దేవునికి లోబడండి, ఆయన చేసిన ప్రమాణాల నుండి ప్రయోజనం పొందండి
‘దేవుడు తనకంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక, తనతోడు అని ప్రమాణముచేసెను.’ —హెబ్రీ. 6:13, 14.
1. పాపులైన మానవుల మాటలకు, యెహోవా మాటలకు మధ్యవున్న తేడా ఏమిటి?
యెహోవా ‘సత్య దేవుడు.’ (కీర్త. 31:5) పాపులైన మానవులు చెప్పే మాటల్ని మనం కొన్నిసార్లు నమ్మలేం, కానీ యెహోవా మాత్రం “అబద్ధమాడజాలని” దేవుడు. (హెబ్రీ. 6:17, 18; సంఖ్యాకాండము 23:19 చదవండి.) మనుష్యుల శ్రేయస్సు కోసం ఆయన ఉద్దేశించినవి ఎల్లప్పుడూ నెరవేరతాయి. ఉదాహరణకు, ప్రతీ సృష్టి దినం ఆరంభంలో యెహోవా తాను ఏమేమి చేస్తానని అన్నాడో వాటన్నిటినీ చేశాడు. అలా, ఆరవ సృష్టి దినం ముగిసే సమయానికి, “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను.”—ఆది. 1:6, 7, 30, 31.
2. దేవుని విశ్రాంతి దినం అంటే ఏమిటి? దేవుడు దాన్ని ఎందుకు ‘పరిశుద్ధపర్చాడు’?
2 తాను చేసిన సృష్టి కార్యాలను పరిశీలించాక, యెహోవా ఏడవ దినం ఆరంభం గురించి ప్రకటించాడు. ఆ దినం 24 గంటల కాలం కాదుగానీ, భూమ్మీద సృష్టి కార్యాలను ముగించి దేవుడు విశ్రమించిన సుదీర్ఘమైన కాలం. (ఆది. 2:2) దేవుని విశ్రాంతి దినం ఇంకా అయిపోలేదు. (హెబ్రీ. 4:9, 10) ఆ దినం ఖచ్చితంగా ఎప్పుడు మొదలైందో బైబిలు చెప్పడం లేదు. కానీ, సుమారు 6,000 సంవత్సరాల క్రితం ఆదాము భార్యయైన హవ్వ సృష్టించబడిన కొంతకాలానికి అది మొదలై ఉంటుంది. త్వరలోనే యేసుక్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన ఆరంభమౌతుంది. పరిపూర్ణ మానవులతో భూమి ఎల్లప్పుడూ ఒక పరదైసుగా ఉండాలనే దేవుని సంకల్పాన్ని అది నెరవేరుస్తుంది. (ఆది. 1:27, 28; ప్రక. 20:6) సంతోషకరమైన ఆ భవిష్యత్తు మీ సొంతమౌతుందని మీరు నమ్మవచ్చా? ఖచ్చితంగా! ఎందుకంటే, “దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను.” అనుకోని అవాంతరాలు ఎన్ని వచ్చినా సరే, దేవుని విశ్రాంతి దినం ముగిసేలోగా ఆయన సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మేందుకు ఆ మాటలు ఓ గట్టి రుజువు.—ఆది. 2:3.
3. (ఎ) దేవుని విశ్రాంతి దినం మొదలయ్యాక ఏ తిరుగుబాటు జరిగింది? (బి) ఆ సమస్యను పరిష్కరించడానికి తాను చేయబోయే దానిగురించి యెహోవా ఏమి చెప్పాడు?
3 దేవుని విశ్రాంతి దినం మొదలైన కొంతకాలానికి, ఒక పెద్ద అవాంతరం రానేవచ్చింది. దేవుని ఆత్మ కుమారుల్లో ఒకడైన సాతాను యెహోవాను ధిక్కరించి తనను తాను దేవునిగా చేసుకున్నాడు. ఆ తర్వాత, మొట్టమొదటి అబద్ధం చెప్పి హవ్వను మోసపర్చాడు, దాంతో ఆమె దేవుని ఆజ్ఞను మీరింది. (1 తిమో. 2:14) తన భర్తయైన ఆదాము కూడా దేవునికి ఎదురుతిరిగేలా ఆమె చేసింది. (ఆది. 3:1-6) యెహోవా సత్యవంతుడేనా అన్న ప్రశ్న తలెత్తిన ఆ క్లిష్ట సమయంలో కూడా, తన సంకల్పం ఖచ్చితంగా నెరవేరుస్తానని చూపించేందుకు యెహోవా ఒట్టేయలేదు. కానీ, తన నిర్ణీత కాలంలో మనకు అర్థమయ్యే మాటల్లో యెహోవా పరిష్కారాన్ని తెలియజేశాడు. ఆ సమస్యను పరిష్కరించే తీరు గురించి యెహోవా ఇలా చెప్పాడు: “నీకును [సాతానుకును] స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది [వాగ్దాన సంతానం] నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువు.”—ఆది. 3:15; ప్రక. 12:9.
ఒట్టు పెట్టుకోవడం—ఇతరుల్లో నమ్మకం కలిగిస్తుంది
4, 5. అబ్రాహాము కొన్ని సందర్భాల్లో ఏమి చేశాడు?
4 ఏదెనులో తిరుగుబాటు జరగడానికి ముందు, ఆదాముహవ్వలకు నమ్మకం కలిగించడానికి యెహోవా ఏ సందర్భంలోనూ ఒట్టేసి ఉండకపోవచ్చు, వాళ్లతో మాట్లాడేటప్పుడు అసలు అలాంటి పదాల్ని కూడా ఉపయోగించి ఉండకపోవచ్చు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయనలా ప్రవర్తించే పరిపూర్ణులకు అసలు ఒట్టేయాల్సిన అసరమే లేదు. వాళ్లు ఎప్పుడూ సత్యమే చెబుతారు, అవతలి వ్యక్తిని పూర్తిగా నమ్ముతారు. కానీ, మానవులు పాపం చేసి అపరిపూర్ణులయ్యాక పరిస్థితులు మారిపోయాయి. మెల్లమెల్లగా అబద్ధం, మోసం పెరిగిపోవడంతో కొన్ని ప్రాముఖ్యమైన విషయాల గురించి అవతలి వాళ్లను నమ్మించడానికి ఒట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
5 కనీసం మూడు సందర్భాల్లో అబ్రాహాము ప్రమాణం చేశాడు లేదా ఒట్టు పెట్టుకున్నాడు. దానివల్ల ప్రయోజనమే కలిగింది. (ఆది. 21:22-24; 24:2-4, 9) ఉదాహరణకు ఆయన ఒట్టేసిన ఒక సందర్భాన్ని పరిశీలించండి. ఏలాము రాజును, అతని సైన్యాలను ఓడించి వచ్చిన అబ్రాహామును కలవడానికి షాలేము, సొదొమ రాజులు వచ్చారు. షాలేము రాజైన మెల్కీసెదెకు “సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు” కూడా. ఆ సమయంలో ఆయన అబ్రాహామును ఆశీర్వదించి, శత్రువులపై ఆయనకు విజయాన్ని అందించినందుకు దేవుణ్ణి స్తుతించాడు. (ఆది. 14:17-20) ఆ తర్వాత, శత్రువుల చేతిలో నుండి తన ప్రజల్ని విడిపించినందుకు సొదొమ రాజు అబ్రాహాముకు బహుమానం ఇవ్వజూపినప్పుడు అబ్రాహాము ఇలా అన్నాడు: “నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పులవారైనను నీవాటిలో ఏదైనను తీసికొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవాయెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను.”—ఆది. 14:21-23.
అబ్రాహాముకు యెహోవా చేసిన ప్రమాణం
6. (ఎ) అబ్రాహాము ఎలాంటి మాదిరి ఉంచాడు? (బి) అబ్రాహాము చూపించిన విధేయత నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?
6 పాపులైన మానవుల ప్రయోజనం కోసం యెహోవా దేవుడు కూడా, “నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు” అనేలాంటి మాటల్ని ఉపయోగిస్తూ కొన్ని సందర్భాల్లో ఒట్టు పెట్టుకున్నాడు. (యెహె. 17:16) యెహోవా ఒట్టేసిన సందర్భాలు బైబిల్లో 40 కన్నా ఎక్కువున్నాయి. బహుశా, యెహోవా అబ్రాహాముతో చేసిన ప్రమాణాల గురించి మనలో చాలామందికి తెలుసు. ఎన్నో సంవత్సరాల వ్యవధిలో యెహోవా అబ్రాహాముతో కొన్ని నిబంధనలు చేశాడు. వాటన్నిటినీ కలిపి చూస్తే, వాగ్దాన సంతానం అబ్రాహాము వంశవృక్షంలో ఇస్సాకు ద్వారా వస్తాడని స్పష్టమౌతుంది. (ఆది. 12:1-3, 7; 13:14-17; 15:5, 18; 21:12) కొంతకాలానికి, యెహోవా అబ్రాహాముకు ఓ కఠిన పరీక్ష పెట్టాడు. తన ప్రియ కుమారుణ్ణి బలిగా అర్పించమని అబ్రాహాముకు ఆజ్ఞాపించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అబ్రాహాము యెహోవాకు లోబడి ఇస్సాకును అర్పించబోతుండగా దేవుడు ఒక దూత ద్వారా అబ్రాహామును ఆపాడు. అప్పుడు యెహోవా ఇలా ఒట్టేశాడు: “నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును, నాతోడని ప్రమాణము చేసియున్నాను.”—ఆది. 22:1-3, 9-12, 15-18.
7, 8. (ఎ) దేవుడు అబ్రాహాముకు ఎందుకు ప్రమాణం చేశాడు? (బి) దేవుడు చేసిన ప్రమాణం నుండి ‘వేరే గొర్రెలు’ ఎలా ప్రయోజనం పొందుతారు?
7 తన వాగ్దానాలు నిజమౌతాయని యెహోవా అబ్రాహాముకు ఎందుకు ప్రమాణం చేశాడు? వాగ్దాన ‘సంతానంలో’ రెండవ భాగంగా తయారై క్రీస్తుతోపాటు వారసులుగా ఉండబోయేవాళ్లకు అభయమివ్వడానికి, వాళ్ల విశ్వాసాన్ని బలపర్చడానికి యెహోవా అలా ఒట్టేశాడు. (హెబ్రీయులు 6:13-18 చదవండి; గల. 3:29) అపొస్తలుడైన పౌలు వివరించినట్లుగా యెహోవా ‘తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి [తన వాగ్దానం, తన ప్రమాణం], మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణముచేసి వాగ్దానమును దృఢపరచెను.’
8 అబ్రాహాముకు దేవుడు చేసిన ప్రమాణం నుండి ప్రయోజనం పొందేది అభిషిక్త క్రైస్తవులు మాత్రమే కాదు. ఎందుకంటే, అబ్రాహాము “సంతానము” వల్ల ‘భూలోకములోని జనములన్నియు ఆశీర్వదించబడును’ అని యెహోవా మాటిచ్చాడు. (ఆది. 22:18) అలా ఆశీర్వాదాలు పొందేవాళ్లలో, క్రీస్తుకు లోబడుతూ భూపరదైసులో నిత్యం జీవించాలని ఎదురుచూసే ‘వేరే గొర్రెలు’ ఉన్నారు. (యోహా. 10:16) మీకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా మీ జీవితమంతా దేవునికి లోబడుతూ ఆ నిరీక్షణను గట్టిగా పట్టుకొని ఉండండి.—హెబ్రీయులు 6:11, 12 చదవండి.
దేవుడు చేసిన ఇతర ప్రమాణాలు
9. అబ్రాహాము వంశీయులు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు యెహోవా ఏమని ప్రమాణం చేశాడు?
9 కొన్ని శతాబ్దాల తర్వాత, ఐగుప్తు బానిసత్వంలో ఉన్న అబ్రాహాము వంశీయులతో మాట్లాడడానికి మోషేను పంపించినప్పుడు, యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానాలకు సంబంధించి మళ్లీ ఒట్టేశాడు. (నిర్గ. 6:6-8) ఆ సందర్భాన్ని సూచిస్తూ దేవుడు ఇలా అన్నాడు: ‘నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన కాలమున వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి వారికొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించునదియునైన దేశములోనికి తోడుకొనిపోయెదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసితిని.’—యెహె. 20:5, 6.
10. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదలయ్యాక యెహోవా వాళ్లకు ఏ ప్రమాణం చేశాడు?
10 ఆ తర్వాత ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదలయ్యాక, యెహోవా వాళ్లకు మరో ప్రమాణం చేస్తూ ఇలా అన్నాడు: “మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్తభూమియు నాదేగదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు.” (నిర్గ. 19:5, 6) అలా యెహోవా వాళ్లకు ఎంతో గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. యెహోవాకు లోబడి నడుచుకుంటే, మానవజాతికి మేలు చేసేలా రాజులైన యాజక సమూహంగా ఏర్పడే గొప్ప అవకాశం ఇశ్రాయేలీయులకు ఉంటుందని ఆ మాటలు చూపించాయి. ఆ సందర్భంలో వాళ్ల కోసం తాను చేసినదాన్ని వర్ణిస్తూ యెహోవా ఇలా అన్నాడు: ‘నేను నిన్ను పెండ్లి చేసికొని [“నీతో ప్రమాణం చేసి,” NW] నీతో నిబంధన చేసికొంటిని.’—యెహె. 16:8-10.
11. తన జనాంగంగా ఉండి తనకు సన్నిహితంగా ఉండమని యెహోవా ఇశ్రాయేలీయుల్ని ఆహ్వానించినప్పుడు వాళ్లు ఎలా స్పందించారు?
11 లోబడి ఉంటామని చూపించేందుకు ఒట్టేయమని యెహోవా అప్పుడు ఇశ్రాయేలీయుల్ని అడగలేదు, తన నిబంధన ప్రజలుగా ఉండమని వాళ్లను బలవంతపెట్టలేదు. కానీ, “యెహోవా చెప్పినదంతయు చేసెదము” అని వాళ్లే ఇష్టపూర్వకంగా చెప్పారు. (నిర్గ. 19:8) తన జనాంగం ఏయే నియమాలు పాటించాలో యెహోవా ఇశ్రాయేలీయులకు మూడు రోజుల తర్వాత తెలియజేశాడు. దేవుడు మొదట మోషే ద్వారా వాళ్లకు పది ఆజ్ఞల్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకా వేరే నియమాల్ని కూడా ఇచ్చాడు, అవి నిర్గమకాండము 20:22 నుండి 23:33 వరకున్న లేఖనాల్లో నమోదై ఉన్నాయి. ఆ నియమాల విషయంలో ఇశ్రాయేలీయులు ఎలా స్పందించారు? “ప్రజలందరు—యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసెదమని యేకశబ్దముతో ఉత్తరమిచ్చిరి.” (నిర్గ. 24:3) మోషే ఆ నియమాలన్నిటినీ ‘నిబంధన గ్రంథంలో’ రాసి, ప్రజలందరూ వినేలా వాటిని బిగ్గరగా చదివి వినిపించాడు. అప్పుడు, ఇశ్రాయేలీయులు, “యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుము” అని మూడోసారి ప్రమాణం చేశారు.—నిర్గ. 24:4, 7, 8.
12. తమ మధ్య ఉన్న నిబంధన విషయంలో యెహోవా ఎలా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయులు ఎలా ప్రవర్తించారు?
12 యెహోవా వెంటనే ధర్మశాస్త్ర నిబంధనలో తన వంతును నెరవేర్చడం మొదలుపెట్టాడు. ఆరాధన కోసం ఒక గుడారాన్ని, పాపులైన మానవులు తనను సమీపించేలా ఓ యాజకత్వాన్ని ఏర్పాటు చేశాడు. కానీ, ఇశ్రాయేలీయులు మాత్రం దేవునికి ఇచ్చిన మాటను త్వరగా మర్చిపోయారు, వాళ్లు “ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి.” (కీర్త. 78:41) ఉదాహరణకు, మోషే సీనాయి పర్వతం మీద యెహోవా నుండి అదనపు నిర్దేశాలను తీసుకుంటున్న సమయంలో, మోషే తమను వదిలేసి వెళ్లిపోయాడని భావించిన ఇశ్రాయేలీయులు సహనం కోల్పోయారు, వాళ్లకు దేవునిపై ఉన్న విశ్వాసం కూడా తగ్గిపోవడం మొదలైంది. కాబట్టి, వాళ్లు ఒక బంగారు దూడను చేసుకొని, “ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే” అని చాటించారు. (నిర్గ. 32:1, 4) ఆ తర్వాత, వాళ్లు “యెహోవాకు పండుగ” చేసుకుంటున్నామని భావించి తాము చేసుకున్న విగ్రహానికి మొక్కారు, బలులు అర్పించారు. అది చూసినప్పుడు యెహోవా, ‘నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయారు’ అని మోషేతో అన్నాడు. (నిర్గ. 32:5, 6, 8) విచారకరంగా, అప్పటినుండి యెహోవాకు ప్రమాణాలు చేయడం, వాటిని నిలబెట్టుకోకపోవడం ఇశ్రాయేలీయులకు ఆనవాయితీగా మారిపోయింది.—సంఖ్యా. 30:2.
మరో రెండు ప్రమాణాలు
13. యెహోవా దావీదుతో ఏ ప్రమాణం చేశాడు? ఆ ప్రమాణానికి, వాగ్దాన సంతానానికి మధ్య ఉన్న సంబంధమేమిటి?
13 యెహోవా తనకు లోబడే వాళ్లందరి ప్రయోజనం కోసం రాజైన దావీదు పరిపాలనా కాలంలో మరో రెండు ప్రమాణాలు చేశాడు. మొదటిగా, దావీదు సింహాసనం నిరంతరం నిలుస్తుందని యెహోవా దావీదుకు ప్రమాణం చేశాడు. (కీర్త. 89: 35, 36; 132:11, 12) వాగ్దాన సంతానం ‘దావీదు కుమారుడు’ అని పిలవబడతాడని ఆ మాటలు చూపించాయి. (మత్త. 1:1; 21:9) తన వంశంలో రాబోయే క్రీస్తు తనకన్నా ఉన్నతమైన స్థానాన్ని అధిరోహిస్తాడనే విషయాన్ని మనసులో ఉంచుకొని దావీదు వినయంగా ఆయనను “ప్రభువు” అని సంబోధించాడు.—మత్త. 22:42-44.
14. వాగ్దాన సంతానం గురించి యెహోవా ఏ ప్రమాణం చేశాడు? ఆ ప్రమాణం నుండి మనమెలా ప్రయోజనం పొందుతాం?
14 రెండవదిగా, ప్రత్యేకమైన స్థానంలో ఉండే రాజైన క్రీస్తు మానవజాతి కోసం ప్రధాన యాజకునిగా పనిచేస్తాడని ప్రవచించేలా యెహోవా దావీదును ప్రేరేపించాడు. ప్రాచీన ఇశ్రాయేలులో ఒకే వ్యక్తి అటు రాజుగా, ఇటు యాజకునిగా ఉండే అవకాశం లేదు. లేవీ గోత్రంలోని వాళ్లు యాజకులుగా, యూదా గోత్రంలోని వాళ్లు రాజులుగా సేవచేసేవాళ్లు. కానీ, తన సింహాసనాన్ని అధిష్ఠించబోయే గొప్ప వారసుడి గురించి దావీదు ఇలా ప్రవచించాడు: “ప్రభువు [“యెహోవా,” NW] నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు —నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. —మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.” (కీర్త. 110:1, 4) ఆ ప్రవచన నెరవేర్పుగా, వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు ప్రస్తుతం పరలోకంలో రాజుగా ఏలుతున్నాడు. పశ్చాత్తాపం చూపించిన మానవులు దేవునితో మంచి సంబంధాన్ని కలిగివుండేలా సహాయం చేయడం ద్వారా ఆయన ప్రధాన యాజకునిగా సేవచేస్తున్నాడు.—హెబ్రీయులు 7:20-22, 25, 26 చదవండి.
దేవుని కొత్త ఇశ్రాయేలు
15, 16. (ఎ) బైబిల్లో ఏ రెండు జనాంగాల గురించిన ప్రస్తావన ఉంది? ప్రస్తుతం ఏ జనాంగం మీద యెహోవా అనుగ్రహం ఉంది? (బి) ఒట్టు పెట్టుకునే విషయంలో యేసు తన అనుచరులకు ఏ ఆజ్ఞ ఇచ్చాడు?
15 యేసుక్రీస్తును తిరస్కరించినందువల్ల ఇశ్రాయేలు జనాంగం దేవుని ఆమోదంతో పాటు, ‘రాజులైన యాజక సమూహంగా’ ఉండే అవకాశాన్ని కూడా కోల్పోయింది. అందుకే, “దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడును” అని యేసు యూదా నాయకులతో చెప్పాడు. (మత్త. 21:43) సా.శ. 33 పెంతెకొస్తు రోజున యెరూషలేములో సమకూడిన 120 మంది శిష్యులమీద దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు ఆ కొత్త జనాంగం ఆవిర్భవించింది. అదే “దేవుని ఇశ్రాయేలు.” కొంతకాలానికే, అన్ని దేశాల నుండి వచ్చిన వేలమంది ప్రజలు ఆ కొత్త జనాంగంలో భాగమయ్యారు.—గల. 6:16.
16 సహజ ఇశ్రాయేలు జనాంగంలా కాక, ఈ కొత్త ఆధ్యాత్మిక జనాంగంలోని వాళ్లు దేవునికి సదా లోబడుతూ రాజ్య ఫలాల్ని ఫలిస్తూ వచ్చారు. వాళ్లు పాటించే ఆజ్ఞల్లో ఒకటి ఒట్టేయడానికి లేదా ప్రమాణం చేయడానికి సంబంధించినది. యేసు భూమ్మీద జీవించిన కాలంలో ప్రమాణాలు చేయడానికి విలువలేకుండా పోయింది. అప్పట్లో ప్రజలు బూటకపు ప్రమాణాలు చేసేవాళ్లు లేదా చిన్నాచితకా విషయాలకు కూడా ఒట్టేసేవాళ్లు. (మత్త. 23:16-22) అందుకే, యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు: ‘ఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది.’—మత్త. 5:34, 37.
యెహోవా వాగ్దానాలు ఎల్లవేళలా నిజమౌతాయి
17. మనం తర్వాతి అధ్యయన ఆర్టికల్లో ఏ ప్రశ్నలకు జవాబులు చూస్తాం?
17 అలాగని అసలు ఒట్టే వేయకూడదా? ముఖ్యంగా, మనం ‘అవునంటే అవును’ అన్నట్లుగా ఎలా జీవించవచ్చు? ఈ ప్రశ్నలకు మనం తర్వాతి అధ్యయన ఆర్టికల్లో జవాబులు చూస్తాం. మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకు లోబడాలనే ప్రేరణను పొందుతూ ఉందాం. అప్పుడు యెహోవా తన అమూల్యమైన వాగ్దానాల ఆధారంగా నిరంతరం మనల్ని సంతోషంగా ఆశీర్వదిస్తాడు.