఏమి చేశారు?

6 మొదటి ప్రపంచ యుద్ధం, స్పానిష్‌ ఫ్లూ రావడంతో చాలామంది ప్రజల దృష్టి మళ్లింది. కానీ అభిషిక్త క్రైస్తవులు మాత్రం, 1914లో “అన్యజనముల కాలములు” ముగుస్తాయని ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. (లూకా 21:24) ఆ సంవత్సరంలో ఏమి జరగనుందో వాళ్లకు పూర్తిగా తెలియకపోయినా, దైవిక పరిపాలనకు సంబంధించి అది కీలకమైన సంవత్సరమని మాత్రం వాళ్లు అర్థం చేసుకున్నారు. బైబిలు ప్రవచన నెరవేర్పును గ్రహించిన వెంటనే వాళ్లు దేవుని పరిపాలన మొదలైందని ధైర్యంగా ప్రకటించారు. రాజ్యాన్ని ప్రకటించిన చాలామందికి తీవ్ర హింసలు ఎదురయ్యాయి. చాలా దేశాల్లో అలా హింసలు రావడమే ప్రవచనం మరింతగా నెరవేరిందని చెప్పడానికి రుజువు. ఆ తర్వాత దశాబ్దాల్లో రాజ్య శత్రువులు ‘కట్టడవలన కీడు కల్పించాలని’ ఎంతో ప్రయత్నించారు. సహోదరులను కొట్టారు, జైళ్లలో వేశారు, చివరికి ఉరితీయడానికి, తుపాకీతో కాల్చడానికి, తలలు నరకడానికి కూడా తెగబడ్డారు.—కీర్త. 94:20; ప్రక. 12:15.

7. లోకంలో జరిగే సంఘటనల వెనకున్న నిజమైన అర్థాన్ని చాలామంది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు?

7 దేవుని రాజ్యం ఇప్పటికే పరలోకంలో పరిపాలన మొదలుపెట్టిందని నిరూపించే ఎన్నో రుజువులు ఉండగా, మరి చాలామంది ఎందుకు వాటిని చూడలేకపోతున్నారు? దేవుని ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ప్రకటిస్తున్నట్లు, బైబిలు ప్రవచనానికి స్పష్టమైన నెరవేర్పుగానే ప్రస్తుత లోక సంఘటనలు జరుగుతున్నాయని వాళ్లు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? చాలామంది తమ కళ్లతో చూడగలిగే వాటిపైనే దృష్టి పెట్టడం వల్ల అలా జరుగుతుందా? (2 కొరిం. 5:6) వాళ్లు తమ కార్యకలాపాల్లో పూర్తిగా మునిగిపోయారు కాబట్టే దేవుడు చేసేవాటిని చూడలేకపోతున్నారా? (మత్త. 24:37-39) సాతాను లోకంలోని ఆదర్శాలు, లక్ష్యాల వల్ల వాళ్లలో కొందరి దృష్టి మళ్లిందా? (2 కొరిం. 4:4) దేవుని రాజ్యం ఇప్పుడేమి చేస్తుందో అర్థం చేసుకోవాలంటే మనకు విశ్వాసం, ఆధ్యాత్మిక దృష్టి ఉండాలి. అయితే, జరుగుతున్న విషయాలు స్పష్టంగా చూస్తున్న మనం నిజంగా ఎంత ధన్యులమో కదా!

దుష్టత్వం అంతకంతకూ పెరిగిపోతుంది

8-10. (ఎ) రెండవ తిమోతి 3:1-5 వచనాలు ఎలా నెరవేరుతున్నాయి? (బి) దుష్టత్వం అంతకంతకూ పెరిగిపోతుందని ఎలా చెప్పవచ్చు?

8 భూ వ్యవహారాల్లో దేవుని రాజ్యం అతి త్వరలోనే జోక్యం చేసుకోబోతుందని నమ్మడానికి రెండవ కారణం, మానవ సమాజంలో దుష్టత్వం అంతకంతకూ పెరిగిపోవడమే. 2 తిమోతి 3:1-5 వచనాల్లోని ప్రవచనం నెరవేరడం గత వందేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ఆ వచనాల్లో బైబిలు వర్ణించిన ప్రవర్తన ప్రపంచ నలుమూలలా వ్యాపిస్తూవుంది. ఆ విషయాన్ని మీరూ గమనించారా? మనం ఇప్పుడు కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.—2 తిమోతి 3:1, 13 చదవండి.

9 ఉదాహరణకు 1940, 1950 దశకాల్లో ప్రజలను ఆందోళనకు గురిచేసిన పోకడలను, ప్రస్తుతం పని స్థలాల్లోనూ, వినోద కార్యక్రమాల్లోనూ, క్రీడల్లోనూ, బట్టలు వేసుకునే తీరులోనూ వస్తున్న పోకడలతో పోల్చిచూడండి. తీవ్రమైన దౌర్జన్యం, అనైతికత నేడు సర్వసాధారణమైపోయాయి. ప్రజలు హింసాత్మక, అనైతిక, క్రూర ప్రవర్తనతో ఇతరులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నారు. 1950లలో, అసభ్యకరమైనవని ప్రజలు అనుకున్న టీవీ కార్యక్రమాలు ఇప్పుడు సకుటుంబ సమేతంగా చూసే కార్యక్రమాలుగా ప్రసారం చేస్తున్నారు. వినోదం, వస్త్రధారణ వంటి రంగాలపై స్వలింగ సంయోగులు ఎలా బలమైన ముద్ర వేశారో, తమ జీవనశైలి గురించి వాళ్లు నలుగురిలో గొప్పగా ఎలా చెప్పుకుంటున్నారో చాలామంది గమనించారు. అయితే ఈ విషయాల్లో దేవుని అభిప్రాయం తెలుసుకున్న మనం ఎంతో కృతజ్ఞులం.—యూదా 14, 15 చదవండి.

10 అలాగే, గతంలో యువతీయువకుల తిరుగుబాటు ప్రవర్తనను ఇప్పటి యువతీయువకుల ప్రవర్తనతో పోల్చిచూడండి. ఉదాహరణకు, 1950లలో పిల్లలు సిగరెట్లు, మద్యం తాగితే లేదా అసభ్యంగా డాన్స్‌ చేస్తే తల్లిదండ్రులు బాధపడేవాళ్లు. అయితే, ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలు వినడం మామూలైపోయింది: ఓ 15 ఏళ్ల విద్యార్థి తుపాకీతో ఇద్దరిని చంపి, 13 మందిని గాయపర్చాడు; మద్యం మత్తులో కొంతమంది యువత ఓ తొమ్మిదేళ్ల బాలికను కిరాతకంగా చంపి, ఆమె తండ్రిని, మరో బంధువును కొట్టారు; ఆసియాలోని ఒక దేశంలో గత పదేళ్లలో జరిగిన నేరాల్లో సగానికి పైగా యువతీయువకులే చేశారు. ఇవన్నీ చూస్తూ కూడా పరిస్థితులు మరీ అధ్వానంగా తయారవ్వలేదని ఎవరైనా గుండెలమీద చెయ్యేసుకుని చెప్పగలరా?

11. పరిస్థితులు మరింత ఘోరంగా తయారవుతున్నా ప్రజలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు?

11 “అంత్యదినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు, —ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురు” అని పేతురు సరిగ్గానే చెప్పాడు. (2 పేతు. 3:3, 4) కొంతమంది అలా ప్రవర్తించడానికి కారణం ఏమైవుండవచ్చు? మనం తరచూ చూసేదాన్ని పెద్దగా పట్టించుకోం. ఉదాహరణకు, మనకు బాగా తెలిసిన స్నేహితుని ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు వస్తే మనం ఆశ్చర్యపోతాం. కానీ ప్రజల వైఖరులు, నైతిక ప్రమాణాలు కాలం గడుస్తుండగా నెమ్మనెమ్మదిగా మారుతూవుంటే మనం ఆ మార్పును గమనించకపోవచ్చు. అయితే, అలా మెల్లమెల్లగా నైతిక విలువలు కోల్పోవడం ప్రమాదకరమైనది.

12, 13. (ఎ) లోకంలో జరిగే సంఘటనలు చూసి మనం నిరుత్సాహపడాల్సిన అవసరం ఎందుకు లేదు? (బి) ‘అపాయకరమైన’ అంత్యదినాలను మనమెలా సహించగలం?

12 “అంత్యదినములలో” పరిస్థితులు ‘అపాయకరంగా’ ఉంటాయని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. (2 తిమో. 3:1) కానీ, అవి మరీ నెట్టుకురాలేనంత కష్టంగా మాత్రం ఉండవు, కాబట్టి మనం వాటి నుండి పారిపోవాల్సిన అవసరం లేదు. యెహోవా, ఆయన ఆత్మ, క్రైస్తవ సంఘం సహాయంతో మనం జీవితంలో వచ్చే ఎలాంటి నిరుత్సాహాన్నైనా, భయాన్నైనా విజయవంతంగా పారదోలగలం. మనం విశ్వాసాన్ని ఖచ్చితంగా కాపాడుకోగలం. అందుకు కావాల్సిన ‘బలాధిక్యాన్ని’ దేవుడే ఇస్తాడు.—2 కొరిం. 4:7-10.

13 అంత్యదినాలకు సంబంధించిన ప్రవచనం చెప్పేటప్పుడు పౌలు, “తెలిసికొనుము” అనే మాటను ఉపయోగించాడని గమనించండి. ఆ ప్రవచనంలోని మిగతా విషయాలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆ మాటను బట్టి గట్టిగా నమ్మవచ్చు. యెహోవా జోక్యం చేసుకుని, అంతం తీసుకొచ్చేవరకూ భక్తిహీన మానవ సమాజం అంతకంతకూ అధ్వానంగా తయారౌతుందని చెప్పడంలో సందేహం లేదు. నైతిక ప్రమాణాలు క్షీణించిపోవడం వల్ల కొన్ని సమాజాలు, చివరికి దేశాలు కూడా పతనమయ్యాయని చరిత్రకారులు రాశారు. అయితే, చరిత్రలో ఎన్నడూ లేనంతగా నేడు లోకమంతా నైతికంగా దిగజారిపోయింది. ఇదంతా దేనికి రుజువుగా ఉందో చాలామంది పట్టించుకోకపోవచ్చు. కానీ, దేవుని రాజ్యం త్వరలోనే దుష్టత్వాన్ని పూర్తిగా అంతం చేస్తుందని 1914 నుండి జరుగుతున్న సంఘటనలు మనల్ని ఒప్పించాలి.

“ఈ తరము గతింపదు”

14-16. దేవుని రాజ్యం త్వరలోనే ‘వస్తుందని’ నమ్మడానికి మూడో కారణం ఏమిటి?

14 అంతం సమీపంలోనే ఉందని మనం నమ్మడానికి మూడో కారణం, దేవుని ప్రజల చరిత్ర. ఉదాహరణకు, దేవుని రాజ్యం పరలోకంలో పాలన మొదలుపెట్టకముందు, కొంతమంది నమ్మకమైన అభిషిక్తులు ఉత్సాహంగా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. వాళ్లు ఎదురుచూసిన కొన్ని విషయాలు 1914లో నిజం కానప్పుడు వాళ్లేం చేశారు? వాళ్లలో చాలామంది శ్రమల్లో, హింసల్లో కూడా తమ యథార్థతను కాపాడుకుని, యెహోవా సేవలో కొనసాగారు. ఆ అభిషిక్తుల్లో దాదాపు అందరూ తమ భూజీవితాన్ని నమ్మకంగా ముగించారు.

15 లోకాంతం గురించిన తన ప్రవచనంలో యేసు ఇలా చెప్పాడు: “ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదు.” (మత్తయి 24:33-35 చదవండి.) “ఈ తరము” అన్నప్పుడు, యేసు రెండు గుంపుల అభిషిక్త క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడని మనకు తెలుసు. మొదటి గుంపు సభ్యులు 1914లో జీవించివుండి, ఆ సంవత్సరంలో యేసు రాజయ్యాడని గ్రహించారు. అంటే, 1914లో జీవించివుండడమే కాకుండా ఆ సంవత్సరంలో లేదా అంతకంటే ముందు దేవుని కుమారులుగా ఆత్మాభిషేకం పొందినవాళ్లు ఆ గుంపులోని సభ్యులుగా ఉన్నారు.—రోమా. 8:14-17.

16 ‘ఈ తరములో’ ఉన్న రెండవ గుంపు సభ్యులు ఎవరంటే, మొదటి గుంపులోని కొంతమంది భూమ్మీద జీవించివున్నప్పుడే, పరిశుద్ధాత్మతో అభిషేకం పొందిన ఇతర అభిషిక్తులు. కాబట్టి ప్రస్తుతం ఈ భూమ్మీదున్న అభిషిక్తుల్లో ప్రతీ ఒక్కరు యేసు చెప్పిన ‘ఈ తరములోని’ సభ్యులు కాదు. రెండవ గుంపులోని అభిషిక్తులు కూడా ఇప్పుడు వృద్ధులౌతున్నారు. అయినా, “ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదు” అని మత్తయి 24:34లో యేసు చెప్పిన మాటల్ని బట్టి ‘ఈ తరములో’ కనీసం కొంతమందైనా జీవించి ఉన్నప్పుడే మహాశ్రమలు మొదలౌతాయని మనం ధైర్యంతో ఉండవచ్చు. అందుకే, దేవుని రాజ్యం అతి త్వరలోనే దుష్టత్వాన్ని నాశనం చేసి, నీతి విలసిల్లే నూతన లోకాన్ని తీసుకొస్తుందని మనం మరింత నమ్మకంతో ఉండవచ్చు.—2 పేతు. 3:13.

క్రీస్తు త్వరలోనే తన విజయ పరంపరను ముగిస్తాడు

17. మనం చర్చించిన రుజువులు ఏ విషయాన్ని అర్థం చేసుకునేలా సహాయం చేస్తాయి?

17 ఇప్పటివరకూ మనం చర్చించిన రుజువులనుబట్టి మనం ఏమి అర్థంచేసుకోవచ్చు? యేసు చెప్పినట్లు, అంతం వచ్చే ఖచ్చితమైన దినాన్ని, గడియను మనం తెలుసుకోలేము, మనకు తెలియదు. (మత్త. 24:36; 25:13) అయితే పౌలు ప్రస్తావించినట్లుగా అంతం వచ్చే ‘కాలాన్ని’ మనం తెలుసుకోవచ్చు, తెలుసుకున్నాం కూడా. (రోమీయులు 13:11 చదవండి.) మనం ఆ కాలంలోనే అంటే అంత్యదినాల్లో జీవిస్తున్నాం. మనం బైబిలు ప్రవచనాలపై, యెహోవా దేవుడూ యేసుక్రీస్తూ చేస్తున్న పనులపై పూర్తి అవధానం నిలిపితే, ఈ దుష్టలోక అంతం సమీపంలో ఉందనే స్పష్టమైన రుజువును చూస్తాం.

18. దేవుని రాజ్యాన్ని గుర్తించడానికి నిరాకరించే వాళ్లకు ఏమి జరుగుతుంది?

18 తెల్లని గుర్రం మీద విజయోత్సవ స్వారీచేస్తున్న యేసు అధికారాన్ని గుర్తించడానికి నిరాకరించే వాళ్లందరూ త్వరలోనే తమ తప్పును బలవంతంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆయన తీర్పులను తప్పించుకోవడం వాళ్ల తరం కాదు. ఆ తీర్పును ఎదుర్కొని నిలబడలేక చాలామంది, “దానికి తాళజాలినవాడెవడు?” అని ఆర్తనాదాలు చేస్తారు. (ప్రక. 6:15-17) అయితే ప్రకటన గ్రంథంలోని తర్వాతి అధ్యాయంలోనే ఆ ప్రశ్నకు జవాబుంది. అభిషిక్తులు, భూపరదైసు నిరీక్షణగల వాళ్లు తప్పకుండా ఆ సమయంలో దేవుని ఆమోదంతో ‘నిలబడతారు.’ వేరేగొర్రెల “గొప్పసమూహము” మహా శ్రమలను తప్పించుకుంటుంది.—ప్రక. 7:9, 13-15.

19. అంతం సమీపంలోనే ఉందని నమ్మే మీరు దేని కోసం ఎదురుచూస్తున్నారు?

19 ఈ ఉత్తేజకరమైన కాలాల్లో నెరవేరుతున్న బైబిలు ప్రవచనాల మీద శ్రద్ధగా మనసు నిలిపితే, సాతాను లోకం వల్ల మన ధ్యాస పక్కకు మళ్లకుండా ఉంటుంది. లోకంలో జరుగుతున్న సంఘటనల ప్రాముఖ్యతను మరింత స్పష్టంగా చూస్తాం. త్వరలోనే, క్రీస్తు నీతియుక్త యుద్ధమైన హార్‌మెగిద్దోనులో ఈ దుష్టలోకాన్ని నాశనం చేసి తన విజయ పరంపరను ముగిస్తాడు. (ప్రక. 19:11, 19-21) ఆ తర్వాత మనం ఎంత ఆనందంగా ఉంటామో ఒక్కసారి ఊహించండి!—ప్రక. 20:1-3, 6; 21:3, 4.