సరళమైన ఆంగ్లంలో కావలికోటను ఎందుకు ప్రవేశపెట్టాం?
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు కావలికోట పత్రికలో వచ్చే బైబిలు ఆధారిత సమాచారం పట్ల దశాబ్దాలుగా ప్రశంసను వ్యక్తం చేస్తున్నారు, దాని నుండి ప్రయోజనం పొందుతున్నారు. అయితే 2011 జూలై నెలలో మొదటిసారిగా సరళమైన ఆంగ్లంలో కావలికోట అధ్యయన ప్రతిని ప్రవేశపెట్టాం. ఆ సంచికలో ఇలా వచ్చింది: “ఈ కొత్త సంచికను ఒక సంవత్సరం పాటు ప్రచురించి చూస్తాం. ఒకవేళ అది సహాయకరంగా ఉంటే దాని ప్రచురణను కొనసాగిస్తాం.”
అయితే, ఆ సంచిక ప్రచురణను ఇక ముందు కూడా కొనసాగిస్తామని తెలియజేసేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. త్వరలోనే ఫ్రెంచ్, పోర్చుగీస్, స్పానిష్ భాషల్లో కూడా అలాంటి సరళ భాషా ప్రతిని ప్రచురిస్తాం.
అది ప్రజలకు ఎందుకు నచ్చింది?
దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని కొంతమంది సరళమైన ఆంగ్లంలో మొదటి సంచిక విడుదలైన తర్వాత దాని గురించి ఇలా రాశారు: “సహోదరులు ఇప్పుడు కావలికోట పత్రికలోని సమాచారాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నారు.” మరో ఉత్తరంలో ఇలా ఉంది: “ఒకప్పుడు అందులోని పదాలను, వాక్యాలను అర్థంచేసుకోవడం కోసం వెచ్చించిన సమయాన్ని మేము ఇప్పుడు అక్కడ ఇచ్చిన లేఖనాలను అర్థంచేసుకోవడానికి, అవి సమాచారంతో ఎలా ముడిపడి ఉన్నాయో అర్థంచేసుకోవడానికి వెచ్చిస్తున్నాం.”
ఉన్నత చదువులు చదివిన ఓ సహోదరి అమెరికా నుండి ఇలా రాసింది: “నేను 18 ఏళ్లపాటు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్లకు మాత్రమే అర్థమయ్యే భాషను మాట్లాడడం, రాయడం నేర్చుకున్నాను. దానివల్ల, నేను అవసరమైన దానికన్నా ఎక్కువ సంక్లిష్టంగా ఆలోచించడం, మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. అయితే, నేను నా ఆలోచనా తీరును, మాట్లాడే తీరును ఎంతగానో మార్చుకోవాల్సి ఉందని గ్రహించాను.” ఇప్పుడు పరిచర్యలో ఎన్నో మంచి ఫలితాలు సాధిస్తున్న ఆ సహోదరి ఇంకా ఇలా
రాసింది: “ఆ సంచిక నాకు ఎంతో సహాయం చేసింది. దానిలో ఉపయోగించిన భాషను చూశాక, ఆయా విషయాల్ని సరళంగా ఎలా వివరించాలో నేర్చుకున్నాను.”1972లో బాప్తిస్మం తీసుకున్న ఓ సహోదరి ఇంగ్లాండ్ నుండి ఇలా రాసింది: “మొదటి సంచికను చదివినప్పుడు, యెహోవా నా భుజాల మీద చెయ్యి వేసి నా పక్కనే కూర్చున్నట్లు, మేమిద్దరం కలిసి దాన్ని చదువుతున్నట్లు నాకు అనిపించింది. అది చదువుతుంటే, తండ్రి తన బిడ్డను పడుకోబెట్టేటప్పుడు ఒక కథ చదివి వినిపిస్తున్న భావన నాలో కలిగింది.”
ఆ సంచిక చదవడం వల్లే కొన్నిసార్లు విషయాలు మరింత బాగా అర్థమౌతున్నాయని, 40 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం బాప్తిస్మం తీసుకొని ప్రస్తుతం అమెరికాలోని బెతెల్లో సేవచేస్తున్న ఓ సహోదరి వ్యాఖ్యానించింది. ఉదాహరణకు, సెప్టెంబరు 15, 2011 సంచికలో “Some Expressions Explained” అనే భాగంలో హెబ్రీయులు 12:1, 2లోని ‘మేఘమువలె ఉన్న సాక్షి సమూహం’ అనే పద బంధానికి, “లెక్కించలేనంత మంది సాక్షులు ఉన్నారు” అనే వివరణ ఉంది. “అది చదివినప్పుడు ఆ లేఖనం విషయంలో నాకున్న అవగాహన పెరిగింది” అని ఆ సహోదరి అంది. కూటాల గురించి కూడా వ్యాఖ్యానిస్తూ ఆమె ఇలా అంది: “ఒక చిన్న పిల్లవాడు సరళమైన ఆంగ్ల ప్రతిలో నుండి నేరుగా చదివినా సరే, ఆ వ్యాఖ్యానం ప్రేక్షకులకు కొత్తగా అనిపించేది. ఎందుకంటే, చాలామంది చేతుల్లో ఉండే అసలు ప్రతిలోని పదాలతో పోలిస్తే సరళ ప్రతిలోని పదాలు భిన్నంగా ఉంటాయి.”
బెతెల్లో సేవచేస్తున్న మరో సహోదరి ఇలా రాసింది: “మా సంఘంలో చిన్న పిల్లల వ్యాఖ్యానాలు వినడం కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తాను. సరళ ప్రతి వల్ల వాళ్లు ఆత్మవిశ్వాసంతో వ్యాఖ్యానాలు చేయగలుగుతున్నారు. వాళ్ల వ్యాఖ్యానాలు నాకు చాలా ప్రోత్సాహాన్నిస్తాయి.”
1984లో బాప్తిస్మం తీసుకున్న ఓ సహోదరి తన
ప్రశంసను ఇలా వ్యక్తం చేసింది: “సరళ ప్రతిని నా కోసమే తయారు చేశారనిపిస్తోంది. నేను చదువుతున్నదాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నాను. కావలికోట అధ్యయనం జరుగుతున్నప్పుడు జవాబులు ఇవ్వడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని అది నాలో నింపింది.”తల్లిదండ్రులు అమూల్యంగా ఎంచే పరికరం
ఏడేళ్ల అబ్బాయి ఉన్న ఓ తల్లి ఇలా అంది: “కావలికోట అధ్యయనం కోసం సిద్ధపడుతున్నప్పుడు అందులోని చాలా వాక్యాలను వాడికి వివరించడానికి ఎంతో సమయం పట్టేది, చాలా అలసట కలిగేది.” సరళ ప్రతి వచ్చాక పరిస్థితి ఏమైనా మారిందా? ఆమె ఇలా రాసింది: “ప్రస్తుతం అధ్యయనం కోసం సిద్ధపడుతున్నప్పుడు వాడు కూడా కొన్ని పేరాలు చదువుతున్నాడు, వాటి అర్థాన్ని గ్రహించగలుగుతున్నాడు. అదంతా చూస్తుంటే నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. వాక్యాలు చిన్నగా ఉంటాయి, విషయాలు సులభంగా అర్థమౌతాయి కాబట్టి వాడు ఇప్పుడు కంగారు పడడంలేదు. ఇప్పుడు వాడే సొంతగా వ్యాఖ్యానాలు సిద్ధం చేసుకుంటున్నాడు, అధ్యయనం జరుగుతున్నప్పుడు అవధానమంతా పత్రిక మీదే పెడుతున్నాడు.”
తొమ్మిదేళ్ల కూతురు ఉన్న ఓ తల్లి ఇలా రాసింది: “ఇంతకుముందు వ్యాఖ్యానాలను సిద్ధం చేసుకోవడానికి మా పాపకు మా సహాయం అవసరమయ్యేది. ఇప్పుడైతే తనే సొంతగా సిద్ధపడుతోంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే మేము వివరించాల్సి వస్తుంది. అందులోని చాలా విషయాలు తనకు సులభంగా అర్థమైపోతున్నాయి కాబట్టి ఇప్పుడు తాను కావలికోట అధ్యయనంలో చక్కగా పాల్గొంటోంది.”
పిల్లలు ఏమనుకుంటున్నారు?
ప్రత్యేకంగా తమ కోసమే సరళ ప్రతిని తయారుచేశారని చాలామంది పిల్లలు అనుకుంటున్నారు. “ఈ కొత్త సంచికను ప్రచురించడం ఇలాగే కొనసాగించండి” అని 12 ఏళ్ల రెబెకా కోరింది. ఆమె ఇంకా ఇలా అంది: “ ‘Some Expressions Explained’ భాగమంటే నాకు చాలా ఇష్టం. ఇది చిన్న పిల్లలకు చాలా సులభంగా అర్థమౌతుంది.”
నికలెట్ అనే ఏడేళ్ల అమ్మాయి ఇలా అంది: “మామూలు కావలికోట ప్రతిలోని సమాచారాన్ని అర్థం చేసుకోవడం నాకు కొంచెం కష్టమయ్యేది, కానీ సరళ ప్రతి వల్ల ఇప్పుడు నేను సొంతగా వ్యాఖ్యానాలు ఇవ్వగలుగుతున్నాను.” తొమ్మిదేళ్ల ఎమ్మా ఇలా రాసింది: “ఇది నాకు, ఆరేళ్ల మా తమ్ముడికి ఎంతగానో సహాయపడుతోంది. మేము విషయాల్ని ఇంతకుముందు కన్నా చాలా బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇది ప్రచురించినందుకు మీకు చాలా థ్యాంక్స్.”
వీటన్నిటినీ చూస్తుంటే, సులభంగా అర్థంచేసుకునే వాక్యాలు ఉండే సరళ ప్రతి వల్ల ఎంతోమంది ప్రయోజనం పొందుతున్నారని స్పష్టమౌతోంది. ప్రస్తుతం చాలామందికి ఉపయోగపడుతున్న ఈ సరళ ప్రతిని, 1879 నుండి క్రమంగా ప్రచురించబడుతున్న అసలు ప్రతితోపాటు ఇకముందు కూడా ప్రచురిస్తాం.